అధ్యయన ఆర్టికల్ 51
నిరీక్షణ మనల్ని నిరాశపర్చదు
“ఆ నిరీక్షణ మనల్ని నిరాశపర్చదు.”—రోమా. 5:5.
పాట 142 మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం
ఈ ఆర్టికల్‌లో . . . a
1. అబ్రాహాము తనకు కొడుకు పుడతాడని ఎందుకు నమ్మాడు?
యెహోవా తన స్నేహితుడైన అబ్రాహాముకు ఒక కొడుకు పుడతాడని, అతని నుండి వచ్చే జనాంగాలన్నీ దీవించబడతాయని మాటిచ్చాడు. (ఆది. 15:5; 22:18) అబ్రాహాముకు యెహోవా మీద చాలా విశ్వాసం ఉంది. కాబట్టి ఆ మాట నిజమౌతుందని నమ్మాడు. అయితే, అబ్రాహాముకు 100 ఏళ్లు, అతని భార్యకు 90 ఏళ్లు వచ్చినా వాళ్లకు పిల్లలు పుట్టలేదు. (ఆది. 21:1-7) కానీ బైబిలు ఏం చెప్తుందంటే, దేవుడిచ్చిన మాటకు అనుగుణంగా “తాను అనేక దేశాల ప్రజలకు తండ్రి అవుతానని [అబ్రాహాము] విశ్వసించాడు.” (రోమా. 4:18) అబ్రాహాము ఎదురుచూసింది నిజమైంది. అతనికి ఇస్సాకు పుట్టాడు. అయితే, దేవుడిచ్చిన మాటను అబ్రాహాము ఎందుకంత గట్టిగా నమ్మాడు?
2. దేవుడిచ్చిన మాటను అబ్రాహాము ఎందుకంత గట్టిగా నమ్మాడు?
2 ఎందుకంటే, అబ్రాహాముకు యెహోవా గురించి బాగా తెలుసు. కాబట్టి దేవుడిచ్చిన మాట నిజమౌతుందని “అబ్రాహాము పూర్తిగా నమ్మాడు.” (రోమా. 4:21) అందుకే, యెహోవా అతన్ని ఆమోదించాడు. అతని విశ్వాసాన్ని బట్టి నీతిమంతునిగా ఎంచాడు. (యాకో. 2:23) రోమీయులు 4:18 చెప్తున్నట్టు అబ్రాహాముకు విశ్వాసం ఉంది, నిరీక్షణ కూడా ఉంది. అయితే, అపొస్తలుడైన పౌలు రోమీయులు 5వ అధ్యాయంలో నిరీక్షణ గురించి ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం.
3. పౌలు మన నిరీక్షణ గురించి ఏం వివరిస్తున్నాడు?
3 మన “నిరీక్షణ మనల్ని నిరాశపర్చదని” ఎందుకు నమ్మకంతో ఉండవచ్చో పౌలు వివరిస్తున్నాడు. (రోమా. 5:5) అంతేకాదు, మన నిరీక్షణ రోజురోజుకీ ఎలా బలపడుతుందో కూడా ఆయన చెప్పాడు. రోమీయులు లో పౌలు చెప్తున్న మాటలు చదువుతుండగా మీ నిరీక్షణ రోజురోజుకీ ఎలా బలపడుతుందో ఆలోచించండి. ముందుగా, ఎప్పుడూ నిరాశపర్చని అద్భుతమైన నిరీక్షణ గురించి పౌలు ఏం చెప్పాడో చూద్దాం. 5:1-5
అద్భుతమైన నిరీక్షణ
4. రోమీయులు 5:1, 2 లో పౌలు దేనిగురించి మాట్లాడాడు?
4 రోమీయులు 5:1, 2 చదవండి. పౌలు ఈ మాటల్ని రోములో ఉన్న సంఘానికి రాశాడు. అక్కడున్న బ్రదర్స్-సిస్టర్స్ యెహోవా గురించి, యేసు గురించి నేర్చుకున్నారు. అంతేకాదు, వాళ్లు నేర్చుకున్న వాటిమీద విశ్వాసం చూపించి క్రైస్తవులుగా మారారు. అందుకే, దేవుడు వాళ్ల విశ్వాసాన్నిబట్టి వాళ్లను “నీతిమంతులుగా” ఎంచాడు, అలాగే పవిత్రశక్తితో అభిషేకించాడు. దాంతో వాళ్లు ఖచ్చితంగా నిజమయ్యే అద్భుతమైన నిరీక్షణ పొందారు.
5. అభిషిక్త క్రైస్తవులకు ఏ నిరీక్షణ ఉంది?
5 పౌలు ఆ తర్వాత ఎఫెసులోని అభిషిక్త క్రైస్తవులకు దేవుడిచ్చిన నిరీక్షణ గురించి రాశాడు. వాళ్లు “పవిత్రులకు స్వాస్థ్యంగా” ఇచ్చిన నిరీక్షణను పొందుతారు. (ఎఫె. 1:18) అంతేకాదు, కొలొస్సయి సంఘంలోనివాళ్లు ఎదురుచూస్తున్నది ఎక్కడ పొందుతారో కూడా పౌలు చెప్పాడు. ఆయన దాన్ని “పరలోకంలో మీకోసం సిద్ధంగా ఉన్నవాటి మీద మీకున్న నిరీక్షణ” అని పిలిచాడు. (కొలొ. 1:4, 5) కాబట్టి ఆ అభిషిక్త క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఏంటంటే, పరలోకంలో శాశ్వతంగా జీవించడానికి పునరుత్థానమై, క్రీస్తుతోపాటు పరిపాలించడం.—1 థెస్స. 4:13-17; ప్రక. 20:6.
6. అభిషిక్త క్రైస్తవుడైన బ్రదర్ ఫ్రెడ్‌రిక్ ఫ్రాంజ్ తన నిరీక్షణ గురించి ఏం చెప్పాడు?
6 ఆ నిరీక్షణను అభిషిక్త క్రైస్తవులు చాలా విలువైనదిగా చూస్తారు. వాళ్లలో ఒకరైన బ్రదర్ ఫ్రెడ్‌రిక్ ఫ్రాంజ్ మనస్ఫూర్తిగా ఇలా అన్నాడు: “మా నిరీక్షణ చాలా ఖచ్చితమైనది. మా నిరీక్షణ మేము ఊహించిన దానికన్నా ఎంతో గొప్పగా నెరవేరుతుంది. అది చిన్న మందలో ఉన్న 1,44,000 లోని చివరి వ్యక్తి వరకు ఖచ్చితంగా నెరవేరుతుంది.” బ్రదర్ ఫ్రాంజ్ కొన్ని దశాబ్దాలు నమ్మకంగా సేవచేసిన తర్వాత, 1991 లో ఇలా అన్నాడు: “ఆ నిరీక్షణకు ఉన్న విలువ ఏమాత్రం తగ్గిపోలేదు. . . . [మేము] దానిగురించి ఎంతెక్కువ ఎదురుచూస్తే, దాని విలువ అంతెక్కువ పెరిగింది. అది ఎంత విలువైనదంటే దానికోసం కొన్ని లక్షల సంవత్సరాలైనా ఎదురుచూడవచ్చు. నేను ముందెప్పటికన్నా మా నిరీక్షణను విలువైనదిగా చూస్తున్నాను.”
7-8. మనలో చాలామందికి ఏ నిరీక్షణ ఉంది? (రోమీయులు 8:20, 21)
7 ప్రస్తుతం దేవుని సేవకుల్లో చాలామందికి అబ్రాహాముకు ఉన్నలాంటి నిరీక్షణే ఉంది. అదేంటంటే, దేవుని రాజ్యంలో శాశ్వతకాలం ఇదే భూమ్మీద జీవించడం. (హెబ్రీ. 11:8-10, 13) ఆ నిరీక్షణ ఉన్నవాళ్లు పొందబోయే ఎన్నో అద్భుతమైన దీవెనల గురించి పౌలు రాశాడు. (రోమీయులు 8:20, 21 చదవండి.) భవిష్యత్తు గురించి బైబిలు చెప్పేవి మొదటిసారి విన్నప్పుడు మీకేది బాగా నచ్చింది? మీలో పాపం పోయి, పరిపూర్ణులౌతారు అనే విషయమా లేదా చనిపోయిన మీ ప్రియమైనవాళ్లు బ్రతికొస్తారు అనే విషయమా? దేవుడిచ్చిన నిరీక్షణను బట్టి ఇవేకాదు ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మీరు ఎదురుచూడవచ్చు.
8 మనం పరలోకంలో శాశ్వతకాలం జీవించడానికి ఎదురుచూస్తున్నా, లేదా భూమ్మీద శాశ్వతకాలం జీవించడానికి ఎదురుచూస్తున్నా మనకున్న గొప్ప నిరీక్షణనుబట్టి సంతోషించవచ్చు. అంతేకాదు, ఆ నిరీక్షణ రోజురోజుకు బలపడుతుంది. అదెలాగో పౌలు రాసిన తర్వాతి మాటల్ని పరిశీలించి తెలుసుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఆ నిరీక్షణ గురించి పౌలు ఏం చెప్పాడో, అది నిజమౌతుందనే మన నమ్మకాన్ని ఎలా బలపర్చుకోవచ్చో చూద్దాం.
మన నిరీక్షణ రోజురోజుకు ఎలా బలపడుతుంది?
9-10. పౌలు ఉదాహరణను బట్టి క్రైస్తవులందరూ దేని కోసం ఎదురుచూడవచ్చు? (రోమీయులు 5:3) (చిత్రాలు కూడా చూడండి.)
9 రోమీయులు 5:3 చదవండి. మనకు శ్రమలు వచ్చినప్పుడు మన నిరీక్షణ ఇంకా బలపడవచ్చు. ఈ విషయం మనకు కాస్త వింతగా అనిపిస్తుంది. కానీ క్రీస్తు అనుచరులందరూ శ్రమలు వస్తాయని ఎదురుచూడవచ్చు. పౌలు ఉదాహరణే తీసుకోండి. ఆయన థెస్సలొనీకయులకు ఇలా చెప్పాడు: “మేము మీ దగ్గర ఉన్నప్పుడు, మనకు శ్రమలు వస్తాయని ముందుగానే మీతో చెప్తూ వచ్చాం. ఇప్పుడు జరిగింది అదేనని మీకు తెలుసు.” (1 థెస్స. 3:4) అలాగే కొరింథీయులకు ఇలా రాశాడు: “సహోదరులారా, . . . మాకు ఎదురైన శ్రమ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం. మేము . . . ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాం.”—2 కొరిం. 1:8; 11:23-27.
10 ఈరోజుల్లో క్రైస్తవులందరికీ ఏదోక రకమైన శ్రమలు రావచ్చు. (2 తిమో. 3:12) మరి మీ సంగతేంటి? క్రీస్తు మీద విశ్వాసం ఉంచి, ఆయన్ని అనుసరిస్తున్నందుకు మీరేమైనా శ్రమలు ఎదుర్కొన్నారా? బహుశా మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని ఎగతాళి చేసుండొచ్చు, మీతో క్రూరంగా ప్రవర్తించి ఉండొచ్చు, లేదా ఉద్యోగ స్థలంలో నిజాయితీగా ఉన్నందుకు ఇబ్బంది ఎదురై ఉండొచ్చు. (హెబ్రీ. 13:18) మీ నిరీక్షణ గురించి ఇతరులతో చెప్పినప్పుడు ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఎదురై ఉండొచ్చు. అయితే, మనకు ఎలాంటి శ్రమ ఎదురైనా సంతోషంగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. ఎందుకు?
11. మనం శ్రమల్ని సహించాలని ఎందుకు తీర్మానించుకోవాలి?
11 శ్రమలు ఏం పుట్టిస్తాయో ఆలోచించినప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. రోమీయులు 5:3 చెప్తున్నట్లు “శ్రమలు సహనాన్ని పుట్టిస్తాయి.” క్రైస్తవులందరికీ శ్రమలు వస్తాయి కాబట్టి, మనకు సహనం అవసరం. మనకు ఎలాంటి శ్రమలు ఎదురైనా వాటిని సహించాలని తీర్మానించుకోవాలి. ఎందుకంటే, అలా సహించినప్పుడే మన నిరీక్షణ నిజమవ్వడాన్ని చూస్తాం. యేసు చెప్పిన ఉదాహరణలోని రాతి నేలలా ఉండాలని మనలో ఎవ్వరం కోరుకోం. అలాంటివాళ్లు, మొదట్లో దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. కానీ “శ్రమలు . . . హింసలు” ఎదురైనప్పుడు విశ్వాసాన్ని వదిలేస్తారు. (మత్త. 13:5, 6, 20, 21) నిజమే వ్యతిరేకత, శ్రమలు ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. కానీ ఎదుర్కొంటే చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
12. సహించడంవల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?
12 శ్రమల్ని సహించడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి శిష్యుడైన యాకోబు చెప్తున్నాడు. ఆయన ఇలా రాశాడు: “సహనం తన పనిని పూర్తిచేయనివ్వండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంపూర్ణులుగా, నిర్దోషులుగా, దేనిలోనూ లోపంలేని వాళ్లుగా ఉండగలుగుతారు.” (యాకో. 1:2-4) యాకోబు ఇక్కడ సహనానికి ఒక పని ఉందని, దాన్ని పూర్తి చెయ్యనివ్వాలని చెప్తున్నాడు. ఇంతకీ సహనానికి ఉన్న పని ఏంటి? అది ఓర్పు, విశ్వాసం, దేవుని మీద ఆధారపడడం లాంటి లక్షణాల్ని ఇంకా పెంచుతుంది. అయితే, సహించడంవల్ల వచ్చే ఇంకొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటో ఇప్పుడు చూద్దాం.
13-14. సహనం ఏం తెస్తుంది? దానివల్ల మన నిరీక్షణ ఏమౌతుంది? (రోమీయులు 5:4)
13 రోమీయులు 5:4 చదవండి. “సహనం దేవుని అనుగ్రహాన్ని” లేదా ఆమోదాన్ని తెస్తుందని పౌలు చెప్పాడు. కాబట్టి మీరు కష్టాల్ని సహిస్తే యెహోవా ఆమోదం పొందుతారు. అంటే దానర్థం, మీరు కష్టాలు-బాధలు పడడం చూసి యెహోవా సంతోషిస్తాడని కాదు. బదులుగా, మీరు నమ్మకంగా కష్టాల్ని సహిస్తున్నందుకు యెహోవా మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. అలా సహిస్తే, యెహోవా హృదయాన్ని సంతోషపెడతామని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహంగా ఉందో కదా!—కీర్త. 5:12.
14 అబ్రాహాము ఎన్నో కష్టాలు పడ్డాడని పై పేరాల్లో చూశాం. వాటిని నమ్మకంగా సహించినందుకు యెహోవా అతన్ని చూసి సంతోషించాడు. అంతేకాదు, ఆయన అబ్రాహామును స్నేహితునిగా చూశాడు, నీతిమంతునిగా ఎంచాడు. (ఆది. 15:6; రోమా. 4:13, 22) మన విషయంలో కూడా యెహోవా అలాగే చేస్తాడు. దేవుని ఆమోదం, ఆయన సేవలో మనం ఎంతపని చేశాం, ఎలాంటి సేవాధిక్యతలు పొందాం అనే దానిమీద కాదుగానీ, మనం కష్టాల్ని ఎంత నమ్మకంగా సహించాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ వయసు వాళ్లమైనా, మన సామర్థ్యాలు-పరిస్థితులు ఏవైనా మనందరం సహించవచ్చు. ప్రస్తుతం మీరేదైనా కష్టాన్ని నమ్మకంగా సహిస్తున్నారా? అలాగైతే మీకు దేవుని ఆమోదం ఉందని మర్చిపోకండి. అంతేకాదు, దేవుని ఆమోదం ఉందని తెలుసుకున్నప్పుడు మీ నిరీక్షణ నిజమౌతుంది అనే మీ నమ్మకం ఇంకా బలపడుతుంది.
నిరాశపర్చని నిరీక్షణ
15. పౌలు రోమీయులు 5:4, 5 లో ఏం చెప్పాడు? అది ఎందుకు కొంతమందిని తికమక పెట్టవచ్చు?
15 కష్టాల్ని నమ్మకంగా సహిస్తే దేవుని ఆమోదం ఉంటుందని పౌలు చెప్పాడు. అయితే, ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడో గమనించండి: “దేవుని అనుగ్రహం నిరీక్షణను కలిగిస్తుందని మనకు తెలుసు. ఆ నిరీక్షణ మనల్ని నిరాశపర్చదని కూడా మనకు తెలుసు” (రోమా. 5:4, 5) ఇది కొంతమందిని తికమక పెట్టవచ్చు. ఎందుకు? ఎందుకంటే రోమీయులు 5:2 లో పౌలు రోములో ఉన్నవాళ్లకు అప్పటికే “దేవుని మహిమను పొందే నిరీక్షణ” ఉందని రాశాడు. అయితే, ‘వాళ్లకు అప్పటికే ఆ నిరీక్షణ ఉన్నప్పుడు, మళ్లీ నిరీక్షణ గురించి పౌలు ఎందుకు రాశాడు?’ అని కొంతమంది అనుకోవచ్చు.
16. ఒక వ్యక్తిలో నిరీక్షణ రోజురోజుకీ ఎలా బలపడవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
16 నిరీక్షణ రోజురోజుకు పెరుగుతుంది అనే విషయం గమనించినప్పుడు, పౌలు ఆ లేఖనంలో అన్న మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన నిరీక్షణ గురించి మీరు మొదటిసారి విన్నప్పుడు మీకెలా అనిపించింది? పరదైసు భూమ్మీద శాశ్వత జీవితం అనే ఆలోచన బాగుంది గానీ అది నిజంగా జరుగుతుందా అని మీకు అనిపించివుండవచ్చు. అయితే యెహోవా గురించి, ఆయన మాటిచ్చిన వాటిగురించి తెలుసుకునేకొద్దీ మీ నిరీక్షణ నిజమౌతుందనే నమ్మకం బలపడింది.
17. మీరు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మీ నిరీక్షణ ఎలా బలపడుతూ వస్తుంది?
17 సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా యెహోవా గురించి నేర్చుకునేకొద్దీ, ఆయన్ని ప్రేమించేకొద్దీ మీ నిరీక్షణ ఇంకా బలపడుతూ వచ్చింది. (హెబ్రీ. 5:13–6:1) బహుశా రోమీయులు 5:2-4 లోని మాటలు మీ విషయంలో నిజమై ఉంటాయి. మీరు ఎన్నో శ్రమల్ని ఎదుర్కొన్నారు. వాటిని నమ్మకంగా సహించడం వల్ల దేవుని ఆమోదాన్ని రుచిచూశారు. దేవుని ఆమోదం మీకుందని, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకం మీకు కుదిరింది. కాబట్టి ఆయన మాటిచ్చినవి నిజమౌతాయని ఎదురుచూడడానికి ఇప్పుడు మీకు ఇంకా మంచి కారణాలు ఉన్నాయి. మీ నిరీక్షణ మొదట్లో కన్నా ఇప్పుడు ఇంకా బలపడివుంటుంది. అదిప్పుడు మీకు ఇంకా వాస్తవంగా ఉంది. ఆ నిరీక్షణ మీ జీవితాన్ని చాలా మార్చి ఉంటుంది. బహుశా, మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించే విధానం, మీరు తీసుకునే నిర్ణయాలు, ఆఖరికి మీరు ఉపయోగించే సమయం కూడా మారి ఉంటుంది.
18. పవిత్రశక్తి ప్రేరణతో పౌలు క్రైస్తవులకు ఏ భరోసాను ఇచ్చాడు?
18 దేవుని ఆమోదం పొందిన తర్వాత మీకున్న నిరీక్షణ గురించి పౌలు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాడు. మీ నిరీక్షణ నిజమౌతుంది అనే భరోసాను ఆయన ఇస్తున్నాడు. మనం అంత నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు? పవిత్రశక్తి ప్రేరణతో క్రైస్తవులకు పౌలు ఈ భరోసాను ఇస్తున్నాడు: “ఆ నిరీక్షణ మనల్ని నిరాశపర్చదని కూడా మనకు తెలుసు; ఎందుకంటే మనకు ఇవ్వబడిన పవిత్రశక్తి ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో నింపబడింది.” (రోమా. 5:5) కాబట్టి మీ నిరీక్షణ ఖచ్చితంగా నిజమౌతుందని నమ్మడానికి సరైన కారణమే ఉంది!
19. మీ నిరీక్షణ గురించి ఏ నమ్మకంతో ఉండవచ్చు?
19 అబ్రాహాముకు యెహోవా ఇచ్చిన మాట గురించి, దేవుడు అతన్ని ఎలా ఆమోదించి స్నేహితునిగా చూశాడనే దానిగురించి ఆలోచించండి. అబ్రాహాము నిరీక్షించింది నిజమైంది. బైబిలు ఇలా చెప్తుంది: “అబ్రాహాము ఓర్పు చూపించిన తర్వాత ఆ వాగ్దానం పొందాడు.” (హెబ్రీ. 6:15; 11:9, 18; రోమా. 4:20-22) నిరీక్షణ అతన్ని నిరాశపర్చలేదు. మీరు నమ్మకంగా ఉంటే మీరు నిరీక్షించింది కూడా పొందుతారు. మీ నిరీక్షణ వాస్తవమైంది. అది నిరాశపర్చదు కానీ మీకు సంతోషాన్ని ఇస్తుంది. (రోమా. 12:12) పౌలు ఇలా రాశాడు: “నిరీక్షణను ఇచ్చే దేవుడు మీరు తన మీద ఉంచిన నమ్మకం ద్వారా మీలో గొప్ప సంతోషాన్ని, శాంతిని నింపాలని కోరుకుంటున్నాను. అప్పుడు పవిత్రశక్తి బలం ద్వారా మీ నిరీక్షణ పొంగిపొర్లుతుంది.”—రోమా. 15:13, అధస్సూచి.
పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!
a భవిష్యత్తు గురించి నిరీక్షించడంలో ఏమేమి ఉన్నాయో అలాగే అవి నిజమౌతాయని మనం ఎందుకు నమ్మవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు, సత్యం నేర్చుకున్న కొత్తలో మనకున్న నిరీక్షణకు, ఇప్పుడు మనకున్న నిరీక్షణకు తేడా ఏంటో అర్థం చేసుకోవడానికి రోమీయులు 5వ అధ్యాయం మనకు సహాయం చేస్తుంది.