కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 52

యౌవన సహోదరీల్లారా పరిణతిగల క్రైస్తవులుగా అవ్వండి

యౌవన సహోదరీల్లారా పరిణతిగల క్రైస్తవులుగా అవ్వండి

“స్త్రీలు . . . అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి.”—1 తిమో. 3:11.

పాట 133 యౌవనకాలంలో యెహోవాను ఆరాధించండి

ఈ ఆర్టికల్‌లో . . . a

1. పరిణతిగల క్రైస్తవులుగా ఎదగాలంటే మనమేం చేయాలి?

 పిల్లలు చూస్తుండగానే చాలా త్వరగా ఎదిగిపోతారు. ఆ ఎదుగుదల దానంతటదే జరుగుతుంది. కానీ పరిణతిగల క్రైస్తవులుగా ఎదగడం దానంతటదే జరగదు. b (1 కొరిం. 13:11; హెబ్రీ. 6:1) దానికోసం యెహోవాతో చాలా దగ్గరి సంబంధం ఉండాలి. అంతేకాదు దేవునికి నచ్చే లక్షణాల్ని పెంచుకోవడానికి, మనకు ఉపయోగపడే నైపుణ్యాల్ని సంపాదించుకోవడానికి, అలాగే భవిష్యత్తులో పొందబోయే బాధ్యతలకు సిద్ధపడడానికి దేవుని పవిత్రశక్తి అవసరం.—సామె. 1:5.

2. ఆదికాండం 1:27 నుండి మనమేం నేర్చుకోవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 యెహోవా మనుషుల్ని పురుషునిగా, స్త్రీగా చేశాడు. (ఆదికాండం 1:27 చదవండి.) నిజమే స్త్రీ, పురుషులు శారీరకంగానే కాదు, ఇంకా వేరే విధాలుగా కూడా వేరుగా ఉన్నారు. ఉదాహరణకు యెహోవా పురుషులకు, స్త్రీలకు కొన్ని బాధ్యతల్ని ఇచ్చాడు. అవి చేయడానికి వాళ్లకు కొన్ని లక్షణాలు, నైపుణ్యాలు అవసరం. (ఆది. 2:18) అయితే, యౌవన సహోదరీలు పరిణతిగల క్రైస్తవులుగా ఎలా అవ్వొచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. తర్వాతి ఆర్టికల్‌లో, యౌవన సహోదరులు పరిణతిగల క్రైస్తవులుగా ఎలా అవ్వొచ్చో చూస్తాం.

దేవునికి నచ్చే లక్షణాలు పెంచుకోండి

రిబ్కా, ఎస్తేరు, అబీగయీలు చూపించినలాంటి లక్షణాలు చూపించడం వల్ల మీరు పరిణతిగల స్త్రీలుగా అవుతారు (3-4 పేరాలు చూడండి)

3-4. యౌవన సహోదరీలు పరిణతిగల స్త్రీలను ఎక్కడ చూడవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

3 యెహోవాను ప్రేమించి, ఆయన్ని నమ్మకంగా సేవించిన ఎంతోమంది స్త్రీల గురించి బైబిలు చెప్తుంది. (“బైబిల్లోని స్త్రీల నుండి మనమేం నేర్చుకోవచ్చు?” అనే ఆర్టికల్‌ని jw.orgలో చూడండి) మన ఆర్టికల్‌ ముఖ్య లేఖనం చెప్తున్నట్లు వాళ్లు “అలవాట్ల విషయంలో మితంగా” ఉన్నారు. “అన్ని విషయాల్లో నమ్మకంగా” ఉన్నారు. అంతేకాదు, అలా పరిణతి సాధించిన సహోదరీలు మీ సంఘంలో కూడా ఉండివుండవచ్చు. వాళ్ల నుండి యౌవన సహోదరీలు ఎంతో నేర్చుకోవచ్చు.

4 యౌవన సహోదరీల్లారా పరిణతి సాధించిన స్త్రీలు ఎవరైనా మీకు తెలుసా? వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని గమనించండి. వాటిని మీరెలా చూపించవచ్చో ఆలోచించండి. తర్వాతి పేరాల్లో, పరిణతి సాధించడానికి అవసరమయ్యే మూడు ముఖ్యమైన లక్షణాల గురించి చూస్తాం.

5. పరిణతిగల క్రైస్తవ స్త్రీకి వినయం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

5 పరిణతిగల క్రైస్తవులుగా అవ్వడానికి వినయం చాలా ముఖ్యమైన లక్షణం. ఒక స్త్రీకి వినయం ఉంటే యెహోవాతో అలాగే ఇతరులతో మంచి స్నేహం ఉంటుంది. (యాకో. 4:6) ఉదాహరణకు, యెహోవాను ప్రేమించే స్త్రీ తన పరలోక తండ్రి పెట్టిన శిరసత్వపు ఏర్పాటును గౌరవిస్తుంది. (1 కొరిం. 11:3) అయితే, ఆ శిరసత్వపు సూత్రం సంఘానికి అలాగే కుటుంబ ఏర్పాటుకు కూడా వర్తిస్తుంది. c

6. రిబ్కా చూపించిన వినయం నుండి యౌవన సహోదరీలు ఏం నేర్చుకోవచ్చు?

6 రిబ్కా ఉదాహరణ గమనించండి. ఆమె చాలా తెలివైనది, ఎప్పుడేమి చేయాలో ఆమెకు బాగా తెలుసు. జీవితంలో పెద్దపెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంది. (ఆది. 24:58; 27:5-17) అయినప్పటికీ ఇతరుల్ని గౌరవిస్తూ, నిర్దేశాలకు లోబడుతూ ఉండేది. (ఆది. 24:17, 18, 65) మీరు కూడా రిబ్కాలా వినయంగా ఉంటే, యెహోవా ఏర్పాట్లకు మద్దతిస్తూ సంఘంలో వాళ్లకు, కుటుంబంలో వాళ్లకు మంచి ఆదర్శంగా ఉండగలుగుతారు.

7. ఎస్తేరు చూపించిన అణకువను యౌవన సహోదరీలు ఎలా అనుకరించవచ్చు?

7 పరిణతిగల క్రైస్తవులందరికీ ఉండాల్సిన ఇంకో లక్షణం అణకువ. “అణకువ గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది” అని బైబిలు చెప్తుంది. (సామె. 11:2) ఎస్తేరు అణకువగల, నమ్మకమైన దేవుని సేవకురాలు. ఆమెకు అణకువ ఉంది కాబట్టే రాణి అయ్యాక కూడా గర్వం చూపించలేదు. ఆమె అన్నయైన మొర్దెకై ఇచ్చిన సలహాను విని, పాటించింది. (ఎస్తే. 2:10, 20, 22) మీరు కూడా ఇతరుల్ని సలహా అడిగి, దాన్ని పాటించినప్పుడు అణకువ ఉందని చూపిస్తారు.—తీతు 2:3-5.

8. సహోదరీలు బట్టలు, కనిపించే తీరు విషయంలో అణకువ చూపించడానికి 1 తిమోతి 2:9, 10 ఎలా సహాయం చేస్తుంది?

8 ఎస్తేరు ఇంకో విధంగా కూడా అణకువ చూపించింది. ఆమె “రూపవతి. ఆమె చాలా ఆకర్షణీయంగా ఉండేది.” అయినా, అందరూ నన్నే చూడాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. (ఎస్తే. 2:7, 15) సహోదరీలు ఎస్తేరును ఎలా అనుకరించవచ్చు? ఒక విధానం గురించి 1 తిమోతి 2:9, 10లో చూడవచ్చు. (చదవండి.) ఇక్కడ అపొస్తలుడైన పౌలు క్రైస్తవ స్త్రీలు అణకువ, మంచి వివేచన ఉట్టిపడే గౌరవప్రదమైన బట్టలు వేసుకోవాలని చెప్తున్నాడు. ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదాలు, క్రైస్తవ స్త్రీలు పద్ధతిగా, ఇతరులకు అభ్యంతరం కలిగించని బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ సలహాను పాటిస్తున్న ప్రియ సహోదరీల్లారా, మిమ్మల్ని చూసి మేమెంతో గర్వపడుతున్నాం!

9. అబీగయీలు నుండి మనమేం నేర్చుకోవచ్చు?

9 పరిణతి సాధించడానికి సహోదరీలకు ఉండాల్సిన ఇంకొక లక్షణం వివేచన. వివేచన అంటే ఏంటి? తప్పొప్పుల్ని గుర్తించి, సరైనది చేసే సామర్థ్యం. అబీగయీలు ఉదాహరణ గమనించండి. ఆమె భర్త ఒక చెడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంట్లో వాళ్లందరి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెంటనే అబీగయీలు ఒక చర్య తీసుకుంది. ఆమె అలా మంచి వివేచన చూపించడం వల్ల అందరి ప్రాణాలు కాపాడగలిగింది. (1 సమూ. 25:14-23, 32-35) వివేచన ఉంటే ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలుస్తుంది. అలాగే, ఇతరుల విషయాల్లో మరీ ఎక్కువ జోక్యం చేసుకోకుండానే వాళ్ల మీద ఎలా శ్రద్ధ చూపించాలో తెలుస్తుంది.—1 థెస్స. 4:11.

మీకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకోండి

చదవడం, రాయడం బాగా నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉందా? (11వ పేరా చూడండి)

10-11. చదవడం, రాయడం నేర్చుకోవడం వల్ల మీకు అలాగే ఇతరులకు ఏంటి ప్రయోజనం? (చిత్రం కూడా చూడండి.)

10 ఒక క్రైస్తవ స్త్రీ తనకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకోవాలి. ఆమె చిన్నతనంలో నేర్చుకున్న కొన్ని పనులు తనకు జీవితాంతం ఉపయోగపడతాయి. అవేంటో కొన్ని ఉదాహరణల్ని గమనించండి.

11 చదవడం, రాయడం బాగా నేర్చుకోండి. కొన్ని సంస్కృతుల్లో ఆడవాళ్లకు చదువు ఎందుకులే అని దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ నైపుణ్యం ప్రతీ క్రైస్తవునికి అవసరం. d (1 తిమో. 4:13) కాబట్టి అది దేనివల్ల ఆగిపోనివ్వకండి. అలా చదవడం, రాయడం నేర్చుకుంటే వచ్చే ప్రయోజనమేంటి? మీ కాళ్లమీద మీరు నిలబడగలిగేలా అది సహాయం చేస్తుంది. అంతేకాదు, దేవుని వాక్యాన్ని చదివే మంచి విద్యార్థిగా, దాన్ని బోధించే మంచి బోధకురాలుగా తయారౌతారు. అన్నిటికన్నా మించి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు యెహోవాకు మరింత దగ్గరౌతారు.—యెహో. 1:8; 1 తిమో. 4:15.

12. సామెతలు 31:26 నుండి మనమేం నేర్చుకోవచ్చు?

12 శ్రద్ధగా వినడం, దయగా మాట్లాడడం నేర్చుకోండి. క్రైస్తవులందరూ చక్కగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుకోవడం అవసరం. దీని గురించి శిష్యుడైన యాకోబు ఈ సలహా ఇస్తున్నాడు: “ప్రతీ ఒక్కరు వినడానికి త్వరపడాలి, మాట్లాడడానికి తొందరపడకూడదు.” (యాకో. 1:19) ఇతరులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వింటే, వాళ్లమీద “సహానుభూతి” ఉందని చూపిస్తాం. (1 పేతు. 3:8) ఒకవేళ ఎదుటివాళ్లు చెప్పేది మీకు అర్థం కాకపోయినా, వాళ్లకెలా అనిపిస్తుందో తెలీకపోయినా ప్రశ్నలు అడగండి. తర్వాత, మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. (సామె. 15:28, అధస్సూచి.) ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను చెప్పేది వాస్తవమేనా? నేను మాట్లాడేది ఇతరులకు ప్రోత్సాహంగా ఉంటుందా? నేను మాట్లాడేటప్పుడు గౌరవంగా, దయగా మాట్లాడుతున్నానా?’ చక్కగా మాట్లాడే పరిణతిగల సహోదరీల నుండి నేర్చుకోండి. (సామెతలు 31:26 చదవండి.) వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. చక్కగా మాట్లాడే నైపుణ్యాన్ని ఎంతెక్కువగా పెంచుకుంటే, ఇతరులతో మీ బంధాలు అంతెక్కువగా బలపడతాయి.

ఇంటి పనులు చక్కగా చేసే స్త్రీ కుటుంబానికే కాదు సంఘానికి కూడా మంచి బహుమతి (13వ పేరా చూడండి)

13. ఇంటి పనులు చేయడం మీరెలా నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

13 ఇంటి పనులు నేర్చుకోండి. చాలా ప్రాంతాల్లో, ఇంటి పనులన్నీ దాదాపు ఆడవాళ్లే చూసుకుంటారు. మీ మమ్మీ లేదా సంఘంలోని ఇంకొక సిస్టర్‌ ఈ నైపుణ్యం నేర్చుకోవడానికి మీకు సహాయం చేయవచ్చు. సిండీ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “మా మమ్మీ నాకు ఎన్నో వెలకట్టలేని బహుమతుల్ని ఇచ్చింది. దాంట్లో ఒకటి, ఆమె నాకు కష్టపడి పనిచేయడం నేర్పించింది. వంట-వార్పు, కుట్లు-అల్లికలు నేర్పించింది. ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం నేర్పించింది. అంతేకాదు, సరుకులు కొనేటప్పుడు డబ్బుల్ని ఆదాచేయడం లాంటివి కూడా నేర్పించింది. అందుకే, నా కాళ్లమీద నేను నిలబడగలిగాను, యెహోవా సేవలో ఇంకా ఎక్కువ చేయగలిగాను. మా మమ్మీ ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం కూడా నేర్పించింది. దానివల్ల ఎంతోమంది బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ఇంటికి ఆహ్వానించి వాళ్ల నుండి ఎంతో నేర్చుకోగలిగాను.” (సామె. 31:15, 21, 22) కష్టపడి ఇంటిపనులు చేస్తూ ఆతిథ్యం ఇచ్చే స్త్రీ తన కుటుంబానికే కాదు, సంఘానికి కూడా ఒక బహుమతిగా ఉంటుంది.—సామె. 31:13, 17, 27; అపొ. 16:15.

14. క్రిస్టల్‌ అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు? మీరు దేనిమీద మనసుపెట్టాలి?

14 సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. పరిణతిగల ప్రతీ క్రైస్తవుడు సంతృప్తిగా ఉండడం అవసరం. (ఫిలి. 4:11) క్రిస్టల్‌ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నేను హైస్కూల్లో ఉన్నప్పుడు నాకు ఉపయోగపడే కోర్సు తీసుకునేలా మా మమ్మీడాడీ సహాయం చేశారు. మా డాడీ అకౌంట్స్‌ నేర్చుకోమని చెప్పాడు. అది ముందుముందు నాకు చాలా పనికొచ్చింది.” ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడే నైపుణ్యాలతో పాటు, డబ్బులు దుబారా చేయకుండా ఎలా తెలివిగా ఖర్చుపెట్టాలో కూడా నేర్చుకోండి. (సామె. 31:16, 18) అనవసరమైన అప్పులు చేయకుండా, సాదాసీదాగా ఉంటూ ఆధ్యాత్మిక లక్ష్యాల మీద మనసుపెట్టండి.—1 తిమో. 6:8.

భవిష్యత్తులో పొందబోయే బాధ్యతల కోసం సిద్ధపడండి

15-16. పెళ్లి చేసుకోని సహోదరీలు ఎందుకు విలువైనవాళ్లు? (మార్కు 10:29, 30)

15 యెహోవాకు నచ్చే లక్షణాల్ని, మీకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకున్నప్పుడు భవిష్యత్తులో మీ బాధ్యతల్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు. భవిష్యత్తులో మీరు ఏమేమి చేయగలరో ఇప్పుడు చూద్దాం.

16 కొంతకాలం వరకు పెళ్లి చేసుకోకూడదని మీరు అనుకోవచ్చు. సమాజం ఏం అనుకున్నా సరే, కొంతమంది స్త్రీలు యేసు చెప్పినట్టు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. (మత్త. 19:10-12) మరికొంతమంది, వాళ్ల పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోకపోవచ్చు. ఏదేమైనా పెళ్లి చేసుకోని వాళ్లను యెహోవా గానీ, యేసు గానీ చిన్నచూపు చూడట్లేదని గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెళ్లి చేసుకోని సహోదరీలు సంఘానికి ఒక దీవెనగా ఉన్నారు. ఇతరుల మీద వాళ్లకున్న నిజమైన ప్రేమ, శ్రద్ధ వల్ల ఎంతోమందికి ఆధ్యాత్మిక సహోదరీలుగా, తల్లులుగా అయ్యారు.—మార్కు 10:29, 30 చదవండి; 1 తిమో. 5:2.

17. ఒక యౌవన సహోదరి పూర్తికాల సేవలో అడుగుపెట్టడానికి ఎలా సిద్ధపడవచ్చు?

17 మీరు పూర్తికాల సేవ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రకటన పని చేస్తున్న వాళ్లలో ఎక్కువమంది స్త్రీలే ఉన్నారు. (కీర్త. 68:11) మీరు పూర్తికాల సేవలో అడుగుపెట్టగలరా? మీరు పయినీరు సేవ చేయవచ్చు. అలాగే నిర్మాణ పనిలో లేదా బెతెల్‌లో సేవ చేయవచ్చు. కాబట్టి మీ లక్ష్యం గురించి ప్రార్థించండి. ఇప్పటికే ఆ లక్ష్యాన్ని చేరుకున్న వాళ్లతో మాట్లాడండి. మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమి చేయాలో వాళ్లను అడగండి. మీ లక్ష్యాలకు తగ్గట్టుగా పనులు చేయండి. ఒక్కసారి మీ లక్ష్యాన్ని చేరుకుంటే, యెహోవా సేవలో మీకు ఎన్నో అవకాశాలు తెరుచుకుంటాయి.

మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకు కాబోయే భర్తను జాగ్రత్తగా ఎంచుకోవాలి (18వ పేరా చూడండి)

18. ఒక సహోదరి తనకు కాబోయే భర్తను ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి? (చిత్రం కూడా చూడండి.)

18 మీరు పెళ్లి చేసుకోవాలని అనుకోవచ్చు. ఇప్పటివరకు చూసిన లక్షణాలు, నైపుణ్యాలు మిమ్మల్ని ఒక మంచి భార్యగా తయారు చేస్తాయి. నిజమే, పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకు కాబోయే భర్తను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీరు తీసుకునే ప్రాముఖ్యమైన నిర్ణయాల్లో ఇదొకటి. మీరు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో, అతని శిరసత్వం కిందకు వెళ్తారని గుర్తుపెట్టుకోండి. (రోమా. 7:2; ఎఫె. 5:23, 33) కాబట్టి ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘అతను ఆధ్యాత్మికంగా పరిణతి సాధించాడా? జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు మొదటిస్థానం ఇస్తున్నాడా? తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడా? తను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటాడా? ఆడవాళ్లంటే అతనికి గౌరవం ఉందా? నన్ను పోషించడానికి, యెహోవాతో నాకున్న స్నేహాన్ని కాపాడడానికి కావాల్సిన నైపుణ్యాలు అతనికి ఉన్నాయా? నాకు ఒక మంచి ఫ్రెండ్‌గా ఉండగలడా? బాధ్యతల్ని సరిగ్గా చేస్తాడా? ఉదాహరణకు, సంఘంలో అతనికి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి? వాటిని ఎలా చేస్తున్నాడు?’ (లూకా 16:10; 1 తిమో. 5:8) నిజమే, మీకొక మంచి భర్త కావాలంటే ముందు మీరెలా ఒక మంచి భార్యగా అవ్వొచ్చో ఆలోచించండి.

19. భార్యను “సహాయకారి” అనడం ఎందుకు గొప్ప గౌరవం?

19 ఒక మంచి భార్య, భర్తకు “సాటియైన సహాయకారి” అని బైబిలు చెప్తుంది. (ఆది. 2:18) అంటే ఈ లేఖనం ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడుతుందా? అస్సలు కాదు! సహాయకారిగా ఉండడం అనేది భార్యకు ఒక గొప్ప గౌరవం. నిజానికి, యెహోవాను కూడా “సహాయకుడు” అని బైబిలు చాలాసార్లు చెప్తుంది. (కీర్త. 54:4; హెబ్రీ. 13:6) కుటుంబంలో భర్త తీసుకునే నిర్ణయాలకు మద్దతివ్వడం ద్వారా భార్య నిజమైన సహాయకారిగా ఉందని చూపిస్తుంది. ఆమె యెహోవాను ప్రేమిస్తుంది కాబట్టి భర్త గౌరవాన్ని కాపాడడానికి ఆమె చేయగలిగినదంతా చేస్తుంది. (సామె. 31:11, 12; 1 తిమో. 3:11) యెహోవా మీద ప్రేమను పెంచుకుంటూ ఇంట్లోవాళ్లకు, సంఘంలో ఉన్నవాళ్లకు చేయగలిగినదంతా చేస్తూ ఉండడం ద్వారా భవిష్యత్తులో భార్యగా ఉండే మీ బాధ్యత కోసం సిద్ధపడవచ్చు.

20. ఒక మంచి తల్లిగా మీ కుటుంబానికి మీరు ఏమేమి చేయగలరు?

20 మీరొక తల్లి అవ్వొచ్చు. పెళ్లయ్యాక మీకు పిల్లలు పుట్టొచ్చు. (కీర్త. 127:3) కాబట్టి ఒక మంచి తల్లిగా అవ్వడానికి ఏమేమి అవసరమో ముందే ఆలోచించి పెట్టుకోవడం మంచిది. ఈ ఆర్టికల్‌లో చూసిన లక్షణాలు, నైపుణ్యాలు మీరొక మంచి భార్యగా, తల్లిగా అవ్వడానికి సహాయం చేస్తాయి. మీరు చూపించే ప్రేమ, దయ, ఓర్పు మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి, మీ పిల్లలు మంచి వాతావరణంలో పెరగడానికి సహాయం చేస్తాయి.—సామె. 24:3.

లేఖనాల నుండి నేర్చుకున్నవి పాటించిన చాలామంది యౌవన సహోదరీలు పరిణతిగల క్రైస్తవులుగా తయారయ్యారు (21వ పేరా చూడండి)

21. మన సహోదరీల గురించి మనకు ఏమనిపిస్తుంది? ఎందుకు? (కవర్‌ పేజీ మీదున్న చిత్రాన్ని చూడండి.)

21 యెహోవా కోసం, ఆయన ప్రజల కోసం మీరు చేస్తున్న దాన్ని మేము ఎప్పుడూ మర్చిపోము. సహోదరిల్లారా మీరంటే మాకు చాలా ఇష్టం! (హెబ్రీ. 6:10) యెహోవాకు నచ్చే లక్షణాల్ని, మీకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకుంటూ మీ జీవితాల్లో అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో పొందబోయే బాధ్యతల కోసం చక్కగా సిద్ధపడుతున్నారు. సహోదరీల్లారా యెహోవా సంస్థకు మీరు చాలా విలువైనవాళ్లు!

పాట 137 నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు

a యౌవన సహోదరీల్లారా మీరంటే మాకు చాలా ఇష్టం. దేవునికి నచ్చే లక్షణాల్ని, మీకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకుంటూ, భవిష్యత్తులో పొందబోయే బాధ్యతల కోసం సిద్ధపడుతూ ఉండడం ద్వారా క్రైస్తవులుగా మీరు పరిణతి సాధించగలరు. అలా చేస్తే యెహోవా సేవలో మీరు ఎన్నో దీవెనల్ని సొంతం చేసుకుంటారు.

b పదాల వివరణ: ఒక వ్యక్తి పరిణతిగల క్రైస్తవునిగా అయ్యాక లోకజ్ఞానం ప్రకారం కాకుండా, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుస్తాడు. అతను లేక ఆమె యేసును అనుకరిస్తారు, యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తారు. అలాగే ఇతరుల మీద నిస్వార్థమైన ప్రేమ చూపిస్తారు.

d చదవడం ఎంత ప్రాముఖ్యమో మరింత తెలుసుకోవడానికి 2010, జూలై 15 కావలికోట సంచికలోని “చదవడంపట్ల, అధ్యయనంపట్ల మీ పిల్లల్లో కోరికను పెంచండి” అనే ఆర్టికల్‌ చూడండి.