జీవిత కథ
యజమానిని అనుసరించడానికి అన్నీ విడిచిపెట్టాను
నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న నాతో, “ప్రీచింగ్‌కి వెళ్తే మళ్లీ ఇంటికి రావొద్దు. వస్తే కాళ్లు విరగ్గొడతా” అని అన్నాడు. దాంతో ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. మన యజమానియైన యేసును అనుసరించడానికి నేను చేసిన మొట్టమొదటి త్యాగం అదే.
ఇంతకీ మా నాన్న ఎందుకు అంత కోపడ్డాడు? అది తెలియాలంటే నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను 1929, జూలై 29న పుట్టాను. ఫిలిప్పీన్స్‌లో ఉన్న బూలాకాన్ ప్రాంతంలోని ఒక పల్లెటూర్లో పెరిగాను. మేము అంత డబ్బున్నవాళ్లం కాదు. నా చిన్నతనంలో, జపాన్ సైన్యం ఫిలిప్పీన్స్ మీదకు యుద్ధానికి వచ్చింది. మా పల్లెటూరు మారుమూల ఉండేది కాబట్టి మా మీద ఎలాంటి దాడులు జరగలేదు. అప్పట్లో మా దగ్గర రేడియో, టీవీ, న్యూస్‌పేపర్ ఉండేవి కావు. కాబట్టి యుద్ధం గురించి వాళ్లూవీళ్లూ చెప్తే విన్నాం.
మా అమ్మానాన్నలకు మొత్తం ఎనిమిదిమంది పిల్లలం, నేను రెండోవాణ్ణి. నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు అమ్మమ్మతాతయ్యలు నన్ను తమతోపాటు తీసుకెళ్లారు. మేము క్యాథలిక్కులం అయినప్పటికీ మా తాతయ్య అన్ని మతాల గురించి తెలుసుకోవడానికి, వాటికి సంబంధించి తన స్నేహితులు ఇచ్చే పుస్తకాలను చదవడానికి ఇష్టపడేవాడు. మా తాతయ్య నాకు తగాలోగ్ భాషలో ఉన్న ప్రొటెక్షన్, సేఫ్టీ, అన్‌కవర్డ్ అనే చిన్నపుస్తకాల్ని a, ఒక బైబిల్ని చూపించినట్లు గుర్తు. నాకు బైబిలు చదవడమంటే చాలా ఇష్టం, ముఖ్యంగా సువార్త పుస్తకాలను ఇష్టపడేవాణ్ణి. వాటిని చదివాక యేసును అనుసరించాలనే కోరిక కలిగింది.—యోహా. 10:27
యజమానిని అనుసరించడం నేర్చుకున్నాను
జపాన్ సైన్యం 1945లో ఫిలిప్పీన్స్‌ను విడిచి వెళ్లిపోయింది. మా అమ్మానాన్నలు నన్ను మళ్లీ ఇంటికి వచ్చేయమన్నారు. తాతయ్య కూడా వెళ్లమనడంతో నేను ఇంటికి వచ్చేశాను.
కొంతకాలానికి అంటే డిసెంబరు 1945లో ఆంగాట్‌లోని యెహోవాసాక్షులు మా ఊళ్లో ప్రీచింగ్ చేయడానికి వచ్చారు. వాళ్లలో ఒక పెద్దవయసు సహోదరుడు మా ఇంటికి వచ్చి, “చివరి రోజుల” గురించి బైబిలు ఏమి చెప్తుందో మాకు వివరించాడు. (2 తిమో. 3:1-5) మా పక్క ఊళ్లో జరిగే ఒక బైబిలు అధ్యయనానికి రమ్మని మమ్మల్ని పిలిచాడు. అమ్మానాన్నలు రాకపోయినా నేనొక్కడినే వెళ్లాను. అక్కడ దాదాపు 20 మంది ఉన్నారు, కొంతమంది బైబిలుకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
వాళ్లు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థంకాలేదు. లేచి బయటకు వచ్చేద్దామనుకున్నాను. అప్పుడే వాళ్లు ఒక రాజ్యగీతాన్ని పాడడం మొదలుపెట్టారు. నాకు ఆ పాట బాగా
నచ్చడంతో అక్కడే ఉండిపోయాను. పాట, ప్రార్థన తర్వాత ఆదివారం ఆంగాట్‌లో జరిగే మీటింగ్‌కు రమ్మని అందర్నీ ఆహ్వానించారు.సహోదరుడు క్రూస్ ఇంట్లో ఆ మీటింగ్ జరిగింది. అక్కడికి వెళ్లడానికి మాలో కొంతమంది దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచాం. 50 మంది దాకా హాజరయ్యారు, చిన్నపిల్లలు కూడా లోతైన బైబిలు అంశాల గురించి కామెంట్స్ చెప్పడం చూసి ఆశ్చర్యపోయాను. నేను ఇంకొన్నిసార్లు మీటింగ్స్‌కు వెళ్లాక డామీయన్ సాన్టోస్ అనే ఒక పెద్దవయసు పయినీరు సహోదరుడు ఒకరోజు రాత్రి తన ఇంట్లో ఉండమని నన్ను ఆహ్వానించాడు. ఆ సహోదరుడు ఒకప్పుడు మేయర్‌గా పనిచేశాడు. మేము ఆరోజు రాత్రి బైబిలు విషయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం.
అప్పట్లో, మాలో చాలామంది ప్రాథమిక బైబిలు బోధలు నేర్చుకున్న వెంటనే మార్పులు చేసుకున్నాం. నేను కొన్ని మీటింగ్స్‌కు వెళ్లాక సహోదరులు నన్నూ, ఇంకొందర్నీ “బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నారా?” అని అడిగారు. నేను “అవును” అని జవాబిచ్చాను. “యజమానియైన క్రీస్తుకు” దాసునిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. (కొలొ. 3:24) నేనూ, మరో సహోదరుడు 1946, ఫిబ్రవరి 15న దగ్గర్లోని నదిలో బాప్తిస్మం తీసుకున్నాం.
బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు యేసులాగే క్రమంగా ప్రీచింగ్ చేయాలని నాకు అర్థమైంది. నాకు ప్రీచింగ్ చేసేంత వయసు లేదని, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నేను ఒక ప్రచారకుణ్ణి అయిపోనని మా నాన్న అన్నాడు. కానీ దేవుని రాజ్యం గురించి ప్రకటించడం దేవుని చిత్తమని నాన్నకు వివరించాను. (మత్త. 24:14) అంతేకాదు, దేవునికి చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుందని చెప్పాను. నేను మొదట్లో చెప్పిన మాటలు నాన్న అన్నది అప్పుడే. నన్ను ప్రీచింగ్‌కి వెళ్లనివ్వకూడదని నాన్న నిశ్చయించుకున్నాడు. యెహోవా సేవచేయడానికి నేను చేసిన మొట్టమొదటి త్యాగం అదే.
నన్ను ఆంగాట్‌లో తమతోపాటు ఉండమని క్రూస్ కుటుంబం ఆహ్వానించింది. వాళ్లు నన్నూ, వాళ్ల చిన్నకూతురు నోరాను పయినీరు సేవచేయమని ప్రోత్సహించారు. 1947, నవంబరు 1న మేమిద్దరం పయినీరు సేవ మొదలుపెట్టాం. నోరా వేరే ప్రాంతంలో సేవచేయడానికి వెళ్లింది, నేను మాత్రం ఆంగాట్‌లోనే ఉన్నాను.
నేను చేసిన మరో త్యాగం
పయినీరు సేవ మొదలుపెట్టి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు బెతెల్ నుండి వచ్చిన సహోదరుడు ఆల్ స్టూవర్ట్ ఆంగాట్‌లో బహిరంగ ప్రసంగం ఇచ్చాడు. దానికి 500 కన్నా ఎక్కువమంది హాజరయ్యారు. ఆయన ఇంగ్లీషులో ప్రసంగిస్తే, నేను దాని సారాంశాన్ని తగాలోగ్ భాషలో చెప్పాను. ఇప్పటివరకు నేను అనువదించిన ఎన్నో ప్రసంగాల్లో అదే మొదటిది. కానీ ఆ పని ఎలా చేయగలిగాను? నేను చదివింది ఏడో తరగతి వరకే కానీ స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్లు ఎప్పుడూ ఇంగ్లీషులోనే మాట్లాడేవాళ్లు. అంతేకాదు తగాలోగ్ భాషలో మన ప్రచురణలు కొన్నే ఉండేవి కాబట్టి నేను ఎక్కువగా ఇంగ్లీషు ప్రచురణల్ని చదివేవాడిని. వీటన్నిటి వల్ల ఇంగ్లీషు ప్రసంగాల్ని అర్థంచేసుకుని అనువదించగలిగాను.
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే 1950 థియోక్రెసీస్ ఇంక్రీస్ సమావేశానికి మిషనరీలు వెళ్తున్నారని సహోదరుడు స్టూవర్ట్ స్థానిక సంఘానికి చెప్పాడు. అందుకే బెతెల్‌లో పనిచేయడానికి ఒకరిద్దరు పయినీర్లు కావాలని బ్రాంచి కార్యాలయం చెప్పింది. అలా ఆహ్వానం అందుకున్న ఇద్దరు పయినీర్లలో నేను ఒకడిని. ఈసారి నేను చేసిన త్యాగం ఏమిటంటే, బెతెల్ సేవ కోసం నాకు బాగా పరిచయమున్న ప్రాంతాన్ని విడిచిపెట్టడం.
నేను 1950, జూన్ 19న బెతెల్‌కు వెళ్లాను. 2.5 ఎకరాల విస్తీర్ణంలో పెద్దపెద్ద చెట్ల మధ్య ఉన్న ఒక పాత ఇంట్లో బెతెల్ ఉండేది. దాదాపు 12 మంది పెళ్లికాని సహోదరులు అక్కడ పనిచేసేవాళ్లు. తెల్లవారుజామున వంట చేయడానికి నేను సహాయం చేసేవాడిని. తర్వాత 9 గంటలకు బట్టలు ఇస్త్రీ చేసేవాణ్ణి, మధ్యాహ్నం కూడా అవే పనులు చేసేవాణ్ణి. సమావేశం నుండి మిషనరీలు తిరిగొచ్చాక కూడా నేను బెతెల్‌లోనే ఉన్నాను. సహోదరులు నాకు ఏ పని అప్పగిస్తే అది చేశాను. పత్రికల్ని పోస్ట్‌లో పంపించడానికి వీలుగా వాటిని కవరులో ప్యాక్ చేసేవాడిని, సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన పనులు చేశాను, రిసెప్షనిష్టుగా కూడా పనిచేశాను.
ఫిలిప్పీన్స్ విడిచి గిలియడ్ పాఠశాలకు
1952లో నాకూ, ఫిలిప్పీన్స్‌లోని మరో ఆరుగురు సహోదరులకూ 20వ గిలియడ్ తరగతికి ఆహ్వానం వచ్చింది. నా ఆనందానికి అవధుల్లేవు. మేము అమెరికాలో ఉన్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు చూశాం, నేర్చుకున్నాం. నేను పుట్టి పెరిగిన చిన్న పల్లెటూరుతో పోలిస్తే, అమెరికాలో జీవితం చాలా వేరుగా అనిపించింది.
ఉదాహరణకు మేము అంతకుముందెప్పుడూ చూడని వస్తువుల్ని, పాత్రల్ని ఎలా వాడాలో నేర్చుకున్నాం. వాతావరణం
కూడా వేరుగా ఉండేది! ఒకరోజు ఉదయం నిద్రలేవగానే బయటంతా తెల్లగా కనిపించింది. నేను మంచును చూడడం అదే మొదటిసారి. చాలా అందంగా కనిపించింది, కానీ కొద్దిసేపటికే విపరీతమైన చలి పుట్టింది.గిలియడ్‌లో పొందిన అద్భుతమైన శిక్షణ ముందు ఈ మార్పులు చాలా చిన్నవిగా అనిపించాయి. మా పాఠశాల ఉపదేశకులు చాలా చక్కగా బోధించేవాళ్లు. అధ్యయనం ఎలా చేయాలో, పరిశోధన ఎలా చేయాలో మాకు నేర్పించారు. యెహోవాతో నాకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి గిలియడ్ శిక్షణ ఎంతో ఉపయోగపడింది.
ఆ శిక్షణ పూర్తయిన తర్వాత నన్ను న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లో కొంతకాలంపాటు ప్రత్యేక పయినీరుగా సేవచేయడానికి నియమించారు. అందుకే 1953, జూలై నెలలో అక్కడ జరిగిన న్యూ వరల్డ్ సొసైటీ సమావేశానికి హజరవ్వగలిగాను. ఆ తర్వాత నన్ను మళ్లీ ఫిలిప్పీన్స్‌కు నియమించారు.
సౌకర్యాలను త్యాగం చేయడం
బ్రాంచి నన్ను ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించింది. యెహోవా ప్రజలకు సహాయం చేయడానికి దూర ప్రాంతాలకు, పట్టణాలకు ప్రయాణించిన యేసును అనుసరించడానికి ఈ సేవ నాకు ఎన్నో అవకాశాల్ని కల్పించింది. (1 పేతు. 2:21) ఫిలిప్పీన్స్‌లోని అతిపెద్ద ద్వీపమైన సెంట్రల్ లూజాన్ సర్క్యూట్‌లో నేను సేవచేశాను. బూలాకాన్, న్వేవా ఏసీహా, టార్లాక్, జామ్బాలేస్ ప్రాంతాలు కూడా అందులో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి, సీయర్రా మాత్రే పర్వతాలను దాటాల్సి వచ్చేది. ఆ ప్రాంతాలకు వెళ్లడానికి బస్సులుగానీ, ట్రైన్‌లుగానీ ఉండేవి కావు. అందుకే చెక్క మొద్దుల్ని రవాణా చేసే ట్రక్కు డ్రైవర్లను అడిగి, ఆ మొద్దులపై కూర్చొని ప్రయాణించేవాణ్ణి. చాలాసార్లు అలాగే ప్రయాణించాను, కానీ అది అంత సౌకర్యవంతంగా ఉండేదికాదు.
చాలా సంఘాలు చిన్నవి, పైగా కొత్తవి. కాబట్టి మీటింగ్స్‌ను ఎలా నిర్వహించాలో, ప్రీచింగ్‌ను మరింత క్రమపద్ధతిగా ఎలా చేయాలో నేర్పించినప్పుడు సహోదరులు సంతోషించారు.
తర్వాత, నన్ను బీకోల్ ప్రాంతానికి నియమించారు. ముందెప్పుడూ ప్రీచింగ్ చేయని ప్రాంతాలకు ప్రత్యేక పయినీర్లు వెళ్లి ప్రీచింగ్ చేయడం వల్ల అక్కడి మారుమూల ప్రాంతాల్లో ఎన్నో గ్రూప్‌లు ఏర్పడ్డాయి. ఒక ఇంట్లో టాయిలెట్ ఎలా ఉండేదంటే, చెరో వైపున రెండు చెక్క మొద్దులు ఉండి మధ్యలో నేలకు గొయ్యి ఉండేది. నేను ఆ మొద్దుల మీద నిలబడిన వెంటనే అవి జారి ఆ గొయ్యిలో పడ్డాయి, నేనూ వాటితోపాటు గొయ్యిలో పడిపోయాను. ఆ తర్వాత స్నానం చేసి తయారయ్యేసరికి చాలా సమయం పట్టింది.
నేను ఆ సర్క్యూట్‌లో సేవ చేస్తున్నప్పుడు, నాతోపాటు పయినీరు సేవ ప్రారంభించిన నోరా గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పటికే ఆమె డూమాగేటే నగరంలో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తోంది, నేను ఆమెను చూడ్డానికి అక్కడి వెళ్లాను. ఆ తర్వాత, మేము ఒకరికొకరం ఉత్తరాలు రాసుకున్నాం, చివరికి 1956లో పెళ్లిచేసుకున్నాం. మా పెళ్లయిన మొదటి వారం రాపూ-రాపూ ద్వీపంలోని సంఘాన్ని సందర్శించాం. అక్కడ మేము పర్వతాలు ఎక్కాల్సి వచ్చింది, సుదూర ప్రాంతాలకు నడవాల్సి వచ్చింది. కానీ దూర ప్రాంతాల్లోని సహోదరులకు సహాయపడడం మాకెంతో ఆనందాన్నిచ్చింది.
బెతెల్‌లో సేవచేయడానికి మళ్లీ ఆహ్వానించారు
దాదాపు నాలుగు సంవత్సరాలపాటు ప్రాంతీయ సేవ చేశాక, బ్రాంచి మమ్మల్ని బెతెల్‌కు ఆహ్వానించింది. 1960, జనవరి నుండి అక్కడ పనిచేయడం మొదలుపెట్టాం. బెతెల్‌లో గడిపిన ఇన్నేళ్లలో యెహోవా సంస్థలో పెద్దపెద్ద బాధ్యతలు నిర్వహించిన సహోదరులతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. వాళ్లనుండి ఎంతో నేర్చుకున్నాను. నోరా కూడా బెతెల్‌లో వేర్వేరు నియామకాల్లో పనిచేసింది.
ఫిలిప్పీన్స్‌లో యెహోవా సేవకుల సంఖ్య అంతకంతకు పెరగడం చూశాను. అది నిజంగా ఒక ఆశీర్వాదమే. పెళ్లికాక ముందు నేను యౌవన సహోదరునిగా బెతెల్‌కు వచ్చినప్పుడు, దేశం మొత్తం మీద దాదాపు 10 వేలమంది ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు. ఇప్పుడు 2 లక్షలకన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు. ప్రకటనా పనికి మద్దతిస్తూ వందలమంది సహోదరసహోదరీలు బెతెల్‌లో సేవచేస్తున్నారు.
కాలం గడుస్తున్న కొద్దీ బెతెల్‌లో జరిగే పనికోసం మరింత ఎక్కువ స్థలం అవసరమైంది. దాంతో మరింత పెద్ద బ్రాంచి కార్యాలయాన్ని కట్టడం కోసం ఒక స్థలాన్ని చూడమని పరిపాలక సభ చెప్పింది. నేనూ, ప్రింటరీ పర్యవేక్షకుడూ కలిసి బ్రాంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఎవరైనా ఇల్లు అమ్మడానికి ఇష్టపడుతున్నారేమో అడిగాం. అక్కడ చైనావాళ్లు ఎక్కువగా ఉండేవాళ్లు. ఎవ్వరూ అమ్మడానికి ఇష్టపడలేదు, పైగా ఒకతను ఇలా అన్నాడు, “చైనావాళ్లు అమ్మరు. కొంటారు.”
కానీ ఒకరోజు అనుకోని సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఒకతను అమెరికాకు వెళ్లిపోతున్నానని చెప్పి, తన ఇంటిని కొనడానికి ఇష్టపడతారానని మమ్మల్ని అడిగాడు. తర్వాత, మరో వ్యక్తి కూడా తన స్థలాన్ని అమ్మడానికి ముందుకొచ్చాడు, అతను ఇంకొంతమందిని కూడా తమ స్థలాల్ని అమ్మమని ప్రోత్సహించాడు. ఆఖరికి, “చైనావాళ్లు అమ్మరు” అని చెప్పిన వ్యక్తి కూడా స్థలాన్ని అమ్మాడు. కొద్దిరోజుల్లోనే బ్రాంచి మూడింతలు పెద్దదైంది. ఇదంతా యెహోవా చిత్తమని నాకు బలంగా అనిపించింది.
1950 నాటికి బెతెల్‌లో అందరికన్నా నేనే చిన్నవాణ్ణి. ఇప్పుడు నేనూ, నా భార్యే అందరికన్నా పెద్దవాళ్లం. యేసు ఎటూ నడిపిస్తే అటు నడుస్తూ, ఆయన్ను అనుసరించినందుకు నేనేమాత్రం బాధపడట్లేదు. నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లో నుండి గెంటేసినా, తనను ప్రేమించే పెద్ద కుటుంబాన్ని యెహోవా నాకు ఇచ్చాడు. మన నియామకం ఏదైనా మనకు కావాల్సిన ప్రతీది యెహోవా ఇస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. యెహోవా దయతో మాకు ఇచ్చినవాటికి నేనూ, నోరా ఎంతో కృతజ్ఞులం. అంతేకాదు యెహోవాను పరీక్షించి చూడమని ఇతరుల్ని కూడా ప్రోత్సహిస్తాం.—మలా. 3:10.
ఒక సందర్భంలో యేసు, మత్తయి లేవి అనే సుంకరితో తనను అనుసరించమని చెప్పాడు. దానికి మత్తయి ఎలా స్పందించాడు? “అతను లేచి, అన్నీ విడిచిపెట్టి ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టాడు.” (లూకా 5:27, 28) అన్నిటినీ విడిచిపెట్టి యేసును అనుసరించే ఒక అవకాశం నాకూ దొరికింది. అంతేకాదు ఇతరులు కూడా యేసును అనుసరించాలని, ఎన్నో ఆశీర్వాదాల్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
a యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు ముద్రించడం లేదు.