అధ్యయన ఆర్టికల్ 53
యౌవన సహోదరుల్లారా పరిణతిగల క్రైస్తవులుగా అవ్వండి
“నిబ్బరంగా, ధైర్యంగా ఉండు.”—1 రాజు. 2:2.
పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’
ఈ ఆర్టికల్‌లో . . . a
1. యౌవన సహోదరులు జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి?
“నిబ్బరంగా, ధైర్యంగా ఉండు” అని రాజైన దావీదు సొలొమోనుకు చెప్పాడు. (1 రాజు. 2:1-3) సహోదరులందరూ ఈ సలహాను పాటించాలి. వాళ్లు జీవితంలో విజయం సాధించాలంటే అన్ని విషయాల్లో దేవుని నియమాల్ని, సూత్రాల్ని పాటించాలి. (లూకా 2:52) అయితే, యౌవన సహోదరులు పరిణతిగల క్రైస్తవులుగా అవ్వడం ఎందుకు ప్రాముఖ్యం?
2-3. ఒక యౌవన సహోదరుడు పరిణతి సాధించడం ఎందుకు ప్రాముఖ్యం?
2 సహోదరులకు కుటుంబంలో, సంఘంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. యౌవన సహోదరుల్లారా మీరు కూడా భవిష్యత్తులో పొందబోయే ఆ బాధ్యతల గురించి ఆలోచించే ఉంటారు. మీరు పూర్తికాల సేవకుడు అవ్వాలని, సంఘ పరిచారకుడు అవ్వాలని, ఆ తర్వాత సంఘపెద్ద అవ్వాలని లక్ష్యం పెట్టుకుని ఉండొచ్చు. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని కూడా అనుకొని ఉండొచ్చు. (ఎఫె. 6:4; 1 తిమో. 3:1) అయితే ఆ లక్ష్యాల్ని చేరుకోవాలన్నా, మీ జీవితంలో విజయం సాధించాలన్నా ముందు మీరు పరిణతి సాధించాలి. b
3 పరిణతి సాధించాలంటే మీరేం చేయాలి? మీరు కొన్ని ముఖ్యమైన నైపుణ్యాల్ని సంపాదించుకోవాలి. అయితే, భవిష్యత్తులో పొందబోయే బాధ్యతలకు మీరు ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు?
పరిణతి సాధించడానికి మార్గాలు
4. యౌవన సహోదరులు పరిణతిగల పురుషుల్ని ఎక్కడ చూడవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
4 మంచివాళ్లను ఆదర్శంగా తీసుకోండి. యౌవన సహోదరులు ఆదర్శంగా తీసుకోవడానికి బైబిల్లో ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. గతంలో జీవించిన ఆ పురుషులు దేవున్ని ప్రేమించారు, తన ప్రజల్ని ఎన్నో విధాలుగా సంరక్షించారు. పరిణతి సాధించిన పురుషులు మీ కుటుంబంలో, సంఘంలో కూడా ఉండివుండవచ్చు. వాళ్లను మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు. (హెబ్రీ. 13:7) అయితే, వీళ్లందరికి మించి యేసుక్రీస్తు గొప్ప ఆదర్శం. (1 పేతు. 2:21) బైబిల్లో ఉన్న ఉదాహరణల గురించి జాగ్రత్తగా చదివి, వాళ్లలో మీకు నచ్చిన లక్షణాల గురించి ఆలోచించండి. (హెబ్రీ. 12:1, 2) ఆ తర్వాత మీరు వాళ్లలా ఎలా ఉండవచ్చో ఆలోచించండి.
5. ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? అదెందుకు ప్రాముఖ్యం? (కీర్తన 119:9)
5 “ఆలోచనా సామర్థ్యాన్ని” పెంచుకుని, దాన్ని ‘భద్రంగా కాపాడుకోండి.’ (సామె. 3:21) ఆలోచనా సామర్థ్యం ఉన్న వ్యక్తి ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచిస్తాడు. కాబట్టి ఆ సామర్థ్యాన్ని సంపాదించడానికి, కాపాడుకోవడానికి కృషి చేయండి. ఎందుకంటే ఈ లోకం నిండా తమకు నచ్చింది, తమకు అనిపించింది చేసుకుంటూ పోయే యువకులే ఉన్నారు. (సామె. 7:7; 29:11) దానికితోడు సినిమాలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా మీ ఆలోచనను పాడుచేసే అవకాశం ఉంది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? ముందుగా బైబిలు సూత్రాల్ని నేర్చుకోండి, అవి మీకెలా ఉపయోగపడతాయో ఆలోచించండి. తర్వాత, ఆ సూత్రాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుని యెహోవాను సంతోషపెట్టండి. (కీర్తన 119:9 చదవండి.) ఈ నైపుణ్యాన్ని మీరు సంపాదించుకుంటే, పరిణతిగల క్రైస్తవులుగా అవ్వడానికి ఒక మెట్టు ఎక్కినట్టే. (సామె. 2:11, 12; హెబ్రీ. 5:14) అయితే, ఆలోచనా సామర్థ్యం ఈ రెండు సందర్భాల్లో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం: (1) సిస్టర్స్‌తో ప్రవర్తించే తీరు. (2) మీరు కనబడే తీరు.
6. ఆడవాళ్ల పట్ల గౌరవం చూపించడానికి ఒక యౌవన సహోదరుడికి ఆలోచనా సామర్థ్యం ఎలా సహాయం చేస్తుంది?
6 మీకు ఆలోచనా సామర్థ్యం ఉంటే ఆడవాళ్లను గౌరవిస్తారు. యౌవన సహోదరుడు ఒక సిస్టర్ గురించి తెలుసుకోవాలి అనుకోవడం, ఆమె మీద కాస్త ఆసక్తి చూపించడం సహజమే. అయితే, ఆలోచనా సామర్థ్యం ఉన్న ఒక యౌవన సహోదరుడు ఒక సిస్టర్‌ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేకుండా ఆమెకు ఆ కోరిక పుట్టించే మెసేజ్‌లు పంపించడు, అలాంటి మాటలు మాట్లాడడు లేదా అలాంటి ఇంకే పని చేయడు. (1 తిమో. 5:1, 2) ఒకవేళ ఒక సిస్టర్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ఆమెను ఒంటరిగా కలిసే బదులు, తమతోపాటు మూడో వ్యక్తి ఉండేలా చూసుకుని ఆమె గౌరవాన్ని కాపాడతాడు.—1 కొరిం. 6:18.
7. బట్టల్ని, హెయిర్ స్టైల్స్‌ని ఎంచుకునేటప్పుడు ఒక యౌవన సహోదరుడికి ఆలోచనా సామర్థ్యం ఎలా సహాయం చేస్తుంది?
7 ఒక యౌవన సహోదరుడికి ఆలోచనా సామర్థ్యం ఉందని చూపించే ఇంకొక మార్గం, బట్టలు అలాగే హెయిర్ స్టైల్స్. సాధారణంగా, మార్కెట్‌లోకి వచ్చే కొత్తకొత్త ఫ్యాషన్‌లన్నీ దేవున్ని ఆరాధించని, నైతిక విలువలు అస్సలు పాటించనివాళ్లు తయారు చేస్తున్నారు. వాళ్ల అనైతికత వాళ్లు తయారుచేసే బట్టల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వాళ్లు ఒంటికి అతుక్కుపోయే లాంటి బట్టల్ని, పురుషుల్ని స్త్రీలలా చూపించే బట్టల్ని తయారు చేస్తున్నారు. ఒక యౌవన సహోదరుడు తన బట్టల్ని ఎంచుకునేటప్పుడు బైబిలు సూత్రాల మీద ఆధారపడతాడు. అలాగే సంఘంలో ఆదర్శంగా ఉన్నవాళ్లను చూసి నేర్చుకుంటాడు. అతను ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నా అభిరుచులు నాకు మంచి వివేచన ఉందని, ఇతరుల గురించి పట్టించుకుంటున్నాను అని చూపిస్తున్నాయా? నేను వేసుకునే బట్టలు దేవుని సేవకుణ్ణి అని చూపిస్తున్నాయా?’ (1 కొరిం. 10:31-33; తీతు 2:6) ఆలోచనా సామర్థ్యం ఉన్న యౌవన సహోదరుడు బ్రదర్స్-సిస్టర్స్ గౌరవాన్నే కాదు, పరలోక తండ్రియైన యెహోవా గౌరవాన్ని కూడా సంపాదించుకుంటాడు.
8. ఒక యౌవన సహోదరుడు నమ్మకస్థునిగా ఎలా ఉండవచ్చు?
8 నమ్మకస్థునిగా ఉండండి. ఒక నమ్మకస్థుడైన యౌవన సహోదరుడు తనకు అప్పగించిన పనులన్నిటిని శ్రద్ధగా చేస్తాడు. (లూకా 16:10) యేసు ఉదాహరణ గమనించండి. ఆయన బాధ్యత లేనివాడిగా, ఏమీ పట్టనట్టుగా ఎప్పుడూ లేడు. బదులుగా, యెహోవా తనకు ఇచ్చిన నియామకాలన్నీ కష్టమైనాసరే దాన్ని పూర్తిచేశాడు. ఆయన ప్రజల్ని ప్రేమించాడు, ముఖ్యంగా తన శిష్యుల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే వాళ్లకోసం తన ప్రాణాన్ని ఇష్టంగా ఇచ్చేశాడు. (యోహా. 13:1) యేసులాగే మీరు కూడా మీకు ఇచ్చిన నియామకాన్ని చేయడానికి కష్టపడి పనిచేయండి. దాన్ని ఎలా చేయాలో మీకు తెలీకపోతే, పరిణతిగల సహోదరుల్ని వినయంగా అడిగి తెలుసుకోండి. ఏదో చేయాలి కదా అన్నట్టు పని చేయకండి. (రోమా. 12:11) బదులుగా, మీకు ఇచ్చిన నియామకాన్ని “మనుషుల కోసం చేస్తున్నట్టు కాకుండా, యెహోవా కోసం” చేయండి. (కొలొ. 3:23) నిజమే, మీరు పరిపూర్ణులు కాదు. కాబట్టి ఏదైనా పొరపాటు జరిగితే వినయంగా దాన్ని ఒప్పుకోండి.—సామె. 11:2.
మీకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకోండి
9. ఒక యౌవన సహోదరుడు తనకు ఉపయోగపడే నైపుణ్యాల్ని ఎందుకు పెంచుకోవాలి?
9 పరిణతిగల క్రైస్తవునిగా అవ్వడానికి, మీకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకోండి. అలా చేస్తే సంఘంలో బాధ్యతల్ని చేపట్టగలుగుతారు. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని, మిమ్మల్ని మీరు పోషించుకోగలుగుతారు. అలాగే మీ కుటుంబాన్ని చూసుకోగలుగుతారు. అంతేకాదు, ఇతరులతో మంచి స్నేహాలు కూడా ఉంటాయి. అయితే, ఆ నైపుణ్యాల్లో కొన్నిటిని ఇప్పుడు మనం చూద్దాం.
10-11. చదవడం, రాయడం బాగా నేర్చుకున్న సహోదరుడు తనకు అలాగే సంఘానికి ఎలా ఉపయోగపడతాడు? (కీర్తన 1:1-3) (చిత్రం కూడా చూడండి.)
10 చదవడం, రాయడం బాగా నేర్చుకోండి. సంతోషంగా ఉండే వ్యక్తి, తన పనులన్నిటిలో సఫలమయ్యే వ్యక్తి ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానిస్తాడని బైబిలు చెప్తుంది. (కీర్తన 1:1-3 చదవండి.) అతను రోజూ బైబిలు చదవడం వల్ల యెహోవా ఆలోచనలు తెలుసుకుంటాడు. చదివిన లేఖనాల్ని ఎలా పాటించాలో స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. (సామె. 1:3, 4) అలాంటి సహోదరులు సంఘానికి చాలా అవసరం. ఎందుకు?
11 బైబిలు ఉపయోగిస్తూ బోధించే, సలహాలిచ్చే సామర్థ్యం ఉన్న సహోదరులు మన బ్రదర్స్-సిస్టర్స్‌కి ఎంతో అవసరం. (తీతు 1:9) మీకు చదవడం, రాయడం బాగా వస్తే మీ ప్రసంగాల్లో, కామెంట్స్‌లో ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని, బలపర్చే విషయాల్ని చెప్పగలుగుతారు. అంతేకాదు, మీ వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నప్పుడు, కూటాల్లో-సమావేశాల్లో ప్రసంగాలు వింటున్నప్పుడు నోట్స్ రాసుకోగలుగుతారు. అలా రాసుకున్న విషయాల్ని ఉపయోగించి మీ విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు, ఇతరుల్ని ప్రోత్సహించవచ్చు.
12. చక్కగా మాట్లాడే సామర్థ్యాన్ని మీరెలా పెంచుకోవచ్చు?
12 శ్రద్ధగా వినడం, దయగా మాట్లాడడం నేర్చుకోండి. ఒక సహోదరుడు బాగా మాట్లాడడం నేర్చుకోవాలి. బాగా మాట్లాడే వ్యక్తి ఇతరులు చెప్పేది వింటాడు. ఇతరులు ఎలా ఆలోచిస్తున్నారో, వాళ్లకు ఎలా అనిపిస్తుందో కూడా పట్టించుకుంటాడు. (సామె. 20:5) అంతేకాదు ఇతరుల స్వరాన్ని, ముఖకవళికల్ని, హావభావాల్ని కూడా అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ చేయాలంటే ఇతరులతో సమయం గడపాలి. ఒకవేళ మీరెప్పుడూ ఫోన్‌లోనో, మెసేజుల్లోనో మాట్లాడుతుంటే, ఇతరులతో మాట్లాడే మీ సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఇతరులతో నేరుగా మాట్లాడడానికి అవకాశాలు వెదకండి.—2 యోహా. 12.
13. ఒక యౌవన సహోదరుడు ఏం నేర్చుకుంటే మంచిది? (1 తిమోతి 5:8) (చిత్రం కూడా చూడండి.)
13 మీ కాళ్ల మీద మీరు నిలబడడం నేర్చుకోండి. ఒక సహోదరుడు తనను తాను అలాగే తన ఇంట్లో వాళ్లను పోషించుకోగలగాలి. (1 తిమోతి 5:8 చదవండి.) కొన్ని దేశాల్లో యౌవన సహోదరులు ఉద్యోగం సంపాదించుకునే నైపుణ్యాన్ని వాళ్ల నాన్న నుండో లేదా బంధువుల నుండో నేర్చుకుంటారు. ఇంకొన్ని దేశాల్లో వాళ్లు చదువుకుంటున్నప్పుడే వృత్తి-విద్యా కోర్సును చేస్తారు. నిజానికి, ఉద్యోగం సంపాదించుకోవడానికి కావల్సిన నైపుణ్యాన్ని నేర్చుకోవడం చాలా మంచిది. (అపొ. 18:2, 3; 20:34; ఎఫె. 4:28) మీరు కష్టపడి పని చేస్తారని, ఇచ్చిన పనిని ఎలాగైనాసరే పూర్తి చేస్తారనే పేరు సంపాదించుకోండి. అలా చేస్తే మీకు ఉద్యోగం దొరికి, దాన్ని నిలుపుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటివరకు చూసిన లక్షణాలు, నైపుణ్యాలు భవిష్యత్తులో మీకొచ్చే బాధ్యతల్ని చేయడానికి కూడా ఎంతో ప్రాముఖ్యం. ఇప్పుడు మనం ఒక యౌవన సహోదరుడు భవిష్యత్తులో పొందబోయే కొన్ని బాధ్యతల గురించి చూద్దాం.
భవిష్యత్తులో పొందబోయే బాధ్యతల కోసం సిద్ధపడండి
14. ఒక యౌవన సహోదరుడు పూర్తికాల సేవలోకి ఎలా అడుగుపెట్టవచ్చు?
14 పూర్తికాల సేవ. చాలామంది పరిణతిగల సహోదరులు చిన్న వయసులోనే పూర్తికాల సేవ మొదలుపెట్టారు. ఒక యౌవన సహోదరుడికి పయినీరు సేవ రకరకాల ప్రజలతో ఎలా పనిచేయాలో నేర్పిస్తుంది. అంతేకాదు, డబ్బును పొదుపుగా ఎలా వాడాలో కూడా నేర్పిస్తుంది. (ఫిలి. 4:11-13) సహాయ పయినీరు సేవ చేస్తే పూర్తికాల సేవలోకి అడుగుపెట్టవచ్చు. కొంతకాలం సహాయ పయినీరు సేవ చేయడం, చాలామందిని క్రమపయినీరుగా సేవ చేయడానికి సిద్ధం చేసింది. అంతేకాదు, పయినీరు సేవ వేరే రకాల పూర్తికాల సేవలోకి వెళ్లడానికి అవకాశాన్నిస్తుంది అంటే నిర్మాణ పనిలో, బెతెల్‌లో సేవ చేయవచ్చు.
15-16. ఒక యౌవన సహోదరుడు సంఘ పరిచారకుడిగా, సంఘపెద్దగా అవ్వడానికి ఏం చేయవచ్చు?
15 సంఘ పరిచారకుడు లేదా సంఘపెద్ద. ఒక సహోదరుడు సంఘపెద్దగా అర్హత సాధించి బ్రదర్స్-సిస్టర్స్‌కి సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకోవచ్చు. ఆ అర్హతను సాధించడానికి కృషిచేస్తున్న సహోదరుడు “మంచిపని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు” అని బైబిలు చెప్తుంది. (1 తిమో. 3:1) అయితే, ఒక సహోదరుడు సంఘపెద్ద అవ్వాలంటే ముందు సంఘ పరిచారకుడు అవ్వాలి. సంఘ పరిచారకులు పెద్దలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తారు. పెద్దలు, సంఘ పరిచారకులు కలిసి వినయంగా బ్రదర్స్-సిస్టర్స్‌కి సేవచేస్తూ, ఉత్సాహంగా పరిచర్యలో పాల్గొంటారు. ఒక సహోదరుడు 17 నుండి 19 సంవత్సరాల మధ్య కూడా సంఘ పరిచారకుడిగా అర్హత సాధించవచ్చు. అంతేకాదు, చక్కగా అర్హత సాధించిన సంఘ పరిచారకుడు 20 ఏళ్ల వయసులో కూడా సంఘపెద్ద అవ్వొచ్చు.
16 సంఘ పరిచారకుడిగా, సంఘ పెద్దగా అవ్వడానికి కావల్సిన అర్హతలు బైబిల్లో ఉన్నాయి. ఒక వ్యక్తికి యెహోవా మీద, తన కుటుంబం మీద, సంఘం మీద ప్రేమ ఉంటే ఆ అర్హతను సంపాదించడానికి కృషి చేస్తాడు. మీరు ఆ అర్హతను ఎలా సంపాదించుకోవచ్చు? (1 తిమో. 3:1-13; తీతు 1:6-9; 1 పేతు. 5:2, 3) ఆ అర్హతల్లో ప్రతీదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాటిని చేరుకోవడానికి సహాయం కోసం యెహోవాను అడగండి. c
17. ఒక యౌవన సహోదరుడు భవిష్యత్తులో ఒక భర్తగా, కుటుంబ శిరస్సుగా అవ్వడానికి ఎలా సిద్ధపడవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
17 భర్త, కుటుంబ శిరస్సు. యేసు చెప్పినట్లు కొంతమంది పరిణతిగల సహోదరులు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకోవచ్చు. (మత్త. 19:12) అయితే, ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ఒక భర్తగా అలాగే కుటుంబ శిరస్సుగా మీకు అదనపు బాధ్యతలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. (1 కొరిం. ) భర్త భార్యను ప్రేమించాలని, ఆమె అవసరాల్ని చూసుకోవాలని, ఆమెకు మంచి ఫ్రెండ్‌గా ఉండాలని, ఆమెకు దేవునితో ఉన్న స్నేహాన్ని కాపాడాలని యెహోవా ఆశిస్తున్నాడు. ( 11:3ఎఫె. 5:28, 29) ఈ ఆర్టికల్‌లో చూసిన లక్షణాల్ని అలాగే నైపుణ్యాల్ని అంటే ఆలోచనా సామర్థ్యం, ఆడవాళ్లను గౌరవించడం, నమ్మకస్థులుగా ఉండడం మిమ్మల్ని ఒక మంచి భర్తగా చేస్తాయి. ఈ లక్షణాలు, నైపుణ్యాలు అన్నీ భవిష్యత్తులో మీరు పొందబోయే బాధ్యతలకు మిమ్మల్ని సిద్ధం చేస్తాయి.
18. ఒక యౌవన సహోదరుడు భవిష్యత్తులో ఒక మంచి తండ్రిగా అవ్వడానికి ఎలా సిద్ధపడవచ్చు?
18 తండ్రి. మీకు పెళ్లయ్యాక మీరొక తండ్రి అవ్వొచ్చు. ఒక మంచి తండ్రిగా ఉండడం గురించి యెహోవా నుండి ఏం నేర్చుకోవచ్చు? చాలానే ఉన్నాయి. (ఎఫె. 6:4) యెహోవా తన కుమారుడైన యేసుతో తనని ప్రేమిస్తున్నానని, తనను చూసి సంతోషిస్తున్నానని చెప్పాడు. (మత్త. 3:17) ఒకవేళ మీరు ఒక తండ్రైతే, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్తూ ఉండండి. వాళ్లు చేసే మంచి పనుల్ని ఎక్కువగా మెచ్చుకోండి. యెహోవాను ఆదర్శంగా తీసుకున్న తండ్రులు, తమ పిల్లలు పరిణతిగల సహోదరులుగా, సహోదరీలుగా ఎదగడానికి సహాయం చేస్తారు. భవిష్యత్తులో పొందే ఆ బాధ్యతల కోసం మీరిప్పుడే ఎలా సిద్ధపడవచ్చు? మీ కుటుంబం మీద, సంఘంలో ఉన్నవాళ్ల మీద శ్రద్ధ చూపించండి. వాళ్లను ప్రేమిస్తున్నామని, వాళ్లను చూసి సంతోషిస్తున్నారని చెప్పండి. (యోహా. 15:9) అవి మీరు భవిష్యత్తులో ఒక మంచి భర్తగా, తండ్రిగా అయ్యేలా సహాయం చేస్తాయి. ఈలోపు మీరు యెహోవాకు, మీ కుటుంబానికి, సంఘానికి వెలకట్టలేని బహుమతి అని గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు మీరేం చేయవచ్చు?
19-20. యౌవన సహోదరులు పరిణతి సాధించడానికి ఏం సహాయం చేస్తుంది? (కవర్ పేజీ మీదున్న చిత్రం చూడండి.)
19 యౌవన సహోదరుల్లారా, క్రైస్తవులుగా పరిణతి సాధించడం దానంతటికి అదే జరిగేది కాదు. దానికోసం కృషి చేయాలి. మంచివాళ్లను ఆదర్శంగా తీసుకోండి, మీ ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోండి, నమ్మకస్థులుగా ఉండండి, మీ జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాల్ని సంపాదించుకోండి, భవిష్యత్తులో పొందబోయే బాధ్యతల కోసం సిద్ధపడండి.
20 ఇవన్నీ విన్నాక, ఇవి చేయడం మీవల్ల కాదని మీకనిపించవచ్చు. కానీ మీరు చేయగలరు! యెహోవా మీకు సహాయం చేయాలని ఎంతో ఎదురుచూస్తున్నాడు. (యెష. 41:10, 13) అంతేకాదు, సంఘంలో ఉన్న బ్రదర్స్-సిస్టర్స్ కూడా మీకు సహాయం చేస్తారు. మీరు పరిణతి సాధించినప్పుడు మీ జీవితం సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. యౌవన సహోదరుల్లారా మీరంటే మాకు చాలా ఇష్టం. పరిణతి సాధించడానికి మీరు చేస్తున్న ప్రతీ పనిని యెహోవా దీవించాలని మేము ఆశిస్తున్నాం!—సామె. 22:4.
పాట 65 ముందుకు సాగిపోదాం!
a సంఘంలో పరిణతిగల సహోదరులు చాలా అవసరం. అయితే, యౌవన సహోదరులు ఎలా పరిణతి సాధించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
b ముందటి ఆర్టికల్‌లోని “పదాల వివరణ” చూడండి.
c యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ పుస్తకంలో 5-6 అధ్యాయాలు చూడండి.