కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 29

మన నాయకుడైన యేసుకు మద్దతిద్దాం

మన నాయకుడైన యేసుకు మద్దతిద్దాం

“పరలోకంలో, భూమ్మీద నాకు పూర్తి అధికారం ఇవ్వబడింది.”మత్త. 28:18.

పాట 13 క్రీస్తు మన ఆదర్శం

ఈ ఆర్టికల్‌లో. . . a

1. యెహోవా ఇప్పుడు ఏం జరగాలని కోరుకుంటున్నాడు?

 దేవుని రాజ్యం గురించిన మంచివార్త ఇప్పుడు భూమంతటా ప్రకటించబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మార్కు 13:10; 1 తిమో. 2:3, 4) ఇది ఆయన పని, అలాగే చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి తన ప్రియకుమారుణ్ణి ఎంచుకున్నాడు. యేసు మనల్ని చక్కగా నడిపిస్తాడు. అందుకే యెహోవా కోరుకున్నట్టే అంతం వచ్చే ముందు ఈ పని ఖచ్చితంగా పూర్తౌతుంది.—మత్త. 24:14.

2. ఈ ఆర్టికల్‌లో మనమేం చూస్తాం?

2 యేసు ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుని’ ద్వారా దేవుని వాక్యం నుండి ఎలా నిర్దేశం ఇస్తున్నాడో అలాగే ముందెప్పుడూ జరగని గొప్ప ప్రకటనా పనికోసం ఎలా ఏర్పాట్లు చేస్తున్నాడో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. (మత్త. 24:45) అంతేకాదు మనలో ప్రతీఒక్కరం యేసుకు, నమ్మకమైన దాసునికి ఎలా మద్దతివ్వచ్చో కూడా చూస్తాం.

ప్రకటనా పనిని యేసు నడిపిస్తున్నాడు

3. యేసుకు ఏ అధికారం ఇవ్వబడింది?

3 యేసు ప్రకటనా పనిని నడిపిస్తున్నాడని మనమెలా చెప్పవచ్చు? ఆయన పరలోకానికి వెళ్లే కాస్త ముందు, గలిలయలో ఒక కొండమీద కొంతమంది నమ్మకమైన అనుచరుల్ని కలిశాడు. వాళ్లతో “పరలోకంలో, భూమ్మీద నాకు పూర్తి అధికారం ఇవ్వబడింది” అని అన్న వెంటనే “కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి” అని చెప్పాడు. (మత్త. 28:18, 19) దీన్నిబట్టి ప్రకటనా పనిని నడిపించడానికి కూడా యేసుకు అధికారం ఇవ్వబడిందని మనకు తెలుస్తుంది.

4. యేసు ఇప్పుడు కూడా ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నాడని మనమెలా చెప్పవచ్చు?

4 ప్రకటనా పని, శిష్యుల్ని చేసే పని అన్నిదేశాల్లో జరుగుతుందని అలాగే “ఈ వ్యవస్థ ముగింపు వరకు” ఆయన తన అనుచరులతో ఉంటాడని యేసు మాటిచ్చాడు. (మత్త. 28:20) ఆ మాటల్నిబట్టి ఇప్పుడు కూడా ప్రకటనా పనిని యేసు నిర్దేశిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది.

5. కీర్తన 110:3 లోని మాటలు నెరవేరడానికి మనమెలా సహాయం చేస్తున్నాం?

5 చివరి రోజుల్లో ప్రకటనా పని చేయడానికి ఎక్కువమంది పనివాళ్లు ఉంటారా లేదా అని యేసు కంగారుపడలేదు. కీర్తనకర్త ముందే చెప్పిన మాటలు నెరవేరతాయని యేసుకు తెలుసు. ఆ కీర్తనకర్త ఇలా రాశాడు: “నువ్వు యుద్ధానికి సిద్ధపడే రోజున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా ముందుకొస్తారు.” (కీర్త. 110:3) ఒకవేళ మీరు ప్రకటనా పని చేస్తుంటే యేసుకు, నమ్మకమైన దాసునికి మద్దతిస్తూ, ఆ ప్రవచనం నెరవేరేలా సహాయం చేస్తున్నట్టే. అయితే ఈ పని ముందుకు వెళ్తుండగా కొన్ని సవాళ్లు ఎదురౌతాయి.

6. మంచివార్తను ప్రకటించేవాళ్లకు ఎదురయ్యే ఒక సవాలేంటి?

6 మంచివార్తను ప్రకటించేవాళ్లకు ఎదురయ్యే ఒక సవాలు వ్యతిరేకత. మతభ్రష్టులు, మతనాయకులు, రాజకీయ నాయకులు మన పని గురించి అబద్ధాలు వ్యాప్తి చేశారు. దాంతో మన బంధువులు, తెలిసినవాళ్లు, తోటి ఉద్యోగస్తులు వాటిని నమ్మేసి యెహోవా సేవను, పరిచర్యను ఆపేయమని మనల్ని బలవంతం చేయవచ్చు. కొన్ని దేశాల్లో మన పనిని వ్యతిరేకించేవాళ్లు మన సహోదర సహోదరీల్ని బెదిరిస్తారు, దాడిచేస్తారు లేదా అరెస్టుచేసి జైలుకు కూడా పంపిస్తారు. ఇలా జరుగుతున్నందుకు మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే యేసు ముందే ఇలా చెప్పాడు: “మీరు నా శిష్యులుగా ఉన్నందుకు అన్నిదేశాల ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు.” (మత్త. 24:9) ఇలాంటి ద్వేషాన్ని ప్రజలు మనమీద చూపిస్తున్నారంటే యెహోవా ఆమోదం మనకుందని అర్థమౌతుంది. (మత్త. 5:11, 12) ఈ వ్యతిరేకత వెనక అపవాది ఉన్నాడు. కానీ అతనికన్నా యేసు ఎంతో శక్తిమంతుడు. యేసు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్నిదేశాల ప్రజలకు మంచివార్త చేరుతుంది. దానికి రుజువుల్ని ఇప్పుడు చూద్దాం.

7. ప్రకటన 14:6, 7 లోని మాటలు నెరవేరుతున్నాయని అనడానికి మీరెలాంటి రుజువుల్ని చూస్తున్నారు?

7 ప్రజలు వేర్వేరు భాషలు మాట్లాడతారు కాబట్టి వాళ్లకు మంచివార్తను చెప్పడం మనకొక సవాలుగా ఉండవచ్చు. అయితే ఈ సవాలును మన కాలంలో అధిగమిస్తామని అపొస్తలుడైన యోహానుకు ఇచ్చిన దర్శనంలో యేసు ముందే చెప్పాడు. (ప్రకటన 14:6, 7 చదవండి.) వీలైనంత ఎక్కువమంది మంచివార్తను విని, మార్పులు చేసుకోవడానికి మనం సహాయం చేస్తున్నాం. ఎలా? ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న చాలామంది ప్రజలు jw.org వెబ్‌సైట్‌లో బైబిలు ఆధారిత సమాచారాన్ని చదవగలుగుతున్నారు. ఎందుకంటే అది 1,000 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. అలాగే శిష్యుల్ని చేసేపనిలో మనం ముఖ్యంగా ఉపయోగించే ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకాన్ని 700 కన్నా ఎక్కువ భాషల్లో అనువదించడానికి పరిపాలక సభ అనుమతినిచ్చింది. అంతేకాదు వినలేనివాళ్లకు వీడియోల ద్వారా, చూపులేనివాళ్లకు బ్రెయిలీలో ప్రచురణల ద్వారా బైబిలు నిర్దేశాలు అందుతున్నాయి. దీన్నిబట్టి బైబిలు ప్రవచనాలు నెరవేరడాన్ని మనం కళ్లారా చూస్తున్నాం. అలా “ఆయా దేశాలకు చెందిన అన్ని భాషల ప్రజలు” బైబిలు సత్యాలకు సంబంధించి “స్వచ్ఛమైన భాషను” మాట్లాడడం నేర్చుకుంటున్నారు. (జెక. 8:23; జెఫ. 3:9) ఇదంతా యేసు, పనిని చక్కగా నడిపిస్తున్నందుకే జరుగుతుంది.

8. మనం మంచివార్తను ప్రకటించడంవల్ల ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలొచ్చాయి?

8 నేడు 80 లక్షల కన్నా ఎక్కువమంది ప్రజలు 240 దేశాల్లో యెహోవా సంస్థలో భాగంగా ఉన్నారు. అలాగే ప్రతీ సంవత్సరం లక్షకంటే ఎక్కువమంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా శిష్యులౌతున్నవాళ్లు క్రైస్తవ లక్షణాల్ని పెంచుకుంటూ “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకుంటున్నారు. (కొలొ. 3:8-10) చాలామంది అనైతికతను, క్రూరత్వాన్ని, పక్షపాతాన్ని వదిలేసి రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అలాగే వాళ్లు “యుద్ధం చేయడం నేర్చుకోరు” కాబట్టి యెషయా 2:4 లో ఉన్న ప్రవచనం నెరవేరుతుంది. మనం కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికి కృషి చేయడంవల్ల ప్రజలు యెహోవా సంస్థలోకి వచ్చేలా సహాయం చేస్తాం. అలాగే యేసుక్రీస్తు నాయకత్వం కింద నడుస్తున్నామని నిరూపిస్తాం. (యోహా. 13:35; 1 పేతు. 2:12) ఇదంతా ఏదో అనుకోకుండా జరగట్లేదుగానీ యేసు మనల్ని నడిపిస్తున్నందుకే జరుగుతుంది.

యేసు ఒక దాసుణ్ణి నియమించాడు

9. మత్తయి 24:45-47 ప్రకారం, చివరి రోజుల్లో ఏం జరుగుతుందని యేసు చెప్పాడు?

9 మత్తయి 24:45-47 చదవండి. ఈ చివరి రోజుల్లో దేవుని వాక్యం నుండి నిర్దేశమివ్వడానికి ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి’ నియమిస్తానని మన నాయకుడైన యేసు ముందే చెప్పాడు. నేడు ఆయన చెప్పినట్టే జరుగుతుంది. దానికోసం ఆయన అభిషిక్త సహోదరులు ఉన్న ఒక చిన్న గుంపును ఉపయోగించి దేవుని ప్రజలకు, ఆసక్తి ఉన్నవాళ్లకు తగిన సమయంలో ఆధ్యాత్మిక ఆహారం పెట్టేలా చూసుకుంటున్నాడు. ఈ అభిషిక్త సహోదరులు, ఇతరుల విశ్వాసం మీద యజమానులమని అస్సలు అనుకోరు. (2 కొరిం. 1:24) బదులుగా యేసుక్రీస్తే తన ప్రజలకు ‘నాయకుడని, అధిపతని’ గుర్తిస్తారు.—యెష. 55:4.

10. యెహోవాను సేవించడం మొదలుపెట్టడానికి చిత్రాల్లో ఉన్న ఏ పుస్తకం మీకు సహాయం చేసింది?

10 ఆసక్తి ఉన్నవాళ్లు దేవుని వాక్యం నుండి సత్యం తెలుసుకోవడానికి సహాయంచేసే ఎన్నో ప్రచురణల్ని నమ్మకమైన దాసుడు 1919 నుండి తయారుచేశాడు. 1921 లో ప్రాముఖ్యమైన బైబిలు సత్యాల్ని నేర్చుకునేలా సహాయం చేయడానికి దేవుని వీణ (ఇంగ్లీష్‌) అనే పుస్తకాన్ని దాసుడు తయారుచేశాడు. మారుతున్న కాలానికి తగ్గట్టు దాసుడు వేరే ప్రచురణల్ని కూడా సిద్ధం చేశాడు. వాటిలో “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఇంగ్లీష్‌), నిత్యజీవమునకు నడుపు సత్యము (ఇంగ్లీష్‌), మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకాలు ఉన్నాయి. మన పరలోక తండ్రి గురించి తెలుసుకుని, ఆయన్ని ప్రేమించడానికి మీకు ఏ పుస్తకం సహాయం చేసింది? ఈ పుస్తకాలన్నీ సరైన సమయంలో విడుదలవ్వడం వల్ల చాలామంది శిష్యులయ్యారు.

11. యెహోవా గురించి, బైబిలు గురించి మనందరం ఎక్కువ తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

11 యెహోవా గురించి, బైబిలు గురించి లోతైన జ్ఞానం కేవలం కొత్తవాళ్లకే కాదు మనందరికీ అవసరం. అందుకే “గట్టి ఆహారం పరిణతిగల వాళ్ల కోసం” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. అలా బైబిలు నుండి నేర్చుకున్నవాటిని పాటించినప్పుడు మనం ‘తప్పొప్పులను గుర్తించగలుగుతాం’ అని కూడా ఆయన చెప్పాడు. (హెబ్రీ. 5:14) ఈరోజుల్లో చాలామంది ప్రజలు నైతికంగా ఎంతో దిగజారిపోయారు కాబట్టి దేవుని ప్రమాణాల్ని పాటించడం చాలా కష్టంగా ఉండవచ్చు. అయితే మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి అవసరమయ్యే ఆధ్యాత్మిక ఆహారం అందేలా యేసు ఖచ్చితంగా చూసుకుంటాడు. ఈ ఆధ్యాత్మిక ఆహారం దేవుని వాక్యమైన బైబిలు నుండి వస్తుంది. దానిని నమ్మకమైన దాసుడు యేసు నిర్దేశం కింద సిద్ధంచేసి అందరికీ అందేలా చూసుకుంటున్నాడు.

12. యేసులాగే మనం దేవుని పేరుకు ఎలా గౌరవాన్ని ఇచ్చాం?

12 యేసులాగే మనం దేవుని పేరుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాం. (యోహా. 17:6, 26) ఉదాహరణకు 1931 లో మనం యెహోవాసాక్షులమనే పేరు పెట్టుకున్నాం. ఆ విధంగా దేవుని పేరు మనకెంత ప్రాముఖ్యమో, ఆ పేరుతో పిలువబడాలని ఎంత కోరుకుంటున్నామో చూపించాం. (యెష. 43:10-12) ఆ సంవత్సరం అక్టోబరు నుండి వచ్చిన కావలికోట పత్రిక కవర్‌ పేజీలన్నిటి మీద దేవుని పేరు కనిపిస్తుంది. పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో దేవుని పేరు ఉండాల్సిన ప్రతీచోట పెట్టాం. దానికి భిన్నంగా క్రైస్తవమత చర్చీలు ఎన్నో బైబిలు అనువాదాల నుండి యెహోవా పేరును పూర్తిగా తీసేశాయి.

యేసు తన సంస్థ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు

13. మనకాలంలో యేసు ‘నమ్మకమైన బుద్ధిగల దాసుణ్ణి’ ఉపయోగిస్తున్నాడని ఎందుకు నమ్మవచ్చు? (యోహాను 6:68)

13 “నమ్మకమైన బుద్ధిగల దాసుని” ద్వారా స్వచ్ఛారాధనను ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప సంస్థను యేసు ఈ భూమ్మీద ఏర్పాటు చేశాడు. బహుశా ఈ సంస్థ గురించి అపొస్తలుడైన పేతురులాగే మీకు కూడా అనిపిస్తుండవచ్చు. ఒక సందర్భంలో అతను యేసుతో ఇలా అన్నాడు: “మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి? శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి.” (యోహా. 6:68) మనకు యెహోవా సంస్థ గురించి తెలీకపోయుంటే ఏమైపోయేవాళ్లం? ఆ సంస్థ ద్వారా యెహోవాకు నమ్మకంగా ఉండడానికి అవసరమయ్యే ప్రతీదాన్ని క్రీస్తు మనకు ఇస్తున్నాడు. ప్రకటనా పనిని, బోధనా పనిని చక్కగా చేయడానికి అవసరమయ్యే శిక్షణను కూడా ఆయన మనకిస్తున్నాడు. అంతేకాదు యెహోవాకు ఇష్టమైన విధంగా నడుచుకునేలా “కొత్త వ్యక్తిత్వాన్ని” అలవర్చుకోవడానికి కూడా యేసు సహాయం చేస్తున్నాడు.—ఎఫె. 4:24.

14. కోవిడ్‌-19 మొదలైనప్పటి నుండి యెహోవా సంస్థ నుండి పొందిన నిర్దేశాలవల్ల మీరెలా ప్రయోజనం పొందారు?

14 కష్టమైన పరిస్థితుల్లో యేసు తెలివైన నిర్దేశాల్ని ఇస్తాడు. కోవిడ్‌-19 మొదలైనప్పుడు యేసు తన సంస్థ ద్వారా ఇచ్చిన నిర్దేశాలవల్ల ఎన్నో ప్రయోజనాలు వచ్చాయి. ఒకవైపు లోకంలోని చాలామంది ఏం చేయాలో తెలీక అయోమయంలో ఉంటే, మనం మాత్రం సురక్షితంగా ఉండడానికి యేసు నుండి స్పష్టమైన నిర్దేశాలు పొందాం. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్‌ పెట్టుకోమని, సామాజిక దూరాన్ని పాటించమని మనకు చెప్పారు. అలాగే పెద్దలు సంఘంలో ఉన్నవాళ్లతో క్రమంగా మాట్లాడుతూ వాళ్లు సురక్షితంగా, ఆరోగ్యంగా, యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగివుండడానికి అవసరమైనవన్నీ ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండమని నిర్దేశించబడ్డారు. (యెష. 32:1, 2) అంతేకాదు పరిపాలక సభ అప్‌డేట్‌ వీడియోల ద్వారా ఇంకా ఎక్కువ నిర్దేశాల్ని, ప్రోత్సాహాన్ని పొందాం.

15. మీటింగ్స్‌ జరుపుకునే విషయంలో, ప్రకటనా పనిచేసే విషయంలో మనం ఎలాంటి నిర్దేశాల్ని పొందాం? దానివల్ల ఎలాంటి ఫలితాలొచ్చాయి?

15 కోవిడ్‌ మహమ్మారిగా మారినప్పుడు మీటింగ్స్‌ ఎలా జరుపుకోవాలో, ప్రీచింగ్‌ ఎలా చేయాలో కూడా స్పష్టమైన నిర్దేశాల్ని పొందాం. కొద్దిరోజుల్లోనే మీటింగ్స్‌ని, సమావేశాల్ని మనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసుకోవడం మొదలుపెట్టాం. అంతేకాదు మన పరిచర్యను ఉత్తరాల ద్వారా, టెలిఫోన్‌ ద్వారా చేయడం ప్రారంభించాం. మనం పడిన కష్టాన్ని యెహోవా దీవిస్తున్నాడు. అందుకే చాలా బ్రాంచీలు తమ క్షేత్రంలో ప్రచారకుల సంఖ్య పెరిగిందని రిపోర్టు చేశాయి. నిజానికి ఈ సమయంలో చాలామందికి ప్రోత్సాహకరమైన అనుభవాలు కూడా దొరికాయి.—“ యెహోవా మన ప్రకటనా పనిని దీవిస్తున్నాడు” అనే బాక్సు చూడండి.

16. మనమే విషయం గురించి నమ్మకంతో ఉండవచ్చు?

16 కోవిడ్‌ విషయంలో మన సంస్థ అతి జాగ్రత్తను చూపిస్తుందని కొంతమంది అనుకొనివుంటారు. కానీ ఆ సమయంలో వచ్చిన నిర్దేశాలన్నీ తెలివైనవే అని ఎన్నోసార్లు రుజువైంది. (మత్త. 11:19) అలాగే యేసు తన ప్రజల్ని ఎంత ప్రేమగా నడిపిస్తున్నాడో లోతుగా ఆలోచించినప్పుడు, భవిష్యత్తులో ఏం జరిగినా యెహోవా, ఆయన ప్రియ కుమారుడు మనకు తోడుగా ఉంటారని మనం నమ్మకంతో ఉండవచ్చు.—హెబ్రీయులు 13:5, 6 చదవండి.

17. యేసు నాయకత్వం కింద పనిచేస్తున్నందుకు మీకెలా అనిపిస్తుంది?

17 యేసు మన నాయకుడిగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మనం వేర్వేరు సంస్కృతులు, దేశాలు, భాషలకు చెందిన ప్రజలున్న సంస్థలో భాగంగా ఉన్నాం. అలాగే దేవుని వాక్యం నుండి నిర్దేశాల్ని, పరిచర్య చేయడానికి అవసరమైన శిక్షణను ఎప్పటికప్పుడు పొందుతున్నాం. అంతేకాదు మనలో ప్రతీఒక్కరం కొత్త వ్యక్తిత్వాన్ని ఎలా అలవర్చుకోవాలో, ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో నేర్చుకుంటున్నాం. నిజంగా, యేసు మన నాయకుడని గర్వపడడానికి ఎన్నో కారణాలున్నాయి.

పాట 16 అభిషిక్త కుమారుణ్ణి బట్టి యెహోవాను స్తుతించండి

a లక్షలమంది పురుషులు, స్త్రీలు, పిల్లలు మంచివార్తను ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. మీరు కూడా వాళ్లలో ఒకరైతే ప్రభువైన యేసుక్రీస్తు నాయకత్వం కింద పనిచేస్తున్నట్లే. ఈ రోజుల్లో ప్రకటనా పనిని యేసే నడిపిస్తున్నాడని చెప్పడానికి కొన్ని రుజువుల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాటిగురించి ఆలోచించడం ద్వారా, క్రీస్తు నిర్దేశం కింద పనిచేస్తూ యెహోవాను సేవిస్తూ ఉండాలనే మన నిర్ణయాన్ని బలపర్చుకుంటాం.