కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 49

మనం శాశ్వత కాలం జీవించవచ్చు

మనం శాశ్వత కాలం జీవించవచ్చు

“దేవుడు ఇచ్చే బహుమతి . . . శాశ్వత జీవితం.”రోమా. 6:23.

పాట 147 యెహోవా శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు

ఈ ఆర్టికల్‌లో. . . a

1. యెహోవా ఇచ్చే శాశ్వత జీవితం అనే బహుమతి గురించి ధ్యానించడం ఎందుకు మంచిది?

 యెహోవా, తనకు లోబడే వాళ్లకు “శాశ్వత జీవితం” అనే బహుమతి ఇస్తానని మాటిచ్చాడు. (రోమా. 6:23) ఆ బహుమతి గురించి ధ్యానించినప్పుడు యెహోవా మీద మనకున్న ప్రేమ ఖచ్చితంగా పెరుగుతుంది. మన పరలోక తండ్రి మనకు ఎందుకు ఆ బహుమతిని ఇవ్వాలి అనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి: ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనతో ఎప్పుడూ కలిసుండాలి అనుకుంటున్నాడు. మరణం మనల్ని ఆయన నుండి వేరుచేయడం ఆయనకు అస్సలు ఇష్టంలేదు.

2. శాశ్వత జీవితం అనే బహుమతి మనకు ఎలా సహాయం చేస్తుంది?

2 శాశ్వత జీవితం అనే బహుమతి కష్టాల్ని తట్టుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. మనల్ని చంపేస్తామని శత్రువులు బెదిరించినా మనం రాజీపడం. ఎందుకు? యెహోవాకు నమ్మకంగా ఉండి చనిపోతే, ఆయన మనల్ని తిరిగి బ్రతికిస్తాడని, శాశ్వత జీవితం ఇస్తాడని మనకు తెలుసు. (యోహా. 5:28, 29; 1 కొరిం. 15:55-58; హెబ్రీ. 2:15) అయితే శాశ్వత కాలం జీవించడం సాధ్యమే అని ఎందుకు చెప్పవచ్చు? కొన్ని కారణాల్ని పరిశీలిద్దాం.

యెహోవా శాశ్వత కాలం జీవిస్తాడు

3. యెహోవా మనకు శాశ్వత జీవితాన్ని ఇవ్వగలడని ఎందుకు నమ్మవచ్చు? (కీర్తన 102:12, 24, 27)

3 యెహోవా దగ్గర జీవపు ఊట ఉంది, ఆయన శాశ్వత కాలం జీవిస్తాడు. కాబట్టి ఆయన మనకు శాశ్వత జీవితం ఇవ్వగలడని నమ్మవచ్చు. (కీర్త. 36:9) యెహోవా ఎప్పటి నుండో ఉన్నాడని, ఆయన ఎప్పటికీ ఉంటాడని చెప్పే కొన్ని బైబిలు లేఖనాల్ని పరిశీలించండి. యెహోవా “యుగయుగాలు” లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు” ఉండే దేవుడని కీర్తన 90:2 చెప్తుంది. 102వ కీర్తనలో కూడా అదే విషయాన్ని చూస్తాం. (కీర్తన 102:12, 24, 27 చదవండి.) మన పరలోక తండ్రి గురించి హబక్కూకు ప్రవక్త ఇలా రాశాడు: “యెహోవా, నువ్వు అనాది కాలం నుండి ఉన్నావు కదా? నా దేవా, పవిత్రుడివైన నా దేవా, నువ్వు ఎప్పటికీ చనిపోవు.”హబ. 1:12.

4. యెహోవా ఎప్పటి నుండో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు అనే విషయం మనకు అర్థం కానంత మాత్రాన అది అబద్ధం అయిపోతుందా? వివరించండి.

4 యెహోవా ఎప్పటి నుండో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తుందా? (యెష. 40:28) మీకే కాదు చాలామందికి దాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించింది. ఉదాహరణకు, ఎలీహు ఇలా అన్నాడు: “ఆయన సంవత్సరాల్ని లెక్కపెట్టడం అసాధ్యం.” (యోబు 36:26) అయితే ఏదైనా మనకు అర్థం కానంత మాత్రాన అది అబద్ధం అయిపోదు. ఉదాహరణకు, వెలుతురు లేదా కాంతి ఎలా పనిచేస్తుందో మనకు పూర్తిగా తెలీదు. అంతమాత్రాన వెలుతురు అనేది లేదు అని అనగలమా? అనలేం కదా. అదేవిధంగా యెహోవా ఎప్పటి నుండో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు అనే విషయాన్ని మనం ఎన్నటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అంతమాత్రాన దేవుడు శాశ్వత కాలం జీవిస్తాడు అనేది అబద్ధం అయిపోదు. మనం అర్థం చేసుకోగలిగినా, చేసుకోలేకపోయినా సృష్టికర్త గురించిన ఈ విషయం వాస్తవం. (రోమా. 11:33-36) మనకు వెలుతురు ఇస్తున్న సూర్యుడు, నక్షత్రాల కన్నా ముందే ఆయన ఉన్నాడు. ‘తన శక్తితో భూమిని చేసింది,’ ‘ఆకాశాన్ని పరిచింది’ యెహోవాయే. (యిర్మీ. 51:15; అపొ. 17:24) అయితే మనం శాశ్వత కాలం జీవించడం సాధ్యమేనని చెప్పడానికి ఇంకో కారణం ఏంటి?

యెహోవా మనల్ని శాశ్వత కాలం జీవించడానికి సృష్టించాడు

5. ఆదాముహవ్వలకు ఏ అవకాశం ఉంది?

5 యెహోవా మనుషుల్ని తప్ప ఈ భూమ్మీది ప్రాణులన్నిటినీ కొంతకాలం జీవించి, చనిపోయేలా సృష్టించాడు. చనిపోకుండా శాశ్వత కాలం జీవించే అవకాశాన్ని యెహోవా మనుషులకు ఇచ్చాడు. అయితే యెహోవా ఆదామును ఇలా హెచ్చరించాడు: “మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు పండ్లను మాత్రం నువ్వు తినకూడదు; ఎందుకంటే దాని పండ్లను తిన్న రోజున నువ్వు ఖచ్చితంగా చనిపోతావు.” (ఆది. 2:17) ఆదాముహవ్వలు యెహోవా మాట వినుంటే, చనిపోకుండా ఉండేవాళ్లు. ఏదోకరోజు యెహోవా వాళ్లను “జీవవృక్షం పండును” తిననిచ్చేవాడు. అలా, ‘నిరంతరం జీవిస్తారు’ అనే భరోసాను యెహోవా వాళ్లకు ఇచ్చుండేవాడు. bఆది. 3:22.

6-7. (ఎ) మనుషులు చనిపోవడానికి సృష్టించబడలేదని ఇంకా దేన్నిబట్టి చెప్పవచ్చు? (బి) మీరు కొత్తలోకంలో ఏం చేయాలనుకుంటున్నారు? (చిత్రాలు చూడండి.)

6 సమాచారాన్ని భద్రపర్చుకునే విషయంలో మనిషి మెదడుకున్న సామర్థ్యం గురించి పరిశోధకులు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నారు. అదేంటంటే, ఒక మనిషి సగటు జీవిత కాలంలో భద్రపర్చుకునే సమాచారం కన్నా, ఎన్నో రెట్లు ఎక్కువ సమాచారాన్ని మనిషి మెదడు భద్రపర్చుకోగలదు. 2010 లో వచ్చిన ఒక సైన్స్‌ ఆర్టికల్‌, మన మెదడుకు 25 లక్షల గిగాబైట్ల సమాచారాన్ని లేదా 300 సంవత్సరాల పాటు నడిచే వీడియోల్లో పట్టేంత సమాచారాన్ని భద్రపర్చే సామర్థ్యం ఉందని చెప్తుంది. నిజానికి మన మెదడుకు అంతకన్నా ఎక్కువ సామర్థ్యమే ఉండివుంటుంది. దీన్నిబట్టి కేవలం 70, 80 సంవత్సరాల్లో నేర్చుకునే సమాచారాన్నే కాదు, ఎన్నో రెట్లు ఎక్కువ సమాచారాన్ని భద్రపర్చుకునేలా యెహోవా మన మెదడును సృష్టించాడని చెప్పవచ్చు.—కీర్త. 90:10.

7 అంతేకాదు, ఎప్పుడూ బ్రతికుండాలనే బలమైన కోరికతో యెహోవా మనుషుల్ని సృష్టించాడు. దేవుడు ‘నిరంతరం జీవించడమనే ఆలోచనను వాళ్ల హృదయంలో పెట్టాడు’ అని బైబిలు చెప్తుంది. (ప్రసం. 3:11) అందుకే మనం మరణాన్ని ఒక శత్రువులా చూస్తాం. (1 కొరిం. 15:26) ఒకసారి ఆలోచించండి, మనకు బాగా జబ్బు చేసినప్పుడు ఇక చనిపోతాం కదా అని అలానే ఉండిపోతామా? లేదు కదా. మంచి వైద్యం తీసుకుని, బ్రతకడానికి చేయగలిగినదంతా చేస్తాం. అంతేకాదు మనకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోతే, చాలా కాలం పాటు బాధపడతాం. వాళ్లు ముసలి వాళ్లయినా, చిన్న వయసు వాళ్లయినా అలా బాధపడతాం. (యోహా. 11:32, 33) మన సృష్టికర్త మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనం ఎప్పటికీ బ్రతికుండాలని కోరుకుంటున్నాడు. లేకపోతే అలా ఎప్పటికీ జీవించాలనే కోరికను, సామర్థ్యాన్ని ఇచ్చేవాడు కాదు. అయితే మనం శాశ్వత కాలం జీవించగలం అని చెప్పడానికి ఇంకొన్ని మంచి కారణాలు కూడా ఉన్నాయి. యెహోవా గతంలో చేసిన పనులు, ఇప్పుడు చేస్తున్న పనులు ఆయన ఉద్దేశం మారలేదని ఎలా రుజువు చేస్తున్నాయో చూద్దాం.

శాశ్వత జీవితం ఇస్తానని యెహోవా మాటిచ్చాడు కాబట్టి, కొత్తలోకంలో మనం చేయాలనుకుంటున్న వాటి గురించి సంతోషంగా ఆలోచిస్తుంటాం (7వ పేరా చూడండి) c

యెహోవా ఉద్దేశం మారలేదు

8. యెహోవా ఉద్దేశం గురించి, యెషయా 55:11 ఏ భరోసాను ఇస్తుంది?

8 ఆదాముహవ్వలు చేసిన పాపం వల్ల వాళ్ల పిల్లలు చనిపోవాల్సి వచ్చింది. అయినా యెహోవా ఉద్దేశం మారలేదు. (యెషయా 55:11 చదవండి.) నమ్మకమైన వాళ్లందరికీ శాశ్వత జీవితం ఇవ్వాలని ఆయన ఇప్పటికీ కోరుకుంటున్నాడు. యెహోవా చెప్పిన కొన్ని మాటలు, చేసిన కొన్ని పనుల్ని బట్టి అలా చెప్పవచ్చు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

9. దేవుడు ఏమని మాటిచ్చాడు? (దానియేలు 12:2, 13)

9 చనిపోయిన వాళ్లను తిరిగి బ్రతికిస్తానని, వాళ్లకు శాశ్వత కాలం జీవించే అవకాశం ఇస్తానని యెహోవా మాటిచ్చాడు. (అపొ. 24:15; తీతు 1:1, 2) చనిపోయిన వాళ్లను మళ్లీ బ్రతికించాలని యెహోవా ఎంతో కోరుకుంటున్నాడని యోబు బలంగా నమ్మాడు. (యోబు 14:14, 15) చనిపోయిన వాళ్లు తిరిగి బ్రతుకుతారని, వాళ్లకు శాశ్వత కాలం జీవించే అవకాశం దొరుకుతుందని దానియేలు ప్రవక్తకు తెలుసు. (కీర్త. 37:29; దానియేలు 12:2, 13 చదవండి.) యెహోవా తన నమ్మకమైన సేవకులకు “శాశ్వత జీవితం” ఇస్తాడని యేసు కాలంలోని యూదులకు కూడా తెలుసు. (లూకా 10:25; 18:18) యేసు కూడా దాని గురించి చాలాసార్లు మాట్లాడాడు. ఆయన్ని కూడా యెహోవా తిరిగి బ్రతికించాడు.—మత్త. 19:29; 22:31, 32; లూకా 18:30; యోహా. 11:25.

ఏలీయా చేసిన పునరుత్థానం మనకు ఏ భరోసాను ఇస్తుంది? (10వ పేరా చూడండి)

10. గతంలో జరిగిన పునరుత్థానాలు ఏం రుజువు చేస్తున్నాయి? (చిత్రం చూడండి.)

10 యెహోవా జీవదాత కాబట్టి మనుషుల్ని తిరిగి బ్రతికించే శక్తి ఆయనకు ఉంది. సారెపతులోని విధవరాలి కొడుకును తిరిగి బ్రతికించడానికి యెహోవా ఏలీయా ప్రవక్తకు శక్తిని ఇచ్చాడు. (1 రాజు. 17:21-23) తర్వాత ఎలీషా ప్రవక్త దేవుని సహాయంతో షూనేము స్త్రీ కొడుకును కూడా బ్రతికించాడు. (2 రాజు. 4:18-20, 34-37) బైబిల్లోని ఇలాంటి సంఘటనలు, యెహోవాకు చనిపోయిన వాళ్లను తిరిగి బ్రతికించే శక్తి ఉందని రుజువు చేస్తున్నాయి. యేసు భూమ్మీద ఉన్నప్పుడు యెహోవా ఆయనకు కూడా ఆ శక్తిని ఇచ్చాడు. (యోహా. 11:23-25, 43, 44) యేసు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనకు ‘పరలోకంలో, భూమ్మీద పూర్తి అధికారం ఇవ్వబడింది.’ కాబట్టి “సమాధుల్లో ఉన్న వాళ్లందర్నీ” తిరిగి బ్రతికించే శక్తి యేసుకు ఉంది. అలా తిరిగి బ్రతికిన వాళ్లకు శాశ్వత కాలం జీవించే అవకాశం ఉంటుంది.—మత్త. 28:18; యోహా. 5:25-29.

11. విమోచన క్రయధనం శాశ్వత జీవితాన్ని ఎలా సాధ్యం చేస్తుంది?

11 యెహోవా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఎందుకు చనిపోనిచ్చాడు? ఆ ప్రశ్నకు యేసు ఇలా జవాబిచ్చాడు: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” (యోహా. 3:16) మన పాపాల్ని క్షమించడం కోసం, దేవుడు తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా ఇచ్చి, మనం శాశ్వత జీవితాన్ని పొందడం సాధ్యం చేశాడు. (మత్త. 20:28) దేవుని ఉద్దేశం గురించిన ఈ ముఖ్యమైన సత్యాన్ని అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “ఎలాగైతే మరణం ఒక మనిషి ద్వారా వచ్చిందో, అలాగే మృతుల పునరుత్థానం కూడా ఒక మనిషి ద్వారానే కలుగుతుంది. ఆదాము వల్ల అందరూ చనిపోతున్నట్టే, క్రీస్తు వల్ల అందరూ బ్రతికించబడతారు.”—1 కొరిం. 15:21, 22.

12. యెహోవా తన ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తాడు?

12 దేవుని రాజ్యం రావాలి, భూమ్మీద దేవుని ఇష్టం నెరవేరాలి అని ప్రార్థించమని యేసు తన అనుచరులకు నేర్పించాడు. (మత్త. 6:9, 10) మనుషులు భూమ్మీద శాశ్వత కాలం జీవించాలన్నది కూడా దేవుని ఉద్దేశంలో ఒక భాగం. దాన్ని నెరవేర్చడం కోసం, యెహోవా తన కుమారుణ్ణి దేవుని రాజ్యానికి రాజుగా నియమించాడు. తన ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుతో పాటు కలిసి పనిచేసేలా 1,44,000 మందిని యెహోవా ఇప్పుడు సమకూరుస్తున్నాడు.—ప్రక. 5:9, 10.

13. యెహోవా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీరు ఏం చేయాలి?

13 నేడు యెహోవా “ఒక గొప్పసమూహాన్ని” సమకూరుస్తున్నాడు, దేవుని రాజ్యంలో ఎలా జీవించాలో వాళ్లకు నేర్పిస్తున్నాడు. (ప్రక. 7:9, 10; యాకో. 2:8) నేడు లోకంలో ఉన్న ప్రజలు ద్వేషం వల్ల ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు. కానీ గొప్పసమూహంలోని వాళ్లు ద్వేషాన్ని విడిచిపెట్టి, దేశం-జాతి అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్లు ఒక విధంగా ఇప్పుడే, తమ ఖడ్గాల్ని నాగటి నక్కులుగా మార్చుకుంటున్నారు. (మీకా 4:3) వాళ్లు ప్రాణాల్ని తీసే యుద్ధాల్లో పాల్గొనట్లేదు. బదులుగా, ప్రజలకు సత్య దేవుని గురించి, ఆయన ఉద్దేశాల గురించి నేర్పిస్తూ “వాస్తవమైన జీవితం” పొందడానికి సహాయం చేస్తున్నారు. (1 తిమో. 6:19) దేవుని రాజ్యానికి మద్దతిస్తున్నందుకు కొన్నిసార్లు కుటుంబ సభ్యులు వాళ్లను వ్యతిరేకించవచ్చు లేదా వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. అయినా యెహోవా వాళ్ల అవసరాల్ని తీరుస్తున్నాడు. (మత్త. 6:25, 30-33; లూకా 18:29, 30) ఇవన్నీ దేవుని రాజ్యం నిజంగా ఉందని, అది దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుందని రుజువు చేస్తున్నాయి.

బంగారు భవిష్యత్తు

14-15. మరణాన్ని నాశనం చేస్తానని యెహోవా ఇచ్చిన మాట ఎలా నెరవేరుతుంది?

14 యేసు ఇప్పుడు పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్నాడు, యెహోవా చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. (2 కొరిం. 1:20) యేసు 1914 నుండి దేవుని శత్రువుల్ని జయిస్తూ వస్తున్నాడు. (కీర్త. 110:1, 2) యేసు, ఆయన సహ పరిపాలకులు త్వరలోనే తమ విజయాన్ని పూర్తి చేస్తారు, చెడ్డ వాళ్లందర్నీ నాశనం చేస్తారు.—ప్రక. 6:2.

15 వెయ్యేళ్ల పరిపాలనలో, చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు. దేవునికి లోబడే వాళ్లందరూ పరిపూర్ణులౌతారు. చివరి పరీక్షలో యెహోవాకు నమ్మకంగా ఉన్న నీతిమంతులు “భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.” (కీర్త. 37:10, 11, 29) దాంతో ‘చివరి శత్రువైన మరణం’ నాశనమౌతుంది.—1 కొరిం. 15:26.

16. మనం యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటి?

16 మనం ఈ ఆర్టికల్‌లో చూసినట్లు, శాశ్వత జీవితం అనే బహుమతి కేవలం వట్టిమాట కాదు. దేవుని వాక్యం దాన్ని మాటిస్తోంది. ఆ బహుమతిని మనసులో ఉంచుకుంటే, కష్టమైన ఈ చివరి రోజుల్ని నమ్మకంగా సహించగలుగుతాం. అయితే కేవలం ఆ బహుమతి కోసమే మనం యెహోవాను సంతోషపెట్టాలనుకోం. మనం యెహోవాను, యేసును ఎంతో ప్రేమిస్తున్నాం కాబట్టే వాళ్లకు నమ్మకంగా ఉంటాం. (2 కొరిం. 5:14, 15) ఆ ప్రేమ వల్లే, మనం వాళ్ల లాంటి లక్షణాల్ని చూపించాలని, ఆ బహుమతి గురించి ఇతరులకు ప్రకటించాలని అనుకుంటాం. (రోమా. 10:13-15) నిస్వార్థంగా ఉండడం నేర్చుకుంటే, ఇచ్చే గుణాన్ని అలవర్చుకుంటే యెహోవా మనకు ఎప్పుడూ స్నేహితునిగా ఉండాలనుకుంటాడు.—హెబ్రీ. 13:16.

17. శాశ్వత జీవితం పొందాలంటే, మన బాధ్యత ఏంటి? (మత్తయి 7:13, 14)

17 శాశ్వత జీవితాన్ని పొందే వాళ్లలో మనం ఉంటామా? శాశ్వత జీవితానికి నడిపించే దారిని యెహోవా తెరిచాడు. అయితే ఆ దారిలోనే నడుస్తూ ఉండడం మన బాధ్యత. (మత్తయి 7:13, 14 చదవండి.) పరదైసులో శాశ్వత కాలం జీవించడం ఎలా ఉంటుంది? దాని గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 141 జీవం ఒక అద్భుతం

a చనిపోతాం అనే భయం లేకుండా శాశ్వతంగా జీవించే రోజు కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అలాంటి ఒకరోజు వస్తుందని యెహోవా మాటిచ్చాడు. యెహోవా తన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. దాన్ని నమ్మడానికి గల కొన్ని కారణాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

c చిత్రాల వివరణ: ఒక వృద్ధ సహోదరుడు, కొత్తలోకంలో ఏం చేయాలనుకుంటున్నాడో ఆలోచిస్తున్నాడు.