కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘భూమికి వారసులవ్వడానికి’ మీరు సిద్ధంగా ఉన్నారా?

‘భూమికి వారసులవ్వడానికి’ మీరు సిద్ధంగా ఉన్నారా?

“సౌమ్యులు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు భూమికి వారసులౌతారు” అని యేసు ఇచ్చిన మాట నెరవేరే రోజు కోసం మనం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. (మత్త. 5:5) అభిషిక్త క్రైస్తవులు యేసుతో కలిసి పరలోకంలో రాజులుగా సేవచేస్తూ ఈ భూమికి వారసులౌతారు. (ప్రక. 5:10; 20:6) అయితే నేడు ఎక్కువమంది నిజక్రైస్తవులు, ఈ భూమ్మీదే శాశ్వత జీవితం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు వాళ్లు పరిపూర్ణులు అవుతారు, ప్రశాంతంగా-సంతోషంగా జీవిస్తూ భూమికి వారసులౌతారు. దానికంటే ముందు, వాళ్లు కొన్ని పనులు చేయాలి. వాటిలో మూడు ఏంటంటే: భూమిని పరదైసుగా మార్చడం, పునరుత్థానమైన వాళ్ల అవసరాల్ని చూసుకోవడం, పునరుత్థానమైన వాళ్లకు బోధించడం. కొత్తలోకంలో మీరు ఆ పనులన్నిటినీ చేయాలని కోరుకుంటున్నారని ఇప్పటి నుండే ఎలా చూపించవచ్చో పరిశీలిద్దాం.

భూమిని పరదైసుగా మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

“భూమిని నింపండి, దాన్ని లోబర్చుకోండి” అని యెహోవా ఆదాముహవ్వలకు ఆజ్ఞాపించాడు. అలా, చివరికి ఈ భూమంతా పరదైసుగా మారాలన్నది తన ఉద్దేశం అని తెలియజేశాడు. (ఆది. 1:28) భూమ్మీద శాశ్వత జీవితం పొందేవాళ్లు కూడా ఆ ఆజ్ఞను పాటించాలి. ఆదాముహవ్వలకైతే ఏదెను తోట ఉండింది. వాళ్లు దాని సరిహద్దుల్ని పెంచుకుంటూ వెళ్తే సరిపోయేది. కానీ భూమికి వారసులు అయ్యేవాళ్ల పరిస్థితి వేరుగా ఉంటుంది. వాళ్లు హార్‌మెగిద్దోన్‌ తర్వాత పాడైపోయిన స్థలాలన్నీ శుభ్రం చేసి, భూమిని పరదైసుగా మార్చాలి. అది నిజంగా పెద్ద పనే.

ఈ పని, బబులోను నుండి తమ స్వదేశానికి తిరిగొచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన పనిని గుర్తుచేస్తుంది. 70 సంవత్సరాల పాటు ఎవ్వరూ లేకుండా ఆ దేశం పాడైపోయి ఉంది. కానీ యెహోవా సహాయంతో, వాళ్లు ఆ దేశాన్నంతా మళ్లీ అందంగా మారుస్తారని యెషయా ముందే చెప్పాడు. యెషయా 51:3 లో ఇలా ఉంది: “ఆయన దాని ఎడారిని ఏదెనులా, దాని ఎడారి మైదానాన్ని యెహోవా తోటలా చేస్తాడు.” నిజంగానే అది జరిగింది. భూమికి వారసులు అయ్యేవాళ్లు కూడా యెహోవా సహాయంతో దాన్ని పరదైసుగా మారుస్తారు. ఆ పనిలో పాల్గొనాలనే కోరికను మీరు ఇప్పటి నుండే చూపించవచ్చు.

ఉదాహరణకు మీరు మీ ఇంటిని, పరిసరాల్ని చక్కగా-శుభ్రంగా ఉంచుకోవడానికి చేయగలిగినదంతా చేయవచ్చు. మీ ఇరుగుపొరుగువారు అలా చేయకపోయినా, మీరు మాత్రం శుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు రాజ్యమందిరాన్ని, సమావేశ హాలును శుభ్రం చేయడానికి, దానిలో రిపేర్లు చేయడానికి మీరు సహాయం చేయవచ్చు. మీ పరిస్థితులు అనుకూలిస్తే, విపత్తు సహాయక పనుల్లో పాల్గొనడానికి అప్లికేషన్‌ కూడా నింపవచ్చు. ఆ విధంగా, మీరు సహోదర సహోదరీలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చూపిస్తారు. ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా ఈ భూమ్మీద శాశ్వత కాలం జీవించే అవకాశం నాకు ఇస్తే, పరదైసులో ఉపయోగపడే కొన్ని నైపుణ్యాల్ని ఇప్పటి నుండే నేర్చుకోగలనా?’

పునరుత్థానమైన వాళ్ల అవసరాల్ని చూసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

యాయీరు కూతుర్ని పునరుత్థానం చేసిన తర్వాత, యేసు ఆ పాపకు తినడానికి ఏమైనా పెట్టమని చెప్పాడు. (మార్కు 5:42, 43) ఆ 12 ఏళ్ల పాప అవసరాల్ని చూసుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు. అయితే “సమాధుల్లో ఉన్న వాళ్లందరూ [యేసు] స్వరం విని బయటికి వస్తారు” అనే మాట నెరవేరినప్పుడు ఎంత పనుంటుందో ఒకసారి ఆలోచించండి. (యోహా. 5:28, 29) దాని గురించి బైబిల్లో ఎక్కువ వివరాలు లేకపోయినా ఆహారం, బట్టలు, ఇల్లు వంటి విషయాల్లో పునరుత్థానమైన వాళ్లకు ఖచ్చితంగా సహాయం అవసరమౌతుంది. వాళ్లకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఇప్పటి నుండే చూపించవచ్చు. మీరు చేయగల కొన్ని పనుల గురించి ఇప్పుడు చూద్దాం.

భూమికి వారసులు అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఇప్పటి నుండే ఎలా చూపించవచ్చు?

ఉదాహరణకు ప్రాంతీయ పర్యవేక్షకుడు మీ సంఘానికి వచ్చినప్పుడు, వాళ్లను మీరు భోజనానికి పిలవగలరా? ఇంతకుముందు బెతెల్‌ సేవ లేదా ప్రాంతీయ సేవ చేసి, తమ నియామకం మారి ఎవరైనా సహోదర సహోదరీలు మీ సంఘానికి వస్తే, వాళ్లకు మీరు ఇల్లు చూసిపెట్టగలరా? మీ ప్రాంతంలో ప్రాదేశిక లేదా ప్రత్యేక సమావేశం జరుగుతుంటే సమావేశానికి ముందు గానీ తర్వాత గానీ మీరు వాలంటీరుగా సేవ చేయగలరా? లేదా వేరే ప్రాంతాల నుండి వచ్చే సహోదర సహోదరీల్ని ఆహ్వానించగలరా?

పునరుత్థానమైన వాళ్లకు బోధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

అపొస్తలుల కార్యాలు 24:15 ప్రకారం, ఎన్నో కోట్లమంది పునరుత్థానం అవుతారు. వాళ్లలో చాలామందికి యెహోవా గురించి తెలుసుకునే అవకాశం దొరకలేదు. కానీ పునరుత్థానం అయ్యాక వాళ్లకు ఆ అవకాశం దొరుకుతుంది. a అనుభవం గల, నమ్మకమైన దేవుని సేవకులు వాళ్లకు బోధిస్తారు. (యెష. 11:9) యూరప్‌, దక్షిణ అమెరికా, ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో ప్రకటించిన షార్లెట్‌ అనే సహోదరి ఆ పని కోసమే ఎదురుచూస్తోంది. ఆమె ఇలా అంటుంది: “పునరుత్థానమైన వాళ్లకు బోధించాలని నేను ఎంతో ఎదురుచూస్తున్నాను. గతంలో జీవించిన వాళ్ల గురించి చదివినప్పుడల్లా ‘ఈ వ్యక్తికి యెహోవా గురించి తెలిసుంటే, అతని జీవితం చాలా వేరుగా ఉండేది’ అని అనుకుంటాను. పునరుత్థానమైన వాళ్లకు యెహోవా గురించి, అలాగే ఆయన్ని సేవిస్తే వాళ్ల జీవితం ఎంత బాగుంటుంది అనే దాని గురించి చెప్పడానికి నేను ఎంతో ఎదురుచూస్తున్నాను.”

యేసు భూమ్మీదికి రాకముందు జీవించిన దేవుని నమ్మకమైన సేవకులు కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఉదాహరణకు దానియేలు గురించి ఆలోచించండి. ఆయన ఎన్నో ప్రవచనాలు రాశాడు, కానీ వాటి అర్థం ఆయనకు తెలీదు. అయితే కొత్త లోకంలో పునరుత్థానం అయినప్పుడు, ఆ ప్రవచనాలు ఎలా నెరవేరాయో మనం ఆయనకు చెప్తాం. అలా దానియేలుకు బోధించడం ఎంత గొప్ప అవకాశమో కదా. (దాని. 12:8) అంతేకాదు రూతు, నయోమిల గురించి ఆలోచించండి. వాళ్లు మెస్సీయకు పూర్వీకులు అయ్యారని మనం చెప్తాం. ఈ చెడ్డ లోకంలో మన దృష్టిని మళ్లించే విషయాలు, తలనొప్పులు ఎన్నో ఉన్నాయి. కానీ అప్పుడు అవేవీ ఉండవు కాబట్టి, మనం ఆ పనిని పూర్తిగా ఆనందిస్తాం.

పునరుత్థానమైన వాళ్లకు బోధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఇప్పటి నుండే ఎలా చూపించవచ్చు? మంచి బోధకులుగా తయారవ్వడానికి, క్రమంగా పరిచర్యలో పాల్గొనడానికి కృషిచేయండి. (మత్త. 24:14) వయసు పైబడడం వల్ల లేదా వేరే కారణాల వల్ల పరిచర్య ఎక్కువ చేయలేకపోతున్నారా? అలాగైతే మీ పరిస్థితులకు తగ్గట్టు, పరిచర్యలో చేయగలిగినదంతా చేయండి. అప్పుడు, పునరుత్థానమైన వాళ్లకు బోధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చూపిస్తారు.

మీరు ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: భూమికి వారసులయ్యే వాళ్లలో ఒకరిగా ఉండాలని నేను నిజంగా కోరుకుంటున్నానా? భూమిని పరదైసుగా మార్చాలని, పునరుత్థానమైన వాళ్ల అవసరాల్ని చూసుకోవాలని, అలాగే వాళ్లకు బోధించాలని నేను ఎదురుచూస్తున్నానా? నేడు మనకున్న అవకాశాల్ని ఉపయోగించుకుంటూ, వాటిని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు భూమికి వారసులవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చూపిస్తాం.

a 2022, సెప్టెంబరు కావలికోట పత్రికలో “నీతిమంతులయ్యేలా చాలామందికి సహాయం దొరుకుతుంది” అనే ఆర్టికల్‌ చూడండి.