కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 27

పాట 73 మాకు ధైర్యాన్నివ్వు

సాదోకులా ధైర్యంగా ఉండండి

సాదోకులా ధైర్యంగా ఉండండి

“బలం, ధైర్యం ఉన్న యువకుడైన సాదోకు.”1 దిన. 12:28.

ముఖ్యాంశం

మనం ధైర్యంగా ఉండడానికి సాదోకు ఉదాహరణ ఎలా సహాయం చేస్తుందో చూస్తాం.

1-2. సాదోకు ఎవరు? (1 దినవృత్తాంతాలు 12:22, 26-28)

 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఇశ్రాయేలు మీద దావీదును రాజుగా చేయడానికి 3,40,000 కన్నా ఎక్కువమంది పురుషులు సమకూడారు. మూడు రోజులపాటు వాళ్లు చాలా సందడి చేశారు. కేరింతలు కొడుతూ హెబ్రోను దగ్గర పర్వత ప్రాంతంలో వాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. (1 దిన. 12:39) అంతపెద్ద గుంపులో సాదోకు అనే యువకుడు కూడా ఉన్నాడు. బహుశా ఆయన్ని ఎవరూ గుర్తించి ఉండకపోవచ్చు. కానీ యెహోవా ఆయన్ని గుర్తించాడు. మనం కూడా ఆయన్ని గుర్తించేలా చేశాడు. (1 దినవృత్తాంతాలు 12:22, 26-28 చదవండి.) ఇంతకీ సాదోకు ఎవరు?

2 సాదోకు ఒక యాజకుడు. ఆయన ప్రధానయాజకుడైన అబ్యాతారుతో కలిసి పనిచేశాడు. సాదోకు దేవుని ఇష్టమేంటో చెప్పగలిగే ఒక ప్రవక్త కూడా. దేవుడు ఆయనకు చాలా తెలివితేటలు ఇచ్చాడు. (2 సమూ. 15:27) అందుకే ప్రజలు తెలివైన సలహా కోసం ఆయన దగ్గరకు వచ్చేవాళ్లు. ఆయనకు ధైర్యం కూడా ఎక్కువే. ఆయనకున్న ఈ లక్షణం గురించే ఈ ఆర్టికల్‌లో మనం చూస్తాం.

3. (ఎ) మనకు ఎందుకు ధైర్యం అవసరం? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 ఈ చివరి రోజుల్లో సాతాను దేవుని ప్రజల మీద ఇంకా ఎక్కువ దాడి చేస్తున్నాడు. (1 పేతు. 5:8) సాతానును అలాగే ఈ చెడ్డ లోకాన్ని యెహోవా నాశనం చేసేంతవరకు మనం ధైర్యం చూపించాలి. (కీర్త. 31:24) కాబట్టి మనం సాదోకులా ధైర్యం చూపించే మూడు విధానాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుని రాజ్యానికి మద్దతివ్వండి

4. దేవుని రాజ్యానికి మద్దతివ్వడానికి యెహోవా ప్రజలకు ఎందుకు ధైర్యం కావాలి? (చిత్రం కూడా చూడండి.)

4 యెహోవా ప్రజలుగా మనం మనస్ఫూర్తిగా దేవుని రాజ్యానికి మద్దతిస్తాం. కానీ చాలావరకు అలా చేయాలంటే మనకు ధైర్యం అవసరం. (మత్త. 6:33) ఉదాహరణకు, ఈ చెడ్డ లోకంలో యెహోవా ప్రమాణాల ప్రకారం బ్రతకడానికి, దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడానికి మనకు ధైర్యం కావాలి. (1 థెస్స. 2:2) అంతేకాదు, విభజనలతో నిండిన ఈ లోక రాజకీయాల్లో మనం ఎవ్వరి పక్షం తీసుకోవద్దంటే చాలా ధైర్యం కావాలి. (యోహా. 18:36) అలాగే చాలామంది దేవుని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో, మిలిటరీలో చేరనందుకు దెబ్బలు తిన్నారు, ఆఖరికి జైలుకు కూడా వెళ్లారు.

వేరేవాళ్లు రాజకీయ విషయాల్లో ఎవరో ఒకరి పక్షం తీసుకుంటే, మీరు ఏం చేస్తారు? (4వ పేరా చూడండి)


5. దావీదుకు మద్దతివ్వడానికి సాదోకుకు ధైర్యం ఎందుకు అవసరమైంది?

5 సాదోకు దావీదును రాజును చేసి, సంబరాలు చేసుకోవడానికి మాత్రమే హెబ్రోనుకు రాలేదు. ఆయన ఆయుధాలతో యుద్ధానికి సిద్ధపడి వచ్చాడు. (1 దిన. 12:38) దావీదు వెన్నంటే ఉండడానికి, ఇశ్రాయేలు శత్రువులతో పోరాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే, సాదోకుకు సైనికుడిగా అంత అనుభవం లేకపోవచ్చు కానీ, ధైర్యం మాత్రం చాలా ఉంది.

6. సాదోకుకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? (కీర్త. 138:3)

6 సాదోకులాంటి ఒక యాజకునికి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? బలం, ధైర్యం ఉన్న మనుషులు ఆయన చుట్టూ ఉండేవాళ్లు. వాళ్లను చూసి ఈయన ధైర్యం తెచ్చుకున్నాడు. ఉదాహరణకు, దావీదు ధైర్యంగా ‘యుద్ధాల్లో ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించాడు.’ అది చూసి ఇశ్రాయేలీయులందరూ ఆయన్ని రాజును చేయాలనుకున్నారు. (1 దిన. 11:1, 2) శత్రువులతో పోరాడడానికి దావీదు ఎప్పుడూ యెహోవా మీద ఆధారపడ్డాడు. (కీర్త. 28:7; కీర్తన 138:3 చదవండి.) దావీదును మాత్రమే కాదు ఇంకొంతమంది పురుషుల్ని చూసి కూడా సాదోకు ధైర్యం తెచ్చుకున్నాడు. వాళ్లెవరంటే, యెహోయాదా అలాగే ఆయన కుమారుడైన బెనాయా. వీళ్లతోపాటు 22 మంది అధిపతులు కూడా ఉన్నారు. (1 దిన. 11:22-25; 12:26-28) వీళ్లంతా కలిసి దావీదును రాజును చేసి, ఆయన మీద ఈగ కూడా వాలకుండా చూసుకున్నారు.

7. (ఎ) మన కాలంలో ఎవర్ని చూసి ధైర్యం తెచ్చుకోవచ్చు? (బి) వీడియోలో ఉన్న బ్రదర్‌ ఎన్‌సిలు నుండి మీరేం నేర్చుకున్నారు?

7 యెహోవాకు, ఆయన రాజ్యానికి ధైర్యంగా మద్దతిచ్చిన వాళ్ల ఆదర్శాన్ని చూసి మనం బలం, ధైర్యం తెచ్చుకోవచ్చు. మన రాజైన యేసుక్రీస్తు సాతాను వ్యవస్థలోని రాజకీయాల్లో తలదూర్చాలనే ఒత్తిడిని ధైర్యంగా ఎదిరించాడు. (మత్త. 4:8-11; యోహా. 6:14, 15) ఆయన బలం కోసం ఎప్పుడూ యెహోవా మీద ఆధారపడ్డాడు. మనకాలంలో కూడా మిలిటరీలో చేరడానికి లేదా రాజకీయాల్లో పాల్గొనడానికి ధైర్యంగా తిరస్కరించిన ఎంతోమంది యువకులు ఉన్నారు. మనం వాళ్ల గురించి jw.orgలో చూడవచ్చు. a

బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయండి

8. సంఘపెద్దలు ఎప్పుడు ధైర్యం చూపించాల్సి రావచ్చు?

8 యెహోవా ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ముందుంటారు. (2 కొరిం. 8:4) అయితే, అలా చేయాలంటే కొన్నిసార్లు చాలా ధైర్యం కావాలి. ఉదాహరణకు, యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రదర్స్‌సిస్టర్స్‌కి ప్రోత్సాహం, మద్దతు అవసరం. అంతేకాదు బహుశా వాళ్లకు బైబిళ్లు, ప్రచురణలు, తలదాచుకోవడానికి ఒక చోటు, ఆహారం, బట్టలు కావాలని స్థానిక సంఘపెద్దలు గుర్తించవచ్చు. గొర్రెల మీదున్న ప్రేమతో వాళ్లకు అవసరమైంది ఇవ్వడానికి సంఘపెద్దలు తమ ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు. (యోహా. 15:12, 13) ఈ విషయంలో వాళ్లు సాదోకులా ధైర్యం చూపిస్తారు.

9. రెండో సమూయేలు 15:27-29 ప్రకారం, దావీదు సాదోకుకు ఏ పని అప్పగించాడు? (చిత్రం కూడా చూడండి.)

9 దావీదు ప్రాణం ప్రమాదంలో ఉంది. తన కొడుకు అబ్షాలోము తనను చంపి రాజవ్వాలని అనుకున్నాడు. (2 సమూ. 15:12, 13) అప్పుడు దావీదు ఉన్నపళంగా యెరూషలేమును వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఆయన తన సేవకులతో ఇలా అన్నాడు: “లేవండి, మనం ఇక్కడి నుండి పారిపోదాం; లేదంటే, అబ్షాలోము చేతిలో నుండి మనలో ఎవ్వరం తప్పించుకోలేం!” (2 సమూ. 15:14) తన సేవకులందరూ పారిపోతున్నప్పుడు అబ్షాలోము వేసే పన్నాగాలు తనకు చేరవేయడానికి ఎవరో ఒకరు యెరూషలేములోనే ఉండాలని దావీదుకు అనిపించింది. కాబట్టి ఆయన సాదోకును, ఇంకొంతమంది యాజకుల్ని అక్కడే ఉండి, ఎప్పటికప్పుడు తనకు సమాచారాన్ని చేరవేయమని చెప్పాడు. (2 సమూయేలు 15:27-29 చదవండి.) అయితే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే, ఆ యాజకులు చేసే పనివల్ల వాళ్ల ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకంటే, అబ్షాలోము చాలా స్వార్థపరుడు, క్రూరుడు, కన్న తండ్రినే చంపాలని చూసిన కసాయోడు. అలాంటిది, సాదోకు అలాగే మిగతా యాజకులు దావీదు ప్రాణాల్ని కాపాడడానికి ఆ పని చేస్తున్నారని తెలిస్తే వాళ్లను ప్రాణాలతో వదిలేస్తాడా!

దావీదు సాదోకును ఒక ప్రమాదకరమైన పని మీద పంపించాడు (9వ పేరా చూడండి)


10. సాదోకు, అతనితోపాటు ఉన్నవాళ్లు దావీదు ప్రాణాల్ని ఎలా కాపాడారు?

10 దావీదు సాదోకుతో, హూషై అనే మరో నమ్మకస్థుడైన స్నేహితునితో కలిసి ఒక ప్లాన్‌ వేశాడు. (2 సమూ. 15:32-37) దాని ప్రకారం హూషై అబ్షాలోముకు మద్దతిస్తున్నట్లు నటించి దావీదుపై ఎలా దాడి చేయాలో సలహా ఇస్తాడు. అప్పుడు ఆ దాడికి సిద్ధపడడానికి దావీదుకు సమయం దొరుకుతుంది. తర్వాత హూషై జరిగిన విషయాన్ని సాదోకుకు, అబ్యాతారుకు చెప్పాడు. (2 సమూ. 17:8-16) ఈ ఇద్దరు ఆ సమాచారాన్ని దావీదుకు చేరవేశారు. (2 సమూ. 17:17) యెహోవా సహాయంతో సాదోకు, ఆయన తోటి యాజకులు దావీదు ప్రాణాల్ని కాపాడడానికి చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు.—2 సమూ. 17:21, 22.

11. మనం సాదోకులా ధైర్యం ఎలా చూపించవచ్చు?

11 ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయమని మిమ్మల్ని అడిగితే సాదోకులాగే ఎలా ధైర్యం చూపించవచ్చు? (1) నిర్దేశాల్ని పాటించండి. అలాంటి పరిస్థితిలో ఐక్యంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి స్థానిక బ్రాంచి కార్యాలయం ఇచ్చే నిర్దేశాల్ని పాటించండి. (హెబ్రీ. 13:17) ఏదైనా విపత్తు వస్తే ఎలా సిద్ధంగా ఉండాలో, దానికోసం ఏమేం చేయాలో అని సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని సంఘపెద్దలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. (1 కొరిం. 14:33, 40) (2) ధైర్యం చూపిస్తూనే జాగ్రత్తలు పాటించండి. (సామె. 22:3) కాస్త తెలివిగా ఉండండి. అనవసరమైన సాహసాలు చేయకండి. (3) యెహోవా మీద ఆధారపడండి. యెహోవాకు మీ భద్రత అలాగే మీ తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ భద్రత చాలా ప్రాముఖ్యమని మర్చిపోకండి. కాబట్టి బ్రదర్స్‌-సిస్టర్స్‌ సురక్షితంగా ఉండడానికి మీరు చేసే ప్రతీ పనిలో ఆయన తోడు ఉంటాడు.

12-13. విక్టర్‌, విటలీ అనుభవాల నుండి మీరేం నేర్చుకున్నారు? (చిత్రం కూడా చూడండి.)

12 విక్టర్‌ అలాగే విటలీ అనే ఇద్దరు సంఘపెద్దలు యుక్రెయిన్‌లో ఉన్న తమ బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఇళ్లకు ఆహారాన్ని, మంచినీళ్లను తీసుకెళ్లి అందించారు. విక్టర్‌ ఇలా చెప్తున్నాడు: “మేము ఆహారం కోసం అంతా తిరిగాం. చాలావరకు మా దారంతా కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉండేవి. ఒక బ్రదర్‌ తన షాపు నుండి ఆహారాన్ని విరాళంగా ఇచ్చాడు. దానివల్ల మన బ్రదర్స్‌సిస్టర్స్‌లో చాలామంది కొన్ని రోజులపాటు కడుపు నింపుకోగలిగారు. మేము ఆహారాన్ని ట్రక్కులోకి ఎక్కిస్తున్నప్పుడు కూడా, మా ముందు దాదాపు 66 అడుగుల దూరంలో ఒక బాంబు పడింది. బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయడానికి కావల్సిన ధైర్యాన్ని ఇవ్వమని రోజంతా యెహోవాను అడుగుతూనే ఉన్నాను.”

13 విటలీ ఇలా చెప్తున్నాడు: “ఆ పని చేయడానికి మాకు చాలా ధైర్యం అవసరమైంది. మొట్టమొదటిసారి బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఆహారాన్ని ఇవ్వడానికి 12 గంటలు పట్టింది. దారంతా నేను యెహోవాకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను.” విటలీ ధైర్యం చూపిస్తూనే జాగ్రత్తలు కూడా పాటించాడు. ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు: “తెలివి, అణకువ కోసం యెహోవాను అడుగుతూనే ఉన్నాను. నేను అధికారులు అనుమతించిన రోడ్డులోనే బండి నడుపుకుంటూ వెళ్లాను. బ్రదర్స్‌-సిస్టర్స్‌ కలిసి పనిచేయడం కళ్లారా చూసినప్పుడు నా విశ్వాసం చాలా బలపడింది. వాళ్లు రోడ్డు మీదున్న చెత్తంతా శుభ్రం చేస్తూ ఆహారాన్ని, బట్టల్ని, ఇంకా అవసరమైన మిగతా వాటిని సేకరించి ట్రక్కులోకి ఎక్కించేవాళ్లు. అంతేకాదు నాకూ, విక్టర్‌కి భోజనం పెట్టేవాళ్లు. దారి మధ్యలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేసేవాళ్లు.”

ప్రమాదకరమైన పరిస్థితుల్లో బ్రదర్స్‌-సిస్టర్స్‌కి సహాయం చేస్తున్నప్పుడు ధైర్యం చూపిస్తూనే జాగ్రత్తలు కూడా తీసుకోండి (12-13 పేరాలు చూడండి)


యెహోవాకు నమ్మకంగా ఉండండి

14. కుటుంబ సభ్యుడో లేదా ప్రాణ స్నేహితుడో యెహోవాను వదిలేస్తే మనకు ఎలా అనిపించవచ్చు?

14 కొన్ని కష్టాలు మనకు మానని గాయాలు చేయవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుడో లేదా ప్రాణ స్నేహితుడో యెహోవాను వదిలేస్తే మన గుండె ముక్కలైపోవచ్చు. (కీర్త. 78:40; సామె. 24:10) ఆ వ్యక్తితో మనకు ఎంత దగ్గరి బంధం ఉంటే, ఆ పరిస్థితిని జీర్ణించుకోవడం మనకు అంత కష్టం కావచ్చు. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి వస్తే, నమ్మకంగా ఉన్న సాదోకు ఉదాహరణ మీకు సహాయం చేస్తుంది.

15. యెహోవాకు నమ్మకంగా ఉండడానికి సాదోకుకు ధైర్యం ఎందుకు అవసరమైంది? (1 రాజులు 1:5-8)

15 తన ప్రాణ స్నేహితుడు అబ్యాతారు యెహోవాకు నమ్మకంగా లేకపోయినా, సాదోకు మాత్రం నమ్మకంగా ఉన్నాడు. ఇది దావీదు పరిపాలన ముగింపులో జరిగిన సంఘటన. దావీదు ముసలివాడై, మంచాన పడినప్పుడు తన సింహాసనాన్ని సొలొమోనుకు ఇస్తానని యెహోవా మాటిచ్చాడు. కానీ దావీదు కొడుకు అదోనీయా ఆ సింహాసనాన్ని చేజిక్కించ్చుకోవాలని అనుకున్నాడు. (1 దిన. 22:9, 10) అబ్యాతారు అదోనీయాకు మద్దతివ్వాలని అనుకున్నాడు. (1 రాజులు 1:5-8 చదవండి.) అలాచేయడం వల్ల, అబ్యాతారు దావీదుకే కాదు యెహోవాకు కూడా నమ్మకద్రోహం చేశాడు. అప్పుడు సాదోకు ఎంత బాధ, వేదన అనుభవించి ఉంటాడో ఊహించుకోగలరా? ఎందుకంటే వాళ్లిద్దరు కలిసి యాజకులుగా 40 కన్నా ఎక్కువ సంవత్సరాలు పనిచేశారు. (2 సమూ. 8:17) అంతేకాదు, వాళ్లిద్దరు కలిసి “సత్యదేవుని మందసాన్ని” మోశారు. (2 సమూ. 15:29) మొదట్లో వాళ్లిద్దరూ దావీదు రాజరికానికి మద్దతిచ్చారు. యెహోవా సేవలో ఎన్నో పనులు కలిసి చేశారు.—2 సమూ. 19:11-14.

16. సాదోకు ఎలా నమ్మకంగా ఉండగలిగాడు?

16 అబ్యాతారు నమ్మకంగా లేకపోయినా, సాదోకు మాత్రం యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. అలాగే సాదోకు దావీదు నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదోనీయా పన్నాగం బయట పడ్డాక దావీదు సాదోకును, నాతానును, బెనాయాను నమ్మి సొలొమోనును రాజును చేశాడు. (1 రాజు. 1:32-34) నాతాను అలాగే మిగతావాళ్లు దావీదుకు, యెహోవాకు నమ్మకంగా ఉండడం చూసి సాదోకు కూడా నమ్మకంగా ఉండగలిగాడు. (1 రాజు. 1:38, 39) సొలొమోను రాజైనప్పుడు ఆయన “అబ్యాతారు స్థానంలో సాదోకును యాజకునిగా నియమించాడు.”—1 రాజు. 2:35.

17. మీకు బాగా కావాల్సినవాళ్లు యెహోవాను వదిలేస్తే, సాదోకులా మీరు ఏం చేయవచ్చు?

17 మీరు సాదోకులా ఏం చేయవచ్చు? మీకు బాగా కావాల్సినవాళ్లు యెహోవాను వదిలేసినా మీరు మాత్రం నమ్మకంగా ఉండండి. (యెహో. 24:15) మీకు కావాల్సిన బలం, ధైర్యం యెహోవా ఇస్తాడు. కాబట్టి ప్రార్థనలో ఆయన మీద ఆధారపడండి, ఆయనకు నమ్మకంగా ఉన్నవాళ్లతో దగ్గరగా ఉండండి. మీరు యెహోవాకు నమ్మకంగా ఉంటే ఆయన మీకు చాలా విలువిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు.—2 సమూ. 22:26.

18. మార్కో, సిద్‌సే అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

18 మార్కో, ఆయన భార్య సిద్‌సే అనుభవం పరిశీలించండి. వాళ్ల ఎదిగిన ఇద్దరు కూతుళ్లు సత్యాన్ని వదిలేసి వెళ్లారు. మార్కో ఇలా చెప్తున్నాడు: “పిల్లలు పుట్టిన క్షణం నుండే వాళ్లను ఎంతో ప్రేమిస్తాం. వాళ్లకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాం. కానీ వాళ్లు యెహోవాను వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడు గుండె పగిలిపోతుంది. అయితే, ఆ బాధను తట్టుకోవడానికి యెహోవా సహాయం చేశాడు. నేను బలహీనంగా ఉన్నప్పుడు నా భార్య బలంగా ఉండేలా, నా భార్య బలహీనంగా ఉన్నప్పుడు నేను బలంగా ఉండేలా యెహోవా చేశాడు.” సిద్‌సే ఇలా అంటుంది: “మాకు కావాల్సిన బలం యెహోవా ఇవ్వకపోయుంటే ఈ కష్టాన్ని మేము తట్టుకునేవాళ్లం కాదు. మా పిల్లలు చేసిన పనికి తప్పంతా నాదే అని కుమిలిపోయాను. నాకు ఎలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పుకున్నాను. అలా చెప్పుకున్న కొంత సమయానికే, చాలా సంవత్సరాలుగా నన్ను కలవని ఒక సిస్టర్‌ నన్ను కలిసింది. ఆమె నా భుజం తడుతూ, నా కళ్లలోకి చూస్తూ ‘గుర్తుంచుకో సిద్‌సే ఇందులో నీ తప్పేమీ లేదు’ అంది. యెహోవా సహాయంతో నేను ఆయన సేవలో సంతోషాన్ని కాపాడుకోగలిగాను.”

19. మీరు ఏమని నిర్ణయించుకున్నారు?

19 తన ఆరాధకులందరూ సాదోకులాగే ధైర్యంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (2 తిమో. 1:7) అయితే, మనం మన సొంత శక్తి మీద కాదుగానీ తన మీద ఆధారపడాలని యెహోవా ఆశిస్తున్నాడు. కాబట్టి ధైర్యం అవసరమైన సందర్భాల్లో యెహోవావైపు చూడండి. అప్పుడు సాదోకులాగే మీరు కూడా ధైర్యంగా ఉండేలా ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు!—1 పేతు. 5:10.

పాట 126 మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి