మద్యం గురించి దేవుని అభిప్రాయం
యెహోవా మనకు చాలా బహుమతులు ఇచ్చాడు. వాటన్నిటిని బహుశా మీరు విలువైనవిగా చూస్తారు. అంతేకాదు, ఆ బహుమతుల్ని ఎలా ఉపయోగించాలో సొంతగా నిర్ణయించుకునే స్వేచ్ఛను కూడా ఆయన ఇచ్చాడు. ఆసక్తికరంగా ద్రాక్షారసం దేవుడిచ్చిన బహుమతి అని బైబిలు చెప్తుంది. అంతేకాదు “నవ్వుల కోసం ఆహారం, జీవితాన్ని ఆనందించడం కోసం ద్రాక్షారసం ఉన్నాయి” అని కూడా బైబిలు చెప్తుంది. (ప్రసం. 10:19; కీర్త. 104:15) కానీ బహుశా మద్యం తాగడంవల్ల జీవితాల్ని వీధిన పడేసుకున్న వాళ్లను మీరు చూసుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా మద్యం తాగడం గురించి ప్రజలకు రకరకాల అభిప్రాయాలున్నాయి. మరి, క్రైస్తవులు ఈ విషయంలో ఎలా తెలివైన నిర్ణయాలు తీసుకోవచ్చు?
మనం ఏ దేశంలో, ఏ సంస్కృతిలో పుట్టి-పెరిగినా మనం తీసుకునే నిర్ణయాలు దేవుని ఆలోచనల ప్రకారంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది, సంతోషంగా కూడా ఉంటాం.
బహుశా కొంతమంది సందు దొరికితే మద్యం తాగడాన్ని, అది కూడా ఒళ్లు మర్చిపోయేంతగా తాగడాన్ని మీరు చూసుంటారు. ఇంకొంతమంది కాస్త సేదదీరడానికి మద్యం తాగడం మీరు చూసుంటారు. మరికొంతమంది సమస్యల్ని తట్టుకోవడానికి మద్యం తాగుతుంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లోనైతే వాళ్ల గొప్పతనాన్ని, వాళ్ల బలాన్ని చూపించుకోవడానికి పీపాలు-పీపాలు తాగుతుంటారు.
కానీ క్రైస్తవులు తెలివైన నిర్ణయం తీసుకునేలా ప్రేమగల సృష్టికర్త సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకు, మితిమీరి మద్యం తాగడంవల్ల వచ్చే చెడు పర్యవసానాల గురించి ఆయన హెచ్చరించాడు. ఒకవ్యక్తి తాగుబోతుగా మారితే వచ్చే సమస్యల గురించి సామెతలు 23:29-35 వివరిస్తుంది. a యూరప్‌లో ఉంటున్న డానియేల్ అనే సంఘపెద్ద, యెహోవాసాక్షి అవ్వడానికి ముందు తన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అన్నాడు: “నేను విపరీతంగా తాగడం వల్ల చాలా చెడు నిర్ణయాలు తీసుకున్నాను. వాటివల్ల నా మనసుకు మానని గాయాలు ఎన్నో అయ్యాయి.”
క్రైస్తవులు తమకున్న స్వేచ్ఛను ఎలా ఉపయోగించవచ్చు? మితిమీరి మద్యం తాగడం వల్ల వచ్చే సమస్యల్ని ఎలా దూరం చూసుకోవచ్చు? దానికోసం మన నిర్ణయాలు, పనులు దేవుని ఆలోచనకు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి.
మద్యం గురించి బైబిలు ఏం చెప్తుందో, కొంతమంది ఏ ఉద్దేశంతో తాగుతారో ఇప్పుడు చూద్దాం.
మద్యం తాగడం గురించి బైబిలు అభిప్రాయం
మితంగా తాగడాన్ని బైబిలు తప్పుబట్టట్లేదు. నిజానికి ద్రాక్షారసం తాగడం వల్ల హృదయం సంతోషంగా ఉంటుందని బైబిలు చెప్తుంది. మనమిలా చదువుతాం: “సంతోషంగా భోజనం చేయి, ఉల్లాస హృదయంతో ద్రాక్షారసం తాగు.” (ప్రసం. 9:7) యేసు కూడా ఒక సందర్భంలో ద్రాక్షారసం తాగాడు. అంతేకాదు, కొంతమంది వేరే నమ్మకమైన యెహోవా సేవకులు కూడా తాగారు.—మత్త. 26:27-29; లూకా 7:34; 1 తిమో. 5:23.
అయితే, మద్యం మితంగా తీసుకోవడాన్ని బైబిలు తప్పుబట్టకపోయినా తాగుబోతుతనాన్ని తప్పని చెప్తుంది. బైబిలు స్పష్టంగా ఇలా చెప్తుంది: “మద్యం మత్తులో ఉండకండి.” (ఎఫె. 5:18) అంతేకాదు, ‘తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు’ అని కూడా అది చెప్తుంది. (1 కొరిం. 6:10) అవును, మితిమీరి తాగడాన్ని అలాగే తాగుబోతుతనాన్ని యెహోవా అస్సలు ఇష్టపడడు. అయితే, మద్యం గురించి కేవలం మన సంస్కృతిలో ఉన్న ఆలోచనల్ని బట్టి కాకుండా యెహోవా ఆలోచనను బట్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
ఎంత తాగినా నేను మద్యానికి బానిస అవ్వనని కొంతమంది అనుకోవచ్చు. కానీ అది చాలా ప్రమాదకరం. “మద్యానికి బానిసలు” అయ్యే పురుషుడు (లేదా స్త్రీ) యెహోవాకు విరుద్ధంగా ఘోరమైన పాపం చేసే అవకాశం ఉందని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. (తీతు 2:3; సామె. 20:1) అంతేకాదు, “అతిగా తాగడం వల్ల” కొత్త లోకానికి వెళ్లే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని యేసు కూడా చెప్పాడు. (లూకా 21:34-36) మరైతే, అతిగా మద్యం తాగే ఊబిలో చిక్కుకోకుండా క్రైస్తవుల్ని ఏది కాపాడుతుంది?
మీరు ఎప్పుడు, ఎందుకు, ఎంత తాగుతున్నారో చూసుకోండి
మద్యం తాగే విషయంలో సంస్కృతిని బట్టి నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. క్రైస్తవులు తాగడం, తినడం గురించి యెహోవాను ఏది సంతోషపెడుతుందో ఆలోచించడం తెలివైన పని. బైబిలు ఇలా చెప్తుంది: “మీరు తిన్నా, తాగినా, ఇంకేమి చేసినా అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి.” (1 కొరిం. 10:31) అయితే తాగడం గురించి కొన్ని ప్రశ్నల్ని, బైబిలు సూత్రాల్ని ఇప్పుడు చూద్దాం:
నేను నలుగురి కోసం తాగుతున్నానా? నిర్గమకాండం 23:2 ఇలా చెప్తుంది: “సమూహంతో పాటు వెళ్లకూడదు.” తనను ఆరాధించనివాళ్ల వెనక వెళ్లకూడదని యెహోవా ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు. ఆ సలహా ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. మద్యం తాగే విషయంలో మన చుట్టూవున్న వాళ్ల అభిప్రాయాల ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటే యెహోవాకు దూరమౌతాం. ఆయన ప్రమాణాల్ని కూడా మీరే ప్రమాదం ఉంది.—రోమా. 12:2.
నా బలం చూపించుకోవడానికి తాగుతున్నానా? కొన్ని సంస్కృతుల్లో చీటికిమాటికి తాగడం, అతిగా తాగడం సర్వసాధారణం. (1 పేతు. 4:3) కానీ 1 కొరింథీయులు 16:13 మనల్ని ఏమని ప్రోత్సహిస్తుందో గమనించండి: “మెలకువగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, బలవంతులు అవ్వండి.” నిజానికి, మద్యం తాగే వ్యక్తి బలవంతుడు అవ్వగలుగుతాడా? అస్సలు అవ్వలేడు. దానికి బదులు, మద్యం మత్తెక్కిస్తుంది కాబట్టి అతను సరిగ్గా ఆలోచించలేడు, సరైన నిర్ణయాలు తీసుకోలేడు. అంతేకాదు, మద్యం అతిగా తాగడం బలానికి సూచన కాదుగానీ బలహీనతకు సూచన. యెషయా 28:7 ఏం చెప్తుందంటే, మద్యం అతిగా తాగేవాళ్లు తప్పుదారి పడతారు, తూలుతారు, తడబడతారు.
నిజమైన బలం యెహోవా ఇస్తాడు. (కీర్త. 18:32) దానికోసం మనం మెలకువగా ఉంటూ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మనం అతిగా మద్యం తాగడం వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండడానికి జాగ్రత్తపడాలి, యెహోవాతో మన బంధాన్ని బలపర్చే నిర్ణయాల్ని తీసుకోవాలి. యేసు భూమ్మీద ఉన్నప్పుడు అలాంటి బలాన్నే చూపించాడు. ఆయన చూపించిన ధైర్యాన్ని, సరైనది చేయాలనే ఆయన పట్టుదలను చూసి ప్రజలు ఆయన్ని గౌరవించారు.
నా సమస్యల్ని తప్పించుకోవడానికి మందు తాగుతున్నానా? ఒక కీర్తనకర్త ఇలా రాశాడు: “ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు నువ్వే [యెహోవా] నన్ను ఓదార్చావు, ఊరడించావు.” (కీర్త. 94:19) కష్టాలు మనల్ని ముంచెత్తినప్పుడు ఉపశమనం కోసం, ఓదార్పు కోసం యెహోవావైపు చూడండి, మద్యం వైపు కాదు. దానికోసం ఒక చక్కని మార్గం ఏంటంటే, యెహోవాకు ఎక్కువసార్లు ప్రార్థన చేయడం. అంతేకాదు, సంఘంలో పరిణతిగల ఒక స్నేహితుని సలహా తీసుకోవడం కూడా ఉపయోగపడవచ్చు. నిజానికి కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి మందు తాగితే, సరైనది చేసే మీ సామర్థ్యం తగ్గిపోవచ్చు. (హోషే. 4:11) ముందు పేరాల్లో ప్రస్తావించిన డానియేల్ ఇలా ఒప్పుకుంటున్నాడు: “నాకు చాలా ఆందోళనగా, ఏదో తప్పు చేసినట్టుగా అనిపించేది. వాటిని తట్టుకోవడానికి నేను మందు తాగేవాణ్ణి. కానీ, దానివల్ల నా సమస్యలు ఇంకా పెరిగాయి గానీ తగ్గలేదు. నా స్నేహితులు దూరమయ్యారు. నా ఆత్మగౌరవం పోయింది.” మరి, డానియేల్‌కి ఏది సహాయం చేసింది? ఆయన ఇలా అంటున్నాడు: “కష్టాలు వచ్చినప్పుడు నేను ఆధారపడాల్సింది యెహోవా మీద గానీ మందు మీద కాదు. చివరికి, యెహోవా సహాయంతో నేను ఆ సమస్యల్ని తట్టుకొని, వాటిని పరిష్కరించుకోగలిగాను.” నిజానికి, మన పరిస్థితి చేయి దాటిపోయినట్టు అనిపించినా, యెహోవా మాత్రం ఎప్పుడూ మనకు సహాయం చేయడానికి తన చేయి అందిస్తూనే ఉంటాడు.—ఫిలి. 4:6, 7; 1 పేతు. 5:7.
మీరు ఎన్నిసార్లు మందు తాగుతున్నారో లేదా ఎంత తాగుతున్నారో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘నా కుటుంబంలో ఎవరైనా లేదా నా దగ్గరి స్నేహితుల్లో ఎవరైనా నేను ఎక్కువ తాగుతున్నాను అని చెప్పారా?’ అలాగైతే, మీకు తెలీకుండానే మందు తాగడం మీకొక వ్యసనంగా మారుతుందని అది సూచిస్తుండవచ్చు. ‘నేను ఇంతకుముందు కన్నా ఎక్కువ తాగుతున్నానా?’ మీ పరిస్థితి అదే అయితే, బహుశా మీరు మద్యానికి బానిస అవ్వడానికి ఎంతో దూరంలో లేరు. ‘మందు తాగకుండా కొన్ని రోజులు కూడా ఉండలేకపోతున్నానా?’ అలాగైతే, మీరు దానికి పూర్తిగా బానిసయ్యారని అర్థం. బహుశా మీరు ఆ సమస్య నుండి బయటపడాలంటే డాక్టర్ల సహాయం కూడా తీసుకోవాల్సి రావచ్చు.
మందు తాగడంవల్ల వచ్చే సమస్యలు లేదా ప్రమాదాల్ని మనసులో ఉంచుకొని, కొంతమంది క్రైస్తవులు అస్సలు మందు తాగొద్దని నిర్ణయించుకోవచ్చు. ఇంకొంతమంది, దాని రుచి నచ్చక తాగొద్దు అనుకోవచ్చు. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా, ఈ నిర్ణయాల్లో ఏదైనా ఒకటి తీసుకుంటే వాళ్లను ఎగతాళి చేయకుండా, దయతో వాళ్ల నిర్ణయాన్ని గౌరవించండి.
లేదా ఒక క్రైస్తవుడు ఎంత తాగాలి, ఎన్నిసార్లు తాగాలి అనే దానికి సంబంధించి కొన్ని హద్దులు పెట్టుకోవాలి అనుకోవచ్చు. బహుశా వారానికి ఒక్కసారి లేదా భోజనం చేస్తున్నప్పుడు
కొంత మద్యం తీసుకోవాలని అతను అనుకోవచ్చు. ఇంకొంతమంది ఎలాంటి మద్యం తీసుకోవాలని అనే దానిగురించి హద్దులు పెట్టుకుంటారు. బహుశా వాళ్లు కొంత మోతాదులో వైన్ లేదా బీర్ తాగాలని అనుకోవచ్చు. కానీ ఎక్కువ మత్తును ఇచ్చే మద్యాన్ని లేదా రకరకాల మద్యం, పండ్ల రసాలు కలిపి తయారుచేసిన కాక్‌టేయిల్స్ లాంటివి తాగొద్దని అనుకోవచ్చు. ఒకవ్యక్తి తాగే విషయంలో ఇలా స్పష్టమైన హద్దులు పెట్టుకున్నప్పుడు, వాటికి కట్టుబడి ఉండడం ఆయనకు తేలికౌతుంది. అయితే, ఈ నిర్ణయాల్లో ఏదైనా ఒకటి తీసుకున్నందుకు వేరేవాళ్లు ఏమనుకుంటారో అని ఒక పరిణతిగల క్రైస్తవుడు ఆలోచించాల్సిన అవసరంలేదు.మద్యం గురించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించడం కూడా మంచిది. రోమీయులు 14:21 ఇలా చెప్తుంది: “మాంసం తినడమైనా, ద్రాక్షారసం తాగడమైనా, నీ సహోదరుణ్ణి విశ్వాసంలో తడబడేలా చేసే ఏ పనైనా చేయకపోవడమే మంచిది.” ఈ సలహాను మీరెలా పాటించవచ్చు? బ్రదర్స్-సిస్టర్స్ మీద ప్రేమ చూపించండి. మీరు మందు తాగడం చూసి ఎవరైనా అభ్యంతరపడతారని అనిపిస్తే, ఆ సందర్భంలో తాగకపోవడమే మంచిది. అలా చేసినప్పుడు ఇతరుల మీద మీకు ప్రేమ, గౌరవం ఉందని చూపిస్తారు. అలాగే మీ ప్రయోజనం కన్నా, ఇతరుల ప్రయోజనం గురించే ఎక్కువ ఆలోచించిన వాళ్లౌతారు.—1 కొరిం. 10:24.
అంతేకాదు, మద్యం గురించి ప్రభుత్వం కూడా కొన్ని నియమాలు పెట్టుండవచ్చు. వాటిని క్రైస్తవులు తప్పకుండా పాటించాలి. బహుశా అందులో మందు తాగాలంటే కనీసం ఇంత వయసు ఉండాలని, లేదా మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని, కొన్ని రకాల మెషీన్లు వాడకూడదని ప్రభుత్వం చెప్పుండవచ్చు.—రోమా. 13:1-5.
యెహోవా నుండి వచ్చిన ఎన్నో బహుమతుల్ని స్వేచ్ఛగా వాడే స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఆయన మనల్ని గౌరవించాడు. అందులో మనమేం తింటాం, ఏం తాగుతాం అని నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛను మనం విలువైనదిగా చూస్తున్నామని యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకుని చూపిద్దాం.
a అమెరికాలోని ఒక ఆరోగ్య సంస్థ అతిగా మద్యం తాగడంవల్ల ఈ పర్యవసానాలు వస్తాయని చెప్పింది: హత్యలు, ఆత్మహత్యలు, లైంగిక దాడులు, గృహహింస, సుఖవ్యాధులు, అబార్షన్.