కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“పరదైసులో కలుద్దాం!”

“పరదైసులో కలుద్దాం!”

“నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు.”లూకా 23:43.

పాటలు: 145, 139

1, 2. పరదైసు గురించి ప్రజలకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి?

కొరియాలోని సియోల్‌ అనే ప్రాంతంలో జరిగిన సమావేశానికి, వేర్వేరు దేశాల నుండి చాలామంది సహోదరసహోదరీలు వచ్చారు. సమావేశం అయిపోయాక, వాళ్లు స్టేడియం వదిలి వెళ్తున్నప్పుడు స్థానిక సాక్షులు కంటతడి పెట్టుకున్నారు. చాలామంది చేతులు ఊపుతూ “పరదైసులో కలుద్దాం!” అని అన్నారు. ఇంతకీ వాళ్లు అన్న పరదైసు ఏంటి?

2 పరదైసు గురించి ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అది ఒక ఊహ అని కొందరంటారు. సంతోషం, సంతృప్తి ఉన్న చోటే పరదైసు అని ఇంకొందరు అంటారు. మరి మీరేమంటారు? మీరు పరదైసు కోసం ఎదురుచూస్తున్నారా?

3. బైబిల్లో పరదైసు గురించి మొట్టమొదటిసారి ఎక్కడ ప్రస్తావించబడింది?

3 గతంలో ఉన్న పరదైసు గురించి, భవిష్యత్తులో రాబోయే పరదైసు గురించి బైబిలు ప్రస్తావిస్తుంది. పరదైసు గురించి మొట్టమొదటిసారి బైబిల్లోని మొదటి పుస్తకంలో చదువుతాం. ఆదికాండము 2:8⁠లో ఇలా ఉంది: “దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి [లేదా ఆహ్లాదకరమైన పరదైసు, కాథోలిక్‌ డ్యుయే వర్షన్‌] తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.” “ఏదెను” అనే మాటకు “ఆహ్లాదం” అని అర్థం. నిజానికి ఆ తోట చాలా ఆహ్లాదకరంగా, అందంగా ఉండేది. అందులో ఆహారం కూడా సమృద్ధిగా ఉండేది, మనుషులకు జంతువులకు మధ్య శాంతి ఉండేది.—ఆది. 1:29-31.

4. ఏదెను తోటను పరదైసు అని ఎందుకు పిలవొచ్చు?

4 పారడియోసోస్‌ అనే గ్రీకు పదాన్ని హీబ్రూలో “తోట” అని అనువదించారు. మెక్లింటాక్‌, స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా ఇలా చెప్తుంది, ‘ఒక గ్రీసు దేశస్థుడు పారడియోసోస్‌ అనే పదం విన్నప్పుడు, అతను ఒక అందమైన, విశాలమైన, సురక్షితమైన ఉద్యానవనాన్ని ఊహించుకుంటాడు. అంతేకాదు రకరకాల పండ్లు కాసే చెట్లను, గలగలపారే సెలయేర్లను, వాటి ఒడ్డున లేడి పిల్లలు, గొర్రెల మందలు మేసే పచ్చిక బయళ్లను ఊహించుకుంటాడు.’—ఆదికాండము 2:15, 16 పోల్చండి.

5, 6. ఆదాముహవ్వలు పరదైసులో జీవించే అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నారు? కొంతమంది ఏమనుకుంటారు?

5 యెహోవా ఆదాముహవ్వలను అలాంటి తోటలో అంటే పరదైసులో ఉంచాడు. కానీ వాళ్లు యెహోవాకు అవిధేయత చూపించడంవల్ల పరదైసులో జీవించే అవకాశాన్ని చేజార్చుకున్నారు. వాళ్ల పిల్లలకు కూడా ఆ అవకాశం లేకుండా చేశారు. (ఆది. 3:23, 24) ఆదాముహవ్వల తర్వాత పరదైసులో ఎవ్వరూ నివసించకపోయినా, బహుశా నోవహు జలప్రళయం వచ్చేవరకు అది ఉనికిలో ఉండివుంటుంది.

6 కొంతమంది ఇలా అనుకోవచ్చు: ‘ఎప్పటికైనా భూమి మళ్లీ పరదైసుగా మారుతుందా?’ వాస్తవాలు ఏం చెప్తున్నాయి? ఇష్టమైనవాళ్లతో కలిసి పరదైసులో జీవించాలని మీరు కోరుకుంటున్నారా? అలా కోరుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? భవిష్యత్తులో పరదైసు ఖచ్చితంగా వస్తుందని ఎందుకు చెప్పవచ్చు?

భవిష్యత్తులో పరదైసు వస్తుందనడానికి ఆధారాలు

7, 8. (ఎ) యెహోవా అబ్రాహాముకు ఏ వాగ్దానం చేశాడు? (బి) ఆ వాగ్దానం విన్నప్పుడు అబ్రాహాము ఏం అనుకొనివుంటాడు?

7 పరదైసు గురించి వచ్చే ప్రశ్నలకు బైబిల్లోనే సరైన జవాబులు దొరుకుతాయి. ఎందుకంటే పరదైసును సృష్టించిన యెహోవాయే బైబిల్ని రాయించాడు. దేవుడు తన స్నేహితుడైన అబ్రాహాముకు ఏం చెప్పాడో పరిశీలించండి. ఆయన అబ్రాహాముతో ఇలా అన్నాడు, “సముద్రతీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను.” ఆ తర్వాత యెహోవా ఒక ప్రాముఖ్యమైన వాగ్దానం చేశాడు: “నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆది. 22:17, 18) కొంతకాలం తర్వాత యెహోవా ఆ వాగ్దానాన్ని అబ్రాహాము కొడుకుతో, మనవడితో మళ్లీ చెప్పాడు.—ఆదికాండము 26:4; 28:14 చదవండి.

8 మనుషులు తమ చివరి ప్రతిఫలం పరలోకంలోని పరదైసులో పొందుతారని అబ్రాహాము అనుకున్నట్లు బైబిల్లో ఎక్కడా లేదు. కాబట్టి “భూలోకములోని జనములన్నియు” ఆశీర్వదించబడతాయని యెహోవా మాటిచ్చినప్పుడు, అది భూమ్మీదే అని అబ్రాహాము అనుకొనివుంటాడు. అయితే, భూమ్మీదే పరదైసు ఉంటుందనడానికి ఇదొక్కటే ఆధారమా?

9, 10. భవిష్యత్తులో భూమ్మీదికి పరదైసు వస్తుందని నమ్మడానికి ఇంకా ఏ ఆధారాలు ఉన్నాయి?

9 అబ్రాహాము వంశస్థుల్లో ఒకడైన దావీదును యెహోవా ప్రేరేపించి, “భక్తిహీనులు” లేకుండాపోయే కాలం గురించి రాయించాడు. (కీర్త. 37:1, 2, 10) భక్తిహీనులకు బదులు, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని దావీదు రాశాడు. అంతేకాదు, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని కూడా ప్రవచించాడు. (కీర్త. 37:11, 29; 2 సమూ. 23:2) దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకునే వాళ్లపై ఆ మాటలు ఎలాంటి ప్రభావం చూపించాయి? ఏదోకరోజు నీతిమంతులు మాత్రమే ఈ భూమ్మీద ఉంటారని, భూమంతా మళ్లీ పరదైసులా అంటే ఏదెను తోటలా మారుతుందని నమ్మడానికి వాళ్లకు ఒక ఆధారం దొరికింది.

10 కాలం గడుస్తుండగా, యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పుకునే ఇశ్రాయేలీయుల్లో చాలామంది ఆయన్ని, సత్యారాధనను విడిచిపెట్టారు. దాంతో, బబులోనీయులు ఇశ్రాయేలీయుల్ని జయించి, వాళ్ల దేశాన్ని నాశనం చేసి, చాలామందిని బందీలుగా తీసుకెళ్లడానికి యెహోవా అనుమతించాడు. (2 దిన. 36:15-21; యిర్మీ. 4:22-27) కానీ 70 ఏళ్ల తర్వాత, ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి వస్తారని దేవుని ప్రవక్తలు ముందే చెప్పారు. ఆ ప్రవచనాలు నెరవేరాయి! అయితే అవి మన కాలానికి కూడా వర్తిస్తాయి. ఇప్పుడు వాటిలో కొన్నింటిని చర్చిస్తుండగా భవిష్యత్తులో పరదైసు భూమ్మీదికి వస్తుందని నమ్మడానికి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో గమనించండి.

11. యెషయా 11:6-9⁠లోని మాటల మొదటి నెరవేర్పు ఎప్పుడు జరిగింది? మనకు ఏ ప్రశ్న వస్తుంది?

11 యెషయా 11:6-9 చదవండి. ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగొచ్చినప్పుడు దేశమంతా శాంతిగా ఉంటుందని యెషయా ప్రవక్త ద్వారా యెహోవా ముందే చెప్పాడు. జంతువుల వల్ల లేదా మనుషుల వల్ల తమకు హాని జరుగుతుందని ఎవ్వరూ భయపడనక్కర్లేదు. పిల్లలు-వృద్ధులు సురక్షితంగా ఉంటారు. ఆ శాంతికరమైన పరిస్థితుల గురించి వింటుంటే, మీకు ఏదెను తోట గుర్తొస్తుందా? (యెష. 51:3) అయితే కేవలం ఇశ్రాయేలు దేశమే కాదు, భూమంతా యెహోవా జ్ఞానంతో నిండి ఉంటుందని యెషయా ప్రవచించాడు. మరి అదెప్పుడు జరుగుతుంది?

12. (ఎ) బబులోను చెర నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు ఎలాంటి దీవెనలు పొందారు? (బి) యెషయా 35:5-10⁠లోని మాటలు భవిష్యత్తులో కూడా నెరవేరతాయని ఏది చూపిస్తుంది?

12 యెషయా 35:5-10 చదవండి. బబులోను చెర నుండి వస్తున్న ఇశ్రాయేలీయులకు ఏ జంతువువల్ల లేదా ఏ మనిషివల్ల హాని జరగదని యెషయా మళ్లీ చెప్పాడని గమనించండి. అంతేకాదు ఏదెను తోటలో ఉన్నట్లే ఆ దేశంలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మంచి ఆహారం సమృద్ధిగా పండుతుందని ఆయన చెప్పాడు. (ఆది. 2:10-14; యిర్మీ. 31:12) అయితే ఆ ప్రవచనం ఇశ్రాయేలీయుల కాలంలో మాత్రమే నెరవేరుతుందా? గుడ్డివాళ్లు, కుంటివాళ్లు, చెవిటివాళ్లు బాగౌతారని కూడా ఆ ప్రవచనం చెప్తుందని గమనించండి. కానీ అది బబులోను చెర నుండి వచ్చిన ఇశ్రాయేలీయుల విషయంలో నెరవేరలేదు. బదులుగా అన్నిరకాల రోగాల్ని భవిష్యత్తులో బాగుచేస్తానని యెహోవా సూచిస్తున్నాడు.

13, 14. యెషయా 65:21-23⁠లోని ఏ మాటలు బబులోను చెర నుండి వచ్చిన ఇశ్రాయేలీయుల విషయంలో నెరవేరాయి? ఇంకా ఏ మాటలు నెరవేరాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

13 యెషయా 65:21-23 చదవండి. ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగొచ్చినప్పుడు, వాళ్లకు సౌకర్యవంతమైన ఇళ్లు లేదా పండించిన పొలాలు, ద్రాక్షతోటలు లేవు. కానీ యెహోవా దీవెన వల్ల కొంతకాలానికి పరిస్థితులు మారాయి. వాళ్లు ఇళ్లు కట్టుకుని వాటిలో నివసిస్తున్నప్పుడు, తాము పండించుకున్న ఆహారం తింటున్నప్పుడు ఎంత సంతోషించివుంటారో ఊహించండి!

14 ఈ ప్రవచనం ప్రకారం, మన ఆయుష్షు “వృక్షాయుష్యమంత” అవుతుందని గమనించండి. కొన్ని చెట్లు వేల సంవత్సరాలు బ్రతుకుతాయి. మనుషులు అంతకాలం బ్రతకాలంటే, వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఒకవేళ యెషయా ప్రవచించిన అందమైన, శాంతికరమైన వాతావరణంలో మనుషులు జీవించగలిగితే పరదైసు వచ్చినట్లే! అంతేకాదు ఆ ప్రవచనం కూడా నెరవేరుతుంది.

పరదైసు గురించి యేసు ఇచ్చిన మాట ఎలా నెరవేరుతుంది? (15, 16 పేరాలు చూడండి)

15. యెషయా పుస్తకంలో ప్రవచించబడిన కొన్ని ఆశీర్వాదాలు ఏంటి?

15 ఇప్పటివరకు చర్చించుకున్న దేవుని వాగ్దానాలు, భవిష్యత్తులో పరదైసు ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు ఇచ్చాయో ఆలోచించండి. దేవుని ఆశీర్వాదాలు పొందిన మనుషులతో భూమంతా నిండివుంటుంది. జంతువుల వల్ల, క్రూరులైన మనుషుల వల్ల హాని జరుగుతుందని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం ఉండదు. గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, కుంటివాళ్లు బాగౌతారు. ప్రజలు సొంత ఇళ్లు కట్టుకుని, స్వయంగా పండించుకున్న ఆహారం తింటారు. వాళ్లు వృక్షాల కన్నా ఎక్కువకాలం జీవిస్తారు. అవును, అలాంటి పరదైసు వస్తుందనడానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ ప్రవచనాలు భూపరదైసు గురించి చెప్పట్లేదని కొంతమంది అనొచ్చు. మరి వాళ్లకు మీరెలా జవాబిస్తారు? నిజమైన భూపరదైసు కోసం ఎదురుచూడడానికి మనకు సరైన కారణం ఉందా? భూమ్మీద జీవించిన అత్యంత గొప్ప వ్యక్తి అయిన యేసు మనకు ఆ కారణాన్ని చెప్పాడు.

నువ్వు పరదైసులో ఉంటావు!

16, 17. యేసు పరదైసు గురించి ఏ సందర్భంలో మాట్లాడాడు?

16 యేసు ఏ తప్పూ చేయకపోయినా ఆయన్ని దోషిగా తీర్పుతీర్చి, ఇద్దరు యూదా నేరస్తుల మధ్య కొయ్యకు వేలాడదీశారు. ఆ నేరస్తుల్లో ఒకడు, యేసు రాజని గుర్తించి ఇలా అన్నాడు, “యేసూ, నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు నన్ను గుర్తుచేసుకో.” (లూకా 23:39-42) యేసు ఆ నేరస్తునికి ఇచ్చిన మాట మీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. ఆయనిచ్చిన మాట లూకా 23:43⁠లో నమోదు చేయబడింది. ఆ మాటల్ని ఎలా అనువదించాలనే దానిగురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఆదిమ భాషలో ఆ మాటలు ఈ అర్థాన్నిస్తాయని కొంతమంది విద్వాంసులు చెప్తారు: “ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు.” కానీ, యేసు చెప్పిన మాటలకు ఇదే సరైన అర్థమని అందరూ ఒప్పుకోకపోవచ్చు. మరి, “ఈ రోజు” అని అన్నప్పుడు యేసు ఉద్దేశం ఏంటి?

17 నేడు ఎన్నో భాషల్లో, ఒక వాక్యానికున్న సరైన అర్థాన్ని తెలియజేయడానికి విరామ చిహ్నాలు ఉపయోగిస్తారు లేదా వాక్య నిర్మాణాన్ని మారుస్తారు. కానీ ప్రాచీన గ్రీకు రాతప్రతుల్లో విరామ చిహ్నాలు ఎక్కువగా ఉపయోగించేవాళ్లు కాదు. కాబట్టి మనకు ఈ ప్రశ్నలు రావచ్చు: యేసు, “ఈ రోజు నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావని మాటిస్తున్నాను” అని చెప్పాడా? లేదా “ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” అని చెప్పాడా? యేసు మాటల్ని తాము అర్థంచేసుకున్న దాన్నిబట్టి అనువాదకులు వాక్య నిర్మాణాన్ని మారుస్తారు. పైన చెప్పిన రెండు వాక్య నిర్మాణాలూ ఇప్పుడున్న చాలా బైబిలు అనువాదాల్లో ఉపయోగించబడ్డాయి.

18, 19. యేసు మాటల భావం అర్థంచేసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

18 కానీ యేసు తన మరణం గురించి తన అనుచరులకు ఏం చెప్పాడో గుర్తుచేసుకోండి. ఆయనిలా చెప్పాడు, “మానవ కుమారుడు . . . భూగర్భంలో మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉంటాడు.” ఆయనింకా ఇలా చెప్పాడు, “మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వాళ్లు ఆయన్ని చంపుతారు, కానీ మూడో రోజున ఆయన బ్రతికించబడతాడు.” (మత్త. 12:40; 16:21; 17:22, 23; మార్కు 10:34) యేసు చెప్పింది జరిగిందని అపొస్తలుడైన పేతురు సాక్ష్యమిచ్చాడు. (అపొ. 10:39, 40) కాబట్టి యేసు, నేరస్తునితో పాటు చనిపోయిన రోజు పరదైసుకు వెళ్లలేదని అర్థమౌతుంది. యెహోవా పునరుత్థానం చేసేవరకు అంటే దాదాపు మూడు రోజుల వరకు ఆయన “సమాధిలో” ఉన్నాడని బైబిలు చెప్తుంది.—అపొ. 2:31, 32. *

19 కాబట్టి యేసు నేరస్తునికి ఇవ్వబోయే వాగ్దానాన్ని పరిచయం చేయడానికి “ఈ రోజు” అనే పదాన్ని ఉపయోగించాడు. మోషే కాలంలో కూడా ప్రజలు అలా మాట్లాడుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే మోషే ఒక సందర్భంలో ఇలా చెప్పాడు, “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.”—ద్వితీ. 6:6; 7:11; 8:1, 19; 30:15.

20. యేసు మాటల్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నామని దేన్నిబట్టి చెప్పవచ్చు?

20 మధ్య ప్రాచ్య దేశానికి చెందిన ఒక బైబిలు అనువాదకుడు ఇలా చెప్పాడు, “ఈ వాక్యంలో ‘ఈ రోజు’ అనే పదం నొక్కి చెప్పబడింది. కాబట్టి దాన్ని, ‘ఈ రోజు నేను నీకు చెప్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు’ అని చదవాలి. అంటే యేసు మాటిచ్చింది ఆరోజు, కానీ అది నెరవేరేది భవిష్యత్తులో.” అంతేకాదు ఆ ప్రాంతంలోని ప్రజలు అప్పట్లో అలానే మాట్లాడుకునే వాళ్లని ఆ అనువాదకుడు చెప్పాడు. అంటే, “ఒకవ్యక్తి ఫలానా రోజు ఏదైనా మాటిస్తే, దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాడని” అర్థం. అందుకే, 1600 సంవత్సరాల క్రితం నాటి సిరియా అనువాదంలో ఆ వచనం ఇలా ఉంది, “ఆమేన్‌, నేను ఈ రోజు నీకు చెప్తున్నాను, నువ్వు నాతోపాటు ఏదెను తోటలో ఉంటావు.” ఆ వాగ్దానం మనందరికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది.

21. నేరస్తునికి ఏ అవకాశం లేదు? ఎందుకు?

21 యేసు నేరస్తునితో పరదైసు గురించి మాట్లాడినప్పుడు, పరలోక పరదైసు గురించి చెప్పలేదు. అది మనకెలా తెలుసు? ఎందుకంటే, పరలోకంలో తనతోపాటు పరిపాలించడానికి యేసు తన నమ్మకమైన అపొస్తలులతో చేసుకున్న ఒప్పందం గురించి ఆ నేరస్తునికి తెలీదు. (లూకా 22:29) అంతేకాదు ఆ నేరస్తుడు బాప్తిస్మం తీసుకోలేదు, లేక పవిత్రశక్తితో అభిషేకించబడలేదు. (యోహా. 3:3-6, 12) కాబట్టి యేసు అతనికి మాటిచ్చినప్పుడు, భూమ్మీదకు రాబోయే పరదైసు గురించి చెప్పివుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒకవ్యక్తి “పరదైసుకు” తీసుకెళ్లబడిన దర్శనం గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (2 కొరిం. 12:1-4) తానూ, మిగతా అపొస్తలులూ పరలోకంలో యేసుతోపాటు పరిపాలించడానికి ఎన్నుకోబడినప్పటికీ, పౌలు భవిష్యత్తులో రాబోయే పరదైసు గురించి మాట్లాడాడు. * ఆ పరదైసు భూమ్మీదే ఉంటుందా? అందులో మీరు ఉండగలరా?

మీరు దేనికోసం ఎదురుచూడవచ్చు?

22, 23. మీరు దేనికోసం ఎదురుచూడవచ్చు?

22 “నీతిమంతులు భూమిని” స్వతంత్రించుకునే కాలం గురించి దావీదు మాట్లాడాడని గుర్తుచేసుకోండి. (కీర్త. 37:29; 2 పేతు. 3:13) అంటే భూమ్మీదున్న మనుషులందరూ దేవుని నీతి సూత్రాలు పాటించే కాలం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యెషయా 65:22⁠లో ఈ ప్రవచనం ఉంది, “నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును.” దీన్నిబట్టి కొత్తలోకంలో యెహోవాను సేవించేవాళ్లు వేల సంవత్సరాలు బ్రతుకుతారని అర్థమౌతుంది. అది నిజంగా జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది! ఎందుకంటే ప్రకటన 21:1-4 చెప్తున్నట్లు, దేవుడు మనుషులకు ఇచ్చే ఆశీర్వాదాల్లో ‘మరణం ఉండని’ జీవితం కూడా ఒకటి.

23 పరదైసు గురించి బైబిలు చెప్పేది చాలా స్పష్టంగా ఉంది. ఆదాముహవ్వలు పరదైసులో శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని చేజార్చుకున్నారు, కానీ భూమి మళ్లీ పరదైసుగా మారనుంది. దేవుడు మాటిచ్చినట్లే, భూమ్మీదున్న మనుషులందర్నీ ఆయన దీవిస్తాడు. దీనులు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొని, దాంట్లో శాశ్వతకాలం జీవిస్తారని దావీదు చెప్పాడు. యెషయా పుస్తకంలో ఉన్న ప్రవచనాల్ని బట్టి, అందమైన భూపరదైసులో జీవితం కోసం మనం ఎదురుచూడవచ్చు. ఆ పరదైసు ఎప్పుడు వస్తుంది? యేసు నేరస్తునికి ఇచ్చిన మాట నెరవేరినప్పుడు. అవును! మీరూ ఆ పరదైసులో ఉండవచ్చు. అప్పుడు, కొరియా సమావేశంలో సహోదరసహోదరీలు చెప్పిన ఈ మాట నిజమౌతుంది: “పరదైసులో కలుద్దాం!”

^ పేరా 18 ప్రొఫెసర్‌ సి. మార్వన్‌ పేట్‌ ఇలా రాశాడు, ‘యేసు “ఈ రోజు” అని చెప్పినప్పుడు, తాను చనిపోయి, అదే రోజు లేదా 24 గంటల్లో పరదైసుకు వెళ్తాను అనేది ఆయన ఉద్దేశమని చాలామంది విద్వాంసులు నమ్ముతారు. కానీ ఈ అవగాహనలో ఉన్న సమస్య ఏంటంటే అది బైబిల్లోని మిగతా వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉంది. ఉదాహరణకు, యేసు చనిపోయాక సమాధిలో ఉన్నాడని, ఆ తర్వాత పరలోకానికి వెళ్లాడని బైబిలు చెప్తుంది.’—మత్త. 12:40; అపొ. 2:31; రోమా. 10:7.

^ పేరా 21 ఈ సంచికలో “పాఠకుల ప్రశ్న” చూడండి.