కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషిస్తారు’

‘నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషిస్తారు’

డయానా 80 ఏళ్లు దాటిన వృద్ధురాలు. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆమె భర్తకు అల్జీమర్స్‌ వ్యాధి వచ్చి, కొంతకాలం హాస్పిటల్‌లో ఉండి చనిపోయాడు. ఆమె ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. అంతేకాదు ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడింది. కానీ ఆమె మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తుందని సహోదరసహోదరీలు చెప్తుంటారు.

జాన్‌ 43 ఏళ్లపాటు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేశాడు. ఆయనకు ఆ నియామకం ఎంత ఇష్టమంటే, అదే ఆయన జీవితం అయిపోయింది. కానీ అనారోగ్యంతో ఉన్న కుటుంబసభ్యుని బాగోగులు చూసుకోవడానికి జాన్‌ ఆ సేవను ఆపేయాల్సివచ్చింది. అయినప్పటికీ ఆయన ముఖంలో సంతోషం ఏ మాత్రం చెక్కుచెదరలేదని సమావేశాల్లో జాన్‌ని కలిసిన సహోదరసహోదరీలు అంటారు.

డయానా, జాన్‌ల సంతోషానికి రహస్యం ఏంటి? కష్టాల్లో ఉన్నప్పుడు, బాగా ఇష్టమైన నియామకాన్ని వదిలేయాల్సి వచ్చినప్పుడు సంతోషంగా ఉండడం ఎలా సాధ్యం? దానికి బైబిలు ఇలా జవాబిస్తుంది, ‘నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషిస్తారు.’ (కీర్త. 64:10) ఆ సత్యాన్ని అర్థంచేసుకోవాలంటే, ఏది శాశ్వతకాలం ఉండే సంతోషాన్ని ఇస్తుందో, ఏది ఇవ్వదో తెలుసుకోవాలి.

తాత్కాలికంగా ఉండే సంతోషం

కొన్ని విషయాలు మనకు సంతోషాన్నిస్తాయి. ఉదాహరణకు, ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నప్పుడు, లేదా ఒకవ్యక్తి తండ్రో, తల్లో అయినప్పుడు, లేదా యెహోవా సేవలో కొత్త నియామకం దొరికినప్పుడు వాళ్లకెలా అనిపిస్తుందో ఆలోచించండి. ఇవన్ని యెహోవా ఇచ్చే బహుమతులు కాబట్టి సంతోషాన్నిస్తాయి. పెళ్లి, పిల్లల్ని కనడం, సంస్థలో పనిచేయడం ఇవన్నీ యెహోవా నుండే వస్తాయి!—ఆది. 2:18, 22; కీర్త. 127:3; 1 తిమో. 3:1.

అయితే, కొన్నిసార్లు ఆ సంతోషం తాత్కాలికం కావచ్చు. ఎందుకంటే, వివాహజత నమ్మకద్రోహం చేయవచ్చు లేదా చనిపోవచ్చు. (యెహె. 24:18; హోషే. 3:1) పిల్లలు తల్లిదండ్రులకు, దేవునికి అవిధేయులు అవ్వొచ్చు, ఆఖరికి సంఘం నుండి బహిష్కరించబడవచ్చు కూడా. ఉదాహరణకు, సమూయేలు కొడుకులు యెహోవా అంగీకరించే విధంగా సేవచేయలేదు, దావీదు బత్షెబతో వ్యభిచారం చేయడం వల్ల అతని కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. (1 సమూ. 8:1-3; 2 సమూ. 12:11) ఇలాంటివి జరిగినప్పుడు, సంతోషానికి బదులు ఎంతో దుఃఖం, వేదన కలుగుతాయి.

అదేవిధంగా కొన్నిసార్లు అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, లేదా సంస్థలో వచ్చిన మార్పుల కారణంగా యెహోవా సేవలో మనకున్న నియామకాన్ని విడిచిపెట్టాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న చాలామంది తమ ఆనందాన్ని కోల్పోయామని చెప్తున్నారు.

పైన ప్రస్తావించిన విషయాలు తాత్కాలిక సంతోషాన్నిస్తాయని స్పష్టంగా అర్థమౌతుంది. మరైతే కష్టాల్లో కూడా సంతోషంగా ఉండవచ్చా? తప్పకుండా ఉండవచ్చు. ఎందుకంటే సమూయేలు, దావీదు, మరితరులు కష్టాల్లో కూడా సంతోషంగా ఉన్నారు.

శాశ్వతకాలం ఉండే సంతోషం

సంతోషంగా ఉండడం అంటే ఏంటో యేసుకు తెలుసు. ఆయన భూమ్మీదికి రాకముందు ‘నిత్యము [యెహోవా] సన్నిధిలో ఆనందించాడు’ అని బైబిలు చెప్తుంది. (సామె. 8:30) కానీ భూమ్మీదికి వచ్చాక, యేసు కొన్నిసార్లు తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, తన తండ్రి ఇష్టాన్ని చేయడం ఆయనకు సంతోషాన్నిచ్చింది. (యోహా. 4:34) మరి యేసు గడిపిన బాధాకరమైన చివరి క్షణాల సంగతేంటి? “ఆయన తన ముందు ఉంచబడిన సంతోషం కోసం హింసాకొయ్య మీద బాధను ఓర్చుకున్నాడు” అని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 12:2) నిజమైన సంతోషం గురించి యేసు చెప్పిన రెండు విషయాల నుండి మనమెంతో నేర్చుకోవచ్చు.

ఒకసారి 70 మంది శిష్యులు ప్రకటనా పని పూర్తి చేసుకుని యేసు దగ్గరకు తిరిగివచ్చారు. వాళ్లు చేసిన పనులన్నిటిని బట్టి, చెడ్డదూతల్ని వెళ్లగొట్టడాన్ని బట్టి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ యేసు వాళ్లతో ఇలా అన్నాడు, “చెడ్డదూతలు మీకు లోబడుతున్నారని సంతోషించకండి. బదులుగా, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి.” (లూకా 10:1-9, 17, 20) అవును, వేరే ఏ ప్రత్యేక నియామకం కన్నా యెహోవా ఆమోదం పొందడమే ముఖ్యం, అదే అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్నిస్తుంది.

మరో సందర్భంలో, యేసు ఒక గుంపుతో మాట్లాడుతున్నప్పుడు, ఒక యూదురాలు ఆయన బోధలకు ఎంత ముగ్ధురాలైందంటే, నీ కన్న తల్లి నిన్ను చూసి చాలా సంతోషిస్తుందని చెప్పింది. కానీ దానికి యేసు ఇలా జవాబిచ్చాడు, “దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!” (లూకా 11:27, 28) మన పిల్లల్ని చూసి గర్వపడిన క్షణాలు మనకు సంతోషాన్నిస్తాయి. కానీ యెహోవాకు విధేయత చూపించినప్పుడు, ఆయనతో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు శాశ్వతకాలం ఉండే సంతోషాన్ని పొందుతాం.

నిజానికి, యెహోవా ఆమోదాన్ని పొందామనే భావన మనకు చెప్పలేనంత సంతోషాన్నిస్తుంది. కష్టాలు ఆనందాన్ని ఇవ్వవు అలాగని యెహోవా ఆమోదాన్ని పొందామనే భావనను తీసివేయలేవు. మనం కష్టాల్లో కూడా నమ్మకంగా ఉంటే, మన సంతోషం రెట్టింపు అవుతుంది. (రోమా. 5:3-5) అంతేకాదు, యెహోవాపై నమ్మకం ఉంచేవాళ్లకు ఆయన తన పవిత్రశక్తిని ఇస్తాడు, అది పుట్టించే లక్షణాల్లో సంతోషం ఒకటి. (గల. 5:22) కాబట్టి కీర్తన 64:10⁠లో ‘నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషిస్తారు’ అని ఎందుకు చెప్పబడిందో మనం అర్థంచేసుకోవచ్చు.

జాన్‌ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఏది సహాయం చేసింది?

డయానా, జాన్‌ల సంతోషానికి రహస్యం ఏంటో ఇప్పుడు తెలిసింది. డయానా ఇలా చెప్తుంది, “ఒక పిల్లవాడు తన తండ్రి దగ్గరకు పరుగెత్తినట్లే, నేను యెహోవాను ఆశ్రయించాను. ప్రతీవారం చిరునవ్వుతో ప్రీచింగ్‌ చేయగలగడం యెహోవా ఇచ్చిన ఆశీర్వాదమే అని భావిస్తున్నాను.” జాన్‌ తన నియామకం నుండి వచ్చేశాక కూడా సంతోషంగా ఉండడానికి, పరిచర్యలో బిజీగా ఉండడానికి ఏది సహాయం చేసింది? ఆయనిలా అంటున్నాడు, “1998లో పరిచర్య శిక్షణా పాఠశాల ఉపదేశకునిగా నియమించబడినప్పటి నుండి ముందెప్పుడూ లేనంతగా వ్యక్తిగత అధ్యయనం చేశాను.” జాన్‌, ఆయన భార్య యెహోవా ఎక్కడ నియమిస్తే అక్కడ సేవచేయడానికి ఇష్టపడ్డారు కాబట్టి జీవితంలో వచ్చిన మార్పుకు అలవాటుపడడం తేలికైందని ఆయన చెప్తున్నాడు. ఆయనిలా అన్నాడు, “మా నియామకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినందుకు ఏమాత్రం బాధపడట్లేదు.”

కీర్తన 64:10 లోని మాటలు నిజమని చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఉదాహరణకు, అమెరికా బెతెల్‌లో 30 కన్నా ఎక్కువ ఏళ్లు సేవచేసిన ఒక జంట గురించి పరిశీలించండి. వాళ్లను ప్రత్యేక పయినీర్లుగా నియమించినప్పుడు ఇలా అన్నారు, “మనం ప్రేమించేది ఏదైనా దూరమైనప్పుడు బాధ కలగడం సహజమే. కానీ ఎప్పటికీ బాధపడుతూ ఉండలేం.” వాళ్లు తమ కొత్త నియామకానికి వెళ్లిన రోజు నుండే సంఘంతోపాటు ప్రీచింగ్‌ చేయడం మొదలుపెట్టారు. వాళ్లు ఇంకా ఇలా అన్నారు, “మేం కొన్ని నిర్దిష్ట అంశాల గురించి ప్రార్థించాం. మా ప్రార్థనలకు జవాబు దొరికినప్పుడు మాకెంతో ప్రోత్సాహంగా, సంతోషంగా అనిపించింది. మేం వచ్చిన కొంతకాలానికే సంఘంలో కొంతమంది పయినీరు సేవ మొదలుపెట్టారు. మాకు రెండు బైబిలు స్టడీలు దొరికాయి. వాళ్లు చక్కగా ప్రగతి సాధిస్తున్నారు.”

ఎల్లప్పుడూ సంతోషించండి

సంతోషంగా ఉండడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. మనకు బాధ కలిగించే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ కీర్తన 64:10 లోని మాటలతో యెహోవా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే, మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా యెహోవాకు విశ్వసనీయంగా ఉంటే ఆయన్నిబట్టి సంతోషిస్తామనే నమ్మకంతో ఉండవచ్చు. అంతేకాదు ‘కొత్త ఆకాశం, కొత్త భూమి’ తీసుకొస్తానని యెహోవా ఇచ్చిన మాట నెరవేరే రోజు కోసం ఆశతో ఎదురుచూడవచ్చు. అప్పుడు అందరూ పరిపూర్ణులౌతారు, యెహోవా చేసే పనుల్ని బట్టి ‘ఎల్లప్పుడూ హర్షించి ఆనందిస్తారు.’—యెష. 65:17, 18.

ఆ లేఖన నెరవేర్పును ఒక్కసారి ఊహించుకోండి. మనకు పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, ప్రతీరోజు ఉరకలువేసే ఉత్సాహంతో నిద్రలేస్తాం. గతంలో మనకు బాధ కలిగించిన ఏ విషయాలు అప్పుడు గుర్తుకురావు. ఎందుకంటే యెహోవా ఈ అభయాన్నిచ్చాడు, “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.” చనిపోయిన మన ప్రియమైనవాళ్లు పునరుత్థానం అవుతారు. అప్పుడు మనం కూడా, యేసు పునరుత్థానం చేసిన 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల్లా భావిస్తాం: “వాళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు” అని బైబిలు చెప్తుంది. (మార్కు 5:42) క్రమక్రమంగా, భూమ్మీదున్న ప్రతీఒక్కరు నీతిమంతులౌతారు, శాశ్వతకాలం యెహోవాను బట్టి సంతోషిస్తారు.