కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఈ సంవత్సరం కావలికోట పత్రికల్ని జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరేమో చూడండి:

ఆలోచనాతీరులో మార్పులు చేసుకోవడం అంటే ఏంటి? (రోమా. 12:2)

అంటే, ఏవో కొన్ని మంచిపనులు చేస్తూ పైపైన మార్పులు చేసుకోవడం కాదు. మనం నిజంగా ఎలాంటి వాళ్లమో పరిశీలించుకోవాలి. యెహోవా ప్రమాణాల్ని వీలైనంత ఎక్కువగా పాటించడానికి, అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండాలి.—w23.01, 9వ పేజీ.

లోకంలో జరుగుతున్నవాటిని గమనిస్తున్నప్పుడు మన ఆలోచనా సామర్థ్యాల్ని ఎలా కాపాడుకోవచ్చు?

ప్రస్తుతం లోకంలో జరుగుతున్నవి బైబిలు ప్రవచనాల్ని ఎలా నెరవేరుస్తున్నాయో ఆలోచించడం మంచిది. కానీ ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అని ఊహించుకుంటూ మన సొంత అభిప్రాయాల్ని చెప్పకూడదు. ఎందుకంటే అది సంఘ ఐక్యతను పాడు చేసే ప్రమాదముంది. కాబట్టి, మనం యెహోవా సంస్థ తయారుచేసిన ప్రచురణల్లో ఉన్న విషయాల ఆధారంగానే ఒకరితోఒకరు మాట్లాడుకోవాలి. (1 కొరిం. 1:10)—w23.02, 16వ పేజీ.

యేసు బాప్తిస్మానికి, తన అనుచరుల బాప్తిస్మానికి తేడాలు ఏంటి?

యెహోవాకు సమర్పించుకున్న జనాంగంలోనే యేసు పుట్టాడు కాబట్టి, ఆయన మళ్లీ ప్రత్యేకంగా సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పశ్చాత్తాపపడాల్సిన లేదా మంచి మనస్సాక్షి కోసం అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ఏ పాపం చేయలేదు.—w23.03, 5వ పేజీ.

వేరేవాళ్లు కామెంట్స్‌ చెప్పేలా మనం ఎలా అవకాశం ఇవ్వచ్చు?

మనం చిన్నచిన్న కామెంట్స్‌ చెప్పొచ్చు. అప్పుడు వేరేవాళ్లకు కూడా కామెంట్స్‌ చెప్పే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు, అన్ని విషయాలు చెప్పకుండా జాగ్రత్తపడాలి. అప్పుడు మిగతావాళ్లు వేరే విషయాల చెప్పగలుగుతారు.—w23.04, 23వ పేజీ.

యెషయా 35:8లో ఉన్న “పవిత్ర మార్గం” దేన్ని సూచిస్తుంది?

ఈ సూచనార్థక రహదారి ముందుగా, బబులోను నుండి తమ స్వదేశానికి తిరిగి వస్తున్న యూదుల మార్గాన్ని సూచిస్తుంది. మనకాలంలో అది దేన్ని సూచిస్తుంది? 1919 కన్నా చాలా సంవత్సరాల ముందే, దైవభక్తిగల కొంతమంది ఆ దారిని సిద్ధం చేస్తూ వచ్చారు. వాళ్లు అన్నిటికన్నా ముఖ్యంగా, బైబిళ్లను అనువదించే-ముద్రించే పనిని చేశారు. దేవుని ప్రజలు “పవిత్ర మార్గం”లో ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక పరదైసులో అడుగుపెడుతున్నారు. అది దేవుని రాజ్యం తీసుకొచ్చే ఎన్నో దీవెనలకు నడిపిస్తుంది.—w23.05, 15-19 పేజీలు.

సామెతలు 9వ అధ్యాయంలో ఏ ఇద్దరు స్త్రీల గురించి ఉంది?

“మూర్ఖురాలు” ఇచ్చే ఆహ్వానం “మరణం దగ్గరికి” నడిపిస్తుంది అని, “తెలివిగల” స్త్రీ ఇచ్చే ఆహ్వానం ‘అవగాహనా మార్గానికి,’ జీవానికి నడిపిస్తుంది అని సామెతల పుస్తకం చెప్తుంది. (సామె. 9:1, 6, 13, 18)—w23.06, 22-24 పేజీలు.

లోతు విషయంలో యెహోవా వినయాన్ని, సహేతుకతను ఎలా చూపించాడు?

లోతును పర్వత ప్రాంతానికి పారిపొమ్మని యెహోవా చెప్పాడు. కానీ లోతు సోయరులో తలదాచుకుంటానని అడిగాడు. యెహోవా దానికి ఒప్పుకున్నాడు.—w23.07, 21వ పేజీ.

భర్త అశ్లీల చిత్రాలు చూస్తే భార్య ఏం చేయవచ్చు?

తనను తాను నిందించుకోకూడదు. దానికి బదులు, ఆమె యెహోవాతో తనకున్న బంధం మీద మనసుపెట్టాలి. బాధతో తల్లడిల్లిపోయినప్పుడు ఓదార్పు కోసం యెహోవా వైపుకు తిరిగిన స్త్రీల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. వాటిని చదివి, ధ్యానించడం ఆమెకు ఓదార్పుగా ఉండొచ్చు. పరిస్థితి చేయి దాటి పోకుండా ఆమె తన భర్తకు సహాయం చేయవచ్చు.—w23.08, 14-17 పేజీలు.

ఎవరైనా మన నమ్మకాల గురించి ప్రశ్నించినప్పుడు, ఆత్మనిగ్రహం చూపించడానికి లోతైన అవగాహన ఎలా సహాయం చేస్తుంది?

ఇతరుల ప్రశ్న వెనుక దాగివున్న వాళ్ల ఆలోచనను అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం వాళ్లకు సౌమ్యంగా జవాబు ఇవ్వగలుగుతాం.—w23.09, 17వ పేజీ.

మరియ ధైర్యం కూడగట్టుకోవడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

మరియ మెస్సీయకు తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత, ఇతరుల సహాయంతో ధైర్యం కూడగట్టుకోగలిగింది. గబ్రియేలు దూత అలాగే ఎలీసబెతు ఆమెకు లేఖనాల నుండి ప్రోత్సాహాన్నిచ్చారు. మనం కూడా తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ నుండి బలం పొందవచ్చు.—w23.10, 15వ పేజీ.

యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇవ్వచ్చు?

యెహోవా మన ప్రార్థనలు వింటానని మాటిస్తున్నాడు, అవి వింటున్నప్పుడు తన సంకల్పాన్ని మనసులో ఉంచుకుంటాడు. (యిర్మీ. 29:12) ఆయన ఒకేలాంటి ప్రార్థనకు రకరకాలుగా జవాబు ఇవ్వవచ్చు కానీ ఆయన మన చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టడు.—w23.11, 21-22 పేజీలు.

రోమీయులు 5:2లో “నిరీక్షణ” గురించి చెప్పాక, మళ్లీ 4వ వచనంలో దానిగురించి ఎందుకు ఉంది?

మంచివార్త విన్నప్పుడు ఒకవ్యక్తి పరదైసు భూమ్మీద శాశ్వత జీవితం సంపాదించుకోవచ్చు అనే నిరీక్షణ పొందుతాడు. అయితే, శ్రమలు వచ్చినప్పుడు ఆ నిరీక్షణ ఇంకా బలపడవచ్చు. అలాగే తనకు దేవుని ఆమోదం ఉందని తెలుసుకున్నప్పుడు తన నిరీక్షణ నిజమౌతుంది అనే నమ్మకం ఇంకా బలపడుతుంది.—w23.12, 12-13 పేజీలు.