కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మంచి తోటిపనివాళ్లుగా ఉన్నారా?

మీరు మంచి తోటిపనివాళ్లుగా ఉన్నారా?

“నేను ప్రధానశిల్పిగా ఆయన పక్కనే ఉన్నాను. . . . నేను ఎప్పుడూ ఆయన ముందు సంతోషిస్తూ ఉండేవాణ్ణి.” (సామె. 8:30) యేసు ఈ భూమ్మీదికి రాకముందు తన తండ్రితో కలిసి కోట్ల సంవత్సరాలు ఎలా పని చేశాడో ఆ లేఖనం వివరిస్తుంది. తన తండ్రితో పని చేస్తున్నప్పుడు యేసు ‘సంతోషించాడు’ అని కూడా ఆ లేఖనం చెప్తుంది.

యేసు ఇతరులతో కలిసి పని చేయడానికి కావాల్సిన మంచి లక్షణాల్ని పరలోకంలో నేర్చుకున్నాడు. ఆయన భూమ్మీద జీవించినప్పుడు ఇతరులతో కలిసి పనిచేసే విషయంలో మంచి ఆదర్శం ఉంచాడు. యేసు ఆదర్శం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? ఆయన ఆదర్శాన్ని పరిశీలించడం ద్వారా ఇతరులతో కలిసి చక్కగా పని చేయడానికి ఉపయోగపడే మూడు సూత్రాల్ని నేర్చుకుంటాం. మన సహోదరులతో మరింత ఐక్యంగా ఉండడానికి ఆ సూత్రాలు సహాయం చేస్తాయి.

యెహోవాలా, యేసులా మీ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి

మొదటి సూత్రం: ‘ఒకరినొకరు ఘనపర్చుకోండి’

ఇతరులతో కలిసి చక్కగా పనిచేసే వ్యక్తి వినయంగా ఉంటాడు. తోటి పనివాళ్ల కన్నా తానే గొప్ప అన్నట్టు ప్రవర్తించడు. యేసు అలాంటి వినయాన్ని తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. సృష్టికర్తగా పిలవబడే అర్హత యెహోవాకు మాత్రమే ఉన్నా, తన కుమారుడు చేసిన ప్రాముఖ్యమైన పని గురించి ఇతరులు తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు: “మన స్వరూపంలో, మనలా మనిషిని తయారుచేద్దాం.” (ఆది. 1:26) ఆ మాటల్నిబట్టి యెహోవాకున్న వినయాన్ని యేసు అర్థంచేసుకున్నాడు.—కీర్త. 18:35.

యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు కూడా యెహోవా లాంటి వినయాన్ని చూపించాడు. ఆయన చేసిన పనులకు ప్రజలు ఆయన్ని పొగిడినప్పుడు ఆ ఘనతంతా దేవునికే ఇచ్చాడు. (మార్కు 10:17, 18; యోహా. 7:15, 16) యేసు ఎప్పుడూ తన శిష్యులతో శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నించాడు. అలాగే వాళ్లను దాసుల్లా కాకుండా స్నేహితుల్లా చూశాడు. (యోహా. 15:15) వినయంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో తన శిష్యులకు నేర్పించడానికి ఆయన ఆఖరికి వాళ్ల కాళ్లు కడిగాడు. (యోహా. 13:5, 12-14) మనం మన గురించే ఆలోచించకుండా మనతో కలిసి పని చేసేవాళ్లను యేసులా ఘనపర్చాలి. మనం ‘ఒకరినొకరం ఘనపర్చుకున్నప్పుడు,’ ఎవరికి పేరు దక్కుతుందని ఆలోచించకుండా ఉన్నప్పుడు, మన పనిలో ఇంకా ఎక్కువ సాధించగలుగుతాం.—రోమా. 12:10.

“సలహాదారులు ఎక్కువమంది ఉంటే పనులు జరుగుతాయి” అని వినయంగల వ్యక్తి అర్థంచేసుకుంటాడు. (సామె. 15:22) మనకు ఎంత అనుభవం ఉన్నా, ఎన్ని సామర్థ్యాలు ఉన్నా ఒకవ్యక్తికి అన్ని విషయాలు తెలీవని మనం గుర్తుంచుకోవాలి. యేసు కూడా తనకు కొన్ని విషయాలు తెలీవని ఒప్పుకున్నాడు. (మత్త. 24:36) అంతేకాదు, తన అపరిపూర్ణ శిష్యుల అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. (మత్త. 16:13-16) అందుకే శిష్యులు ఆయనతో కలిసి పని చేయడానికి ఇష్టపడేవాళ్లు. మనం కూడా వినయంగా ఉన్నప్పుడు, మనకు అన్ని విషయాలు తెలీవని గుర్తుంచుకున్నప్పుడు, ఇతరుల అభిప్రాయాల్ని విన్నప్పుడు మన మధ్య శాంతి ఉంటుంది అలాగే మన పనుల్లో విజయం సాధిస్తాం.

సంఘ పెద్దలందరూ కలిసి పని చేస్తున్నప్పుడు యేసులాంటి వినయాన్ని చూపించాలి. పెద్దలసభ కలిసి చర్చించుకుంటున్నప్పుడు, మంచి నిర్ణయం తీసుకునేలా మాట్లాడేందుకు పవిత్రశక్తి ఏ పెద్దనైనా ప్రేరేపించగలదని వాళ్లు గుర్తుంచుకోవాలి. ప్రతీ పెద్ద తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగినప్పుడు, సంఘం మొత్తానికి ప్రయోజనాన్నిచ్చే నిర్ణయాల్ని వాళ్లు తీసుకోగలుగుతారు.

రెండో సూత్రం: ‘పట్టుబట్టేవాళ్లుగా’ ఉండకండి

ఇతరులతో కలిసి చక్కగా పనిచేసే వ్యక్తి పట్టుబట్టే స్వభావాన్ని చూపించడు. అతను, ఇతరుల్ని అర్థంచేసుకుంటాడు అలాగే తనమాటే నెగ్గాలని అనుకోడు. వాళ్లు చెప్పేది విని మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. యేసు తన తండ్రికున్న అర్థంచేసుకునే స్వభావాన్ని ఎన్నో సందర్భాల్లో చూసుంటాడు. ఉదాహరణకు, యెహోవా మనుషుల్ని అర్థంచేసుకున్నాడు కాబట్టే వాళ్లను మరణం నుండి విడిపించడానికి తన కుమారుణ్ణి ఈ భూమ్మీదికి పంపించాడు.—యోహా. 3:16.

యేసు కూడా ప్రజల్ని అర్థంచేసుకుని వ్యవహరించాడు. ఆయన ఇశ్రాయేలీయులకు సహాయం చేయడానికి వచ్చినప్పటికీ, ఒక సందర్భంలో ఫేనీకే స్త్రీకి సహాయం చేశాడు. (మత్త. 15:22-28) ఆయన తన శిష్యులతో కూడా అర్థంచేసుకుని వ్యవహరించాడు. తన స్నేహితుడైన పేతురు అందరి ముందు తానెవరో తెలీదని చెప్పినప్పటికీ యేసు అతన్ని క్షమించాడు. ఆ తర్వాత పేతురుకు బరువైన బాధ్యతల్ని కూడా ఇచ్చాడు. (లూకా 22:32; యోహా. 21:17; అపొ. 2:14; 8:14-17; 10:44, 45) మనం కూడా ‘పట్టుబట్టేవాళ్లుగా’ ఉండకుండా, మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని యేసు ఆదర్శం నుండి నేర్చుకోవచ్చు.—1 తిమో. 3:3.

మనకు పట్టుబట్టే స్వభావం లేనప్పుడు అన్నిరకాల ప్రజలతో శాంతియుతంగా పని చేయడానికి కావాల్సిన మార్పుల్ని చేసుకోగలుగుతాం. యేసు తన చుట్టూవున్న ప్రజలతో ఎంత చక్కగా వ్యవహరించాడంటే, అది చూసి ఆయన శత్రువులు కుళ్లుకున్నారు. ఆయన్ని “పన్ను వసూలుచేసే వాళ్లకూ పాపులకూ స్నేహితుడు” అని నిందించారు. (మత్త. 11:19) యేసులా మనం కూడా అన్నిరకాల ప్రజలతో కలిసి పని చేయగలమా? లూయిస్‌ అనే సహోదరుడు ప్రాంతీయ పర్యవేక్షకునిగా, బెతెల్‌ సభ్యునిగా రకరకాల వ్యక్తులతో కలిసి పని చేశాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “రకరకాల వ్యక్తులతో కలిసి పని చేయడాన్ని, వేర్వేరు సైజులో ఉన్న రాళ్లతో గోడ కట్టడంతో పోల్చవచ్చు. ఆ రాళ్లు వేర్వేరు సైజుల్లో ఉండడంవల్ల గోడ కట్టడానికి ఎక్కువ సమయం, కృషి అవసరమైనా మనం గోడ కట్టగలుగుతాం. అదేవిధంగా నేను ఇతరులతో కలిసి ప్రశాంతంగా పని చేయగలిగేలా వ్యక్తిగతంగా కొన్ని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాను.”

ఇతరులతో కలిసి చక్కగా పనిచేసే వ్యక్తి వాళ్లపై తనదే పైచేయిగా ఉండాలనుకోడు, వాళ్లకు ఉపయోగపడే విషయాల్ని చెప్పకుండా దాయడు

మనకు పట్టుబట్టే స్వభావం లేదని సంఘంలో ఎలా చూపించవచ్చు? మన క్షేత్రసేవ గుంపుతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు వేర్వేరు కుటుంబ బాధ్యతలు, వేర్వేరు వయసులు ఉన్న సహోదర సహోదరీలతో కలిసి పని చేయవచ్చు. వాళ్లు పరిచర్యను మరింత ఆనందించేలా పరిచర్య చేసే పద్ధతిలో, సమయాల్లో మనం మార్పులు చేసుకోవచ్చు.

మూడో సూత్రం: “పంచుకోవడానికి సిద్ధంగా” ఉండండి

ఇతరులతో కలిసి చక్కగా పనిచేసే వ్యక్తి “పంచుకోవడానికి సిద్ధంగా” ఉంటాడు. (1 తిమో. 6:18) యేసు యెహోవాతో కలిసి పని చేస్తున్నప్పుడు, యెహోవా ఏమీ దాచలేదని ఆయన గమనించివుంటాడు. యెహోవా “ఆకాశాన్ని సిద్ధం చేసినప్పుడు” యేసు అక్కడే ‘ఉన్నాడు’ అలాగే ఆయన్నుండి నేర్చుకున్నాడు. (సామె. 8:27) తర్వాత యేసు, ‘తండ్రి దగ్గర విన్న వాటిని’ తన శిష్యులతో సంతోషంగా పంచుకున్నాడు. (యోహా. 15:15) మనం నేర్చుకున్నవాటిని సహోదర సహోదరీలకు చెప్పడం ద్వారా యెహోవాను అనుకరించవచ్చు. ఇతరులతో కలిసి చక్కగా పనిచేసే వ్యక్తి వాళ్లపై తనదే పైచేయిగా ఉండాలనుకోడు, వాళ్లకు ఉపయోగపడే విషయాల్ని చెప్పకుండా దాయడు. బదులుగా తాను నేర్చుకున్న మంచి విషయాల్ని ఇతరులకు సంతోషంగా చెప్తాడు.

మనతో కలిసి పని చేసేవాళ్లను మనం మెచ్చుకోవచ్చు. ఎవరైనా మన కష్టాన్ని గుర్తించి, మనల్ని హృదయపూర్వకంగా మెచ్చుకుంటే సంతోషంగా అనిపించదా? యేసు సమయం తీసుకుని తన శిష్యుల్ని మెచ్చుకున్నాడు. (మత్తయి 25:19-23 పోల్చండి; లూకా 10:17-20.) వాళ్లు తనకన్నా “గొప్ప పనులు” చేస్తారని కూడా చెప్పాడు. (యోహా. 14:12) ఆయన చనిపోవడానికి ముందు రోజు రాత్రి తన నమ్మకమైన అపొస్తలులను, “నా కష్టాల్లో నన్ను అంటిపెట్టుకొని ఉన్నవాళ్లు మీరే” అని మెచ్చుకున్నాడు. (లూకా 22:28) ఆయన మాటలు శిష్యుల హృదయాన్ని తాకివుంటాయి. అలాగే తర్వాత్తర్వాత ఇంకా ఎక్కువ పనిచేసేలా వాళ్లను ప్రోత్సహించివుంటాయి. మనం కూడా మనతో కలిసి పని చేసేవాళ్లను మెచ్చుకున్నప్పుడు వాళ్లు ఖచ్చితంగా ఎంతో సంతోషిస్తారు, ఇంకా ఎక్కువ పని చేయగలుగుతారు.

మీరు ఒక మంచి తోటిపనివారిగా ఉండవచ్చు

కెయోడే అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “ఇతరులతో కలిసి చక్కగా పనిచేసే వ్యక్తి పరిపూర్ణుడిగా ఉండాల్సిన అవసరంలేదు. అతను పరిపూర్ణుడు కాకపోయినా తనతో కలిసి పని చేసేవాళ్లను సంతోషపెడతాడు అలాగే వాళ్ల పనిని తేలిక చేస్తాడు.” మీరూ అలాంటి వ్యక్తా? బహుశా మీరు అలాంటి పనివాళ్లో కాదో మీ తోటి సహోదర సహోదరీల్ని అడిగితే, వాళ్లు మీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తారు. శిష్యులు యేసుతో కలిసి పని చేయడానికి సంతోషించినట్లే, ఇతరులు మీతో కలిసి పని చేయడానికి సంతోషిస్తుంటే, అపొస్తలుడైన పౌలులా మీరు కూడా ఇలా అనొచ్చు: “మేము మీ సంతోషం కోసం పాటుపడే తోటిపనివాళ్లం.”—2 కొరిం. 1:24.