కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

బైబిలు ప్రకారం, పెళ్లయిన క్రైస్తవులు పిల్లలు పుట్టకుండా IUDలు (ఇంట్రా యుటరైన్‌ డివైజ్‌) వాడవచ్చా?

ఈ విషయంలో క్రైస్తవ దంపతులు బైబిలు సూత్రాలను, వాస్తవాలను పరిగణలోకి తీసుకుని ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. అప్పుడు వాళ్లు దేవుని ముందు మంచి మనస్సాక్షితో ఉండగలుగుతారు.

పూర్వం కేవలం ఇద్దరు మనుషులే ఉన్నప్పుడు, (అలాగే జలప్రళయం తర్వాత ఎనిమిదిమంది ఉన్నప్పుడు) యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు, “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.” (ఆది. 1:28; 9:1) ఆ ఆజ్ఞ ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా వర్తిస్తుందని బైబిలు చెప్పట్లేదు. కాబట్టి, కుటుంబ నియంత్రణకు లేదా కొంతకాలం వరకు పిల్లల్ని కనకుండా ఉండడానికి ఏ రకమైన గర్భనిరోధకాలు వాడాలనేది ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. అయితే, వాళ్లు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది?

క్రైస్తవులు ఎలాంటి గర్భనిరోధకాలు వాడినా, అవి బైబిలు సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. పిల్లలు వద్దనుకునే క్రైస్తవులు గర్భస్రావం చేయించుకోరు. కావాలని గర్భస్రావం చేయించుకుంటే, జీవాన్ని విలువైనదిగా చూడాలనే బైబిలు సూత్రాన్ని ఉల్లంఘించినట్లే. పిండం ఎదిగి ఒక మనిషిగా తయారౌతుంది కాబట్టి, దాన్ని కడుపులోనే చంపాలని క్రైస్తవులు ఎన్నడూ కోరుకోరు. (నిర్గ. 20:13; 21:22-24; కీర్త. 139:16; యిర్మీ. 1:4, 5) మరైతే, IUDలు వాడే విషయమేమిటి?

దీనిగురించి 1979, మే 15 కావలికోట (ఇంగ్లీషు) సంచిక (30-31 పేజీలు) వివరించింది. పిల్లలు పుట్టకుండా గర్భసంచిలో అమర్చే ప్లాస్టిక్‌ IUDలు అప్పట్లో ఎక్కువగా అందుబాటులో ఉండేవి. అవి ఎలా పనిచేస్తాయో పూర్తిగా తెలీదని ఆ ఆర్టికల్‌ చెప్పింది. వీర్యకణం అండానికి చేరకుండా, అలాగే అండం ఫలదీకరణం చెందకుండా IUD పరికరం గర్భసంచిలో కొన్ని రియాక్షన్లు తీసుకొస్తుందని చాలామంది డాక్టర్లు చెప్పారు. అండం ఫలదీకరణం చెందదు కాబట్టి పిండం ఏర్పడదు.

కానీ, IUDలు వాడినా కొన్నిసార్లు అండం ఫలదీకరణం చెందే అవకాశం ఉందని కొన్ని రుజువులు చూపిస్తున్నాయి. అలా ఫలదీకరణం చెందిన అండం ఫాలొపియన్‌ గొట్టంలో (Fallopian tube) పెరగవచ్చు (అండం గర్భసంచిలో కాకుండా వేరే దగ్గర పెరగడాన్ని ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అంటారు) లేదా గర్భసంచిలోకి ప్రవేశించవచ్చు. ఒకవేళ గర్భసంచిలోకి ప్రవేశిస్తే, అక్కడున్న IUD పరికరం ఆ అండాన్ని గర్భసంచికి అంటుకోనివ్వదు, దాన్ని ఎదగనివ్వదు. అలా అప్పటికే ఏర్పడిన జీవాన్ని చంపడం గర్భస్రావమే అవుతుంది. కాబట్టి, ‘IUD పరికరాన్ని వాడాలనుకునే నిజక్రైస్తవులు, ఆ విషయాలన్నిటిని మనసులో ఉంచుకోవాలి. అదే సమయంలో జీవాన్ని గౌరవించాలని బైబిలు చెప్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి’ అని ఆ ఆర్టికల్‌ చెప్పింది.—కీర్త. 36:9.

ఆ ఆర్టికల్‌ 1979⁠లో ప్రచురించబడిన తర్వాత నుండి IUDల విషయంలో వైజ్ఞానికంగా లేదా వైద్యపరంగా ఏమైనా అభివృద్ధి జరిగిందా?

అవును, రెండు రకాల IUDలు అందుబాటులోకి వచ్చాయి. 1988 కల్లా అమెరికాలో కాపర్‌ (రాగి) IUDలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, 2001⁠లో హార్మోన్‌ను విడుదల చేసే IUDలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎలా పనిచేస్తాయి?

కాపర్‌ IUD: పైన పేర్కొన్నట్లుగా, వీర్యకణం అండానికి చేరకుండా IUDలు అడ్డుపడతాయి. కానీ కాపర్‌ IUDల విషయానికొస్తే, వాటిలో నుండి విడుదలయ్యే కాపర్‌ వీర్యకణాన్ని అడ్డుకోవడమే కాకుండా, దాన్ని చంపేస్తుంది. అంటే ఒక స్పెర్మిసైడ్‌లా కూడా పనిచేస్తుంది. a అంతేకాదు, కాపర్‌ IUDలు గర్భసంచిలోని పొరల్లో రియాక్షన్‌ తీసుకొస్తాయి.

హార్మోన్‌ IUD: గర్భనిరోధక మాత్రల్లో ఎక్కువగా ఉపయోగించే హార్మోనే ఈ IUDల్లో ఉంటుంది. ఈ IUDలు గర్భసంచిలో హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇవి కొంతమంది స్త్రీలలో అండం ఉత్పత్తి అవ్వకుండా చేస్తాయి. కాబట్టి అండం ఉత్పత్తి అవ్వకపోతే, అసలు ఫలదీకరణం అనేదే జరగదు. దాంతోపాటు ఈ IUDల్లో ఉండే హార్మోన్‌ గర్భసంచిలోని పొరల్ని పల్చగా చేస్తుంది. b అంతేకాదు, గర్భసంచి ముఖద్వారం (cervix) దగ్గర ఉండే జిగురు పదార్థాన్ని గట్టిగా చేస్తుంది, దానివల్ల వీర్యం యోనిలో నుండి గర్భసంచికి వెళ్లలేదు. మామూలు IUDలు చేసే పనులతో పాటు హార్మోన్‌ IUDలు వీటన్నిటిని అదనంగా చేస్తాయి.

ఇప్పటివరకు పరిశీలించినట్లుగా, ఈ రెండు రకాల IUDలు గర్భసంచిలోని పొరల్లో మార్పు తెస్తాయని అర్థమౌతుంది. కానీ ఒకవేళ అండం విడుదలై, ఫలదీకరణం జరిగితే అప్పుడేంటి? ఆ అండం గర్భసంచిలోకి ప్రవేశించవచ్చు, కానీ అది అతుక్కోవడానికి గర్భసంచి పొరలు అంతగా సహకరించవు. దానివల్ల పిండం ప్రారంభ దశలోనే చనిపోతుంది. అయితే అలా జరగడం చాలా అరుదు. గర్భనిరోధక మాత్రల ద్వారా కూడా అప్పుడప్పుడు ఇలా జరగవచ్చు.

కాబట్టి, కాపర్‌ IUDలుగానీ, హార్మోన్‌ IUDలుగానీ అండం ఫలదీకరణం జరగకుండా చేస్తాయని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. కానీ పైన చర్చించుకున్నట్లుగా IUDలు ఎన్నో విధాలుగా పనిచేస్తాయి కాబట్టి, అవి వాడితే గర్భం రావడం చాలా అరుదని రుజువైంది.

IUDలు వాడాలనుకుంటున్న క్రైస్తవ దంపతులు డాక్టర్‌ను సంప్రదించి, స్థానికంగా ఎలాంటి IUDలు అందుబాటులో ఉన్నాయో, వాటివల్ల వచ్చే లాభనష్టాలు ఏమిటో చర్చించవచ్చు. అంతేగానీ తాము ఏమి చేయాలో నిర్ణయించే అధికారాన్ని మూడో వ్యక్తికి ఇవ్వకూడదు, ఆఖరికి డాక్టర్‌కైనా సరే. (రోమా. 14:12; గల. 6:4, 5) అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవున్ని సంతోషపెట్టేలా, ఆయన దగ్గర శుద్ధమైన మనస్సాక్షి కలిగివుండేలా నిర్ణయం తీసుకోవాలి.—1 తిమోతి 1:18, 19; 2 తిమోతి 1:3 పోల్చండి.

a ఇంగ్లాండ్స్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ గైడ్‌ ఇలా నివేదించింది, “ఎక్కువ కాపర్‌ ఉన్న IUDలు 99 శాతం కన్నా ఎక్కువ సురక్షితం. అంటే ఒక సంవత్సరంలో, IUDలు వాడే 100 మంది స్త్రీలలో ఒక్కరు గర్భవతి అయ్యే అవకాశం కూడా అరుదు. తక్కువ కాపర్‌ ఉన్న IUDలు తక్కువ సురక్షితం.”

b హార్మోన్‌ IUDలు గర్భసంచిలోని పొరల్ని పల్చగా చేస్తాయి కాబట్టి, అధిక రక్తస్రావంతో బాధపడుతున్న పెళ్లయిన లేదా పెళ్లికాని స్త్రీలకు డాక్టర్లు కొన్నిసార్లు వీటిని సిఫారసు చేస్తారు.