అధ్యయన ఆర్టికల్ 51
కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రశాంతంగా ఉండవచ్చు
“ఆందోళన పడకండి, భయపడకండి.”—యోహా. 14:27.
పాట 112 యెహోవా, శాంతికి మూలం
ఈ ఆర్టికల్‌లో. . . a
1. “దేవుని శాంతి” అంటే ఏంటి? అది మనకు ఎలా సహాయం చేస్తుంది? (ఫిలిప్పీయులు 4:6, 7)
“దేవుని శాంతి” గురించి ఈ లోకంలోని వాళ్లకు తెలీదు. “దేవుని శాంతి” అంటే, మన పరలోక తండ్రితో దగ్గరి సంబంధం కలిగి ఉండడం వల్ల పొందే ప్రశాంతత. దాన్ని పొందినప్పుడు మనకు సురక్షితంగా ఉన్నట్టు అనిపిస్తుంది. (ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.) “శాంతికి మూలమైన” దేవునితో, ఆయన్ని ప్రేమించే వాళ్లతో స్నేహాన్ని మనం ఆనందిస్తాం. (1 థెస్స. 5:23) మన పరలోక తండ్రిని తెలుసుకుని, ఆయన్ని నమ్మి, లోబడినప్పుడు కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండేలా దేవుని శాంతి సహాయం చేస్తుంది.
2. కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని శాంతిని అనుభవించడం సాధ్యమే అని ఎందుకు చెప్పవచ్చు?
2 అంటువ్యాధులు వ్యాపించినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, దేశంలో అల్లర్లు జరిగినప్పుడు లేదా హింస ఎదురైనప్పుడు దేవుని శాంతిని అనుభవించడం సాధ్యమేనా? ఇలాంటి ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనకు చాలా భయంగా అనిపించవచ్చు. కానీ యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “ఆందోళన పడకండి, భయపడకండి.” (యోహా. 14:27) మంచి విషయం ఏంటంటే, మన సహోదర సహోదరీలు యేసు సలహాను పాటిస్తున్నారు. యెహోవా సహాయంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు.
అంటువ్యాధులు వ్యాపిస్తున్నా ప్రశాంతంగా ఉండవచ్చు
3. అంటువ్యాధులు వ్యాపించినప్పుడు ఏం జరగవచ్చు?
3 అంటువ్యాధులు వ్యాపించినప్పుడు, జీవితం ఒక్కసారిగా తలకిందులు అవ్వవచ్చు. ఉదాహరణకు కోవిడ్ వల్ల ఏం జరిగిందో ఆలోచించండి. ఆ సమయంలో చేసిన ఒక సర్వేలో, సగం కంటే ఎక్కువ మంది రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోలేకపోయామని చెప్పారు. ఆ సమయంలో ప్రజల్లో ఆందోళన, కృంగుదల ఉన్నట్టుండి ఎక్కువైపోయాయి, మందు-మత్తు పదార్థాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది, అలాగే గృహహింస, ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువయ్యాయి. మీ ప్రాంతంలో అంటువ్యాధులు వ్యాపించినప్పుడు, ఆందోళన పడకుండా దేవుని శాంతిని ఎలా అనుభవించవచ్చు?
4. చివరి రోజుల గురించి యేసు చెప్పిన విషయాల్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?
4 చివరి రోజుల్లో “ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో” పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయని యేసు ముందే చెప్పాడు. (లూకా 21:11) దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? అంటువ్యాధులు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోం. బదులుగా ఇప్పుడు పరిస్థితులు యేసు చెప్పినట్టే ఉన్నాయని అర్థం చేసుకుంటాం. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ సలహా పాటించాలని కోరుకుంటాం: “మీరు కంగారుపడకుండా చూసుకోండి.”—మత్త. 24:6.
5. (ఎ) ఫిలిప్పీయులు 4:8, 9 ప్రకారం, అంటువ్యాధులు వ్యాపించినప్పుడు మనం ఏమని ప్రార్థించవచ్చు? (బి) బైబిలు ఆడియో రికార్డింగ్‌లు వినడంవల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?
5 అంటువ్యాధులు వ్యాపించినప్పుడు అంతా గందరగోళంగా, చాలా భయంగా అనిపించవచ్చు. డేజీ b అనే సహోదరి విషయంలో కూడా అదే జరిగింది. కోవిడ్ వల్ల ఆమె బాబాయ్, పెదనాన్న కొడుకు, అలాగే వాళ్ల డాక్టర్ చనిపోయారు. ఆ వైరస్ తనకు కూడా సోకుతుందేమో, తన నుండి ముసలితనంలో ఉన్న తన తల్లికి కూడా సోకుతుందేమో అని ఆమె భయపడింది. దానికితోడు, ‘ఈ కోవిడ్ సమయంలో ఉద్యోగం పోతే ఎలా? ఇంటి ఖర్చులు ఎలా చూసుకోవాలి?’ అని ఆలోచిస్తూ ఆందోళనపడింది. దానివల్ల ఆమె రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోలేకపోయింది. కానీ డేజీ తాను కోల్పోయిన ప్రశాంతతను తిరిగి పొందింది. ఎలా? కంగారుపడకుండా, మంచి విషయాల గురించి ఆలోచించేలా సహాయం చేయమని ఆమె యెహోవాకు ప్రార్థించింది. (ఫిలిప్పీయులు 4:8, 9 చదవండి.) బైబిలు ఆడియో రికార్డింగ్‌లు వింటూ యెహోవా చెప్పేది వినింది. ఆమె ఇలా అంది: “ఆ రికార్డింగులలో బైబిలు వచనాల్ని ఎంత ప్రశాంతమైన స్వరంతో చదివారంటే, అవి విన్నప్పుడు నా ఆందోళన తగ్గిపోయింది. యెహోవా నన్ను పట్టించుకుంటున్నాడనే నమ్మకం పెరిగింది.”—కీర్త. 94:19.
6. వ్యక్తిగత అధ్యయనం, మీటింగ్స్ మనకు ఎలా సహాయం చేస్తాయి?
6 అంటువ్యాధులు వ్యాపించినప్పుడు, మనం ఇంతకుముందు చేసిన కొన్ని పనులు చేయడం కుదరకపోవచ్చు. కానీ వ్యక్తిగత అధ్యయనం, మీటింగ్స్‌కి హాజరవ్వడం వంటివి ఆగిపోకుండా చూసుకోండి. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మన తోటి సహోదర సహోదరీలు యెహోవాను ఎలా నమ్మకంగా సేవిస్తున్నారో తెలిపే ప్రచురణల్ని, వీడియోల్ని మీ వ్యక్తిగత అధ్యయనంలో పరిశీలించవచ్చు. (1 పేతు. 5:9) మీ మనసును బైబిల్లో ఉన్న మంచి విషయాలతో నింపుకోవడానికి మీటింగ్స్ సహాయం చేస్తాయి. మీటింగ్స్‌కి హాజరవ్వడం వల్ల ఒకరినొకరం ప్రోత్సహించుకోవచ్చు. (రోమా. 1:11, 12) అనారోగ్యంతో, భయంతో, ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లకు యెహోవా ఎలా సహాయం చేశాడో ఆలోచించినప్పుడు మీ విశ్వాసం బలపడుతుంది. ఆయన మీకు కూడా సహాయం చేస్తాడనే నమ్మకం పెరుగుతుంది.
7. అపొస్తలుడైన యోహాను నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
7 సహోదర సహోదరీలతో మాట్లాడడానికి ప్రయత్నించండి. అంటువ్యాధులు వచ్చినప్పుడు మన తోటి ఆరాధకులకు కూడా దూరంగా ఉండాల్సి రావచ్చు. అలాంటి సమయంలో, మీకు కూడా అపొస్తలుడైన యోహానులాగే అనిపించవచ్చు. ఆయన తన స్నేహితుడైన గాయియును నేరుగా కలవాలని అనుకున్నాడు. (3 యోహా. 13, 14) కానీ అలా కలవడం కుదరదని తెలిసినప్పుడు ఆయన ఏం చేయగలడో అది చేశాడు, అతనికి ఉత్తరం రాశాడు. మీ సహోదర సహోదరీల్ని నేరుగా కలవడం వీలుకానప్పుడు వాళ్లకు ఫోన్ చేయండి, వీడియో కాల్ చేయండి, మెసేజ్‌లు పంపించండి. అలా వాళ్లతో మాట్లాడుతుంటే మీలో ఒంటరితనం తగ్గిపోయి, మరింత ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీకు బాగా ఆందోళనగా ఉంటే ఆ విషయాన్ని పెద్దలకు చెప్పండి. ప్రేమతో వాళ్లిచ్చే ప్రోత్సాహాన్ని తీసుకోండి.—యెష. 32:1, 2.
విపత్తు వచ్చినా ప్రశాంతంగా ఉండవచ్చు
8. విపత్తు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించవచ్చు?
8 వరదలు, భూకంపం, అగ్నిప్రమాదం లాంటివి మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అయితే అది జరిగిన చాలా రోజుల తర్వాత కూడా మీరు తీవ్రంగా ఆందోళనపడి ఉండవచ్చు. ఆ విపత్తుల వల్ల మీకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోతే లేదా మీ ఇళ్లు గానీ, వస్తువులు గానీ పాడైతే మీరు దుఃఖంలో, నిరాశలో మునిగిపోయి ఉండవచ్చు. లేదా మీకు కోపం వచ్చి ఉండవచ్చు. అలా అనిపించినంత మాత్రాన మీరు వస్తువుల్ని ప్రేమిస్తున్నట్టు, విశ్వాసాన్ని కోల్పోయినట్టు కాదు. నిజానికి మీకొక పెద్ద కష్టం వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో మీరు కోపంలో ఏదో అనేస్తారని లేదా చేసేస్తారని కొంతమంది అనుకోవచ్చు. (యోబు 1:11) కానీ అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. ఎలా?
9. విపత్తుల గురించి యేసు ముందే ఏమని చెప్పాడు?
9 యేసు చెప్పిన మాటల్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో కొంతమంది విపత్తులు రావని, వాటివల్ల తమకు ఏం కాదని అనుకోవచ్చు. కానీ ముందుముందు విపత్తులు ఇంకా ఎక్కువౌతాయని, మనం కూడా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుందని మనకు తెలుసు. ఎందుకంటే, అంతం వచ్చేముందు “తీవ్రమైన భూకంపాలు,” ఇతర విపత్తులు వస్తాయని యేసు ముందే చెప్పాడు. (లూకా 21:11) ‘చెడుతనం పెరిగిపోతుంది’ అని కూడా ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే నేడు లోకంలో నేరాలు, హింస, తీవ్రవాద దాడులు ఎక్కువైపోయాయి. (మత్త. 24:12) ఈ విపత్తులు యెహోవా సేవకులుకాని వాళ్ల మీదకే వస్తాయని యేసు ఎన్నడూ అనలేదు. నిజానికి విపత్తులవల్ల ఎంతోమంది యెహోవా సేవకులు నష్టపోయారు. (యెష. 57:1; 2 కొరిం. 11:25) యెహోవా మనల్ని అద్భుతరీతిలో విపత్తుల నుండి కాపాడకపోవచ్చు, కానీ అవి వచ్చినా కంగారుపడకుండా ప్రశాంతంగా ఉండేలా సహాయం చేస్తాడు.
10. విపత్తు కోసం ఇప్పుడే సిద్ధపడుతున్నామంటే, మనకు విశ్వాసం ఉన్నట్టే అని ఎందుకు చెప్పవచ్చు? (సామెతలు 22:3)
10 విపత్తులు వస్తాయని తెలుసుకుని వాటికి ముందే సిద్ధపడి ఉండడం ద్వారా మనం ప్రశాంతంగా ఉండవచ్చు. మరి అలా సిద్ధపడుతున్నామంటే, మనకు యెహోవా మీద విశ్వాసం లేదనా? కానేకాదు. నిజానికి విపత్తుల కోసం సిద్ధపడుతున్నామంటే, యెహోవా మన బాగోగుల్ని చూసుకుంటున్నాడని నమ్ముతున్నట్టు. అదెలా? విపత్తుల కోసం ముందే సిద్ధపడమని దేవుని వాక్యం మనకు చెప్తుంది. (సామెతలు 22:3 చదవండి.) పత్రికలు, మీటింగ్స్, ప్రకటనల ద్వారా అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధపడమని దేవుని సంస్థ మనకు పదేపదే చెప్తుంది. c మనకు యెహోవా మీద నమ్మకం ఉంటే, ఆ సలహాల్ని ఇప్పుడే, అంటే విపత్తు రాకముందే పాటిస్తాం.
11. మార్గరెట్ అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
11 మార్గరెట్ అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె ఉంటున్న ప్రాంతంలోని అడవుల్లో కార్చిచ్చు రగులుకుంది. దాంతో ప్రభుత్వం అక్కడున్న వాళ్లందర్నీ ఆ ప్రాంతం నుండి వెళ్లిపోమని హెచ్చరించింది. అప్పుడు అందరూ తమ కార్లతో రోడ్ల మీదికి రావడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. పొగ దట్టంగా కమ్మేయడంతో మార్గరెట్ తన కారులో నుండి బయటికి రాలేకపోయింది. అయితే ఆమె ముందుగానే సిద్ధపడడంవల్ల ఆ ప్రమాదాన్ని తప్పించుకుంది. ఆ ప్రాంతం నుండి బయటికి వెళ్లడానికి ఉన్న ఇంకో దారిని చూపించే మ్యాపును ఆమె తన పర్సులో పెట్టుకుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కంగారుపడకుండా వెళ్లేలా ఆమె ఇదివరకే ఆ దారిలో ఒకసారి వెళ్లి వచ్చింది. అలా ముందే సిద్ధపడడం వల్ల ఆమె క్షేమంగా బయటపడింది.
12. మనం సురక్షితంగా ఉండడానికి ఇచ్చే నిర్దేశాల్ని ఎందుకు పాటించాలి?
12 మనం సురక్షితంగా ఉండడం కోసం కొన్నిసార్లు అధికారులు కర్ఫ్యూ విధించవచ్చు లేదా మన ప్రాంతాన్ని విడిచి వెళ్లమని చెప్పవచ్చు లేదా వేరే నిర్దేశాలు ఇవ్వవచ్చు. తమ ఆస్తుల్ని, వస్తువుల్ని విడిచి రావడం ఇష్టంలేక కొంతమంది ఆ నిర్దేశాల్ని వెంటనే పాటించరు. మరి అలాంటి సందర్భాల్లో క్రైస్తవులు ఏం చేస్తారు? బైబిలు ఇలా చెప్తుంది: “మనుషులు స్థాపించిన ప్రతీ అధికారానికి ప్రభువును బట్టి లోబడివుండండి. మీ మీద అధికారిగా ఉన్నందుకు రాజుకు లోబడివుండండి. అలాగే అధిపతులకు కూడా లోబడివుండండి.” (1 పేతు. 2:13, 14) మనం సురక్షితంగా ఉండడం కోసం కావల్సిన నిర్దేశాల్ని దేవుని సంస్థ కూడా ఇస్తుంది. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పెద్దలు మిమ్మల్ని కలిసేలా లేదా మీతో మాట్లాడేలా, మీ ఫోన్ నెంబరు గానీ అడ్రస్ గానీ మారితే వెంటనే ఆ వివరాల్ని వాళ్లకు తెలియజేయమని సంస్థ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తోంది. మరి పెద్దలకు మీరు ఆ వివరాలు ఇచ్చారా? అంతేకాదు ఇంట్లోనే ఉండిపోవడం, సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం, విపత్తు సమయంలో అవసరమైన వాటిని పొందడం, ఇతరులకు సహాయం చేయడం వంటివాటికి సంబంధించి కూడా మనకు నిర్దేశాలు అందవచ్చు. ఒకవేళ మనం ఆ నిర్దేశాలు పాటించకపోతే మన ప్రాణాలు, అలాగే పెద్దల ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. ఈ ప్రేమగల పెద్దలు మీ ప్రాణాలకు కాపలాగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. (హెబ్రీ. 13:17) పై పేరాలో చెప్పిన మార్గరెట్ ఇలా అంటుంది: “పెద్దలు, అలాగే సంస్థ ఇచ్చిన నిర్దేశాల్ని పాటించడం వల్లే నా ప్రాణాల్ని కాపాడుకున్నాను అని బలంగా నమ్ముతున్నాను.”
13. విపత్తుల వల్ల తమ ఇంటిని విడిచి వెళ్లిపోయిన క్రైస్తవులు తమ సంతోషాన్ని, ప్రశాంతతను ఎలా కాపాడుకున్నారు?
13 విపత్తుల వల్ల, యుద్ధం వల్ల లేదా దేశంలో జరిగిన అల్లర్ల వల్ల కొంతమంది సహోదర సహోదరీలు తమ ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అయినా ఆ కొత్త పరిస్థితికి అలవాటుపడడానికి, ఆరాధనకు సంబంధించిన పనుల్ని తిరిగి మొదలుపెట్టడానికి వాళ్లు చేయగలిగినదంతా చేశారు. హింస వల్ల చెదిరిపోయిన మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే, వాళ్లు కూడా “మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.” (అపొ. 8:4) ప్రకటనాపని వల్ల వాళ్లు తమ కష్టాల మీద కాకుండా, దేవుని రాజ్యం మీదే మనసుపెట్టగలిగారు. అలా వాళ్లు తమ సంతోషాన్ని, ప్రశాంతతను కాపాడుకున్నారు.
హింసలు ఎదురైనా ప్రశాంతంగా ఉండవచ్చు
14. హింస ఎదురైనప్పుడు ఏం జరిగే అవకాశముంది?
14 హింసలు ఎదురైనప్పుడు మన ప్రశాంతతను పోగొట్టుకునే అవకాశముంది. అరెస్టు చేస్తారనే భయం లేకుండా అందర్నీ చక్కగా కలుస్తూ, స్వేచ్ఛగా ప్రకటిస్తూ, రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. కానీ ఆ పనుల్ని చేసుకునే స్వేచ్ఛను కోల్పోతే, ఎప్పుడు ఏమవుతుందో అని మనకు ఆందోళనగా, భయంగా అనిపించవచ్చు. అది సహజమే. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హింస వల్ల కొంతమంది విశ్వాసంలో తడబడతారని యేసు ముందే చెప్పాడు. (యోహా. 16:1, 2) మరి హింసలు వచ్చినా మనం ప్రశాంతంగా ఎలా ఉండవచ్చు?
15. మనం హింసకు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? (యోహాను 15:20; 16:33)
15 బైబిలు ఇలా చెప్తుంది: “క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.” (2 తిమో. 3:12) ఆ విషయాన్ని అంగీకరించడం ఆండ్రే అనే సహోదరునికి కష్టంగా అనిపించింది. ప్రభుత్వం వాళ్ల దేశంలో మన పనిని నిషేధించింది. ‘దేశంలో ఇంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు కదా, అధికారులు అందర్నీ అరెస్టు చేయలేరు లే’ అని ఆయన అనుకున్నాడు. అయితే ఆ ఆలోచన ఆయనకు ప్రశాంతతను ఇవ్వలేదు గానీ ఆందోళనను పెంచింది. కానీ మిగతా సహోదరులు యెహోవా మీద నమ్మకముంచారు, ఏదోకరోజు తాము కూడా అరెస్టు అయ్యే అవకాశముందని అర్థం చేసుకున్నారు. వాళ్లు ఆండ్రే అంత ఆందోళనపడలేదు. అది చూసి, ఆండ్రే కూడా యెహోవా మీద నమ్మకముంచి వాళ్లలాగే ఆలోచించడం మొదలుపెట్టాడు. దానివల్ల ఆయనకు ప్రశాంతంగా అనిపించింది. ఎన్నో సవాళ్లు ఉన్నా, ఇప్పుడు ఆయన సంతోషంగా ఉంటున్నాడు. హింసలు వచ్చినప్పుడు మనం కూడా అలా ఉండవచ్చు. మనకు హింసలు వస్తాయని యేసు చెప్పాడు. అయితే మనం విశ్వాసంలో స్థిరంగా ఉండగలమని కూడా ఆయన ధైర్యం చెప్పాడు.—యోహాను 15:20; 16:33 చదవండి.
16. హింస ఎదురైనప్పుడు మనం ఏ నిర్దేశాల్ని పాటించాలి?
16 ప్రభుత్వం మన పనిని నిషేధించినప్పుడు లేదా మన పని విషయంలో హద్దులు పెట్టినప్పుడు బ్రాంచి కార్యాలయం నుండి, పెద్దల నుండి మనకు కొన్ని నిర్దేశాలు అందవచ్చు. మనల్ని కాపాడడానికి, ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా పొందడానికి, వీలైనంతవరకు పరిచర్యలో కొనసాగడానికి ఆ నిర్దేశాలు ఇస్తారు. అవి మీకు పూర్తిగా అర్థంకాకపోయినా, వాటికి లోబడడానికి కృషిచేయండి. (యాకో. 3:17) సహోదర సహోదరీలకు అలాగే సంఘ పనులకు సంబంధించిన సమాచారాన్ని వేరేవాళ్లకు చెప్పకండి.—ప్రసం. 3:7.
17. మొదటి శతాబ్దంలోని అపొస్తలుల్లాగే మనం కూడా ఏమని నిర్ణయించుకోవాలి?
17 సాతాను దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి ఒక కారణం, మనం ‘యేసు గురించి సాక్ష్యమివ్వడం.’ (ప్రక. 12:17) సాతానును, అతని లోకాన్ని చూసి భయపడిపోకండి. వ్యతిరేకత ఉన్నా ప్రకటించే, బోధించే పనిలో కొనసాగుతూ ఉంటే మనం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాం. మొదటి శతాబ్దంలో యూదా అధికారులు ప్రకటించడం ఆపేయమని అపొస్తలులకు చెప్పినప్పుడు, ఆ నమ్మకమైన క్రైస్తవులు దేవునికే లోబడాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు మానకుండా ప్రకటిస్తూ సంతోషంగా ఉన్నారు. (అపొ. 5:27-29, 41, 42) అయితే మన పని విషయంలో ప్రభుత్వం హద్దులు పెట్టినప్పుడు మనం జాగ్రత్తగా ప్రకటించాలి. (మత్త. 10:16) ఈ పనిలో చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవాను సంతోషపెడుతున్నాం, జీవాన్నిచ్చే సందేశాన్ని ప్రకటిస్తున్నాం అనే సంతోషంతో ప్రశాంతంగా ఉంటాం.
“శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు”
18. కష్టమైన సమయాల్లో మనకు ఏది అవసరం?
18 ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రశాంతంగా ఉండగలమనే ధైర్యంతో ఉండండి. అలాంటి సమయాల్లో మనకు అవసరమయ్యేది యెహోవా ఇచ్చే శాంతి. అంటువ్యాధులు వ్యాపించినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు లేదా హింస ఎదురైనప్పుడు యెహోవా సహాయం తీసుకోండి. ఆయన సంస్థను అంటిపెట్టుకుని ఉండండి. మీరు పొందబోయే అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తూ ఉండండి. అప్పుడు, “శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.” (ఫిలి. 4:9) దేవుని శాంతిని అనుభవించేలా, కష్టాల్లో ఉన్న తోటి క్రైస్తవులకు ఎలా సహాయం చేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.
పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు
a తనను ప్రేమించేవాళ్లకు శాంతిని లేదా ప్రశాంతతను ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు. దేవుడిచ్చే శాంతి అంటే ఏంటి? దాన్ని మనం ఎలా పొందవచ్చు? అంటువ్యాధులు వ్యాపిస్తున్నప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, హింస ఎదురైనప్పుడు “దేవుని శాంతి” మనకు ఎలా సహాయం చేస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబుల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
b కొన్ని అసలు పేర్లు కావు.
c 2017 తేజరిల్లు! నం. 5 (ఇంగ్లీష్) పత్రికలో “విపత్తులు వచ్చినప్పుడు మన ప్రాణాల్ని కాపాడుకోవడానికి చేయాల్సిన పనులు” అనే ఆర్టికల్ చూడండి.