కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా మాతో దయగా వ్యవహరించాడు

యెహోవా మాతో దయగా వ్యవహరించాడు

నేనూ, నా భార్య డాన్యెల హోటల్‌లో అడుగుపెట్టగానే అక్కడున్న రిసెప్షనిస్టు, “సార్‌! కొంచెం బోర్డర్‌ పోలీసులకు ఫోన్‌ చేయండి” అంది. కొన్ని గంటల ముందే, మేం పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాబన్‌కి వచ్చాం. 1970లలో అక్కడ మన పనిపై నిషేధం ఉండేది.

డాన్యెల ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించేది. అందుకే ఆమె నా చెవిలో “పోలీసులకు ఫోన్‌ చేయొద్దు, వాళ్లు ఆల్రెడీ వచ్చేశారు!” అని చెప్పింది. సరిగ్గా అప్పుడే హోటల్‌ ముందు ఒక వాహనం వచ్చి ఆగింది. కొన్ని నిమిషాల తర్వాత పోలీసులు మమ్మల్ని అరెస్ట్‌ చేశారు. కానీ డాన్యెల హెచ్చరించడం వల్ల, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని అక్కడున్న వేరే సహోదరుడికి ఇవ్వగలిగాను.

మమ్మల్ని పోలీసుస్టేషన్‌కి తీసుకెళ్తుండగా నా భార్య ధైర్యాన్ని; యెహోవా మీద, ఆయన సంస్థ మీద ఆమెకున్న శ్రద్ధను చూసి చాలా గర్వపడ్డాను. డాన్యెల నాకు సహకరించిన ఎన్నో సందర్భాల్లో ఇది ఒకటి మాత్రమే. అయితే, మన ప్రకటనా పనిపై ఆంక్షలు ఉన్న దేశాలను మేం ఎందుకు సందర్శించాల్సి వచ్చిందో చెప్తాను.

సత్యాన్ని అర్థంచేసుకునేలా యెహోవా ప్రేమతో నాకు సహాయం చేశాడు

నేను 1930లో ఉత్తర ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణమైన క్ర్వాలో నిష్ఠగల కాథలిక్‌ కుటుంబంలో పుట్టాను. మా కుటుంబం ప్రతీవారం చర్చిలో రొట్టె-ద్రాక్షారసం తీసుకునేది. మా నాన్న చర్చి పనుల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. కానీ నాకు దాదాపు 14 ఏళ్లున్నప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల చర్చి వేషధారణను తెలుసుకోగలిగాను.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ సైన్యం ఫ్రాన్స్‌ను ఆక్రమించింది. నాజీలను సమర్థించే వీషీ ప్రభుత్వానికి మద్దతివ్వమని మా ప్రీస్టు తన ప్రసంగాల్లో తరచూ చెప్పేవాడు. ఆ ప్రసంగాలు విని మేం భయపడేవాళ్లం. ఫ్రాన్స్‌లో ఉన్న చాలామందిలాగే మేం కూడా రహస్యంగా బిబిసి రేడియోలో మిత్రపక్షాల గురించిన వార్తలు వినేవాళ్లం. అయితే ఆ ప్రీస్టు గోడమీద పిల్లిలా ఒక్కసారిగా మిత్రపక్షాలకు మద్దతివ్వడం మొదలుపెట్టాడు. సెప్టెంబరు 1944లో మిత్రపక్షాలు జర్మన్‌ సైన్యం మీద పైచేయి సాధించాయని తెలియగానే, ఆ ప్రీస్టు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాడు. అది చూసి నేను కంగుతిన్నాను! దాంతో మతనాయకుల మీద నాకున్న నమ్మకం సన్నగిల్లింది.

ఆ యుద్ధం ముగిసిన కొంతకాలానికే, మా నాన్న చనిపోయాడు. మా అక్కకు అప్పటికే పెళ్లయి బెల్జియంలో ఉంటోంది. కాబట్టి అమ్మను నేనే చూసుకోవాలి. అప్పుడు నాకు మంచి ఉద్యోగం వచ్చింది. మా బాస్‌, అతని కొడుకులు కాథలిక్‌ మతాన్ని నిష్ఠగా పాటించేవాళ్లు. నాకు ఆ కంపెనీలో ఉన్నతస్థాయికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కొంతకాలానికే ఓ పరీక్ష ఎదురైంది.

మా అక్క సీమోన్‌ ఒక యెహోవాసాక్షి అయ్యింది, 1953లో ఒకసారి మమ్మల్ని చూడడానికి వచ్చింది. నరకం, త్రిత్వం, అమర్త్యమైన ఆత్మ గురించి కాథలిక్‌ చర్చీలు చెప్పే బోధలు అబద్ధాలని లేఖనాలు ఉపయోగించి తర్కబద్ధంగా వివరించింది. మొదట్లో, ఆమె కాథలిక్‌ బైబిలు ఉపయోగించి చెప్పట్లేదని నేను వాదించాను. కానీ కొద్దిసేపటికే ఆమె చెప్తుంది సత్యమని గ్రహించగలిగాను. ఆ తర్వాత ఆమె నాకు కొన్ని పాత కావలికోట సంచికల్ని ఇచ్చింది. నేను వాటిని రాత్రిపూట చాలా ఆసక్తిగా చదివేవాణ్ణి. ఇదే సత్యమని వెంటనే గ్రహించాను, కానీ నా ఉద్యోగం పోతుందేమో అనే భయంతో నేను యెహోవాసాక్షి అవ్వలేదు.

కొన్ని నెలలపాటు బైబిల్ని, కావలికోట ఆర్టికల్స్‌ని సొంతగా అధ్యయనం చేశాను. ఆ తర్వాత, రాజ్యమందిరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అక్కడ, సహోదరసహోదరీల మధ్యున్న ప్రేమాప్యాయతలు చూసి నేను ఎంతో కదిలించబడ్డాను. అనుభవజ్ఞుడైన ఒక సహోదరుని దగ్గర ఆరు నెలలపాటు బైబిలు స్టడీ తీసుకొని 1954, సెప్టెంబరులో బాప్తిస్మం తీసుకున్నాను. కొంతకాలానికే మా అమ్మ, చెల్లి కూడా బాప్తిస్మం తీసుకోవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

పూర్తికాల సేవలో యెహోవామీద ఆధారపడ్డాను

1958లో న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యే అవకాశం నాకు దొరికింది. కానీ విచారకరంగా, ఆ సమావేశానికి కొన్ని వారాల ముందు మా అమ్మ చనిపోయింది. నాకు ఇక ఏ కుటుంబ బాధ్యతలు లేవు కాబట్టి సమావేశం నుండి తిరిగొచ్చాక, ఉద్యోగానికి రాజీనామా చేసి పయినీరు సేవ మొదలుపెట్టాను. ఈలోపు, ఉత్సాహవంతురాలైన ఒక పయినీరు సహోదరి డాన్యెల డీలీతో నాకు నిశ్చితార్థం జరిగింది. 1959, మేలో మేం పెళ్లిచేసుకున్నాం.

డాన్యెల తన ఇంటికి దూరంగా ఉన్న బ్రిటనీ అనే గ్రామంలో పూర్తికాల సేవ మొదలుపెట్టింది. కాథలిక్‌లు ఉండే ఆ ప్రాంతంలో ప్రకటించడానికి అలాగే ఆ గ్రామంలో ఉన్న క్షేత్రాలకు సైకిలు మీద వెళ్లడానికి ఆమెకు ధైర్యం అవసరమైంది. నాలాగే ఆమెకూడా అత్యవసరభావంతో ప్రకటించేది. ఎందుకంటే అంతం చాలా దగ్గర్లో ఉండివుంటుందని మేం భావించాం. (మత్త. 25:13) ఆమె చూపించిన స్వయంత్యాగ స్ఫూర్తి వల్ల మేం పూర్తికాల సేవలో పట్టుదలగా కొనసాగగలిగాం.

మా పెళ్లయిన కొన్ని రోజులకే మమ్మల్ని ప్రాంతీయ సేవకు నియమించారు. దాంతో మేం సాదాసీదాగా జీవించడం అలవాటు చేసుకున్నాం. మేం సందర్శించిన మొట్టమొదటి సంఘంలో 14 మంది ప్రచారకులు ఉండేవాళ్లు. ఆ సహోదరుల ఇళ్లలో మేం ఉండేంత చోటు లేనందువల్ల రాజ్యమందిరంలోని స్టేజీ మీద పడుకున్నాం. అది అంత సౌకర్యంగా లేకపోయినా, నేలమీద పడుకోవడం వెన్నెముకకు మంచిదేలే!

సంఘాల్ని సందర్శించడానికి మా చిన్న కారులో వెళ్లేవాళ్లం

మా షెడ్యూల్‌ చాలా బిజీగా ఉండేది. అయినా డాన్యెల ప్రయాణ పనికి చక్కగా సర్దుకుపోయింది. అనుకోకుండా జరిగే సంఘపెద్దల కూటాలవల్ల ఆమె తరచూ మా చిన్న కారులో నాకోసం ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఎప్పుడూ ఏమీ అనేదికాదు. మేం కేవలం రెండు సంవత్సరాలే ప్రాంతీయ సేవచేశాం. కానీ భార్యాభర్తలిద్దరూ దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆ రెండు సంవత్సరాల్లో నేర్చుకున్నాం.—ప్రసం. 4:9.

మా కొత్త సేవా నియామకాలు

1962లో బ్రూక్లిన్‌లోని న్యూయార్క్‌లో పది నెలలపాటు జరిగే 37వ గిలియడ్‌ పాఠశాలకు మమ్మల్ని ఆహ్వానించారు. దానికి హాజరైన వందమంది విద్యార్థుల్లో 13 జంటలున్నాయి. కాబట్టి మేమిద్దరం కలిసి హాజరవ్వడం మాకు దొరికిన గొప్ప అవకాశంగా భావించాం. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలైన ఫ్రెడ్రిక్‌ ఫ్రాంజ్‌, యులీసిజ్‌ గ్లాస్‌, అలెగ్జాండెర్‌ హెచ్‌. మాక్‌మిలన్‌ వంటి సహోదరులతో గడిపిన మధుర క్షణాలు నాకింకా గుర్తున్నాయి.

మేమిద్దరం కలిసి గిలియడ్‌ పాఠశాలకు హాజరవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది!

గిలియడ్‌ పాఠశాలలో, గమనించే శక్తిని పెంచుకోవాలని మాకు నేర్పించారు. మా శిక్షణలో భాగంగా, అప్పుడప్పుడు శనివారం మధ్యాహ్నాలు క్లాస్‌ అయిపోయిన తర్వాత న్యూయార్క్‌ పట్టణంలోని కొన్ని ప్రదేశాలను చూపించేవాళ్లు. మేం చూసిన ప్రదేశాలకు సంబంధించి సోమవారం ఒక రాత పరీక్ష ఉండేది. శనివారం సాయంత్రానికల్లా మేం బాగా అలిసిపోయి తిరిగొచ్చేవాళ్లం. కానీ మాకు టూర్‌ గైడ్‌గా వచ్చిన బెతెల్‌ వాలంటీర్‌ మేం చూసొచ్చిన వాటిగురించి కొన్ని ప్రశ్నలు అడిగేవాడు. ఆ విధంగా రాత పరీక్ష కోసం ముఖ్యమైన విషయాల్ని గుర్తుపెట్టుకోవడం వీలయ్యేది. ఒక శనివారం మధ్యాహ్నం మేం ఆ పట్టణమంతా కాలినడకన తిరిగాం. తర్వాత ఒక నక్షత్ర పరిశోధనశాలకు వెళ్లి అక్కడ ఉల్కలకు, ఉల్కాశకలాలకు మధ్యున్న తేడాను నేర్చుకున్నాం. అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీలో వివిధ రకాల మొసళ్ల గురించి నేర్చుకున్నాం. తిరిగి బెతెల్‌కి వచ్చాక, మా గైడ్‌ “ఉల్కలకి, ఉల్కాశకలాలకి తేడా ఏంటి?” అని మమ్మల్ని అడిగాడు. అప్పటికే బాగా అలసిపోయిన డాన్యెల, “ఏముంది, ఉల్కాశకలాలకి పొడవాటి దంతాలుంటాయి!” అని చెప్పింది.

ఆఫ్రికాలో ఉన్న మన నమ్మకమైన సహోదర సహోదరీలను సందర్శించడం ఎంతో ఆనందాన్నిచ్చింది

ఆశ్చర్యకరంగా మమ్మల్ని ఫ్రాన్స్‌ బ్రాంచికి నియమించారు. మేమిద్దరం కలిసి 53 కన్నా ఎక్కువ సంవత్సరాలు అక్కడ సేవచేశాం. 1976లో నన్ను బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా నియమించారు. అంతేకాదు మన ప్రకటనా పనిపై నిషేధం లేదా ఆంక్షలున్న ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలను సందర్శించే నియామకాన్ని కూడా అప్పగించారు. అందుకే మొదట్లో ప్రస్తావించిన గాబన్‌ దేశానికి మేం వెళ్లాం. నిజం చెప్పాలంటే, ఊహించని ఈ బాధ్యతలు చేపట్టడానికి నేను అర్హుణ్ణి కానని ఎప్పుడూ అనుకునేవాణ్ణి. కానీ డాన్యెల ఇచ్చిన మద్దతుతో ఎలాంటి నియామకాన్నైనా చేయగలనని అనిపించింది.

1988లో పారిస్‌లో జరిగిన “దైవిక న్యాయము” అనే సమావేశంలో సహోదరుడు థియోడోర్‌ జారస్‌ ప్రసంగాన్ని నేను అనువదిస్తూ

పెద్ద కష్టాన్ని సహించాం

మొదటినుండి బెతెల్‌ జీవితం అంటే మాకెంతో ఇష్టం. గిలియడ్‌కు హాజరవ్వడానికి ముందు, కేవలం ఐదు నెలల్లోనే డాన్యెల ఇంగ్లీష్‌ నేర్చుకుంది. దానివల్ల ఆమె ఒక నైపుణ్యంగల అనువాదకురాలు అయ్యింది. మేం బెతెల్‌ సేవను చాలా ఆనందించాం. అంతేకాదు సంఘ పనుల్లో చురుగ్గా పాల్గొనడం మా ఆనందాన్ని రెట్టింపు చేసింది. నేనూ డాన్యెల స్టడీలు చేసి బాగా పొద్దుపోయాక, పారిస్‌ మెట్రోలో తిరిగి ఇంటికి రావడం నాకింకా గుర్తుంది. అప్పుడు మేం బాగా అలసిపోయేవాళ్లం కానీ ప్రగతిదాయక బైబిలు స్టడీలు చేసినందుకు చాలా సంతోషించాం. విచారకరంగా, ఊహించని అనారోగ్య సమస్య వల్ల డాన్యెల అనుకున్నంత చురుగ్గా ఉండలేకపోయింది.

1993లో డాన్యెలకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చింది. దానికి ఆపరేషన్‌ చేసి, కీమోథెరపీ ఇచ్చారు. అది చాలా నొప్పితో కూడుకున్న చికిత్స. అయితే 15 సంవత్సరాల తర్వాత, ఆమెకు మళ్లీ తీవ్రస్థాయిలో క్యాన్సర్‌ వచ్చింది. కానీ, ఆమెకు అనువాద పని ఎంత ఇష్టమంటే కోలుకున్న వెంటనే తన పనిని మళ్లీ ప్రారంభించింది.

డాన్యెలకు అంత భయంకరమైన జబ్బు వచ్చినప్పటికీ, బెతెల్‌ విడిచివెళ్లాలని మేం ఎన్నడూ అనుకోలేదు. అయితే అనారోగ్యంతో బెతెల్‌లో ఉండడం కొన్ని సవాళ్లను కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా మీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఎదుటివ్యక్తికి తెలియనప్పుడు మీకు ఇంకా కష్టంగా ఉంటుంది. (సామె. 14:13) తన ఆరోగ్యం ఎంత క్షీణించినా 70 కన్నా ఎక్కువ వయసులో కూడా డాన్యెల ముఖంలో చిరునవ్వు, కాంతి అస్సలు చెక్కుచెదరలేదు. ఆమె తన పరిస్థితి గురించి ఎన్నడూ చింతించలేదు. బదులుగా ఇతరులు చెప్పేది విని, వాళ్లకు సహాయం చేసేది. (సామె. 17:17) డాన్యెల తనకున్న అనుభవాన్ని బట్టి క్యాన్సర్‌కు భయపడనక్కర్లేదని చాలామంది సహోదరీలకు ధైర్యం చెప్పేది.

మేం కొత్త సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. డాన్యెలకు ఎక్కువ గంటలు పనిచేసే శక్తి లేనప్పుడు, నాకు సహాయం చేయడం మీదే మనసుపెట్టింది. నా జీవితం సాఫీగా సాగడానికి ఆమె నాకెంతో సహాయం చేసింది. దానివల్ల 37 ఏళ్లపాటు బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా సేవ చేయగలిగాను. ఉదాహరణకు, ఆమె ఆహారాన్ని వండి సిద్ధంగా ఉంచేది, దాంతో ప్రతీరోజు మధ్యాహ్నం మేమిద్దరం మా రూమ్‌లోనే భోంచేసి, కాస్త విశ్రాంతి తీసుకునేవాళ్లం.—సామె. 18:22.

ఏరోజు ఆందోళనల్ని ఆ రోజు తట్టుకున్నాం

డాన్యెల తన జీవితం మీద ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. తర్వాత ఆమెకు మూడోసారి క్యాన్సర్‌ వచ్చింది. ఇక తట్టుకోవడం మావల్ల కాదనిపించింది. కీమోథెరపీ, రేడియోథెరపీ క్రమంగా ఇవ్వడం వల్ల ఆమె ఎంత బలహీనమైందంటే కనీసం నడవడం కూడా కష్టంగా ఉండేది. నైపుణ్యంగల అనువాదకురాలైన నా భార్య తడబడుతూ మాట్లాడడం చూసి నా గుండె తరుక్కుపోయింది.

మాకు తట్టుకునే శక్తి లేదనిపించినా పట్టుదలగా ప్రార్థించాం. దానివల్ల మేం భరించలేని కష్టాల్ని యెహోవా అనుమతించడనే నమ్మకం కుదిరింది. (1 కొరిం. 10:13) యెహోవా తన వాక్యం ద్వారా, బెతెల్‌ వైద్య సిబ్బంది ద్వారా, మన సహోదరసహోదరీల ప్రేమపూర్వక మద్దతు ద్వారా మాకు సహాయం చేస్తూ వచ్చాడు. మేం దాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాం.

ఏ చికిత్సను ఎంపిక చేసుకోవాలో సహాయం చేయమని యెహోవాను తరచూ అడిగాం. ఒకానొక సమయంలోనైతే ఏ చికిత్సా దొరకలేదు. డాన్యెల కీమోథెరపీ చేయించుకున్న ప్రతీసారీ స్పృహ కోల్పోయేది. అలా ఎందుకు జరుగుతుందో 23 సంవత్సరాలపాటు ఆమెకు చికిత్స చేసిన డాక్టరు చెప్పలేకపోయాడు. కీమోథెరపీకి బదులు ఏ చికిత్స తీసుకుంటే బాగుంటుందో కూడా ఆయన చెప్పలేకపోయాడు. ఆ సమయంలో మాకు సహాయం చేసేవాళ్లు ఎవ్వరూ లేరనిపించింది, పరిస్థితులు ఎలా మారతాయోనని ఆందోళనపడ్డాం. అప్పుడే క్యాన్సర్‌ నిపుణుడైన ఒక డాక్టరు డాన్యెలకు చికిత్స చేయడానికి ఒప్పుకున్నాడు. మా ఆందోళనల్ని తట్టుకోవడానికి ఆ సమయంలో యెహోవాయే మార్గం తెరిచాడని అనిపించింది.

మా ఆందోళనను తగ్గించుకోవడానికి, ఏ రోజు గురించి ఆరోజు ఆలోచించడం నేర్చుకున్నాం. యేసు ఇలా చెప్పాడు, ‘ఏ రోజు సమస్యలు ఆ రోజుకు చాలు.’ (మత్త. 6:34) సానుకూలంగా, చమత్కారంగా ఉండడం మాకు సహాయం చేశాయి. ఉదాహరణకు రెండు నెలలు కీమోథెరపీ చేయించుకోనప్పుడు, డ్యానెల సరదాగా ఇలా అనేది “నీకు తెలుసా, కీమోథెరపీ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఒకేలా ఉంది!” (సామె. 17:22) తనకు ఎంత బాధ ఉన్నా కొత్త రాజ్య గీతాలు బిగ్గరగా, ధైర్యంగా ప్రాక్టీసు చేస్తూ ఆనందించేది.

ఆమెకున్న సానుకూల దృక్పథం నా పరిమితుల్ని అధిగమించడానికి సహాయం చేసింది. నిజం చెప్పాలంటే, 57 ఏళ్ల మా దాంపత్య జీవితంలో ఆమె నన్ను బాగా చూసుకుంది, ఏ పని చేయనిచ్చేది కాదు. అందుకే కనీసం గుడ్లు ఎలా వేయించాలో కూడా నాకు తెలిసేది కాదు! కానీ, ఆమెకు బాగా జబ్బు చేసినప్పుడు గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం నేర్చుకున్నాను. అలా పనిచేస్తున్నప్పుడు నా చేతిలో కొన్ని గ్లాసులు కూడా పగిలాయి, కానీ ఆమె కోసం ఈ పనులన్నీ చేయడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. *

యెహోవా ప్రేమపూర్వక దయకు నేను కృతజ్ఞుణ్ణి

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అనారోగ్య సమస్యలవల్ల, వయసు పైబడడంవల్ల వచ్చే పరిమితుల నుండి నేను ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను. మొదటిది, వివాహజత బాగోగులు చూసుకోలేనంత బిజీగా మనం ఎన్నడూ ఉండకూడదు. మనం ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే ప్రియమైన వాళ్లను బాగా చూసుకోవాలి. (ప్రసం. 9:9) రెండోది, చిన్నచిన్న విషయాల గురించి అతిగా ఆందోళనపడకూడదు. ఎందుకంటే అలాచేస్తే ప్రతీరోజు మనం అనుభవించే ఆశీర్వాదాలను చూడలేం.—సామె. 15:15.

పూర్తికాల సేవలో మా జీవితం గురించి ఆలోచించినప్పుడు, ఊహించినదానికన్నా ఎక్కువ దీవెనలు యెహోవా మాకిచ్చాడని అనిపిస్తుంది. కీర్తనకర్త చెప్పిన ఈ మాటలతో నేను ఏకీభవిస్తాను, ‘యెహోవా నాతో దయగా వ్యవహరించాడు.’—కీర్త. 116:7, NW.

^ పేరా 32 ఈ ఆర్టికల్‌ సిద్ధం చేస్తుండగా సహోదరి డాన్యెల బోకార్ట్‌ తన 78వ ఏట మరణించింది.