కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 30

మీ ప్రేమను అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉండండి

మీ ప్రేమను అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉండండి

“ప్రేమతో . . . అన్ని విషయాల్లో పరిణతి సాధించేవరకు ఎదుగుతూ ఉందాం.”ఎఫె. 4:15.

పాట 2 యెహోవా నీ పేరు

ఈ ఆర్టికల్‌లో . . . a

1. బైబిలు స్టడీ మొదలుపెట్టినప్పుడు మీరు ఏమేం నేర్చుకున్నారు?

 మీరు బైబిలు స్టడీ మొదలుపెట్టినప్పుడు మీరేం నేర్చుకున్నారో, అప్పుడు మీకెలా అనిపించిందో గుర్తుతెచ్చుకోండి. దేవునికి ఒక పేరుందని తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోయుంటారు. నరకంలో దేవుడు ప్రజల్ని చిత్రహింసలు పెట్టడని తెలుసుకున్నప్పుడు బహుశా మీరు ఊపిరి పీల్చుకుని ఉంటారు. మరణంవల్ల విడిపోయిన మీ ఇష్టమైనవాళ్లను తిరిగి చూస్తారని, వాళ్లతో మీరు ఇదే భూమ్మీద పరదైసులో జీవిస్తారని తెలుసుకున్నప్పుడు మీ కళ్లు చెమ్మగిల్లుంటాయి.

2. బైబిలు సత్యాల్ని మీరు నేర్చుకోవడంతోపాటు ఇంకా ఎలా ప్రగతి సాధించారు? (ఎఫెసీయులు 5:1, 2)

2 మీరు బైబిలు సత్యాల్ని ఎక్కువగా తెలుసుకునేకొద్దీ యెహోవా మీద మీకున్న ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. ఆ ప్రేమవల్లే మీరు నేర్చుకున్నవాటిని పాటించారు. బైబిలు ప్రకారం మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం మీ ఆలోచనల్లో, పనుల్లో మార్పులు-చేర్పులు చేసుకున్నారు. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల్లా ఉండాలి అనుకున్నట్టే, మీరు కూడా మీ పరలోక తండ్రిలా ఉంటున్నారు.—ఎఫెసీయులు 5:1, 2 చదవండి.

3. మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు?

3 మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘యెహోవా మీద నాకున్న ప్రేమ నేను బాప్తిస్మం తీసుకున్నప్పటి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువైందా? నా బాప్తిస్మం తర్వాత నా ఆలోచనల్లో, పనుల్లో ముఖ్యంగా బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ప్రేమ చూపించే విషయంలో యెహోవాను ఎక్కువగా అనుకరిస్తున్నానా?’ ఇలా ఆలోచించుకున్న తర్వాత ‘మొదట్లో మీకున్న ప్రేమ’ కాస్త చల్లారింది అనిపిస్తే డీలా పడకండి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు యేసు వాళ్ల మీద ఆశ వదులుకోలేదు. మన మీద కూడా ఆశ వదులుకోడు. (ప్రక. 2:4, 7) మొదటిసారి సత్యం తెలుసుకున్నప్పుడు మనకున్న ప్రేమను మళ్లీ పెంచుకోగలమని ఆయన నమ్ముతున్నాడు.

4. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

4 యెహోవా మీద, అలాగే ఇతరుల మీద మనం ప్రేమను ఎలా పెంచుకుంటూ ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలా పెంచుకోవడం వల్ల మనకు అలాగే ఇతరులకు వచ్చే కొన్ని దీవెనలు ఏంటో కూడా చూస్తాం.

యెహోవా మీద ప్రేమను పెంచుకుంటూ ఉండండి

5-6. యెహోవా సేవలో అపొస్తలుడైన పౌలుకు ఎలాంటి ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి? యెహోవా సేవను కొనసాగించడానికి పౌలుకు ఏది సహాయం చేసింది?

5 అపొస్తలుడైన పౌలు యెహోవా సేవను ఎంతో ఆనందించాడు. కానీ అన్నిసార్లు అది పూలబాటలా లేదు. ఆయనకు చాలా ఎత్తుపల్లాలు కూడా ఎదురయ్యాయి. పౌలు తరచూ దూర ప్రయాణాలు చేసేవాడు. అప్పట్లో ఆ ప్రయాణాలు ముప్పుతో కూడినవి. అలా ప్రయాణిస్తున్నప్పుడు పౌలు కొన్నిసార్లు “నదుల్లో, దొంగల చేతుల్లో, . . . ప్రమాదాలు ఎదుర్కొన్నాడు.” ఇంకొన్నిసార్లయితే శత్రువులు ఆయన్ని కొట్టారు. (2 కొరిం. 11:23-27) అంతేకాదు, కొన్నిసార్లు ఏ క్రైస్తవులకు సహాయం చేయడానికి పౌలు అంత కష్టపడ్డాడో వాళ్లే ఆయనకు కృతజ్ఞత చూపించలేదు, అవసరంలో తోడుగా నిలబడలేదు.—2 కొరిం. 10:10; ఫిలి. 4:15.

6 మరి పౌలు యెహోవా సేవను కొనసాగించడానికి ఏది సహాయం చేసింది? ఆయన లేఖనాల నుండి అలాగే తన సొంత అనుభవం నుండి యెహోవా గురించి ఎంతో నేర్చుకున్నాడు. దాంతో యెహోవా దేవుడు తనను ప్రేమిస్తున్నాడనే నమ్మకం పౌలుకు కుదిరింది. (రోమా. 8:38, 39; ఎఫె. 2:4, 5) అలా పౌలు కూడా యెహోవాను ఎంతో ప్రేమించాడు. ఆయన ‘పవిత్రులకు సేవచేశాడు, ఇంకా సేవ చేస్తూనే’ ఉండడం ద్వారా యెహోవా మీద తనకున్న ప్రేమను చూపించాడు.—హెబ్రీ. 6:10.

7. యెహోవా మీద ప్రేమ పెంచుకుంటూ ఉండడానికి ఒక విధానం ఏంటి?

7 మనం యెహోవా మీద ప్రేమ పెంచుకుంటూ ఉండడానికి బైబిల్ని జాగ్రత్తగా చదవాలి. తర్వాత, చదివిన ఆ భాగం యెహోవా గురించి ఏం చెప్తుందో ధ్యానించాలి. మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నేను చదివిన ఈ వచనాలు యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడని ఎలా చూపిస్తున్నాయి? నేను యెహోవాను ప్రేమించడానికి ఏ కారణాలు ఉన్నాయి?’

8. యెహోవా మీద ప్రేమ పెంచుకుంటూ ఉండడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

8 యెహోవా మీద మనకున్న ప్రేమను పెంచుకుంటూ ఉండడానికి ఇంకో విధానం ఏంటంటే, ప్రతీరోజు మనసువిప్పి ఆయనకు ప్రార్థించడం. (కీర్త. 25:4, 5) అలాంటి ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడు. (1 యోహా. 3:21, 22) ఆసియాలో ఉంటున్న కెన్‌ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “మొదట్లో నేను నేర్చుకున్నవాటిని బట్టి యెహోవాను ప్రేమించాను. కానీ ఆయన నా ప్రార్థనలకు జవాబిచ్చినప్పుడు ఆ ప్రేమ అంచెలంచెలుగా పెరిగింది. దాంతో ఆయనకు ఇష్టమైనవి చేయాలనే కోరిక నాలో కలిగింది.” b

ఇతరుల మీద ప్రేమను పెంచుకుంటూ ఉండండి

9. తిమోతి ప్రేమ చూపించే విషయంలో ఎంతగా ప్రగతి సాధించాడు?

9 పౌలు క్రైస్తవుడిగా మారిన కొన్నేళ్లకి యువకుడైన తిమోతిని కలిశాడు. తిమోతికి యెహోవా మీద అలాగే ఇతరుల మీద ప్రేమ ఉంది. పౌలు ఫిలిప్పీ సంఘానికి ఇలా రాశాడు: “[తిమోతి]లాంటి మనస్తత్వం కలిగి మీ విషయంలో నిజమైన శ్రద్ధ చూపించేవాళ్లు ఇంకెవ్వరూ నా దగ్గర లేరు.” (ఫిలి. 2:20) ఇక్కడ తిమోతి సామర్థ్యాల గురించి, అంటే అతను క్రమపద్ధతిలో పనులు చేస్తాడని లేదా మంచి ప్రసంగాలు ఇస్తాడని పౌలు చెప్పట్లేదు గానీ తిమోతికి బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీదున్న ప్రేమ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అది పౌలు మనసును ఎంతో తాకింది. కాబట్టి తిమోతి ఏ సంఘాల్లో సేవ చేశాడో అక్కడున్నవాళ్లు ఆయన మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూసుంటారు.—1 కొరిం. 4:17.

10. బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీదున్న ప్రేమను ఆనా, ఆమె భర్త చేతల్లో ఎలా చూపించారు?

10 బ్రదర్స్‌, సిస్టర్స్‌కి సహాయం చేయడానికి మనం కూడా అవకాశాల కోసం వెదకవచ్చు. (హెబ్రీ. 13:16) ముందటి ఆర్టికల్‌లో చూసిన ఆనా అనుభవాన్ని గమనించండి. బీభత్సమైన తుఫాను తర్వాత ఒక సాక్షుల కుటుంబం ఇల్లు పైకప్పు పాడైపోయింది. దానివల్ల వాళ్ల బట్టలు కూడా మురికిపట్టేశాయి. ఆనా అలాగే ఆమె భర్త ఈ కుటుంబాన్ని కలిసారు. ఆనా ఇలా చెప్తుంది: “మేము వాళ్ల బట్టలు తీసుకుని వాటిని ఉతికి, ఇస్త్రీ చేసి, మడతపెట్టి వాళ్లకు తిరిగిచ్చాం. మేము ప్రేమతో చేసిన ఆ చిన్న పనివల్ల ఇప్పటికీ మా స్నేహబంధం విడవని ముడిలా ఉంది.” బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ఆనా, ఆమె భర్తకు ఉన్న ప్రేమ పెదాలు పలికే పదాలు వరకే ఉండిపోలేదు గానీ చేతలు వరకు వెళ్లింది.—1 యోహా. 3:17, 18.

11. (ఎ) మనం ప్రేమతో సహాయం చేసినప్పుడు ఇతరులకు ఎలా అనిపిస్తుంది? (బి) సామెతలు 19:17 ప్రకారం, మనం ఇతరుల మీద ప్రేమ చూపించినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

11 ఇతరులకు మనం ప్రేమతో, దయతో సహాయం చేస్తే మన ఆలోచనల్లో, పనుల్లో యెహోవాను అనుకరించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నామో వాళ్లు గమనిస్తారు. అలాగే వాళ్లకు మన మీద మనం ఊహించే దానికన్నా ఎక్కువ కృతజ్ఞత ఉండి ఉండవచ్చు. ముందటి పేరాల్లో మనం చూసిన కెన్‌ అనే సిస్టర్‌ తనకు సహాయం చేసినవాళ్లను గుర్తుచేసుకుంటూ ఇలా అంటుంది: “ప్రీచింగ్‌కి వెళ్లడానికి నాకు చాలామంది సిస్టర్స్‌ సహాయం చేశారు. వాళ్లే నన్ను ఇంటికొచ్చి తీసుకెళ్లేవాళ్లు, భోజనానికి ఆహ్వానించేవాళ్లు, మళ్లీ నన్ను ఇంటిదగ్గర జాగ్రత్తగా దించేవాళ్లు. ఇప్పుడు వాటిగురించి ఆలోచిస్తే, నాకు సహాయం చేయడానికి వాళ్లెంత కష్టపడ్డారో నాకు అర్థమౌతుంది. నా మీద ప్రేమతో వాళ్లు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేశారు.” అయితే, మనం సహాయం చేసిన ప్రతీ ఒక్కరు కృతజ్ఞత చూపించకపోవచ్చు. తనకు సహాయం చేసినవాళ్ల గురించి కెన్‌ మళ్లీ ఇలా చెప్తుంది: “నా మీద దయ చూపించిన వాళ్లందరికీ ఏదోకటి తిరిగి చేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉంటున్నారో నాకు తెలీదు, యెహోవాకైతే తెలుసు. అందుకే నా మీద దయ చూపించిన వాళ్లందరికీ తిరిగి ఏదోకటి చేయమని ప్రార్థిస్తున్నాను.” కెన్‌ మాటలు ఎంత నిజమో కదా! మనం ఇతరుల కోసం దయతో చేసిన పని రవ్వంతే అయినా యెహోవా దాన్ని గమనిస్తాడు, విలువైనదిగా చూస్తాడు. అలాగే తనకు అప్పు ఇచ్చినట్టు భావించి, తిరిగి ఇచ్చేస్తాడు.—సామెతలు 19:17 చదవండి.

ఒక వ్యక్తి యెహోవా సేవలో ప్రగతి సాధించినప్పుడు ఇతరులకు సహాయం చేసే అవకాశాల కోసం వెదుకుతాడు (12వ పేరా చూడండి)

12. సంఘంలో ఉన్నవాళ్ల మీద బ్రదర్స్‌ ప్రేమను ఎలా పెంచుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

12 మీరు ఒక బ్రదరైతే, ఇతరుల మీద ప్రేమ చూపించడానికి, వాళ్లకు సహాయం చేయడానికి మీరు ఏం చేయవచ్చు? జోర్డన్‌ అనే బ్రదర్‌ సంఘానికి ఇంకా ఎలా సహాయం చేయవచ్చో ఒక సంఘపెద్దను అడిగాడు. అతను ఇప్పటికే సాధించిన ప్రగతిని బట్టి ఆ సంఘపెద్ద మెచ్చుకుని, ఆ తర్వాత ఇంకా ఏమేం చేయవచ్చో సలహా ఇచ్చాడు. ఉదాహరణకు, రాజ్యమందిరానికి కాస్త ముందుగా వచ్చి ఇతరుల్ని పలకరించమని, మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్పమని, క్షేత్రసేవ గుంపుతో క్రమంగా ప్రీచింగ్‌ చేయమని అలాగే ఇతరులకు సహాయం చేయడానికి వేరే అవకాశాల కోసం చూడమని ఆ సంఘపెద్ద చెప్పాడు. జోర్డన్‌ ఆ సలహాను పాటించడం వల్ల అతను కొత్తకొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవడంతో పాటు బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ప్రేమను కూడా పెంచుకోగలిగాడు. నిజానికి, ఒక బ్రదర్‌ ఇతరులకు సహాయం చేయడం సంఘ పరిచారకుడు అయిన తర్వాత మొదలుపెట్టడు గానీ తాను అప్పటికే చేస్తున్న సహాయాన్ని కొనసాగిస్తాడు అని జోర్డన్‌ నేర్చుకున్నాడు.—1 తిమో. 3:8-10, 13.

13. మళ్లీ సంఘపెద్ద అవ్వడానికి క్రిస్టియన్‌ అనే బ్రదర్‌కి ప్రేమ ఎలా సహాయం చేసింది?

13 ఇంతకుముందు మీరు ఒక సంఘపెద్దగా లేదా సంఘ పరిచారకుడిగా సేవ చేసుంటే, అప్పుడేంటి? గతంలో మీరు చేసిన పనిని అలాగే మీరు చూపించిన ప్రేమను యెహోవా ఎప్పుడూ గుర్తుంచుకుంటాడు. (1 కొరిం. 15:58) ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమను కూడా ఆయన చూస్తున్నాడు. క్రిస్టియన్‌ అనే బ్రదర్‌ సంఘపెద్దగా తనకున్న నియామకాన్ని కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను సంఘపెద్దగా ఉన్నా, లేకపోయినా యెహోవా మీద నాకున్న ప్రేమవల్ల ఆయన కోసం నేను చేయగలిగినదంతా చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను.” కొద్దికాలం తర్వాత ఆయన మళ్లీ సంఘపెద్ద అయ్యాడు. ఆయన ఇలా అంటున్నాడు: “మళ్లీ సంఘపెద్ద అయినప్పుడు నేను కంగారుపడ్డాను. కానీ నామీద దయతో, నేను మళ్లీ సంఘపెద్దగా సేవచేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. అలాగే నాకు ఆయన మీద ఇంకా బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ప్రేమ ఉంది. కాబట్టి నేను ఇది చేయాలి అని అనుకున్నాను.”

14. ఎలీనా సిస్టర్‌ మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు?

14 యెహోవా సేవకులు ప్రజల మీద కూడా ప్రేమ చూపిస్తారు. (మత్త. 22:37-39) ఉదాహరణకు, జార్జియాలో ఉంటున్న ఎలీనా అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “మొదట్లో యెహోవా మీద నాకున్న ప్రేమవల్ల మాత్రమే నేను ప్రీచింగ్‌ చేశాను. కానీ పరలోక తండ్రి మీద నాకున్న ప్రేమ అంచెలంచెలుగా పెరిగేకొద్దీ, ప్రజల మీద కూడా ప్రేమ ఎక్కువౌతూ వచ్చింది. వాళ్లు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో, దేనిగురించి చెప్తే వాళ్ల మనసును చేరుకుంటానో ఆలోచించాను. అలా ఎంతెక్కువగా ఆలోచిస్తే, వాళ్లకు సహాయం చేయాలనే కోరిక అంతెక్కువగా పెరిగింది.”—రోమా. 10:13-15.

ఇతరుల మీద ప్రేమ చూపిస్తే యెహోవా ఇచ్చే దీవెనలు

మనం ప్రేమతో చేసే రవ్వంత పని, చాలామందికి కొండంత దీవెనలు తెస్తాయి (15-16 పేరాలు చూడండి)

15-16. చిత్రాల్లో చూపించినట్టు ఇతరుల మీద ప్రేమ చూపిస్తే ఎలాంటి దీవెనలు వస్తాయి?

15 బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ప్రేమ చూపిస్తే వాళ్లు మాత్రమే ప్రయోజనం పొందరు. కోవిడ్‌ మొదలైన తర్వాత పౌలో అనే బ్రదర్‌, ఆయన భార్య చాలామంది పెద్ద వయసు సిస్టర్స్‌కి సహాయం చేశారు. ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా సాక్ష్యం ఎలా ఇవ్వాలో వాళ్లకు నేర్పించారు. ఒక సిస్టర్‌కి మొదట్లో అలా నేర్చుకోవడం తలకుమించిన భారంగా అనిపించింది. కానీ చివరికి ఆమె నేర్చుకుంది. దానివల్ల జ్ఞాపకార్థ ఆచరణకు తన బంధువుల్ని పిలవగలిగింది. అలా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 60 మంది ఆ మీటింగ్‌కి హాజరయ్యారు. పౌలో అలాగే ఆయన భార్య పడిన కష్టం వల్ల ఆ సిస్టర్‌ మాత్రమేకాదు, ఆమె బంధువులందరూ ప్రయోజనం పొందారు. తర్వాత ఆ సిస్టర్‌ పౌలోకి ఇలా రాసింది: “నాలాంటి పెద్ద వయసు వాళ్లకు నేర్పించినందుకు మీకు చాలా థ్యాంక్స్‌. యెహోవా మమ్మల్ని పక్కనపెట్టకుండా మా మీద చూపించిన శ్రద్ధను అలాగే మాకు ఓపిగ్గా నేర్పించడానికి మీరు పడిన కష్టాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను.”

16 ఇలాంటి అనుభవాలు పౌలోకి ఒక ముఖ్యమైన పాఠం నేర్పించింది. జ్ఞానం లేదా సామర్థ్యాల కన్నా ప్రేమ ఎన్నోరెట్లు ప్రాముఖ్యమని ఆయన నేర్చుకున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “ఒకప్పుడు నేను ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవ చేశాను. అప్పట్లో నేను ఇచ్చిన టాక్స్‌ బ్రదర్స్‌, సిస్టర్స్‌ మర్చిపోయి ఉండొచ్చు గానీ నేను వాళ్లకు ప్రేమతో చేసిన పనుల్ని వాళ్లింకా గుర్తుంచుకున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది.”

17. మనం ప్రేమ చూపిస్తే ఇంకెవరు ప్రయోజనం పొందుతారు?

17 మనం ఇతరుల్ని ప్రేమిస్తే ఊహించని ప్రయోజనాల్ని మనం కూడా పొందుతాం. న్యూజిలాండ్‌లో ఉంటున్న జోనాతన్‌ అనే బ్రదర్‌ విషయంలో ఇది నిజమైంది. ఒకరోజు శనివారం మధ్యాహ్నం మండుటెండలో ఒక పయినీరు బ్రదర్‌ ప్రీచింగ్‌ ఒంటరిగా చేయడాన్ని జోనాతన్‌ చూశాడు. దాంతో ప్రతీ శనివారం ఆ బ్రదర్‌తో కలిసి ప్రీచింగ్‌ చేయాలని అనుకున్నాడు. దయతో చేస్తున్న ఈ పని తనకు ఎంత మేలు చేస్తుందో ఆ సమయంలో జోనాతన్‌కు తెలీదు. జోనాతన్‌ ఇలా అంటున్నాడు: “అప్పటివరకు నేను ప్రీచింగ్‌ని అంతగా ఎంజాయ్‌ చేసేవాణ్ణి కాదు. కానీ ఆ పయినీరు బ్రదర్‌ బోధించే విధానం, పరిచర్యలో ఆయనకు వచ్చిన ఫలితాలు చూసినప్పుడు ఈ పని మీద నాకున్న ఇష్టం పెరిగింది. ప్రీచింగ్‌ బాగా ఎంజాయ్‌ చేయడం మొదలుపెట్టాను. అంతేకాదు ఆ బ్రదర్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయ్యాడు. నేను పరిచర్యను బాగా చేసేలా, యెహోవాకు నేను దగ్గరయ్యేలా ఆ బ్రదర్‌ నా భుజం తట్టాడు.”

18. యెహోవా మనందరి నుండి ఏం కోరుకుంటున్నాడు?

18 మనందరం ఆయన మీద, ఇతరుల మీద ప్రేమను పెంచుకుంటూ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం నేర్చుకున్నట్టుగా యెహోవా మీద మనకున్న ప్రేమను పెంచుకుంటూ ఉండాలంటే బైబిలు చదవాలి, ధ్యానించాలి, ప్రతీరోజు ప్రార్థనలో ఆయనతో మాట్లాడాలి. బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద మనకున్న ప్రేమను పెంచుకుంటూ ఉండాలంటే వాళ్లకు మనం చేసే సహాయం మాటల వరకే కాదు చేతల వరకు వెళ్లాలి. అలా మన ప్రేమ అంచెలంచెలుగా పెరిగేకొద్దీ యెహోవాకు, బ్రదర్స్‌ సిస్టర్స్‌కి ఇంకా దగ్గరౌతాం. అలాగే మన స్నేహాలు నిత్యం చిగురిస్తుంటాయి.

పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి

a మనం కొత్తగా సత్యంలోకి వచ్చినా లేదా ఎన్నో ఏళ్లుగా యెహోవా సేవచేస్తున్నా, మనందరం కూడా ప్రగతి సాధిస్తూనే ఉండాలి. ఈ ఆర్టికల్‌లో మనం యెహోవా మీద అలాగే ఇతరుల మీద అంచెలంచెలుగా ప్రేమను పెంచుకుంటూ ఉంటే ఎలా ప్రగతి సాధిస్తామో చర్చిస్తాం. అలా చర్చిస్తుండగా ఇప్పటివరకు మనం ఎంత ప్రగతి సాధించామో, ముందుముందు ఇంకా ఎంత ప్రగతి సాధించగలమో ఆలోచించండి.

b కొన్ని అసలు పేర్లు కావు.