కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 51

యెహోవా మీకు ఎంతబాగా తెలుసు?

యెహోవా మీకు ఎంతబాగా తెలుసు?

“యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు, కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.”—కీర్త. 9:10.

పాట 56 సత్య మార్గంలో నడవండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. అన్హిలీటో అనుభవం చూపిస్తున్నట్టు మనలో ప్రతీఒక్కరం ఏం చేయాలి?

మీ అమ్మానాన్నలు యెహోవాసాక్షులా? వాళ్లు యెహోవాకు స్నేహితులైనంత మాత్రాన మీరు కూడా ఆయన స్నేహితులైపోతారని అనుకోకండి. మన తల్లిదండ్రులు యెహోవాను ఆరాధించేవాళ్లు అయినా, కాకపోయినా మనలో ప్రతీ ఒక్కరం ఎవరికివాళ్లు ఆయనతో వ్యక్తిగత స్నేహాన్ని వృద్ధిచేసుకోవాలి.

2 అన్హిలీటో అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయన సాక్షుల కుటుంబంలో పెరిగాడు. తను టీనేజీలో ఉన్నప్పుడు, దేవునికి బాగా దగ్గరైన భావన తనకు కలగలేదు. ఆయన ఇలా చెప్తున్నాడు: “నేను కేవలం మా ఇంట్లోవాళ్లు చేస్తున్నారు కాబట్టే యెహోవాను ఆరాధించాను.” కానీ అన్హిలీటో దేవుని వాక్యం చదవడానికి, దాని గురించి ధ్యానించడానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు; తరచూ యెహోవాకు ప్రార్థన చేయడం కూడా మొదలుపెట్టాడు. ఫలితం? ఆయన ఇలా అన్నాడు: “నా ప్రియ తండ్రియైన యెహోవాకు దగ్గరయ్యే ఒకే ఒక్క మార్గం, నాకు నేనుగా ఆయన గురించి తెలుసుకోవడమే అని అర్థంచేసుకున్నాను.” అన్హిలీటో అనుభవం పరిశీలించాక మనకు ఈ ముఖ్యమైన ప్రశ్నలు రావచ్చు: యెహోవా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికీ, ఆయన్ని బాగా తెలుసుకోవడానికీ మధ్య తేడా ఏంటి? యెహోవాను బాగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి?

3. యెహోవా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికీ, ఆయన్ని బాగా తెలుసుకోవడానికీ మధ్య తేడా ఏంటి?

3 మనకు యెహోవా పేరు తెలియడం వల్ల లేదా ఆయన చెప్పిన కొన్ని విషయాలు లేదా చేసిన కొన్ని పనులు తెలియడం వల్ల ఆయన మనకు తెలుసని అనుకుంటుండవచ్చు. కానీ యెహోవాను తెలుసుకోవడంలో అంతకన్నా ఎక్కువే ఉంది. మనం యెహోవా గురించి, ఆయన అద్భుతమైన లక్షణాల గురించి నేర్చుకోవడానికి సమయం వెచ్చించాల్సిన అవసరముంది. అప్పుడే మనం ఆయన మాటల వెనుక, పనుల వెనుక ఉన్న కారణాలను మెల్లిమెల్లిగా అర్థంచేసుకుంటాం. మన అభిప్రాయాలు, నిర్ణయాలు, పనులు ఆయనకు నచ్చుతాయో లేదో గ్రహించగలుగుతాం. మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో గ్రహించాక, నేర్చుకున్నదానికి అనుగుణంగా ప్రవర్తించాలి.

4. బైబిల్లోని ఉదాహరణలను పరిశీలించడం మనకెలా సహాయం చేస్తుంది?

4 మనం యెహోవాను ఆరాధించాలని కోరుకుంటున్నందుకు కొంతమంది మనల్ని ఎగతాళి చేస్తుండవచ్చు, మనం కూటాలకు వెళ్లడం మొదలుపెట్టాక వాళ్లు ఇంకా ఎక్కువగా మనల్ని వ్యతిరేకిస్తుండవచ్చు. అయినాసరే, మనం యెహోవా మీద నమ్మకముంచితే ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. అలాగే, దేవునితో జీవితాంతం నిలిచివుండే స్నేహానికి మనం పునాది వేసుకుంటాం. మనం నిజంగా యెహోవాను అంతబాగా తెలుసుకోగలమా? ఖచ్చితంగా తెలుసుకోగలం! అది సాధ్యమని, అపరిపూర్ణ మనుషులైన మోషే, దావీదు రాజు ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. వాళ్లు ఏం చేశారో పరిశీలిస్తూ, ఈ రెండు ప్రశ్నలకు జవాబు చూద్దాం: వాళ్లు యెహోవాను ఎలా తెలుసుకున్నారు? వాళ్ల ఉదాహరణల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

“అదృశ్యుడైన దేవుణ్ణి” మోషే చూశాడు

5. మోషే ఏమి చేయాలని కోరుకున్నాడు?

5 దేవున్ని సేవించాలని మోషే నిర్ణయించుకున్నాడు. మోషేకు దాదాపు 40 ఏళ్లు ఉన్నప్పుడు, ‘ఫరో కూతురి కుమారుణ్ణని’ అనిపించుకునే బదులు హెబ్రీయులైన దేవుని ప్రజలతో సహవాసం చేయాలని కోరుకున్నాడు. (హెబ్రీ. 11:24) మోషే ఒక ప్రత్యేక హోదాను వదులుకున్నాడు. ఆయన ఐగుప్తులో బానిసలుగా ఉన్న హెబ్రీయుల పక్షం వహించి, ప్రజలు దేవుడిలా భావించే శక్తివంతమైన ఫరో రాజు ఆగ్రహానికి గురయ్యాడు. మోషేకు ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఇది చూపిస్తోంది. మోషే యెహోవా మీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకం శాశ్వత బంధానికి ఒక పునాదిగా నిలిచింది.—సామె. 3:5.

6. మోషే ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

6 మనకేంటి పాఠం? మోషేలా మనందరం తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటి ఉంది: మనం దేవున్ని సేవిస్తూ, ఆయన ప్రజలతో సహవసిస్తామా? దేవున్ని సేవించడానికి మనం త్యాగాలు చేయాల్సిరావచ్చు, యెహోవా అంటే తెలియనివాళ్ల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. కానీ మన పరలోక తండ్రి మీద నమ్మకం ఉంచితే ఆయన మనకు మద్దతిస్తాడనే భరోసాను కలిగివుండవచ్చు!

7-8. మోషే వేటి గురించి నేర్చుకుంటూనే ఉన్నాడు?

7 మోషే, యెహోవా లక్షణాల గురించి నేర్చుకుంటూ, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసత్వం నుండి విడిపించే పనిని మోషేకు అప్పగించినప్పుడు ఆయనకు ధైర్యం చాల్లేదు. ఆ పనికి తను సరిపోనని యెహోవాతో పదేపదే అన్నాడు. దేవుడు నిజమైన కనికరం చూపిస్తూ మోషేకు సహాయం చేశాడు. (నిర్గ. 4:10-16) దానివల్ల, మోషే శక్తివంతమైన తీర్పు సందేశాలను ఫరోకు ప్రకటించగలిగాడు. ఆ తర్వాత, యెహోవా తన శక్తిని ఉపయోగించి ఇశ్రాయేలీయులను కాపాడడం, ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో నాశనం చేయడం మోషే చూశాడు.—నిర్గ. 14:26-31; కీర్త. 136:15.

8 మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన తర్వాత, వాళ్లు అదేపనిగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు. అయినాసరే, తాను బానిసత్వం నుండి విడిపించిన ప్రజలపట్ల యెహోవా ఎంతో ఓర్పు చూపించడం మోషే గమనించాడు. (కీర్త. 78:40-43) అంతేకాదు, ఇశ్రాయేలీయులను నాశనం చేయొద్దని మోషే బ్రతిమాలినప్పుడు యెహోవా తన మనసు మార్చుకుని, గొప్ప వినయం చూపించడాన్ని మోషే గమనించాడు.—నిర్గ. 32:9-14.

9. హెబ్రీయులు 11:27 ప్రకారం, మోషే యెహోవాకు ఎంత దగ్గరయ్యాడు?

9 ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత, మోషే యెహోవాకు ఎంత దగ్గరయ్యాడంటే, ఆయన తన పరలోక తండ్రిని చూస్తున్నట్టుగా ఆయనకు అనిపించింది. (హెబ్రీయులు 11:27 చదవండి.) ఆ బంధం ఎంత సన్నిహితమైందో తెలియజేస్తూ బైబిలు ఇలా చెప్తుంది: “మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను.”—నిర్గ. 33:11.

10. యెహోవా గురించి బాగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి?

10 మనకేంటి పాఠం? యెహోవాను బాగా తెలుసుకోవాలంటే మనం ఆయన లక్షణాల గురించి నేర్చుకోవడంతోపాటు ఆయన ఇష్టాన్ని కూడా నెరవేర్చాలి. నేడు, “అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలి” అనేదే యెహోవా ఇష్టం. (1 తిమో. 2:3, 4) యెహోవా ఇష్టాన్ని నెరవేర్చే ఒక మార్గం ఏంటంటే, ఆయన గురించి ఇతరులకు బోధించడం.

11. ఇతరులకు యెహోవా గురించి బోధిస్తుండగా, మనం ఆయన గురించి ఇంకా బాగా ఎలా తెలుసుకుంటాం?

11 సాధారణంగా, యెహోవా గురించి ఇతరులకు బోధించినప్పుడు వ్యక్తిగతంగా మనం ఆయన గురించి ఇంకా బాగా తెలుసుకుంటాం. ఉదాహరణకు, సరైన హృదయ స్థితి ఉన్నవాళ్ల దగ్గరకు యెహోవా మనల్ని నడిపించినప్పుడు ఆయన కనికరాన్ని మనం కళ్లారా చూస్తాం. (యోహా. 6:44; అపొ. 13:48) మనం బైబిలు అధ్యయనం చేస్తున్నవాళ్లు తమ చెడు అలవాట్ల నుండి బయటపడి, కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం చూసినప్పుడు దేవుని వాక్యానికి ఉన్న శక్తిని మనం చూస్తాం. (కొలొ. 3:9, 10) మనం పరిచర్య చేసే ప్రాంతంలోని ప్రజలు తన గురించి నేర్చుకుని, రక్షణ పొందే ఎన్నో అవకాశాలు వాళ్లకు ఇస్తున్నప్పుడు మనం దేవుని ఓర్పుకు రుజువును చూస్తాం.—రోమా. 10:13-15.

12. నిర్గమకాండము 33:13 చెప్తున్నట్టు మోషే ఏం అడిగాడు? ఎందుకలా అడిగాడు?

12 యెహోవాతో తనకున్న సంబంధాన్ని మోషే తేలిగ్గా తీసుకోలేదు. దేవుని పేరున శక్తివంతమైన పనులు చేసిన తర్వాత కూడా మోషే, ‘నీ మార్గాలు నాకు తెలియజేయి’ అని యెహోవాను గౌరవపూర్వకంగా అడిగాడు. (నిర్గమకాండము 33:13 చదవండి.) అలా అడిగే నాటికి మోషే 80వ పడిలో ఉన్నాడు. అయినాసరే, ప్రేమగల తన పరలోక తండ్రి గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని మోషేకు తెలుసు.

13. దేవునితో మనకున్న స్నేహాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపించే ఒక మార్గమేమిటి?

13 మనకేంటి పాఠం? మనం యెహోవాను ఎంతోకాలం నుండి సేవిస్తున్నా ఆయనతో మనకున్న సంబంధాన్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. దేవునితో మనకున్న స్నేహాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపించే ఒక మార్గం ఏంటంటే, ఆయనతో ప్రార్థనలో మాట్లాడడం.

14. దేవుని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రార్థన ఒక ముఖ్యమైన మార్గమని ఎలా చెప్పొచ్చు?

14 బలమైన బంధాలకు సంభాషణ ఒక ఆయువుపట్టు లాంటిది. కాబట్టి తరచూ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనకు దగ్గరవ్వండి. మీ లోతైన భావాలను ఆయనకు చెప్పడానికి ఎప్పుడూ భయపడకండి. (ఎఫె. 6:18) టర్కీలో ఉంటున్న క్రిస్టా ఇలా చెప్తుంది: “ప్రార్థనలో నా భావాలను యెహోవాకు చెప్పుకున్న ప్రతీసారి, ఆయన నాకు సహాయం చేయడం చూసి యెహోవా మీద నాకున్న ప్రేమ, నమ్మకం పెరుగుతున్నాయి. యెహోవా నా ప్రార్థనలకు ఎలా జవాబిస్తున్నాడో చూస్తుంటే ఆయన నాకు ఒక తండ్రిలా, స్నేహితునిలా అనిపిస్తున్నాడు.”

యెహోవా హృదయానికి నచ్చిన వ్యక్తి

15. దావీదు రాజు గురించి యెహోవా ఏమన్నాడు?

15 యెహోవా దేవుని సమర్పిత జనాంగంలో దావీదు రాజు పుట్టాడు. కానీ కేవలం తన కుటుంబం యెహోవాను ఆరాధిస్తుంది కాబట్టి తను కూడా ఆయన్ని ఆరాధించాలని దావీదు అనుకోలేదు. ఆయన యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు, యెహోవాకు కూడా ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం. దావీదు “నా హృదయానికి నచ్చిన వ్యక్తి” అని యెహోవానే స్వయంగా అన్నాడు. (అపొ. 13:22) దావీదు యెహోవాకు అంత దగ్గర ఎలా అయ్యాడు?

16. సృష్టిని చూసి దావీదు యెహోవా గురించి ఏం నేర్చుకున్నాడు?

16 సృష్టిని చూసి దావీదు యెహోవా గురించి నేర్చుకున్నాడు. దావీదు యువకునిగా ఉన్నప్పుడు తన తండ్రి గొర్రెల్ని కాస్తూ ఎన్నో గంటలు బయటే గడిపేవాడు. బహుశా అప్పుడే ఆయన యెహోవా గురించి ధ్యానించడం మొదలుపెట్టివుంటాడు. ఉదాహరణకు, దావీదు రాత్రిళ్లు తలెత్తి ఆకాశాన్ని రెప్పవాల్చకుండా చూసినప్పుడు, వేల సంఖ్యలో అక్కడున్న నక్షత్రాలను గమనించడంతోపాటు వాటిని తయారుచేసిన వ్యక్తి లక్షణాలను కూడా గ్రహించివుంటాడు. దావీదు ఇలా రాసేందుకు కదిలించబడ్డాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” (కీర్త. 19:1, 2) మనుషులు సృష్టించబడిన విధానం గురించి ఆలోచించినప్పుడు యెహోవా ఎంత జ్ఞానవంతుడో దావీదు అర్థంచేసుకున్నాడు. (కీర్త. 139:14) యెహోవా చేసిన పనులను ధ్యానించినప్పుడు తనెంత అల్పుడో దావీదు గ్రహించాడు.—కీర్త. 139:6.

17. సృష్టి గురించి ధ్యానించినప్పుడు మనమేం నేర్చుకోవచ్చు?

17 మనకేంటి పాఠం? సృష్టి మీద ఆసక్తి పెంచుకోండి; యెహోవా చేసిన అందమైన సృష్టిని గమనించడానికి సమయం తీసుకోండి; మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే అనుభూతిని పొందండి! మీ రోజువారీ జీవితంలో మీ చుట్టూ వున్న మొక్కల గురించి, జంతువుల గురించి, ప్రజల గురించి లోతుగా ఆలోచించండి. అవన్నీ యెహోవా గురించి మీకు బోధిస్తాయి. అలా చేస్తే ప్రతీ రోజు మీ ప్రేమగల తండ్రి గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. (రోమా. 1:20) ఆయన మీద మీకున్న ప్రేమ రోజురోజుకు పెరగడం మీరే చూస్తారు.

18. కీర్తన 18 లో ఉన్నట్టు దావీదు ఏం గుర్తించాడు?

18 యెహోవా తనకు సహాయం చేస్తున్నాడని దావీదు గ్రహించాడు. ఉదాహరణకు, దావీదు తన తండ్రి గొర్రెల్ని సింహం నుండి, ఎలుగుబంటి నుండి కాపాడినప్పుడు యెహోవాయే అలాంటి క్రూరమృగాలను చంపడానికి తనకు సహాయం చేశాడని దావీదు గ్రహించాడు. గొప్ప యోధుడైన గొల్యాతును ఓడించినప్పుడు తనను నడిపించింది యెహోవాయే అని ఆయన స్పష్టంగా అర్థంచేసుకున్నాడు. (1 సమూ. 17:37) అసూయపరుడైన సౌలు రాజు నుండి తప్పించుకొని పారిపోయినప్పుడు తనను రక్షించింది యెహోవాయే అని దావీదు గుర్తించాడు. (కీర్త. 18, పైవిలాసము) దావీదు స్థానంలో ఒక గర్విష్ఠి ఉంటే ఆ విజయాల ఘనతంతా తనే తీసుకునేవాడు. కానీ దావీదు వినయస్థుడు, అందుకే తన జీవితంలో యెహోవా హస్తం ఉందని గ్రహించగలిగాడు.—కీర్త. 138:6.

19. దావీదు ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు?

19 మనకేంటి పాఠం? మనం యెహోవా సహాయం అడగడం కన్నా ఎక్కువే చేయాలి. ఆయన ఎప్పుడు, ఎలా సహాయం చేస్తాడో గ్రహించడానికి ప్రయత్నించాలి. మనం వినయంగా మన పరిమితుల్ని గుర్తిస్తే, మన సొంత శక్తితో చేయలేని వాటిని చేసే సామర్థ్యం ఆయనే ఇస్తాడని స్పష్టంగా గ్రహిస్తాం. యెహోవా మనకు సహాయం చేయడం చూసిన ప్రతీసారి ఆయనతో మనకున్న సంబంధం బలపడుతుంది. ఫిజిలో ఉంటున్న ఐజాక్‌ అనే సహోదరుడు ఆ విషయం నిజమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఎంతోకాలంగా యెహోవా సేవచేస్తున్న ఆ సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నా జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, నేను బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు యెహోవా నాకు ఎలా సహాయం చేస్తున్నాడో నేను చూస్తున్నాను. అందుకే యెహోవా నాకు నిజమైన వ్యక్తిగా ఉన్నాడు.”

20. యెహోవాతో దావీదుకున్న సంబంధం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

20 దావీదు యెహోవాకున్న లక్షణాల్ని చూపించాడు. యెహోవాకున్న లక్షణాలను చూపించే సామర్థ్యంతో మనం సృష్టించబడ్డాం. (ఆది. 1:26) యెహోవా లక్షణాల గురించి మనం ఎంతబాగా తెలుసుకుంటే, ఆయనను అంతబాగా అనుకరించగలుగుతాం. దావీదు తన పరలోక తండ్రి గురించి బాగా తెలుసుకున్నాడు, అందుకే ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆయన్ని అనుకరించగలిగాడు. ఒక ఉదాహరణను పరిశీలించండి. దావీదు బత్షెబతో వ్యభిచారం చేసి, ఆ తర్వాత ఆమె భర్తను చంపించి యెహోవాకు విరుద్ధంగా పాపం చేశాడు. (2 సమూ. 11:1-4, 15) కానీ ఇతరుల మీద కనికరం చూపించిన దావీదు మీద యెహోవా కనికరం చూపించాలనుకున్నాడు. దావీదుకు యెహోవాతో అంత మంచి సంబంధం ఉండబట్టే ఆయన ఇశ్రాయేలీయులు మెచ్చిన రాజుల జాబితాలో ఒకడిగా నిలిచిపోయాడు. ఇశ్రాయేలు రాజులకు దావీదును కొలమానంగా యెహోవా ఉపయోగించాడు.—1 రాజు. 15:11; 2 రాజు. 14:1-3.

21. ఎఫెసీయులు 4:24; 5:1 చెప్పినట్టు మనం ‘దేవున్ని అనుకరిస్తే’ ఎలాంటి ఫలితాలు వస్తాయి?

21 మనకేంటి పాఠం? మనం ‘దేవున్ని అనుకరించాలి.’ అలాచేస్తే మనం ప్రయోజనం పొందడంతోపాటు ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతాం. మనం మన వ్యక్తిత్వాన్ని ఆయన వ్యక్తిత్వంలా తీర్చి దిద్దుకున్నప్పుడు మనం ఆయన పిల్లలమని నిరూపించుకుంటాం.—ఎఫెసీయులు 4:24; 5:1 చదవండి.

యెహోవా గురించి ఇంకా బాగా తెలుసుకోండి

22-23. యెహోవా గురించి నేర్చుకున్న వాటిని మనం పాటిస్తే ఏం జరుగుతుంది?

22 ఇప్పటివరకు పరిశీలించినట్టు సృష్టి ద్వారా, ఆయన వాక్యమైన బైబిలు ద్వారా మనం యెహోవా గురించి నేర్చుకోవచ్చు. దాంట్లో మనం అనుకరించగల ఎంతోమంది విశ్వాసుల ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో మనం మోషే, దావీదు గురించి చూశాం. యెహోవా తన వంతు తాను చేశాడు. ఇప్పుడు మనవంతు మనం చేయాలి, ఆయన గురించి ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి.

23 మనం యెహోవా గురించి నేర్చుకోవడం ఎప్పటికీ ఆపం. (ప్రసం. 3:11) ఆయన గురించి మనకెంత తెలుసనేది కాదుగానీ, తెలుసుకున్న దాంతో మనమేమి చేస్తామనేది ముఖ్యం. మనం నేర్చుకున్నదాన్ని పాటిస్తూ, మన ప్రేమగల తండ్రిని అనుకరిస్తే, ఆయన మనకు దగ్గరౌతూనే ఉంటాడు. (యాకో. 4:8) తన గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్లను ఎప్పటికీ విడిచిపెట్టనని యెహోవా తన వాక్యం ద్వారా హామీ ఇస్తున్నాడు.

పాట 80 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి

^ పేరా 5 దేవుడు ఉన్నాడని చాలామంది నమ్ముతారు. కానీ వాళ్లకు ఆయన నిజంగా తెలీదు. యెహోవాను తెలుసుకోవడమంటే ఏంటి? దేవునితో పటిష్ఠమైన సంబంధం ఏర్పర్చుకునే విషయంలో మోషే అలాగే రాజైన దావీదు నుండి మనమేం నేర్చుకోవచ్చు వంటి ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌ జవాబిస్తుంది.