కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 52

కష్టమైన పరిస్థితుల్ని తట్టుకునేలా ఇతరులకు సహాయం చేయండి

కష్టమైన పరిస్థితుల్ని తట్టుకునేలా ఇతరులకు సహాయం చేయండి

“మేలు చేయడం నీకు చేతనైనప్పుడు, దాన్ని పొందాల్సిన వాళ్లకు ఆ మేలు చేయకుండా ఉండకు.”సామె. 3:27.

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

ఈ ఆర్టికల్‌లో. . . a

1. యెహోవా తరచూ తన సేవకుల ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడు?

 ఎవరైనా సహాయం కోసం యెహోవాకు పట్టుదలగా ప్రార్థించినప్పుడు, వాళ్ల ప్రార్థనకు జవాబివ్వడానికి యెహోవా మిమ్మల్ని కూడా ఉపయోగించుకుంటాడని మీకు తెలుసా? మీరు సంఘ పెద్దైనా, సంఘ పరిచారకుడైనా, పయినీరైనా, పబ్లిషరైనా ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. అంతేకాదు మీరు యౌవనులైనా, ముసలి వాళ్లయినా, సహోదరులైనా, సహోదరీలైనా ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. ఎవరైనా సహాయం కోసం యెహోవాకు ప్రార్థించినప్పుడు తరచూ ఆయన పెద్దల్ని, ఇతర నమ్మకమైన సేవకుల్ని ఉపయోగించుకుని వాళ్లకు “ఎంతో ఊరటను” ఇస్తాడు. (కొలొ. 4:11) యెహోవా తరఫున తోటి సహోదరులకు సహాయం చేసే అవకాశం దొరికినందుకు మనం ఎంతో సంతోషిస్తాం. అంటువ్యాధులు వ్యాపించినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు లేదా హింస ఎదురైనప్పుడు మనం అలా తోటి సహోదరులకు సహాయం చేయవచ్చు.

అంటువ్యాధులు వ్యాపించినప్పుడు ఇతరులకు సహాయం చేయండి

2. అంటువ్యాధులు వ్యాపించినప్పుడు ఇతరులకు సహాయం చేయడం ఎందుకు కష్టం అవ్వవచ్చు?

2 అంటువ్యాధులు వ్యాపించినప్పుడు వేరేవాళ్లకు సహాయం చేయడం చాలా కష్టం అవ్వవచ్చు. ఉదాహరణకు మనం సహోదర సహోదరీల్ని కలవడానికి వెళ్లాలనుకోవచ్చు, కానీ అలా వెళ్లడం ప్రమాదకరం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లను మన ఇంటికి భోజనానికి పిలవాలనుకోవచ్చు, కానీ అదికూడా కుదరదు. మన ఇంట్లోవాళ్లకు బాలేనప్పుడు, మనం ఇతరులకు సహాయం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి ఉంటుంది. అయినా తోటివాళ్లకు సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (సామె. 3:27; 19:17) మరి మనం ఏం చేయవచ్చు?

3. డేజీ సంఘంలోని పెద్దల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (యిర్మీయా 23:4)

3 పెద్దలు ఏం చేయవచ్చు? మీరొక సంఘ పెద్ద అయితే, మీ సంఘంలోని గొర్రెల గురించి బాగా తెలుసుకోండి. (యిర్మీయా 23:4 చదవండి.) ముందటి ఆర్టికల్‌లో చెప్పిన డేజీ ఇలా అంటుంది: “మా ఫీల్డ్‌ సర్వీస్‌ గ్రూపులోని పెద్దలు మాతో కలిసి పరిచర్య చేసేవాళ్లు, సరదాగా సమయం గడిపేవాళ్లు.” b దానివల్ల కోవిడ్‌ సమయంలో డేజీకి సహాయం చేయడం వాళ్లకు తేలికైంది. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు వైరస్‌ వల్ల చనిపోయారు.

4. డేజీకి సహాయం చేయడం పెద్దలకు ఎందుకు తేలికైంది? దీన్నుండి ఏం నేర్చుకోవచ్చు?

4 డేజీ ఇలా చెప్తుంది: “పెద్దలు ముందు నుండే మంచి స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి నాకు ఎలా అనిపిస్తుందో, దేనిగురించి కంగారుపడుతున్నానో వాళ్లకు ఈజీగా చెప్పగలిగాను.” దీన్నుండి పెద్దలు ఏం నేర్చుకోవచ్చు? కష్టమైన పరిస్థితులు రాకముందే మీ సంఘంలో ఉన్నవాళ్లను శ్రద్ధగా చూసుకోండి. వాళ్లకు స్నేహితులుగా ఉండండి. అంటువ్యాధులు వచ్చి, వాళ్లను నేరుగా కలవడం కష్టమైనప్పుడు ఏం చేయవచ్చో ఆలోచించండి. డేజీ ఇంకా ఇలా చెప్తుంది: “కొన్నిసార్లు ఒకేరోజు వేర్వేరు సంఘ పెద్దలు నాకు ఫోన్‌ చేసి మాట్లాడేవాళ్లు లేదా మెసేజ్‌లు పంపేవాళ్లు. వాళ్లు చూపించిన లేఖనాలు నాకు బాగా తెలిసినవే అయినా, ఆ సమయంలో అవి నాకెంతో ఊరటను ఇచ్చాయి.”

5. సహోదర సహోదరీల అవసరాలు ఏంటో పెద్దలు ఎలా తెలుసుకోవచ్చు? వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

5 సహోదర సహోదరీల అవసరాలేంటో తెలుసుకోవడానికి, మీరు తెలివిగా కొన్ని ప్రశ్నలు అడగాల్సి రావచ్చు. (సామె. 20:5) వాళ్ల దగ్గర ఆహారం, మందులు లాంటివి సరిపడా ఉన్నాయా? వాళ్ల ఉద్యోగం పోయే పరిస్థితి ఏమైనా ఉందా? ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారా? ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనం పొందడానికి వాళ్లకేమైనా సహాయం అవసరమా? మీరు ఇలాంటి విషయాల గురించి ఆలోచించాల్సి రావచ్చు. సహోదర సహోదరీలు డేజీకి అవసరమైనవాటిని ఇచ్చారు. అయితే పెద్దలు ఇచ్చిన ప్రోత్సాహం, ఆధ్యాత్మిక మద్దతే ఆ కష్టాల్ని సహించడానికి ఆమెకు ఎక్కువగా సహాయం చేశాయి. ఆమె ఇలా చెప్తుంది: “పెద్దలు నాతో కలిసి ప్రార్థించారు. ఆ ప్రార్థనలో వాళ్లు ఏం చెప్పారో నాకు గుర్తులేదు, కానీ అప్పుడు నాకు ఎలా అనిపించిందో ఇంకా గుర్తుంది. ఒక విధంగా ‘నేను నీకు తోడుగా ఉన్నాను’ అని యెహోవాయే నాతో చెప్తున్నట్టు అనిపించింది.”—యెష. 41:10, 13.

రాజ్యమందిరంలో కామెంట్స్‌ చెప్తున్న వాళ్లను, అలాగే అనారోగ్యం వల్ల జూమ్‌లో హాజరై కామెంట్‌ చెప్తున్న సహోదరుణ్ణి చూసి, కావలికోట చేస్తున్న సహోదరుడు సంతోషిస్తున్నాడు (6వ పేరా చూడండి)

6. ఇతరులకు సహాయం చేయడానికి సంఘంలో ఉన్నవాళ్లు ఏం చేయవచ్చు? (చిత్రం చూడండి.)

6 సంఘంలో ఇతరులు ఏం చేయవచ్చు? పెద్దలు సంఘంలో ఉన్నవాళ్ల బాగోగులు చూసుకోవాలని మనం అనుకుంటాం. కానీ మనందరం ఇతరుల్ని ప్రోత్సహించాలని, వాళ్లకు సహాయం చేయాలని యెహోవా చెప్తున్నాడు. (గల. 6:10) అనారోగ్యంతో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి మనం ప్రేమతో చేసే ఏ చిన్న పనైనా, వాళ్లకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సంఘంలో ఉన్న ఎవరినైనా ప్రోత్సహించడానికి పిల్లలు ఏదైనా డ్రాయింగ్‌ వేసి చిన్న కార్డు పంపవచ్చు. యౌవనులు సరుకులు కొనుక్కునే విషయంలో సహాయం చేయవచ్చు. మీరు వీలైతే ఒంట్లో బాలేని వాళ్ల కోసం భోజనం తయారుచేసి, దాన్ని వాళ్ల ఇంటి గుమ్మం దగ్గర పెట్టవచ్చు. నిజం చెప్పాలంటే అంటువ్యాధులు వ్యాపించినప్పుడు, సంఘంలో ఉన్న ప్రతీఒక్కరికి ప్రోత్సాహం అవసరం. కాబట్టి మీటింగ్‌ అయిపోయిన తర్వాత ఇంకాస్త ఎక్కువసేపు ఉండి సహోదర సహోదరీలతో మాట్లాడవచ్చు, అది రాజ్యమందిరంలోనైనా, జూమ్‌లోనైనా. పెద్దలకు కూడా ప్రోత్సాహం అవసరం. అంటువ్యాధులు వ్యాపించినప్పుడు పెద్దలు ఇంతకుముందు కన్నా బిజీగా ఉంటారు. కాబట్టి కొంతమంది సహోదర సహోదరీలు వాళ్లకు థ్యాంక్యూ చెప్తూ మెసేజ్‌ గానీ, చిన్న కార్డు గానీ పంపించారు. “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ” ఉండడానికి మనలో ప్రతీఒక్కరం కృషి చేసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో కదా!—1 థెస్స. 5:11.

విపత్తు వచ్చినప్పుడు ఇతరులకు సహాయం చేయండి

7. విపత్తు వల్ల ఏం అవ్వవచ్చు?

7 విపత్తు వచ్చినప్పుడు ఒక్కసారిగా, రెప్పపాటులో జీవితం తలకిందులైపోవచ్చు. విపత్తు వల్ల మనకు ఇష్టమైనవాళ్లు చనిపోవచ్చు, మన ఇళ్లు-ఆస్తులు పాడైపోవచ్చు. యెహోవా సేవకులు కూడా వీటివల్ల బాధలు పడుతున్నారు. మరి మనం వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

8. విపత్తు రాకముందే సంఘ పెద్దలు, కుటుంబ పెద్దలు ఏం చేయవచ్చు?

8 పెద్దలు ఏం చేయవచ్చు? పెద్దలారా విపత్తు రాకముందే, దానికి సిద్ధపడేలా సహోదరులకు సహాయం చేయండి. సురక్షితంగా ఉండడానికి, పెద్దల్ని సంప్రదించడానికి ఏం చేయాలో సంఘంలో ప్రతీఒక్కరికి తెలిసేలా చూసుకోండి. ముందటి ఆర్టికల్‌లో చెప్పిన మార్గరెట్‌ ఇలా అంది: “మా సంఘంలోని పెద్దలు స్థానిక అవసరాలు భాగంలో మేము ఉంటున్న ప్రాంతంలోని అడవుల్లో కార్చిచ్చు రేగే అవకాశం ఇంకా ఉందని గుర్తుచేశారు. అధికారులు మా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని చెప్పినప్పుడు లేదా పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే ఇల్లు వదిలి వెళ్లిపోవాలని కూడా పెద్దలు గుర్తుచేశారు.” సరిగ్గా సరైన సమయంలో పెద్దలు ఆ నిర్దేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఐదు వారాల తర్వాత, ఆ ప్రాంతంలో పెద్ద కార్చిచ్చు రేగింది. విపత్తు వచ్చినప్పుడు ఇంట్లో ప్రతీఒక్కరు ఏం చేయాలో కుటుంబ పెద్దలు కుటుంబ ఆరాధనలో చర్చించవచ్చు. మీరు, మీ పిల్లలు ముందుగానే సిద్ధపడితే విపత్తు వచ్చినప్పుడు కంగారుపడకుండా, కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు.

9. విపత్తుకు ముందు, తర్వాత పెద్దలు ఏం చేయవచ్చు?

9 మీరు ఫీల్డ్‌ సర్వీస్‌ గ్రూపు ఓవర్‌సీర్‌ అయితే, మీ గ్రూపులో ఉన్నవాళ్లందరి ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌ తీసిపెట్టుకోండి. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండండి. అలా చేస్తే, విపత్తు వచ్చినప్పుడు వారిలో ప్రతీఒక్కరి బాగోగుల్ని, అవసరాల్ని వెంటనే కనుక్కోగలుగుతారు. ఆ వివరాల్ని వెంటనే మీ పెద్దల సభ కో-ఆర్డినేటర్‌కి చెప్పండి. ఆయన దాన్ని ప్రాంతీయ పర్యవేక్షకునికి తెలియజేస్తాడు. అలా అందరూ కలిసి పని చేయడం వల్ల సహోదరులకు చక్కగా సహాయం చేయగలుగుతారు. కార్చిచ్చు రేగిన తర్వాత మార్గరెట్‌ వాళ్ల ప్రాంతీయ పర్యవేక్షకుడు దాదాపు 36 గంటలపాటు నిద్రపోకుండా, పెద్దలతో కలిసి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాడు. ఇల్లు విడిచివెళ్లిన దాదాపు 450 మంది సహోదర సహోదరీల అవసరాలన్నీ ఆ పెద్దలు చూసుకోగలిగారు. (2 కొరిం. 11:27) దానివల్ల ఆ సహోదర సహోదరీలందరికీ ఉండడానికి ఒక చోటు దొరికింది.

10. పెద్దలు సహోదరుల్ని ప్రోత్సహిస్తూ, ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? (యోహాను 21:15)

10 సహోదర సహోదరీల్ని ప్రోత్సహించాల్సిన, ఆధ్యాత్మికంగా బలపర్చాల్సిన బాధ్యత పెద్దలకు ఉంది. (1 పేతు. 5:2) విపత్తు వచ్చినప్పుడు ప్రతీఒక్కరు సురక్షితంగా ఉన్నారో, లేదో పెద్దలు తెలుసుకోవాలి. అలాగే వాళ్లకు తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఏమైనా అవసరమో కనుక్కోవాలి. అయితే విపత్తు వచ్చిన చాలా నెలల తర్వాత కూడా వాళ్లను ప్రోత్సహిస్తూ, ఆధ్యాత్మికంగా బలపర్చాల్సిన అవసరం రావచ్చు. (యోహాను 21:15 చదవండి.) హెరాల్డ్‌ అనే బ్రాంచి కమిటీ సభ్యుడు, విపత్తు బారినపడిన ఎంతోమంది సహోదర సహోదరీల్ని కలిశాడు. ఆయన ఇలా అంటున్నాడు: “వాళ్లు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మారిన పరిస్థితులకు వాళ్లు అలవాటు పడుతుండవచ్చు. కానీ చనిపోయిన తమ ప్రియమైనవాళ్ల జ్ఞాపకాలు గుర్తుకొస్తుండవచ్చు. వాళ్లు కోల్పోయిన ఇల్లు-వస్తువులు కూడా గుర్తుకొస్తుండవచ్చు. అలాగే వాళ్లు ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితి పీడకలలా వాళ్లను వేధిస్తుండవచ్చు. ఆ జ్ఞాపకాలు వాళ్లను పదేపదే దుఃఖంలోకి నెట్టేయవచ్చు. అలా దుఃఖపడుతున్నంత మాత్రాన వాళ్ల విశ్వాసం తగ్గిపోయినట్టేమీ కాదు. అలా బాధపడడం సహజమే.”

11. విపత్తు వచ్చిన చాలా నెలల తర్వాత కూడా కుటుంబాలకు ఏ సహాయం అవసరం?

11 “ఏడ్చేవాళ్లతో ఏడ్వండి” అనే బైబిలు సలహాను పెద్దలు పాటిస్తారు. (రోమా. 12:15) యెహోవా, అలాగే సహోదర సహోదరీలు తమను ప్రేమిస్తున్నారనే భరోసాను, పెద్దలు విపత్తు బారినపడిన వాళ్లకు ఇవ్వాలి. ప్రార్థించడం, అధ్యయనం చేయడం, మీటింగ్స్‌కు హాజరవడం, ప్రకటనాపని చేయడం లాంటి వాటిలో కూడా కొనసాగేలా పెద్దలు కుటుంబాలకు సహాయం చేస్తారు. ఏ విపత్తూ యెహోవాతో మన స్నేహాన్ని పాడు చేయలేదు, ఆయన ఎప్పుడూ మనకు తోడుంటాడు అనే విషయాన్ని పిల్లలకు చెప్తూ ఉండమని పెద్దలు తల్లిదండ్రుల్ని ప్రోత్సహిస్తారు. కాబట్టి తల్లిదండ్రులారా ఆ విషయాన్ని మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండండి. అలాగే ఎంతో ప్రేమించే, సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే ప్రపంచవ్యాప్త సహోదర సహోదరీలు ఉన్నారని మీ పిల్లలకు వివరించండి.—1 పేతు. 2:17.

మీ ప్రాంతానికి దగ్గర్లో విపత్తు వచ్చినప్పుడు, సహాయం చేయడానికి మీరు ముందుకు వస్తారా? (12వ పేరా చూడండి) e

12. సంఘంలో ఉన్న ఇతరులు విపత్తు సహాయక పనుల్లో ఎలా సహాయం చేయవచ్చు? (చిత్రం చూడండి.)

12 సంఘంలో ఉన్న ఇతరులు ఏం చేయవచ్చు? మీ ప్రాంతానికి దగ్గర్లో విపత్తు వస్తే, మీరెలా సహాయం చేయవచ్చో పెద్దల్ని అడగండి. వీలైతే విపత్తు బారినపడిన వాళ్లను, అలాగే విపత్తు సహాయక పనుల్లో పాల్గొనడానికి వచ్చిన సహోదర సహోదరీల్ని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఆహారాన్ని, అవసరమైన వాటిని అందజేయవచ్చు. విపత్తు మీ దగ్గర్లో కాకుండా, ఇంకెక్కడో దూరంలో వస్తే మీరెలా సహాయం చేయవచ్చు? మీరు వాళ్ల కోసం ప్రార్థించవచ్చు. (2 కొరిం. 1:8-11) అలాగే ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు ఇవ్వడం ద్వారా కూడా విపత్తు సహాయక పనులకు మద్దతివ్వవచ్చు. (2 కొరిం. 8:2-5) ఒకవేళ మీరు విపత్తు వచ్చిన ప్రాంతానికి వెళ్లి సహాయం చేయాలనుకుంటే దానిగురించి మీ పెద్దలతో మాట్లాడి, అప్లికేషన్‌ నింపండి. ఒకవేళ అవకాశం వస్తే, మీకు మంచి శిక్షణ ఇచ్చి అవసరమైన చోటికి పంపిస్తారు.

హింసలు ఎదురైనప్పుడు సహోదరులకు సహాయం చేయండి

13. మన పనిపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో సహోదరులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు?

13 నిషేధం ఉన్న దేశాల్లో హింస వల్ల జీవితం చాలా కష్టంగా మారవచ్చు. అలాంటి దేశాల్లో ఉన్న సహోదరులకు, అందరికీ వచ్చే లాంటి సమస్యలు కూడా వస్తాయి. అంటే వాళ్లు కూడా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు, అనారోగ్యానికి గురౌతారు, వాళ్లకు ఇష్టమైనవాళ్లు చనిపోతారు. కానీ నిషేధం వల్ల, పెద్దలు ప్రోత్సాహం అవసరమైన సహోదర సహోదరీల ఇంటికి స్వేచ్ఛగా వెళ్లలేరు, వాళ్లతో మాట్లాడలేరు. ముందటి ఆర్టికల్‌లో చెప్పిన సహోదరుడు ఆండ్రేకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయన ఫీల్డ్‌ సర్వీస్‌ గ్రూపులో ఒక సహోదరి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. దానికి తోడు ఆమెకు యాక్సిడెంట్‌ అయ్యింది. అప్పుడు ఆమెకు చాలా సర్జరీలు చేయాల్సి వచ్చింది. దానివల్ల ఆమె ఉద్యోగానికి వెళ్లలేకపోయింది. అయితే యెహోవాకు ఆమె పరిస్థితి తెలుసు, ఆమెకు సహాయం చేయడానికి ఆయన తన సేవకుల్ని ఉపయోగించాడు. నిషేధం ఉన్నా, కోవిడ్‌ ఉన్నా సహోదర సహోదరీలు ఆమెకు సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేశారు.

14. పెద్దలు ఎలా యెహోవా మీద ఆధారపడవచ్చు?

14 పెద్దలు ఏం చేయవచ్చు? ఆండ్రే యెహోవాకు ప్రార్థించాడు, చేయగలిగింది చేశాడు. మరి యెహోవా ఎలా సహాయం చేశాడు? కాస్త ఎక్కువ స్వేచ్ఛ ఉన్న తోటి విశ్వాసుల్ని, ఆమెకు సహాయం చేసేలా కదిలించాడు. కొంతమంది ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇంకొంతమంది ఆమెకు కావల్సిన డబ్బులు ఇచ్చారు. అలా వాళ్లు కలిసికట్టుగా, ధైర్యంగా చేసిన ప్రయత్నాల్ని యెహోవా దీవించాడు. (హెబ్రీ. 13:16) పెద్దలారా, మన పనిపై నిషేధం ఉన్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోండి. (యిర్మీ. 36:5, 6) అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాపై ఆధారపడండి. సహోదర సహోదరీల బాగోగులు చూసుకునేలా ఆయన మీకు సహాయం చేస్తాడు.

15. హింస ఎదురైనప్పుడు మన క్రైస్తవ ఐక్యతను ఎలా కాపాడుకోవచ్చు?

15 సంఘంలో ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు? మన పనిపై నిషేధం ఉన్నప్పుడు మనం చిన్నచిన్న గుంపులుగా కలుసుకోవాల్సి రావచ్చు. కాబట్టి మనం సహోదర సహోదరీలతో శాంతిగా ఉండడం, ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా ప్రాముఖ్యం. మనం పోరాడాల్సింది సాతానుతో, సహోదర సహోదరీలతో కాదు. సహోదరులు చేసే చిన్నచిన్న పొరపాట్లను పట్టించుకోకండి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోండి. (సామె. 19:11; ఎఫె. 4:26) ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండండి. (తీతు 3:14) పై పేరాల్లోని సహోదరికి సహాయం చేయడానికి తోటి క్రైస్తవులు చేసిన ప్రయత్నాల వల్ల, ఆ గ్రూపులో ఉన్న వాళ్లందరూ ప్రయోజనం పొందారు. ఒక కుటుంబంలా, వాళ్లు ఒకరికొకరు ఇంకా దగ్గరయ్యారు.—కీర్త. 133:1.

16. కొలొస్సయులు 4:3, 18 ప్రకారం, హింసలు ఎదుర్కొంటున్న సహోదర సహోదరీలకు మనం ఎలా సహాయం చేయవచ్చు?

16 ప్రభుత్వ నిషేధం ఉన్నా, ఎన్నో వేలమంది సహోదర సహోదరీలు యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతున్నారు. వాళ్లలో కొంతమంది తమ విశ్వాసం కారణంగా జైలుకు వెళ్లారు. వాళ్ల కోసం, వాళ్ల కుటుంబాల కోసం మనం ప్రార్థించవచ్చు. అలాగే వాళ్లకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, న్యాయపరంగా సహాయం చేయడానికి తమ స్వేచ్ఛను సైతం పణంగా పెట్టి ముందుకు వస్తున్న సహోదర సహోదరీల కోసం కూడా మనం ప్రార్థించవచ్చు. c (కొలొస్సయులు 4:3, 18 చదవండి.) మీ ప్రార్థనలు ఆ సహోదర సహోదరీలకు ఎంతో సహాయం చేస్తాయనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకండి.—2 థెస్స. 3:1, 2; 1 తిమో. 2:1, 2.

హింసను ఎదుర్కోడానికి మీ కుటుంబాన్ని ఇప్పుడే ఎలా సిద్ధం చేయవచ్చు? (17వ పేరా చూడండి)

17. హింసను ఎదుర్కోడానికి మీరు ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు?

17 హింసను ఎదుర్కోడానికి మీరు, మీ కుటుంబం ఇప్పుడే సిద్ధపడండి. (అపొ. 14:22) ‘అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో’ అని అతిగా ఆందోళనపడకండి. బదులుగా యెహోవాతో మీకున్న స్నేహాన్ని ఇంకా పెంచుకోండి. అలా పెంచుకునేలా మీ పిల్లలకు కూడా సహాయం చేయండి. మీకు ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ప్రార్థనలో యెహోవా ముందు మీ హృదయాన్ని కుమ్మరించండి. (కీర్త. 62:7, 8) కుటుంబమంతా కలిసి, యెహోవా మీద నమ్మకం ఉంచడానికి గల కారణాలన్నీ చర్చించండి. d మీరు యెహోవా మీద నమ్మకం ఉంచుతూ ముందే సిద్ధపడడాన్ని చూసి మీ పిల్లలు కూడా ధైర్యంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.

18. భవిష్యత్తులో మనం ఏ గొప్ప బహుమతిని పొందుతాం?

18 దేవుని శాంతి మన హృదయాలకు, మనసులకు కాపలా ఉంటుంది. (ఫిలి. 4:6, 7) అంటువ్యాధులు, విపత్తు, హింస వచ్చినా ప్రశాంతంగా ఉండేలా యెహోవా ఇచ్చే శాంతి మనకు సహాయం చేస్తుంది. కష్టపడి పనిచేసే పెద్దల ద్వారా యెహోవా మనల్ని శ్రద్ధగా చూసుకుంటాడు. అలాగే ఇతరులకు సహాయం చేసే గొప్ప అవకాశాన్ని ఆయన మనందరికీ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఆనందిస్తున్న ఈ శాంతి భవిష్యత్తులో వచ్చే పెద్ద కష్టాల్ని, చివరికి ‘మహాశ్రమను’ కూడా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. (మత్త. 24:21) ఆ సమయంలో మనం ఒకరితోఒకరం శాంతిగా ఉండాలి, అలా ఉండేలా ఇతరులకు సహాయం చేయాలి. మహాశ్రమ ముగిసిన తర్వాత ఇక మనల్ని ఆందోళనకు గురిచేసే ఏ కష్టాలూ ఉండవు. అప్పుడు యెహోవా మనకు ఇవ్వాలనుకుంటున్న గొప్ప బహుమతిని, అంటే ఎల్లప్పుడూ ఉండే నిజమైన శాంతిని పొందుతాం.—యెష. 26:3, 4.

పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి

a కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి యెహోవా తరచూ తన సేవకుల్ని ఉపయోగించుకుంటాడు. మీ సహోదర సహోదరీల్ని ప్రోత్సహించడానికి ఆయన మిమ్మల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇతరులకు మనం ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

b కొన్ని అసలు పేర్లు కావు.

c మీరు రాసిన ఉత్తరాల్ని, జైల్లో ఉన్న సహోదరులకు పంపించే పనిని బ్రాంచి కార్యాలయం గానీ ప్రపంచ ప్రధాన కార్యాలయం గానీ చేయదని గుర్తుంచుకోండి.

d 2019, జూలై, కావలికోట పత్రికలో “హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే సిద్ధపడండి” అనే ఆర్టికల్‌ చూడండి.

e చిత్రాల వివరణ: విపత్తు తర్వాత టెంట్‌లో ఉంటున్న ఒక కుటుంబానికి ఒక జంట ఆహారాన్ని, నీళ్లను తీసుకొచ్చింది.