కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన లేస్తాడని నాకు తెలుసు

ఆయన లేస్తాడని నాకు తెలుసు

‘మన స్నేహితుడు నిద్రపోతున్నాడు, అతన్ని లేపడానికి వెళ్తున్నాను.’యోహా. 11:11.

పాటలు: 142, 129

1. తన సోదరుని విషయంలో మార్త ఏ నమ్మకంతో ఉంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

 యేసుకు మంచి స్నేహితురాలు, శిష్యురాలు అయిన మార్త ఏడుస్తోంది. ఎందుకంటే ఆమె సోదరుడైన లాజరు చనిపోయాడు. ఆమెను ఓదార్చే విషయం ఏదైనా ఉందా? ఉంది. యేసు ఆమెకిలా మాటిచ్చాడు, “నీ సోదరుడు లేస్తాడు.” నిజమే, ఆ ఒక్క మాట ఆమె బాధను పూర్తిగా పోగొట్టలేదు. అయినాసరే మార్త యేసు మాట మీద నమ్మకముంచి ఇలా అంది, “చివరి రోజున పునరుత్థానం జరిగే సమయంలో లేస్తాడని నాకు తెలుసు.” (యోహా. 11:20-24) అవును, భవిష్యత్తులో పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుందని ఆమె నమ్మింది. కానీ యేసు ఒక అద్భుతం చేశాడు, ఆయన అప్పటికప్పుడే లాజరును పునరుత్థానం చేశాడు.

2. పునరుత్థానం ఉందని మార్తలాగే మీరు కూడా ఎందుకు నమ్ముతున్నారు?

2 యేసుగానీ, ఆయన తండ్రిగానీ చనిపోయిన మన ఆప్తుల్ని ఇప్పుడే పునరుత్థానం చేస్తారని మనం ఆశించలేము. భవిష్యత్తులో మాత్రం పునరుత్థానం జరుగుతుందని మార్త నమ్మినంత బలంగా మీరు నమ్ముతున్నారా? బహుశా మీ భర్త లేదా భార్య చనిపోయి ఉండవచ్చు. లేదా మీ అమ్మనో, నాన్ననో; మీకెంతో ఇష్టమైన అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలనో; లేదా అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ పిల్లలనో మరణంలో పోగొట్టుకుని ఉండవచ్చు. వాళ్లను గుండెలకు హత్తుకోవాలని, వాళ్లతో మాట్లాడాలని, కలిసి ఆనందంగా గడపాలని మీరెంతో ఆత్రుతతో ఎదురుచూస్తుండవచ్చు. సంతోషకరంగా, మార్తలాగే మీరు కూడా ‘నా ప్రియమైనవాళ్లు పునరుత్థానం అవుతారని నాకు తెలుసు’ అని అనడానికి సరైన కారణం ఉంది. అయినప్పటికీ పునరుత్థానాన్ని ఎందుకు నమ్ముతున్నామో పరిశీలించుకోవడం ద్వారా మనందరం ప్రయోజనం పొందుతాం.

3, 4. యేసు ఎవరెవర్ని పునరుత్థానం చేశాడు? అది మార్త విశ్వాసాన్ని ఎలా బలపర్చివుంటుంది?

3 మార్త యెరూషలేము దగ్గర్లో ఉండేది. కాబట్టి, గలిలయలోని నాయీనులో ఉండే విధవరాలి కొడుకును యేసు పునరుత్థానం చేయడం ఆమె చూసి ఉండకపోవచ్చు. కానీ దానిగురించి వినివుంటుంది. యేసు యాయీరు కూతుర్ని పునరుత్థానం చేయడం గురించి కూడా ఆమె వినివుంటుంది. ఆ అమ్మాయి ‘చనిపోయిందని’ వాళ్లింట్లో అందరికీ తెలుసు. అయినాసరే యేసు ఆ అమ్మాయి చేతిని పట్టుకుని, “పాపా, లే!” అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. (లూకా 7:11-17; 8:41, 42, 49-55) యేసు రోగుల్ని బాగుచేయగలడనే విషయం మార్తకు, ఆమె సోదరైన మరియకు తెలుసు. అందుకే యేసు తమతోపాటు ఉండివుంటే లాజరు చనిపోయేవాడు కాదని వాళ్లు అనుకున్నారు. ఏదేమైనా యేసు ప్రియ మిత్రుడైన లాజరు చనిపోయాడు, మరి మార్త దేనికోసం ఎదురుచూసింది? లాజరు “చివరి రోజున” అంటే భవిష్యత్తులో పునరుత్థానం అవుతాడని మార్త చెప్పడాన్ని గమనించండి. ఆ విషయాన్ని ఆమె అంత బలంగా ఎందుకు నమ్మింది? భవిష్యత్తులో పునరుత్థానం జరుగుతుందని, వాళ్లలో మీ ఆప్తులు కూడా ఖచ్చితంగా ఉంటారని మీరెందుకు నమ్మవచ్చు?

4 పునరుత్థానంపై విశ్వాసం ఉంచడానికి సరైన కారణాలే ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చర్చిద్దాం. అంతేకాదు, పునరుత్థానానికి సంబంధించి మీరు ఇప్పటివరకు ఆలోచించని కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. చనిపోయిన మీ ప్రియమైనవాళ్లను తిరిగి చూస్తారనే మీ విశ్వాసాన్ని అవి మరింత బలపరుస్తాయి.

మనకు నిరీక్షణనిచ్చే సంఘటనలు

5. లాజరు ఖచ్చితంగా పునరుత్థానం అవుతాడని మార్తకు ఎలా తెలుసు?

5 మార్త మాటల్ని గమనించారా? ‘నా సోదరుడు పునరుత్థానం అవుతాడు అనుకుంట’ అని ఆమె అనలేదుగానీ, “లేస్తాడని నాకు తెలుసు” అంది. మార్తకు అంత నమ్మకం ఎలా కలిగింది? గతంలో జరిగిన పునరుత్థానాల గురించి ఆమెకు తెలుసు. బహుశా చిన్నప్పుడు వాటిగురించి తన ఇంట్లో లేదా సభా మందిరంలో వినివుంటుంది. అయితే బైబిల్లో నమోదు చేయబడిన పునరుత్థానాల్లో మూడింటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

6. మార్తకు ఏ అద్భుతం గురించి ఖచ్చితంగా తెలిసేవుంటుంది?

6 దేవుడు ఏలీయా ప్రవక్తకు అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చిన కాలంలోనే మొట్టమొదటి పునరుత్థానం జరిగింది. ఇశ్రాయేలుకు ఉత్తరాన, ఫేనీకే పట్టణమైన సారెపతులో ఒక పేద విధవరాలు ఉండేది, ఆమె ఏలీయాకు ఆతిథ్యమిచ్చింది. ఆ సమయంలో యెహోవా ఒక అద్భుతం చేశాడు. అదేమిటంటే ఆ విధవరాలి దగ్గరున్న పిండిని, నూనెను తగ్గిపోకుండా చేసి ఆమె, ఆమె కొడుకూ ప్రాణాలతో ఉండడానికి సహాయం చేశాడు. (1 రాజు. 17:8-16) కొంతకాలానికి ఆమె కొడుకు జబ్బుపడి చనిపోయాడు. కానీ ఏలీయా ఆమెకు సహాయం చేశాడు. ఆయన ఆ అబ్బాయిని ముట్టుకుని, “నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్ము” అని యెహోవాకు ప్రార్థించాడు. ఏలీయా ప్రార్థించినట్లుగానే జరిగింది! దేవుడు ఏలీయా మొర విన్నాడు, ఆ అబ్బాయి తిరిగి ప్రాణాలతో లేచాడు. బైబిల్లో నమోదైన మొదటి పునరుత్థానం అదే. (1 రాజులు 17:17-24 చదవండి.) ఈ ఆశ్చర్యకరమైన సంఘటన మార్తకు ఖచ్చితంగా తెలిసేవుంటుంది.

7, 8. (ఎ) కడుపుకోత అనుభవిస్తున్న ఒక తల్లిని ఎలీషా ఎలా ఓదార్చాడు? (బి) ఎలీషా చేసిన అద్భుతం యెహోవాకు ఏ శక్తి ఉందని రుజువు చేసింది?

7 బైబిల్లో నమోదైన రెండవ పునరుత్థానాన్ని ఎలీషా ప్రవక్త చేశాడు. షూనేము అనే పట్టణంలో నివసిస్తున్న ఇశ్రాయేలీయురాలైన ఒక స్త్రీకి పిల్లలు పుట్టలేదు. ఆమె ఎలీషాకు ఉదారంగా ఆతిథ్యమిచ్చినందుకు యెహోవా ఆమెనూ, ముసలివాడైన ఆమె భర్తనూ దీవించి ఒక మగబిడ్డనిచ్చాడు. కానీ కొన్నేళ్లకు ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తల్లి అనుభవించిన కడుపుకోతను మీరు ఊహించుకోగలరా? ఆమె దుఃఖంతో, ఎలీషాను కలవడానికి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆమె కొడుకును బ్రతికించమని ఎలీషా తన సేవకుడైన గేహజీని పంపించాడు. కానీ ఆ పని గేహజీ వల్ల కాలేదు. దాంతో ఆమె ఎలీషాను వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లింది.—2 రాజు. 4:8-31.

8 చనిపోయిన ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి ఎలీషా ప్రార్థించాడు. యెహోవా ఆయన ప్రార్థన విని ఆ అబ్బాయిని అద్భుతరీతిలో బ్రతికించాడు. తన కొడుకును ప్రాణాలతో చూసిన ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి! (2 రాజులు 4:32-37 చదవండి.) బహుశా ఆ క్షణంలో, హన్నా చేసిన ప్రార్థన ఆమెకు గుర్తొచ్చివుంటుంది. పిల్లలు లేరని హన్నా మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెకు సమూయేలును ఇచ్చాడు. ఆ తర్వాత హన్నా దేవున్ని ఇలా స్తుతించింది, ‘యెహోవా సమాధికి చేర్చగలడు, తిరిగి బ్రతికించగలడు.’ (1 సమూ. 2:6, NW) అవును, షూనేములోని స్త్రీ కొడుకును బ్రతికించడం ద్వారా చనిపోయినవాళ్లను పునరుత్థానం చేసే శక్తి తనకుందని యెహోవా రుజువు చేశాడు.

9. బైబిల్లో నమోదైన మూడవ పునరుత్థానం గురించి చెప్పండి.

9 ఎలీషా చనిపోయిన తర్వాత మరొక అద్భుతం జరిగింది. దాదాపు 50 కన్నా ఎక్కువ ఏళ్లపాటు ప్రవక్తగా సేవచేసిన ఎలీషా ‘జబ్బు చేసి అనారోగ్యం పాలై, తర్వాత చనిపోయాడు.’ కొంతకాలానికి, సమాధిలో ఉన్న ఎలీషా శరీరం మట్టిలో కలిసిపోయి ఎముకలు తప్ప ఏమీ మిగల్లేదు. అయితే ఒక రోజు, కొంతమంది ఇశ్రాయేలీయులు ఒక వ్యక్తిని పాతిపెట్టడానికి వెళ్తుండగా శత్రువులు తమవైపు రావడం వాళ్ల కంటబడింది. దాంతో ఆ ఇశ్రాయేలీయులు శత్రువుల నుండి తప్పించుకునే కంగారులో ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పడేసి పారిపోయారు. అప్పుడు జరిగిన సంఘటన గురించి బైబిలు ఇలా చెప్తోంది, ‘అతనికి ఎలీషా ఎముకలు తాకగానే, అతను బ్రతికి, తన పాదాల మీద నిలబడ్డాడు.’ (2 రాజు. 13:14, 20, 21, NW) దేవునికి మరణంపై అధికారం ఉందని ఈ వృత్తాంతాలను బట్టి మార్త తెలుసుకుంది. దేవునికి అపారమైన, అపరిమితమైన శక్తి ఉందని నమ్మడానికి ఈ వృత్తాంతాలు మీకు కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాయి.

అపొస్తలుల కాలంలో జరిగిన సంఘటనలు

10. ఒక క్రైస్తవ సహోదరి చనిపోయినప్పుడు పేతురు ఏమి చేశాడు?

10 దేవుని నమ్మకమైన సేవకులు చేసిన పునరుత్థానాల గురించి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కూడా ఉంది. నాయీను పట్టణం దగ్గర, అలాగే యాయీరు ఇంట్లో యేసు చేసిన పునరుత్థానాల గురించి ఇంతకు ముందే మనం చర్చించుకున్నాం. అవి జరిగిన కొంతకాలానికి, దొర్కా లేదా తబితా అనే పేరుగల స్త్రీని అపొస్తలుడైన పేతురు పునరుత్థానం చేశాడు. ఆమె శరీరాన్ని ఉంచిన గదికి పేతురు వెళ్లి ప్రార్థన చేసి, “తబితా, లే!” అన్నాడు. వెంటనే ఆమె కళ్లు తెరిచింది, అప్పుడు ఆయన అక్కడున్న ఇతర క్రైస్తవుల్ని పిలిచి “తబితా మళ్లీ బ్రతికిందని వాళ్లకు చూపించాడు.” అది చూసి ఆ పట్టణంలోని చాలామంది “ప్రభువు మీద విశ్వాసముంచారు.” కొత్తగా శిష్యులైనవాళ్లు యేసు గురించిన మంచివార్తను, అలాగే చనిపోయినవాళ్లను బ్రతికించగల యెహోవా సామర్థ్యాన్ని అందరికీ చాటి చెప్పగలరు.—అపొ. 9:36-42.

11. ఒక యువకుణ్ణి పరిశీలించి వైద్యుడైన లూకా ఏమని నిర్ధారించాడు? అప్పుడు జరిగిన సంఘటన ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపించింది?

11 కొంతమంది మరో పునరుత్థానాన్ని కూడా ప్రత్యక్షంగా చూశారు. ఒకసారి అపొస్తలుడైన పౌలు, ప్రస్తుతం వాయువ్య టర్కీలో ఉన్న త్రోయ అనే పట్టణానికి వెళ్లాడు. పౌలు మేడగదిలో ఉన్నవాళ్లను ఉద్దేశించి మాట్లాడుతుండగా అర్ధరాత్రి దాటిపోయింది. పౌలు చెప్తున్నవాటిని కిటికీ దగ్గర కూర్చుని వింటున్న ఐతుకు అనే యువకుడు మెల్లగా నిద్రలోకి జారుకుని మూడవ అంతస్తు నుండి కిందికి పడ్డాడు. అతనికి ఏమైందో చూడ్డానికి బహుశా లూకానే మొదట వెళ్లుంటాడు. వైద్యుడైన లూకా ఆ యువకుణ్ణి పరిశీలించి అతనికి దెబ్బలు తగలడమో, స్పృహ కోల్పోవడమో కాదుగానీ అతను చనిపోయాడని నిర్ధారించాడు. ఇంతలో పౌలు కూడా కిందికి వచ్చాడు, ఆయన ఐతుకును కౌగలించుకుని, “ఇతను బ్రతికే ఉన్నాడు” అని అన్నాడు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. జరిగినదాన్ని కళ్లారా చూసిన ప్రతీఒక్కరిపై ఆ అద్భుతం చాలా ప్రభావం చూపించింది. చనిపోయిన ఆ యువకుడు తిరిగి బ్రతికాడని తెలుసుకుని వాళ్లు “చెప్పలేనంత సంతోషించారు.”—అపొ. 20:7-12.

బలమైన నిరీక్షణ

12, 13. ఇప్పటివరకు చర్చించిన పునరుత్థానాలను బట్టి మనలో ఏ ప్రశ్నలు తలెత్తవచ్చు?

12 ఇప్పటివరకు చర్చించిన ఈ వృత్తాంతాలను బట్టి పునరుత్థానంపై మీకు కూడా మార్తకు కలిగినంత నమ్మకం కలగాలి. మనకు ప్రాణాన్నిచ్చిన దేవుడు, చనిపోయినవాళ్లకు తిరిగి ప్రాణం పోయగలడనే పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు. ఇప్పటివరకు పరిశీలించిన పునరుత్థానాలు జరిగినప్పుడు ఏలీయా, యేసు, లేదా పేతురు వంటి నమ్మకమైన దేవుని సేవకులు ఉన్నారు. పైగా అవన్నీ యెహోవా అద్భుతాలు చేసిన కాలంలో జరిగాయి. మరి అలాంటి అద్భుతాలు జరగడం ఆగిపోయిన కాలంలో చనిపోయినవాళ్ల సంగతేంటి? చనిపోయినవాళ్లను దేవుడు భవిష్యత్తులో పునరుత్థానం చేస్తాడని నమ్మకమైన స్త్రీపురుషులు ఎదురుచూడవచ్చా? “చివరి రోజున పునరుత్థానం జరిగే సమయంలో లేస్తాడని నాకు తెలుసు” అని చెప్పిన మార్తలాంటి బలమైన నమ్మకం వాళ్లు కూడా కలిగివుండవచ్చా? పునరుత్థానం జరుగుతుందని ఆమె ఎందుకు నమ్మింది? మీరెందుకు నమ్మవచ్చు?

13 భవిష్యత్తులో పునరుత్థానం ఉంటుందనే విషయాన్ని దేవుని నమ్మకమైన సేవకులు నమ్మారని బైబిల్లోని ఎన్నో వృత్తాంతాలు తెలియజేస్తున్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

14. అబ్రాహాము వృత్తాంతం పునరుత్థానం గురించి ఏమి తెలియజేస్తుంది?

14 లేకలేక పుట్టిన ఇస్సాకును ఏమి చేయమని దేవుడు అబ్రాహాముకు చెప్పాడో ఒకసారి ఆలోచించండి. ‘నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి, అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసికొని మోరీయా దేశానికి వెళ్లి అక్కడ దహనబలిగా అతన్ని అర్పించు’ అని యెహోవా చెప్పాడు. (ఆది. 22:2) ఈ ఆజ్ఞను విన్నప్పుడు అబ్రాహాముకు ఎలా అనిపించివుంటుందని మీరు అనుకుంటున్నారు? అబ్రాహాము సంతానం ద్వారా అన్ని జనాంగాలు దీవించబడతాయని యెహోవా మాటిచ్చాడు. (ఆది. 13:14-16; 18:18; రోమా. 4:17, 18) పైగా ఆ దీవెన ‘ఇస్సాకు వల్లే’ వస్తుందని యెహోవా చెప్పాడు. (ఆది. 21:12) ఒకవేళ ఇస్సాకును బలిగా అర్పిస్తే ఆ మాట ఎలా నిజమౌతుంది? ఇస్సాకును పునరుత్థానం చేసే శక్తి దేవునికి ఉందని అబ్రాహాము నమ్మినట్లు పౌలు పవిత్రశక్తి సహాయంతో వివరించాడు. (హెబ్రీయులు 11:17-19 చదవండి.) కానీ దేవుడు ఇస్సాకును వెంటనే, బహుశా కొన్ని గంటల్లో, ఒక్క రోజులో లేదా వారంలో పునరుత్థానం చేస్తాడని అబ్రాహాము అనుకున్నట్లు బైబిలు చెప్పడం లేదు. అసలు ఇస్సాకు ఎప్పుడు పునరుత్థానం చేయబడతాడో అబ్రాహాముకు తెలీదు. కానీ యెహోవా ఖచ్చితంగా పునరుత్థానం చేస్తాడనే నమ్మకం మాత్రం ఆయన కలిగివున్నాడు.

15. యోబు ఏ నమ్మకంతో జీవించాడు?

15 దేవుని నమ్మకమైన సేవకుడు యోబు కూడా భవిష్యత్తులో పునరుత్థానం జరుగుతుందని నమ్మాడు. ఒక చెట్టును నరికేస్తే అది మళ్లీ చిగురిస్తుందని యోబుకు తెలుసు. కానీ మనిషి విషయంలో అలా జరగదు. (యోబు 14:7-12; 19:25-27) చనిపోయిన వ్యక్తి తనంతట తానే తిరిగి బ్రతకలేడు. (2 సమూ. 12:23; కీర్త. 89:48) అంతమాత్రాన, చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించడం దేవుని వల్ల కూడా అవ్వదని దానర్థం కాదు. నిజానికి యెహోవా తనను గుర్తుచేసుకుంటాడని యోబు నమ్మాడు. (యోబు 14:13-15 చదవండి.) అయితే అది ఎప్పుడనేది యోబుకు తెలీదు. అయినాసరే, మనుషులకు ప్రాణం పోసిన సృష్టికర్త తనను గుర్తుంచుకొని పునరుత్థానం చేయగలడని, ఖచ్చితంగా చేస్తాడని యోబు నమ్మాడు.

16. ఒక దేవదూత దానియేలును ఎలా ప్రోత్సహించాడు?

16 మరో నమ్మకమైన సేవకుడు దానియేలు గురించి ఆలోచించండి. ఆయన తన జీవితమంతా యెహోవాకు నమ్మకంగా సేవచేశాడు. యెహోవా కూడా ఆయనకు తోడుగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఒక దేవదూత ఆయన్ని ‘ఎంతో అమూల్యమైనవాడా’ అని పిలిచాడు. ‘శాంతిగా, నిబ్బరంగా ఉండు’ అని ప్రోత్సహించాడు.—దాని. 9:22, 23; 10:11, 18, 19, NW.

17, 18. యెహోవా దానియేలుకు ఏమని వాగ్దానం చేశాడు?

17 దానియేలు దాదాపు 100 ఏళ్ల వయసులో మరణానికి దగ్గర్లో ఉన్నప్పుడు తనకు ఏమౌతుందోనని ఆలోచించివుంటాడు. మరి ఆయన పునరుత్థానం అవుతాడా? ఖచ్చితంగా అవుతాడు. దేవుడు ఆయనకు ఏమని మాటిచ్చాడో దానియేలు పుస్తకం చివర్లో మనం చూడవచ్చు. అక్కడిలా ఉంది, ‘నీ విషయానికొస్తే, చివరి వరకూ స్థిరంగా ఉండు. నువ్వు విశ్రాంతి తీసుకుంటావు.’ (దాని. 12:13, NW) చనిపోయినవాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారని; సమాధిలో ‘పనిగానీ, ఉపాయంగానీ, జ్ఞానంగానీ, తెలివిగానీ’ ఉండదని వృద్ధుడైన దానియేలుకు తెలుసు. ఆయన కూడా అక్కడికే వెళ్తాడు. (ప్రసం. 9:10, NW) కానీ ఆయన జీవితం అంతటితో ముగిసిపోలేదు. ఆయన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని యెహోవా వాగ్దానం చేశాడు.

18 యెహోవా దూత దానియేలుతో ఇలా చెప్పాడు, ‘రోజుల చివర్లో నువ్వు నీ వంతు కోసం నిలబడతావు.’ అది ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుందో దానియేలుకు తెలీదు. తాను చనిపోతాననే విషయం ఆయనకు అర్థమైంది. కానీ ‘నువ్వు నీ వంతు కోసం నిలబడతావు’ అనే వాగ్దానాన్ని విన్నప్పుడు, భవిష్యత్తులో తాను పునరుత్థానం అవుతానని దానియేలు అర్థంచేసుకున్నాడు. ఆయన చనిపోయిన చాలాకాలం తర్వాత అంటే ‘రోజుల చివర్లో’ అది జరుగుతుంది.

మార్తలాగే మీరు కూడా పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుందని నమ్మవచ్చు(19, 20 పేరాలు చూడండి)

19, 20. (ఎ) మార్త యేసుతో అన్న మాటలకు, ఇప్పటివరకు మనం చర్చించిన వృత్తాంతాలకు ఉన్న సంబంధం ఏమిటి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

19 వీటన్నిటిని బట్టి, దేవునికి నమ్మకంగా జీవించిన తన సోదరుడైన లాజరు “చివరి రోజున పునరుత్థానం జరిగే సమయంలో లేస్తాడని” నమ్మడానికి మార్తకు సరైన కారణాలే ఉన్నాయని చెప్పవచ్చు. యెహోవా దానియేలుకు చేసిన వాగ్దానం, భవిష్యత్తులో పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుందనే మార్త బలమైన విశ్వాసం మనలో నమ్మకాన్ని ఖచ్చితంగా పెంచుతాయి. అవును, భవిష్యత్తులో పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుంది.

20 గతంలో నిజంగా జరిగిన పునరుత్థానాల గురించి మనం తెలుసుకున్నాం. చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారని అవి రుజువు చేస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో పునరుత్థానం జరుగు తుందని దేవుని సేవకులు నమ్మారని కూడా తెలుసుకున్నాం. అయితే పునరుత్థానం చేస్తానని దేవుడు వాగ్దానం చేసి చాలాకాలం గడిచిపోయింది. ఆ వాగ్దానం నిజమౌతుందని చెప్పడానికి ఏమైనా రుజువులు ఉన్నాయా? ఒకవేళ రుజువులు ఉంటే, భవిష్యత్తులో పునరుత్థానం జరుగుతుందని ఇంకా బలంగా నమ్ముతాం. ఇంతకీ అదెప్పుడు జరుగుతుంది? వీటిగురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.