కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 31

ప్రార్థనను అమూల్యమైన వరంలా చూడండి

ప్రార్థనను అమూల్యమైన వరంలా చూడండి

“నా ప్రార్థన, నీ ముందు బాగా సిద్ధం చేసిన ధూపంలా ఉండాలి.”కీర్త. 141:2.

పాట 47 ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించండి

ఈ ఆర్టికల్‌లో. . . a

1. మనం ప్రార్థనను ఎలా చూడాలి?

 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన వ్యక్తితో ప్రార్థన ద్వారా మాట్లాడడం మనకు దొరికిన అమూల్యమైన వరం. ఒక్కసారి ఆలోచించండి, మనం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండానే, ఏ సమయంలోనైనా ఏ భాషలోనైనా యెహోవాకు మన మనసులో ఉన్నదంతా చెప్పుకోవచ్చు. మనం హాస్పిటల్‌లో కదల్లేని స్థితిలో ఉన్నా, జైల్లో ఉన్నా మన ప్రేమగల తండ్రి తప్పకుండా వింటాడనే నమ్మకంతో ప్రార్థించవచ్చు. ఈ వరాన్ని మనం తేలిగ్గా తీసుకోం.

2. ప్రార్థనను దావీదు అమూల్యమైన వరంలా చూశాడని ఎలా చెప్పవచ్చు?

2 రాజైన దావీదు, ప్రార్థనను అమూల్యమైన వరంలా చూశాడు. ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నా ప్రార్థన, నీ ముందు బాగా సిద్ధం చేసిన ధూపంలా ఉండాలి.” (కీర్త. 141:1, 2) దావీదు కాలంలో, సత్యారాధనలో యాజకులు ఉపయోగించే పవిత్ర ధూపాన్ని ఎంతో జాగ్రత్తగా తయారుచేసేవాళ్లు. (నిర్గ. 30:34, 35) దావీదు అన్న ఆ మాటల్ని బట్టి, ఆయన తన పరలోక తండ్రికి ప్రార్థించేటప్పుడు ఏం మాట్లాడాలో జాగ్రత్తగా ఆలోచించేవాడని అర్థమౌతోంది. మనం కూడా అలాగే చేయాలనుకుంటాం. మన ప్రార్థనలు యెహోవాను సంతోషపెట్టాలని మనం కోరుకుంటాం.

3. మనం యెహోవాకు ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలి? ఎందుకు?

3 మనం యెహోవాకు ప్రార్థించేటప్పుడు, ఎంతో గౌరవంతో మాట్లాడాలి. యెషయా, యెహెజ్కేలు, దానియేలు అలాగే యోహాను చూసిన అద్భుతమైన దర్శనాల్ని ఒకసారి గుర్తుచేసుకోండి. అవి వేర్వేరు దర్శనాలు అయినా, అవన్నీ యెహోవాను ఎంతో మహిమగల రాజుగా వర్ణించాయి. “యెహోవా ఒక ఉన్నతమైన గొప్ప సింహాసనం మీద కూర్చొని ఉండడం” యెషయా చూశాడు. (యెష. 6:1-3) యెహోవా పరలోక రథం మీద కూర్చున్నట్టు, దాని చుట్టూ “ప్రకాశవంతమైన . . . ఇంద్రధనుస్సు కాంతి” లాంటిది ఉన్నట్టు యెహెజ్కేలు చూశాడు. (యెహె. 1:26-28) తెల్లని వస్త్రాలు వేసుకున్న ‘మహా వృద్ధుణ్ణి,’ ఆయన సింహాసనం నుండి అగ్ని జ్వాలలు రావడాన్ని దానియేలు చూశాడు. (దాని. 7:9, 10) యెహోవా ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నట్టు, చుట్టూ ఆకుపచ్చ మరకతం లాంటి ఇంద్రధనుస్సు ఉన్నట్టు యోహాను చూశాడు. (ప్రక. 4:2-4) సాటిలేని యెహోవా మహిమ గురించి ఆలోచించినప్పుడు, ఆయనతో మాట్లాడడం నిజంగా ఎంత గొప్ప వరమో, అలా మాట్లాడేటప్పుడు మనకు ప్రగాఢ గౌరవం ఉండడం ఎంత ముఖ్యమో అర్థమౌతుంది. మరి మనం వేటి గురించి ప్రార్థించాలి?

“మీరు ఈ విధంగా ప్రార్థించాలి”

4. మత్తయి 6:9, 10 లో యేసు నేర్పించిన ప్రార్థనలోని ప్రారంభ మాటల నుండి మనం ఏం నేర్చుకుంటాం?

4 మత్తయి 6:9, 10 చదవండి. దేవుణ్ణి సంతోషపెట్టేలా ఎలా ప్రార్థించాలో, కొండ మీది ప్రసంగంలో యేసు తన శిష్యులకు నేర్పించాడు. యేసు, “మీరు ఈ విధంగా ప్రార్థించాలి” అని చెప్పిన తర్వాత, యెహోవా సంకల్పానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాడు. అవేంటంటే, యెహోవా పేరు పవిత్రపర్చబడాలి; ఆయన శత్రువులందర్నీ నాశనం చేసే ఆయన రాజ్యం రావాలి; అలాగే భూమి గురించి, మనుషుల గురించి ఆయన అనుకున్న మంచి విషయాలు జరగాలి. మనం కూడా అలాంటి విషయాల గురించి ప్రార్థించినప్పుడు, దేవుని ఇష్టం మనకు ముఖ్యమని చూపిస్తాం.

5. మనం మన అవసరాల గురించి ప్రార్థించవచ్చా?

5 ఆ ప్రార్థన తర్వాతి మాటల్లో, మనం మన అవసరాల గురించి కూడా ప్రార్థించవచ్చని యేసు చెప్పాడు. అంటే, ఈ రోజుకు కావాల్సిన ఆహారం ఇవ్వమని, మన పాపాల్ని క్షమించమని, ప్రలోభంలో పడకుండా కాపాడమని, దుష్టుని నుండి రక్షించమని మనం యెహోవాను అడగవచ్చు. (మత్త. 6:11-13) మనం వీటి గురించి యెహోవాకు ప్రార్థించినప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నామని, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకుంటున్నామని చూపిస్తాం.

భర్త తన భార్యతో కలిసి వేటి గురించి ప్రార్థించవచ్చు? (6వ పేరా చూడండి) b

6. మనం మాదిరి ప్రార్థనలో ఉన్న విషయాల గురించి మాత్రమే ప్రార్థించాలా? వివరించండి.

6 అయితే, మాదిరి ప్రార్థనను మనం ఉన్నదున్నట్లు చెప్పాలన్నది యేసు ఉద్దేశం కాదు. వేరే సందర్భాల్లో, తనకు ఆ సమయంలో ముఖ్యం అనిపించిన ఇతర విషయాల గురించి యేసు ప్రార్థించాడు. (మత్త. 26:39, 42; యోహా. 17:1-26) అలాగే మనం కూడా మనల్ని కలవరపెడుతున్న ఏ విషయం గురించైనా ప్రార్థించవచ్చు. ఉదాహరణకు, ఒక నిర్ణయం తీసుకునేముందు తెలివి కోసం, అవగాహన కోసం ప్రార్థించవచ్చు. (కీర్త. 119:33, 34) అలాగే ఒక కష్టమైన పని మొదలుపెట్టేముందు, దాన్ని ఎలా చేయాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అడగవచ్చు. (సామె. 2:6) తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ప్రార్థించవచ్చు. మనందరం మన బైబిలు విద్యార్థుల గురించి, మనం ప్రకటించేవాళ్ల గురించి ప్రార్థించవచ్చు, అలా ప్రార్థించాలి కూడా. అయితే, మన ప్రార్థనల్లో విన్నపాలు మాత్రమే ఉండకూడదు.

మన ప్రార్థనల్లో వేటి గురించి యెహోవాను స్తుతించవచ్చు, కృతజ్ఞతలు చెప్పవచ్చు? (7-9 పేరాలు చూడండి) c

7. మనం ప్రార్థనలో యెహోవాను ఎందుకు స్తుతించాలి?

7 ప్రార్థించేటప్పుడు మనం మర్చిపోకుండా యెహోవాను స్తుతించాలి. మనం స్తుతించడానికి దేవుని కన్నా అర్హులు ఎవరూ లేరు. ఆయన ‘మంచివాడు, ​క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు.’ అంతేకాదు ఆయన ‘కరుణ, ​కనికరం గల దేవుడు, ఓర్పు, అపారమైన విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం గల దేవుడు.’ (కీర్త. 86:5, 15) యెహోవా లక్షణాల్ని బట్టి, ఆయన చేసే వాటిని బట్టి మనం ఆయన్ని స్తుతించవచ్చు.

8. మనం వేటి గురించి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పవచ్చు? (కీర్తన 104:12-15, 24)

8 మనం ప్రార్థనలో యెహోవాను స్తుతించడంతో పాటు, ఆయనిచ్చే అద్భుతమైన బహుమానాల గురించి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటాం. ఉదాహరణకు, చూడచక్కని రంగురంగుల పువ్వులు, లెక్కలేనన్ని రుచికరమైన ఆహారపదార్థాలు, స్నేహితులతో గడిపే మధుర క్షణాలు వంటి వాటిని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. మన ప్రేమగల తండ్రి కేవలం మన ఆనందం కోసమే వీటిని, ఇంకా ఎన్నో మంచివాటిని ఇస్తున్నాడు. (కీర్తన 104:12-15, 24 చదవండి.) మరి ముఖ్యంగా, యెహోవా మనకు సమృద్ధిగా ఇస్తున్న ఆధ్యాత్మిక ఆహారం గురించి, భవిష్యత్తులో ఇవ్వబోతున్న అద్భుతమైన జీవితం గురించి మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్తాం.

9. యెహోవాకు మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పడం కోసం ఏం చేయవచ్చు? (1 థెస్సలొనీకయులు 5:17, 18)

9 అయితే యెహోవా మనకు ఇవన్నీ ఇస్తున్నా, ఒక్కోసారి మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటాం. అలా మర్చిపోకూడదంటే ఏం చేయాలి? మీరు ప్రత్యేకంగా ఏ విషయాల గురించి ప్రార్థించారో ఒకచోట రాసుకోండి, యెహోవా వాటికి ఎలా జవాబిచ్చాడో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. తర్వాత, ఆయన చేసిన సహాయం కోసం కృతజ్ఞతలు చెప్పండి. (1 థెస్సలొనీకయులు 5:17, 18 చదవండి.) దీని గురించి ఆలోచించండి: ఇతరులు మనకు కృతజ్ఞతలు చెప్పినప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది, వాళ్లకు మనమీద ప్రేమ ఉందని అర్థమౌతుంది. అదేవిధంగా, యెహోవా మన ప్రార్థనలకు జవాబిచ్చినప్పుడు మనం మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్తే ఆయన సంతోషిస్తాడు. (కొలొ. 3:15) మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది.

తన ప్రియ కుమారుడి గురించి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి

10. మొదటి పేతురు 2:21 ప్రకారం, యేసును పంపించినందుకు మనం యెహోవాకు ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి?

10 మొదటి పేతురు 2:21 చదవండి. మనకు బోధించడానికి తన ప్రియమైన కుమారుడిని పంపించినందుకు మనం యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాలి. మనం యేసు జీవితం గురించి చదివితే, యెహోవా గురించి ఎంతో నేర్చుకోవచ్చు, ఆయన్ని ఎలా సంతోషపెట్టాలో తెలుసుకోవచ్చు. మనం క్రీస్తు బలి మీద విశ్వాసం చూపిస్తే, యెహోవా దేవునికి దగ్గరి స్నేహితులమౌతాం, ఆయనతో శాంతియుత సంబంధం ఆనందిస్తాం.—రోమా. 5:1.

11. మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?

11 తన కుమారుడి పేరున ప్రార్థన చేసే అవకాశం ఇచ్చినందుకు మనం యెహోవాకు కృతజ్ఞతలు చెప్తాం. యెహోవా మనం అడిగే వాటిని యేసు ద్వారానే ఇస్తాడు. యేసు పేరున చేసే ప్రార్థనల్ని యెహోవా వింటాడు, వాటికి జవాబిస్తాడు. యేసు ఇలా అన్నాడు: “నా పేరున మీరు ఏది అడిగినా నేను అది చేస్తాను, కుమారుడి ద్వారా తండ్రికి మహిమ వచ్చేలా నేను అలా చేస్తాను.”—యోహా. 14:13, 14.

12. మనం యేసును బట్టి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడానికి మరో కారణం ఏంటి?

12 యేసు విమోచనా క్రయధన బలి ఆధారంగానే యెహోవా మన పాపాల్ని క్షమిస్తాడు. యేసును “పరలోకంలో మహాదేవుని సింహాసనానికి కుడిపక్కన కూర్చున్న” ప్రధానయాజకుడిగా లేఖనాలు వర్ణిస్తున్నాయి. (హెబ్రీ. 8:1) యేసు మన కోసం ‘తండ్రి దగ్గర ఉన్న సహాయకుడు.’ (1 యోహా. 2:1) మన బలహీనతలను అర్థం చేసుకుని, ‘మన కోసం వేడుకుంటున్న’ ప్రధానయాజకుడిని ఇచ్చినందుకు మనం యెహోవాకు ఎంతో రుణపడి ఉన్నాం! (రోమా. 8:34; హెబ్రీ. 4:15) మనం అపరిపూర్ణులం కాబట్టి, యేసు బలి లేకపోయుంటే యెహోవాకు ప్రార్థించే అవకాశం మనకు దొరికి ఉండేది కాదు. యెహోవా మనకు ఈ అమూల్యమైన బహుమతిని, అంటే ఆయన ప్రియ కుమారుడిని ఇచ్చినందుకు ఆయనకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!

సహోదర సహోదరీల కోసం ప్రార్థించండి

13. యేసు తన శిష్యుల్ని ప్రేమిస్తున్నానని, చనిపోయే ముందు రోజు రాత్రి ఎలా చూపించాడు?

13 యేసు చనిపోయే ముందు రోజు రాత్రి తన శిష్యుల కోసం చాలాసేపు ప్రార్థించాడు. “దుష్టుని నుండి వాళ్లను కాపాడమని” తండ్రిని వేడుకున్నాడు. (యోహా. 17:15) దాన్నిబట్టి, యేసుకు వాళ్ల మీద ఎంత ప్రేముందో అర్థమౌతుంది! ఆయన కాసేపట్లో చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నా, తన అపొస్తలుల బాగోగుల గురించి ఎంతో ఆలోచించాడు.

మన సహోదర సహోదరీల గురించి ఏమని ప్రార్థించవచ్చు? (14-16 పేరాలు చూడండి) d

14. మనం సహోదర సహోదరీల్ని ప్రేమిస్తున్నామని ఎలా చూపిస్తాం?

14 మనం యేసును అనుకరిస్తాం కాబట్టి, కేవలం మన అవసరాల గురించే ఆలోచించుకోకుండా, మన సహోదర సహోదరీల కోసం క్రమంగా ప్రార్థిస్తాం. అలా చేసినప్పుడు, ఒకరినొకరు ప్రేమించుకోవాలనే యేసు ఆజ్ఞకు లోబడతాం, అలాగే తోటి విశ్వాసులను ఎంతగా ప్రేమిస్తున్నామో యెహోవాకు చూపిస్తాం. (యోహా. 13:34) సహోదర సహోదరీల కోసం మనం చేసే ప్రార్థనలు వాళ్లకు సహాయం చేస్తాయి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, “నీతిమంతుడు పట్టుదలగా చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది.”—యాకో. 5:16.

15. మన సహోదర సహోదరీలకు మన ప్రార్థనలు ఎందుకు అవసరం?

15 మన సహోదర సహోదరీలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్లకు మన ప్రార్థనలు అవసరం. అనారోగ్యం, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, హింస వంటి వాటివల్ల ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకునేలా వాళ్లకు సహాయం చేయమని మనం యెహోవాను వేడుకోవచ్చు. అలాగే, వాళ్లకు నిస్వార్థంగా సహాయం చేస్తున్న సహోదర సహోదరీల గురించి కూడా మనం ప్రార్థించవచ్చు. అలాంటి కష్టాలు పడుతున్న వాళ్లలో కొంతమంది మీకు తెలిసుండవచ్చు. మీరు వాళ్ల పేర్లు ఉపయోగిస్తూ వాళ్ల కోసం ప్రార్థన చేయవచ్చు. కష్టాలు తట్టుకునేలా వాళ్లకు సహాయం చేయమని యెహోవాను వేడుకున్నప్పుడు వాళ్లమీద నిజమైన సహోదర ప్రేమ చూపిస్తాం.

16. బాధ్యతల్లో ఉన్న సహోదరుల కోసం ఎందుకు ప్రార్థించాలి?

16 మనం సంఘంలో బాధ్యతల్లో ఉన్న వాళ్ల కోసం ప్రార్థించినప్పుడు వాళ్లు కృతజ్ఞతతో ఉంటారు, ఆ ప్రార్థనలు వాళ్లకు సహాయం చేస్తాయి. ఇతరుల ప్రార్థనలు తనకు అవసరమని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. ఆయన ఇలా రాశాడు: “నేను మంచివార్త గురించిన పవిత్ర రహస్యాన్ని తెలియజేయడానికి నోరు తెరిచినప్పుడు సరైన పదాలతో ధైర్యంగా మాట్లాడగలిగేలా నాకోసం కూడా ప్రార్థించండి.” (ఎఫె. 6:19) నేడు కూడా మనల్ని ముందుండి నడిపిస్తూ, కష్టపడి పనిచేసే సహోదరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లు చేసే పనిని దీవించమని యెహోవాను అడగడం ద్వారా మనం వాళ్ల మీద ప్రేమ చూపిస్తాం.

ఇతరుల తరఫున ప్రార్థించేటప్పుడు . . .

17-18. మనం ఏ సందర్భాల్లో ఇతరుల తరఫున ప్రార్థించాల్సి రావచ్చు? అప్పుడు ఏ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి?

17 కొన్నిసార్లు మనం ఇతరుల తరఫున ప్రార్థించాల్సి రావచ్చు. ఉదాహరణకు, బైబిలు స్టడీ చేస్తున్న ఒక సహోదరి తనతో ఉన్న సహోదరిని ప్రార్థన చేయమని అడగవచ్చు. అయితే, ఆ సహోదరికి విద్యార్థి గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు, కాబట్టి ఆమె ముగింపు ప్రార్థన చేయాలనుకోవచ్చు. దానివల్ల ఆమె విద్యార్థి అవసరాల గురించి తెలుసుకుని, వాటిగురించి ప్రార్థన చేయగలుగుతుంది.

18 అలాగే, ఒక సహోదరుడిని క్షేత్రసేవా కూటంలో లేదా మీటింగ్‌లో ప్రార్థించమని అడగవచ్చు. అప్పుడు ఆ సహోదరుడు సందర్భాన్ని మనసులో పెట్టుకుని ప్రార్థించాలి. ఇతరులను సరిదిద్దడానికి లేదా ప్రకటనలు చేయడానికి ప్రార్థనను ఉపయోగించకూడదు. మీటింగ్స్‌లో పాటకు, ప్రార్థనకు కలిపి ఐదు నిమిషాలు కేటాయిస్తారు. కాబట్టి ప్రార్థన చేసే సహోదరుడు “ఎక్కువ మాటలు” ఉపయోగించాల్సిన అవసరం లేదు; ముఖ్యంగా ప్రారంభ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.—మత్త. 6:7.

ప్రార్థనను మీ జీవితంలో ముఖ్యమైన భాగంగా చేసుకోండి

19. యెహోవా తీర్పు తీర్చే రోజు కోసం మనం సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి?

19 యెహోవా తీర్పు తీర్చే రోజు దగ్గరయ్యే కొద్దీ, మన జీవితంలో ప్రార్థనకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దాని గురించి యేసు ఇలా అన్నాడు: ‘కాబట్టి, జరగాల్సిన వీటన్నిటినీ తప్పించుకోగలిగేలా మీరు ఎప్పుడూ పట్టు​దలగా ప్రార్థిస్తూ, మెలకువగా ఉండండి.’ (లూకా 21:36) కాబట్టి మనం క్రమంగా ప్రార్థిస్తూ ఉంటే మన విశ్వాసం బలంగా ఉంటుంది, దేవుని తీర్పు రోజు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటాం.

20. మన ప్రార్థనలు పరిమళ ధూపంలా ఉండాలంటే ఏం చేయాలి?

20 ఈ ఆర్టికల్‌లో మనం ఏం నేర్చుకున్నాం? మనం ప్రార్థనను అమూల్యమైన వరంలా చూస్తాం. ప్రార్థనలో ముందుగా యెహోవా సంకల్పానికి సంబంధించిన వాటి గురించి అడగాలి. దేవుని కుమారుడి కోసం, ఆయన రాజ్యం కోసం కృతజ్ఞతలు చెప్పాలి. మన తోటి సహోదర సహోదరీల కోసం ప్రార్థించాలి. మన భౌతిక, ఆధ్యాత్మిక అవసరాల కోసం కూడా మనం ప్రార్థించవచ్చు. మనం ప్రార్థించేటప్పుడు ఏం మాట్లాడాలో జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా, ప్రార్థనను నిజంగా అమూల్యమైన వరంలా ఎంచుతున్నామని చూపిస్తాం. అప్పుడు మన మాటలు యెహోవాకు పరిమళ ధూపంలా ఉంటాయి, “ఆయనకు సంతోషాన్నిస్తాయి.”—సామె. 15:8.

పాట 45 నా హృదయ ధ్యానం

a యెహోవాకు ప్రార్థించడాన్ని మనం అమూల్యమైన వరంలా చూస్తాం. మన ప్రార్థనలు పరిమళ ధూపంలా ఆయన్ని సంతోషపెట్టాలని మనం కోరుకుంటాం. ఈ ఆర్టికల్‌లో, మనం వేటి గురించి ప్రార్థించవచ్చో పరిశీలిస్తాం. అలాగే, ఇతరుల తరఫున ప్రార్థించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాల గురించి చూస్తాం.

b చిత్రాల వివరణ: ఒక సహోదరుడు తన భార్యతో కలిసి, స్కూల్‌లో ఉన్న తమ పాప క్షేమంగా ఉండాలని, వృద్ధుడైన తండ్రి ఆరోగ్యం బాగవ్వాలని, బైబిలు విద్యార్థి ప్రగతి సాధించాలని ప్రార్థిస్తున్నాడు.

c చిత్రాల వివరణ: ఒక యువ సహోదరుడు యేసు బలి గురించి, అందమైన భూమి గురించి, మంచి ఆహారం గురించి యెహోవాకు కృతజ్ఞతలు చెప్తున్నాడు.

d చిత్రాల వివరణ: ఒక సహోదరి, పరిపాలక సభలోని సహోదరులకు పవిత్రశక్తి ఇవ్వమని; ప్రకృతి విపత్తుల వల్ల, హింస వల్ల బాధలు పడుతున్న వాళ్లకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తుంది.