కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

కీర్తన 61:8లో దావీదు, నేను “నిరంతరం” దేవుని పేరును స్తుతిస్తాను అన్నాడు. అంటే తాను ఎప్పుడూ చనిపోడని దావీదు అనుకున్నాడా?

లేదు, ఆ మాటకు అర్థం అది కాదు. నిజానికి దావీదు “నిరంతరం” అనే పదాన్ని ఉపయోగించడం సరైనదే అని చెప్పవచ్చు. ఎందుకు?

దావీదు ఈ వచనంలో, అలాగే ఇంకొన్ని వచనాల్లో ఇలా రాశాడు: “నేను ప్రతీరోజు నా మొక్కుబళ్లు చెల్లిస్తూ, నిరంతరం నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను.” “యెహోవా, నా దేవా, నా నిండు హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను, నీ పేరును నిరంతరం మహిమపరుస్తాను.” “నిరంతరం నీ పేరును స్తుతిస్తాను.”—కీర్త. 61:8; 86:12; 145:1, 2.

దావీదు ఈ మాటలు అన్నప్పుడు తాను చనిపోనని అనుకోలేదు. పాపం చేశారు కాబట్టి మనుషులందరూ చనిపోతారని దావీదుకు తెలుసు. అలాగే ఆయన కూడా పాపాలు చేశానని ఒప్పుకున్నాడు. (ఆది. 3:3, 17-19; కీర్త. 51:4, 5) దేవునికి ఎంతో ఇష్టమైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు చనిపోయారని, తను కూడా ఏదోకరోజు చనిపోతాడని దావీదుకు తెలుసు. (కీర్త. 37:25; 39:4) అయితే కీర్తన 61:8 లోని మాటలు, “నిరంతరం” అంటే చనిపోయేంతవరకు దేవున్ని స్తుతించాలని దావీదుకు ఉన్న బలమైన కోరికను తెలియజేస్తున్నాయి.—2 సమూ. 7:12.

కొన్నిసార్లు దావీదు తన జీవితంలో జరిగిన వాటి గురించి కూడా రాశాడు. 18, 5152 కీర్తనల పైవిలాసాన్ని చూస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. 23వ కీర్తనలో, తన ప్రజల్ని కాపాడే, నడిపించే, సేదదీర్పునిచ్చే కాపరితో దావీదు యెహోవాను పోల్చాడు. దావీదు కూడా కాపరే కాబట్టి, అలాంటి మంచి కాపరైన యెహోవాను “జీవితాంతం” సేవించాలని అనుకున్నాడు.—కీర్త. 23:6.

దావీదు రాసినవన్నీ పవిత్రశక్తి ప్రేరణతోనే రాశాడని గుర్తుంచుకోండి. ఆయన రాసినవాటిలో భవిష్యత్తులో నెరవేరే ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 110వ కీర్తనలో, తన ప్రభువు పరలోకంలో ‘[దేవుని] కుడిపక్కన కూర్చుంటాడని,’ గొప్ప అధికారాన్ని పొందుతాడని దావీదు రాశాడు. దావీదు ప్రభువైన మెస్సీయ ఏ అధికారం పొందుతాడు? దేవుని శత్రువుల్ని నాశనం చేసే, “దేశాల మీద తీర్పు అమలుచేసే” అధికారాన్ని పొందుతాడు. ఆ మెస్సీయకు దావీదు పూర్వీకుడు. మెస్సీయ పరలోకం నుండి పరిపాలిస్తాడు, అలాగే “ఎప్పటికీ యాజకుడిగా” సేవచేస్తాడు. (కీర్త. 110:1-6) 110వ కీర్తనలో ఉన్న ప్రవచనం తన గురించే అని, అది భవిష్యత్తులో నెరవేరుతుందని యేసు స్పష్టం చేశాడు.—మత్త. 22:41-45.

కాబట్టి దావీదు తన కాలం గురించి, అలాగే తను తిరిగి బ్రతికినప్పుడు నిరంతరం యెహోవాను స్తుతించే కాలం గురించి పవిత్రశక్తి ప్రేరణతో రాశాడు. అందుకే, కీర్తన 37:10, 11, 29 లో ఉన్న మాటలు ప్రాచీన ఇశ్రాయేలులోని పరిస్థితుల గురించి, అలాగే భవిష్యత్తులో దేవుని వాగ్దానాలన్నీ నెరవేరాక భూమ్మీద ఉండే పరిస్థితుల గురించి చెప్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు.—ఈ పత్రికలోని “నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” ఆర్టికల్‌లో 8వ పేరా చూడండి.

కీర్తన 61:8, అలాగే ఇతర వచనాలు చనిపోయేంతవరకు యెహోవాను స్తుతించాలనే దావీదు కోరికను తెలియజేస్తున్నాయి. అలాగే భవిష్యత్తులో యెహోవా దావీదును తిరిగి బ్రతికించాక ఆయన ఏం చేస్తాడో కూడా తెలియజేస్తున్నాయి.