కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 51

‘ఈయన మాట వింటూ ఉండండి’

‘ఈయన మాట వింటూ ఉండండి’

“ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈయన మాట వినండి.”—మత్త. 17:5.

పాట 54 “ఇదే త్రోవ”

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) ముగ్గురు అపొస్తలులను ఏం చేయమని యెహోవా చెప్పాడు? దానికి వాళ్లెలా స్పందించారు? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేం చూస్తాం?

 సా.శ. 32 పస్కా తర్వాత అపొస్తలులైన పేతురు, యాకోబు, యోహానులు ఒక అసాధారణ దర్శనాన్ని చూశారు. బహుశా హెర్మోను పర్వతం మీద ఒక ఎత్తయిన చోటికి వెళ్లినప్పుడు, యేసు రూపాంతరం చెందడాన్ని వాళ్లు చూశారు. అక్కడ “ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన పైవస్త్రాలు వెలుగులా తెల్లగా అయ్యాయి.” (మత్త. 17:1-4) దర్శనం చివర్లో యెహోవా ఇలా అనడాన్ని ఆ అపొస్తలులు విన్నారు: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈయన మాట వినండి.” (మత్త. 17:5) అది జరిగిన తర్వాత, ఆ ముగ్గురు అపొస్తలులు జీవించిన విధానం బట్టి వాళ్లు యేసు మాట విన్నారని అర్థమౌతుంది. మనం కూడా ఆ అపొస్తలుల లాగే యేసు మాట వినాలి.

2 ముందటి ఆర్టికల్‌లో యేసు స్వరం వినడమంటే, ఆయన చేయొద్దు అని చెప్పిన కొన్ని పనుల్ని చేయకుండా ఉండడమని నేర్చుకున్నాం. ఈ ఆర్టికల్‌లో, యేసు చేయమని చెప్పిన రెండు పనుల గురించి చూస్తాం.

“ఇరుకు ద్వారం గుండా వెళ్లండి”

3. మత్తయి 7:13, 14 ప్రకారం మనమేం చేయాలి?

3 మత్తయి 7:13, 14 చదవండి. ఈ లేఖనంలో యేసు రెండు ద్వారాల గురించి చెప్పాడు. ఒక ద్వారం గుండా వెళ్లే దారి “విశాలంగా” ఉంటుంది. మరో ద్వారం గుండా వెళ్లే దారి “కష్టంగా” ఉంటుంది. ఈ రెండు దారులు కాకుండా మూడో దారి లేదు. మనం ఏ దారిలో వెళ్తామో మనమే నిర్ణయించుకోవాలి. ఇది మనం తీసుకునే అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే దీనిమీదే మన శాశ్వత జీవితం ఆధారపడి ఉంది.

4. “విశాలంగా” ఉన్న దారి గురించి మీరేం చెప్తారు?

4 ఆ రెండు దారుల మధ్య తేడా ఉంది. “విశాలంగా” ఉన్న దారిలో చాలామంది వెళ్తున్నారు, ఎందుకంటే దానిలో ప్రయాణించడం తేలిక. విచారకరంగా వాళ్లు ఆ దారిలోనే కొనసాగాలని, ఇప్పటికే దానిలో వెళ్తున్నవాళ్లను అనుకరించాలని నిర్ణయించుకుంటారు. అయితే, ఆ దారిలో ప్రజల్ని నడిపిస్తున్నది సాతానేనని, అలా వెళ్తే చివరకు వచ్చేది మరణం అని వాళ్లు గుర్తించరు.—1 కొరిం. 6:9, 10; 1 యోహా. 5:19.

5. “కష్టంగా” ఉన్న దారిని కనుగొనడానికి అలాగే దాంట్లో ప్రయాణించడం మొదలుపెట్టడానికి కొంతమంది ఎలా ప్రయత్నించారు?

5 “విశాలంగా” ఉన్న దారికి భిన్నంగా మరో దారి ఉంది. అది “కష్టంగా” ఉంటుంది. ఆ దారిని కొంతమందే కనుక్కుంటారని యేసు చెప్పాడు. ఎందుకు? ఆసక్తికరంగా ఆ తర్వాతి వచనంలోనే అబద్ధ ప్రవక్తల గురించి యేసు తన అనుచరుల్ని హెచ్చరించాడు. (మత్త. 7:15) కొంతమంది చెప్తున్నట్టు నేడు ప్రపంచంలో వేల మతాలు ఉన్నాయి. వాటిలో చాలా మతాలు సత్యాన్ని బోధిస్తున్నామని చెప్పుకుంటున్నాయి. దానివల్ల లక్షలాదిమంది విసిగిపోయి లేదా అయోమయంలో పడి, జీవానికి నడిపించే దారిని కనీసం వెతకడానికి కూడా ప్రయత్నించట్లేదు. కానీ ఆ దారిని కనుక్కోవచ్చు. దానిగురించి యేసు ఇలా చెప్పాడు: “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు. అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది.” (యోహా. 8:31, 32) మెచ్చుకోదగిన విషయం ఏంటంటే, మీరు ఈ లోకంలోని చాలామందిలా కాకుండా సత్యాన్ని వెతికారు. బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టి, యెహోవా మీ నుండి ఏం కోరుతున్నాడో నేర్చుకున్నారు; అలాగే యేసు బోధల్ని తెలుసుకున్నారు. దానితోపాటు అబద్ధమత బోధల్ని తిరస్కరించి, వాటితో సంబంధమున్న పండుగల్ని, ఆచారాల్ని చేయడం ఆపేయాలన్నది యెహోవా కోరికని నేర్చుకున్నారు. అంతేకాదు, యెహోవాను సంతోషపెట్టేలా మార్పులు చేసుకోవడం తేలిక కాదని మీరు తెలుసుకున్నారు. (మత్త. 10:34-36) అయినా మీరు మార్పులు చేసుకున్నారు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రిని మీరు ప్రేమిస్తున్నారు, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకున్నారు. మిమ్మల్ని చూసి యెహోవా ఎంతో సంతోషించివుంటాడు!—సామె. 27:11.

కష్టంగా ఉన్న దారిలో ప్రయాణిస్తూ ఉండడానికి ఏం చేయాలి?

“కష్టంగా” ఉన్న దారిలో ప్రయాణిస్తూ ఉండడానికి దేవుని సలహాలు, ప్రమాణాలు సహాయం చేస్తాయి (6-8 పేరాలు చూడండి) *

6. కీర్తన 119:9, 10, 45, 133 ప్రకారం, కష్టంగా ఉన్న దారిలో ప్రయాణిస్తూ ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

6 కష్టంగా ఉన్న దారిలో ప్రయాణిస్తూ ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? ఈ ఉదాహరణను గమనించండి. ఘాట్‌రోడ్‌ అంచున ఉండే రెయిలింగ్‌ డ్రైవర్‌ను, అతని వాహనాన్ని కాపాడుతుంది. సాధారణంగా డ్రైవర్లు మరీ రోడ్డు అంచుకు వెళ్లిపోకుండా లేదా అలా వెళ్లి పడిపోకుండా రెయిలింగ్‌ కాపాడుతుంది. అసలు ఆ రెయిలింగ్‌ను ఎందుకు పెట్టారని ఎవ్వరూ ప్రశ్నించరు లేదా అది అడ్డుగా ఉందని ఎవ్వరూ అనరు. అయితే బైబిల్లోవున్న యెహోవా ప్రమాణాల్ని రెయిలింగ్‌తో పోల్చవచ్చు. కష్టంగా ఉన్న దారిలో ప్రయాణిస్తూ ఉండడానికి ఆ ప్రమాణాలు మనకు సహాయం చేస్తాయి.—కీర్తన 119:9, 10, 45, 133 చదవండి.

7. యౌవనులు కష్టంగా ఉన్న దారి గురించి ఏం అనుకోకూడదు? ఎందుకు?

7 యౌవనులారా, యెహోవా ప్రమాణాలు మిమ్మల్ని కట్టిపడేస్తున్నట్లు కొన్నిసార్లు అనిపిస్తుందా? మీరలా ఆలోచించాలని సాతాను కోరుకుంటున్నాడు. విశాలమైన దారిలో ప్రయాణిస్తున్న వాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు; కాబట్టి వాళ్లు చేసే పనులపై మీరు దృష్టిపెట్టాలని అతను ఆశిస్తాడు. మీ స్నేహితులు లేదా ఆన్‌లైన్‌లో మీరు చూసే వ్యక్తులు తమ జీవితాన్ని చాలా సంతోషంగా గడపడాన్ని గమనించినప్పుడు, మీరేదో కోల్పోతున్నట్లు అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు. దానికి కారణం యెహోవా ప్రమాణాలే అని మిమ్మల్ని నమ్మించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. * కానీ గుర్తుంచుకోండి, సాతాను నడిపించే విశాలమైన దారిలో ప్రయాణిస్తే చివరికి ఏం జరుగుతుందో అతను చెప్పట్లేదు. కానీ జీవమార్గంలో ప్రయాణిస్తే మీరెలాంటి అద్భుతమైన జీవితం పొందుతారో యెహోవా స్పష్టంగా చెప్తున్నాడు.—కీర్త. 37:29; యెష. 35:5, 6; 65:21-23.

8. ఓలా అనుభవం నుండి యౌవనులు ఏం నేర్చుకోవచ్చు?

8 ఓలా అనే యువ సహోదరుడి అనుభవాన్ని గమనించండి. * తన క్లాస్‌మేట్స్‌ తమతో సెక్స్‌లో పొల్గొనమని అతన్ని ఒత్తిడి చేశారు. యెహోవాసాక్షులు బైబిలు ఉన్నత ప్రమాణాల ప్రకారం జీవిస్తారని అతను వివరించినప్పుడు, తన క్లాస్‌లో కొంతమంది అమ్మాయిలు అతనితో ఎలాగైనా తప్పు చేయించాలని ఇంకా గట్టిగా ప్రయత్నించారు. కానీ అతను లొంగిపోకుండా సరైనదే చేశాడు. అయితే ఓలాకు ఇంకొక ఒత్తిడి కూడా ఎదురైంది. అతనిలా అంటున్నాడు: “నా టీచర్లు నన్ను ఉన్నత విద్య చదవమని ప్రోత్సహించారు. దానివల్ల ఇతరులు నన్ను గౌరవిస్తారని చెప్పారు. అలా చదవకపోతే నేను జీవితంలో పైకి రాలేనని కూడా వాళ్లు చెప్పారు.” ఆ ఒత్తిడిని ఎదిరించడానికి ఓలాకు ఏది సహాయం చేసింది? అతనిలా అంటున్నాడు: “నేను నా సంఘంలోని వాళ్లతో దగ్గరి స్నేహాన్ని ఏర్పరచుకున్నాను. వాళ్లు నా సొంత కుటుంబ సభ్యుల్లా అనిపించారు. అలాగే నేను బైబిల్ని మరింత లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అలా అధ్యయనం చేసేకొద్దీ ఇదే సత్యమని నా నమ్మకం బలపడింది. దాంతో నేను బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.”

9. కష్టంగా ఉన్న దారిలో ప్రయాణిస్తూ ఉండాలంటే మనమేం చేయాలి?

9 మీరు జీవానికి నడిపించే దారిని విడిచిపెట్టి, చాలామంది నడిచే విశాలమైన దారిలో నడవాలని సాతాను కోరుకుంటున్నాడు. అయితే ఆ దారి ‘నాశనానికి నడిపిస్తుంది.’ (మత్త. 7:13) కష్టంగా ఉన్న దారిలో మనం ప్రయాణిస్తూ ఉండాలంటే యేసు మాట వింటూ ఉండాలి; ఆ దారి సురక్షితమైందని నమ్మాలి. యేసు చేయమని చెప్పిన ఇంకో విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

నీ సహోదరునితో సమాధానపడు

10. మత్తయి 5:23, 24 ప్రకారం, ఏం చేయమని యేసు చెప్పాడు?

10 మత్తయి 5:23, 24 చదవండి. యూదులకు చాలా ప్రాముఖ్యమైన ఒక సందర్భం గురించి ఇక్కడ యేసు చెప్పాడు. ఒకవ్యక్తి ఆలయానికి వచ్చి, జంతువును బలి అర్పించడానికి దాన్ని యాజకునికి ఇస్తున్నట్లు ఊహించుకోండి. ఆ సమయంలో, అతనివల్ల తన సహోదరుడు నొచ్చుకున్నాడని గుర్తొస్తే ఆ జంతువును అక్కడే విడిచిపెట్టి అతను ‘వెళ్లాలి.’ ఎందుకలా వెళ్లాలి? యెహోవాకు బలి అర్పించడం కన్నా ఏది ఇంకా ఎక్కువ ప్రాముఖ్యమై ఉండొచ్చు? దానిగురించి యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “ముందు నీ సహోదరునితో సమాధానపడు.”

తన అన్నతో వినయంగా సమాధానపడిన యాకోబును మీరు అనుకరిస్తారా? (11-12 పేరాలు చూడండి) *

11. ఏశావుతో సమాధానపడడానికి యాకోబు ఏం చేశాడో వివరించండి.

11 సమాధానపడడం గురించి యాకోబు నుండి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. యాకోబు తన సొంతూరుకి దూరంగా దాదాపు 20 ఏళ్లు ఉన్న తర్వాత, దేవుడు మళ్లీ అతన్ని అక్కడికి వెళ్లమని దేవదూత ద్వారా చెప్పాడు. (ఆది. 31:11, 13, 38) కానీ అతను అక్కడికి ఎలా వెళ్లగలడు? అతని అన్న ఏశావు అతన్ని చంపడానికి చూస్తున్నాడు. (ఆది. 27:41) ఏశావుకు తనమీద ఇంకా కోపం ఉందేమోనని యాకోబు “చాలా భయపడ్డాడు, ఆందోళన చెందాడు.” (ఆది. 32:7) తన అన్నతో సమాధానపడడానికి యాకోబు ఏం చేశాడు? ముందుగా అతను దానిగురించి తీవ్రంగా ప్రార్థించి, సహాయం కోసం యెహోవాను అడిగాడు. తర్వాత, అతను ఏశావుకు చాలా బహుమతులు పంపించాడు. (ఆది. 32:9-15) చివరికి ఏశావు ఎదురుపడినప్పుడు గౌరవం చూపించడానికి యాకోబు చొరవ తీసుకున్నాడు. అతను ఏశావుకు ఒకట్రెండుసార్లు కాదుగానీ, ఏకంగా ఏడుసార్లు వంగి నమస్కారం చేశాడు. యాకోబు వినయాన్ని, గౌరవాన్ని చూపించి తన అన్నతో సమాధానపడ్డాడు.—ఆది. 33:3, 4.

12. యాకోబు నుండి మనమేం నేర్చుకోవచ్చు?

12 యాకోబు తన అన్నను కలవడానికి సిద్ధపడిన విధానం నుండి, తన అన్న దగ్గరికి వెళ్తుండగా చేసిన పనుల నుండి మనం పాఠం నేర్చుకోవచ్చు. యాకోబు వినయంగా యెహోవాను సహాయం అడిగాడు. ఆ తర్వాత, తన ప్రార్థనకు అనుగుణంగా తన అన్న కోపం చల్లారేలా చర్యలు తీసుకున్నాడు. ఏశావును కలుసుకున్నప్పుడు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని అతను వాదించలేదు. ఏదేమైనా యాకోబు తన అన్నతో సమాధానపడాలనే కోరుకున్నాడు. అతన్ని మనమెలా అనుకరించవచ్చు?

ఇతరులతో మనమెలా సమాధానపడాలి?

13-14. ఒక సహోదరుడు లేదా సహోదరి మనవల్ల నొచ్చుకుంటే మనమేం చేయాలి?

13 జీవమార్గంలో మనం నడుస్తూ ఉండాలంటే మన సహోదరులతో ఎప్పుడూ శాంతిగా ఉండాలి. (రోమా. 12:18) ఒక సహోదరుడు లేదా సహోదరి మనవల్ల నొచ్చుకున్నారని తెలిస్తే మనమేం చేయాలి? యాకోబులాగే యెహోవాకు తీవ్రంగా ప్రార్థిస్తూ, ఆ సహోదరుడు లేదా సహోదరితో సమాధానపడడానికి మనం చేసే ప్రయత్నాల్ని దీవించమని అడగాలి.

14 మనల్ని మనం పరిశీలించుకోవడానికి కూడా సమయం తీసుకోవాలి. మనం ఈ ప్రశ్నల్ని వేసుకోవచ్చు: ‘నా తప్పును ఒప్పుకోవడానికి, వినయంగా క్షమించమని అడగడానికి అలాగే సమాధానపడడానికి నేను సిద్ధంగా ఉన్నానా? నా సహోదరుడు లేదా సహోదరితో సమాధానపడడానికి నేను చొరవ తీసుకున్నప్పుడు యెహోవా, యేసు ఎలా భావిస్తారు?’ ఈ ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడు యేసు స్వరాన్ని వినడానికి, తోటి సహోదరుడు లేదా సహోదరితో వినయంగా సమాధానపడడానికి పురికొల్పబడతాం. ఈ విషయంలో మన యాకోబును అనుకరించవచ్చు.

15. ఎఫెసీయులు 4:2, 3 లో ఉన్న సూత్రాన్ని పాటించినప్పుడు, మన సహోదరునితో సమాధానపడడానికి అదెలా సహాయం చేస్తుంది?

15 ఏశావు ఎదురుపడినప్పుడు యాకోబు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని వాదించి ఉంటే ఏమైవుండేదో ఆలోచించండి. పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది! మనం కూడా మన సహోదరునితో సమాధానపడడానికి వెళ్లినప్పుడు వినయం చూపించాలి. (ఎఫెసీయులు 4:2, 3 చదవండి.) సామెతలు 18:19 ఇలా చెప్తుంది: “ప్రాకారాలుగల నగరాన్ని జయించడం కన్నా నొచ్చుకున్న సహోదరుణ్ణి శాంతపర్చడం కష్టం, కోట ద్వారాల అడ్డగడియల లాంటి తగాదాలు కూడా ఉన్నాయి.” అయితే మనం వినయంగా క్షమాపణ అడిగినప్పుడు నొచ్చుకున్న వ్యక్తి మనతో సమాధానపడడానికి ఇష్టపడవచ్చు.

16. మనం సమాధానపడడానికి వెళ్లే ముందు వేటి గురించి ఆలోచించాలి? ఎందుకు?

16 మన సహోదరునితో లేదా సహోదరితో సమాధానపడడానికి వెళ్లే ముందే ఏం మాట్లాడతామో, ఎలా మాట్లాడతామో జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ తర్వాత వాళ్లను కలిసినప్పుడు, వాళ్లు మనతో తిరిగి మంచి సంబంధాన్ని ఏర్పర్చుకునేలా మనం మాట్లాడాలి. మొదట్లో వాళ్లు మనల్ని బాధపెట్టేలా మాట్లాడొచ్చు. అప్పుడు మనకు కోపం రావచ్చు లేదా మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ అలాచేస్తే వాళ్లతో సమాధానపడడం అస్సలు కుదరదు. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో నిరూపించడం కన్నా వాళ్లతో తిరిగి శాంతిని నెలకొల్పుకోవడం చాలా ప్రాముఖ్యమని మనం గుర్తుంచుకోవాలి.—1 కొరిం. 6:7.

17. గిల్‌బర్ట్‌ ఉదాహరణ నుండి మీరేమి నేర్చుకోవచ్చు?

17 గిల్‌బర్ట్‌ అనే సహోదరుడు సమాధానపడడానికి ఎంతో కృషిచేశాడు. ఆయనిలా చెప్తున్నాడు: “నా కూతురుతో నాకస్సలు పడేదికాదు. తనతో తిరిగి మంచి సంబంధాన్ని కలిగివుండేలా, విషయాల్ని ప్రశాంతంగా చర్చించడానికి రెండు సంవత్సరాలకుపైగా ప్రయత్నించాను.” గిల్‌బర్ట్‌ ఇంకా ఏం చేశాడు? ఆయనింకా ఇలా చెప్తున్నాడు, “తనతో మాట్లాడే ముందు నేను ప్రతీసారి ప్రార్థన చేసుకుని, తను ఏమన్నా బాధపడకుండా క్షమించడానికి సిద్ధంగా ఉండాలనుకున్నాను. నావైపు తప్పులేదని నిరూపించడానికి ప్రయత్నించే బదులు, సమాధానపడడమే నా బాధ్యతని అర్థంచేసుకున్నాను.” ఆయన చేసిన కృషికి ఎలాంటి ఫలితం దక్కింది? గిల్‌బర్ట్‌ ఇలా అంటున్నాడు: “నా కుటుంబ సభ్యులందరితో మంచి సంబంధం కలిగివుండడం వల్ల, ఇప్పుడు నేను మనశ్శాంతితో ఉంటున్నాను.”

18-19. మనం ఎవర్నైనా నొప్పిస్తే ఏం చేయాలి? ఎందుకు చేయాలి?

18 తోటి సహోదరుణ్ణి లేదా సహోదరిని నొప్పించారని మీకనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? సమాధానపడమని యేసు ఇచ్చిన నిర్దేశాన్ని పాటించండి. ఆ విషయం గురించి యెహోవాకు ప్రార్థనలో చెప్పి, మీ ప్రయత్నాలు ఫలించేలా పవిత్రశక్తి మీద ఆధారపడండి. అలాచేస్తే మీరు సంతోషంగా ఉంటారు, యేసు స్వరాన్ని వింటున్నారని చూపిస్తారు.—మత్త. 5:9.

19 సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తు ద్వారా యెహోవా మనకు ప్రేమపూర్వక నిర్దేశాన్ని ఇస్తున్నందుకు మనమెంతో కృతజ్ఞులం! (ఎఫె. 5:23) అపొస్తలులైన పేతురు, యాకోబు, యోహానులాగే మనం కూడా యేసు మాట వినాలని నిశ్చయించుకుందాం. (మత్త. 17:5) యేసు మాట వింటున్నామని చూపించడానికి, మనవల్ల నొచ్చుకున్న సహోదరుడు లేదా సహోదరితో సమాధానపడాలని నేర్చుకున్నాం. అలాచేస్తూ, జీవానికి నడిపించే కష్టంగా ఉన్న దారిలో ప్రయాణిస్తూ ఉందాం. దానివల్ల ఇప్పుడు ఎన్నో ఆశీర్వాదాల్ని పొందుతాం, భవిష్యత్తులో అవధుల్లేని సంతోషాన్ని పొందుతాం.

పాట 130 క్షమిస్తూ ఉండండి

^ జీవానికి నడిపించే ఇరుకు ద్వారంలో వెళ్లమని యేసు మనకు చెప్పాడు. అలాగే తోటి సహోదర సహోదరీలతో సమాధానపడమని కూడా చెప్పాడు. ఆయనిచ్చిన సలహాల్ని పాటిస్తున్నప్పుడు మనకెలాంటి సవాళ్లు ఎదురుకావొచ్చు? వాటిని మనమెలా అధిగమించవచ్చు?

^ యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు అనే బ్రోషుర్‌లో “తోటివాళ్ల ఒత్తిడిని నేనెలా తిప్పికొట్టవచ్చు?” అనే 6వ ప్రశ్న చూడండి. అలాగే jw.org/teలో మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించండి! అనే వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ చూడండి. (బిలు బోధలు > టీనేజర్లు చూడండి.)

^ కొన్ని అసలు పేర్లు కావు.

^ చిత్రాల వివరణ: ఘాట్‌రోడ్‌ కష్టంగా ఉన్న దారికి పోలికగా ఉంది. రెయిలింగ్‌ దేవుని ప్రమాణాలకు పోలికగా ఉంది. “కష్టంగా” ఉన్న దారిలో ప్రయాణిస్తూ, దేవుని ప్రమాణాల్ని పాటిస్తే అశ్లీల చిత్రాలు, లైంగిక పాపం వంటి ప్రమాదాల్లో చిక్కుకోం. అలాగే ఉన్నత విద్య చేయాలనే ఒత్తిడిని ఎదిరిస్తాం.

^ చిత్రాల వివరణ: సమాధానపడాలని యాకోబు ఏశావు ముందు చాలాసార్లు వంగి నమస్కరించాడు.