కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పండి’

‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పండి’

మీరు కృతజ్ఞత కలిగిన వ్యక్తని మీకు అనిపిస్తుందా? మనలో ప్రతీఒక్కరం ఆ ప్రశ్న గురించి ఆలోచించాలి. ఎందుకంటే, మనకాలంలో చాలామంది ‘కృతజ్ఞత లేనివాళ్లుగా’ ఉంటారని బైబిలు ముందుగానే చెప్పింది. (2 తిమో. 3:2) ఇతరులు తమకు పనులు చేసిపెట్టడం లేదా ఏదైనా వస్తువులు ఇవ్వడం వాళ్ల బాధ్యత అన్నట్లు చూసేవాళ్లను మీరెప్పుడైనా కలిశారా? తాము పొందిన దాన్నిబట్టి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదని వాళ్లు అనుకుంటుండవచ్చు. అలాంటి ప్రజల మధ్య ఉండడం చికాకును కలిగిస్తుందని మీరు ఒప్పుకుంటారు. అవునా?

దానికి భిన్నంగా, యెహోవా సేవకులు ‘కృతజ్ఞులై ఉండాలని’ బైబిలు చెప్తుంది. మనం ‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి.’ (కొలొ. 3:15; 1 థెస్స. 5:18) నిజానికి, కృతజ్ఞత చూపించే స్ఫూర్తి కలిగివుండడం మనకే మంచిది. అలాగని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

కృతజ్ఞత కలిగివుంటే మన మీద మనకు మంచి అభిప్రాయం కలుగుతుంది

కృతజ్ఞత కలిగివుండడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, దానివల్ల మన గురించి మనం సానుకూలంగా ఆలోచించగలుగుతాం. కృతజ్ఞతలు చెప్పే వ్యక్తికి సంతృప్తిగా అనిపించవచ్చు, ఆ కృతజ్ఞతను స్వీకరించే వ్యక్తికి కూడా మంచిగా అనిపిస్తుంది. కృతజ్ఞత చూపించడం వల్ల ఇరువురూ ఎందుకు సంతోషిస్తారు? దాన్ని అర్థంచేసుకోవడానికి ఈ ఉదాహరణ పరిశీలించండి: ఇతరులు మీకోసం ఏదైనా ఒక పని చేయడానికి ముందుకు వచ్చారంటే, దానర్థం మీరు దాన్ని పొందడానికి అర్హులని భావించారు కాబట్టే అలా చేశారు. మీ మీద వాళ్లకు శ్రద్ధ ఉంది. మీరు ఆ శ్రద్ధను గమనించినప్పుడు, మీ గురించి మీకు మంచిగా అనిపిస్తుంది. రూతు విషయంలో అదే జరిగి ఉండవచ్చు. బోయజు రూతు మీద ఉదారత చూపించాడు. అది గమనించిన రూతు, తనపట్ల శ్రద్ధ చూపించేవాళ్లు ఉన్నారని తెలుసుకుని, ఖచ్చితంగా సంతోషించి ఉంటుంది.—రూతు 2:10-13.

మనం ముఖ్యంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగివుండడం సముచితం. ఆయన ఇచ్చిన, ఇప్పటికీ ఇస్తున్న ఎన్నో ఆధ్యాత్మిక, భౌతిక బహుమానాల గురించి అప్పుడప్పుడు ఖచ్ఛితంగా ఆలోచించే ఉంటారు. (ద్వితీ. 8:17, 18; అపొ. 14:17) అయితే, దేవుడు చూపించిన మంచితనం గురించి కేవలం కాసేపు ఆలోచించే బదులు, మీ మీద, మీ ప్రియమైనవాళ్ల మీద కుమ్మరించిన ఎన్నో ఆశీర్వాదాల గురించి లోతుగా ధ్యానించడానికి ఎందుకు సమయం తీసుకోకూడదు? సృష్టికర్త చూపించిన ఉదారత గురించి ధ్యానించినప్పుడు, ఆయనపట్ల మీకున్న కృతజ్ఞత మరింత పెరుగుతుంది. అంతేకాదు ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మీకెంత విలువ ఇస్తున్నాడో మీరు అర్థంచేసుకోగలుగుతారు.—1 యోహా. 4:9.

అయితే, కేవలం ఆయన చూపించిన ఉదారత గురించి, ఆయన ఇచ్చిన దీవెనల గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా ఆయన చూపించే మంచితనం బట్టి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి. (కీర్త. 100:4, 5) “మనుషుల సంతోషానికి ఒక ముఖ్యమైన కారణం కృతజ్ఞతలు చెప్పడం” అని చాలామంది అంటుంటారు.

కృతజ్ఞత చూపిస్తే మీ స్నేహాలు బలపడతాయి

కృతజ్ఞత చూపించడం మీకు మంచిదని చెప్పడానికి మరో కారణం ఏంటంటే, అది స్నేహాల్ని బలపరుస్తుంది. ఇతరులు మనపట్ల కృతజ్ఞత చూపించాలని అందరం కోరుకుంటాం. ఒకవ్యక్తి మనకు దయతో ఏదైనా సహాయం చేసినప్పుడు, ఆయనకు మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తే, ఒకరికొకరం మంచి స్నేహితులం అవుతాం. (రోమా. 16:3, 4) అంతేకాదు, కృతజ్ఞతను కలిగివుండేవాళ్లు తరచూ ఇతరులకు సహాయం చేసేవాళ్లుగా ఉంటారు. వాళ్లు తమపట్ల చూపించే దయను గమనించి, వాళ్లు కూడా దయ చూపిస్తారు. అవును, ఇతరులకు సహాయం చేస్తే సంతోషంగా ఉంటాం. అది సరిగ్గా యేసు చెప్పినట్లే ఉంటుంది. ఆయనిలా చెప్పాడు, “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొ. 20:35.

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాబర్ట్‌ ఈమన్స్‌ ఇలా చెప్తున్నాడు: “కృతజ్ఞత కలిగివుండాలంటే, మనం ఒకరి మీద ఒకరం ఆధారపడే వాళ్లమని అర్థంచేసుకోవాలి. మనం కొన్నిసార్లు ఇస్తాం, కొన్నిసార్లు తీసుకుంటాం.” వాస్తవం ఏంటంటే మనం బ్రతికివుండడానికి, సంతోషంగా జీవించడానికి ఇతరుల మీద ఎన్నో విధాలుగా ఆధారపడతాం. ఉదాహరణకు, ఇతరులు మనకు ఆహారం లేదా వైద్య సహాయం అందించవచ్చు. (1 కొరిం. 12:21) కృతజ్ఞత కలిగివుండే వ్యక్తి, ఇతరులు తనకు చేసే సహాయాన్ని తప్పకుండా విలువైనదిగా ఎంచుతాడు. అయితే, ఇతరులు మీకోసం చేసిన వాటినిబట్టి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకున్నారా?

కృతజ్ఞత చూపించడం అలాగే జీవితం మీద మీకున్న అభిప్రాయం

కృతజ్ఞత చూపించడం మంచిదని చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే, అది మన జీవితంలో ప్రతికూల విషయాల మీద కాకుండా సానుకూల విషయాల మీద దృష్టి పెట్టేలా సహాయం చేస్తుంది. ఒకవిధంగా మీ మనసు జల్లెడలా పనిచేస్తుంది. అంటే, మీ చుట్టూ జరిగే కొన్ని విషయాల్ని మనసులోకి తీసుకొని, వేరే విషయాలను మనసులోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది. అప్పుడు మీరు సానుకూల విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ, మీ సమస్యల మీద తక్కువ దృష్టి పెడతారు. మీరు ఎంత కృతజ్ఞతను చూపిస్తే, అంత ఎక్కువగా మంచి విషయాల గురించి ఆలోచిస్తారు, మరింత కృతజ్ఞతను చూపించాలనే ప్రోత్సాహాన్ని పొందుతారు. కృతజ్ఞత కలిగివుండాల్సిన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తే, అపొస్తలుడైన పౌలు చేయమని ప్రోత్సహించిన పనిని చేయగలుగుతారు. ఆయనిలా ప్రోత్సహించాడు: “ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించండి.”—ఫిలి. 4:4.

కృతజ్ఞత కలిగివుంటే, ప్రతికూల ఆలోచనలు దరిచేరవు. మనం ఒకవైపు కృతజ్ఞతను కలిగివుంటూనే మరోవైపు ఈర్ష్యను, బాధను, లేదా కోపాన్ని చూపించలేం. కృతజ్ఞత కలిగివుండే ప్రజలు వస్తుసంపదలపై మోజును కూడా పెంచుకోరు. వాళ్లు తమకున్న వాటితో తృప్తి పడతారు గానీ ఎక్కువ కావాలని కోరుకోరు.—ఫిలి. 4:12.

మీరు పొందిన ఆశీర్వాదాలను లెక్క పెట్టుకోండి!

ఈ చివరిరోజుల్లో మీకు ఎదురయ్యే కష్టాలకు మీరు బాధపడాలని, కృంగిపోవాలని సాతాను కోరుకుంటున్నాడనే విషయం క్రైస్తవులుగా మీకు తెలుసు. మీరు ప్రతికూల వైఖరిని, ఫిర్యాదు చేసే స్వభావాన్ని అలవర్చుకుంటే అతను సంతోషిస్తాడు. ఒకవేళ మీరు అలాంటి వ్యక్తయితే, మీరు మంచివార్తను సమర్థవంతంగా ప్రకటించలేరు. నిజానికి, కృతజ్ఞత కలిగివుండడానికి, పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించడానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఉదాహరణకు, దేవుడు మనకు ఇచ్చిన మంచివాటిని బట్టి మనకు సంతోషం కలుగుతుంది అలాగే భవిష్యత్తు గురించి ఆయన చేసిన వాగ్దానాల మీద మనకు విశ్వాసం ఏర్పడుతుంది.—గల. 5:22, 23.

ఒక యెహోవాసాక్షిగా, కృతజ్ఞత గురించి ఈ ఆర్టికల్‌లో చర్చించిన విషయాలతో మీరు ఏకీభవిస్తుండవచ్చు. అయితే, కృతజ్ఞత కలిగివుండడం, జీవితం గురించి సానుకూలంగా ఆలోచించడం వాటంతటవే రావని మీరు గ్రహించివుంటారు. అలాగైతే, నిరుత్సాహపడకండి. కృతజ్ఞత అనే లక్షణాన్ని అలవర్చుకోవడం, దాన్ని కాపాడుకోవడం సాధ్యమే. ఎలా? మీ జీవితంలో కృతజ్ఞత చూపించగల కొన్ని అంశాల గురించి ఆలోచించడానికి ప్రతీరోజు కొంత సమయం తీసుకోండి. మీరు ఎంతెక్కువ అలాచేస్తే, కృతజ్ఞత చూపించడం అంతెక్కువ తేలికౌతుంది. జీవితంలో కష్టాల మీదే దృష్టి పెట్టే వాళ్లకన్నా మీరు ఇంకెంతో సంతోషంగా ఉంటారు. దేవుడు అలాగే ఇతరులు మిమ్మల్ని ప్రోత్సహించే ఏమేం పనులు చేశారో ఆలోచించండి. అది మీకు సంతోషాన్నిస్తుంది. బహుశా మీరు ఆ విషయాలన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవచ్చు. ప్రతీరోజు మీరు కృతజ్ఞత చూపించాలనిపించే రెండు లేదా మూడు విషయాల గురించి అందులో రాసుకోవచ్చు.

కృతజ్ఞత చూపించడం గురించి అధ్యయనం చేసిన కొంతమంది ఏం కనుగొన్నారంటే, ‘మనం ఇతరులకు క్రమంగా కృతజ్ఞతలు చెప్పినప్పుడు, మన మెదడు పనిచేసే తీరు మారుతుంది. దానివల్ల మన జీవితం గురించి మంచిగా ఆలోచించడం తేలికౌతుంది.’ కృతజ్ఞత కలిగివుండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. కాబట్టి మీరు పొందిన దీవెనల్ని లెక్క పెట్టుకోండి, జీవితంలో ఎదురైన మంచి అనుభవాల గురించి ఆలోచించండి, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగివుండండి! మంచి విషయాలను నిర్లక్ష్యం చేసే బదులు, ‘యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు.’ అవును, ‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి.’—1 దిన. 16:34, NW; 1 థెస్స. 5:18.