కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 50

“నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు”

“నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు”

“ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు.”లూకా 23:43.

పాట 145 పరదైసు—దేవుని వాగ్దానం

ఈ ఆర్టికల్‌లో. . . a

1. యేసు చనిపోకముందు, తన పక్కన ఉన్న ఒక నేరస్తునితో ఏమని చెప్పాడు? (లూకా 23:39-43)

 యేసు, ఇద్దరు నేరస్తులు హింసాకొయ్య మీద వేలాడుతున్నారు, వాళ్లు చనిపోయే స్థితిలో ఉన్నారు. (లూకా 23:32, 33) ఆ ఇద్దరు నేరస్తులు యేసును నిందిస్తున్నారు, కాబట్టి వాళ్లు ఆయన శిష్యులైతే కాదు. (మత్త. 27:44; మార్కు 15:32) కానీ ఒకతను తన మనసు మార్చుకున్నాడు. అతను ఇలా అన్నాడు: “యేసూ, నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు నన్ను గుర్తుచేసుకో.” అప్పుడు యేసు అతనితో, “ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” అన్నాడు. (లూకా 23:39-43 చదవండి.) యేసు పరలోక రాజ్యం గురించి తన పరిచర్యలో ప్రకటించినప్పుడు, ఈ నేరస్తుడు దాని గురించి విన్నాడని గానీ, ఆ సందేశాన్ని అంగీకరించాడని గానీ బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. అంతేకాదు, ఆ నేరస్తుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని కూడా యేసు చెప్పలేదు. (మత్త. 4:17) యేసు ఇక్కడ, భూమ్మీదికి రాబోయే పరదైసు గురించి మాట్లాడుతున్నాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చు?

యేసుతో మాట్లాడిన నేరస్తుడు ఎవరై ఉంటాడు? అతనికి ఏ విషయాలు తెలిసుండవచ్చు? (2-3 పేరాలు చూడండి)

2. మనసు మార్చుకున్న నేరస్తుడు ఒక యూదుడు అని ఎందుకు చెప్పవచ్చు?

2 మనసు మార్చుకున్న నేరస్తుడు బహుశా ఒక యూదుడు అయ్యుంటాడు. అతను తనతోపాటు ఉన్న మరో నేరస్తునితో ఇలా అన్నాడు: “నువ్వు దేవునికి ఏమాత్రం భయపడవా? నీకూ అదే శిక్ష పడింది కదా?” (లూకా 23:40) యూదులు ఒక్క దేవున్నే ఆరాధించే వాళ్లు. అయితే వేరే దేశాలవాళ్లు చాలామంది దేవుళ్లను ఆరాధించే వాళ్లు. (నిర్గ. 20:2, 3; 1 కొరిం. 8:5, 6) ఒకవేళ ఆ నేరస్తులిద్దరూ వేరే దేశాలకు చెందిన వాళ్లయితే అతను, “నువ్వు దేవుళ్లకు ఏమాత్రం భయపడవా?” అని అడిగి ఉండేవాడు. అంతేకాదు, సాధారణంగా యేసు యూదులుకాని వాళ్లకు ప్రకటించలేదు. ఎందుకంటే, యేసు “ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ల దగ్గరికి” పంపించబడ్డాడే గానీ, వేరే దేశాల ప్రజల దగ్గరికి పంపించబడలేదు. (మత్త. 15:24) చనిపోయిన వాళ్లను తిరిగి బ్రతికిస్తానని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, ఈ నేరస్తునికి ఆ విషయం గురించి తెలిసే ఉంటుంది. అందుకే యెహోవా యేసును తిరిగి బ్రతికిస్తాడని, దేవుని రాజ్యంలో పరిపాలించే అధికారాన్ని ఇస్తాడని అతను అనుకున్నాడు. అందుకే తనను కూడా దేవుడు తిరిగి బ్రతికిస్తాడని నమ్మాడు.

3. యేసు “పరదైసు” అన్నప్పుడు, ఆ నేరస్తుడు ఏం అర్థం చేసుకుని ఉంటాడు? వివరించండి. (ఆదికాండం 2:15)

3 యూదుడైన ఆ నేరస్తునికి ఆదాముహవ్వల గురించి, యెహోవా వాళ్లకు ఇచ్చిన పరదైసు లాంటి ఏదెను తోట గురించి తెలిసే ఉంటుంది. కాబట్టి యేసు “పరదైసు” అన్నప్పుడు, భూమ్మీద ఉండే ఒక అందమైన తోట గురించి చెప్తున్నాడని అతను అర్థం చేసుకుని ఉంటాడు.—ఆదికాండం 2:15 చదవండి.

4. యేసు ఆ నేరస్తునితో అన్న మాటల్ని చదివినప్పుడు మనం దేని గురించి ఆలోచించవచ్చు?

4 ఆ నేరస్తునితో యేసు అన్న మాటల్ని చదివినప్పుడు, పరదైసు జీవితం గురించి మనం ఆలోచించవచ్చు. పరదైసు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, రాజైన సొలొమోను పరిపాలన గురించి మనం పరిశీలించవచ్చు. ఆయన పరిపాలనలో ప్రజలు సంతోషంగా జీవించారు. యేసు సొలొమోను కన్నా గొప్పవాడని బైబిలు చెప్తుంది. ఆయన తన సహ పరిపాలకులతో కలిసి భూమంతటినీ ఒక అందమైన పరదైసుగా మారుస్తాడు. (మత్త. 12:42) అందులో శాశ్వత కాలం జీవించడానికి అర్హతలు సంపాదించాలని “వేరే గొర్రెలు” కోరుకుంటారు.—యోహా. 10:16.

పరదైసులో జీవితం ఎలా ఉంటుంది?

5. పరదైసు జీవితం గురించి మీరెలా ఊహించుకుంటారు?

5 పరదైసులో జీవితం గురించి ఆలోచించినప్పుడు మీ మనసులోకి ఏం వస్తాయి? బహుశా ఏదెను లాంటి ఒక అందమైన తోట మీకు కనిపించవచ్చు. (ఆది. 2:7-9) దేవుని ప్రజల గురించి మీకా చెప్పిన “ప్రతీ ఒక్కరు తమ ద్రాక్షచెట్టు కింద, తమ అంజూర చెట్టు కింద కూర్చుంటారు” అనే ప్రవచనం మీకు గుర్తుకురావచ్చు. (మీకా 4:3, 4) ఆహారం సమృద్ధిగా ఉంటుంది అనే బైబిలు లేఖనాలు కూడా మీకు గుర్తుకురావచ్చు. (కీర్త. 72:16; యెష. 65:21, 22) మీరు ఇలా ఊహించుకుంటుండవచ్చు: మీరు ఒక అందమైన తోటలో కూర్చున్నారు. చల్లని చిరుగాలి పువ్వుల సువాసనల్ని మోసుకొస్తోంది. మీ ముందు చక్కని, రుచికరమైన ఆహారం ఉంది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు గలగల నవ్వుతూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో పునరుత్థానమైన వాళ్లు కూడా ఉన్నారు. ఇదంతా కేవలం ఒక పగటి కల కాదు. ఇవన్నీ భూమ్మీద నిజంగా జరుగుతాయి. పరదైసులో మనం చేసే పని కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

పునరుత్థానమైన వాళ్లకు బోధించే ముఖ్యమైన పని పరదైసులో మనకు ఉంటుంది (6వ పేరా చూడండి)

6. పరదైసులో మనం ఏం చేస్తాం? (చిత్రం చూడండి.)

6 కష్టపడి పనిచేస్తూ, పనిని ఆనందించేలా యెహోవా మనల్ని సృష్టించాడు. (ప్రసం. 2:24) వెయ్యేళ్ల పరిపాలనలో మనకు చాలా పని ఉంటుంది. మహాశ్రమను దాటిన వాళ్లకు, అలాగే పునరుత్థానం అయ్యే కోట్లమందికి ఆహారం, బట్టలు, ఇళ్లు అవసరం. అందుకోసం మనం చాలా కష్టపడి పని చేయాలి, కానీ ఆ పని ఎంతో సరదాగా ఉంటుంది. ఆదాముహవ్వలకు ఇచ్చినట్టే, భూమంతటినీ అందమైన తోటలా మార్చే పనిని దేవుడు మనకు కూడా ఇస్తాడు. అంతేకాదు యెహోవా గురించి, ఆయన ఉద్దేశం గురించి అస్సలు తెలియని కోట్లమంది తిరిగి బ్రతుకుతారు. వాళ్లకు మనం యెహోవా గురించి బోధించాలి. అలాగే యేసుకు ముందు జీవించిన దేవుని నమ్మకమైన సేవకులకు కూడా కొన్ని విషయాలు నేర్పించాలి.

7. మనం ఏం నమ్మవచ్చు? ఎందుకు?

7 పరదైసులో పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉంటాయని, మనకు కావల్సినవన్నీ సమృద్ధిగా దొరుకుతాయని, పనులన్నీ పద్ధతిగా జరుగుతాయని మనం నమ్మవచ్చు. ఎందుకంటే యేసు పరిపాలన ఎలా ఉంటుందో, రాజైన సొలొమోను పరిపాలన ద్వారా యెహోవా మనకు ముందే రుచి చూపించాడు.

సొలొమోను పరిపాలన పరదైసు ఎలా ఉంటుందో రుచి చూపించింది

8. కీర్తన 37:10, 11, 29 లో ఉన్న మాటలు సొలొమోను కాలంలో ఎలా నెరవేరాయి? (ఈ పత్రికలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.)

8 దావీదు పవిత్రశక్తి ప్రేరణతో భవిష్యత్తులో ఒక తెలివైన, నమ్మకమైన రాజు పరిపాలిస్తాడని, అప్పుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పాడు. (కీర్తన 37:10, 11, 29 చదవండి.) పరదైసు గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం తరచూ కీర్తన 37:11 చూపిస్తాం. కొండమీద ప్రసంగంలో యేసు కూడా ఆ లేఖనాన్ని ఉపయోగించాడు. దాన్నిబట్టి ఆ లేఖనం భవిష్యత్తులో నెరవేరుతుందని స్పష్టమౌతుంది. (మత్త. 5:5) అయితే దావీదు మాటలు, రాజైన సొలొమోను కాలంలోని పరిస్థితుల గురించి కూడా చెప్పాయి. సొలొమోను పరిపాలనలో దేవుని ప్రజలు ‘పాలుతేనెలు ప్రవహించే దేశంలో’ ఎంతో ప్రశాంతతను, సమృద్ధిని అనుభవించారు. దేవుడు ముందే ఇలా చెప్పాడు: ‘మీరు నా శాసనాల ప్రకారం నడుచుకుంటూ ఉంటే, నేను దేశంలో శాంతిని దయచేస్తాను, మీరు హాయిగా నిద్రపోతారు, మిమ్మల్ని ఎవ్వరూ భయపెట్టరు.’ (లేవీ. 20:24; 26:3, 6) ఆ మాటలన్నీ సొలొమోను పరిపాలనలో నిజమయ్యాయి. (1 దిన. 22:9; 29:26-28) చెడ్డ వాళ్లెవ్వరూ “ఇక ఉండరు” అని కూడా యెహోవా మాటిచ్చాడు. (కీర్త. 37:10) కాబట్టి కీర్తన 37:10, 11, 29 లో ఉన్న మాటలు గతంలో నెరవేరాయి, భవిష్యత్తులో కూడా నెరవేరతాయి.

9. షేబ దేశపు రాణి, సొలొమోను పరిపాలన గురించి ఏం చెప్పింది?

9 సొలొమోను పరిపాలనలో ఇశ్రాయేలీయులు ఆనందించిన ప్రశాంతత, సమృద్ధి గురించి ఎంతో దూరంలో ఉన్న షేబ దేశపు రాణికి కూడా తెలిసింది. విన్న విషయాలు నిజమో కాదో తెలుసుకోవడానికి ఆమె స్వయంగా యెరూషలేముకు వచ్చింది. (1 రాజు. 10:1) సొలొమోను పరిపాలనలో ఉన్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆమె ఇలా అంది: “సగం కూడా నాకు చెప్పబడలేదు. . . . నీ మనుషులు ధన్యులు, నీతో ఎప్పుడూ ఉంటూ తెలివిగల నీ మాటలు వినే నీ సేవకులు ధన్యులు!” (1 రాజు. 10:6-8) అయితే సొలొమోను పరిపాలనలో ఉన్న పరిస్థితులు, పరదైసులో జీవితాన్ని కేవలం రుచి చూపించాయి. పరదైసులో అంత కన్నా గొప్ప పరిస్థితులు ఉంటాయి.

10. యేసు ఏ విషయాల్లో సొలొమోను కంటే గొప్పవాడు?

10 యేసు అన్ని విషయాల్లో సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను అపరిపూర్ణుడు, పెద్దపెద్ద తప్పులు చేశాడు. దానివల్ల తర్వాత్తర్వాత దేవుని ప్రజలకు ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ యేసు పరిపూర్ణుడు, ఎలాంటి తప్పులూ చేయడు. (లూకా 1:32; హెబ్రీ. 4:14, 15) సాతాను తీసుకొచ్చిన ఎన్నో కష్టమైన పరీక్షల్లో కూడా యేసు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ పాపం చేయడని నిరూపించుకున్నాడు. కాబట్టి తన రాజ్యం కిందున్న వాళ్లకు హాని కలిగించే ఏ పనీ యేసు చేయడు. ఇలాంటి గొప్ప రాజు ఉన్నందుకు నిజంగా మనం గర్వపడాలి.

11. పరిపాలించడానికి యేసుకు ఎవరు సహాయం చేస్తారు?

11 మనుషుల బాగోగుల్ని చూసుకోవడానికి, భూమి విషయంలో యెహోవా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసుకు 1,44,000 మంది సహాయం చేస్తారు. (ప్రక. 14:1-3) వాళ్లు భూమ్మీద ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నారు. కాబట్టి మనల్ని వాళ్లు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇంతకీ ఈ సహ పరిపాలకులు ఏం చేస్తారు?

అభిషిక్తులు ఏం చేస్తారు?

12. యెహోవా 1,44,000 మందికి ఏ పని అప్పగించాడు?

12 సొలొమోను కేవలం ఒక్క దేశంలో ఉన్న లక్షలమందిని పరిపాలించాడు. కానీ యేసు, ఆయన సహ పరిపాలకులు భూమంతటినీ పరిపాలించాలి, ఎన్నో కోట్లమందిని చూసుకోవాలి. నిజంగా 1,44,000 మందికి యెహోవా ఎంతో బరువైన బాధ్యతను అప్పగించాడు.

13. సహపరిపాలకులు ఇంకా ఏం చేస్తారు?

13 యేసులానే 1,44,000 మంది రాజులుగా, యాజకులుగా సేవ చేస్తారు. (ప్రక. 5:10) ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా, యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉండేలా చూసుకునే బాధ్యత యాజకులకు ఉందని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. “ధర్మశాస్త్రం రాబోయే మంచివాటికి నీడ.” కాబట్టి పరదైసులో దేవుని ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా, యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉండేలా 1,44,000 మంది చూసుకుంటారని చెప్పవచ్చు. (హెబ్రీ. 10:1) అయితే రాజులుగా, యాజకులుగా సేవ చేసే వీళ్లు భూమ్మీది ప్రజలతో ఎలా మాట్లాడతారు అనేది మనకు ప్రస్తుతం తెలీదు. యెహోవా అందుకోసం ఏ ఏర్పాటు చేసినా, పరదైసు భూమ్మీద ఉన్నవాళ్లకు అవసరమైన నిర్దేశాలు అందుతాయని మనం పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—ప్రక. 21:3, 4.

పరదైసులో జీవించాలంటే “వేరే గొర్రెలు” ఏ అర్హతలు సంపాదించాలి?

14. “వేరే గొర్రెలు,” “చిన్నమంద” కలిసి ఎలా ఒకే మందగా ఉంటాయి?

14 తనతోపాటు పరిపాలించే వాళ్లను యేసు “చిన్నమంద” అని పిలిచాడు. (లూకా 12:32) ఆయన ఇంకో గుంపు గురించి కూడా చెప్పాడు. వాళ్లను “వేరే గొర్రెలు” అని పిలిచాడు. ఈ రెండు గుంపులు కలిసి ఒకే మందగా ఉంటాయి. (యోహా. 10:16) ఇప్పటికే ఈ రెండు గుంపుల్లో ఉన్నవాళ్లు కలిసి పనిచేస్తున్నారు, పరదైసులో కూడా వాళ్లు దాన్ని కొనసాగిస్తారు. అయితే, అప్పుడు “చిన్నమందలో” ఉన్నవాళ్లు పరలోకంలో ఉంటారు. “వేరే గొర్రెల్లో” ఉన్నవాళ్లు ఇదే భూమ్మీద శాశ్వత కాలం జీవించే అవకాశాన్ని పొందుతారు. “వేరే గొర్రెలు” పరదైసులో జీవించాలంటే, ఇప్పుడే కొన్ని అర్హతలు సంపాదించాలి.

పరదైసులో జీవించడానికి సిద్ధపడుతున్నామని మనం ఇప్పటి నుండే చూపించవచ్చు (15వ పేరా చూడండి) b

15. (ఎ) “వేరే గొర్రెలు” క్రీస్తు సహోదరులకు ఎలా సహాయం చేస్తారు? (బి) చిత్రంలో ఉన్న సహోదరునిలాగే మీరేం చేయవచ్చు?

15 మనసు మార్చుకున్న నేరస్తుడు, యేసు పట్ల తనకున్న కృతజ్ఞతను చూపించుకునే అవకాశం దొరకకముందే చనిపోయాడు. కానీ వేరే గొర్రెలమైన మనకు మాత్రం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం అభిషిక్త సహోదరులకు సహాయం చేసినప్పుడు, యేసును ప్రేమిస్తున్నామని చూపిస్తాం. దాన్నిబట్టే యేసు మనల్ని గొర్రెలుగా తీర్పుతీరుస్తాడు. (మత్త. 25:31-40) ప్రకటించే, శిష్యుల్ని చేసే పనిలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా కూడా క్రీస్తు సహోదరులకు మనం సహాయం చేస్తాం. (మత్త. 28:18-20) వాళ్లు ఇచ్చిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! లాంటి బోధనా పనిముట్లను చక్కగా ఉపయోగిస్తాం. మీకు ప్రస్తుతం బైబిలు స్టడీ లేదా? అలాగైతే, ఆసక్తి చూపించిన వాళ్లందరికీ బైబిలు స్టడీ గురించి చెప్పాలనే లక్ష్యం పెట్టుకోండి.

16. పరదైసులో అడుగుపెట్టాలంటే మనం ఇప్పటి నుండే ఏం చేయాలి?

16 పరదైసులో అడుగుపెట్టాలంటే మనం ఇప్పటి నుండే యెహోవాకు నచ్చిన విధంగా జీవించాలి. మనం నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. యెహోవాకు, వివాహజతకు, తోటి క్రైస్తవులకు నమ్మకంగా ఉండాలి. ఈ దుష్టలోకంలో దేవుని ప్రమాణాలకు తగ్గట్టుగా జీవించగలిగితే, పరదైసులో వాటిని పాటించడం ఇంకా తేలికౌతుంది. పరదైసులో అవసరమయ్యే నైపుణ్యాల్ని, లక్షణాల్ని ఇప్పటి నుండే పెంచుకోవడం ద్వారా, మనం అందులో జీవించడానికి సిద్ధపడుతున్నామని చూపించవచ్చు. ఈ పత్రికలో ఉన్న “‘భూమికి వారసులవ్వడానికి’ మీరు సిద్ధంగా ఉన్నారా?” అనే ఆర్టికల్‌ చూడండి.

17. మనం గతంలో చేసిన పాపాల్ని బట్టి అతిగా బాధపడాలా? వివరించండి.

17 మనం గతంలో చేసిన ఘోరమైన పాపాల్ని బట్టి అతిగా బాధపడాల్సిన అవసరంలేదు. అయితే, విమోచన క్రయధనం ఉంది కదా అని, “కావాలని పాపం” చేయకూడదు. (హెబ్రీ. 10:26-31) ఒకవేళ చేసిన పాపం విషయంలో మనం నిజంగా పశ్చాత్తాపపడితే; దేవుని సహాయం, పెద్దల సహాయం తీసుకుంటే; మన ప్రవర్తనను మార్చుకుంటే యెహోవా మనల్ని అధికంగా క్షమిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (యెష. 55:7; అపొ. 3:19) యేసు పరిసయ్యులతో అన్న ఈ మాటల్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి: “నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.” (మత్త. 9:13) విమోచన క్రయధనం మనం చేసిన తప్పులన్నిటినీ కప్పేయగలదు.

మీరు పరదైసులో శాశ్వత కాలం జీవించవచ్చు

18. యేసు మీద విశ్వాసం చూపించిన నేరస్తునితో మీరు ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు?

18 ఒకసారి ఇలా ఊహించుకోండి: మీరు పరదైసులో, యేసు మీద విశ్వాసం చూపించిన నేరస్తునితో పాటు ఉన్నారు. యేసు ఇచ్చిన బలి పట్ల మీకు ఉన్న కృతజ్ఞత గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. యేసును కొయ్యమీద వేలాడదీసిన తర్వాత ఏం జరిగిందో చెప్పమని మీరు ఆ నేరస్తున్ని అడుగుతున్నారు. అలాగే, “నువ్వు నాతో పాటు పరదైసులో ఉంటావు” అని యేసు చెప్పినప్పుడు అతనికి ఎలా అనిపించిందని కూడా అడుగుతున్నారు. అతనేమో, చివరిరోజుల్లో జీవితం ఎలా ఉండేది అని మిమ్మల్ని అడుగుతున్నాడు. అవును, అలాంటి వాళ్లతో దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది!—ఎఫె. 4:22-24.

ఒక సహోదరుడు తాను కోరుకున్నట్టుగానే, పెయింటింగ్‌ వేసే విషయంలో తన నైపుణ్యాన్ని వెయ్యేళ్ల కాలంలో పెంచుకుంటున్నాడు (19వ పేరా చూడండి)

19. పరదైసులో మనకు ఎందుకు బోర్‌ కొట్టదు? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

19 పరదైసులో మనకు ఎప్పుడూ బోర్‌ కొట్టదు. కొత్తకొత్త స్నేహితులు దొరుకుతుంటారు. అక్కడ చేసే పని మనకు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రతీరోజు మన పరలోక తండ్రి గురించి ఏదోక కొత్త విషయం తెలుసుకుంటాం. ఆయన మన కోసం చేసిన వాటన్నిటినీ ఆనందిస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు గడిచినా, మనం యెహోవా గురించి నేర్చుకుంటూనే ఉంటాం. సృష్టి గురించి కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. యెహోవా మీద మనకున్న ప్రేమ రోజురోజుకీ పెరుగుతూ ఉంటుంది. యెహోవా, యేసు పరదైసులో శాశ్వత జీవితం ఇస్తానని వాగ్దానం చేసినందుకు మనం వాళ్లకు రుణపడి ఉంటాం!

పాట 22 రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదికి రావాలి!

a పరదైసులో జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచిస్తూ ఉంటారా? అలా చేయడం మంచిది. యెహోవా మనకు ఇవ్వబోతున్న జీవితం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే, కొత్తలోకం గురించి మనం అంత ఉత్సాహంగా ప్రకటిస్తాం. రాబోతున్న పరదైసు గురించి యేసు ఇచ్చిన మాటను మనం ఎందుకు బలంగా నమ్మవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

b చిత్రాల వివరణ: ఒక సహోదరుడు ఇతరులకు ప్రకటిస్తూ, పరదైసులో పునరుత్థానం అయ్యే వాళ్లకు బోధించడానికి ఇప్పటి నుండే సిద్ధపడుతున్నాడు.