కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 32

యెహోవాలా సహేతుకత చూపించండి

యెహోవాలా సహేతుకత చూపించండి

“మీరు పట్టుబట్టే ప్రజలు కాదని [లేదా, సహేతుకత గలవాళ్లని] అందరికీ తెలియనివ్వండి.”ఫిలి. 4:5.

పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి

ఈ ఆర్టికల్‌లో . . . a

మీరు ఏ చెట్టులా ఉండాలనుకుంటున్నారు? (1వ పేరా చూడండి)

1. క్రైస్తవులు ఏ విధంగా ఒక చెట్టులా ఉండాలి? (చిత్రం కూడా చూడండి.)

 ఒక చెట్టు గాలికి విరగకూడదంటే, గాలి ఎటు వస్తే అటు వంగాలి. అప్పుడే అది పడిపోకుండా బలంగా ఉంటుంది. క్రైస్తవులముగా మనం కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలంటే, పరిస్థితులకు తగ్గట్టు మనం మారాలి. అలా మారడానికి మనకు సహేతుకత అవసరం. అప్పుడే మన జీవితంలో పరిస్థితులు మారినప్పుడు వాటికి సర్దుకుపోతాం, ఇతరుల అభిప్రాయాల్ని, నిర్ణయాల్ని గౌరవిస్తాం.

2. మారిన పరిస్థితులకు సర్దుకుపోవాలంటే ఏ లక్షణాలు కావాలి? ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 యెహోవా సేవకులుగా మనం సహేతుకంగా, వినయంగా, ఇతరుల్ని అర్థంచేసుకునే వాళ్లంగా ఉండాలనుకుంటాం. ఈ లక్షణాలు, మారిన పరిస్థితులకు సర్దుకుపోవడానికి కొంతమంది క్రైస్తవులకు ఎలా సహాయం చేశాయో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అలాగే ఈ లక్షణాలు మనకు కూడా ఎలా సహాయం చేస్తాయో తెలుసుకుంటాం. ముందుగా, సహేతుకత చూపించే విషయంలో అత్యుత్తమ ఆదర్శాన్ని ఉంచిన యెహోవా, యేసు నుండి నేర్చుకుందాం.

యెహోవా, యేసు సహేతుకత చూపించారు

3. యెహోవా సహేతుకంగా ఉంటాడని ఎలా చెప్పవచ్చు?

3 యెహోవా స్థిరంగా, కదల్చబడని వానిగా ఉన్నాడు కాబట్టి బైబిలు ఆయన్ని “బండరాయి” అని పిలుస్తుంది. (ద్వితీ. 32:4, అధస్సూచి) ఆయన సహేతుకత కూడా చూపిస్తాడు. ఈ లోక పరిస్థితులు మారుతున్నప్పుడు, వాటికి తగ్గట్టు ఆయన మారుతూ తన సంకల్పం ఖచ్చితంగా నెరవేరేలా చూసుకుంటాడు. యెహోవా మనుషుల్ని తన స్వరూపంలో సృష్టించాడు, అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోయే సామర్థ్యం మనందరిలో ఉంది. అంతేకాదు, మన జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన బైబిలు సూత్రాల్ని ఆయన ఇచ్చాడు. యెహోవా ఒక “బండరాయి” అయినప్పటికీ, ఆయన సహేతుకత కూడా చూపించాడని తన సొంత ఆదర్శం ద్వారా, ఆయన ఇచ్చిన సూత్రాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమౌతుంది.

4. యెహోవా మొండివాడు కాదని అనడానికి ఒక ఉదాహరణ చెప్పండి. (లేవీయకాండం 5:7, 11)

4 యెహోవా పనులన్నీ పరిపూర్ణమైనవి, సహేతుకమైనవి. ఆయన మనుషులతో వ్యవహరిస్తున్నప్పుడు మొండిగా లేడు. ఉదాహరణకు, ఆయన ఇశ్రాయేలీయులతో వ్యవహరిస్తున్నప్పుడు సహేతుకతను ఎలా చూపించాడో ఆలోచించండి. డబ్బున్న వాళ్లయినా, పేదవాళ్లయినా అందరూ ఒకేలాంటి బలులు తీసుకురావాలని ఆయన పట్టుబట్టలేదు. కొన్ని సందర్భాల్లో, తమ పరిస్థితులకు తగ్గట్టు బలులు అర్పించడాన్ని ఆయన అనుమతించాడు.—లేవీయకాండం 5:7, 11 చదవండి.

5. యెహోవా వినయం, కనికరం చూపించిన ఒక ఉదాహరణ చెప్పండి.

5 యెహోవాకున్న వినయం, కనికరం వల్ల సహేతుకత చూపించాడు. ఉదాహరణకు, సొదొమలోని చెడ్డ ప్రజల్ని నాశనం చేయబోతున్నప్పుడు ఆయన వినయం కనిపించింది. లోతును పర్వత ప్రాంతానికి పారిపొమ్మని యెహోవా దేవదూతల ద్వారా చెప్పాడు. కానీ లోతు అక్కడికి వెళ్లడానికి భయపడి ఆయన, ఆయన కుటుంబం సోయరులో తలదాచుకుంటామని అడిగారు. నిజానికి, యెహోవా నాశనం చేయాలనుకున్న పట్టణాల్లో సోయరు కూడా ఉంది. మారు మాట్లాడకుండా నేను చెప్పింది చేయి అని యెహోవా పట్టుబట్టవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా లోతు అడిగిన దానికి ఒప్పుకుని, సోయరు పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేశాడు. (ఆది. 19:18-22) వందల సంవత్సరాల తర్వాత యెహోవా నీనెవె పట్టణంలో ఉన్న ప్రజలపట్ల కనికరాన్ని చూపించాడు. అక్కడున్న చెడ్డ ప్రజలందర్నీ నాశనం చేస్తానని యెహోవా యోనా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. కానీ నీనెవె పట్టణంలో ఉన్నవాళ్లు పశ్చాత్తాపం చూపించినప్పుడు, యెహోవా వాళ్ల మీద కనికరపడి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేశాడు.—యోనా 3:1, 10; 4:10, 11.

6. యెహోవాలా యేసు సహేతుకతను చూపించిన ఉదాహరణలు చెప్పండి.

6 యేసు యెహోవాలా సహేతుకత చూపించాడు. ఆయన “ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి” వాళ్లకు ప్రకటించడానికి ఈ భూమ్మీదికి వచ్చాడు. కానీ ఆ నియామకాన్ని చేస్తున్నప్పుడు యేసు సహేతుకత చూపించాడు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీయురాలు కాని ఒక స్త్రీ, తన పాపకు చెడ్డదూత పట్టడం వల్ల “విపరీతంగా బాధపడుతోంది” అని చెప్పి, తనను బాగుచేయమని యేసును బ్రతిమిలాడింది. యేసు ఆమెపట్ల కనికరం చూపించి, ఆ పాపను బాగుచేశాడు. (మత్త. 15:21-28) ఇంకో ఉదాహరణ గమనించండి. యేసు తన పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో, ‘ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, నేను కూడా అతన్ని తిరస్కరిస్తాను’ అన్నాడు. (మత్త. 10:33) కానీ పేతురు యేసు ఎవరో తెలీదని మూడుసార్లు ఆయన్ని తిరస్కరించాడు. మరి దానికి యేసు కూడా పేతురును తిరస్కరించాడా? లేదు. పేతురు చూపించిన పశ్చాత్తాపాన్ని, ఆయన విశ్వాసాన్ని యేసు చూశాడు. పునరుత్థానమైన తర్వాత యేసు పేతురుకు కనిపించి, తనను క్షమించానని, తనను ఇంకా ప్రేమిస్తున్నాడనే భరోసాను ఇచ్చాడు.—లూకా 24:33, 34.

7. ఫిలిప్పీయులు 4:5 ప్రకారం, మనకు ఎలాంటి పేరు ఉండాలనుకుంటాం?

7 యెహోవా దేవుడు, యేసుక్రీస్తు సహేతుకత చూపిస్తారని ఇప్పటివరకు చూశాం. మరి మన సంగతేంటి? మనం కూడా సహేతుకత చూపించాలని యెహోవా ఆశిస్తున్నాడు. (ఫిలిప్పీయులు 4:5 చదవండి.) ఈ లేఖనం ఒక అనువాదంలో ఇలా ఉంది: “మీరు సహేతుకత చూపిస్తారనే పేరును సంపాదించుకోండి.” మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను సహేతుకత చూపిస్తానని, ఇతరుల్ని అర్థం చేసుకుంటానని, వాళ్ల నిర్ణయాలకు ఒప్పుకుంటాననే పేరు ఉందా? లేదా మొండిగా, కఠినంగా ఉంటానని లేదా తలబిరుసుగా ఉంటాననే పేరు ఉందా? నేను చెప్పిందే జరగాలి అని పట్టుబట్టే వానిగా ఉన్నానా లేదా ఇతరులు చెప్పేది కూడా వింటూ అవసరమైతే వాళ్ల అభిప్రాయాలకు తలొగ్గే వానిగా ఉన్నానా?’ మనం ఎంతెక్కువగా సహేతుకత చూపిస్తే యెహోవాను, యేసును అంతెక్కువగా అనుకరించిన వాళ్లమౌతాం. మనం సహేతుకత చూపించాల్సిన రెండు రంగాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకటి, మన వ్యక్తిగత పరిస్థితులు మారినప్పుడు. రెండు, ఇతరుల అభిప్రాయాలు, నిర్ణయాలు మనలా లేనప్పుడు.

పరిస్థితులు మారినప్పుడు సహేతుకంగా ఉండండి

8. మారిన పరిస్థితులకు తగ్గట్టు మనం మారాలంటే ఏం చేయాలి? (అధస్సూచి కూడా చూడండి.)

8 సహేతుకత అంటే మారిన పరిస్థితులకు తగ్గట్టు మనమూ మారడం. అలాంటి మార్పులు కొన్నిసార్లు మనకు ఊహించని కష్టాల్ని తెచ్చిపెట్టవచ్చు. బహుశా మనకు ఒక పెద్ద అనారోగ్య సమస్య రావచ్చు. లేదా ఒక్కసారిగా మన ఆర్థిక పరిస్థితి మారిపోవచ్చు. లేదా మనం ఉంటున్న ప్రాంతంలో రాజకీయపరంగా కొన్ని మార్పులు వచ్చి, మన జీవితం చిందరవందర అవ్వొచ్చు. (ప్రసం. 9:11; 1 కొరిం. 7:31) అంతేకాదు, యెహోవా సంస్థలో మనకున్న నియామకం మారినప్పుడు కూడా అదొక పరీక్షలా మారవచ్చు. మనకు ఎలాంటి సవాళ్లు వచ్చినా, ఈ నాలుగు పనులు చేసినప్పుడు మారిన పరిస్థితులకు మనం చక్కగా సర్దుకుపోగలుగుతాం: (1) వాస్తవాన్ని అంగీకరించాలి, (2) భవిష్యత్తువైపు చూడాలి, (3) మంచి విషయాలపైన మనసుపెట్టాలి, (4) ఇతరుల కోసం ఏదోకటి చేయాలి. b ఈ నాలుగు పనులు చేయడం వల్ల మారిన పరిస్థితులకు చక్కగా సర్దుకుపోయిన కొంతమంది నిజ జీవిత అనుభవాల్ని ఇప్పుడు చూద్దాం.

9. ఒక జంట ఊహించని కష్టాల్ని ఎలా తట్టుకోగలిగింది?

9 వాస్తవాన్ని అంగీకరించండి. ఇమ్మాన్వెల్‌, ఫ్రాన్సిస్కా వేరే దేశానికి మిషనరీలుగా పంపించబడ్డారు. వాళ్లు వెళ్లి, కొత్త భాష నేర్చుకుంటూ, కొత్త సంఘానికి అలవాటు పడుతుండగా కరోనా మహమ్మారి వచ్చిపడింది. దాంతో వాళ్లు ఇల్లు కదల్లేని పరిస్థితి వచ్చింది. సరిగ్గా అప్పుడే ఫ్రాన్సిస్కా వాళ్ల అమ్మ చనిపోయింది. వాళ్ల అమ్మని చివరి చూపు చూడాలని ఫ్రాన్సిస్కా బాగా పరితపించింది. కానీ కరోనా వల్ల అక్కడికి ప్రయాణం చేసే అవకాశం లేదు. మరి, ఆ కష్టమైన పరిస్థితిని ఫ్రాన్సిస్కా ఎలా తట్టుకోగలిగింది? ముందుగా ఇమ్మాన్వెల్‌, ఫ్రాన్సిస్కా ఇద్దరు కలిసి ఒక్కో రోజు గట్టెక్కడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని యెహోవాకు ప్రార్థన చేశారు. యెహోవా సరైన సమయంలో తన సంస్థను ఉపయోగించుకొని వాళ్ల ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఉదాహరణకు, ఒక వీడియో ఇంటర్వ్యూలో ఒక బ్రదర్‌ చెప్పిన మాటలు వాళ్లకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. అందులో ఆయనిలా అన్నాడు: “మనం కొత్త పరిస్థితుల్ని ఎంత తొందరగా అంగీకరించి, వాటికి అలవాటుపడితే మన సంతోషం అంత త్వరగా తిరిగి వస్తుంది. దానివల్ల కొత్త పరిస్థితుల్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతాం.” c రెండోది, వాళ్లు ఫోన్‌ సాక్ష్యం చేయడంలో చక్కగా నైపుణ్యం సంపాదించి, ఒక బైబిలు అధ్యయనాన్ని కూడా మొదలుపెట్టారు. మూడోది, స్థానిక బ్రదర్స్‌, సిస్టర్స్‌ ఇచ్చే ప్రోత్సాహాన్ని, మద్దతును వాళ్లు తీసుకున్నారు. ఒక దయగల సిస్టర్‌, సంవత్సరం పాటు లేఖనాల్ని ఉపయోగించుకొని ఫ్రాన్సిస్కాకు ప్రతీరోజు ఒక మెసేజ్‌ పంపించేది. మనం కూడా వాస్తవాన్ని అంగీకరించి, మారిన పరిస్థితులకు అలవాటుపడితే, మనం చేయగలుగుతున్న వాటినిబట్టి సంతోషాన్ని పొందవచ్చు.

10. తన జీవితంలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు ఒక సిస్టర్‌ ఎలా అలవాటుపడింది?

10 భవిష్యత్తు వైపు చూస్తూ, మంచి విషయాలపైన మనసుపెట్టండి. జపాన్‌లో ఉంటున్న క్రిస్టీనా అనే రొమేనియన్‌ సిస్టర్‌ అనుభవాన్ని చూడండి. ఆమె వెళ్లే ఇంగ్లీష్‌ సంఘాన్ని సంస్థ తీసేసినప్పుడు ఆమె చాలా బాధపడింది. కానీ ఆమె జరిగిన దానిగురించే ఆలోచిస్తూ ఉండిపోలేదు. బదులుగా, స్థానిక జపనీస్‌ భాష నేర్చుకోవడానికి, అందులో ప్రీచింగ్‌ చేయడానికి ఆమె చేయగలిగినదంతా చేయాలని నిర్ణయించుకుంది. ఆ భాషను ఇంకా బాగా నేర్పించమని ఆమె ఒకప్పుడు కలిసి పనిచేసిన ఆవిడను అడిగింది. ఆమె బైబిల్ని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురును ఉపయోగించి క్రిస్టీనాకు జపనీస్‌ భాష నేర్పించడానికి ఒప్పుకుంది. క్రిస్టీనా జపనీస్‌ భాష బాగా నేర్చుకోవడమే కాదు, ఆమెకు ఆ భాష నేర్పించిన ఆవిడ, సత్యం పట్ల కూడా ఆసక్తి చూపించడం మొదలుపెట్టింది. మనం భవిష్యత్తు వైపు చూస్తూ, మంచి విషయాలపైన మనసుపెట్టినప్పుడు, మన జీవితంలో ఊహించని ఆ మార్పులే ఊహించని దీవెనలు తెచ్చిపెడతాయి.

11. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక దంపతులు ఏం చేశారు?

11 ఇతరుల కోసం ఏదోకటి చేయండి. మన పనిని నిషేధించిన దేశంలో ఉంటున్న ఒక దంపతుల గురించి ఆలోచించండి. ఆ దేశంలో ఆర్థిక మాంద్యం రావడం వల్ల వాళ్ల ఉద్యోగాలు కోల్పోయారు. మరి, ఆ పరిస్థితికి వాళ్లెలా సర్దుకుపోయారు? ముందుగా, వాళ్లు తమ ఖర్చుల్ని బాగా తగ్గించుకున్నారు. తర్వాత, వాళ్ల సమస్యల మీద మనసుపెట్టే బదులు పరిచర్యలో బిజీగా ఉంటూ వేరేవాళ్లకు సహాయం చేయడం మీద ఎక్కువ మనసుపెట్టాలని నిర్ణయించుకున్నారు. (అపొ. 20:35) ఆ బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “మేము ప్రీచింగ్‌లో బిజీగా ఉండడం వల్ల దేవుని ఇష్టం చేయడం మీద ఎక్కువ మనసుపెట్టగలిగాం. అలా మా సమస్యల గురించి ఆలోచించడానికి టైంయే దొరికేది కాదు.” మన పరిస్థితులు మారినప్పుడు, ప్రీచింగ్‌ చేస్తూ వేరేవాళ్లకు సహాయం చేయడం ఎంత ప్రాముఖ్యమో మనం గుర్తుంచుకోవాలి.

12. మనం ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

12 మనం ప్రీచింగ్‌లో పరిస్థితులకు తగ్గట్టు మారాలి. ఎందుకంటే మనం వేర్వేరు నమ్మకాలు ఉన్నవాళ్లను, వేర్వేరు ప్రాంతాలకు, వేర్వేరు సంస్కృతులకు చెందినవాళ్లను కలుస్తాం. అపొస్తలుడైన పౌలు పరిస్థితులకు తగ్గట్టు మారాడు, ఆయన నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. యేసు ఆయన్ని ‘అన్యజనులకు అపొస్తలునిగా’ నియమించాడు. (రోమా. 11:13) ఆ పనిని చేస్తూ పౌలు యూదులకు, గ్రీకువాళ్లకు, బాగా చదువుకున్న వాళ్లకు, పల్లెటూరి వాళ్లకు, అధికారులకు, రాజులకు ప్రకటించాడు. ఇలా రకరకాల ప్రజల హృదయాన్ని చేరుకోవడానికి పౌలు వాళ్లలా మారాడు. (1 కొరిం. 9:19-23) తను చెప్పేది వినేవాళ్ల సంస్కృతి, నేపథ్యం, నమ్మకాల మీద ఆయన మనసుపెట్టాడు. దానికి తగ్గట్టు తను చెప్పాలనుకున్న విషయాన్ని మార్చుకున్నాడు. మనం కూడా పరిచర్యను బాగా చేయాలంటే, మనం చెప్పేది వినే ప్రతీ ఒక్కరి గురించి ఆలోచించి, వాళ్ల అవసరాలకు తగ్గట్టు మనం చెప్పే విషయాన్ని మార్చుకోవాలి.

ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించండి

మనం సహేతుకంగా ఉంటే ఇతరుల అభిప్రాయాల్ని, ఇష్టాల్ని గౌరవిస్తాం (13వ పేరా చూడండి)

13. ఇతరుల అభిప్రాయాల్ని లేదా ఇష్టాల్ని గౌరవించినప్పుడు 1 కొరింథీయులు 8:9​లో చెప్పిన ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటాం?

13 సహేతుకత ఉంటే వేరేవాళ్ల అభిప్రాయాల్ని లేదా ఇష్టాల్ని గౌరవిస్తాం. ఉదాహరణకు, కొంతమంది సిస్టర్స్‌కి మేకప్‌ వేసుకోవడం అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొంతమందికి ఇష్టంలేకపోవచ్చు. కొంతమంది క్రైస్తవులు కాస్త మందు తాగాలనుకోవచ్చు, ఇంకొంతమంది అస్సలు తాగాలనుకోకపోవచ్చు. మనందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, దానికోసం రకరకాల ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటాం. అయితే, మన అభిప్రాయాన్ని వేరేవాళ్ల మీద రుద్దడానికి ప్రయత్నిస్తే, సంఘంలో వాళ్లను అభ్యంతర పెట్టే అవకాశం ఉంది, విభజనలు సృష్టించే ప్రమాదం ఉంది. మనం అలా చేయాలని అస్సలు అనుకోము. (1 కొరింథీయులు 8:9 చదవండి; 10:23, 24) అయితే, మనం ఇప్పుడు రెండు సందర్భాల్ని గమనిద్దాం. మనం సరిగ్గా ఆలోచించడానికి, శాంతిని కాపాడుకోవడానికి ఆ రెండు సందర్భాల్లో లేఖనాల్ని ఎలా పాటించాలో పరిశీలిద్దాం.

మనం సహేతుకంగా ఉంటే ఇతరుల అభిప్రాయాల్ని, ఇష్టాల్ని గౌరవిస్తాం (14వ పేరా చూడండి)

14. బట్టలు, హేర్‌స్టైల్స్‌ విషయంలో మనం ఏ బైబిలు సూత్రాల్ని మనసులో పెట్టుకోవాలి?

14 బట్టలు, హేర్‌స్టైల్స్‌. మనం ఇలాగే బట్టలు వేసుకోవాలని యెహోవా చెప్పలేదు కానీ కొన్ని సూత్రాల్ని ఇచ్చాడు. మనం దేవునికి మహిమ తీసుకొచ్చేలా, సహేతుకత, అణకువ, “మంచి వివేచన” ఉట్టిపడే బట్టల్ని వేసుకోవాలి. (1 తిమో. 2:9, 10; 1 పేతు. 3:3) కాబట్టి ఇతరుల దృష్టి అనవసరంగా మనవైపుకు వచ్చే బట్టల్ని మనం వేసుకోం. అయితే బట్టలు, హేర్‌స్టైల్స్‌ విషయంలో సంఘ పెద్దలు అనవసరమైన రూల్స్‌ పెట్టకుండా బైబిలు సూత్రాలు వాళ్లకు సహాయం చేస్తాయి. ఉదాహరణకు, ఒక సంఘంలో కొంతమంది యౌవనులు తమ చుట్టూ ఉన్నవాళ్ల లాంటి హేర్‌స్టైల్స్‌ చేసుకున్నారు. అంటే అది చిన్నగానే ఉంది కానీ చింపిరిగా ఉంది. ఇప్పుడు ఆ సంఘ పెద్దలు వాళ్లకు సలహా ఇవ్వాలనుకున్నారు. మరి ఎలాంటి రూల్స్‌ పెట్టకుండానే ఆ పెద్దలు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు? ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆ యౌవనులతో ఇలా మాట్లాడమని సంఘ పెద్దలకు సలహా ఇచ్చాడు: “మీరే స్టేజ్‌ మీద నుండి మాట్లాడుతుంటే, ప్రేక్షకులు మీరు చెప్పే విషయం మీద కాకుండా మీపైనే ఎక్కువ దృష్టిపెడుతుంటే, సమస్య మీ హేర్‌స్టైల్స్‌లో, బట్టల్లో ఉన్నట్టు.” ఈ ఒక్కమాటతో యౌవనులకు ఏం చేయాలో అర్థమైంది. పెద్దలకు కూడా రూల్స్‌ పెట్టాల్సిన అవసరం రాలేదు. d

మనం సహేతుకంగా ఉంటే ఇతరుల అభిప్రాయాల్ని, ఇష్టాల్ని గౌరవిస్తాం (15వ పేరా చూడండి)

15. వైద్యం విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ బైబిలు నియమాలు, సూత్రాలు మనకు సహాయం చేస్తాయి? (రోమీయులు 14:5)

15 వైద్యం. ప్రతీ క్రైస్తవుడు తన ఆరోగ్యం గురించి తానే శ్రద్ధ తీసుకోవాలి. (గల. 6:5) క్రైస్తవులు వైద్యం తీసుకుంటున్నప్పుడు రక్తానికి, మంత్రతంత్రాలకు దూరంగా ఉండాలనే బైబిలు ఆజ్ఞల్ని పాటిస్తారు. (అపొ. 15:20; గల. 5:19, 20) ఈ రెండూ తప్ప వైద్యానికి సంబంధించిన మిగతా నిర్ణయాలన్నీ వ్యక్తిగత అభిప్రాయాల్ని బట్టే తీసుకోవచ్చు. కొంతమంది వైద్యం కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఇంకొంతమంది వేరే రకమైన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటారు. ఫలానా ట్రీట్‌మెంట్‌ మంచిదని లేదా మంచిది కాదని మనకు బలంగా అనిపించినా, బ్రదర్స్‌ సిస్టర్స్‌ వైద్యం విషయంలో సొంతగా తీసుకునే నిర్ణయాల్ని మనం గౌరవిస్తాం. వైద్యానికి సంబంధించి మనం ఈ విషయాల్ని మనసులో ఉంచుకోవాలి: (1) దేవుని రాజ్యం మాత్రమే మనకున్న రోగాలన్నిటినీ పూర్తిగా, శాశ్వతంగా బాగుచేస్తుంది. (యెష. 33:24) (2) ఒక క్రైస్తవుడు తనకు ఏ వైద్యం సరిగ్గా సరిపోతుందో ‘పూర్తిగా నమ్మకం’ కుదుర్చుకోవాలి. (రోమీయులు 14:5 చదవండి.) (3) ఇతరులు తీసుకున్న నిర్ణయాల్ని తప్పుపట్టకూడదు, వాళ్లను అభ్యంతర పెట్టే ఏ పనీ చేయకూడదు. (రోమా. 14:13) (4) క్రైస్తవులు ప్రేమను చూపిస్తూ, వ్యక్తిగత అభిప్రాయాల కన్నా సంఘ శాంతే ముఖ్యమని గుర్తిస్తారు. (రోమా. 14:15, 19, 20) మనం ఈ విషయాల్ని మనసులో ఉంచుకుంటే బ్రదర్స్‌, సిస్టర్స్‌తో మనకున్న స్నేహాన్ని కాపాడుకుంటాం. సంఘం ఐక్యంగా ఉండడానికి మన వంతు సహాయం చేస్తాం.

మనం సహేతుకంగా ఉంటే ఇతరుల అభిప్రాయాల్ని, ఇష్టాల్ని గౌరవిస్తాం (16వ పేరా చూడండి)

16. సంఘపెద్దలు తోటి పెద్దలతో వ్యవహరిస్తున్నప్పుడు సహేతుకత ఎలా చూపిస్తారు? (చిత్రాలు కూడా చూడండి.)

16 సంఘపెద్దలు సహేతుకత చూపించే విషయంలో చక్కని ఆదర్శాన్ని ఉంచాలి. (1 తిమో. 3:2, 3) ఉదాహరణకు, ఒక సంఘపెద్ద తన వయసును బట్టి అన్నిసార్లు మిగతా పెద్దలు తన మాటే వినాలని ఆశించకూడదు. పెద్దల సభ ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఏ సంఘపెద్దనైనా పవిత్రశక్తి మాట్లాడేలా చేస్తుందని అతను గుర్తిస్తాడు. అలాగే బైబిలు సూత్రాలను మీరనంతవరకు తమకు వేరే అభిప్రాయం ఉన్నా సరే, పెద్దల సభలో ఎక్కువమంది పెద్దలు తీసుకునే నిర్ణయానికి వాళ్లు ఇష్టపూర్వకంగా మద్దతిస్తారు.

సహేతుకంగా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు

17. సహేతుకత చూపిస్తే ఎలాంటి దీవెనలు వస్తాయి?

17 సహేతుకత చూపించడం వల్ల మనం ఎన్నో దీవెనలు పొందుతాం. బ్రదర్స్‌, సిస్టర్స్‌ మధ్య మంచి స్నేహాల్ని ఆనందిస్తాం, సంఘం శాంతితో కళకళలాడుతుంది. యెహోవా ప్రజల్లో వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నా, వేర్వేరు సంస్కృతులు ఉన్నా ఐక్యంగా ఆయన్ని ఆరాధిస్తాం. అంతేకాదు, మనం సహేతుకత చూపిస్తున్నామంటే, సహేతుకతగల యెహోవాలా ఉన్నాం అనే సంతృప్తితో ఉండవచ్చు.

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

a యెహోవా, యేసు సహేతుకత చూపించారు. మనం కూడా అలా చూపించాలని వాళ్లు కోరుకుంటున్నారు. మనకు సహేతుకత ఉంటే మన పరిస్థితులు మారినప్పుడు అంటే ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మారినప్పుడు మనం తేలిగ్గా సర్దుకుపోగలుగుతాం. అంతేకాదు సంఘం శాంతిగా, ఐక్యంగా ఉండడానికి మన వంతు సహాయం చేసిన వాళ్లమౌతాం.

b 2016, నం. 4 తేజరిల్లు! పత్రికలో “పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి” అనే ఆర్టికల్‌ చూడండి.

c 2021, మార్చి-ఏప్రిల్‌ మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌లో వచ్చిన “వ్యతిరేకతను సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా మార్చాడు” అనే ఆర్టికల్‌లో ఉన్న సహోదరుడు డిమీత్రి మిఖైలొవ్‌తో ఇంటర్వ్యూ వీడియో చూడండి.

d బట్టలు, హేర్‌స్టైల్స్‌ విషయంలో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 52వ పాఠం చూడండి.