కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా​—⁠“సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి”

యౌవనులారా​—⁠“సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి”

“మీరు ఎప్పటిలాగే లోబడుతూ ఉండండి. . . . భయంతో, వణకుతో మీ సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి.”ఫిలి. 2:12.

పాటలు: 133, 135

1. బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (ప్రారంభ చిత్రం చూడండి.)

 ప్రతీ సంవత్సరం, వేలమంది బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకుంటున్నారు. వాళ్లలో చాలామంది, టీనేజర్లు లేదా అంతకన్నా చిన్నవయసువాళ్లే. బహుశా తల్లిదండ్రులు యెహోవాసాక్షులు కావడం వల్ల చిన్నప్పటి నుండే వాళ్లకు సత్యం తెలిసుంటుంది. మీరు బాప్తిస్మం తీసుకున్న యౌవనులా? అలాగైతే మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. ఒక క్రైస్తవుడు శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే బాప్తిస్మం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం.—మత్త. 28:19, 20; 1 పేతు. 3:21.

2. యెహోవాకు సమర్పించుకోవడానికి మీరెందుకు భయపడకూడదు?

2 బాప్తిస్మం తీసుకోవడం వల్ల యెహోవా ఇచ్చే ఎన్నో దీవెనలతోపాటు, కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. ఏ విధంగా? మీరు బాప్తిస్మం తీసుకున్న రోజున, బాప్తిస్మ ప్రసంగం ఇచ్చిన సహోదరుడు మిమ్మల్ని ఇలా అడిగివుంటాడు: “యేసుక్రీస్తు బలి ఆధారంగా మీరు మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవా చిత్తం చేయడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారా?” అప్పుడు మీరు “అవును” అని జవాబిచ్చారు. అంటే యెహోవాను ప్రేమిస్తారని, ఆయన సేవ చేయడమే మీకు అన్నిటికన్నా ప్రాముఖ్యమని మీరు మాటిచ్చారు. అంత గంభీరమైన ప్రమాణం చేసినందుకు మీరు బాధపడాలా? ఖచ్చితంగా లేదు. మీ జీవితాన్ని యెహోవా చేతుల్లో పెట్టినందుకు బాధపడే పరిస్థితి ఎన్నటికీ రాదు. యెహోవా గురించి తెలియనివాళ్లు సాతాను లోక గుప్పిట్లో ఉన్నారు. సాతాను వాళ్లను ఏమాత్రం పట్టించుకోడు. మీపట్ల కూడా అతనికి శ్రద్ధ లేదు. నిజానికి, మీరు యెహోవాను వదిలేసి శాశ్వత జీవితాన్ని పోగొట్టుకుంటే సాతాను చాలా సంతోషిస్తాడు.

3. మీ జీవితాన్ని సమర్పించుకున్నందుకు యెహోవా మిమ్మల్ని ఎలా దీవించాడు?

3 మీరు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నందుకు యెహోవా మిమ్మల్ని ఎలా దీవించాడో ఆలోచించండి. మీ జీవితాన్ని యెహోవాకు అంకితం చేశారు కాబట్టి మీరు ధైర్యంగా ఇలా అనవచ్చు: ‘యెహోవా నా పక్షాన ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు?’ (కీర్త. 118:6) యెహోవా పక్షాన ఉండడం కన్నా, ఆయన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాడని తెలుసుకోవడం కన్నా మించిన గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదు.

వ్యక్తిగత బాధ్యత

4, 5. (ఎ) సమర్పణ వ్యక్తిగత బాధ్యత అని ఎందుకు చెప్పవచ్చు? (బి) వయసుతో సంబంధం లేకుండా క్రైస్తవులందరికీ ఎలాంటి సమస్యలు వస్తాయి?

4 యెహోవాతో సంబంధం అనేది, తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చే ఆస్తి లాంటిది కాదు. మీరు మీ అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నప్పటికీ, యెహోవాతో సంబంధాన్ని ఏర్పర్చుకోవడం మీ వ్యక్తిగత బాధ్యత. ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం ఎందుకు ముఖ్యం? ముందుముందు మన విశ్వాసానికి ఎలాంటి పరీక్షలు ఎదురౌతాయో మనలో ఎవ్వరికీ తెలీదు. ఉదాహరణకు, మీరు టీనేజీకి రాకముందే బాప్తిస్మం తీసుకుని ఉండవచ్చు. టీనేజీలో అడుగుపెట్టాక మీకు కొత్త అభిప్రాయాలు ఏర్పడి ఉండవచ్చు, కొత్త సమస్యలు ఎదురై ఉండవచ్చు. ఒక టీనేజీ అమ్మాయి ఇలా చెప్పింది, “స్కూల్లో బర్త్‌డే కేక్‌ తినలేకపోతున్నందుకు యెహోవాసాక్షుల పిల్లలెవ్వరూ బాధపడరు. కానీ కొన్నేళ్లు గడిచాక సెక్స్‌లో పాల్గొనాలనే ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ, యెహోవా పెట్టిన నియమాల్ని పాటించడమే అన్నిటికన్నా ఉత్తమమని వాళ్లు పూర్తిగా నమ్మగలగాలి.​”

5 కొత్తకొత్త సమస్యలు యౌవనులకు మాత్రమే రావు. పెద్దయ్యాక బాప్తిస్మం తీసుకున్నవాళ్లకు కూడా ఊహించని పరీక్షలు ఎదురౌతాయి. అవి వివాహానికి సంబంధించినవి కావచ్చు లేదా ఆరోగ్యానికి, ఉద్యోగానికి సంబంధించినవి కావచ్చు. అవును, వయసుతో సంబంధం లేకుండా మనలో ప్రతీఒక్కరి విశ్వాసానికి పరీక్షలు ఎదురౌతాయి. అలాంటప్పుడు మనం నమ్మకంగా ఉండాలి.—యాకో. 1:12-14.

6. (ఎ) యెహోవాకు మీరు చేసిన ప్రమాణానికి షరతులు లేకపోవడం అంటే ఏమిటి? (బి) ఫిలిప్పీయులు 4:11-13 వచనాల నుండి మీరేమి నేర్చుకోవచ్చు?

6 ఎలాంటి పరీక్షలు ఎదురైనప్పటికీ మీరు నమ్మకంగా ఉండాలంటే, సర్వోన్నతుడైన యెహోవాకు మీరు చేసిన ప్రమాణానికి షరతులు లేవని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ప్రమాణానికి షరతులు లేకపోవడం అంటే ఏమిటి? అంటే ఏవో కొన్ని పరిస్థితుల్లో కాదుగానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఆఖరికి మీ స్నేహితులు-అమ్మానాన్నలు యెహోవాను ఆరాధించడం మానేసినా మీరు మాత్రం ఆయన్ను సేవించడం ఆపరని ప్రమాణం చేశారు. (కీర్త. 27:10) ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండడానికి సహాయం చేయమని ప్రతీ సందర్భంలో యెహోవాను అడుగుతూ ఉండండి.—ఫిలిప్పీయులు 4:11-13 చదవండి.

7. “భయంతో, వణకుతో” సొంత రక్షణ కోసం కృషిచేయడం అంటే ఏమిటి?

7 మీరు తనతో స్నేహం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. కానీ ఆ స్నేహాన్ని బలంగా ఉంచుకోవాలన్నా, మీ సొంత రక్షణను సంపాదించుకోవాలన్నా చాలా కృషిచేయాలి. నిజానికి, “భయంతో, వణకుతో మీ సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి” అని ఫిలిప్పీయులు 2:12 చెప్తుంది. ఆ మాటలకు అర్థమేమిటి? యెహోవాతో బలమైన సంబంధం కలిగివుండడానికి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నమ్మకంగా ఉండడానికి మీరేమి చేస్తారో జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు. ఎంతోకాలంపాటు యెహోవా సేవచేసినవాళ్లు కూడా చివరివరకు నమ్మకంగా ఉండలేకపోయారని గుర్తుంచుకోండి. మరి, సొంత రక్షణ కోసం మీరెలాంటి చర్యలు తీసుకోవచ్చు?

బైబిల్ని లోతుగా అధ్యయనం చేయాలి

8. వ్యక్తిగత అధ్యయనం అంటే ఏమిటి? అది ఎందుకు ప్రాముఖ్యం?

8 యెహోవాకు స్నేహితులు అవ్వాలంటే ఆయన చెప్పేది వినాలి, ఆయనతో మాట్లాడాలి. యెహోవా చెప్పేది వినేందుకు ముఖ్యమైన మార్గమేమిటంటే, వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడం. దానర్థం బైబిల్ని అలాగే బైబిలు ఆధారిత ప్రచురణల్ని చదవాలి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించాలి. బైబిల్ని అధ్యయనం చేయడమనేది, స్కూల్‌ పరీక్షల కోసం జవాబుల్ని గుర్తుపెట్టుకోవడం లాంటిది కాదు. బదులుగా, యెహోవా గురించి కొత్తకొత్త విషయాల్ని కనుగొనే ఆసక్తికరమైన ప్రయాణం లాంటిది. అలా చేయడంవల్ల మీరు ఆయనకు దగ్గరౌతారు, ఆయన కూడా మీకు దగ్గరౌతాడు.—యాకో. 4:8.

యెహోవా చెప్పేది వింటూ, ఆయనతో మాట్లాడుతున్నారా? (8-11 పేరాలు చూడండి)

9. మీ వ్యక్తిగత అధ్యయనానికి ఏ సహాయకాలు ఉపయోగపడ్డాయి?

9 మీకు వ్యక్తిగత అధ్యయనంలో ఉపయోగపడే ఎన్నో సహాయకాలను యెహోవా సంస్థ అందిస్తోంది. ఉదాహరణకు, jw.org వెబ్‌సైట్‌లో “టీనేజర్లు” విభాగంలో “బైబిల్ని స్టడీ చేద్దాం” అనే శీర్షిక కింద ఉన్న బైబిలు కథల నుండి మీకు ఉపయోగపడే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఆ వెబ్‌సైట్‌లో “బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?” స్టడీ గైడులు కూడా ఉన్నాయి. మీ విశ్వాసాన్ని మరింత పెంచుకోవడానికి, మీ నమ్మకాల్ని ఇతరులకు ఎలా వివరించాలో నేర్చుకోవడానికి అవి ఉపయోగపడతాయి. అంతేకాదు, 2013 ఏప్రిల్‌ 15 కావలికోట సంచికలో “బైబిలు చదవడం వల్ల వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందండి” అనే ఆర్టికల్‌ ఉంది. మీ వ్యక్తిగత అధ్యయనానికి ఉపయోగపడే మరికొన్ని సలహాలు అందులో ఉన్నాయి. బైబిల్ని అధ్యయనం చేయడం, అందులోని విషయాల గురించి లోతుగా ఆలోచించడం మీ సొంత రక్షణ కోసం మీరు చేసే కృషిలో ముఖ్యమైన భాగం.—కీర్తన 119:105 చదవండి.

ప్రార్థన చేయాలి

10. బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు ఎందుకు ప్రార్థన చేయాలి?

10 యెహోవా చెప్పేది వినేందుకు వ్యక్తిగత బైబిలు అధ్యయనం మార్గమైతే, యెహోవాతో మాట్లాడేందుకు ప్రార్థన ఒక మార్గం. ప్రార్థనను కేవలం ఒక అలవాటులా లేదా విజయానికి మంత్రంలా చూడకూడదు. ప్రార్థన అంటే మన సృష్టికర్తతో మాట్లాడడం. మనం మాట్లాడితే వినాలని యెహోవా కోరుకుంటున్నాడు. (ఫిలిప్పీయులు 4:6 చదవండి.) కాబట్టి ఏదైనా కారణంచేత ఆందోళనగా అనిపిస్తే మీ ‘భారాన్ని యెహోవామీద మోపమని’ బైబిలు చెప్తోంది. (కీర్త. 55:22) ఈ సలహా ఎంత బాగా పనిచేస్తుందో లక్షలమంది సహోదర సహోదరీలు తెలుసుకున్నారు. అది మీకు కూడా ఉపయోగపడుతుంది.

11. యెహోవాకు ఎల్లప్పుడూ ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి?

11 అయితే కేవలం యెహోవా సహాయం అవసరమైనప్పుడే ప్రార్థన చేయాలా? లేదు. బైబిలు మనకిలా గుర్తుచేస్తోంది, “కృతజ్ఞులై ఉండండి.” (కొలొ. 3:15) కొన్నిసార్లు మనం సమస్యలతో ఎంత సతమతమౌతామంటే, మనకు జరిగిన మంచిని కూడా గుర్తించలేకపోతాం. కాబట్టి ఇలా చేసి చూడండి: ప్రతీరోజు, మీకు జరిగిన మూడు మంచి విషయాలేమిటో ఆలోచించండి. వాటి విషయంలో యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి. 12 ఏళ్లప్పుడు బాప్తిస్మం తీసుకున్న అబీగయీల్‌ అనే టీనేజీ అమ్మాయి ఏమని అంటోందంటే, “విశ్వంలో అందరికన్నా ఎక్కువగా యెహోవాయే మన కృతజ్ఞతకు అర్హుడు. ఆయన మనకిచ్చిన బహుమానాల విషయంలో అవకాశం దొరికినప్పుడల్లా కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఒకసారి ఈ చక్కని జ్ఞాపికను విన్నాను: రేపు ఉదయం నిద్ర లేచేసరికి మీరు ఏయే విషయాల గురించైతే రాత్రి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పారో అవి మాత్రమే మిగిలివుంటే . . . మీ దగ్గర ఏమేమి ఉంటాయి?”

సొంత అనుభవం ఎంతో విలువైనది

12, 13. యెహోవా మంచితనాన్ని మీరెలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు? యెహోవా మీకెలా సహాయం చేశాడో ఆలోచించడం ఎందుకు ప్రాముఖ్యం?

12 రాజైన దావీదుకు తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు యెహోవా సహాయం చేశాడు. ఆ అనుభవంతోనే దావీదు ఇలా అన్నాడు, ‘యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి; ఆయన్ని ఆశ్రయించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.’ (కీర్త. 34:8, NW) ఆ వచనం చెప్తున్నట్లు, యెహోవా మంచితనాన్ని మనమే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. బైబిల్ని, బైబిలు ఆధారిత ప్రచురణల్ని చదివినప్పుడు అలాగే మీటింగ్స్‌కి హాజరైనప్పుడు నమ్మకంగా ఉండేలా దేవుడు ఇతరులకు ఎలా సహాయం చేశాడో మీరు తెలుసుకుంటారు. యెహోవాతో మీ సంబంధం బలపడే కొద్దీ, యెహోవా మీకు ఎలా సహాయం చేస్తున్నాడో మీరు తెలుసుకోగలగాలి. యెహోవా మంచితనాన్ని మీరు ఏయే సందర్భాల్లో రుచిచూశారు?

13 యెహోవా మంచితనాన్ని క్రైస్తవులైన ప్రతీఒక్కరు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రుచిచూశారు. అదెలాగో తెలుసా? ఆయన మనలో ప్రతీఒక్కరిని తన వైపుకు, తన కుమారుని వైపుకు రమ్మని ఆహ్వానించాడు. యేసు ఇలా చెప్పాడు, “నన్ను పంపించిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేరు. చివరి రోజున నేను అతన్ని పునరుత్థానం చేస్తాను.” (యోహా. 6:44) యెహోవా మిమ్మల్ని తనవైపు ఆకర్షించాడని అనిపిస్తోందా? లేదా ‘యెహోవా మా అమ్మానాన్నల్ని తనవైపు ఆకర్షించాడు, నేను కేవలం వాళ్లు చూపించిన దారిలో వెళ్తున్నాను అంతే’ అని అనుకుంటున్నారా? వాస్తవమేమిటంటే, మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించి బాప్తిస్మం తీసుకున్నప్పుడు, వ్యక్తిగతంగా యెహోవాతో మీకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది. బైబిలు మనకిలా చెప్తుంది, “ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తే, ఆ వ్యక్తి దేవునికి తెలుసు.” (1 కొరిం. 8:3) తన సంస్థలో యెహోవా మీకిచ్చిన స్థానాన్ని ఎప్పటికీ విలువైనదిగా ఎంచండి.

14, 15. బలమైన విశ్వాసం కలిగివుండడానికి ప్రీచింగ్‌ మీకెలా సహాయం చేస్తుంది?

14 యెహోవా మంచితనాన్ని రుచిచూడగల ఇంకో సందర్భం కూడా ఉంది. ప్రీచింగ్‌లో గానీ, స్కూల్‌లో గానీ మీ విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడే ధైర్యాన్ని యెహోవా మీకు ఇచ్చినప్పుడు ఆయన మంచితనాన్ని రుచిచూస్తారు. తోటి విద్యార్థులకు ప్రీచింగ్‌ చేయడం కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది. బహుశా వాళ్లెలా స్పందిస్తారోనని మీరు భయపడుతుండవచ్చు. మరి ముఖ్యంగా, ఎక్కువమంది ముందు మీ నమ్మకాల గురించి మాట్లాడాలంటే కంగారుగా అనిపించవచ్చు. మరి మీకు ఏమి సహాయం చేయగలదు?

15 మీరు ఏమి నమ్ముతున్నారో, ఎందుకలా నమ్ముతున్నారో ఆలోచించండి. ఒకవేళ jw.org వెబ్‌సైట్‌లోని స్టడీ గైడులు మీ భాషలో అందుబాటులో ఉంటే వాటిని చక్కగా ఉపయోగించుకోండి. మీ నమ్మకాలు ఏమిటో, వాటిని ఎందుకు నమ్ముతున్నారో, వాటిని ఇతరులకు ఎలా వివరించాలో ఆలోచించడానికి అవి మీకు సహాయం చేస్తాయి. మీ నమ్మకాలపై బలమైన విశ్వాసం కుదిరినప్పుడు, చక్కగా సిద్ధపడినప్పుడు యెహోవా గురించి ఇతరులకు చెప్పాలనే కోరిక మీలో కలుగుతుంది.—యిర్మీ. 20:8, 9.

16. మీ నమ్మకాల గురించి మాట్లాడే ధైర్యం తెచ్చుకోవడానికి మీకేమి సహాయం చేస్తుంది?

16 మీరు చక్కగా సిద్ధపడినప్పటికీ మీ నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడాలంటే భయంగా అనిపించవచ్చు. 13 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్న 18 ఏళ్ల సహోదరి ఇలా చెప్తోంది, “నా నమ్మకాలేమిటో నాకు తెలుసు. కానీ వాటిని వివరించడానికి తడబడుతుంటాను.” కాబట్టి ఆమె సత్యం గురించి తన సొంత మాటల్లో ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఇంకా ఇలా అంటోంది, “నా తోటి విద్యార్థులు, వాళ్లు చేసే పనుల గురించి ధైర్యంగా చెప్తారు. నేను కూడా అలానే చెప్పాలి. కాబట్టి నేను చెప్పాలనుకున్నదాన్ని మాటల మధ్యలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎలాగంటే, ‘మొన్న నేను బైబిలు గురించి ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే . . . ’ ఆ తర్వాత, నేను వాళ్లకు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తాను. ఆ విషయం బైబిలుకు సంబంధించింది కాకపోయినా, నేను బైబిలు గురించి వేరేవాళ్లతో ఏమి మాట్లాడానా అనే ఆత్రుత నా తోటివాళ్లలో కలుగుతుంది. కొన్నిసార్లు దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా నన్ను అడుగుతుంటారు. ఈ పద్ధతిని ఉపయోగించే కొద్దీ వాళ్లకు సాక్ష్యమివ్వడం మరింత తేలికౌతుంది. చివరికి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది.”

17. ఇతరులతో మాట్లాడడానికి మీకు ఇంకా ఏమి సహాయం చేస్తుంది?

17 మీరు తమపై శ్రద్ధ చూపిస్తున్నారని, తమను గౌరవిస్తున్నారని ఇతరులు గుర్తించినప్పుడు; మిమ్మల్నీ, మీ నమ్మకాల్నీ గౌరవించడం వాళ్లకు తేలికౌతుంది. ఉదాహరణకు 17 ఏళ్ల ఓలివీయ, టీనేజీకి రాకముందే బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇలా అంటోంది, “బైబిలు గురించి మాట్లాడితే నాకు మతపిచ్చి పట్టిందని అనుకుంటారేమో అని ఎప్పుడూ భయపడేదాన్ని.” కొంతకాలానికి ఆమె తన భయాలను పక్కనపెట్టి ఇలా ఆలోచించింది, “చాలామంది పిల్లలకు యెహోవాసాక్షుల గురించి ఏమీ తెలీదు. వాళ్లకు తెలిసిన యెహోవా సాక్షులు మనమే. కాబట్టి వాళ్లెలా స్పందిస్తారనేది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. మనం బిడియంగా, పిరికిగా ఉంటే, లేదా మన విశ్వాసం గురించి మాట్లాడడానికి జంకితే, ఇబ్బందిపడితే ఎలా? యెహోవాసాక్షులుగా ఉన్నందుకు మనం గర్వపడట్లేదని వాళ్లు అనుకోవచ్చు. ధైర్యంలేని మనతో వాళ్లు దురుసుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. అదే గనుక మన నమ్మకాల గురించి తడబడకుండా, ధైర్యంగా మాట్లాడితే వాళ్లు మనల్ని గౌరవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.”

సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి

18. సొంత రక్షణ కోసం కృషి చేయాలంటే మీరేమి చేయాలి?

18 మీ సొంత రక్షణ కోసం కృషిచేయడం గంభీరమైన బాధ్యత అని తెలుసుకున్నాం. ఆ బాధ్యతను నెరవేర్చాలంటే బైబిల్ని చదివి, చదివిన వాటిగురించి ఆలోచించాలి; యెహోవాకు ప్రార్థన చేయాలి; ఆయన వ్యక్తిగతంగా మీకు సహాయం చేసిన సందర్భాలన్నిటి గురించి లోతుగా ఆలోచించాలి. వీటిని చేసినప్పుడు యెహోవా మీ స్నేహితుడనే నమ్మకం మరింత బలపడుతుంది. అప్పుడు మీ నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడాలనే కోరిక మీలో కలుగుతుంది.—కీర్తన 73:28 చదవండి.

19. సొంత రక్షణ కోసం కృషిచేస్తే ఏమి పొందుతాం?

19 యేసు ఇలా చెప్పాడు, “ఓ వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను తన జీవితాన్ని త్యాగం చేసి, తన హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరిస్తూ ఉండాలి.” (మత్త. 16:24) అవును, యేసును అనుసరించాలనుకునే ప్రతీ క్రైస్తవుడు ఖచ్చితంగా తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలి. అలాచేస్తే ఇప్పుడు ఎన్నో దీవెనల్ని పొందుతారు, కొత్తలోకంలో శాశ్వత జీవితం సొంతం చేసుకుంటారు. కాబట్టి మీ సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించండి.