కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

అపొస్తలుడైన పౌలు ఏ భావంలో “మూడో పరలోకానికి” అలాగే “పరదైసుకు” తీసుకెళ్లబడ్డాడు?—2 కొరిం. 12:2-4.

ఒక వ్యక్తి “మూడో పరలోకానికి” తీసుకెళ్లబడ్డాడని పౌలు 2 కొరింథీయులు 12:2, 3⁠లో చెప్పాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? పౌలు కొరింథు సంఘానికి రాస్తూ దేవుడు తనను అపొస్తలుడిగా ఉపయోగించుకుంటున్నాడని నొక్కిచెప్పాడు. (2 కొరిం. 11:5, 23) తర్వాత ఆయన “ప్రభువు నుండి వచ్చిన దర్శనాల గురించి, సందేశాల గురించి” ప్రస్తావించాడు. పౌలు ఈ సందర్భంలో వేరే సహోదరుల గురించి ప్రస్తావించలేదు, కాబట్టి ఆయన తన గురించే చెప్తున్నాడని స్పష్టమౌతుంది.—2 కొరిం. 12:1, 5.

దీన్నిబట్టి “మూడో పరలోకానికి” అలాగే “పరదైసుకు” తీసుకెళ్లబడ్డ వ్యక్తి పౌలేనని అర్థమౌతుంది. (2 కొరిం. 12:2-4) పౌలు ఉపయోగించిన “దర్శనాలు” అనే పదాన్ని చూస్తే, భవిష్యత్తులో జరగబోయేవి ఆయనకు తెలియజేయబడ్డాయని చెప్పవచ్చు.

పౌలు చూసిన “మూడో పరలోకం” ఏంటి?

బైబిల్లో “పరలోకం” అనే పదం ఆకాశాన్ని సూచించవచ్చు. (ఆది. 11:4; 27:28; మత్త. 6:26) కానీ ఆ పదం వేరే అర్థాలతో కూడా ఉపయోగించబడింది. కొన్నిసార్లు అది మానవ పరిపాలనను సూచిస్తుంది. (దాని. 4:20-22) లేదా దేవుని రాజ్య పరిపాలనను సూచిస్తుంది.—ప్రక. 21:1.

పౌలు“మూడో పరలోకం” చూశానని చెప్తున్నాడంటే దానర్థమేంటి? బైబిలు ఏదైనా విషయాన్ని నొక్కిచెప్పడానికి, లేదా దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి, అప్పుడప్పుడు మూడుసార్లు ప్రస్తావిస్తుంది. (యెష. 6:3; యెహె. 21:27; ప్రక. 4:8) కాబట్టి “మూడో పరలోకం” గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు, ఒక అత్యున్నత పరిపాలన గురించి నొక్కిచెప్తుండవచ్చు. అదే యేసుక్రీస్తు, తన 1,44,000 సహారాజులతో పరిపాలించే మెస్సీయ ప్రభుత్వం. (2004, అక్టోబరు 15 కావలికోట సంచికలోని 8వ పేజీలో, 5 పేరా చూడండి.) అపొస్తలుడైన పేతురు రాసినట్టు, మనం దేవుని వాగ్దానం ప్రకారం “కొత్త ఆకాశం” కోసం ఎదురుచూస్తున్నాం.—2 పేతు. 3:13.

పౌలు ప్రస్తావించిన “పరదైసు” ఏంటి?

“పరదైసు” అనే పదానికి కూడా వేర్వేరు అర్థాలు ఉండవచ్చు: (1) “పరదైసు” రాబోయే అక్షరార్థమైన భూపరదైసును అంటే ఆదాముహవ్వలు కోల్పోయిన లాంటి భూపరదైసును సూచించవచ్చు. (2) కొత్త లోకంలో దేవుని ప్రజలు ఆనందించే ఆధ్యాత్మిక స్థితిని సూచించవచ్చు. (3) ప్రకటన 2:7 ప్రకారం “దేవుని పరదైసు” అంటే పరలోకంలో ఉండే అద్భుతమైన పరిస్థితుల్ని సూచించవచ్చు.—2015, జూలై 15 కావలికోట సంచికలోని 8వ పేజీలో, 8వ పేరా చూడండి.

2 కొరింథీయులు 12:4⁠లో పౌలు తన అనుభవాన్ని చెప్తున్నప్పుడు పైన ప్రస్తావించిన మూడు విషయాల్ని ఆయన సూచిస్తుండవచ్చు.

సారాంశం:

2 కొరింథీయులు 12:2⁠లో ప్రస్తావించిన “మూడో పరలోకం” యేసుక్రీస్తు అలాగే 1,44,000 మంది పరిపాలించే మెస్సీయ రాజ్యం అంటే “కొత్త ఆకాశం” అయ్యుంటుంది.—2 పేతు. 3:13.

ఆ రాజ్యం అత్యున్నత పరిపాలన చేస్తుంది కాబట్టి దాన్ని “మూడో పరలోకం” అని పిలుస్తాం.

దర్శనంలో పౌలు తీసుకెళ్లబడిన “పరదైసు”: (1) భూమ్మీదకు రాబోయే అక్షరార్థమైన పరదైసును, (2) ఇప్పుడున్న ఆధ్యాత్మిక పరదైసు కన్నా ఇంకా విస్తృతస్థాయిలో ఉండబోయే ఆధ్యాత్మిక పరదైసును, (3) కొత్త లోకంలో భాగంగా ఉండే పరలోకంలోని ‘దేవుని పరదైసును’ సూచించవచ్చు.

దీన్నిబట్టి కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని కలిపి కొత్త లోకం అని పిలుస్తాం. పరలోక రాజ్య ప్రభుత్వం, భూపరదైసులో యెహోవాను ఆరాధించే మనుషులు రెండూ ఉండే ఒక కొత్త ఏర్పాటే ఆ కొత్త లోకం.