కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 52

తల్లిదండ్రులారా—యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి

తల్లిదండ్రులారా—యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి

“కుమారులు [పిల్లలు, NW] యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.”—కీర్త. 127:3.

పాట 134 పిల్లలు యెహోవా ఇచ్చిన బాధ్యత

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా తల్లిదండ్రులకు ఏ బాధ్యతను అప్పగించాడు?

పిల్లల్ని కనాలనే ఉద్దేశంతోనే యెహోవా మొదటి జంటను సృష్టించాడు. అందుకే బైబిలు సరిగ్గానే ఇలా చెప్తుంది: “కుమారులు [పిల్లలు, NW] యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.” (కీర్త. 127:3) దానర్థం ఏంటి? ఉదాహరణకు మీ సన్నిహిత స్నేహితుడు తన దగ్గరున్న పెద్దమొత్తం డబ్బును చూసుకునే బాధ్యతను మీకు అప్పగించాడనుకోండి. మీకెలా అనిపిస్తుంది? బహుశా అతను మిమ్మల్ని అంతలా నమ్ముతున్నందుకు మీకు గౌరవంగా అనిపించవచ్చు. అయితే, అంత డబ్బును జాగ్రత్తగా కాపాడడం ఎలాగని మీరు కంగారు పడుతుండవచ్చు. మన సన్నిహిత స్నేహితుడైన యెహోవా ఆ డబ్బు కంటే చాలా విలువైనదాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చాడు. పిల్లల బాగోగుల్ని చూసుకుంటూ వాళ్లను సంతోషపెట్టే బాధ్యతను ఆయన తల్లిదండ్రులకు అప్పగించాడు.

2. మనం ఏ ప్రశ్నల్ని చర్చిస్తాం?

2 పెళ్లయిన జంట పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఎప్పుడు కనాలి అనేది ఎవరు నిర్ణయించాలి? పిల్లలు సంతోషకరమైన జీవితాన్ని ఆనందించేలా తల్లిదండ్రులు వాళ్లకెలా సహాయం చేయవచ్చు? క్రైస్తవ దంపతులు తెలివైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయం చేసే కొన్ని బైబిలు సూత్రాల్ని పరిశీలించండి.

భార్యాభర్తల నిర్ణయాన్ని గౌరవించండి

3. (ఎ) భార్యాభర్తలు పిల్లల్ని కనాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించాలి? (బి) వాళ్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు ఏ బైబిలు సూత్రాల్ని మనసులో ఉంచుకోవాలి?

3 కొన్ని సంస్కృతుల్లో, కొత్తగా పెళ్లయినవాళ్లు వీలైనంత త్వరగా పిల్లల్ని కనాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి కుటుంబ సభ్యులు, ఇతరులు పిల్లల్ని కనమని వాళ్లమీద ఒత్తిడి తీసుకురావొచ్చు. ఆసియాకు చెందిన జెత్రో అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “సంఘంలో పిల్లలున్న కొంతమంది దంపతులు, పిల్లల్ని కనమని పిల్లలులేని దంపతుల్ని ఒత్తిడి చేస్తుంటారు.” ఆసియాకు చెందిన జెఫ్రీ అనే మరో సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “పిల్లలు లేకపోతే వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరని కొంతమంది పిల్లలు లేని దంపతులతో చెప్తారు.” ఏదేమైనా పిల్లల్ని కనాలా వద్దా అని భార్యాభర్తలు సొంతగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం వాళ్లే తీసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ల బాధ్యత. (గల. 6:5, అధస్సూచి) నిజమే, కొత్తగా పెళ్లయిన జంట సంతోషంగా ఉండాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరుకుంటారు. అయితే, పిల్లల్ని కనాలా వద్దా అనే నిర్ణయం మాత్రం పూర్తిగా ఆ జంటదేనని అందరూ గుర్తుపెట్టుకోవాలి.—1 థెస్స. 4:11.

4-5. దంపతులు ఏ రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి? ఎప్పుడు మాట్లాడుకోవాలి? వివరించండి.

4 పిల్లల్ని కనాలనుకునే దంపతులు రెండు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోవాలి: మొదటిది, వాళ్లు పిల్లల్ని ఎప్పుడు కనాలనుకుంటున్నారు? రెండోది, వాళ్లు ఎంతమంది పిల్లల్ని కావాలనుకుంటున్నారు? అయితే, ఒక జంట ఆ విషయాన్ని ఎప్పుడు చర్చించుకోవడం మంచిది? ఆ రెండు విషయాలు ఎందుకంత ప్రాముఖ్యం?

5 చాలా సందర్భాల్లో, ఒక జంట పెళ్లికి ముందే పిల్లల గురించి మాట్లాడుకోవడం మంచిది. పెళ్లికి ముందే ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే, ఈ విషయంలో పెళ్లి చేసుకోబోయే వాళ్లు ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండడం ప్రాముఖ్యం. అంతేకాదు, పిల్లల్ని పెంచే బాధ్యతను తీసుకోవడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారో లేదో పరిశీలించుకోవాలి. కొంతమంది దంపతులు ఒకట్రెండు సంవత్సరాల వరకు పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒక్కసారి పిల్లలు పుట్టారంటే వాళ్ల సమయం, శక్తి అంతా పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికే సరిపోతుంది. కాబట్టి కొంతకాలం పిల్లల్ని కనకుండా ఆగడం ద్వారా తాము వైవాహిక జీవితానికి అలవాటుపడేందుకు, ఒకరికొకరు దగ్గరయ్యేందుకు వీలౌతుందని వాళ్లు అంటారు.—ఎఫె. 5:33.

6. మనం జీవిస్తున్న కాలాల్ని బట్టి కొంతమంది దంపతులు ఏమని నిర్ణయించుకున్నారు?

6 ఇంకొంతమంది క్రైస్తవులు నోవహు ముగ్గురు కొడుకులను, కోడళ్లను ఆదర్శంగా తీసుకున్నారు. వాళ్లు పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనలేదు. (ఆది. 6:18; 9:18, 19; 10:1; 2 పేతు. 2:5) యేసు మన కాలాన్ని ‘నోవహు రోజులతో’ పోల్చాడు. కాబట్టి ‘మనం ప్రమాదకరమైన కష్ట కాలాల్లో’ జీవిస్తున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. (మత్త. 24:37; 2 తిమో. 3:1) ఆ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు దంపతులు, యెహోవా సేవలో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా పిల్లల్ని కనడాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.

పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఎంతమందిని కనాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు తెలివైన దంపతులు లూకా 14:28, 29 లో ఉన్న సూత్రాన్ని పాటిస్తారు (7వ పేరా చూడండి) *

7. లూకా 14:28, 29 అలాగే సామెతలు 21:5 లో ఉన్న సూత్రాలు దంపతులకు ఎలా సహాయం చేస్తాయి?

7 పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఎంతమందిని కనాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు తెలివైన దంపతులు లూకా 14:28, 29 లో ఉన్న సూత్రాన్ని పాటిస్తారు. (చదవండి.) పిల్లల్ని పెంచడం ఖర్చుతో కూడుకున్న పనేకాదు వాళ్లను పెంచాలంటే సమయం, శక్తి కూడా కావాలనే విషయం అనుభవం గల తల్లిదండ్రులకు బాగా తెలుసు. కాబట్టి దంపతులు ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: ‘కుటుంబ కనీస అవసరాల కోసం మేమిద్దరం పని చేయాలా? “కనీస అవసరాల” గురించి ఇద్దరం ఒకేలా ఆలోచిస్తామా? ఒకవేళ మేమిద్దరం పనిచేస్తే మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ల ఆలోచనల మీద, వాళ్ల పనుల మీద ఎవరి ప్రభావం పడొచ్చు?’ ఈ విషయాల్ని జ్ఞానయుక్తంగా చర్చించే దంపతులు సామెతలు 21:5 లో ఉన్న మాటల్ని మనస్ఫూర్తిగా పాటిస్తారు.—చదవండి.

ప్రేమగల భర్త తన భార్యకు సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేస్తాడు (8వ పేరా చూడండి)

8. క్రైస్తవ దంపతులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వవచ్చు? ఒక ప్రేమగల భర్త ఏం చేస్తాడు?

8 తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లల కోసం తగినంత సమయాన్ని, శక్తిని వెచ్చించాలి. కాబట్టి ఒక జంటకు తక్కువ వయసు తేడాతో ఎక్కువమంది పిల్లలు ఉంటే, ప్రతీ పిల్లవాడి మీద తగినంత శ్రద్ధ చూపించడం వాళ్లకు కష్టంగా ఉండొచ్చు. వెంటవెంటనే పిల్లల్ని కన్న కొంతమంది దంపతులు, వాళ్లను పెంచడానికి ఉక్కిరిబిక్కిరి అయ్యామని చెప్తున్నారు. తల్లి శారీరకంగా, భావోద్వేగంగా బాగా అలసిపోవచ్చు. దీనివల్ల ఆమె వ్యక్తిగత అధ్యయనం, ప్రార్థన, పరిచర్య క్రమంగా చేయడానికి శక్తి ఉండకపోవచ్చు. అలాగే కూటాలకు వెళ్లినప్పుడు శ్రద్ధగా విని వాటినుండి పూర్తి ప్రయోజనం పొందడం కూడా కష్టంగా ఉండొచ్చు. నిజమే ప్రేమగల భర్త, కూటాలకు వెళ్లినప్పుడు అలాగే ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకునే విషయంలో భార్యకు సహాయం చేయడానికి తాను చేయగలిగింది చేస్తాడు. ఉదాహరణకు, అతను ఇంటి పనుల్లో తన భార్యకు సహాయం చేస్తాడు. అలాగే క్రమంగా కుటుంబ ఆరాధన చేస్తూ కుటుంబమంతా ప్రయోజనం పొందేలా చూసుకుంటాడు. కుటుంబంతో కలిసి క్రమంగా పరిచర్యకు వెళ్తాడు.

మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి

9-10. పిల్లల్ని చక్కగా పెంచాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి?

9 పిల్లలు యెహోవాను ప్రేమించేలా సహాయం చేయడానికి తల్లిదండ్రులు ఏం చేయవచ్చు? ఈ దుష్ట లోకంలో ఎదురయ్యే ప్రమాదాల నుండి వాళ్లను ఎలా కాపాడుకోవచ్చు? తల్లిదండ్రులు చేయాల్సిన కొన్ని పనుల్ని పరిశీలించండి.

10 సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. సమ్సోను తల్లిదండ్రులైన మానోహ, అతని భార్య ఆదర్శాన్ని గమనించండి. వాళ్లకు కొడుకు పుట్టబోతున్నాడని తెలిసినప్పుడు, ఆ పిల్లవాడిని పెంచడానికి కావాల్సిన నిర్దేశం ఇవ్వమని మానోహ యెహోవాను వేడుకున్నాడు.

11. న్యాయాధిపతులు 13:8 లో ఉన్న మానోహ ఆదర్శాన్ని తల్లిదండ్రులు ఎలా అనుకరించవచ్చు?

11 బోస్నియా అండ్‌ హెర్జెగోవినా దేశానికి చెందిన నీహాద్‌, ఆల్మా అనే దంపతులు మానోహను ఆదర్శంగా తీసుకున్నారు. వాళ్లిలా చెప్తున్నారు: “మంచి తల్లిదండ్రులు అయ్యేలా సహాయం చేయమని మానోహలాగే మేము కూడా యెహోవాను వేడుకున్నాం. అప్పుడు యెహోవా లేఖనాల ద్వారా, బైబిలు సాహిత్యం ద్వారా, సంఘ కూటాల ద్వారా అలాగే సమావేశాల ద్వారా మా ప్రార్థనలకు జవాబిచ్చాడు.”—న్యాయాధిపతులు 13:8 చదవండి.

12. యోసేపు, మరియలు తమ పిల్లలకు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచారు?

12 మీ ఆదర్శం ద్వారా నేర్పించండి. మీ మాటలే కాదు, మీ పనులు కూడా మీ పిల్లలపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. యోసేపు, మరియలు యేసుకే కాదు వాళ్ల పిల్లలందరికీ ఖచ్చితంగా మంచి ఆదర్శం ఉంచివుంటారు. యోసేపు తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడ్డాడు. అంతేకాదు, తన కుటుంబంలోని వాళ్లంతా ఆధ్యాత్మిక విషయాల మీద ప్రేమ పెంచుకునేలా వాళ్లను ప్రోత్సహించాడు. (ద్వితీ. 4:9, 10) “ప్రతీ సంవత్సరం” పస్కాను ఆచరించడానికి కుటుంబాన్నంతా యెరూషలేముకు తీసుకెళ్లాలని ధర్మశాస్త్రం చెప్పకపోయినా, యోసేపు తన కుటుంబాన్నంతా తీసుకెళ్లాడు. (లూకా 2:41, 42) ఆయన కాలంలోని కొందరు తండ్రులు కుటుంబం మొత్తాన్ని వెంటబెట్టుకొని వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని, చాలా సమయం-డబ్బు వెచ్చించాల్సి వస్తుందని అనుకొని ఉండవచ్చు. అయితే యోసేపు ఆధ్యాత్మిక విషయాలపట్ల చాలా మెప్పుదల చూపించేవాడు. ఆయన తన పిల్లలకు కూడా అదే నేర్పించాడు. మరియకు కూడా లేఖనాల మీద మంచి పట్టు ఉండేది. ఆమె తన మాటల ద్వారా, పనుల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రేమించడం తన పిల్లలకు తప్పకుండా నేర్పించి ఉంటుంది.

13. ఒక జంట ఎలా యోసేపు, మరియల బాటలో నడిచారు?

13 ముందు మాట్లాడుకున్న నీహాద్‌, ఆల్మా దంపతులు యోసేపు, మరియల బాటలో నడవాలనుకున్నారు. తమ ఒక్కగానొక్క కొడుకు యెహోవాను ప్రేమించేలా, ఆయన సేవ చేసేలా పెంచడానికి వాళ్లకేది సహాయం చేసింది? వాళ్లిలా చెప్తున్నారు: “యెహోవా నిర్దేశాల ప్రకారం జీవించడం ఎంత బావుంటుందో మా జీవన విధానం ద్వారా మా అబ్బాయికి చూపించాలనుకున్నాం.” నీహాద్‌ ఇంకా ఇలా అంటున్నాడు, “మీ పిల్లవాడు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ముందు మీరు అలా ఉండండి.”

14. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో తల్లిదండ్రులు ఎందుకు తెలుసుకోవాలి?

14 మంచి స్నేహితుల్ని ఎంపిక చేసుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులిద్దరికీ ఉంది. పిల్లలు సోషల్‌ మీడియాలో, ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడం కూడా అందులో ఒకటి. ఎందుకంటే మీ పిల్లల ఆలోచనలపై, పనులపై అలాంటి స్నేహితుల ప్రభావం పడొచ్చు.—1 కొరిం. 15:33.

15. జెస్సీ అనే తండ్రి ఉదాహరణ నుండి అమ్మానాన్నలు ఏం నేర్చుకోవచ్చు?

15 మరి తల్లిదండ్రులకు కంప్యూటర్ల గురించి లేదా మొబైల్‌ ఫోన్‌ల గురించి అంతగా తెలీకపోతే అప్పుడేంటి? ఫిలిప్పీన్స్‌కి చెందిన జెస్సీ అనే తండ్రి ఇలా అంటున్నాడు: “మాకు టెక్నాలజీ గురించి అంతగా తెలీదు. అంతమాత్రాన ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించేటప్పుడు ఎదురయ్యే ప్రమాదాల గురించి మా పిల్లలకు నేర్పించడం మానలేదు.” జెస్సీకి వాటి గురించి అంతగా తెలీదు కాబట్టి తన పిల్లలు వాటిని వాడకూడదని ఆంక్షలు పెట్టలేదు. ఆయన ఇలా వివరిస్తున్నాడు: “ఒక కొత్త భాష నేర్చుకోవడానికి, కూటాలకు సిద్ధపడడానికి, ప్రతీరోజు బైబిలు చదవడానికి తమ ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడమని మా పిల్లల్ని ప్రోత్సహించాను.” మీరు తల్లిదండ్రులైతే, jw.org® వెబ్‌సైట్‌లోని “టీనేజర్లు” సెక్షన్‌లో, మెసేజ్‌లు పంపించడం, ఇంటర్నెట్‌లో ఫోటోలు పెట్టడం వంటి వాటికి సంబంధించిన మంచి సలహాల్ని చదివి, మీ పిల్లలతో చర్చించారా? మీరు ఫోన్లకు, టాబ్లెట్లకు అతుక్కుపోతున్నారా?అలాగే సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి * అనే వీడియోల్ని వాళ్లతో చర్చించారా? ఎలక్ట్రానిక్‌ పరికరాలను జాగ్రత్తగా ఎలా ఉపయోగించాలో మీ పిల్లలకు నేర్పించడానికి ఆ సమాచారం మీకు చక్కగా సహాయం చేస్తుంది.—సామె. 13:20.

16. చాలామంది తల్లిదండ్రులు ఏం చేశారు? దాని ఫలితమేమిటి?

16 చాలామంది తల్లిదండ్రులు, యెహోవా సేవలో ఆదర్శవంతులైన వాళ్లతో తమ పిల్లలు సమయం గడిపే అవకాశాల్ని కల్పించడానికి కృషి చేస్తారు. ఉదాహరణకు కోటే డి’ ఐవరీకి చెందిన ఎన్డేనీ, బొమీన్‌ అనే జంట తరచూ ప్రాంతీయ పర్యవేక్షకునికి వాళ్ల ఇంట్లో వసతి ఏర్పాటు చేసేవాళ్లు. ఎన్డేనీ ఇలా చెప్తున్నాడు: “మా అబ్బాయి మీద అది మంచి ప్రభావం చూపించింది. మా అబ్బాయి పయినీరు సేవ మొదలుపెట్టి, ఇప్పుడు సబ్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవ చేస్తున్నాడు.” మీరు కూడా మీ పిల్లలు అలాంటివాళ్లతో సమయం గడిపేలా ఏర్పాటు చేయగలరా?

17-18. తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పటినుండి శిక్షణ ఇవ్వాలి?

17 పిల్లలకు చిన్నప్పటి నుండే శిక్షణ ఇవ్వండి. పిల్లలకు ఎంత చిన్న వయసు నుండి శిక్షణ ఇస్తే అంత మంచిది. (సామె. 22:6) తిమోతి గురించి ఆలోచించండి. ఆయన పెద్దవాడయ్యాక అపొస్తలుడైన పౌలుతో కలిసి ప్రయాణించాడు. తిమోతి తల్లి యునీకే, అమ్మమ్మ లోయి ఆయనకు “పసికందుగా ఉన్నప్పటి నుండే” శిక్షణ ఇచ్చారు.—2 తిమో. 1:5; 3:15.

18 కోటే డి’ ఐవరీకి చెందిన జాన్‌క్లోడ్‌, పీస్‌ అనే దంపతులు, యెహోవాను ప్రేమిస్తూ ఆయన సేవ చేసేలా తమ ఆరుగురు పిల్లల్ని పెంచగలిగారు. వాళ్ల విజయానికి రహస్యం ఏంటి? వాళ్లు యునీకే, లోయిలను ఆదర్శంగా తీసుకున్నారు. ఆ దంపతులు ఇలా చెప్తున్నారు: “మా పిల్లలు పసికందులుగా ఉన్నప్పటి నుండే దేవుని వాక్యాన్ని వాళ్ల హృదయాల్లో నాటాం.”—ద్వితీ. 6:6, 7.

19. మీ పిల్లల హృదయాల్లో యెహోవా వాక్యాన్ని ‘నాటడం’ అంటే ఏంటి?

19 మీ పిల్లల హృదయాల్లో యెహోవా వాక్యాన్ని ‘నాటడం’ అంటే ఏంటి? ‘నాటడం’ అంటే “మళ్లీమళ్లీ చెప్తూ వాళ్లకు గుర్తుండిపోయేలా బోధించడం.” అలా చేయాలంటే, తల్లిదండ్రులు తమ చిన్నారులతో ప్రతీరోజు సమయం గడపాలి. పిల్లలకు చెప్పిందే మళ్లీమళ్లీ చెప్పాలంటే ఒక్కోసారి విసుగ్గా అనిపించవచ్చు. అయితే, తల్లిదండ్రులు దీన్ని ఒక అవకాశంగా భావించి, తమ పిల్లలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని, దాన్ని పాటించేలా వాళ్ల మనసుల్లో ముద్ర వేయవచ్చు.

తమ పిల్లల్లో ఒక్కొక్కరికి ఎలా శిక్షణ ఇవ్వాలో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి (20వ పేరా చూడండి) *

20. పిల్లల్ని పెంచే విషయంలో కీర్తన 127:4 వ వచనాన్ని ఎలా పాటించవచ్చో వివరించండి.

20 మీ పిల్లల్ని బాగా తెలుసుకోండి. 127వ కీర్తన పిల్లల్ని బాణాలతో పోలుస్తుంది. (కీర్తన 127:4 చదవండి.) బాణాలు వేర్వేరు పదార్థాల్లో, వేర్వేరు సైజుల్లో ఉంటాయి, అలాగే పిల్లల మనస్తత్వాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి తమ పిల్లల్లో ఒక్కొక్కరికి ఎలా శిక్షణ ఇవ్వాలో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఇజ్రాయిల్‌లో ఉంటున్న ఒక జంట తమ పిల్లలు యెహోవాను సేవించేలా చక్కగా పెంచగలిగారు. “మా పిల్లలకు విడివిడిగా బైబిలు అధ్యయనం చేయడం” ఉపయోగకరంగా అనిపించిందని వాళ్లు చెప్పారు. అయితే అలా అధ్యయనం చేయడం అవసరమా, లేదా అలా చేయడం వీలౌతుందా అనేది ప్రతీ ఇంటి పెద్ద సొంతగా నిర్ణయించుకుంటాడు.

యెహోవా మీకు సహాయం చేస్తాడు

21. తల్లిదండ్రులకు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

21 కొన్నిసార్లు పిల్లలకు బోధించడం తల్లిదండ్రులకు చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ పిల్లలు, యెహోవా ఇచ్చిన బహుమానం కాబట్టి వాళ్లను పెంచే విషయంలో సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తల్లిదండ్రుల ప్రార్థనల్ని ఆయన ఇష్టపూర్వకంగా వింటాడు. అంతేకాదు బైబిలు ద్వారా, మన ప్రచురణల ద్వారా, సంఘంలో ఉన్న ఆదర్శవంతులైన, అనుభవంగల తల్లిదండ్రుల ద్వారా వాళ్ల ప్రార్థనలకు జవాబిస్తాడు.

22. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగల అత్యంత శ్రేష్ఠమైన వాటిలో ఏమేం ఉన్నాయి?

22 ఒక పిల్లవాణ్ణి పెంచడం వెనుక 20 ఏళ్ల కృషి ఉంటుందని కొంతమంది అంటుంటారు. కానీ తల్లిదండ్రుల బాధ్యత అంతటితో అయిపోదు. వాళ్లు తమ పిల్లలకు ఇవ్వగల అత్యంత శ్రేష్ఠమైన వాటిలో ప్రేమ, సమయం, బైబిలు ఆధారిత శిక్షణ ఉన్నాయి. శిక్షణ ఇచ్చినప్పుడు పిల్లలందరూ ఒకేలా స్పందించకపోవచ్చు. అయితే, యెహోవాను ప్రేమించే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన చాలామంది పిల్లలు, ఆసియాకు చెందిన సహోదరి జొవానా మే అనే సహోదరిలాగే భావిస్తారు. ఆమె ఇలా చెప్తుంది: “ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకుంటే, నా తల్లిదండ్రులు నాకు చక్కని క్రమశిక్షణ ఇచ్చినందుకు, యెహోవాను ప్రేమించడం నేర్పించినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. వాళ్లు నాకు జీవాన్ని మాత్రమే కాదు, ఒక అర్థవంతమైన జీవితాన్ని కూడా ఇచ్చారు.” (సామె. 23:24, 25) లక్షలాదిమంది క్రైస్తవులు అలాగే భావిస్తున్నారు.

పాట 59 యెహోవాను స్తుతిద్దాం

^ పేరా 5 పెళ్లయిన దంపతులు పిల్లల్ని కనాలా? ఒకవేళ కనాలనుకుంటే వాళ్లు ఎంతమందిని కనాలి? యెహోవాను ప్రేమించేలా, ఆయన్ని సేవించేలా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వొచ్చు? కొన్ని ఆధునిక ఉదాహరణల్ని, అలాగే ఈ ప్రశ్నలకు జవాబిచ్చే బైబిలు సూత్రాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 15 జూన్‌ 2018 క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌లో “సోషల్‌ నెట్‌వర్క్‌ వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండండి” అనే ఆర్టికల్‌ కూడా చూడండి.

^ పేరా 60 చిత్రాల వివరణ: పిల్లల్ని కనడం వల్ల వచ్చే సంతోషాల్ని, బాధ్యతల్ని చర్చించుకుంటున్న ఒక క్రైస్తవ జంట.

^ పేరా 64 చిత్రాల వివరణ: పిల్లల వయసు, సామర్థ్యాల్ని బట్టి వాళ్లతో విడివిడిగా బైబిలు అధ్యయనం చేస్తున్న ఒక జంట.