కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 50

యెహోవా మీకు విడుదల దయచేస్తాడు

యెహోవా మీకు విడుదల దయచేస్తాడు

‘మీరు దేశవాసులకందరికీ విడుదల చాటింపవలెను.’ —లేవీ. 25:10.

పాట 22 రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదికి రావాలి!

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) ప్రజలు ఏ సందర్భంలో సంబరాలు జరుపుకుంటారు? (“ సునాద సంవత్సరం అంటే ఏంటి?” అనే బాక్సు చూడండి) (బి) లూకా 4:16-18⁠లో యేసు దేని గురించి మాట్లాడాడు?

కొన్ని దేశాల్లో, రాజు లేదా రాణి తమ పరిపాలనలో 50వ సంవత్సరాన్ని విశిష్ఠంగా గుర్తించడానికి ప్రత్యేక సంబరాలు జరుపుకుంటారు. ఆ సంబరాలు ఒక రోజు, ఒక వారం, లేదా అంతకన్నా ఎక్కువకాలం వరకు జరుపుకుంటారు. కానీ అవి ఎలాగైనా చివరకు ముగుస్తాయి. వాటివల్ల కలిగిన సంతోషాన్ని కూడా ప్రజలు వెంటనే మర్చిపోతారు.

2 మనం అంతకన్నా మెరుగైన సునాద సంవత్సరం గురించి పరిశీలిస్తాం. అది ప్రాచీన ఇశ్రాయేలులో, 50 ఏళ్లకు ఒక్కసారి ఏడాది పొడవునా జరుపుకునే సునాద సంవత్సరం కన్నా ఎంతో మెరుగైనది. ప్రాచీనకాల సునాద సంవత్సరం దాన్ని ఆచరించేవాళ్లకు విడుదల తీసుకొచ్చింది. నేడు మనమెందుకు దాని గురించి తెలుసుకోవాలి? ఎందుకంటే, ఇశ్రాయేలీయుల సునాద సంవత్సరం, నేడు యెహోవా మనకోసం చేస్తున్న ఒక అద్భుతమైన ఏర్పాటును మనకు గుర్తుచేస్తుంది. అది మనకు శాశ్వతమైన విడుదలను తీసుకొస్తుంది. దాన్నుండి మనం ఇప్పుడు కూడా ప్రయోజనం పొందవచ్చు. ఆ అద్భుతమైన విడుదల గురించి యేసు కూడా మాట్లాడాడు.—లూకా 4:16-18 చదవండి.

ఇశ్రాయేలులో సునాద సంవత్సరం సంతోషాల్ని తీసుకొచ్చింది, ఎందుకంటే బానిసలుగా ఉన్నవాళ్లు తమ కుటుంబం దగ్గరికి, తమ స్వదేశానికి తిరిగొచ్చారు (3వ పేరా చూడండి) *

3. లేవీయకాండము 25:8-12 వచనాలు చెప్తున్నట్లుగా, ఇశ్రాయేలీయులు సునాద సంవత్సరం నుండి ఎలా ప్రయోజనం పొందేవాళ్లు?

3 ముందు మనం, దేవుడు ప్రాచీనకాలంలో తన ప్రజల కోసం ఏర్పాటు చేసిన సునాద సంవత్సరం గురించి చర్చిస్తే, విడుదల గురించి యేసు చెప్పిన మాటల్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.” (లేవీయకాండము 25:8-12 చదవండి.) ముందటి ఆర్టికల్‌లో, ఇశ్రాయేలీయులు ప్రతీవారం విశ్రాంతి రోజును పాటించడం ద్వారా ఎలా ప్రయోజనం పొందారో పరిశీలించాం. మరైతే, వాళ్లు సునాద సంవత్సరం నుండి ఎలా ప్రయోజనం పొందారు? ఉదాహరణకు, ఒక ఇశ్రాయేలీయుడు అప్పు చేసి, దాన్ని తీర్చలేక తన భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందనుకోండి, సునాద సంవత్సరంలో అతని భూమి తిరిగి అతనికి దక్కుతుంది. అలా అతను “తన స్వాస్థ్యమును తిరిగి” పొందేవాడు. దానివల్ల తర్వాత్తర్వాత అతని పిల్లలు దాన్ని వారసత్వంగా పొందుతారు. ఇంకో సందర్భంలో, ఒక ఇశ్రాయేలీయుడు అప్పు చేసి, దాన్ని తీర్చలేక తనను గానీ, తన పిల్లల్ని గానీ దాసత్వానికి అమ్ముకున్నాడని అనుకోండి, సునాద సంవత్సరంలో వాళ్లు ‘తమ కుటుంబం దగ్గరికి తిరిగి రావాలి.’ కాబట్టి ఈ ఏర్పాటు వల్ల ఎవ్వరికీ శాశ్వతమైన దాసత్వం ఉండేది కాదు. నిజంగా యెహోవా తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ చూపించాడో కదా!

4-5. ప్రాచీనకాలం నాటి సునాద సంవత్సరం గురించి నేడు మనం తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

4 సునాద సంవత్సరం వల్ల మరో ప్రయోజనం ఏంటి? యెహోవా ఇలా వివరించాడు: “నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును . . . మీలో బీదలు ఉండనే ఉండరు.” (ద్వితీ. 15:4, 5) యెహోవా చేసిన ఏర్పాటుకు, నేడు లోకంలో ఉన్న పరిస్థితికి ఎంత తేడా ఉందో కదా! నేడు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్లు అంతకంతకూ పేదవాళ్లు అవుతున్నారు.

5 క్రైస్తవులముగా మనం మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అంటే సునాద సంవత్సరం అనే ఏర్పాటుకు సంబంధించి దాసుల్ని విడుదల చేయడం, రుణాల్ని మాఫీ చేయడం, స్వాస్థ్యాన్ని తిరిగి ఇచ్చేయడం లాంటి వాటిని మనం పాటించం. (రోమా. 7:4; 10:4; ఎఫె. 2:15) అయినప్పటికీ, మనం సునాద సంవత్సరం గురించి నేర్చుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే, యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఏర్పాటు చేసిన విడుదలను లేదా స్వేచ్ఛను గుర్తుచేసే లాంటి స్వేచ్ఛను, ఇప్పుడు మనం కూడా ఆనందించవచ్చు.

యేసు విడుదలను ప్రకటించాడు

6. మనుషులకు దేని నుండి విడుదల అవసరం?

6 మనందరికీ విడుదల అవసరమే ఎందుకంటే ఒక విధంగా మనందరం పాపానికి దాసులుగా ఉన్నాం, అది చాలా క్రూరమైన బానిసత్వం. దానివల్ల వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం వంటి వాటిని అనుభవిస్తున్నాం. మనం అద్దంలో చూసుకున్నప్పుడు లేదా అనారోగ్యంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు ఆ విషయం మనకు రుజువౌతుంది. అంతేకాదు మనం పాపాలు చేసినప్పుడు నిరుత్సాహపడతాం. అపొస్తలుడైన పౌలు కూడా ‘తన శరీరం పాపపు నియమానికి బందీగా ఉందని’ ఒప్పుకున్నాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి! ఇలాంటి మరణానికి నడిపించే శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు?”—రోమా. 7:23, 24.

7. విడుదల గురించి యెషయా ప్రవక్త ఏం చెప్పాడు?

7 సంతోషకరమైన విషయమేమిటంటే, మనల్ని రక్షించడానికి లేదా పాపం నుండి విడిపించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విడుదలకు యేసే కీలకం. యేసు భూమ్మీదకు రావడానికి 700 కన్నా ఎక్కువ సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త భవిష్యత్తులో జరిగే ఒక గొప్ప విడుదల గురించి చెప్పాడు. ఆ గొప్ప విడుదల, ఇశ్రాయేలీయుల కాలంలో సునాద సంవత్సరం సాధించిన విడుదల కన్నా ఎంతో ఎక్కువ సాధిస్తుంది. దాని గురించి యెషయా ఇలా రాశాడు: “ప్రభువగు యెహోవా ఆత్మ నామీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకును . . . ఆయన నన్ను పంపెను.” (యెష. 61:1, 2) ఈ ప్రవచనం ఎవరికి అన్వయిస్తుంది?

8. విడుదలకు సంబంధించిన యెషయా ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది?

8 విడుదలకు సంబంధించిన ఈ ముఖ్యమైన ప్రవచనం, యేసు తన పరిచర్యను ఆరంభించిన తర్వాత నెరవేరడం మొదలైంది. ఆయన తన సొంతూరైన నజరేతులోని సభామందిరానికి వెళ్లినప్పుడు అక్కడ సమకూడిన యూదులకు, యెషయా రాసిన ఆ మాటల్నే చదివి వినిపించాడు. యేసు ఆ మాటల్ని తనకే అన్వయించుకుంటూ ఇలా చదివాడు, “యెహోవా పవిత్రశక్తి నా మీద ఉంది. ఎందుకంటే, పేదవాళ్లకు మంచివార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. బందీలకు విడుదల కలుగుతుందని, గుడ్డివాళ్లకు చూపు వస్తుందని ప్రకటించడానికి; అణచివేయబడిన వాళ్లను విడిపించడానికి ఆయన నన్ను పంపించాడు. అంతేకాదు, యెహోవా అనుగ్రహం సంపాదించుకునే సమయం గురించి ప్రకటించడానికి కూడా ఆయన నన్ను పంపించాడు.” (లూకా 4:16-19) యేసు ఆ ప్రవచనాన్ని ఎలా నెరవేర్చాడు?

అందరికంటే ముందుగా విడుదల పొందిన ప్రజలు

నజరేతులోని సభామందిరంలో యేసు విడుదల గురించి ప్రకటన చేస్తున్నాడు (8-9 పేరాలు చూడండి)

9. యేసు కాలంలోని చాలామంది ఎలాంటి విడుదల కోసం ఎదురుచూశారు?

9 ఏ విడుదల గురించైతే యెషయా ప్రవచించాడో, దేని గురించైతే యేసు లేఖనాల్లో చదివి వినిపించాడో ఆ విడుదలను యేసు కాలంలోని ప్రజలు ముందుగా పొందగలిగారు. యేసు, “ఇప్పుడు మీరు విన్న లేఖనం ఈ రోజు నెరవేరింది” అని చెప్పాడు కాబట్టి ఆ విషయాన్ని మనం నిస్సందేహంగా నమ్మవచ్చు. (లూకా 4:21) యేసు చదివిన మాటల్ని విన్న చాలామంది బహుశా రాజకీయపరంగా ఏదైనా మార్పు వస్తుందనో లేక రోమా ప్రభుత్వం నుండి తాము విడుదల పొందుతామనో అనుకొని ఉండవచ్చు. యేసు శిష్యులు కూడా అలాగే అనుకొని ఉంటారు. ఎందుకంటే కొంతకాలానికి వాళ్లలో ఇద్దరు ఇలా అన్నారు: “ఇశ్రాయేలుకు విడుదల తీసుకురాబోయే వ్యక్తి ఆయనే అని మేము ఆశతో ఎదురుచూశాం.” (లూకా 24:13, 21) అయితే, కఠినంగా పరిపాలించే రోమా ప్రభుత్వానికి ఎదురు తిరగమని యేసు తన అనుచరులకు ఎప్పుడూ చెప్పలేదు. బదులుగా, “కైసరువి కైసరుకు చెల్లించండి” అని ఆయన నిర్దేశించాడు. (మత్త. 22:21) మరి ఆ సమయంలో యేసు వాళ్లకు ఎలా విడుదలను తీసుకొచ్చాడు?

10. ప్రజలు దేని నుండి విడుదల పొందేలా యేసు సహాయం చేశాడు?

10 ప్రజలు రెండు విధాలుగా విడుదల పొందేలా సహాయం చేసేందుకు దేవుని కుమారుడు వచ్చాడు. మొదటిగా, ప్రజలకు భారంగా ఉండే మత నాయకుల సిద్ధాంతాల నుండి విడుదల పొందేలా ఆయన సహాయం చేశాడు. అప్పట్లో చాలామంది యూదులు మనుషులు కల్పించిన ఆచారాలకు, తప్పుడు నమ్మకాలకు బానిసలుగా ఉండేవాళ్లు. (మత్త. 5:31-37; 15:1-11) నిజానికి, ఆధ్యాత్మికంగా దారి చూపిస్తున్నామని చెప్పుకునే వాళ్లే గుడ్డివాళ్లలా ఉన్నారు. వాళ్లు మెస్సీయను, ఆయన అందించిన ఆధ్యాత్మిక వెలుగును తిరస్కరించారు కాబట్టి చీకట్లో, పాపంలో ఉండిపోయారు. (యోహా. 9:1, 14-16, 35-41) యేసు సత్య బోధల ద్వారా, మంచి ఆదర్శం ద్వారా వినయంగల వాళ్లు అబద్ధ బోధల నుండి ఎలా విడుదల పొందగలరో నేర్పించాడు.—మార్కు 1:22; 2:23–3:5.

11. ప్రజలు విడుదల పొందేలా యేసు సహాయం చేసిన రెండో విధానం ఏంటి?

11 రెండోదిగా, పాపం అనే దాసత్వం నుండి మనుషులందరూ విడుదల పొందేలా యేసు చేయగలిగాడు. యేసు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు కాబట్టి తాను ఏర్పాటు చేసిన విమోచనా క్రయధనం మీద విశ్వాసం ఉంచుతూ దాన్ని అంగీకరించిన వాళ్ల పాపాలను యెహోవా క్షమించగలడు. (హెబ్రీ. 10:12-18) యేసు ఇలా చెప్పాడు: “కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులౌతారు.” (యోహా. 8:36) సునాద సంవత్సరంలో ఇశ్రాయేలీయులు పొందగలిగే విడుదల కన్నా ఈ విడుదల చాలా గొప్పది. ఎలాగంటే, సునాద సంవత్సరంలో విడుదల పొందిన వ్యక్తి మళ్లీ బానిసగా మారే అవకాశం ఉంది. కొంతకాలానికి అతను చనిపోవచ్చు. కానీ యేసు ఇచ్చే విడుదల శాశ్వతమైనది.

12. యేసు ప్రకటన చేసిన విడుదల నుండి ఎవరు ముందుగా ప్రయోజనం పొందుతారు?

12 క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజు, అపొస్తలుల్ని అలాగే విశ్వాసులైన ఇతర స్త్రీపురుషుల్ని యెహోవా తన పవిత్రశక్తి ద్వారా అభిషేకించాడు. అలా యెహోవా వాళ్లను తన పిల్లలుగా దత్తత తీసుకున్నాడు. దానివల్ల భవిష్యత్తులో వాళ్లు పరలోకానికి పునరుత్థానమై యేసుతోపాటు పరిపాలిస్తారు. (రోమా. 8:2, 15-17) నజరేతులోని సభామందిరంలో యేసు ప్రకటన చేసిన విడుదల నుండి ముందుగా ప్రయోజనం పొందేది వీళ్లే. లేఖన విరుద్ధమైన యూదా మతనాయకుల అబద్ధ బోధలకు గానీ, వాళ్ల ఆచారాలకు గానీ వీళ్లు ఇక ఎంతమాత్రం బానిసలుగా లేరు. అంతేకాదు మరణానికి దారితీసే పాపం నుండి కూడా విడుదలైనట్లు దేవుడు వీళ్లను పరిగణించాడు. క్రీ.శ. 33⁠లో క్రీస్తు అనుచరులను అభిషేకించడంతో మొదలైన ఈ సూచనార్థక సునాద సంవత్సరం, యేసు వెయ్యేళ్ల పరిపాలన చివర్లో ముగుస్తుంది. ఆలోపు ఎలాంటి మంచి సంగతులు జరుగుతాయి?

లక్షలాదిమంది ఇతరులు కూడా విడుదల పొందుతారు

13-14. యేసు ప్రకటన చేసిన విడుదల నుండి అభిషిక్త క్రైస్తవులే కాకుండా ఇంకా ఎవరు కూడా ప్రయోజనం పొందుతారు?

13 నేడు, అన్ని దేశాలకు చెందిన లక్షలాదిమంది యథార్థమైన ప్రజలు ‘వేరే గొర్రెలకు’ చెందినవాళ్లు. (యోహా. 10:16) యేసుతోపాటు పరలోకంలో పరిపాలించడానికి దేవుడు వాళ్లను ఎంపిక చేసుకోలేదు. బదులుగా, వాళ్లకు భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉందని బైబిలు చెప్తుంది. మీ నిరీక్షణ కూడా అదేనా?

14 అయితే, అభిషిక్తులు పొందే కొన్ని ప్రయోజనాలను ఇప్పుడు మీరు కూడా ఆనందిస్తున్నారు. యేసు విమోచన క్రయధనం మీద మీకున్న విశ్వాసంతో మీ పాపాల్ని క్షమించమని దేవుణ్ణి అడగవచ్చు. అప్పుడు మీరు దేవుని ఆమోదం పొంది, ఆయన ముందు మంచి మనస్సాక్షితో జీవించగలుగుతారు. (ఎఫె. 1:7; ప్రక. 7:14, 15) అబద్ధ బోధలనుండి ఇప్పుడు మీరు విడుదల పొందారు, దానివల్ల మీరు అనుభవిస్తున్న ఆశీర్వాదాల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. యేసు ఇలా చెప్పాడు: “మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది.” (యోహా. 8:32) అలాంటి విడుదల పొందడం మనకెంత సంతోషాన్నిస్తుందో కాదా!

15. త్వరలో ఎలాంటి విడుదల కోసం, ఆశీర్వాదాల కోసం మనం ఎదురుచూడవచ్చు?

15 త్వరలో ఇంకా గొప్ప విడుదల కోసం మనం ఎదురుచూడవచ్చు. సమీప భవిష్యత్తులో, యేసు అబద్ధమతాన్ని, అవినీతితో నిండిపోయిన మానవ ప్రభుత్వాలను నాశనం చేస్తాడు. దేవుడు తనను ఆరాధించే ఒక ‘గొప్ప సమూహాన్ని’ కాపాడి, భూపరదైసులో ఉండే ఆశీర్వాదాలను పొందేలా చేస్తాడు. (ప్రక. 7:9, 14) ఎంతోమంది ప్రజలు తిరిగి బ్రతికించబడతారు. ఆదాము పాపం వల్ల వచ్చిన చెడు పర్యవసానాలన్నిటి నుండి విడుదల పొందే అవకాశం వాళ్లకు దొరుకుతుంది.—అపొ. 24:15.

16. మనుషులందరూ భవిష్యత్తులో ఎలాంటి గొప్ప విడుదలను సొంతం చేసుకుంటారు?

16 వెయ్యేళ్ల పరిపాలనలో, మనుషులందరికీ పరిపూర్ణ ఆరోగ్యం, దేవునితో పరిపూర్ణ సంబంధం ఉండేలా యేసు, ఆయన తోటి పరిపాలకులు సహాయం చేస్తారు. అప్పుడు జరిగే పునరుద్ధరణ, విడుదల, ఇశ్రాయేలు కాలంనాటి సునాద సంవత్సరంలా ఉంటుంది. అప్పుడు భూమ్మీద జీవించే యెహోవా నమ్మకమైన సేవకులందరూ పాపం లేకుండా, పరిపూర్ణ జీవితాన్ని సొంతం చేసుకుంటారు.

కొత్త లోకంలో మనం ప్రయోజనకరమైన, సంతృప్తినిచ్చే పనులు చేస్తాం (17వ పేరా చూడండి)

17. భవిష్యత్తులో దేవుని ప్రజలకు ఏం జరుగుతుందని యెషయా 65:21-23 వచనాలు చెప్తున్నాయి? (ముఖచిత్రం చూడండి.)

17 భవిష్యత్తులో భూమ్మీద ఎలాంటి జీవితం ఉంటుందనే దానిగురించి యెషయా 65:21-23 వచనాలు వివరిస్తున్నాయి. (చదవండి.) మనం బద్దకంగా ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చోం. దానికి బదులు, దేవుని ప్రజలు ప్రయోజనకరమైన, సంతృప్తినిచ్చే పనులు చేస్తారని బైబిలు సూచిస్తుంది. వెయ్యేళ్ల పరిపాలన చివర్లో, “సృష్టి పాపమరణాల బానిసత్వం నుండి విడుదలై, దేవుని పిల్లలు ఆస్వాదించే మహిమగల స్వాతంత్ర్యాన్ని” పొందుతారనే నమ్మకంతో మనం ఉండవచ్చు.—రోమా. 8:21.

18. మన కోసం ఉజ్వలమైన భవిష్యత్తు వేచి ఉందని ఎందుకు నమ్మవచ్చు?

18 యెహోవా ఎలాగైతే ఇశ్రాయేలీయులకు పని చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండేలా ఒక మంచి ఏర్పాటు చేశాడో, రాబోయే వెయ్యేళ్ల పరిపాలనలో కూడా తన ప్రజల కోసం అలాంటి ఏర్పాటే చేస్తాడు. కాబట్టి కొత్తలోకంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలకు తప్పకుండా సమయం ఉంటుంది. నేడు మనం సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించడం చాలా ప్రాముఖ్యం. అందుకే కొత్తలోకంలో కూడా దేవుని ఆరాధనకు సమయం ఉంటుంది. అవును, నమ్మకమైన మనుషులందరూ క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలో సంతోషంగా ఉంటారు, ఎందుకంటే అప్పుడు మనకు సంతృప్తినిచ్చే పని ఉంటుంది, అలాగే మనందరం యెహోవాను ఆరాధిస్తాం.

పాట 142 మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం

^ పేరా 5 ప్రాచీన ఇశ్రాయేలులో విడుదలను లేదా స్వేచ్ఛను ప్రకటించడానికి యెహోవా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. అదే సునాద సంవత్సరం. క్రైస్తవులుగా మనం మోషే ధర్మశాస్త్రం కింద లేము. అయితే, మనం సునాద సంవత్సరం గురించి తెలుసుకోవడం ప్రాముఖ్యం. ప్రాచీన కాలంనాటి సునాద సంవత్సరం యెహోవా మనకోసం చేసిన ఒక ఏర్పాటును ఎలా గుర్తు చేస్తుందో, మనం దాన్నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 61 చిత్రం వివరణ: సునాద సంవత్సరంలో బానిసలుగా ఉన్న ఇద్దరు విడుదల పొంది తమ కుటుంబం దగ్గరికి, వాళ్ల స్వదేశానికి తిరిగొస్తున్నారు.