కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా​—⁠“రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” సంపాదించుకునేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి

తల్లిదండ్రులారా​—⁠“రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” సంపాదించుకునేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి

‘పసికందుగా ఉన్నప్పటి నుండే నీకు పవిత్ర లేఖనాలు తెలుసు. రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని అవి నీకు ఇవ్వగలవు.’2 తిమో. 3:15.

పాటలు: 141, 134

1, 2. తమ పిల్లలు యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు, కొంతమంది తల్లిదండ్రులు ఎందుకు ఆందోళనపడుతుంటారు?

 వేలమంది బైబిలు విద్యార్థులు యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుంటున్నారు. వాళ్లలో చాలామంది యౌవనులు చిన్నప్పటినుండే సత్యం నేర్చుకొని, ఉత్తమమైన జీవన విధానాన్ని ఎంచుకున్నారు. (కీర్త. 1:1-3) ఒకవేళ మీరు క్రైస్తవ తల్లిదండ్రులైతే, మీ అబ్బాయి లేదా అమ్మాయి బాప్తిస్మం తీసుకొనే రోజు కోసం మీరు ఎదురుచూస్తుండవచ్చు.—3 యోహా. 4 పోల్చండి.

2 కానీ మనసులో మీకు కొన్ని ఆందోళనలు ఉండివుంటాయి. ఎందుకంటే కొందరు యౌవనులు బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికి, దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడంవల్ల నిజంగా ఉపయోగం ఉందానని సందేహపడడం మీరు చూసివుంటారు. ఇంకొంతమంది యౌవనులు ఏకంగా సత్యాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్లలాగే మీ పిల్లలు కూడా కొంతకాలానికి సత్యంపట్ల ఉన్న ప్రేమ కోల్పోతారేమోనని మీరు భయపడుతుండవచ్చు. అంతేకాదు మీ అబ్బాయి లేదా అమ్మాయి, మొదటి శతాబ్దపు ఎఫెస్సులోని కొంతమంది క్రైస్తవుల్లా తయారౌతారేమోనని అనిపించవచ్చు. ఆ క్రైస్తవుల గురించి యేసు ఇలా అన్నాడు, “మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలేశావు.” (ప్రక. 2:4) మరి సత్యంపట్ల మీ పిల్లలకున్న ప్రేమ బలంగా ఉండడానికి, “రక్షణ పొందే దిశగా” ఎదగడానికి మీరెలా సహాయం చేయవచ్చు? (1 పేతు. 2:2) ఆ విషయాలను మనం తిమోతి ఉదాహరణ నుండి తెలుసుకుందాం.

“నీకు పవిత్ర లేఖనాలు తెలుసు”

3. (ఎ) తిమోతి యేసు బోధల్ని ఎలా నేర్చుకున్నాడు? వాటిని ఎలా పాటించాడు? (బి) పౌలు తిమోతితో ఏ మూడు విషయాల గురించి మాట్లాడాడు?

3 అపొస్తలుడైన పౌలు క్రీ.శ. 47⁠లో లుస్త్రకు మొట్టమొదటిసారి వచ్చాడు. టీనేజీలో ఉన్న తిమోతి, యేసు బోధల గురించి నేర్చుకున్నది కూడా బహుశా అప్పుడే కావచ్చు. అయితే నేర్చుకున్న విషయాలను తిమోతి పాటించాడు, రెండేళ్ల తర్వాత ప్రయాణ పనిలో పౌలుతో పాటు వెళ్లడం మొదలుపెట్టాడు. దాదాపు 16 సంవత్సరాలు గడిచాక పౌలు తిమోతికి ఇలా రాశాడు, “నువ్వు నేర్చుకున్నవాటిని, నీకు నమ్మకం కుదిరినవాటిని పాటిస్తూ ఉండు. ఎందుకంటే నీకు ఆ విషయాలు నేర్పించినవాళ్లను నువ్వు నమ్మవచ్చు. అంతేకాదు పసికందుగా ఉన్నప్పటి నుండే నీకు పవిత్ర లేఖనాలు [హీబ్రూ లేఖనాలు] తెలుసు. క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచడం వల్ల కలిగే రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని అవి నీకు ఇవ్వగలవు.” (2 తిమో. 3:14, 15) పౌలు తిమోతితో ఏమి అన్నాడో గమనించండి: (1) నీకు పవిత్ర లేఖనాలు తెలుసు, (2) నేర్చుకున్నవాటి పట్ల నమ్మకం కుదుర్చుకున్నావు, (3) క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచడం వల్ల రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని సంపాదించావు.

4. మీ పిల్లలకు బైబిలు విషయాలు నేర్పించడానికి మీరు వేటిని ఉపయోగించారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 నేడు హీబ్రూ-గ్రీకు లేఖనాలు భాగమై ఉన్న పవిత్ర లేఖనాలను మీ పిల్లలు తెలుసుకోవాలని క్రైస్తవ తల్లిదండ్రులైన మీరు కోరుకుంటారు. చిన్నపిల్లలు కూడా బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి, సంఘటనల గురించి నేర్చుకోవచ్చు. వాటిని పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులకు సహాయపడే ఎన్నో పుస్తకాలను, బ్రోషుర్లను, వీడియోలను యెహోవా సంస్థ తయారుచేసింది. వాటిలో ఏవి మీ భాషలో అందుబాటులో ఉన్నాయి? మీ పిల్లలు యెహోవాతో బలమైన సంబంధాన్ని కలిగివుండాలంటే వాళ్లు బైబిల్లోని విషయాలు తెలుసుకోవడం అవసరం.

‘నమ్మకం కుదుర్చుకోవడం’

5. (ఎ) ‘నమ్మకం కుదుర్చుకోవడం’ అంటే ఏమిటి? (బి) యేసు గురించిన మంచివార్త పట్ల తిమోతికి నమ్మకం కుదిరిందని మనమెలా చెప్పవచ్చు?

5 పిల్లలకు బైబిల్లోని వ్యక్తుల గురించి, సంఘటనల గురించి కేవలం నేర్పిస్తే సరిపోదు. తిమోతి నేర్చుకున్న విషయాల పట్ల ‘నమ్మకం కుదుర్చుకున్నాడు’ అని బైబిలు చెప్తోంది. పౌలు ఉపయోగించిన ఆ గ్రీకు పదబంధానికి “నమ్మకం ఉంచడం” లేదా “ఫలానా విషయం సత్యమని ఒప్పుకోవడం, నిజమని భావించడం” అనే అర్థాలు ఉన్నాయి. “పసికందుగా ఉన్నప్పటి” నుండే అంటే చాలా చిన్నతనం నుండే తిమోతికి హీబ్రూ లేఖనాలు తెలుసు. కొంతకాలానికి, యేసే మెస్సీయ అని ఆయనకు నమ్మకం కుదిరింది. తిమోతి విశ్వాసం ఎంత బలంగా ఉందంటే ఆయన బాప్తిస్మం తీసుకొని, పౌలుతోపాటు మిషనరీగా సేవచేశాడు.

6. బైబిలు పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడానికి మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు?

6 తిమోతిలాగే మీ పిల్లలు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, నేర్చుకున్నవాటి పట్ల ‘నమ్మకం కుదుర్చుకోవడానికి’ మీరెలా సహాయం చేయవచ్చు? మొదటిగా, ఓపిగ్గా ఉండండి. ఎందుకంటే బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సమయం పడుతుంది. అంతేకాదు, మీరు నమ్మిన విషయాల్ని మీ పిల్లలు కూడా నమ్ముతారని ఖచ్చితంగా చెప్పలేం. వాళ్లు తమ “ఆలోచనా సామర్థ్యాల్ని” ఉపయోగించి బైబిలోని విషయాల పట్ల వ్యక్తిగతంగా విశ్వాసం పెంచుకోవాలి. (రోమీయులు 12:1 చదవండి.) ఆ విషయంలో తల్లిదండ్రులుగా మీరెంతో సహాయం చేయవచ్చు. ముఖ్యంగా వాళ్లు ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ల విశ్వాసాన్ని బలపర్చడానికి ప్రయత్నించండి. ఈ విషయంలో ఒక తండ్రి అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం.

7, 8. (ఎ) తన కూతురికి నేర్పిస్తున్నప్పుడు ఒక క్రైస్తవ తండ్రి ఎలా ఓపిక చూపించాడు? (బి) మీ పిల్లల విషయంలో ఓపిక చూపించాల్సిన సందర్భం మీకెప్పుడు ఎదురైంది?

7 థామస్‌ అనే సహోదరునికి 11 ఏళ్ల కూతురు ఉంది. ఆయనిలా చెప్తున్నాడు, “కొన్నిసార్లు మా అమ్మాయి నన్ను, ‘భూమ్మీద జీవాన్ని పుట్టించడానికి యెహోవా పరిణామ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఉంటాడా? పరిస్థితుల్ని మంచిగా మార్చడానికి, అందరితోపాటు మనం కూడా ఓటు వేయవచ్చుగా?’ వంటి ప్రశ్నలు అడుగుతుంటుంది. వాటిని నమ్మకూడదని ఖరాకండిగా చెప్పేయాలని కొన్నిసార్లు నాకనిపిస్తుంది. కానీ అలా చెప్పను. ఎందుకంటే, ఒక వ్యక్తికి దేనిమీదైనా నమ్మకం కుదరాలంటే కావాల్సింది ఒక పెద్ద వాస్తవం కాదు, కేవలం చిన్నచిన్న రుజువులు.”

8 పిల్లలకు నేర్పించాలంటే ఓపిక అవసరమని థామస్‌కు తెలుసు. నిజానికి, క్రైస్తవులందరికీ ఓపిక అవసరం. (కొలొ. 3:12) తన కూతురికి నమ్మకం కుదరాలంటే సమయం పడుతుందని, ఆమెతో ఎన్నోసార్లు మాట్లాడాల్సి వస్తుందని, లేఖనాలను ఉపయోగించి ఆలోచింపజేసేలా మాట్లాడాలని ఆయన గ్రహించాడు. థామస్‌ ఇలా అంటున్నాడు, “నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన అంశాలను మా కూతురు నమ్ముతుందో లేదో, అవి ఆమెకు అర్థవంతంగా అనిపిస్తున్నయో లేవో నేనూ నా భార్య తెలుసుకోవాలని అనుకుంటాం. ఒకవేళ ఆమె ఏవైనా ప్రశ్నలు అడిగితే ఫర్లేదు. కానీ తను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా దేనినైనా నమ్మినప్పుడే నాకు కాస్త కంగారుగా అనిపిస్తుంది.”

9. బైబిలు చెప్తున్న విషయాలను నమ్మేలా మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

9 తల్లిదండ్రులు ఓపిగ్గా నేర్పించినప్పుడు, కాలం గడుస్తుండగా పిల్లలు తమ విశ్వాసం ఎంత “వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు” ఉందో అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. (ఎఫె. 3:18) అయితే మనం పిల్లల వయసుకు, అవగాహనకు తగ్గట్టు నేర్పించాలి. నేర్చుకుంటున్న విషయాల పట్ల వాళ్లకు విశ్వాసం పెరిగేకొద్దీ, తోటి విద్యార్థులు లేదా ఇతరులు వాళ్ల నమ్మకాలను ప్రశ్నించినప్పుడు, సులభంగా జవాబు చెప్పగలుగుతారు. (1 పేతు. 3:15) ఉదాహరణకు, చనిపోయినవాళ్ల పరిస్థితి ఏమిటో వివరించడానికి మీ పిల్లలు బైబిల్ని ఉపయోగించగలరా? బైబిలు ఇస్తున్న జవాబు వాళ్లకు సరైనదిగా అనిపిస్తుందా? a బైబిలు చెప్తున్నవాటిని నమ్మేలా మీ పిల్లలకు సహాయం చేయాలంటే ఓపిగ్గా ఉండాలని గుర్తుంచుకోండి. దానివల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి.—ద్వితీ. 6:6, 7.

10. మీ పిల్లల్లో విశ్వాసాన్ని పెంచడానికి మీరేమి చేయవచ్చు?

10 నిజానికి, మీ పిల్లలో విశ్వాసం పెరగాలంటే మీరు వాళ్లకు మంచి ఆదర్శం ఉంచడం కూడా ప్రాముఖ్యం. ముగ్గురు కూతుళ్లు ఉన్న స్టెఫనీ అనే సహోదరి ఇలా అంటోంది, “నా పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి నేనిలా ప్రశ్నించుకునేదాన్ని, ‘యెహోవా ఉన్నాడని, ఆయన ప్రేమగలవాడని, ఆయన మార్గాలు నీతియుక్తమైనవని నేను ఎందుకు నమ్ముతున్నానో నా పిల్లలకు చెప్తున్నానా? నేను యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నానని నా పిల్లలకు అర్థమౌతోందా?’ నేను నమ్మనివాటిని నా పిల్లలు నమ్మాలని కోరుకోవడం సరైనది కాదు.”

“రక్షణను పొందడానికి కావాల్సిన తెలివి”

11, 12. తెలివి అంటే ఏమిటి? అది వయసుతో వచ్చేది కాదని ఎలా చెప్పవచ్చు?

11 తిమోతికి (1) లేఖన పరిజ్ఞానం, (2) తన నమ్మకాల మీద బలమైన విశ్వాసం ఉన్నాయని నేర్చుకున్నాం. కానీ పవిత్ర లేఖనాలు తిమోతికి “రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” ఇవ్వగలవని పౌలు చెప్పిన మాటలకు అర్థమేమిటి?

12 లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీషు) 2వ సంపుటి ఏమి వివరిస్తుందంటే, బైబిలు ప్రకారం తెలివి అంటే ‘సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రమాదాల్ని తప్పించుకోవడానికి, ఆయా లక్ష్యాల్ని చేరుకోవడానికి లేదా అలా చేరుకోమని ఇతరులకు సలహా ఇవ్వడానికి జ్ఞానాన్ని, అవగాహనను ఉపయోగించే సామర్థ్యం. తెలివి మూర్ఖత్వానికి వ్యతిరేకం.’ బైబిలు ఇలా చెప్తుంది, “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును.” (సామె. 22:15) తెలివి ఉన్న చోట మూర్ఖత్వం ఉండదు కాబట్టి, తెలివి అనేది పరిణతికి ఒక సూచన. వయసు పెరగడం వల్ల కాదుగానీ యెహోవా పట్ల భయం, ఆయనకు లోబడాలనే కోరిక ఉండడం వల్లే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతాడు.—కీర్తన 111:10 చదవండి.

13. రక్షణ పొందడానికి కావాల్సిన తెలివిని సంపాదించుకున్నారని యౌవనులు ఎలా చూపించవచ్చు?

13 ఆధ్యాత్మికంగా తగినంత పరిణతి సాధించిన యౌవనులు, తమ కోరికల వల్ల లేదా తోటి యౌవనుల ప్రభావం వల్ల ‘సముద్రపు కెరటాలకు అటుఇటు కొట్టుకుపోయేటట్లు’ ఉండరు. (ఎఫె. 4:14) బదులుగా, ‘తప్పొప్పులను గుర్తించేలా’ తమ ‘వివేచనా సామర్థ్యాలకు’ శిక్షణనిస్తూ ఉంటారు. (హెబ్రీ. 5:14) కాబట్టి, తల్లిదండ్రులు లేదా వేరే పెద్దవాళ్లు గమనించకపోయినా వాళ్లు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. (ఫిలి. 2:12) రక్షణ పొందడానికి అలాంటి తెలివి అవసరం. (సామెతలు 24:14 చదవండి.) దాన్ని సంపాదించుకోవడానికి మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు? మొదటిగా, మీరు పాటించే బైబిలు ప్రమాణాలేమిటో మీ పిల్లలకు స్పష్టంగా చెప్పండి. వాటి ప్రకారం జీవించడానికి మీరు కృషి చేస్తున్నారని మీ మాటల ద్వారా, పనుల ద్వారా వాళ్లకు తెలియజేయండి.—రోమా. 2:21-23.

తల్లిదండ్రులు కృషి చేస్తూనే ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? (14-18 పేరాలు చూడండి)

14, 15. (ఎ) బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్న యౌవనులు వేటిగురించి ఆలోచించాలి? (బి) దేవుని ఆజ్ఞలకు లోబడితే వచ్చే ఆశీర్వాదాల గురించి మీ పిల్లలు ఆలోచించేలా మీరెలా సహాయం చేయవచ్చు?

14 మంచేదో, చెడేదో చెప్పినంత మాత్రాన మీ పిల్లల్లో విశ్వాసం పెరగదు. దాంతోపాటు, ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించేలా కూడా వాళ్లకు సహాయం చేయాలి, ‘ఈ లోకంలో ఆకర్షణీయంగా కనిపించేవాటికి దూరంగా ఉండమని బైబిలు ఎందుకు చెప్తుంది? బైబిలు ప్రమాణాలు పాటించడం వల్ల నాకెప్పుడూ మంచే జరుగుతుందని నేనెలా నమ్మవచ్చు?’—యెష. 48:17, 18.

15 ఒకవేళ బాప్తిస్మం తీసుకోవాలని మీ పిల్లలు అనుకుంటుంటే, బాప్తిస్మంతోపాటు వచ్చే బాధ్యతల గురించి ఆలోచించడానికి వాళ్లకు సహాయం చేయండి. ఉదాహరణకు, ఆ బాధ్యతల గురించి వాళ్లు ఎలా భావిస్తున్నారు? బాప్తిస్మం తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు, సవాళ్లు ఏమిటి? సవాళ్లకన్నా ప్రయోజనాలే ఎందుకు ఎక్కువుంటాయి? (మార్కు 10:29, 30) బాప్తిస్మానికి ముందే ఈ విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. దేవుని ఆజ్ఞలకు లోబడడం వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి, లోబడకపోతే వచ్చే నష్టాల గురించి లోతుగా ఆలోచించేలా మీ పిల్లలకు సహాయం చేయండి. దానివల్ల, బైబిలు ప్రమాణాలు పాటిస్తే ఎప్పుడూ మంచే జరుగుతుందని గట్టి నమ్మకం కుదురుతుంది.—ద్వితీ. 30:19, 20.

బాప్తిస్మం తీసుకున్న తర్వాత బైబిలు సత్యాలను సందేహిస్తే . . .

16. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పిల్లల విశ్వాసం తగ్గడం మొదలైతే తల్లిదండ్రులు ఏమి చేయాలి?

16 బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీ పిల్లలు, బైబిలు సత్యాలను సందేహిస్తుంటే మీరేమి చేయవచ్చు? ఉదాహరణకు, మీ అబ్బాయి లేదా అమ్మాయి లోకానికి ఆకర్షితులు కావచ్చు. లేదా బైబిలు సూత్రాలను పాటించడం నిజంగా తెలివైన పనేనా అని సందేహించవచ్చు. (కీర్త. 73:1-3, 12, 13) అలాంటి పరిస్థితుల్లో, తల్లిదండ్రులైన మీరు ఎలా స్పందిస్తారనే దాన్నిబట్టే మీ పిల్లలు యెహోవాను ఆరాధించడంలో కొనసాగుతారా లేదా అనేది ఆధారపడివుంటుంది. కానీ మీ పిల్లలు టీనేజీ వయసువాళ్లయినా లేక అంతకన్నా చిన్నవాళ్లయినా ఈ విషయాల గురించి వాళ్లతో గొడవపడకండి. బదులుగా మీరు వాళ్లను ప్రేమిస్తున్నారని, వాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నారని తెలుసుకునేలా చేయండి.

17, 18. యౌవనులకు సందేహాలు ఉంటే తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

17 బాప్తిస్మం తీసుకున్న యౌవనులు తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నారు. అంటే, అన్నిటికన్నా ఎక్కువగా యెహోవాను ప్రేమిస్తారని, ఆయన్ను సేవిస్తారని మాటిచ్చారు. (మార్కు 12:30 చదవండి.) యెహోవా ఆ ప్రమాణాన్ని చాలా గంభీరమైనదిగా చూస్తాడు. మనం కూడా అలాగే చూడాలి. (ప్రసం. 5:4, 5) ఈ విషయాన్ని మీ పిల్లలకు గుర్తుచేయండి. కానీ దానికన్నా ముందు, సంస్థ తల్లిదండ్రుల కోసం తయారుచేసిన సమాచారాన్ని చదివి, అధ్యయనం చేయండి. తర్వాత సరైన సమయం చూసి మీ పిల్లలతో దయగా మాట్లాడుతూ, యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడం చాలా గంభీరమైనదనీ, కానీ దానివల్ల చాలా దీవెనలు ఉంటాయనీ చెప్పండి.

18 ఉదాహరణకు, 2012 జూలై కావలికోట సార్వజనిక ప్రతిలో “ఎదుగుతున్న మీ అబ్బాయి మీ మత నమ్మకాలను ప్రశ్నిస్తే” అనే ఆర్టికల్‌లో మంచి సలహాను మీరు చూడవచ్చు. పిల్లలు మీ నమ్మకాల్ని ప్రశ్నిస్తే వాళ్లకు సత్యమంటే ఇష్టం లేదని వెంటనే ఒక ముగింపుకు రాకండి. బదులుగా ఆ ఆర్టికల్‌ చెప్తున్నట్లు, అసలు సమస్య ఏమిటో తెలుసుకోండి. బహుశా తోటివాళ్ల ఒత్తిడి, ఒంటరితనం లేదా తమకన్నా మిగతా యౌవనులు యెహోవా సేవను బాగా చేస్తున్నారనే నిరుత్సాహం వల్ల మీ పిల్లలు సత్యాన్ని సందేహిస్తుండవచ్చు. అంతమాత్రాన వాళ్లు మీ నమ్మకాలను ఒప్పుకోవట్లేదని కాదు. బదులుగా, ఏదో ఇబ్బంది వల్లే ప్రస్తుతం వాళ్లకు అలా అనిపిస్తుండవచ్చు. అయితే అలాంటి పిల్లలకు తల్లిదండ్రులు ఎలా సహాయం చేయాలో తెలియజేసే సలహాలు కూడా ఆ ఆర్టికల్‌లో ఉన్నాయి.

19. “రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” సంపాదించుకోవడానికి తల్లిదండ్రులు పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

19 ‘యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇస్తూ’ పిల్లలను పెంచే ప్రాముఖ్యమైన బాధ్యత, మంచి అవకాశం తల్లిదండ్రులకు ఉంది. (ఎఫె. 6:4) అంటే, బైబిలు చెప్తున్న విషయాలను మీ పిల్లలకు నేర్పించి, వాటిపై నమ్మకం కుదుర్చుకునేలా వాళ్లకు సహాయం చేయాలి. వాళ్ల విశ్వాసం బలపడినప్పుడు, యెహోవాకు సమర్పించుకొని ఆయనను హృదయపూర్వకంగా సేవించడానికి ముందుకొస్తారు. యెహోవా ఇచ్చిన బైబిలు, ఆయన పవిత్రశక్తి, మీరు చేసే కృషివల్ల మీ పిల్లలు “రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” సంపాదించుకోవాలని మేము కోరుకుంటున్నాం.

a బైబిలు సత్యాలను అర్థంచేసుకోవడానికి, వాటిని ఇతరులకు వివరించడానికి పిల్లలకు, పెద్దలకు ఉపయోగపడే చక్కని ఉపకరణాలు ఏమిటంటే, “బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?” పుస్తకం ఆధారంగా తయారుచేసిన స్టడీ గైడులు. అవి చాలా భాషల్లో jw.org వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వాటిని బైబిలు బోధలు > బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి సెక్షన్‌లో చూడవచ్చు.