కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 29

యెహోవా సేవలో మీరు చేయగలిగింది చేస్తున్నందుకు సంతోషించండి!

యెహోవా సేవలో మీరు చేయగలిగింది చేస్తున్నందుకు సంతోషించండి!

“ప్రతీ వ్యక్తి . . . వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.”—గల. 6:4.

పాట 34 యథార్థంగా జీవించడం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా మనల్ని ఇతరులతో ఎందుకు పోల్చడు?

యెహోవా వైవిధ్యాన్ని ఇష్టపడతాడు. ఆయన సృష్టించిన రకరకాల చెట్లను, జంతువులను, అలాగే మనుషులను చూసినప్పుడు ఆ విషయం స్పష్టమౌతుంది. మనలో ప్రతీఒక్కరం ప్రత్యేకమైనవాళ్లం, కాబట్టి ఆయన మిమ్మల్ని ఎప్పుడూ ఇతరులతో పోల్చడు. ఆయన మీ హృదయాన్ని పరిశీలిస్తాడు. (1 సమూ. 16:7) ఆయనకు మీ సామర్థ్యాలు, బలహీనతలు, మీరు పెరిగిన విధానం కూడా తెలుసు. అలాగే మీరు చేయగలిగిన దానికన్నా ఎక్కువ ఆశించడు. మన గురించి మనం, యెహోవా ఆలోచించిన్నట్టే ఆలోచించుకోవాలి. అప్పుడు మనకు “మంచి వివేచన” ఉంటుంది. కాబట్టి మన గురించి మనం మరీ ఎక్కువగా ఆలోచించుకోము లేదా మరీ తక్కువగా ఆలోచించుకోము.—రోమా. 12:3.

2. ఇతరులతో పోల్చుకోవడం ఎందుకు మంచిది కాదు?

2 మనం ఇతరుల మంచి ఆదర్శం నుండి నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, బాగా పరిచర్య చేసే ఒక సహోదరుడు లేదా సహోదరి మీకు తెలిసుండొచ్చు. (హెబ్రీ. 13:7) పరిచర్యను ఇంకా నైపుణ్యవంతంగా ఎలా చేయవచ్చో వాళ్ల నుండి నేర్చుకోవచ్చు. (ఫిలి. 3:17) అయితే ఇతరుల ఆదర్శం నుండి నేర్చుకోవడానికీ వాళ్లతో పోల్చుకోవడానికీ తేడా ఉంది. అలా పోల్చుకుంటే మనం ఈర్ష్యపడవచ్చు, నిరుత్సాహపడవచ్చు లేదా విలువైనవాళ్లం కాదన్నట్లు భావించవచ్చు. మనం ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నట్లు, సంఘంలోని ఇతరులతో పోటీపడితే యెహోవాతో మనకున్న సంబంధం పాడవ్వవచ్చు. అందుకే యెహోవా ప్రేమతో ఇలా అంటున్నాడు: “అయితే ప్రతి వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి. అంతేకాదు వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.”—గల. 6:4.

3. మీరు ఆధ్యాత్మికంగా సాధించిన ఏ ప్రగతి మీకు సంతోషాన్నిస్తుంది?

3 మీ ఆధ్యాత్మిక ప్రగతిని బట్టి మీరు సంతోషించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఉదాహరణకు, మీరొకవేళ బాప్తిస్మం తీసుకొని ఉంటే ఆ లక్ష్యం చేరుకున్నందుకు సంతోషించవచ్చు. మీరు యెహోవా మీద మీకున్న ప్రేమను బట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుండి మీరు సాధించిన ప్రగతి గురించి ఆలోచించండి. ఉదాహరణకు, బైబిలు చదివి, దాన్ని అధ్యయనం చేసే విషయంలో మీ ఆసక్తి పెరిగిందా? ప్రార్థనల్ని మరింత అర్థవంతంగా చేయగల్గుతున్నారా? (కీర్త. 141:2) మీరు పరిచర్యలో సమర్థవంతంగా సంభాషణలు మొదలుపెట్టగల్గుతున్నారా? అలాగే, బోధనా పనిముట్లను మరింత నైపుణ్యంగా ఉపయోగించగల్గుతున్నారా? మీకు ఒక కుటుంబం ఉంటే, మంచి భర్తగా లేదా భార్యగా తయారవడానికి లేదా మంచి తల్లిదండ్రులుగా ఉండడానికి యెహోవా మీకు సహాయం చేశాడా? ఈ విషయాలన్నిటిలో సాధించిన ప్రగతిని బట్టి మీరు చాలా సంతోషించవచ్చు.

4. ఈ ఆర్టికల్‌లో మనమేం పరిశీలిస్తాం?

4 ఇతరులు తమ ఆధ్యాత్మిక ప్రగతిని బట్టి ఆనందించేలా మనం వాళ్లకు సహాయం చేయవచ్చు. వాళ్లు ఇతరులతో పోల్చుకోకుండా ఉండేలా కూడా సహాయం చేయవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చో, భార్యాభర్తలు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవచ్చో, పెద్దలు అలాగే ఇతరులు తోటి సహోదరసహోదరీలకు ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే మన సామర్థ్యాల్ని, పరిస్థితుల్ని బట్టి చేరుకోగల లక్ష్యాల్ని పెట్టుకోవడానికి సహాయం చేసే కొన్ని బైబిలు సూత్రాన్ని పరిశీలిస్తాం.

తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఏం చేయవచ్చు?

తల్లిదండ్రులారా, మీ పిల్లల్లో ప్రతి ఒక్కరూ చేసే మంచి ప్రయత్నాల్ని బట్టి సంతోషిస్తున్నారని చూపించండి (5, 6 పేరాలు చూడండి) *

5. ఎఫెసీయులు 6:4 ప్రకారం, తల్లిదండ్రులు ఏం చేయకుండా జాగ్రత్తపడాలి?

5 తమ పిల్లల్ని వేరేవాళ్లతో పోల్చకుండా అలాగే, వాళ్లు చేయగల్గిన దానికన్నా ఎక్కువ ఆశించకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. లేదంటే వాళ్లు తమ పిల్లల్ని నిరుత్సాహపరుస్తారు. (ఎఫెసీయులు 6:4 చదవండి.) సాచీకో * అనే సహోదరి ఇలా అంటుంది: “నా క్లాస్‌లోని మిగతా విద్యార్థులకన్నా నేను బాగా చదవాలని మా టీచర్లు కోరుకునేవాళ్లు. మా అమ్మ కూడా అదే కోరుకునేది. ఎందుకంటే నేను బాగా చదివితే మా టీచరుకు అలాగే, సాక్షికాని మా నాన్నకు యెహోవాసాక్షుల మీద మంచి అభిప్రాయం కలుగుతుందని ఆమె చెప్పేది. నిజానికి నాకు వందకి వంద శాతం మార్కులు రావాలని ఆమె కోరుకునేది. కానీ అది నాకు అసాధ్యం అనిపించింది. నేను స్కూలు పూర్తి చేసుకొని చాలా సంవత్సరాలైనప్పటికీ, యెహోవా సేవను ఎంత బాగా చేస్తున్నా అది ఆయనను సంతోషపెట్టట్లేదేమో అని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది.”

6. కీర్తన 131:1, 2 నుండి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు?

6 కీర్తన 131:1, 2 లో తల్లిదండ్రులకు ఒక విలువైన పాఠం ఉంది. (చదవండి.) “గొప్పగొప్ప వాటికోసం, నా శక్తికి మించిన వాటికోసం నేను పాకులాడలేదు” అని రాజైన దావీదు అన్నాడు. తనకున్న వినయాన్ని బట్టి ఆయన సంతృప్తిగా, ప్రశాంతంగా ఉన్నాడు. దావీదు మాటల నుండి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు? తల్లిదండ్రులు తమ నుండి తాము ఎక్కువ ఆశించకుండా అలాగే, పిల్లలు నుండి కూడా ఎక్కువ ఆశించకుండా ఉండడం వల్ల వినయం చూపించవచ్చు. తాము విలువైనవాళ్లమని పిల్లలు అనుకోవాలంటే తల్లిదండ్రులు వాళ్ల సామర్థ్యాల్ని, బలహీనతల్ని గుర్తించి వాళ్లు చేరుకోగల లక్ష్యాల్ని పెట్టుకోవడానికి సహాయం చేయాలి. మెరీనా అనే సహోదరీ ఇలా గుర్తుచేసుకుంటుంది: “మా అమ్మ నన్ను మా అన్నతో, ఇద్దరు తముళ్లతో, లేదా వేరే పిల్లలతో ఎప్పుడూ పోల్చలేదు. ప్రతీఒక్కరికి వేర్వేరు సామర్థ్యాలు ఉన్నాయని, అలాగే మనలో ప్రతీఒక్కరం యెహోవాకు విలువైనవాళ్లమని ఆమె నాకు నేర్పించింది. దానివల్ల నేను ఇతరులతో ఎక్కువగా పోల్చుకోను.”

7-8. ఒక భర్త తన భార్యను గౌరవిస్తున్నాడని ఎలా చూపిస్తాడు?

7 ఒక క్రైస్తవ భర్త తన భార్యను గౌరవించాలి. (1 పేతు. 3:7) ఇతరుల్ని గౌరవించడం అంటే వాళ్లపట్ల ప్రత్యేక అవధానం నిలుపుతూ, వాళ్లకు మర్యాద ఇవ్వడం. ఉదాహరణకు, ఒక భర్త తన భార్యను ప్రాముఖ్యమైన వ్యక్తిగా చూడడంవల్ల ఆమెను గౌరవిస్తాడు. ఆమె చేయగల్గిన దానికన్నా ఎక్కువ ఆశించడు. అలాగే, ఆమెను ఇతర స్త్రీలతో అస్సలు పోల్చడు. ఒకవేళ అలా పోలిస్తే, భార్యకు ఎలా అనిపిస్తుంది? రోసా అనే సహోదరి అనుభవాన్ని గమనించండి. సత్యంలోలేని ఆమె భర్త తరచూ ఆమెను వేరే స్త్రీలతో పోల్చేవాడు. ఆయన దురుసుగా మాట్లాడిన మాటల వల్ల రోసా తన గురించి తాను తక్కువగా భావించడమే కాదు, అసలు తనను నిజంగా ఎవరైనా ప్రేమిస్తారా అని కూడా సందేహపడేది. ఆమె ఇలా అంటుంది: “యెహోవా నన్ను విలువైనదానిగా ఎంచుతున్నాడని నాకు ఎప్పుడూ గుర్తుచేయాల్సి వచ్చేది.” దానికి భిన్నంగా ఒక క్రైస్తవ భర్త తన భార్యను గౌరవిస్తాడు. అలా చేసినప్పుడు తన భార్యతో, అలాగే యెహోవాతో తనకు మంచి సంబంధం ఉంటుందని ఆయనకు తెలుసు. *

8 భార్యను గౌరవించే భర్త ఆమె గురించి ఇతరుల దగ్గర మంచిగా మాట్లాడతాడు, ఆమెను ప్రేమిస్తున్నానని చెప్తాడు, ఆమెను మెచ్చుకుంటాడు. (సామె. 31:28) ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన క్యాటరీనాకు, పనికిరానిదాన్ననే భావాల నుండి బయటపడడానికి ఆమె భర్త సహాయం చేశాడు. క్యాటరీనా చిన్నతనంలో ఆమె అమ్మ, తనను స్నేహితులతో సహా వేరే అమ్మాయిలతో పోలుస్తూ తక్కువ చేసి మాట్లాడేది. దానివల్ల క్యాటరీనా తనను తాను ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె ఒక యెహోవాసాక్షి అయిన తర్వాత కూడా అలా పోల్చుకుంటూ ఉండేది. కానీ అలా చేయకుండా ఉండడానికి, అలాగే తన గురించి సరైన విధంగా ఆలోచించుకోవడానికి ఆమె భర్త సహాయం చేశాడు. ఆమె ఇలా అంటుంది: “ఆయన నన్ను ప్రేమిస్తాడు, నేను చేసిన మంచి పనుల్ని బట్టి నన్ను మెచ్చుకుంటాడు, అలాగే నాకోసం ప్రార్థన చేస్తాడు. ఆయన యెహోవాకున్న అద్భుతమైన లక్షణాల్ని నాకు గుర్తుచేస్తాడు, అలాగే నా ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవడానికి కూడా సహాయం చేస్తాడు.”

ప్రేమగల సంఘపెద్దలు, ఇతరులు ఏం చేయవచ్చు?

9-10. పోల్చుకోకుండా ఉండేలా దయగల సంఘపెద్దలు ఒక సహోదరికి ఎలా సహాయం చేశారు?

9 ఇతరులతో పోల్చుకునే వాళ్లకు సంఘపెద్దలు ఎలా సహాయం చేయవచ్చు? హనూనీ అనే సహోదరి అనుభవాన్ని గమనించండి. చిన్నతనంలో తనను ఎక్కువగా ఎవ్వరూ మెచ్చుకునేవాళ్లు కాదు. ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది: “నేను బిడియస్థురాలిని, అలాగే వేరే పిల్లలకన్నా తక్కువదాన్నని అనుకునేదాన్ని. నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండే ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టాను.” అయితే హనూనీ సత్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతరులతో పోల్చుకుంటూ ఉండేది. దానివల్ల సంఘంలో తాను ప్రాముఖ్యమైనదాన్ని కాదని అనుకునేది. కానీ ఇప్పుడు ఆమె ఒక పయినీరుగా సంతోషంగా సేవ చేస్తుంది. తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి ఆమెకు ఏది సహాయం చేసింది?

10 దయగల సంఘపెద్దలు తనకు సహాయం చేశారని హనూనీ చెప్తుంది. ఆమె సంఘంలో విలువైనదని చెప్తూ, ఆమె ఉంచిన మంచి ఆదర్శాన్ని బట్టి వాళ్లు తనను మెచ్చుకున్నారు. ఆమె ఇలా రాస్తుంది: “సహాయం అవసరమైన కొంతమంది సహోదరీలను ప్రోత్సహించమని కొన్నిసార్లు సంఘపెద్దలు నాకు చెప్పేవాళ్లు. దానివల్ల నేను విలువైనదాన్నని నాకు అనిపించేది. కొంతమంది యౌవన సహోదరీలను ప్రోత్సహించినప్పుడు ప్రేమగల సంఘపెద్దలు నాకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత 1 థెస్సలొనీకయులు 1:2, 3 వచనాలు నాకు చూపించారు. అవి నా హృదయాన్ని తాకాయి. ఆ ప్రేమగల పెద్దల వల్ల యెహోవా సంస్థలో నాకు కూడా విలువైన స్థానం ఉందని నేను తెలుసుకున్నాను.”

11. యెషయా 57:15 లో వర్ణించబడినట్లు, ‘నలిగిపోయిన వాళ్లకు, దీనమనసు గలవాళ్లకు’ మనం ఎలా సహాయం చేయవచ్చు?

11 యెషయా 57:15 చదవండి. ‘నలిగిపోయిన వాళ్లను, దీనమనసు గలవాళ్లను’ యెహోవా ఎంతో పట్టించుకుంటాడు. సంఘపెద్దలతో పాటు మనందరం ఇలాంటి సహోదరసహోదరీలను ప్రోత్సహించవచ్చు. వాళ్లని ప్రోత్సహించడానికి ఒక మార్గం, వాళ్ల మీద శ్రద్ధ ఉందని చూపించడం. వాళ్లను యెహోవా ఎంత ప్రేమిస్తున్నాడో మనం తెలియజేయాలని ఆయన కోరుకుంటున్నాడు. (సామె. 19:17) మనం వినయంగా ఉండడం ద్వారా, మన సామర్థ్యాల గురించి గొప్పలు చెప్పుకోకుండా ఉండడం ద్వారా కూడా తోటి సహోదరసహోదరీలకు సహాయం చేయవచ్చు. ఇతరుల అవధానం మనవైపు మళ్లాలని, వాళ్లు మనల్ని చూసి ఈర్ష్యపడాలని మనం కోరుకోం. బదులుగా మనకున్న సామర్థ్యాల్ని, జ్ఞానాన్ని ఇతరుల్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తాం.—1 పేతు. 4:10, 11.

తాను ఇతరుల కన్నా గొప్ప అని యేసు ఎప్పుడూ అనుకోలేదు, అందుకే తన శిష్యులు ఆయనకు దగ్గరయ్యారు. ఆయన తన స్నేహితులతో సమయం గడపడాన్ని ఆనందించాడు (12వ పేరా చూడండి)

12. సామాన్య ప్రజలు యేసుతో ఉండడానికి ఎందుకు ఇష్టపడ్డారు? (ముఖచిత్రం చూడండి.)

12 యేసు తన అనుచరులతో ఎలా వ్యవహరించాడో తెలుసుకోవడం ద్వారా, మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలో ఎక్కువ నేర్చుకోవచ్చు. ఈ భూమ్మీద జీవించిన మనుషులందరిలో ఆయనే అత్యంత గొప్ప వ్యక్తి. అయినా ‘సౌమ్యుడిగా, వినయస్థుడిగా ఉన్నాడు.’ (మత్త. 11:28-30) తనకున్న తెలివితేటల్ని బట్టి, విస్తారమైన జ్ఞానాన్ని బట్టి ఆయన ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. ఆయన బోధించినప్పుడు సరళమైన భాషని, అందరికీ తేలికగా అర్థమయ్యే ఉదాహరణల్ని ఉపయోగించాడు. అవి దీనుల హృదయాల్ని తాకాయి. (లూకా 10:21) యేసు ఆ కాలంలోని గర్వంగల మతనాయకుల్లా లేడు. ఇతరులు తాము దేవుని దృష్టిలో విలువైనవాళ్లమని భావించేలా ఆయన వాళ్లతో ప్రవర్తించాడు. (యోహా. 6:37) అలాగే సామాన్య ప్రజల్ని ఆయన గౌరవించాడు.

13. యేసు తన శిష్యుల పట్ల దయను, ప్రేమను ఎలా చూపించాడు?

13 యేసు తన శిష్యులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆయనకున్న దయ, ప్రేమ కనిపించేవి. వాళ్ల సామర్థ్యాలు, పరిస్థితులు వేరని ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్లు ఒకేలాంటి బాధ్యతల్ని చేపట్టలేరు, అలాగే పరిచర్యలో ఒకేలాంటి ఫలితాల్ని సాధించలేరు. అయినా వాళ్లలో ప్రతిఒక్కరూ పూర్ణహృదయంతో చేసిన కృషిని ఆయన మెచ్చుకున్నాడు. తలాంతుల ఉదాహరణలో, యేసుకున్న అర్థం చేసుకునే గుణం కనిపిస్తుంది. ఆ ఉదాహరణలో యజమాని తన దాసుల “సామర్థ్యాలకు తగ్గట్టు” పనిని అప్పగించాడు. కష్టపడి పనిచేసిన ఇద్దరు దాసుల్లో ఒక దాసుడు, ఇంకొక దాసుని కన్నా ఎక్కువ సంపాదించాడు. కానీ యజమాని ఇద్దరిని ఒకేలా మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, “శభాష్‌, నమ్మకమైన మంచి దాసుడా!”—మత్త. 25:14-23.

14. మనం ఇతరులతో యేసులా ఎలా వ్యవహరించవచ్చు?

14 యేసు మనతో ఎప్పుడూ దయగా, ప్రేమగా వ్యవహరిస్తాడు. మన సామర్థ్యాలు, పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆయనకు తెలుసు. అయినా, మనం చేయగలిగింది చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. మనం ఇతరులతో యేసు వ్యవహరించినట్లే వ్యవహరించాలి. ఒక సహోదరుడు లేదా సహోదరి ఇతరులు చేసినంత చేయలేకపోతున్నందుకు, వాళ్లు తక్కువవాళ్లని లేదా పనికిరానివాళ్లని అనుకునేలా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు. బదులుగా, మన సహోదరసహోదరీలు యెహోవా సేవలో తాము చేయగలిగింది చేస్తున్నందుకు ఎప్పుడూ మెచ్చుకుందాం.

చేరుకోగల లక్ష్యాలను పెట్టుకోండి

చేరుకోగల లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించడం ద్వారా ఆనందాన్ని పొందండి (15, 16 పేరాలు చూడండి) *

15-16. ఒక సహోదరి తాను చేరుకోగల లక్ష్యాలను పెట్టుకుని ఎలా ప్రయోజనం పొందింది?

15 మనం యెహోవా సేవలో లక్ష్యాలు పెట్టుకుంటే మన జీవితం సంతృప్తిగా, అర్థవంతంగా ఉంటుంది. ఇతరులకున్న లక్ష్యాలే మనకు ఉండాల్సిన అవసరం లేదు గానీ మన సామర్థ్యాలకు, పరిస్థితులకు తగ్గట్లు లక్ష్యాలు పెట్టుకోవాలి. లేకపోతే మనం నిరుత్సాహపడే అవకాశం ఉంది. (లూకా 14:28) మిడోరీ అనే ఒక పయినీరు సహోదరి అనుభవాన్ని పరిశీలించండి.

16 సత్యంలోలేని మిడోరీ నాన్న, తనను చిన్నతనం నుండి తన తమ్ముడితో, చెల్లితో అలాగే ఇతర విద్యార్థులతో పోలుస్తూ తక్కువచేసి మాట్లాడేవాడు. మిడోరీకి తాను ఎందుకూ పనికిరానిదాన్నని అనిపించేది. ఆమె పెద్దదౌతుండగా తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆమె ఇలా అంటోంది, “నేను ప్రతీరోజు బైబిలు చదవడం వల్ల మనశ్శాంతి పొందుతున్నాను, యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకోగల్గుతున్నాను.” దానితోపాటు మిడోరీ, చేరుకోగల కొన్ని లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించడానికి సహాయం చేయమని ప్రార్థించింది. దానివల్ల ఆమె యెహోవా సేవలో తాను చేయగలిగింది చేస్తున్నందుకు సంతోషిస్తుంది.

యెహోవా సేవలో మీరు చేయగలిగినదంతా చేస్తూ ఉండండి

17. మనం ఎలా “కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండాలి?” అలా చేస్తే వచ్చే ఫలితం ఏంటి?

17 మనం తక్కువవాళ్లమనే ఆలోచన మార్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే యెహోవా ఇలా అంటున్నాడు, “మీరు కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండాలి.” (ఎఫె. 4:23, 24) అలా చేయాలంటే మనం ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, ధ్యానించాలి. వీటిని చేస్తూ సహాయం కోసం యెహోవా వైపు చూడండి. మనం ఇతరులతో పోల్చుకోవడం మానేయడానికి ఆయన పవిత్రశక్తి సహాయం చేస్తుంది. ఒకవేళ మీ హృదయంలో ఈర్ష్య లేదా గర్వం మొలకెత్తితే, వాటిని గుర్తించి వెంటనే పెరికి వేయడానికి కూడా యెహోవా మీకు సహాయం చేస్తాడు.

18. రెండో దినవృత్తాంతాలు 6:29, 30లోని మాటల నుండి మనమెలా ఓదార్పు పొందవచ్చు?

18 రెండో దినవృత్తాంతాలు 6:29, 30 చదవండి. యెహోవాకు మన హృదయం తెలుసు. ఈ లోకపు చెడు ప్రభావాలతో, సొంత అపరిపూర్ణతలతో మనం చేసే పోరాటం కూడా యెహోవాకు తెలుసు. ఆ విషయాల్లో మనం ఎంత గట్టిగా పోరాడుతున్నామో చూసినప్పుడు యెహోవాకు మనమీద ప్రేమ పెరుగుతుంది.

19. మన గురించి ఎలా భావిస్తున్నాడో చెప్పడానికి యెహోవా ఏ ఉదాహరణ ఉపయోగించాడు?

19 మన గురించి తాను ఎలా భావిస్తాడో చెప్పడానికి యెహోవా తల్లీబిడ్డల అనుబంధానికి సంబంధించిన ఉదాహరణని ఉపయోగించాడు. (యెష. 49:15) రేచల్‌ అనే తల్లి ఇలా చెప్తుంది, “నా కూతురు స్టెఫనీ నెలలు నిండకుండానే పుట్టింది. నేను తనను మొదటిసారి చూసినప్పుడు చిన్నగా, నిస్సహాయంగా కనిపించింది. తాను పుట్టిన మొదటి నెల తనను ఇన్‌క్యుబేటర్‌ బాక్సులో పెట్టినప్పుడు, ప్రతీరోజు తనను ఎత్తుకొని కౌగలించుకోవడానికి డాక్టర్‌ నన్ను అనుమతించాడు. నా బిడ్డతో గడిపిన ఆ క్షణాలు మా ఇద్దరి మధ్య దగ్గరి బంధం ఏర్పడేలా చేశాయి. తనకిప్పుడు ఆరు సంవత్సరాలు, చూడ్డానికి తన వయసువాళ్ల కన్నా చిన్నగా ఉంటుంది. అయినా తనంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే, తను జీవించడానికి ఎంతో పోరాడింది అలాగే నా జీవితంలో సంతోషాన్ని నింపింది.” మనం ఆయన సేవలో చేయగలిగినదంతా చేయడానికి పోరాడడం యెహోవా చూసినప్పుడు, మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. అది నిజంగా మనకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా!

20. యెహోవా సేవకులుగా మీరెందుకు సంతోషించవచ్చు?

20 యెహోవా సేవకుల్లో ఒకరిగా మీరు ప్రత్యేకమైనవాళ్లు, అలాగే ఆయన కుటుంబంలో విలువైనవాళ్లు. మీరు ఇతరులకన్నా గొప్పవాళ్లని యెహోవా మిమ్మల్ని తనవైపు ఆకర్షించలేదు. ఆయన మీ హృదయాన్ని చూశాడు. అలాగే మీరు వినయస్థులని, ఆయన చెప్పేది విని మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గమనించి మిమ్మల్ని ఆకర్షించాడు. (కీర్త. 25:9) మీరు ఆయన సేవలో చేయగలిగినదంతా చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడని మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు. మీ ఓర్పు, విశ్వసనీయత మీకు “మంచి మనసు” ఉందని రుజువు చేస్తున్నాయి. (లూకా 8:15) కాబట్టి యెహోవా సేవలో మీరు చేయగలిగినదంతా చేస్తూ ఉండండి. అలా చేస్తే ‘మీ పనుల వల్లే మీకు సంతోషం కలుగుతుంది.’

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

^ పేరా 5 యెహోవా మనల్ని ఇతరులతో పోల్చడు. అయినా మనం ఇతరులతో పోల్చుకుంటూ మనం తక్కువవాళ్లమని భావించే అవకాశం ఉంది. అలా పోల్చుకోవడం ఎందుకు మంచిది కాదో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. తమ గురించి యెహోవా ఎలా ఆలోచిస్తున్నాడో వాళ్లూ అలాగే ఆలోచించుకోవడానికి కుటుంబ సభ్యులకు, సంఘంలోని సహోదరసహోదరీలకు మనం ఏ విధంగా సహాయం చేయగలమో కూడా చూస్తాం.

^ పేరా 5 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 7 ఇందులోని సమాచారం ముఖ్యంగా భర్తల గురించి మాట్లాడుతున్నా, చాలా సూత్రాలు భార్యలకు కూడా వర్తిస్తాయి.

^ పేరా 58 చిత్రాల వివరణ: కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు నోవహు ఓడలో పెట్టడానికి తమ పిల్లలు ఒక్కొక్కరు ఏం చేశారో చూసినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు.

^ పేరా 62 చిత్రాల వివరణ: ఒక చిన్న పిల్లవాడు ఉన్న ఒంటరి తల్లి సహాయ పయినీరు సేవ చేయడానికి ప్రణాళిక వేసుకుంటుంది. దాన్ని చేసినప్పుడు ఆమె ఎంతో సంతోషిస్తుంది.