కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 29

మహాశ్రమకు మీరు సిద్ధమా?

మహాశ్రమకు మీరు సిద్ధమా?

“మీరు . . . సిద్ధంగా ఉండండి.”మత్త. 24:44.

పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

ఈ ఆర్టికల్‌లో . . . a

1. విపత్తుకు సిద్ధపడడం ఎందుకు మంచిది?

 దేనికైనా సిద్ధపడడం ప్రాణాల్ని కాపాడుతుంది. ఉదాహరణకు, విపత్తు రాకముందే ఎవరైతే దానికోసం సిద్ధపడతారో వాళ్లు తమ ప్రాణాల్ని కాపాడుకుంటారు, ఇతరులకు సహాయం కూడా చేయగలుగుతారు. యూరప్‌లోని ఒక మానవ సేవా సంస్థ ఇలా చెప్తుంది: “మంచిగా సిద్ధపడి ఉండడం ప్రాణాల్ని కాపాడుతుంది.”

2. మహాశ్రమకు మనం ఎందుకు సిద్ధంగా ఉండాలి? (మత్తయి 24:44)

2 “మహాశ్రమ” హఠాత్తుగా మొదలౌతుంది. (మత్త. 24:21) అయితే వేరే విపత్తుల్లా కాకుండా మహాశ్రమ వస్తుందని మనకు తెలుసు కాబట్టి మనం ఆశ్చర్యపోం. యేసు కూడా 2,000 సంవత్సరాల ముందే ఆ రోజు కోసం సిద్ధంగా ఉండమని తన అనుచరుల్ని హెచ్చరించాడు. (మత్తయి 24:44 చదవండి.) మనం కూడా సిద్ధంగా ఉంటే ఆ కష్టకాలం నుండి బయటపడడం కాస్త తేలికౌతుంది. అలాగే ఇతరులు కూడా బయటపడేలా సహాయం చేస్తాం.—లూకా 21:36.

3. మహాశ్రమకు సిద్ధంగా ఉండడానికి సహనం, కనికరం, ప్రేమ ఎలా సహాయం చేస్తాయి?

3 మహాశ్రమకు సిద్ధపడడానికి మనకు అవసరమయ్యే మూడు లక్షణాల్ని గమనించండి. కఠినమైన తీర్పు సందేశాన్ని ప్రకటించమని చెప్తే, అప్పుడు వ్యతిరేకత వస్తే? (ప్రక. 16:21) యెహోవా మాట వినడానికి, ఆయన మనల్ని కాపాడతాడని నమ్మడానికి మనకు సహనం అవసరం. మన బ్రదర్స్‌ కొన్నిటిని లేదా అన్నిటినీ కోల్పోతే? (హబ. 3:17, 18) వాళ్లకు అవసరమైన సహాయం చేయడానికి మనకు కనికరం అవసరం. దేశాల గుంపు దాడి చేసినప్పుడు మన బ్రదర్స్‌, సిస్టర్స్‌తో ఒకే చోట ఉండాల్సి వస్తే? (యెహె. 38:10-12) ఆ కష్టమైన సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండడానికి మనకు బలమైన ప్రేమ అవసరం.

4. సహనాన్ని, కనికరాన్ని, ప్రేమను మనం పెంచుకుంటూనే ఉండాలని బైబిలు ఎలా చెప్తుంది?

4 సహనాన్ని, కనికరాన్ని, ప్రేమను పెంచుకుంటూ ఉండమని బైబిలు చెప్తుంది. లూకా 21:19 ఇలా చెప్తుంది: “మీ సహనం వల్ల మీరు మీ ప్రాణాలు రక్షించుకుంటారు.” కొలొస్సయులు 3:12 ఇలా చెప్తుంది: “కనికరాన్ని, . . . అలవర్చుకోండి.” 1 థెస్సలొనీకయులు 4:9, 10 ఇలా చెప్తుంది: “మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పిస్తున్నాడు. . . . అయితే సహోదరులారా, ఇంకా పూర్తిస్థాయిలో అలా ప్రేమ చూపిస్తూ ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం.” ఈ మాటలన్నీ సహనం, కనికరం, ప్రేమ అనే లక్షణాల్ని ముందు నుంచే చూపిస్తున్న క్రైస్తవులకు చెప్పబడ్డాయి. ఎందుకంటే వాళ్లు ఆ లక్షణాల్ని ఇంకా పెంచుకుంటూనే ఉండాలి. మనం కూడా వాళ్లలాగే చేయాలి. దానికోసం మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఈ లక్షణాల్ని ఎలా చూపించారో, వాళ్లలాగే మనం ఆ లక్షణాల్ని ఎలా చూపించవచ్చో, అలా మహాశ్రమకు సిద్ధంగా ఉన్నామని ఎలా నిరూపించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సహనాన్ని పెంచుకోండి

5. కష్టాలు వచ్చినప్పుడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు సహనం ఎలా చూపించారు?

5 మొదటి శతాబ్దపు క్రైస్తవులకు సహనం అవసరమైంది. (హెబ్రీ. 10:36) మనుషులందరికీ వచ్చే కష్టాలే కాకుండా, క్రైస్తవులుగా ఉన్నందుకు ఇంకొన్ని కష్టాలు కూడా వాళ్లకు వచ్చాయి. యూదా మత నాయకులు, రోమా అధికారుల నుండే కాకుండా తమ సొంత కుటుంబం నుండి కూడా చాలామంది హింసను ఎదుర్కొన్నారు. (మత్త. 10:21) అలాగే సంఘం లోపల నుండి కూడా వాళ్లకు కష్టాలు వచ్చాయి. మతభ్రష్టులు చెప్పే అబద్ధ బోధలకు పడిపోకుండా ఉండడానికి వాళ్లు పోరాడాల్సి వచ్చింది. (అపొ. 20:29, 30) ఇన్ని కష్టాలు వచ్చినాసరే ఆ క్రైస్తవులు సహనం చూపించారు. (ప్రక. 2:3) ఎలా? సహనం చూపించిన యోబులాంటి బైబిలు ఉదాహరణల గురించి వాళ్లు జాగ్రత్తగా ఆలోచించారు. (యాకో. 5:10, 11) ధైర్యం కోసం ప్రార్థించారు. (అపొ. 4:29-31) అలాగే సహనం చూపిస్తే వచ్చే మంచి ఫలితాల మీద దృష్టిపెట్టారు.—అపొ. 5:41.

6. వ్యతిరేకతను సహించడానికి మెరిటా చేసిన దాన్నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

6 సహనం గురించిన ఉదాహరణల్ని బైబిల్లో, మన ప్రచురణల్లో చదివి, ధ్యానించినప్పుడు మనం కూడా సహనం చూపించగలుగుతాం. అల్బేనియాలో ఉన్న మెరిటా అనే సిస్టర్‌ అదే చేసింది. దానివల్ల తన కుటుంబం నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా ఆమె సహించగలిగింది. ఆమె ఇలా అంటుంది: “బైబిల్లోని యోబు ఉదాహరణ నాకు చాలా సహాయం చేసింది. ఆయన ఎన్నో కష్టాలు సహించాడు. అవి ఎవరి వల్ల వస్తున్నాయో తెలీకపోయినా ఆయన ఇలా అన్నాడు: ‘చనిపోయేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను!’ (యోబు 27:5) యోబుకు వచ్చిన కష్టాలతో పోలిస్తే నా కష్టాలు చాలా చిన్నవని అనిపించింది. అంతేకాదు నాకైతే ఈ కష్టాల వెనుక ఎవరున్నారో కూడా తెలుసు.”

7. ఇప్పుడు మనకు తుఫానులాంటి కష్టాలు లేకపోయినా ఇప్పటినుండే ఏం చేయాలి?

7 మనం తరచూ మనసులో ఉన్నదంతా యెహోవాకు ప్రార్థనలో చెప్పినప్పుడు సహనాన్ని పెంచుకోగలుగుతాం. (ఫిలి. 4:6; 1 థెస్స. 5:17) ఇప్పుడైతే మీకు తుఫానులాంటి కష్టాలు ఉండకపోవచ్చు. కానీ మీరు డీలా పడినప్పుడు, ఏదైనా విషయం మిమ్మల్ని తికమక పెట్టినప్పుడు లేదా ఏం చేయాలో దిక్కుతోచనప్పుడు సహాయం కోసం యెహోవావైపు చూస్తారా? ఇప్పుడు రోజువారీ చిన్నచిన్న కష్టాల్లో సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తే, భవిష్యత్తులో పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఆయన సహాయాన్ని అడగడానికి వెనకాడరు. అంతేకాదు మీకు సరిగ్గా ఎప్పుడు, ఎలా సహాయం చేయాలో యెహోవాకు ఖచ్చితంగా తెలుసనే ధీమాతో ఉంటారు.—కీర్త. 27:1, 3.

సహనం

ఇప్పుడు వచ్చే ఏ కష్టాన్నైనా సహిస్తే, తర్వాత వచ్చే వాటికి ధీటుగా నిలబడతాం (8వ పేరా చూడండి)

8. ఇప్పుడు వచ్చే కష్టాల్ని సహిస్తే, భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని సహించవచ్చని మీరా ఉదాహరణ ఎలా చూపిస్తుంది? (యాకోబు 1:2-4) (చిత్రం కూడా చూడండి.)

8 ఇప్పుడు మనం కష్టాల్ని సహిస్తే మహాశ్రమను కూడా సహించవచ్చు. (రోమా. 5:3) అలాగని ఎందుకు చెప్పవచ్చు? కష్టాల్ని సహించిన ప్రతీసారి, తర్వాత వచ్చే కష్టానికి ధీటుగా నిలబడడానికి అది సహాయం చేసిందని చాలామంది బ్రదర్స్‌, సిస్టర్స్‌ చెప్తున్నారు. సహనం వాళ్లను మెరుగులుదిద్దింది. వాళ్లకు సహాయం చేయడానికి యెహోవా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడనే విశ్వాసాన్ని బలపర్చింది. ఆ విశ్వాసమే, తర్వాత వచ్చే కష్టాన్ని సహించడానికి సహాయం చేసింది. (యాకోబు 1:2-4 చదవండి.) అల్బేనియాలో ఉంటున్న మీరా అనే పయినీరు సిస్టర్‌ గురించి ఆలోచించండి. గతంలో కష్టాల్ని సహించడంవల్ల, తర్వాత వచ్చిన కష్టాల్ని కూడా ఆమె సహించగలిగింది. ఆమెకు మాత్రమే ఇన్ని కష్టాలు ఉన్నాయని కొన్నిసార్లు అనుకునేది. కానీ గడిచిన 20 సంవత్సరాల్లో యెహోవా తనకు ఎంతలా సహాయం చేశాడో గుర్తుతెచ్చుకుని, తనకు తాను ఇలా చెప్పుకునేది: ‘ఇప్పుడు విశ్వాసాన్ని వదిలేయద్దు. ఇన్ని సంవత్సరాలు యెహోవా సహాయంతో ఎన్నో సహించావు. వాటన్నిటిని మట్టిలో కలిసిపోనివ్వకు.’ మీరు కూడా ఇప్పటికే కష్టాల్ని సహించడానికి యెహోవా మీకెలా సహాయం చేశాడో ఆలోచించవచ్చు. కష్టాల్ని సహించిన ప్రతీసారి ఆయన చూస్తాడనే, మీకు ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (మత్త. 5:10-12) అలా మహాశ్రమ మొదలవ్వడానికి ముందే సహనాన్ని చూపించడం మీకు అలవాటు అయ్యుంటుంది కాబట్టి, ఆ లక్షణాల్ని ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉండాలని నిర్ణయించుకుంటారు.

కనికరం చూపించండి

9. సిరియాలోని అంతియొకయ సంఘంవాళ్లు ఎలా కనికరం చూపించారు?

9 యూదయలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఏం జరిగిందో గమనించండి. ఆ కరువు గురించి సిరియాలోని అంతియొకయలో ఉన్న సంఘానికి తెలిసింది. అప్పుడు యూదయలో ఉన్న బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద కనికరపడి, వాళ్లు ఏదోక సహాయం చేసేలా కదిలించబడ్డారు. అందుకే “ఒక్కొక్కరు తాము ఇవ్వగలిగిన దాన్నిబట్టి, యూదయలో ఉన్న సహోదరులకు సహాయం పంపించాలని నిశ్చయించుకున్నారు.” (అపొ. 11:27-30) కరువు బారినపడిన ఆ బ్రదర్స్‌, సిస్టర్స్‌ దూరంలో ఉన్నాసరే, అంతియొకయలో ఉన్న క్రైస్తవులు మాత్రం వాళ్లకు సహాయం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.—1 యోహా. 3:17, 18.

కనికరం

ప్రకృతి విపత్తులు మనం కనికరం చూపించడానికి ఒక అవకాశాన్నిస్తాయి (10వ పేరా చూడండి)

10. విపత్తు బారినపడిన మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ఏయే విధాలుగా మనం కనికరం చూపించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

10 ఈ రోజుల్లో మనం కూడా విపత్తు బారినపడిన మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద కనికరం చూపించవచ్చు. మనం సహాయం చేయడానికి వెంటనే ముందుండొచ్చు. బహుశా సహాయక చర్యల్లో పని చేయగలమా అని పెద్దల్ని అడగొచ్చు, ప్రపంచవ్యాప్త పనికి విరాళం ఇవ్వొచ్చు లేదా విపత్తు బారినపడిన వాళ్లకోసం ప్రార్థించవచ్చు. b (సామె. 17:17) ఉదాహరణకు, 2020​లో కోవిడ్‌ బారినపడిన వాళ్లకు సహాయం చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా 950 కన్నా ఎక్కువ విపత్తు సహాయక కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కమిటీలో పనిచేసినవాళ్లకు మనం ఎంతో కృతజ్ఞులం! మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద కనికరంతో వాళ్లు అవసరమైన వస్తువుల్ని పంచిపెట్టారు, ఆధ్యాత్మిక సహాయం చేశారు. ఇంకొన్ని సందర్భాల్లోనైతే ఇళ్లను, రాజ్యమందిరాల్ని తిరిగి కట్టారు లేదా మరమ్మతులు చేశారు.—2 కొరింథీయులు 8:1-4 తో పోల్చండి.

11. మనం కనికరం చూపిస్తే యెహోవాకు ఎలా ఘనత వస్తుంది?

11 విపత్తు సమయంలో మనం కనికరం చూపించినప్పుడు, మనం చేసే త్యాగాల్ని ఇతరులు గమనిస్తారు. ఉదాహరణకు, 2019​లో డోరియన్‌ తుఫాను విరుచుకుపడినప్పుడు బహామాస్‌లోని మన రాజ్యమందిరం నేలమట్టమైంది. ఆ రాజ్యమందిరాన్ని తిరిగి కడుతున్నప్పుడు, ఒక పనికోసం ఎంత ఖర్చు అవుతుందో యెహోవాసాక్షికాని ఒక కాంట్రాక్టర్‌ని మన బ్రదర్స్‌ అడిగారు. ఆయన ఇలా అన్నాడు: ‘పనిముట్లను, సామాన్లను, పనివాళ్లను నేను ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మీ సంస్థ కోసం నాకు ఇది చేయాలని ఉంది. మీరు మీ ఫ్రెండ్స్‌కి సహాయం చేయడం నాకు బాగా నచ్చింది.’ లోకంలోని చాలామందికి యెహోవా ఎవరో తెలీదు. కానీ యెహోవాసాక్షులు ఇతరులకు సహాయం చేయడానికి ఏం చేస్తున్నారో చాలామంది గమనిస్తారు. కాబట్టి మనం కనికరంతో చేసే పనులు, ప్రజల్ని ‘అత్యంత కరుణామయుడైన’ యెహోవాను తెలుసుకునేలా చేయడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా!—ఎఫె. 2:4.

12. ఇప్పుడు, మహాశ్రమ సమయంలో మనం కనికరాన్ని ఎందుకు చూపించాలి? (ప్రకటన 13:16, 17)

12 మహాశ్రమ సమయంలో మనం ఎందుకు కనికరం చూపించాలి? ఈ లోక ప్రభుత్వానికి ఎవరైతే మద్దతు ఇవ్వరో, వాళ్లకు ఇప్పుడు అలాగే మహాశ్రమ సమయంలో కష్టాలు వస్తాయని బైబిలు చెప్తుంది. (ప్రకటన 13:16, 17 చదవండి.) మన బ్రదర్స్‌, సిస్టర్స్‌కి రోజువారీ అవసరాల్ని తీర్చుకోవడానికి కూడా మన సహాయం అవసరమవ్వచ్చు. మన రాజు యేసుక్రీస్తు తీర్పుతీర్చడానికి వచ్చినప్పుడు మనం ఇతరుల మీద కనికరం చూపించడం గమనించి, “రాజ్యానికి వారసులు అవ్వండి” అని మనల్ని ఆహ్వానిస్తాడు.—మత్త. 25:34-40.

ప్రేమను పెంచుకోండి

13. రోమీయులు 15:7 ప్రకారం, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఒకరిమీద ఒకరు ప్రేమను ఎలా పెంచుకున్నారు?

13 మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రేమకు చిరునామాగా నిలిచారు. కానీ వాళ్లకు ప్రేమ చూపించడం కష్టమైంది. ఎందుకంటే రోములో ఉన్న సంఘం గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్లల్లో మోషే ధర్మశాస్త్రాన్నే పాటించాలని నేర్చుకున్న యూదులు ఉన్నారు. అలాగే వేర్వేరు దేశాల నుండి, నేపథ్యాల నుండి వచ్చిన యూదులుకానివాళ్లు ఉన్నారు. ఇంకొంతమంది క్రైస్తవుల్లో బహుశా దాసులు, దాసత్వం నుండి విడిపించబడిన వాళ్లు, దాసుల యజమానులు కూడా ఉండివుంటారు. వాళ్ల మధ్య అలాంటి తేడాలున్నా ప్రేమను ఎలా పెంచుకున్నారు? అపొస్తలుడైన పౌలు “ఒకరినొకరు ఆహ్వానించండి” అని వాళ్లకు చెప్పాడు. (రోమీయులు 15:7, అధస్సూచి చదవండి.) ఆయన మాటలకు అర్థమేంటి? “ఆహ్వానించండి” అని అనువదించిన పదం, ఎవరినైనా తమ ఇంటికి లేదా స్నేహితుల చిట్టాలోకి దయగా చేర్చుకోవడం అని అర్థం. ఉదాహరణకు, ఫిలేమోను నుండి ఒనేసిము అనే దాసుడు పారిపోయాడు. అతన్ని ఎలా ఆహ్వానించాలో పౌలు ఫిలేమోనుకు ఇలా చెప్పాడు: “అతన్ని . . . దయతో చేర్చుకో.” (ఫిలే. 17) అలాగే క్రైస్తవత్వం గురించి అంతగా తెలియని అపొల్లోను, అకుల-ప్రిస్కిల్ల ‘తమతో పాటు తీసుకెళ్లారు.’ అలా వాళ్లు ఆయన్ని ఆహ్వానించారు. (అపొ. 18:26) ఆ క్రైస్తవులు వాళ్లమధ్య ఉన్న తేడాల వల్ల విడిపోలేదు గానీ, వాటన్నిటినీ పక్కనపెట్టి ఒకరినొకరు ఆహ్వానించుకున్నారు లేదా చేర్చుకున్నారు.

ప్రేమ

మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ అందరి ప్రేమలు మనకు అవసరం (15వ పేరా చూడండి)

14. ఆనా, ఆమె భర్త ప్రేమను ఎలా చూపించారు?

14 బ్రదర్స్‌, సిస్టర్స్‌ని మన స్నేహితుల చిట్టాలోకి చేర్చి, వాళ్లతో సమయం గడపడం వల్ల మనం కూడా వాళ్ల మీద ప్రేమ చూపించవచ్చు. అలా చేస్తే వాళ్లు కూడా మన మీద ప్రేమ చూపిస్తారు. (2 కొరిం. 6:11-13) ఆనా, ఆమె భర్త ఉదాహరణను గమనించండి. వాళ్లు మిషనరీలుగా పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లిన కొంత సమయానికే కోవిడ్‌ మొదలైంది. వాళ్లు ఆ ప్రాంతానికి కొత్తగా వెళ్లారు కాబట్టి, ఆ సంఘంలో ఉన్న ఎవ్వర్నీ వాళ్లు నేరుగా కలుసుకోలేకపోయారు. మరి ఆ జంట ప్రేమను ఎలా చూపించారు? వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా బ్రదర్స్‌, సిస్టర్స్‌తో మాట్లాడి వాళ్ల గురించి ఎంతగా తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పారు. అలా వాళ్లు చూపించిన ప్రేమ బ్రదర్స్‌, సిస్టర్స్‌ మనసుల్ని తాకాయి. దాంతో వాళ్లు కూడా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు చేస్తున్నారు. మరి ఈ జంట అక్కడున్న బ్రదర్స్‌, సిస్టర్స్‌కి దగ్గరవ్వడానికి ఎందుకు అంతలా ప్రయత్నించారు? ఆనా ఇలా చెప్తుంది: “కష్టసుఖాల్లో నా మీద, నా కుటుంబం మీద బ్రదర్స్‌, సిస్టర్స్‌ చూపించిన ప్రేమ నా మనసులో చెరగని ముద్ర వేసింది. దాంతో నాకు కూడా ఇతరుల మీద ప్రేమ చూపించాలనే తపన పెరిగింది.”

15. మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ అందర్నీ ప్రేమించడం గురించి వెనిస్సా ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

15 వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చి, వేర్వేరు వ్యక్తిత్వాలతో ఉన్న బ్రదర్స్‌, సిస్టర్స్‌ మన సంఘాల్లో కూడా ఉన్నారు. వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీద దృష్టి పెట్టినప్పుడు మనం ప్రేమను పెంచుకోవచ్చు. న్యూజిలాండ్‌లో ఉంటున్న వెనిస్సా అనే సిస్టర్‌కి, తన సంఘంలో ఉన్న కొంతమందితో సర్దుకుపోవడం కష్టమైంది. కానీ తనకు చిరాకు తెప్పించినవాళ్లను దూరం పెట్టే బదులు, ఆమె వాళ్లతో ఇంకా ఎక్కువ సమయం గడపాలనుకుంది. అలా చేయడంవల్ల యెహోవా వాళ్లలో ఏం చూస్తున్నాడో ఆమె తెలుసుకుంది. ఆమె ఇలా అంటుంది: “నా భర్త ప్రాంతీయ పర్యవేక్షకుడు అయినప్పుడు, వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న చాలామంది బ్రదర్స్‌, సిస్టర్స్‌తో సమయం గడిపాను. వాళ్లందరితో మంచిగా ఉండడం నాకు ఈజీ అయ్యింది. అలా వేర్వేరు బ్రదర్స్‌, సిస్టర్స్‌తో కలవడం నాకు బాగా నచ్చింది. యెహోవాకు కూడా అది నచ్చి ఉంటుంది. అందుకే రకరకాల ప్రజలున్న గుంపులోకి ఆయన మనల్ని తీసుకొచ్చాడు.” యెహోవా చూసినట్టే మనం ఇతరుల్ని చూడడం నేర్చుకున్నప్పుడు మనం ప్రేమను చూపిస్తాం.—2 కొరిం. 8:24.

మహాశ్రమ సమయంలో మనం మన బ్రదర్స్‌, సిస్టర్స్‌తో కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే మనల్ని కాపాడతానని యెహోవా మాటిస్తున్నాడు (16వ పేరా చూడండి)

16. మహాశ్రమ సమయంలో బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ప్రేమ చూపించడం ఎందుకు ముఖ్యం? (చిత్రం కూడా చూడండి.)

16 మహాశ్రమ సమయంలో మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ప్రేమ చూపించడం ముఖ్యం. ఆ సమయంలో మనం ఎక్కడ ఉంటే కాపాడబడతాం? ప్రాచీన బబులోను మీద దాడి జరిగినప్పుడు, తన ప్రజలకు యెహోవా ఇచ్చిన ఈ నిర్దేశాన్ని గమనించండి: “నా ప్రజలారా, వెళ్లండి, లోపలి గదుల్లోకి ప్రవేశించి తలుపులు వేసుకోండి. దేవుని కోపం దాటివెళ్లే వరకు కాసేపు దాక్కోండి.” (యెష. 26:20) మహాశ్రమ సమయంలో మనం కూడా ఆ నిర్దేశాల్ని పాటించాల్సి రావచ్చు. “లోపలి గదులు” అంటే అవి సంఘాల్ని సూచిస్తుండవచ్చు. మహాశ్రమ సమయంలో మనం మన బ్రదర్స్‌, సిస్టర్స్‌తో కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే మనల్ని కాపాడతానని యెహోవా మాటిస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ని భరించడమే కాదు, వాళ్లను ప్రేమించడానికి కూడా కష్టపడాలి. అలా చేస్తేనే మనం మన ప్రాణాల్ని రక్షించుకుంటాం.

ఇప్పుడే సిద్ధపడండి

17. ఇప్పుడు మనం సిద్ధపడితే మహాశ్రమ సమయంలో ఏం చేస్తాం?

17 “యెహోవా మహారోజు” వచ్చినప్పుడు మనుషులందరికీ అది కష్టమైన సమయంగా ఉంటుంది. (జెఫ. 1:14, 15) యెహోవా ప్రజలకు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం సిద్ధంగా ఉంటే, ఆ సమయంలో మనం ప్రశాంతంగా ఉంటాం, ఇతరులకు సహాయం చేస్తాం. మన ముందు ఎన్ని కష్టాలు వచ్చినా సహిస్తాం. మన బ్రదర్స్‌, సిస్టర్స్‌కి కష్టాలు వచ్చినప్పుడు వాళ్లకు నీడగా ఉంటూ, వాళ్లకు చేయూతను ఇస్తూ కనికరం చూపిస్తాం. అలాగే మన బ్రదర్స్‌, సిస్టర్స్‌కి ఇప్పుడు వెన్నంటే ఉంటూ వాళ్లమీద ప్రేమ చూపిస్తే, భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉంటాం. అప్పుడు యెహోవా మనకు ప్రతిఫలం ఇస్తాడు. అదే విపత్తులు, శ్రమలు గుర్తేరాని కొత్తలోకంలో శాశ్వత జీవితం!—యెష. 65:17.

పాట 144 మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!

a మనం మహాశ్రమకు చాలా దగ్గర్లో ఉన్నాం. అది మనుషులు ఇప్పటివరకు చూడని ఎంతో కష్టమైన కాలం. దానికి సిద్ధంగా ఉండడానికి మనకు సహనం, కనికరం, ప్రేమ అనే లక్షణాలు అవసరం. మరి ఈ లక్షణాల్ని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా చూపించారు? నేడు మనం ఎలా చూపించవచ్చు? ఈ లక్షణాలు మనల్ని మహాశ్రమకు ఎలా సిద్ధం చేస్తాయి?

b విపత్తు సహాయక పనుల్లో సహాయం చేయాలనుకునేవాళ్లు ముందుగా, లోకల్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌ వాలంటీర్‌ అప్లికేషన్‌ (DC-50) లేదా అప్లికేషన్‌ ఫర్‌ వాలంటీర్‌ ప్రోగ్రామ్‌ (A-19) నింపి, ఆ పని కోసం పిలుపు వచ్చేవరకు వేచి ఉండాలి.