కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 49

మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలో లేవీయకాండం నుండి నేర్చుకుందాం

మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలో లేవీయకాండం నుండి నేర్చుకుందాం

నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.”—లేవీ. 19:18.

పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. ముందటి ఆర్టికల్‌లో ఏం తెలుసుకున్నాం? ఈ ఆర్టికల్‌లో ఏం నేర్చుకుంటాం?

 ముందటి ఆర్టికల్‌లో లేవీయకాండం 19వ అధ్యాయం నుండి ఉపయోగపడే కొన్ని సలహాల్ని చర్చించాం. ఉదాహరణకు, 3వ వచనంలో తల్లిదండ్రుల్ని గౌరవించాలని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. నేడు మన తల్లిదండ్రులు తమకు అవసరమయ్యే వస్తువులు కొనుక్కోవడానికి మనం ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా; యెహోవాతో తమ సంబంధాన్ని కాపాడుకుంటూ, ఆయన సేవ చేస్తూ ఉండడానికి వాళ్లకు సహాయం చేయడం ద్వారా; అలాగే వాళ్లకు మానసికంగా కావాల్సిన ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ సలహాను పాటించవచ్చని నేర్చుకున్నాం. అదే వచనంలో విశ్రాంతి రోజును పాటించాలని యెహోవా ఇశ్రాయేలీయులకు గుర్తుచేశాడు. నేడు మనం విశ్రాంతి రోజును పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతీరోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక విషయాలకు కేటాయిస్తే ఆ ఆజ్ఞలోని సూత్రాన్ని పాటించవచ్చని నేర్చుకున్నాం. అలా చేసినప్పుడు, లేవీయకాండం 19:2 అలాగే 1 పేతురు 1:15 చెప్తున్నట్టు మనం పవిత్రులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నామని చూపిస్తాం.

2 ఈ ఆర్టికల్‌లో, లేవీయకాండం 19వ అధ్యాయంలోని ఇంకొన్ని వచనాల గురించి చూస్తాం. శారీరక లోపమున్న వాళ్లపట్ల దయ చూపించడం, వ్యాపార విషయాల్లో నిజాయితీగా ఉండడం, సాటిమనిషి పట్ల ప్రేమ చూపించడం గురించి ఆ అధ్యాయం నుండి నేర్చుకుంటాం. వీటిని చేస్తే మన దేవునిలాగే పవిత్రులుగా ఉంటాం.

శారీరక లోపాలున్న వాళ్లపట్ల దయ చూపించండి

వినికిడి లోపమున్న వాళ్లతో లేదా చూపులేని వాళ్లతో ఎలా వ్యవహరించాలని లేవీయకాండం 19:14 చెప్తుంది? (3-5 పేరాలు చూడండి) *

3-4. లేవీయకాండం 19:14 ప్రకారం, ఇశ్రాయేలీయులు చెవిటివాళ్లతో, గుడ్డివాళ్లతో ఎలా ప్రవర్తించాలి?

3 లేవీయకాండం 19:14 చదవండి. తన ప్రజలు శారీరక లోపాలున్న వాళ్లపట్ల దయ చూపించాలని యెహోవా కోరుకున్నాడు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు చెవిటివాళ్లను శపించకూడదు. బహుశా శపించడం అంటే ఆ వ్యక్తిని భయపెట్టడం, బెదిరించడం లేదా అతని గురించి చెడుగా మాట్లాడడం. వాళ్లపట్ల అలా ప్రవర్తించడం ఎంత తప్పో కదా! ఎందుకంటే, ఒక చెవిటివ్యక్తి ఏమీ వినలేడు కాబట్టి తన గురించి ఇతరులు ఏమైనా అంటే, తిరిగి జవాబివ్వలేడు.

4 పద్నాలుగవ వచనంలో, “గుడ్డివాని దారికి అడ్డంగా ఏదీ పెట్టకూడదు” అని కూడా దేవుడు తన ప్రజలకు చెప్పాడు. పూర్వం మధ్యప్రాచ్య దేశాల్లో శారీరక లోపాలున్న వాళ్లతో ప్రజలు అన్యాయంగా, నిర్దయగా ప్రవర్తించేవాళ్లని ఒక రెఫరెన్స్‌ పుస్తకం చెప్తుంది. బహుశా జాలిలేని కొంతమంది, చూపులేని ఒక వ్యక్తికి హాని చేయాలని లేదా అతన్ని ఎగతాళి చేయాలని దారిలో ఏదైనా అడ్డు పెట్టేవాళ్లు. అది ఎంత దారుణమో కదా! ఈ వచనంలోని ఆజ్ఞను బట్టి, తన ప్రజలు శారీరక లోపాలున్న వాళ్లపట్ల కనికరం చూపించాలని యెహోవా కోరుకున్నాడు.

5. శారీరక లోపాలున్న వాళ్లపట్ల మనమెలా కనికరం చూపించవచ్చు?

5 శారీరక లోపాలున్న వాళ్లపట్ల యేసు కనికరం చూపించాడు. ఒక సందర్భంలో బాప్తిస్మమిచ్చు యోహానుకు ఆయన ఈ సందేశం పంపించాడు: “గుడ్డివాళ్లు ఇప్పుడు చూస్తున్నారు, కుంటివాళ్లు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులౌతున్నారు, చెవిటివాళ్లు వింటున్నారు, చనిపోయినవాళ్లు బ్రతికించబడుతున్నారు.” యేసు చేసిన అద్భుతాల్ని చూసినప్పుడు “ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించారు.” (లూకా 7:20-22; 18:43) నేడు మనం కూడా శారీరక లోపాలున్న వాళ్లపట్ల యేసులా కనికరం చూపించాలనుకుంటాం. అందుకే వాళ్లతో దయగా, ఓర్పుగా ఉంటాం. నిజమే, యేసులా అద్భుతాలు చేసే శక్తిని యెహోవా మనకివ్వలేదు. కానీ చూపులేనివాళ్లకు, ఆధ్యాత్మిక గుడ్డితనంతో ఉన్నవాళ్లకు పరదైసు గురించిన మంచివార్తను చెప్పే గొప్ప అవకాశం మనకిచ్చాడు. పరదైసులో ప్రతీఒక్కరూ పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. అలాగే దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుంటారు. (లూకా 4:18) మనం చెప్పే ఆ మంచివార్త వల్ల ప్రజలు ఇప్పటికే దేవుణ్ణి స్తుతిస్తున్నారు.

వ్యాపార విషయాల్లో నిజాయితీగా ఉండండి

6. పది ఆజ్ఞల్ని ఇంకా బాగా అర్థంచేసుకోవడానికి లేవీయకాండం 19 వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనకెలా సహాయం చేస్తాయి?

6 లేవీయకాండం 19వ అధ్యాయంలోని కొన్ని వచనాలు, పది ఆజ్ఞల్ని ఇంకా బాగా అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఉదాహరణకు 8వ ఆజ్ఞలో ఇలా ఉంది: “దొంగతనం చేయకూడదు.” (నిర్గ. 20:15) అయితే, వేరేవాళ్లకు చెందినవి తీసుకోనంతవరకూ తాము ఆ ఆజ్ఞను పాటిస్తున్నామని కొందరు అనుకోవచ్చు. కానీ వాళ్లు వేరే విధాలుగా దొంగతనం చేసే అవకాశం ఉంది.

7. దొంగతనం చేయకూడదని ధర్మశాస్త్రంలోని 8 వ ఆజ్ఞను ఒక వ్యాపారి ఎప్పుడు మీరినట్లు అవుతుంది?

7 ఒక వ్యాపారి వేరేవాళ్లకు చెందినవి తాను ఎప్పుడూ తీసుకోలేదు కాబట్టి దొంగతనం చేయలేదని అనుకోవచ్చు. కానీ ఇతరులతో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆయన నిజాయితీగా ఉంటున్నాడా? లేవీయకాండం 19:35, 36 లో యెహోవా ఇలా చెప్పాడు: “మీరు పొడవును గానీ బరువును గానీ పరిమాణాన్ని గానీ కొలిచేటప్పుడు తప్పుడు కొలమానాలు ఉపయోగించకూడదు. మీరు ఖచ్చితమైన త్రాసును, ఖచ్చితమైన తూకంరాళ్లను, ఖచ్చితమైన ఘనపదార్థాల కొలతను, ఖచ్చితమైన ద్రవ కొలతను ఉపయోగించాలి.” ఒక వ్యాపారి ఇతరులను మోసం చేయడానికి తప్పుడు త్రాసును లేదా తప్పుడు కొలతను ఉపయోగిస్తే అతను దొంగతనం చేసినట్టే. 19 వ అధ్యాయంలోని ఇంకొన్ని వచనాల్ని పరిశీలించినప్పుడు ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమౌతుంది.

లేవీయకాండం 19:11-13 ప్రకారం ఒక క్రైస్తవుడు తన వ్యాపారానికి సంబంధించి ఏ విషయాల గురించి ఆలోచించాలి? (8-10 పేరాలు చూడండి) *

8. ఎనిమిదవ ఆజ్ఞలోని సూత్రాన్ని పాటించడానికి, లేవీయకాండం 19:11-13 లో ఉన్న విషయాలు యూదులకు ఎలా సహాయం చేశాయి? మనమేం చేసేలా అది సహాయం చేస్తుంది?

8 లేవీయకాండం 19:11-13 చదవండి. లేవీయకాండం 19:11 వ వచనం ఈ మాటలతో మొదలౌతుంది: “మీరు దొంగతనం చేయకూడదు.” అలాగే 13వ వచనం, “మీరు సాటిమనిషిని దగా చేయకూడదు” అని చెప్తుంది. దీన్నిబట్టి ఒకవ్యక్తి వ్యాపారం చేస్తున్నప్పుడు నిజాయితీగా లేకపోతే అతను దొంగతనం చేస్తున్నట్టే. 8వ ఆజ్ఞ దొంగతనం చేయడం తప్పని చెప్తుంటే, ఆ ఆజ్ఞలోని సూత్రాన్ని ఎలా పాటించాలో అర్థంచేసుకోవడానికి లేవీయకాండంలోని వివరాలు యూదులకు సహాయం చేశాయి. నిజాయితీగా లేకపోవడం గురించి, దొంగతనం చేయడం గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడో మనం ఆలోచించడం మంచిది. మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: “లేవీయకాండం 19:11-13 లో ఉన్న విషయాల్ని ఆలోచించినప్పుడు, నా జీవితంలో ముఖ్యంగా, వ్యాపారం లేదా ఉద్యోగం విషయంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందని నాకు అనిపిస్తుందా?”

9. లేవీయకాండం 19:13 లో ఉన్న ఆజ్ఞ కూలివాళ్లకు ఎలా సహాయం చేసింది?

9 ఒక క్రైస్తవుడు తన దగ్గర పనిచేసేవాళ్ల విషయంలో ఇంకా ఏ విధంగా నిజాయితీగా ఉండవచ్చో గమనించండి. లేవీయకాండం 19:13 వ వచనం చివర్లో ఇలా ఉంది: “కూలివానికి ఇవ్వాల్సిన జీతాన్ని రాత్రంతా, అంటే మరుసటి రోజు ఉదయం వరకు మీ దగ్గర ఉంచుకోకూడదు.” పూర్వం ఇశ్రాయేలీయుల్లో చాలామంది పొలాల్లో పనిచేసేవాళ్లు. వాళ్లకు ఏ రోజు జీతం ఆరోజు ఇచ్చేవాళ్లు. ఒకవేళ కూలివానికి ఆరోజు చివర్లో జీతం ఇవ్వకపోతే అతను ఆరోజు తన కుటుంబ అవసరాల్ని తీర్చలేడు. దాని గురించి యెహోవా ఇలా చెప్పాడు: “అతను పేదవాడు, అతని జీవితం ఆ డబ్బులపైనే ఆధారపడి ఉంది.”—ద్వితీ. 24:14, 15; మత్త. 20:8.

10. లేవీయకాండం 19:13 నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

10 మనకాలంలో చాలామంది ఉద్యోగులకు ప్రతీరోజు కాకుండా నెలకు ఒకటి లేదా రెండుసార్లు జీతం ఇస్తారు. అయినా లేవీయకాండం 19:13 లో ఉన్న సూత్రం ఇప్పటికీ వర్తిస్తుంది. కొంతమంది యజమానులు తమ దగ్గర ఉద్యోగం చేసేవాళ్లతో అన్యాయంగా వ్యవహరిస్తూ ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ జీతం ఇస్తారు. ఉద్యోగుల అవసరాన్ని అలుసుగా తీసుకొని కావాలనే తక్కువ జీతానికి పని చేయించుకుంటారు. అలా చేయడంవల్ల ఆ యజమానులు ‘కూలివానికి ఇవ్వాల్సిన జీతాన్ని తమ దగ్గర ఉంచుకుంటున్నట్టు’ అవుతుంది. కాబట్టి ఒక క్రైస్తవుడు తన దగ్గర పనిచేసేవాళ్లతో నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు లేవీయకాండం 19వ అధ్యాయం నుండి ఇంకా ఏం నేర్చుకోవచ్చో గమనిద్దాం.

నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి

11-12. లేవీయకాండం 19:17, 18 లో ఉన్న మాటల్ని ప్రస్తావిస్తూ యేసు ఏ విషయాన్ని నొక్కిచెప్పాడు?

11 మనం ఇతరులకు హాని చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనింకా ఏం కోరుకుంటున్నాడో లేవీయకాండం 19:17, 18 లో తెలుసుకోవచ్చు. (చదవండి.) ఆ వచనాల్లో యెహోవా స్పష్టంగా ఇలా చెప్పాడు: “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.” ఒక క్రైస్తవుడు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఆ ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి.

12 లేవీయకాండం 19:18 లో ఉన్న ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమైందో యేసు చెప్పాడు. ఒకసారి ఒక పరిసయ్యుడు యేసును, “ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు. దానికి ఆయన, యెహోవాను మన నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, నిండు మనసుతో ప్రేమించాలనేదే “అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటి” ఆజ్ఞ అని చెప్పాడు. తర్వాత లేవీయకాండం 19:18 లో ఉన్న మాటల్ని ప్రస్తావిస్తూ యేసు ఇలా అన్నాడు: “రెండో ఆజ్ఞ కూడా దాని లాంటిదే. అదేమిటంటే, ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.’” (మత్త. 22:35-40) మనం ఎన్నో విధాలుగా ఇతరులమీద ప్రేమ చూపించవచ్చు. కొన్ని విధానాల్ని లేవీయకాండం 19వ అధ్యాయం నుండి తెలుసుకుందాం.

13. మనం యోసేపు వృత్తాంతాన్ని పరిశీలించడం ద్వారా లేవీయకాండం 19:18 లో ఉన్న మాటల్ని ఇంకా బాగా ఎలా అర్థంచేసుకోవచ్చు?

13 మనం ఇతరులమీద ప్రేమ చూపించగల ఒక మార్గం గురించి లేవీయకాండం 19:18 లో చూస్తాం. అక్కడ ఇలా ఉంది: “ప్రతీకారం తీర్చుకోకూడదు, నీ ప్రజల మీద పగపెట్టుకోకూడదు.” తోటి ఉద్యోగి మీద, క్లాస్‌మేట్‌ మీద, బంధువు లేదా కుటుంబ సభ్యుని మీద ఎన్నో సంవత్సరాలపాటు పగ పెంచుకున్నవాళ్ల గురించి మనలో చాలామంది వినేవుంటాం. యోసేపు పదిమంది అన్నలు ఆయనమీద పగ పెంచుకుని, చివరికి ద్వేషంతో ప్రతీకారం తీర్చుకున్నారని గుర్తుచేసుకోండి. (ఆది. 37:2-8, 25-28) కానీ యోసేపు వాళ్లలా ప్రవర్తించలేదు. ఆయన చేతిలో అధికారమున్నా, పగతీర్చుకునే అవకాశం వచ్చినా తన అన్నల మీద దయ చూపించాడే గానీ పగ పెట్టుకోలేదు. నిజానికి ఆయన, ఆ తర్వాత రాయబడిన లేవీయకాండం 19:18 లో ఉన్న మాటల ప్రకారం ప్రవర్తించాడు.—ఆది. 50:19-21.

14. లేవీయకాండం 19:18 లో ఉన్న సూత్రాలను మనం ఇప్పటికీ ఎందుకు పాటించాలి?

14 దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునే క్రైస్తవులు యోసేపును అనుకరించాలి. ఆయన తన అన్నల మీద పగతీర్చుకునే బదులు వాళ్లను క్షమించాడు. అది యేసు చెప్పిన మాదిరి ప్రార్థనకు అనుగుణంగా ఉంది. మన విషయంలో పాపం చేసినవాళ్లను క్షమించాలని ఆయన ఆ ప్రార్థనలో చెప్పాడు. (మత్త. 6:9, 12, అధస్సూచి) అపొస్తలుడైన పౌలు కూడా క్రైస్తవులకు ఈ సలహా ఇచ్చాడు: “ప్రియ సహోదరులారా, మీకు మీరే పగతీర్చుకోకండి.” (రోమా. 12:19) ఆయన వాళ్లను ఇంకా ఇలా ప్రోత్సహించాడు: “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరుల మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నాసరే అలా క్షమించండి.” (కొలొ. 3:13) యెహోవా సూత్రాలు ఎప్పటికీ మారవు. కాబట్టి లేవీయకాండం 19:18 లోని ఆజ్ఞ వెనకున్న సూత్రాలను మనం ఇప్పటికీ పాటించాలి.

శరీరానికి తగిలిన దెబ్బను అదేపనిగా ముట్టుకోవడం ఎలాగైతే మంచిదికాదో, ఇతరులు మనల్ని బాధపెట్టినప్పుడు దాన్ని పదేపదే గుర్తుచేసుకోవడం కూడా మంచిదికాదు. దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాలి (15వ పేరా చూడండి) *

15. మనల్ని బాధపెట్టిన వాళ్లను ఎందుకు క్షమించాలో అర్థంచేసుకోవడానికి ఏ ఉదాహరణ సహాయం చేస్తుంది?

15 ఒక ఉదాహరణ గమనించండి. మన హృదయానికి అయ్యే గాయాల్ని శరీరానికి తగిలే దెబ్బలతో పోల్చవచ్చు. ఆ దెబ్బలు చిన్నవి లేదా పెద్దవి అవ్వొచ్చు. ఉదాహరణకు, మనం కూరగాయలు కోస్తున్నప్పుడు మన వేలు తెగొచ్చు. వెంటనే నొప్పిగా అనిపించినా అది త్వరగా తగ్గిపోతుంది. ఒకట్రెండు రోజుల తర్వాత, అసలు తెగిందని కూడా మనకు గుర్తుండదు. అదేవిధంగా మీ స్నేహితుడు ఆలోచించకుండా ఏదైనా అనడం లేదా చేయడం వల్ల మీకు బాధ కలగవచ్చు. కానీ అదేం పెద్ద విషయం కాదు కాబట్టి మీరు అతన్ని క్షమించగల్గుతారు. అయితే, కొన్నిసార్లు మన శరీరానికి పెద్ద దెబ్బ తగలొచ్చు. దానికి డాక్టరు కుట్లు వేసి, కట్టుకట్టాల్సి వస్తుంది. ఆ దెబ్బను అదేపనిగా ముట్టుకుంటే అది తగ్గకుండా ఇంకా ఎక్కువ అవ్వొచ్చు. విచారకరంగా, ఒక వ్యక్తి బాగా నొచ్చుకున్నప్పుడు అలాంటి పనే చేస్తుండొచ్చు. అవతలివ్యక్తి చేసిన పని గురించి, దానివల్ల తానుపడ్డ బాధ గురించి అతను పదేపదే ఆలోచిస్తూ పగ పెట్టుకునే ప్రమాదం ఉంది. అలా చేస్తే అది అతనికే నష్టం. దానికి బదులు, లేవీయకాండం 19:18 లో ఉన్న సలహాను పాటించడం ఎంత మంచిదో కదా!

16. లేవీయకాండం 19:33, 34 ప్రకారం, ఇశ్రాయేలీయులు పరదేశుల్ని ఎలా చూడాలని యెహోవా కోరుకున్నాడు? దాన్ని మనమెలా పాటించవచ్చు?

16 సాటిమనిషిని ప్రేమించమని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, వాళ్లు తోటి ఇశ్రాయేలీయుల్ని మాత్రమే ప్రేమించాలని దానర్థం కాదు. తమ మధ్యవున్న పరదేశులను కూడా వాళ్లు ప్రేమించాలని ఆయన చెప్పాడు. లేవీయకాండం 19:33, 34 లో ఉన్న మాటల్నిబట్టి ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. (చదవండి.) ఇశ్రాయేలీయులు తమ మధ్యవున్న పరదేశిని వాళ్లలో ఒకరిగా చూడాలని, తమనుతాము ప్రేమించుకున్నట్టు ప్రేమించాలని యెహోవా కోరుకున్నాడు. ఉదాహరణకు పేదవాళ్లను, పరదేశులను పొలాల్లో పరిగె ఏరుకోనివ్వాలని ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీ. 19:9, 10) పరదేశులను ప్రేమించాలనే సూత్రం నేడు మనకు కూడా వర్తిస్తుంది. (లూకా 10:30-37) దాన్ని మనమెలా పాటించవచ్చు? నేడు ఒక దేశం నుండి మరో దేశానికి లక్షలమంది వలస వెళ్తుండవచ్చు. అలాంటివాళ్లు మన ప్రాంతంలో కూడా కొంతమంది ఉండుంటారు. మనం వాళ్లను గౌరవించాలి.

అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పని

17-18. (ఎ) లేవీయకాండం 19:2 అలాగే 1 పేతురు 1:15, మనల్ని ఏం చేయమని ప్రోత్సహిస్తున్నాయి? (బి) అపొస్తలుడైన పేతురు ఏ ప్రాముఖ్యమైన పని చేయమని చెప్పాడు?

17 దేవుని ప్రజలు పవిత్రంగా ఉండాలని లేవీయకాండం 19:2 అలాగే 1 పేతురు 1:15 చెప్తున్నాయి. దేవుడు మనల్ని చూసి సంతోషించాలంటే మనమేం చేయాలో, ఏం చేయకూడదో లేవీయకాండం 19వ అధ్యాయంలోని ఇతర వచనాల నుండి నేర్చుకున్నాం. * ఆ సూత్రాల్ని ఈరోజుల్లో కూడా మనం పాటించాలనేది యెహోవా కోరికని క్రైస్తవ గ్రీకు లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే అపొస్తలుడైన పేతురు ఇంకొక మాట కూడా చెప్పాడు.

18 మనం క్రమంగా యెహోవాను ఆరాధిస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ ఉండొచ్చు. అయినా మనల్ని ఒక ప్రాముఖ్యమైన పని చేయమని పేతురు ప్రత్యేకంగా ప్రోత్సహించాడు. మన ప్రవర్తనంతటిలో పవిత్రులుగా ఉండమని చెప్పడానికి ముందు ఆయనిలా అన్నాడు: “కష్టపడి పనిచేయడానికి మీ మనసుల్ని సిద్ధం చేసుకోండి.” (1 పేతు. 1:13, 15) ఏంటా పని? క్రీస్తు అభిషిక్త సహోదరులు, తమను “పిలిచిన దేవుని ‘గొప్ప లక్షణాల గురించి దేశదేశాల్లో ప్రకటిస్తారని’” పేతురు చెప్పాడు. (1 పేతు. 2:9) అత్యంత ప్రాముఖ్యమైన ఆ పనిలో భాగం వహించే గొప్ప అవకాశం నేడు క్రైస్తవులందరికీ ఉంది. వాళ్లు ఉత్సాహంగా ప్రకటించే, బోధించే పనిని చేస్తారు. ఆ పని వేరే దేనికన్నా ప్రజలకు ఎక్కువ సహాయం చేస్తుంది. (మార్కు 13:10) లేవీయకాండం 19వ అధ్యాయంలో ఉన్న సూత్రాల్ని పాటించడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు మన దేవుణ్ణి, పొరుగువాళ్లను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. అలాగే మన ప్రవర్తనంతట్లో ‘పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నామని’ చూపిస్తాం.

పాట 111 మన సంతోషానికి కారణాలు

^ క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరంలేదు. అయినా మనమేం చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఇతరుల్ని ప్రేమించగలం, దేవుణ్ణి సంతోషపెట్టగలం. లేవీయకాండం 19 వ అధ్యాయంలోని కొన్ని విషయాల్ని మన జీవితంలో ఎలా పాటించవచ్చో అర్థంచేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

^ ఈ ఆర్టికల్‌లో, ముందటి ఆర్టికల్‌లో లేవీయకాండంలోని కొన్ని లేఖనాల్ని మనం చర్చించలేదు. అవి పక్షపాతం చూపించడం, లేనిపోనివి కల్పించి చెప్పడం, రక్తాన్ని తినడం, మంత్రతంత్రాలను చేయడం, భవిష్యత్తు చెప్పేవాళ్లను సంప్రదించడం, అనైతికత గురించి వివరిస్తున్నాయి.—లేవీ. 19:15, 16, 26-29, 31.—ఇదే పత్రికలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.

^ చిత్రాల వివరణ: డాక్టరుతో మాట్లాడేలా వినికిడి లోపమున్న ఒక సహోదరునికి ఇంకో సహోదరుడు సహాయం చేస్తున్నాడు.

^ చిత్రాల వివరణ: పెయింటింగ్‌ బిజినెస్‌ చేస్తున్న ఒక సహోదరుడు తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి జీతం ఇస్తున్నాడు.

^ చిత్రాల వివరణ: ఒక సహోదరి తనకు తగిలిన చిన్న దెబ్బను సులభంగా మర్చిపోవచ్చు. ఒకవేళ పెద్ద దెబ్బ తగిలితే దాన్ని మర్చిపోగలదా?