కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 31

“స్థిరంగా, నిలకడగా ఉండండి”

“స్థిరంగా, నిలకడగా ఉండండి”

“నా ప్రియ సహోదరులారా, స్థిరంగా, నిలకడగా ఉండండి.”1 కొరిం. 15:58.

పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!

ఈ ఆర్టికల్‌లో . . . a

1-2. క్రైస్తవులు ఎలా ఒక ఎత్తయిన బిల్డింగ్‌లా ఉన్నారు? (1 కొరింథీయులు 15:58)

 జపాన్‌లోని టోక్యో నగరంలో ఆకాశాన్నంటే ఎత్తయిన 60 అంతస్తుల బిల్డింగ్‌ని 1978 లో కట్టారు. ఇంత పెద్ద బిల్డింగ్‌ కట్టారు సరే, కానీ భూకంపం వస్తే ఎలా తట్టుకుంటుంది అని చూసినవాళ్లంతా అనుకున్నారు. కానీ ఇంజనీర్లు ఆ భవనాన్ని చాలా బలంగా, భూమి అదిరినా దాన్ని తట్టుకునే సామర్థ్యంతో కట్టారు. క్రైస్తవులు కూడా ఆ పెద్ద బిల్డింగ్‌లాగే ఉన్నారు. అలా అని ఎందుకు చెప్పవచ్చు?

2 ఒక క్రైస్తవుడు ఒకవైపు స్థిరంగా ఉంటూనే ఇంకోవైపు సహేతుకంగా ఉండాలి. యెహోవా ఆజ్ఞల విషయంలో, ప్రమాణాల విషయంలో కదల్చబడకుండా స్థిరంగా ఉండాలి. (1 కొరింథీయులు 15:58 చదవండి.) అలాగే అతను ‘లోబడడానికి సిద్ధంగా ఉంటూ’ వాటి విషయంలో రాజీపడకూడదు. మరోవైపు ఒక క్రైస్తవుడు అవసరమైన చోట ‘సహేతుకత’ చూపించాలి. (యాకో. 3:17, అధస్సూచి) ఈ రెండిటిని సమపాళ్లలో చూపించే క్రైస్తవుడు మరీ పట్టుబట్టేవాడిగా ఉండడు లేదా మరీ నిర్లక్ష్యం చేసేవాడిగా ఉండడు. మనం కదల్చబడకుండా స్థిరంగా ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే మనల్ని కదల్చడానికి సాతాను ఉపయోగించే ఐదు మార్గాల్ని పరిశీలిస్తాం. వాటిని తిప్పికొట్టడానికి మనం ఏం చేయాలో కూడా చూస్తాం.

మనం ఎలా స్థిరంగా ఉండవచ్చు?

3. అపొస్తలుల కార్యాలు 15:28, 29 లో యెహోవా ఏ ఆజ్ఞలు ఇచ్చాడు?

3 యెహోవా అత్యున్నతమైన శాసనకర్తగా తన ప్రజలకు స్పష్టమైన ఆజ్ఞలు ఇస్తూనే వచ్చాడు. (యెష. 33:22) ఉదాహరణకు, క్రైస్తవులు స్థిరంగా ఉండాల్సిన మూడు విధానాల గురించి మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ చెప్పింది: (1) విగ్రహారాధనను తిరస్కరించి యెహోవాను మాత్రమే ఆరాధించడం, (2) రక్తాన్ని పవిత్రంగా చూడడం, (3) బైబిల్లో ఉన్న ఉన్నత నైతిక ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండడం. (అపొస్తలుల కార్యాలు 15:28, 29 చదవండి.) అయితే, నేడున్న క్రైస్తవులు ఆ మూడు విధానాల్లో ఎలా స్థిరంగా ఉండవచ్చో ఇప్పుడు చూద్దాం.

4. మనం యెహోవాకు సంపూర్ణ భక్తిని ఎలా ఇవ్వొచ్చు? (ప్రకటన 4:11)

4 మనం విగ్రహారాధనను తిరస్కరించి, యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. తనకు మాత్రమే సంపూర్ణ భక్తిని ఇవ్వాలని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చాడు. (ద్వితీ. 5:6-10) అంతేకాదు, సాతాను పరీక్షించినప్పుడు మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలని యేసు స్పష్టంగా చెప్పాడు. (మత్త. 4:8-10) అందుకే మనం విగ్రహాలను ఆరాధించం. అలాగని మనుషుల్ని కూడా ఆరాధించం. అంటే మతనాయకుల్ని, రాజకీయ నాయకుల్ని, క్రీడాకారుల్ని లేదా సినిమా తారల్ని దేవుళ్లుగా చేసుకోం. బదులుగా మనం యెహోవా పక్షాన నిలబడుతూ ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయనే ‘అన్నిటినీ సృష్టించాడు.’—ప్రకటన 4:11 చదవండి.

5. జీవాన్ని, రక్తాన్ని పవిత్రంగా ఎంచాలనే యెహోవా ఆజ్ఞకు మనం ఎందుకు కట్టబడి ఉంటాం?

5 జీవాన్ని, రక్తాన్ని పవిత్రంగా ఎంచాలనే యెహోవా ఆజ్ఞకు మనం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే రక్తం, యెహోవా ఇచ్చిన అమూల్యమైన జీవంతో సమానమని బైబిలు చెప్తుంది. (లేవీ. 17:14) మనుషులు మాంసాన్ని తినొచ్చని యెహోవా మొదటిసారి చెప్పినప్పుడు, రక్తాన్ని తినకూడదని ఆయన ఆజ్ఞాపించాడు. (ఆది. 9:4) ఇశ్రాయేలీయులకు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు కూడా ఆయన ఈ ఆజ్ఞను మళ్లీ చెప్పాడు. (లేవీ. 17:10) అంతేకాదు, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ‘రక్తానికి ఎప్పుడూ దూరంగా ఉండాలి’ అని అప్పుడున్న పరిపాలక సభ ద్వారా నిర్దేశించాడు. (అపొ. 15:28, 29) మనం కూడా వైద్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఆజ్ఞ విషయంలో స్థిరంగా ఉంటాం. b

6. యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండడానికి మనం ఏం చేస్తాం?

6 యెహోవా ఇచ్చిన ఉన్నత నైతిక ప్రమాణాల్ని అంటిపెట్టుకుని ఉంటాం. (హెబ్రీ. 13:4) మన శరీర అవయవాల్ని ‘చంపేసుకోవాలి’ అని అపొస్తలుడైన పౌలు సలహా ఇచ్చాడు. అంటే మనలో వచ్చే తప్పుడు కోరికల్ని తీసేసుకోవడానికి మనం ఎంత దూరమైనా వెళ్లాలని ఆయన చెప్తున్నాడు. అందుకే, లైంగిక పాపానికి నడిపించే దేన్నైనా మనం చూడం, చేయం. (కొలొ. 3:5; యోబు 31:1) ఒకవేళ తప్పుచేయాలనే ఆలోచన వస్తే? యెహోవాతో మన స్నేహాన్ని పాడుచేసే ఆలోచనను గానీ, పనిని గానీ వెంటనే తిరస్కరిస్తాం.

7. మనం ఏమని తీర్మానించుకోవాలి? ఎందుకు?

7 మనం “మనస్ఫూర్తిగా” తనకు లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. (రోమా. 6:17) ఆయన నిర్దేశాలు ఎప్పుడూ మన మంచికోసమే. అలాగే ఆయన ఆజ్ఞలు ఎవ్వరి కోసం మారవు. (యెష. 48:17, 18; 1 కొరిం. 6:9, 10) మనం యెహోవాను సంతోషపెట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తాం. అంతేకాదు, కీర్తనకర్తలాగే మనం కూడా ఇలా అంటాం: “అన్ని సమయాల్లో, చివరివరకూ నీ నియమాలకు లోబడాలని నేను నా హృదయంలో తీర్మానించుకున్నాను.” (కీర్త. 119:112) కానీ మన తీర్మానాన్ని నీరుగార్చడానికి సాతాను ప్రయత్నిస్తాడు. దానికోసం అతను ఏ పద్ధతుల్ని ఉపయోగిస్తాడు?

సాతాను ఎలా మన తీర్మానాన్ని నీరుగారుస్తాడు?

8. మన తీర్మానాన్ని నీరుగార్చడానికి సాతాను హింసను ఎలా ఉపయోగిస్తున్నాడు?

8 హింస. మన తీర్మానాన్ని నీరుగార్చడానికి ప్రజలు మనల్ని కొట్టేలా, మానసికంగా ఒత్తిడి తెచ్చేలా సాతాను చేయవచ్చు. యెహోవాతో మన సంబంధాన్ని దెబ్బతీసి, మనల్ని ‘మింగేయాలి’ అన్నదే అతని లక్ష్యం. (1 పేతు. 5:8) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు స్థిరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వల్ల ప్రజలు వాళ్లను బెదిరించారు, కొట్టారు, ఆఖరికి చంపేశారు. (అపొ. 5:27, 28, 40; 7:54-60) నేడు కూడా సాతాను అలాంటి హింసనే ఉపయోగిస్తున్నాడు. రష్యాలో, ఇతర దేశాల్లో మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద వ్యతిరేకులు దయాదాక్షిణ్యాలు లేకుండా క్రూరంగా హింసించడం చూస్తే అదే నిజమని అర్థమౌతుంది.

9. కంటికి కనిపించని ఒత్తిళ్ల విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో ఉదాహరణతో చెప్పండి.

9 కంటికి కనిపించని ఒత్తిళ్లు. సాతాను నేరుగా దాడి చేయడంతోపాటు వెనకనుండి దాడిచేయడానికి కూడా ‘వ్యూహాల్ని’ పన్నుతాడు. (ఎఫె. 6:11, అధస్సూచి) రాబర్ట్‌ అనే బ్రదర్‌ ఉదాహరణని గమనించండి. ఆయనకు పెద్ద సర్జరీ అవసరంపడి హాస్పిటల్‌లో చేరాడు. ఎట్టి పరిస్థితుల్లో రక్తం ఎక్కించుకోనని ఆయన డాక్టర్లకు చెప్పాడు. సర్జరీ చేసే డాక్టర్‌ దానికి ఒప్పుకున్నాడు. కానీ సర్జరీకి ముందురోజు రాత్రి మత్తు డాక్టర్‌, రాబర్ట్‌ ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు. దాదాపు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి రాదుగానీ అవసరమౌతుందేమో అని రక్తాన్ని అందుబాటులో పెట్టుకుంటామని రాబర్ట్‌కి చెప్పాడు. చుట్టూ కుటుంబ సభ్యులు లేరు కాబట్టి రాబర్ట్‌ తన మనసు మార్చుకుంటాడని ఆ డాక్టర్‌ అనుకుని ఉంటాడు. కానీ రక్తం విషయంలో రాబర్ట్‌ స్థిరంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లో రక్తం ఎక్కించకూడదని చెప్పాడు.

10. లోకపు తెలివి ఎందుకు ఒక ఉచ్చులాంటిది? (1 కొరింథీయులు 3:19, 20)

10 లోకపు తెలివి. మనం విషయాల్ని మనుషుల వైపు నుండి ఆలోచిస్తే యెహోవాను, ఆయన ప్రమాణాల్ని పక్కన పెట్టేసే ప్రమాదం ఉంది. (1 కొరింథీయులు 3:19, 20 చదవండి.) సాధారణంగా “ఈ లోకపు తెలివి” వల్ల మనం యెహోవా ప్రమాణాల్ని వదిలేసి, మనకు నచ్చినవే చేయడం మొదలుపెడతాం. పెర్గము, తుయతైరలోని కొంతమంది క్రైస్తవులు విగ్రహారాధన, అనైతికత విషయంలో చుట్టూవున్న ప్రజల ఆలోచనను వంటపట్టిచ్చుకున్నారు. వాళ్లు లైంగిక అనైతికతను చూసీచూడనట్టు వదిలేయడంతో, ఆ రెండు సంఘాల వాళ్లను యేసు గట్టిగా హెచ్చరించాడు. (ప్రక. 2:14, 20) ఈరోజుల్లో, మనచుట్టూ ఉన్నవాళ్లలా ఆలోచించాలనే ఒత్తిడి మనకు రావచ్చు. కుటుంబ సభ్యులు లేదా ఇరుగుపొరుగువాళ్లు మనం మరీ నిష్ఠగా ఉంటున్నామనీ, అప్పుడప్పుడు యెహోవా ప్రమాణాలు మీరడంలో తప్పేం లేదనీ అనొచ్చు. ఉదాహరణకు, బైబిల్లో ఉన్న ఉన్నత నైతిక ప్రమాణాలు పాతకాలం నాటివని, మన సొంత కోరికల్ని తీర్చుకోవచ్చు అని చెప్పొచ్చు.

11. మనం స్థిరంగా ఉంటూనే ఏం చేయకూడదు?

11 కొన్నిసార్లు యెహోవా ఇచ్చే నిర్దేశం అంత స్పష్టంగా లేదని అనిపించవచ్చు. ఆఖరికి “లేఖనాల్లో రాసివున్న వాటిని” మీరాలని కూడా మనకు అనిపించవచ్చు. (1 కొరిం. 4:6) యేసు కాలంలోని మతనాయకులు ఈ పాపాన్నే మూట కట్టుకున్నారు. వాళ్లు ధర్మశాస్త్రానికి సొంత నియమాల్ని జోడించి, మామూలు ప్రజల మీద ఎక్కువ భారాన్ని మోపారు. (మత్త. 23:4) కానీ యెహోవా తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా మనకు స్పష్టమైన నిర్దేశాల్ని ఇస్తాడు. ఆ నిర్దేశాలకు మనం తలా-తోక జోడించాల్సిన అవసరంలేదు. (సామె. 3:5-7) కాబట్టి బైబిల్లో రాసున్న వాటిని మీరకుండా మనం జాగ్రత్తపడతాం. అలాగే తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ వ్యక్తిగత విషయాల్లో మనం సొంత రూల్స్‌ పెట్టకుండా ఉంటాం.

12. ‘మోసపూరితమైన వట్టి మాటల్ని’ సాతాను ఎలా ప్రచారం చేస్తున్నాడు?

12 మోసపూరితమైన మాటలు. సాతాను ‘ఈ లోకంలోని ప్రాథమిక విషయాలతో, మోసపూరితమైన వట్టి మాటలతో’ తప్పుదారి పట్టిస్తున్నాడు. అలాగే మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతున్నారు. (కొలొ. 2:8) మొదటి శతాబ్దంలో, ఈ మోసపూరితమైన మాటల్లో మనుషుల ఆలోచనలు, లేఖన విరుద్ధమైన యూదా బోధలు అలాగే క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రాన్నే పాటించాలనే బోధ ఉన్నాయి. ఇవన్నీ మోసపూరితమైన మాటలు. ఎందుకంటే నిజమైన తెలివికి మూలమైన యెహోవా నుండి ప్రజల్ని అవి తప్పుదారి పట్టించాయి. ఈరోజుల్లో కూడా పుకార్లను, రాజకీయ నాయకులు వెనకుండి నడిపించే తప్పుడు నివేదికల్ని సాతాను వార్తల్లో, సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టేలా చేస్తున్నాడు. కోవిడ్‌ సమయంలో ఇలాంటివి మనం ఎన్నో చూశాం. c కానీ యెహోవాసాక్షుల్లో ఎవరైతే సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని పాటించారో వాళ్లు, ఈ తప్పుడు మాటలకు పడిపోలేదు అలాగే అనవసరమైన ఆందోళనకు గురవ్వలేదు.—మత్త. 24:45.

13. మన దృష్టి ఎందుకు పక్కకు మళ్లకుండా చూసుకోవాలి?

13 దృష్టి పక్కకు మళ్లించడం. మనం “ఎక్కువ ప్రాముఖ్యమైన” వాటి నుండి దృష్టి పక్కకు మళ్లించకుండా చూసుకోవాలి. (ఫిలి. 1:9, 10) దృష్టి పక్కకు వెళ్తే మన సమయం, శక్తి అన్నీ గాల్లో కలిసిపోతాయి. మనం మామూలుగా చేసే పనులు అంటే తినడం, తాగడం, సరదాగా సమయం గడపడం, ఉద్యోగం వంటివాటి మీద ఎక్కువ మనసుపెడితే మన దృష్టి పక్కకు మళ్లవచ్చు. (లూకా 21:34, 35) వీటికి తోడు, వార్తలన్నీ సమాజంలో జరిగే అల్లర్లు, రాజకీయ విషయాలతోనే నిండిపోయాయి. వాటివల్ల మన దృష్టి పక్కకు మళ్లకుండా చూసుకోవాలి. లేదంటే మన మనసులో, హృదయంలో ఎవరో ఒకరి పక్షాన ఉండే ప్రమాదముంది. సరైంది చేయాలనే మన తీర్మానాన్ని నీరుగార్చడానికి పైన చెప్పిన పద్ధతులన్నీ సాతాను ఉపయోగిస్తాడు. కాబట్టి అతని ప్రయత్నాల్ని తిప్పికొట్టి, మనం ఎలా స్థిరంగా ఉండవచ్చో ఇప్పుడు చూద్దాం.

మనం స్థిరంగా ఎలా ఉండవచ్చు?

స్థిరంగా ఉండాలంటే, మీరు ఎందుకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నారో ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి, ధ్యానించాలి. మీ హృదయాన్ని స్థిరంగా ఉంచుకోవాలి, యెహోవాను నమ్మాలి (14-18 పేరాలు చూడండి)

14. యెహోవా పక్షాన స్థిరంగా నిలబడడానికి సహాయం చేసే ఒక విషయం ఏంటి?

14 మీరు ఎందుకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నారో ఆలోచించండి. మీరు యెహోవా పక్షాన నిలబడాలని అనుకున్నారు కాబట్టే ఆ రెండు పనులు చేశారు. ఇదే సత్యమని నమ్మడానికి మీకు ఏది సహాయం చేసిందో గుర్తుతెచ్చుకోండి. మీరు యెహోవా గురించి సరైన జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మీ పరలోక తండ్రి మీద ప్రేమ, గౌరవం పెంచుకున్నారు. మీరు విశ్వాసాన్ని పెంచుకుని, మీ తప్పులకు పశ్చాత్తాపపడ్డారు. యెహోవాకు ఇష్టంలేని పనులన్నీ వదిలేసి, ఆయన ఇష్టానికి తగ్గట్టుగా జీవించాలని మీ మనసులో తీర్మానించుకున్నారు. యెహోవా మిమ్మల్ని క్షమించాడని తెలుసుకుని మీరు ఊరట పొందారు. (కీర్త. 32:1, 2) మీరు మీటింగ్స్‌కి హాజరయ్యారు. తర్వాత, నేర్చుకున్న వాటన్నిటిని ఇతరులకు చెప్పడం మొదలుపెట్టారు. అలా సమర్పించుకుని, క్రైస్తవునిగా బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు మీరు జీవమార్గంలో నడుస్తూ ఉన్నారు. ఆ దారి నుండి పక్కకు మళ్లకుండా ఉండాలని గట్టిగా తీర్మానించుకున్నారు.—మత్త. 7:13, 14.

15. అధ్యయనం చేయడం, ధ్యానించడం ఎందుకు మంచిది?

15 దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, ధ్యానించండి. ఒక చెట్టు బలంగా ఉండాలంటే దాని వేళ్లు లోపల వరకు వెళ్లాలి. అలాగే మనం స్థిరంగా ఉండాలంటే మన విశ్వాసం కూడా దేవుని వాక్యంలో వేళ్లూనుకొని ఉండాలి. ఒక చెట్టు ఎదిగేటప్పుడు దాని వేళ్లు లోపలికి, దూరంగా పాతుకుపోయి ఉంటాయి. మనం అధ్యయనం చేసి, ధ్యానించినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. అలాగే యెహోవా మార్గాలే సరైనవనే నమ్మకం బలపడుతుంది. (కొలొ. 2:6, 7) యెహోవా ఇచ్చిన నిర్దేశం, నడిపింపు, కాపుదల గతంలోని తన సేవకులకు ఎలా సహాయం చేశాయో ఆలోచించండి. ఉదాహరణకు, యెహెజ్కేలు గురించి చూడండి. ఆలయపు కొలతల్ని దేవదూత ఆయనకు దర్శనంలో చెప్తున్నప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా విన్నాడు. ఆ దర్శనం వల్ల యెహెజ్కేలు బలపర్చబడ్డాడు. అలాగే సత్యారాధన విషయంలో యెహోవా ప్రమాణాల్ని మనమెలా అంటిపెట్టుకుని ఉండవచ్చో ఆ దర్శనం నేర్పిస్తుంది. d (యెహె. 40:1-4; 43:10-12) మనం కూడా దేవుని వాక్యంలో ఉన్న లోతైన విషయాల్ని అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి సమయం తీసుకున్నప్పుడు ఎంతో ప్రయోజనం పొందుతాం.

16. హృదయాన్ని స్థిరంగా ఉంచుకోవడం, రాబర్ట్‌కి ఎలా సహాయం చేసింది? (కీర్తన 112:7)

16 మీ హృదయాన్ని స్థిరంగా ఉంచుకోండి. “దేవా, నా హృదయం స్థిరంగా ఉంది” అని పాడి, రాజైన దావీదు యెహోవా మీద తనకు ఉన్న చెక్కుచెదరని ప్రేమను చూపించాడు. (కీర్త. 57:7) మనం కూడా యెహోవాను పూర్తిగా నమ్మితే, మన హృదయాన్ని స్థిరంగా ఉంచుకోగలుగుతాం. (కీర్తన 112:7 చదవండి.) ఇది పైన ప్రస్తావించిన రాబర్ట్‌ అనే బ్రదర్‌కి ఎలా సహాయం చేసిందో ఆలోచించండి. డాక్టర్లు ఒకవేళ రక్తం ఉపయోగపడుతుందేమో అని పక్కన పెట్టుకుంటాం అన్నప్పుడు, అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పండి, నేను వెంటనే హాస్పిటల్‌ నుండి వెళ్లిపోతానని రాబర్ట్‌ చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇలా అంటున్నాడు: “డాక్టర్లు అలా అడిగినప్పుడు నేను ఏమాత్రం సంకోచించలేదు. అలాగే నాకు ఏం జరుగుతుందా అని కంగారుపడలేదు.”

మన విశ్వాసం బలంగా వేళ్లూనుకొని ఉంటే మనకు ఏ కష్టం వచ్చినా స్థిరంగా నిలబడతాం (17వ పేరా చూడండి)

17. రాబర్ట్‌ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

17 రాబర్ట్‌ స్థిరంగా ఎందుకు ఉండగలిగాడంటే హాస్పిటల్‌కి వెళ్లడానికి చాలాకాలం ముందే, స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఒకటి, యెహోవాను సంతోషపెట్టాలని ఆయన కోరుకున్నాడు. రెండు, జీవానికి అలాగే రక్తానికి ఉన్న పవిత్రత గురించి బైబిలు, మన ప్రచురణలు ఏం చెప్తున్నాయో జాగ్రత్తగా అధ్యయనం చేశాడు. మూడు, యెహోవా ఇచ్చే నిర్దేశాల్ని పాటిస్తే శాశ్వతకాలం ఉండే ప్రయోజనాలు పొందుతామని బలంగా నమ్మాడు. మనం కూడా ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే మన హృదయాన్ని స్థిరంగా ఉంచుకోవచ్చు.

బారాకు, ఆయన మనుషులు సీసెరా సైన్యాన్ని ధైర్యంగా తరుముతున్నారు (18వ పేరా చూడండి)

18. యెహోవా మీద నమ్మకం ఉంచాలని బారాకు ఉదాహరణ ఎలా నేర్పిస్తుంది? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

18 యెహోవాను నమ్మండి. యెహోవా ఇచ్చే నిర్దేశాన్ని నమ్మడం వల్ల బారాకు ఎలా విజయం సాధించాడో ఆలోచించండి. ఇశ్రాయేలీయుల దగ్గర ఒక్క డాలు గానీ, ఈటె గానీ లేదు. కానీ చాలా ఆయుధాలు ఉన్న కనాను సైన్యాధిపతి సీసెరా మీదికి యుద్ధానికి వెళ్లమని యెహోవా చెప్పాడు. (న్యాయా. 5:8) సీసెరా, అతని 900ల యుద్ధ రథాలతో చదునైన నేలమీద యుద్ధం చేయడానికి వెళ్లమని బారాకుకు దెబోరా ప్రవక్త్రి చెప్పింది. అలాంటి నేలమీద యుద్ధం చేస్తే బారాకు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే, బారాకు ఆమె చెప్పింది చేశాడు. సైనికులు తాబోరు కొండమీద నుండి దిగుతున్నప్పుడు యెహోవా ఆకాశం నుండి కుండపోత వర్షాన్ని కురిపించాడు. అప్పుడు సీసెరా, అతని రథాలు బురదలో కూరుకుపోయాయి. అలా యెహోవా బారాకుకు విజయాన్ని ఇచ్చాడు. (న్యాయా. 4:1-7, 10, 13-16) అదేవిధంగా మనం ఆయన్ని, సంస్థ ద్వారా ఆయన ఇచ్చే నిర్దేశాన్ని నమ్మినప్పుడు యెహోవా మనకు కూడా విజయాన్ని ఇస్తాడు.—ద్వితీ. 31:6.

స్థిరంగా ఉండాలని గట్టిగా తీర్మానించుకోండి

19. మీరెందుకు స్థిరంగా ఉండాలని అనుకుంటున్నారు?

19 సాతాను లోకంలో మనం జీవించినంత కాలం స్థిరంగా ఉండడానికి పోరాడుతూనే ఉండాలి. (1 తిమో. 6:11, 12; 2 పేతు. 3:17) కాబట్టి హింస, కనిపించని ఒత్తిళ్లు, లోకపు తెలివి, మోసపూరితమైన మాటలు, దృష్టి పక్కకు మళ్లించేవి, ఇవేవీ మనల్ని ముంచేయకుండా చూసుకోవాలి. (ఎఫె. 4:14) అలాగే యెహోవాకు మనం చూపించే సంపూర్ణ భక్తి విషయంలో, ఆయన ఆజ్ఞలకు లోబడే విషయంలో మనం కదల్చబడకుండా స్థిరంగా ఉండాలి. అదే సమయంలో మనం సహేతుకంగా ఉండాలి. సహేతుకత చూపించే విషయంలో యెహోవా, యేసు ఎలా అత్యుత్తమ ఆదర్శాన్ని ఉంచారో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

a ఆదాముహవ్వల కాలం నుండే మనుషులు ఏది సరైనదో, ఏది తప్పో వాళ్లంతట వాళ్లే నిర్ణయించుకోవచ్చు అని సాతాను చెప్తున్నాడు. యెహోవా ప్రమాణాల విషయంలో, ఆయన సంస్థ ఇచ్చే నిర్దేశాల విషయంలో కూడా మనం అలాగే ఉండాలని అతను కోరుకుంటున్నాడు. కానీ సాతాను చెప్పుచేతల్లో ఉన్న మనుషుల్లా తమకు నచ్చిందే చేయాలనే ఆలోచన నుండి దూరంగా ఉండడానికి, యెహోవా పక్షాన స్థిరంగా ఉండాలనే మన నిశ్చయాన్ని బలపర్చుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

b ఒక క్రైస్తవుడు రక్తాన్ని యెహోవా చూసినట్టే ఎలా చూడాలో తెలుసుకోవడానికి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 39వ పాఠం చూడండి.

c jw.orgలో “గాలి వార్తలా? వాస్తవాలా?” అనే వీడియో చూడండి.