కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు పండును తింటే హవ్వ చనిపోదని సాతాను చెప్పినప్పుడు, అమర్త్యమైన ఆత్మ అనే సిద్ధాంతాన్ని అతను పరిచయం చేశాడా?

దేవుడు తినొద్దన్న పండు తింటే, హవ్వ శరీరం చనిపోయినా ఆమె ఆత్మ మాత్రం వేరేచోట జీవిస్తూనే ఉంటుందని అపవాది చెప్పలేదు. అతను పాము ద్వారా హవ్వతో మాట్లాడుతూ ఆ చెట్టు పండు తింటే ఆమె ‘చావనే చావదు’ అని అన్నాడు. అంటే, ఆమె భూమ్మీద మెరుగైన జీవితాన్ని ఆనందిస్తూ, దేవునిపై ఆధారపడకుండా ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుందనేది అతని ఉద్దేశం.—ఆది. 2:17; 3:3-5.

అమర్త్యమైన ఆత్మ అనే అబద్ధ సిద్ధాంతం ఏదెను తోటలో మొదలవ్వకపోతే, ఇంకెక్కడ పుట్టినట్టు? మనం ఖచ్చితంగా చెప్పలేం. నోవహు కాలంలో వచ్చిన జలప్రళయంలో అబద్ధ ఆరాధనంతా తుడిచిపెట్టుకుపోయిందని మనకు తెలుసు. అప్పుడు సత్యారాధకులైన నోవహు, ఆయన కుటుంబం మాత్రమే మిగిలారు. కాబట్టి అబద్ధమత ఆలోచనల్ని బోధించేవాళ్లెవ్వరూ లేరని చెప్పవచ్చు.

అంటే మనుషుల్లో అమర్త్యమైన ఆత్మ ఉందనే బోధ జలప్రళయం తర్వాత పుట్టుకొచ్చి ఉంటుంది. బాబెలు నగరంలో దేవుడు భాషలను తారుమారు చేసినప్పుడు, ప్రజలు అక్కడ నుండి ‘భూమంతటికీ చెదరిపోయారు.’ వాళ్లు వెళ్తూవెళ్తూ అమర్త్యమైన ఆత్మ అనే సిద్ధాంతాన్ని కూడా తమ వెంట తీసుకెళ్లి ఉంటారనడంలో సందేహం లేదు. (ఆది. 11:8, 9) ఈ అబద్ధ బోధ ఎక్కడ మొదలైనప్పటికీ, దీనంతటి వెనుక “అబద్ధానికి తండ్రి” అయిన సాతానే ఉన్నాడని, ఇది అంతటా వ్యాప్తిచెందడం చూసి సంతోషిస్తున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.—యోహా. 8:44.