మీకు తెలుసా?
ప్రాచీన బబులోనులో దొరికిన ఇటుకలు, వాటి తయారీ విధానం బైబిలు చెప్పేవి నిజమని ఎలా రుజువు చేస్తున్నాయి?
పురాతన వస్తువుల్ని తవ్వేవాళ్లకు ప్రాచీన బబులోనులో ఎన్నో లక్షల ఇటుకలు దొరికాయి. అప్పట్లో నగరాల్ని కట్టడానికి ఆ ఇటుకల్ని ఉపయోగించేవాళ్లు. పురాతన వస్తువుల్ని తవ్వే శాస్త్రజ్ఞుడైన రోబర్ట్ కొల్దేవ్ ఇలా అంటున్నాడు: ‘నగరం బయట ఎక్కడైతే మంచి బంకమట్టి అలాగే ఇటుకలు కాల్చడానికి కట్టెలు దొరుకుతాయో, అక్కడి కొలిమిలో ఇటుకల్ని తయారుచేసేవాళ్లు.’
ఈ కొలిమిల్నే, బబులోను ప్రభుత్వ అధికారులు ఒక ఘోరమైన పని చేయడానికి కూడా ఉపయోగించే వాళ్లని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ప్రాచీన అష్షూరు చరిత్రలో అలాగే భాషలో నిపుణుడైన పౌల్-అలెన్ బోలి అనే ఫ్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ టొరొంటోలో పనిచేస్తున్నాడు. అతను ఇలా అంటున్నాడు: ‘ఎవరైతే రాజు మాటను వినరో లేదా బబులోను దేవుళ్లను గౌరవించరో, వాళ్లను కొలిమిలో పడేసి, కాల్చేయాలని బబులోను తవ్వకాల్లో దొరికిన చాలావాటి మీద రాసి ఉంది.’ ఉదాహరణకు, నెబుకద్నెజరు రాజు కాలం నాటి ఒక రాతల్లో ఇలా ఉంది: ‘వాళ్లను చంపేయండి, కొలిమిలో వేసి వాళ్లను కాల్చేయండి, వాళ్లను మాడ్చి మసి చేయండి, పొగ పైకిలేచేలా చేయండి, కొన ఊపిరిపోయేలా మంటల్లో వేసేయండి.’
ఈ మాటలు మనకు దానియేలు 3వ అధ్యాయాన్ని గుర్తుచేస్తాయి. అక్కడ ఏం ఉందంటే, రాజైన నెబుకద్నెజరు ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించి, బబులోను నగరం బయట దూరా మైదానంలో నిలబెట్టించాడు. అప్పుడు ముగ్గురు హెబ్రీ యువకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ ప్రతిమకు వంగి నమస్కారం చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో నెబుకద్నెజరుకు బాగా కోపం వచ్చి “కొలిమిని మామూలుకన్నా ఏడు రెట్లు ఎక్కువ వేడిగా చేయమని” ఆజ్ఞాపించాడు. అలాగే ఆ ముగ్గుర్ని “మండే కొలిమిలో పడేయమని” చెప్పాడు. అప్పుడు ఒక శక్తివంతమైన దేవదూత వాళ్లను ప్రాణాలతో కాపాడాడు.—దాని. 3:1-6, 19-28.
బబులోనులో దొరికిన ఇటుకలు బైబిలు చెప్తున్నది నిజమని రుజువు చేస్తున్నాయి. అలాంటి ఇటుకల్లో చాలావాటి మీద రాజును పొగుడుతూ కొన్ని మాటలు ఉన్నాయి. వాటిలో ఒక దానిమీద ఇలా ఉంది: ‘నెబుకద్నెజరు, బబులోను రాజు. ఈ రాజ భవనాన్ని గొప్ప రాజైన నేను కట్టించాను, నా వంశస్థులందరూ ఎప్పటికీ దీన్ని పరిపాలిస్తూ ఉండాలి.’ ఈ మాటలు, దానియేలు 4:30లోని నెబుకద్నెజరు తన గురించి తాను గొప్పలకు పోతూ చెప్పుకున్న మాటలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ వచనంలో ఇలా ఉంది: “ఈ మహా బబులోను నేను నా ఘనతావైభవాల్ని చూపించడం కోసం నా సొంత శక్తితో, బలంతో రాజధానిగా కట్టించుకున్న నగరం కాదా?”