కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 29

పాట 121 మనకు ఆత్మనిగ్రహం అవసరం

ప్రలోభంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి

ప్రలోభంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి

“మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా మెలకువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉండండి.”మత్త. 26:41.

ముఖ్యాంశం

మనం పాపం చేయకుండా ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు, పాపానికి నడిపించే పనులు చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో కూడా చూస్తాం.

1-2. (ఎ) శిష్యులకు యేసు ఏ హెచ్చరిక ఇచ్చాడు? (బి) వాళ్లు యేసును వదిలేసి ఎందుకు పారిపోయారు? (చిత్రం కూడా చూడండి.)

 “మనసు సిద్ధమే కానీ శరీరమే బలహీనం.” a (మత్త. 26:41బి) మనం అపరిపూర్ణులం అని, పొరపాట్లు చేసే అవకాశం ఉందని యేసు అర్థం చేసుకున్నట్టు ఆ మాటలు చూపిస్తున్నాయి. అయితే, ఆ మాటల్లో ఒక హెచ్చరిక కూడా దాగివుంది. అదేంటంటే: మనం అస్సలు తప్పు చేయమనే మితిమీరిన ఆత్మవిశ్వాసం చూపించకూడదు. ఎందుకంటే ఆరోజు రాత్రి కొన్ని గంటల ముందే, యేసును అస్సలు వదిలిపెట్టమని శిష్యులు మాటిచ్చారు. (మత్త. 26:35) వాళ్ల ఉద్దేశం మంచిదే, కానీ ఒత్తిడి వచ్చినప్పుడు వెంటనే బలహీనపడిపోయారు. అందుకే వాళ్లకు యేసు ఈ జాగ్రత్త చెప్పాడు: “మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా మెలకువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉండండి.”—మత్త. 26:41ఎ.

2 బాధాకరంగా, శిష్యులు మెలకువగా ఉండలేకపోయారు. యేసును బంధించినప్పుడు వాళ్లు ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నారా? లేదా పారిపోవాలనే ప్రలోభానికి తలొగ్గారా? శిష్యులు జాగ్రత్తగా లేరు కాబట్టి, ఏదైతే అస్సలు చెయ్యం అన్నారో అదే చేశారు. వాళ్లు యేసును వదిలేసి పారిపోయారు.—మత్త. 26:56.

ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా మెలకువగా ఉండమని యేసు తన శిష్యులకు చెప్పాడు, కానీ వాళ్లు ఆయన్ని వదిలేసి పారిపోయారు (1-2 పేరాలు చూడండి)


3. (ఎ) మనం యెహోవాకు నమ్మకంగా ఉండాలంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎందుకు చూపించకూడదు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 ‘నేను అస్సలు తప్పు చేయను’ అనే మితిమీరిన ఆత్మవిశ్వాసం మనం చూపించకూడదు. నిజమే, యెహోవాను బాధపెట్టే ఏ పనీ చేయకూడదని మనం గట్టిగా నిర్ణయించుకున్నాం. కానీ మనం అపరిపూర్ణులం కాబట్టి తప్పుచేసే అవకాశం ఉంది. (రోమా. 5:12; 7:21-23) కొన్నిసార్లు అనుకోకుండా ఏదోక తప్పు చేయాలనే ప్రలోభం మనకు రావచ్చు. కానీ మనం యెహోవాకు, యేసుకు నమ్మకంగా ఉండాలంటే, ప్రలోభంలో పడిపోకుండా మెలకువగా ఉండాలి అనే సలహాను పాటించాలి. దాన్ని చేయడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. ముందుగా, మనం ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో పరిశీలిస్తాం. ఆ తర్వాత ప్రలోభంలో పడిపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో చూస్తాం. చివరిగా, మనం ఎలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండవచ్చో పరిశీలిస్తాం.

మనం ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి?

4-5. చిన్నవిగా కనిపించే పాపాల విషయంలో కూడా మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

4 కొన్ని పాపాలు చిన్నవిగా కనిపించవచ్చు కానీ, అవి యెహోవాతో మనకున్న బంధాన్ని బలహీనం చేస్తాయి. అంతేకాదు, ఘోరమైన పాపాలు చేయడానికి నడిపిస్తాయి.

5 తప్పు చేయాలనే ఒత్తిడి మనందరికీ వస్తుంది. అయితే, మనందరికీ వేర్వేరు బలహీనతలు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు, తప్పు చేయాలనే ప్రలోభాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి లైంగిక పాపం చేయాలనే ప్రలోభంతో పోరాడుతుండవచ్చు. ఇంకొకతను హస్తప్రయోగం లేదా అశ్లీల చిత్రాలు చూడడం లాంటి అపవిత్రమైన అలవాట్లతో పోరాడుతుండవచ్చు. మరొకతను మనుషుల భయం, పొగరు, కోపం లేదా ఇంకేదైనా ప్రలోభంతో పోరాడుతుండవచ్చు. యాకోబు చెప్పినట్టు“ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, వలలో పడేసి అతన్ని పరీక్షకు గురిచేస్తుంది.”—యాకో. 1:14.

6. మనం ఏ విషయాన్ని నిజాయితీగా గుర్తించాలి?

6 మీరు ఏ విషయాల్లో తేలిగ్గా ప్రలోభంలో పడిపోతారో మీకు తెలుసా? మన బలహీనతల్ని పట్టించుకోకపోవడం లేదా అస్సలు తప్పు చెయ్యమని అనుకోవడం ప్రమాదకరం. (1 యోహా. 1:8) ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే, “పరిణతిగల” క్రైస్తవులు కూడా ప్రలోభంలో పడిపోయే అవకాశం ఉందని పౌలు చెప్పాడు. (గల. 6:1) కాబట్టి మన బలహీనతలు ఏంటో నిజాయితీగా గుర్తించాలి.—2 కొరిం. 13:5.

7. మనం వేటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి? ఉదాహరణ చెప్పండి.

7 మనం ఏ విషయాల్లో త్వరగా ప్రలోభంలో పడిపోతామో గుర్తించిన తర్వాత, ఏం చేయాలి? వాటిని ఎదిరించి నిలబడడానికి గట్టిగా కృషి చేయాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ గమనించండి. బైబిలు కాలాల్లో ఒక నగర ప్రాకారంలో బలహీనమైన భాగం వాటి ద్వారాలే. కాబట్టి ఆ ద్వారాల దగ్గరే ఎక్కువమంది కాపలా కాసేవాళ్లు. అదేవిధంగా, మనం ఏ విషయాల్లో త్వరగా ప్రలోభానికి పడిపోతామో వాటిమీదే ఎక్కువ దృష్టిపెట్టాలి.—1 కొరిం. 9:27.

మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

8-9. సామెతలు 7వ అధ్యాయంలో ఉన్న యువకుడు ఘోరమైన పాపం చేయకుండా ఎలా తప్పించుకుని ఉండేవాడు? (సామె. 7:8, 9, 13, 14, 21)

8 ప్రలోభంలో పడిపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? సామెతలు 7వ అధ్యాయంలో ఉన్న యువకుని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఆలోచించండి. అతను అనైతిక స్త్రీతో లైంగిక పాపం చేశాడు. అతను “ఉన్నట్టుండి” ఆమెతో వెళ్లాడని 22వ వచనం చెప్తుంది. కానీ దానికి ముందున్న వచనాల్ని చూస్తే, అతను కొన్ని పనులు చేసి మెల్లిమెల్లిగా పాపం వైపు అడుగులు వేశాడు.

9 అతను ఏ పనులు చేశాడు? ముందుగా, అతను సాయంత్రం “ఆ [అనైతిక] స్త్రీ ఉన్న వీధి మలుపు దగ్గర నడిచాడు.” తర్వాత, “ఆమె ఇంటి వైపుగా అడుగులు వేశాడు.” (సామెతలు 7:8, 9 చదవండి.) ఆ తర్వాత, అతను ఆమెను చూసినప్పుడు ముఖం తిప్పేసుకోలేదు. బదులుగా తనకు ముద్దు పెట్టనిచ్చాడు. ఆమె ఏదో మంచిదని చూపించుకోవడానికి సమాధాన బలులు అర్పించానని చెప్తుంటే, అతను కూర్చుని విన్నాడు. (సామెతలు 7:13, 14, 21 చదవండి.) ఆ యువకుడు పాపానికి నడిపించే ఆ పనులు చేసుండకపోతే ప్రలోభం నుండి, పాపం నుండి తప్పించుకొని ఉండేవాడు.

10. సామెతలు పుస్తకంలోని యువకునిలాగే ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తి ఏ పొరపాటు చేసే అవకాశం ఉంది?

10 యెహోవాను ఆరాధించే ఎవ్వరికైనా ఏం జరగవచ్చో ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేసి ఆ తర్వాత ఇదంతా “ఉన్నట్టుండి,” “అనుకోకుండా జరిగింది” అని అనుకోవచ్చు. కానీ అతను చేసిన పాపం గురించి ఒకసారి వెనక్కెళ్లి ఆలోచిస్తే, దానికన్నా ముందు అతను కొన్ని తెలివితక్కువ పనులు చేసుండొచ్చు. అతను యెహోవాను ప్రేమించని వాళ్లతో స్నేహం చేయడం, చెడ్డ వినోదాన్ని ఎంచుకోవడం లేదా కొన్నిరకాల వెబ్‌సైట్స్‌ చూడడం, క్రైస్తవులకు తగని చోట్లకు వెళ్లడం లాంటివి చేసి ఉండవచ్చు. అంతేకాదు, బహుశా అతను ప్రార్థన చేయడం, బైబిలు చదవడం, మీటింగ్స్‌కి-ప్రీచింగ్‌కి వెళ్లడం ఆపేసివుండవచ్చు. సామెతలు పుస్తకంలో చర్చించుకున్న యువకునిలాగే ఇతను చేసిన పాపం కూడా “ఉన్నట్టుండి” చేసింది కాదు.

11. మనం పాపం చేయకూడదంటే దేనికి కూడా దూరంగా ఉండాలి?

11 మనకేంటి పాఠం? మనం పాపాన్నే కాదు పాపానికి నడిపించే పనుల్ని కూడా చేయకుండా ఉండాలి. అనైతిక స్త్రీ గురించి, యువకుని గురించి చెప్పిన తర్వాత సొలొమోను ఆ విషయాన్నే చెప్పాడు. ఆ స్త్రీ గురించి హెచ్చరిస్తూ ఆయనిలా అన్నాడు: “దారితప్పి ఆమె త్రోవల్లోకి వెళ్లకు.” (సామె. 7:25) ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఆమెకు చాలా దూరంగా ఉండు; ఆమె ఇంటి వాకిలి దగ్గరికి కూడా వెళ్లకు.” (సామె. 5:3, 8) కాబట్టి మనం పాపానికి నడిపించే పరిస్థితులకు దూరంగా ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. b దాంట్లో క్రైస్తవులకు తగని పనులకు, పరిస్థితులకు దూరంగా ఉండడం మాత్రమే కాదు, మనల్ని ప్రలోభానికి నెట్టేసే పనులకు కూడా దూరంగా ఉండాలి.—మత్త. 5:29, 30.

12. ఏం చేయాలని యోబు గట్టిగా నిర్ణయించుకున్నాడు? దానివల్ల ప్రలోభానికి ఎలా దూరంగా ఉండగలిగాడు? (యోబు 31:1)

12 పాపానికి నడిపించే పరిస్థితులకు దూరంగా ఉండాలంటే, జాగ్రత్తగా ఉండాలని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. యోబు అదే చేశాడు. వేరే స్త్రీని తప్పుడు దృష్టితో చూడకూడదని ఆయన ‘తన కళ్లతో ఒప్పందం చేసుకున్నాడు.’ (యోబు 31:1 చదవండి.) అలా గట్టిగా నిర్ణయించుకోవడం వల్ల వ్యభిచారానికి దూరంగా ఉండగలిగాడు. మనం కూడా ప్రలోభానికి నడిపించే దేనికైనా సరే, దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకోగలం.

13. మన ఆలోచనల విషయంలో కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (చిత్రాలు కూడా చూడండి.)

13 మన ఆలోచనల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. (నిర్గ. 20:17) తప్పు చేయనంత వరకు చెడు కోరికల గురించి ఊహించుకోవడంలో తప్పేమీ లేదని కొంతమంది అనుకుంటారు. కానీ అది కూడా తప్పే. ఒక వ్యక్తి అదేపనిగా చెడు కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటే అతను ఆ కోరికలతో రగిలిపోతాడు. ఒక విధంగా తప్పుచేయాలనే ప్రలోభాన్ని తిప్పికొట్టడం అతనికి ఇంకా కష్టమౌతుంది. నిజమే, మనందరికీ కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆ చెడు ఆలోచనను వెంటనే తీసేసుకొని, దాని స్థానంలో మంచి ఆలోచనల్ని నింపుకోవాలి. అలా చేసినప్పుడు, చెడు ఆలోచనలు తప్పుడు కోరికలుగా మారకుండా జాగ్రత్తపడతాం, ఘోరమైన పాపం చేయకుండా ఉంటాం.—ఫిలి. 4:8; కొలొ. 3:2; యాకో. 1:13-15.

ప్రలోభానికి నడిపించే దేనికైనా మనం దూరంగా ఉండాలి (13వ పేరా చూడండి)


14. ప్రలోభం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంకేం చేయవచ్చు?

14 ప్రలోభం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంకేం చేయవచ్చు? యెహోవా నియమాల్ని పాటిస్తే ఎప్పుడూ మనకే ప్రయోజనం అనే విషయాన్ని మనం గట్టిగా నమ్మాలి. కొన్నిసార్లు మన ఆలోచనలు, కోరికలు, లక్ష్యాలు దేవునికి నచ్చే విధంగా ఉంచుకోవడం కష్టం కావచ్చు. కానీ అలా ఉంచుకోవడానికి గట్టిగా కృషి చేసినప్పుడు చెప్పలేనంత మనశ్శాంతి పొందుతాం.

15. ప్రలోభాన్ని తిప్పికొట్టాలంటే ఏం చేయాలి?

15 మనం సరైన కోరికల్ని పెంచుకోవాలి. ‘చెడును ద్వేషించి, మంచిని ప్రేమించడం’ నేర్చుకుంటే, సరైనది చేయాలనే మన నిర్ణయం బలపడుతుంది. తప్పుచేసే పరిస్థితుల్ని తప్పించుకోగలుగుతాం. (ఆమో. 5:15) సరైన కోరికలు ఉంటే అనుకోకుండా వచ్చే ప్రలోభాల్ని కూడా గట్టిగా తిప్పికొట్టగలుగుతాం.

16. మనం సరైన కోరికల్ని ఎలా పెంచుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

16 మనం సరైన కోరికల్ని ఎలా పెంచుకోవచ్చు? మనం ఆధ్యాత్మిక పనుల్లో వీలైనంత ఎక్కువగా మునిగిపోవాలి. మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో ఉన్నప్పుడు తప్పుచేయాలనే ప్రలోభం రాదు గానీ యెహోవాను సంతోషపెట్టాలనే కోరిక బలపడుతుంది. (మత్త. 28:19, 20; హెబ్రీ. 10:24, 25) బైబిల్ని చదివి, అధ్యయనం చేసి, లోతుగా ఆలోచించినప్పుడు మంచిని ఎక్కువగా ప్రేమించగలుగుతాం, చెడును ఎక్కువగా ద్వేషించగలుగుతాం. (యెహో. 1:8; కీర్త. 1:2, 3; 119:97, 101) యేసు తన శిష్యులకు ఏం చెప్పాడో గుర్తుంచుకోండి: “ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా . . . ప్రార్థన చేస్తూ ఉండండి.” (మత్త. 26:41) మనం మన పరలోక తండ్రితో ప్రార్థనలో మాట్లాడినప్పుడు ఆయన సహాయం తీసుకుంటాం, ఆయన్ని సంతోషపెట్టాలనే మన కోరిక బలంగా తయారౌతుంది.—యాకో. 4:8.

ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉంటే ప్రలోభాల్ని తిప్పికొడతాం (16వ పేరా చూడండి) c


జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి

17. పేతురుకు ఏ మొండి బలహీనత ఉంది?

17 బహుశా మనం కొన్ని బలహీనతల నుండి పూర్తిగా బయటపడవచ్చు. కానీ ఇంకొన్ని బలహీనతలు చాలా మొండిగా ఉంటాయి. వాటిని తీసేసుకోవడం అంత తేలిక అవ్వకపోవచ్చు. అపొస్తలుడైన పేతురు గురించి ఆలోచించండి. ఆయన మనుషులకు భయపడి యేసు ఎవరో తెలీదని మూడుసార్లు అన్నాడు. (మత్త. 26:69-75) నిజానికి, మహాసభ ముందు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు పేతురు తన భయాన్ని అధిగమించినట్టు కనిపించింది. (అపొ. 5:27-29) కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, “సున్నతి పొందినవాళ్లకు భయపడి” క్రైస్తవులుగా మారిన అన్యులతో కలిసి భోజనం చేయడం ఆపేశాడు. (గల. 2:11, 12) అక్కడ పేతురులో ఉన్న భయం మళ్లీ నిద్రలేచింది. బహుశా పేతురు ఆ బలహీనత నుండి ఎప్పుడూ పూర్తిగా బయటపడి ఉండకపోవచ్చు.

18. కొన్ని బలహీనతల విషయంలో ఏం జరగవచ్చు?

18 మనకు కూడా అలాంటి పరిస్థితే ఎదురవ్వవచ్చు. ఎలా? బహుశా ఒక బలహీనతను మనం పూర్తిగా తీసేసుకున్నాం అని అనుకోవచ్చు, కానీ అది మళ్లీ నిద్రలేవచ్చు. ఉదాహరణకు, ఒక బ్రదర్‌ ఇలా చెప్పాడు: “నేను పదేళ్లపాటు అశ్లీల చిత్రాల జోలికే వెళ్లలేదు. ఇక నాకు ఆ సమస్య పూర్తిగా పోయిందని అనుకున్నాను. కానీ అదొక క్రూర జంతువులా అవకాశం దొరికితే మళ్లీ దాడిచేయడానికి దాక్కొని ఉంది.” మెచ్చుకోదగిన విషయం ఏంటంటే, ఆ సహోదరుడు తన బలహీనతతో పోరాడుతూనే ఉన్నాడు. ఈ సాతాను లోకంలో జీవించినంతకాలం, ప్రతీరోజు ఆ బలహీనతతో పోరాడుతూనే ఉండాలని ఆయన గుర్తించాడు. తన భార్య, అలాగే సంఘపెద్దల సహాయంతో అశ్లీల చిత్రాలు చూడకుండా ఉండడానికి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

19. మనల్ని ఎప్పుడూ వెంటాడే బలహీనతతో ఏం చేయవచ్చు?

19 మనల్ని ఎప్పుడూ వెంటాడే బలహీనతల విషయంలో మనం ఏం చేయవచ్చు? ప్రలోభం విషయంలో ‘మెలకువగా ఉండండి’ అని యేసు ఇచ్చిన సలహాను మనం పాటించవచ్చు. ఆ బలహీనతను పూర్తిగా తీసేసుకున్నామని అనిపించినప్పుడు కూడా, ప్రలోభానికి నడిపించే పరిస్థితులకు దూరంగానే ఉండండి. (1 కొరిం. 10:12) మీరు ఆ బలహీనతను తీసేసుకోవడానికి ఏమేం చేశారో వాటిని చేస్తూనే ఉండండి. సామెతలు 28:14 ఇలా చెప్తుంది: “ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు సంతోషంగా ఉంటాడు.”—2 పేతు. 3:14.

జాగ్రత్తగా ఉండండి, ప్రయోజనాలు పొందండి

20-21. (ఎ) ప్రలోభం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఏ ప్రయోజనాలు వస్తాయి? (బి) మనవంతు మనం చేస్తే, యెహోవా తన వంతుగా ఏం చేస్తాడు? (2 కొరింథీయులు 4:7)

20 ప్రలోభంలో పడకుండా చూసుకోవడానికి మనం చేసే కష్టం ఊరికేపోదు. పాపం వల్ల వచ్చే ఏ “తాత్కాలిక” సుఖం కన్నా, యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించడం వల్ల వెయ్యి రెట్లు ఎక్కువ సంతోషం పొందుతాం. (హెబ్రీ. 11:25; కీర్త. 19:8) ఎందుకంటే, మనం తన ఇష్టానికి తగ్గట్టు జీవించడానికే సృష్టించబడ్డాం. (ఆది. 1:27) అలా మనం స్వచ్ఛమైన మనస్సాక్షితో ఉంటాం, శాశ్వత జీవితం సంపాదించుకునే లిస్టులో ఉంటాం.—1 తిమో. 6:12; 2 తిమో. 1:3; యూదా 20, 21.

21 నిజమే, మన ‘శరీరం బలహీనం.’ అంతమాత్రాన మనం మన బలహీనతల విషయంలో ఏం చేయలేమని కాదు. ఎందుకంటే మనకు కావాల్సిన శక్తిని ఇవ్వడానికి యెహోవా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. (2 కొరింథీయులు 4:7 చదవండి.) ఆయన మనకు అసాధారణ శక్తిని ఇస్తాడు అనే విషయాన్ని గమనించండి. మనకు ఆ శక్తి కావాలంటే, ప్రలోభంలో పడిపోకుండా ఉండడానికి మనవంతు మనం కృషి చేస్తూనే ఉండాలి, అది మన బాధ్యత! అలా చేసినప్పుడు, అసాధారణ శక్తి కావాలని మనం చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (1 కొరిం. 10:13) అవును, యెహోవా సహాయంతో మనం ఏ ప్రలోభాన్నైనా తిప్పికొట్టవచ్చు.

పాట 47 ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించండి

a పదాల వివరణ: యేసు మత్తయి 26:41 లో “మనసు” అని అన్నప్పుడు, మనం సరైనది చేయడానికే ఇష్టపడతామని చెప్తున్నాడు. “శరీరం” అని అన్నప్పుడు, మనలో ఉన్న అపరిపూర్ణత, పాపం వల్ల తరచూ చెడు విషయాలు ఆలోచిస్తామని, చెడ్డ పనులు చేస్తామని చెప్తున్నాడు. కాబట్టి, కొన్నిసార్లు మనం సరైనది చేయాలని కోరుకున్నా సరే, జాగ్రత్తగా లేకపోతే మన అపరిపూర్ణ కోరికల వల్ల తప్పు చేస్తాం.

c చిత్రాల వివరణ: ఒక బ్రదర్‌ ఉదయాన్నే దినవచనం చదువుతున్నాడు, లంచ్‌ బ్రేక్‌లో బైబిలు చదువుతున్నాడు, సాయంత్రం మీటింగ్‌ హాజరౌతున్నాడు.