పాఠకుల ప్రశ్న
“సాటిమనిషి ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు” అని లేవీయకాండం 19:16 లో ఉన్న ఆజ్ఞకు అర్థం ఏంటి? దాన్నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?
ఇశ్రాయేలీయులు పవిత్రంగా ఉండాలని యెహోవా చెప్పాడు. వాళ్లు అలా ఉండేలా సహాయం చేయడానికి ఆయన ఈ మాటల్ని చెప్పాడు: “నీ ప్రజల మధ్య లేనిపోనివి కల్పించి చెప్తూ ఇంటింటికీ తిరగకూడదు. సాటిమనిషి ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు. నేను యెహోవాను.”—లేవీ. 19:2, 16.
“సాటిమనిషి ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు” అనే మాటకు అర్థం ఏంటి? లేవీయకాండం గురించి ఒక యూదుల పుస్తకంలో ఇలా ఉంది: ‘ఈ వచనంలోని ఆ మాటకు హెబ్రీ భాషలో అక్షరార్థంగా “దగ్గరలో నిలబడకూడదు, చూస్తూ నిలబడకూడదు” అనే అర్థాలు వస్తాయి. అయితే ఆ మాటను ఏ ఉద్దేశంతో చెప్పారో స్పష్టంగా తెలియట్లేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది.’
ఆ మాట, 15వ వచనానికి సంబంధించిందని కొంతమంది విద్వాంసులు అంటారు. ఆ వచనంలో ఇలా ఉంది: “మీరు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. పేదవాళ్ల విషయంలో పక్షపాతం చూపించకూడదు లేదా ధనవంతుల మీద అభిమానం చూపించకూడదు. సాటిమనిషికి న్యాయంగా తీర్పు తీర్చాలి.” (లేవీ. 19:15) అలాగైతే 16వ వచనంలో, “సాటిమనిషి ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు” అనే మాట, దేవుని ప్రజలు తమతోపాటు పనిచేసేవాళ్లకు హాని చేయకూడదనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇశ్రాయేలీయులు కోర్టు కేసుల్లో, వ్యాపారాల్లో లేదా కుటుంబంలో అన్యాయంగా ప్రవర్తించకూడదు. అంతేకాదు వాళ్ల సొంత లాభం కోసం ఇతరుల్ని మోసం చేయకూడదు. నిజమే అవన్నీ మనం చేయకూడదు. అయితే 16వ వచనంలో ఉన్న మాటను మనం ఇంకా బాగా ఎలా అర్థంచేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఆ వచనంలో ఉన్న మొదటి భాగాన్ని చూడండి. లేనిపోనివి కల్పించి చెప్తూ ఇంటింటికి తిరగకూడదని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. సాధారణంగా పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల సమస్యలు వస్తాయి. అయితే లేనిపోనివి కల్పించి చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. (సామె. 10:19; ప్రసం. 10:12-14; 1 తిమో. 5:11-15; యాకో. 3:6) లేనిపోనివి కల్పించి చెప్పే వ్యక్తి కావాలనే ఇతరుల పేరు పాడుచేస్తాడు. అతను అవతలి వ్యక్తి ప్రాణం మీదికి వస్తుందని తెలిసినా అబద్ధసాక్ష్యం చెప్తాడు. నాబోతు విషయంలో అదే జరిగింది. ఇద్దరు వ్యక్తులు కావాలనే అబద్ధసాక్ష్యం చెప్పడం వల్ల నాబోతును అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపారు. (1 రాజు. 21:8-13) కాబట్టి లేనిపోనివి కల్పించి చెప్పేవాడు, లేవీయకాండం 19:16బి భాగం చెప్తున్నట్లు సాటిమనిషి ప్రాణాన్ని అపాయంలో పడేస్తాడు.
ఒకవ్యక్తి ద్వేషం వల్ల కూడా ఇతరులమీద లేనిపోనివి కల్పించి చెప్తాడు. 1 యోహాను 3:15 లో ఇలా చదువుతాం: “తన సహోదరుణ్ణి ద్వేషించే ప్రతీ వ్యక్తి హంతకుడే, ఏ హంతకుడూ శాశ్వత జీవితం పొందడని మీకు తెలుసు.” అంతేకాదు 16వ వచనంలో “సాటిమనిషి ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు” అని చెప్పిన తర్వాత, యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “నీ హృదయంలో నీ సహోదరుణ్ణి ద్వేషించకూడదు.”—లేవీ. 19:17.
కాబట్టి లేవీయకాండం 19:16 లోని ఆజ్ఞ క్రైస్తవులందరికీ గట్టి హెచ్చరికగా ఉంది. అందుకే మన మనసులో ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు, లేనిపోనివి కల్పించి చెప్పకూడదు. సూటిగా చెప్పాలంటే, కొన్నిసార్లు తోటి సహోదరసహోదరీల మీద అయిష్టత లేదా అసూయ వల్ల వాళ్లమీద లేనిపోనివి కల్పించి చెప్తాం. అలా చేస్తే, వాళ్లపై మనకు ద్వేషం ఉన్నట్టే. అందుకే క్రైస్తవులుగా మనం ఎవర్నీ ద్వేషించకూడదు.—మత్త. 12:36, 37.