కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 50

విశ్వాసం, పనులు మనల్ని నీతిమంతుల్ని చేస్తాయి

విశ్వాసం, పనులు మనల్ని నీతిమంతుల్ని చేస్తాయి

‘మన తండ్రి అబ్రాహాము చూపించిన విశ్వాసపు అడుగుజాడల్లో సక్రమంగా నడవండి.’—రోమా. 4:12.

పాట 119 మనకు విశ్వాసం ఉండాలి

ఈ ఆర్టికల్‌లో . . . a

1. మనకు ఏ ప్రశ్న రావచ్చు?

 అబ్రాహాము గురించి చాలామంది వినుంటారు. కానీ అతని గురించి వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. మీకైతే అబ్రాహాము గురించి తెలిసింది చాలా ఎక్కువ. ఉదాహరణకు, అతను “విశ్వాసం చూపించే వాళ్లందరికీ తండ్రి” అని మీకు తెలుసు. (రోమా. 4:11) బహుశా మీకు ఇలా అనిపించవచ్చు: ‘నేను అబ్రాహాము అడుగుజాడల్లో నడిచి ఆయనలాంటి విశ్వాసం చూపించగలనా?’ అవును, మీరు చూపించగలరు!

2. అబ్రాహాము గురించి మనం ఎందుకు అధ్యయనం చేయాలి? (యాకోబు 2:22, 23)

2 మనం కూడా అబ్రాహాము లాంటి విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఒక విధానం ఏంటంటే, అతని గురించి అధ్యయనం చేయడం. యెహోవా చెప్పిన వెంటనే అబ్రాహాము మారుమాట్లాడకుండా కొత్త ప్రాంతానికి వెళ్లాడు. దశాబ్దాల పాటు డేరాల్లో ఉన్నాడు. ఆఖరికి తన ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకును బలివ్వడానికి కూడా వెనుకాడలేదు. ఈ పనులన్నీ అతనికి బలమైన విశ్వాసం ఉందని చూపిస్తున్నాయి. అబ్రాహాము విశ్వాసం, పనులు యెహోవాను సంతోషపెట్టాయి, ఆయనకు స్నేహితుణ్ణి చేశాయి. (యాకోబు 2:22, 23 చదవండి.) మీతో సహా మనందరం, అబ్రాహాము లాంటి దీవెనలే పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే అబ్రాహాము గురించి రాసేలా పౌలును, యాకోబును ఆయన ప్రేరేపించాడు. ఇప్పుడు రోమీయులు 4వ అధ్యాయంలో, యాకోబు 2వ అధ్యాయంలో అబ్రాహాము గురించి ఉన్న విషయాల్ని పరిశీలిద్దాం. ఈ రెండు అధ్యాయాల్లో పౌలు అలాగే యాకోబు చాలా ఆసక్తికరమైన విషయాలు రాశారు.

3. పౌలు, యాకోబు అబ్రాహాము గురించి ఏ లేఖనం నుండి ఎత్తి రాశారు?

3 పౌలు, యాకోబు ఆదికాండం 15:6 లో ఉన్న మాటల్నే ఎత్తి రాశారు. అక్కడిలా ఉంది: “[అబ్రాహాము] యెహోవా మీద విశ్వాసం ఉంచాడు, దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.” దేవుడు ఎవర్ని చూసైతే సంతోషిస్తాడో, ఎవరిలోనైతే ఏ తప్పూ లేదనుకుంటాడో వాళ్లను నీతిమంతులు అని పిలుస్తాడు. పాపం, అపరిపూర్ణత నరనరాల్లో ఉండిపోయిన ఒక మనిషిని, దేవుడు ఏ తప్పూ చేయని వ్యక్తిగా చూడడం ఎంతగొప్ప విషయమో కదా! బహుశా మిమ్మల్ని కూడా దేవుడు అలా చూస్తే ఎంత బాగుంటుందో అని మీకు అనిపిస్తుందా? అయితే, అది సాధ్యమే. మరి, యెహోవా అబ్రాహామును నీతిమంతునిగా చూసినట్లే మిమ్మల్ని కూడా నీతిమంతులుగా చూడాలంటే ఏంచేయాలో ఇప్పుడు చూద్దాం.

నీతిమంతులకు విశ్వాసం ఉండాలి

4. నీతిమంతులుగా ఉండడం మనకు ఎందుకు కష్టంగా అనిపించవచ్చు?

4 పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో మనుషులందరూ పాపులే అన్నాడు. (రోమా. 3:23) మరి, అలాంటప్పుడు ఒక వ్యక్తి నీతిమంతునిగా లేదా ఏ తప్పూ చేయనివాడిగా ఉంటూ దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలడు? దాన్ని అర్థం చేసుకోవడానికే పౌలు అబ్రాహాము ఉదాహరణ చెప్పాడు.

5. యెహోవా అబ్రాహామును నీతిమంతుడు అని దేని ఆధారంగా అన్నాడు? (రోమీయులు 4:2-4)

5 అబ్రాహాము కనాను దేశంలో ఉన్నప్పుడు యెహోవా అతన్ని నీతిమంతుడు అని పిలిచాడు. యెహోవా ఎందుకలా పిలిచాడు? అబ్రాహాము ధర్మశాస్త్రాన్ని తూ.చా. తప్పకుండా పాటించినందుకా? ఎంతమాత్రం కాదు! (రోమా. 4:13) ఎందుకంటే, యెహోవా అబ్రాహాముతో ఆ మాటలు అనే సమయానికి ధర్మశాస్త్రం ఉనికిలో లేదు. యెహోవా అబ్రాహామును నీతిమంతుడని పిలిచిన 400 సంవత్సరాల కన్నా ఎక్కువకాలం తర్వాత ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం వచ్చింది. మరైతే, యెహోవా దేని ఆధారంగా అబ్రాహామును నీతిమంతుడు అన్నాడు? అబ్రాహాము చూపించిన విశ్వాసాన్ని బట్టి, యెహోవా అపారదయతో అతన్ని నీతిమంతుడని పిలిచాడు.—రోమీయులు 4:2-4 చదవండి.

6. పాపుల్ని నీతిమంతులని యెహోవా ఎలా అనగలడు?

6 “దేవుని మీద విశ్వాసం ఉంచే వ్యక్తి, తన విశ్వాసం వల్ల నీతిమంతునిగా ఎంచబడతాడు” అని పౌలు చెప్పాడు. (రోమా. 4:5) అంతేకాదు, ఆయన ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి పనులు పూర్తిగా ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేకపోయినా దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచితే, అతని సంతోషం ఎలా ఉంటుందో దావీదు కూడా చెప్పాడు: ‘తమ అక్రమాలు, పాపాలు క్షమించబడినవాళ్లు సంతోషంగా ఉంటారు; ఎవరి పాపాన్నైతే యెహోవా అస్సలు గుర్తుపెట్టుకోడో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు.’” (రోమా. 4:6-8; కీర్త. 32:1, 2) యెహోవా తన మీద విశ్వాసం ఉంచేవాళ్ల పాపాల్ని పూర్తిగా క్షమిస్తాడు. అంటే, వాళ్ల పాపాల్ని అస్సలు గుర్తుపెట్టుకోడు. అలాంటివాళ్లు చూపించిన విశ్వాసాన్నిబట్టి వాళ్లను ఏ తప్పూ చేయనివాళ్లుగా, నీతిమంతులుగా చూస్తాడు.

7. ఒకప్పటి నమ్మకమైన దేవుని సేవకులు నీతిమంతులని ఎందుకు చెప్పగలం?

7 అబ్రాహాము, దావీదు అలాగే ఇతర నమ్మకమైన దేవుని ఆరాధకులు నీతిమంతులు అని పిలవబడినా వాళ్లు అపరిపూర్ణులు, పాపులే. కానీ, తనను ఆరాధించని వాళ్లతో పోలిస్తే, వీళ్లు చూపించిన విశ్వాసాన్నిబట్టి దేవుడు వీళ్లను ఏ తప్పూ చేయనివాళ్లుగా చూశాడు. (ఎఫె. 2:12) దేవునితో మంచి స్నేహం కావాలంటే, విశ్వాసం చాలా ప్రాముఖ్యమని పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో స్పష్టంగా చెప్పాడు. అబ్రాహాము, దావీదు తమకున్న విశ్వాసాన్నిబట్టి దేవుని స్నేహితులు అయ్యారు. మనకు కూడా విశ్వాసం ఉంటే దేవునికి మంచి స్నేహితులు అవ్వగలం!

విశ్వాసానికి, పనులకు సంబంధం ఏంటి?

8-9. పౌలు, యాకోబు రాసిన మాటల్ని కొంతమంది ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారు? ఎందుకు?

8 విశ్వాసానికి, పనులకు మధ్య ఉన్న సంబంధం గురించి క్రైస్తవ మతనాయకులు వందల సంవత్సరాలుగా వాడివేడిగా వాదించుకుంటున్నారు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే, యేసుక్రీస్తు ప్రభువు పైన విశ్వాసం ఉంచాలని కొంతమంది మతనాయకులు బోధిస్తున్నారు. బహుశా వాళ్లు “యేసును నమ్ముకోండి రక్షణ పొందండి” అని చెప్పడం మీరు వినేవుంటారు. బహుశా వాళ్లు పౌలు చెప్పిన ఈ మాటల్ని కూడా ఎత్తి చూపించవచ్చు: ‘ఒక వ్యక్తి పనులు దేవునికి అనుగుణంగా లేకపోయినా దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచుతాడు.’ (రోమా. 4:6) అయితే ఇంకొంతమంది, “రక్షణ పొందాలంటే” చర్చివాళ్లు పవిత్రంగా ఎంచే ప్రదేశాలకు వెళ్లాలని, వాళ్లు పెట్టిన ఆచారాల్ని పాటించాలని చెప్తారు. వాళ్లు బహుశా యాకోబు 2:24 లో ఉన్న ఈ మాటల్ని చూపించవచ్చు: “కేవలం విశ్వాసం ఉండడం వల్ల కాదుగానీ, దాన్ని చేతల్లో చూపించినప్పుడే ఒక వ్యక్తి నీతిమంతుడని తీర్పు పొందుతాడు.”

9 విశ్వాసం, పనులు గురించి పౌలుకు, యాకోబుకు ఏకాభిప్రాయం లేదని కొంతమంది బైబిలు పండితులు అనుకున్నారు. కొంతమంది మతనాయకులైతే ఇలా అనొచ్చు, ‘పనులతో సంబంధం లేకుండా విశ్వాసం చూపిస్తే చాలు ఒక వ్యక్తి నీతిమంతునిగా ఎంచబడతాడని పౌలు నమ్మాడు. కానీ దేవున్ని సంతోషపెట్టాలంటే పనులు చాలా ప్రాముఖ్యమని యాకోబు బోధించాడు.’ ఒక బైబిలు ఫ్రొఫెసర్‌ ఆ విషయాన్ని ఇలా రాశాడు: “పనులతో సంబంధం లేకుండా కేవలం విశ్వాసం వల్లే ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడతాడని పౌలు చెప్పిన మాటల ఉద్దేశాన్ని యాకోబు అర్థం చేసుకోలేదు.” కానీ యెహోవాయే పౌలుతో, యాకోబుతో ఆ మాటలు రాయించాడు. (2 తిమో. 3:16) అయితే, ఆ మాటల్ని తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే, వాళ్లు రాసిన మాటల సందర్భాన్ని తెలుసుకుంటే సరిపోతుంది.

పౌలు రోములో ఉన్న క్రైస్తవులకు ధర్మశాస్త్రంలో ఉన్న పనులు కాదుగానీ విశ్వాసమే చాలా ప్రాముఖ్యమని చెప్పాడు (10వ పేరా చూడండి) b

10. పౌలు ఏ ‘పనుల’ గురించి మాట్లాడుతున్నాడు? (రోమీయులు 3:21, 28) (చిత్రం కూడా చూడండి.)

10 పౌలు రోమీయులు 3, 4 అధ్యాయాల్లో ఏ ‘పనుల’ గురించి మాట్లాడుతున్నాడు? సీనాయి పర్వతం మీద యెహోవా మోషేకు ఇచ్చిన “ధర్మశాస్త్రం చెప్తున్న పనుల” గురించి పౌలు మాట్లాడుతున్నాడు. (రోమీయులు 3:21,28 చదవండి.) ఎందుకంటే, పౌలు కాలంలో ఉన్న కొంతమంది యూదా క్రైస్తవులు ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించాలని, అది చెప్తున్న పనులు చేయాలని అనుకునేవాళ్లు. అందుకే “ధర్మశాస్త్రం చెప్తున్న పనులు” చేయడంవల్ల కాదుగానీ, విశ్వాసం వల్లే ఒక వ్యక్తి “దేవుని దృష్టిలో నీతియుక్తమైన స్థానం” పొందుతాడు అని పౌలు చెప్పాడు. దాన్ని నిరూపించడానికే ఆయన అబ్రాహాము ఉదాహరణ చెప్పాడు. ఇది మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఎందుకంటే మనకు యెహోవా మీద, క్రీస్తు మీద విశ్వాసం ఉంటే దేవుని ఆమోదం పొందుతాం.

తమ విశ్వాసాన్ని పక్షపాతం లేకుండా చేసే “పనుల్లో” చూపించమని యాకోబు క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు (11-12 పేరాలు చూడండి) c

11. యాకోబు చెప్పిన “పనులు” ఏంటి?

11 అయితే, యాకోబు 2వ అధ్యాయంలో ఉన్న “పనులు,” పౌలు ప్రస్తావించిన “ధర్మశాస్త్రం చెప్తున్న పనులు” రెండూ ఒకటి కావు. యాకోబు ఇక్కడ క్రైస్తవులు తమ రోజువారీ జీవితంలో చేసే పనుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ పనులు దేవుని మీద వాళ్లకు నిజమైన విశ్వాసం ఉందో లేదో చూపిస్తాయి. ఇప్పుడు యాకోబు ఉపయోగించిన రెండు ఉదాహరణల గురించి పరిశీలిద్దాం.

12. విశ్వాసానికి, పనులకు మధ్య ఉన్న సంబంధాన్ని యాకోబు ఎలా వివరించాడు? (చిత్రం కూడా చూడండి.)

12 మొదటి ఉదాహరణలో, క్రైస్తవులు ఎవ్వరి మీద పక్షపాతం చూపించకూడదని యాకోబు చెప్పాడు. దాన్ని వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ ఉపయోగించాడు. ఒక వ్యక్తి డబ్బున్న వాళ్లను బాగా గౌరవిస్తూ, పేదవాళ్లను చిన్నచూపు చూస్తే, అతనికి విశ్వాసం ఉందని చెప్పుకోవచ్చు గానీ అతను దానికి తగిన పనులు చేస్తున్నట్టా? అని యాకోబు అన్నాడు. (యాకో. 2:1-5, 9) రెండో ఉదాహరణలో, ఒక వ్యక్తి తన ‘తోటి సహోదరుడు గానీ సహోదరి గానీ వేసుకోవడానికి బట్టలు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడడం చూసి’ కూడా ఏ సహాయం చేయకపోతే, అతను విశ్వాసం ఉందని చెప్పుకున్నా, దానికి తగిన పనులు లేవు కాబట్టి అది వ్యర్థమని యాకోబు అన్నాడు. అందుకే ఆయనిలా రాశాడు: “విశ్వాసాన్ని చేతల్లో చూపించకపోతే అది చనిపోయినట్టే.”—యాకో. 2:14-17.

13. మన విశ్వాసాన్ని పనుల్లో చూపించాలని చెప్పడానికి యాకోబు ఎవరి ఉదాహరణ వాడాడు? (యాకోబు 2:25, 26)

13 విశ్వాసాన్ని పనుల్లో చూపించిన వాళ్లలో రాహాబు ఒక మంచి ఉదాహరణ అని యాకోబు చెప్పాడు. (యాకోబు 2:25, 26 చదవండి.) ఆమె యెహోవా గురించి విని, ఇశ్రాయేలీయులకు ఆయన మద్దతిస్తున్నాడని గుర్తించింది. (యెహో. 2:9-11) ఆమె ఇశ్రాయేలీయులైన ఇద్దరు గూఢచారుల ప్రాణాల్ని కాపాడి, తన విశ్వాసాన్ని పనుల్లో చూపించింది. దానివల్ల ఇశ్రాయేలీయురాలుకాని, అపరిపూర్ణురాలైన ఈ స్త్రీ, దేవుని దృష్టిలో అబ్రాహాములాగే నీతిమంతురాలు అని పేరు తెచ్చుకుంది. మన విశ్వాసాన్ని మన పనుల్లో చూపించడం చాలా ప్రాముఖ్యమని రాహాబు ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు.

14. విశ్వాసం, పనులు గురించి పౌలు, యాకోబు వేర్వేరు కోణాల్లో రాశారని ఎలా చెప్పవచ్చు?

14 కాబట్టి విశ్వాసం, పనులు గురించి పౌలు, యాకోబు వేర్వేరు కోణాల్లో రాశారు. కేవలం మోషే ధర్మశాస్త్రంలో ఉన్న పనులు చేసినంత మాత్రాన, యెహోవా ఆమోదం ఉంటుందని అనుకోవడం పొరపాటే అని పౌలు యూదా క్రైస్తవులకు చెప్పాడు. మరోవైపు, క్రైస్తవులందరూ తమ విశ్వాసాన్ని తాము చేసే మంచి పనుల్లో చూపించాలని యాకోబు చెప్పాడు.

యెహోవా ఆమోదించే పనుల్ని చేస్తూ మీ విశ్వాసాన్ని చూపిస్తున్నారా? (15వ పేరా చూడండి)

15. మన విశ్వాసాన్ని ఏయే పనుల్లో చూపించవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

15 యెహోవా మనల్ని నీతిమంతులుగా ఎంచాలంటే, అబ్రాహాము చేసినట్లే మనమూ వేరే ప్రాంతానికి వెళ్లాలని, డేరాల్లో ఉండాలని ఆయన ఆశించట్లేదు. నిజానికి, మనకు విశ్వాసం ఉందని వేర్వేరు విధాలుగా చూపించవచ్చు. రాజ్యమందిరంలో కొత్తవాళ్లను ఆప్యాయంగా ఆహ్వానించవచ్చు, నిజంగా అవసరంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌కి సహాయం చేయవచ్చు, కుటుంబ సభ్యులందరితో మంచిగా ఉండవచ్చు. ఇవన్నీ చేస్తే యెహోవా మనల్ని ఆమోదిస్తాడు, దీవిస్తాడు. (రోమా. 15:7; 1 తిమో. 5:4, 8; 1 యోహా. 3:18) అయితే, మన విశ్వాసాన్ని పనుల్లో చూపించే ముఖ్యమైన మార్గం ఇతరులకు ఉత్సాహంగా మంచివార్త ప్రకటించడం. (1 తిమో. 4:16) యెహోవా మాటిచ్చినవన్నీ నిజమౌతాయని, ఆయన చేసేవాటికి ఏదీ సాటిరాదనే విశ్వాసాన్ని పనుల్లో చూపించే అవకాశం మనందరికి ఉంది. అలా చేస్తే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతాడు, తనకు స్నేహితులని పిలుస్తాడు అనే గట్టి నమ్మకంతో మనం ఉండవచ్చు.

నిరీక్షణ విశ్వాసాన్ని పెంచుతుంది

16. అబ్రాహాము దేనిగురించి ఎదురుచూశాడు? దేని మీద విశ్వాసం ఉంచాడు?

16 అబ్రాహాము నుండి రోమీయులు 4వ అధ్యాయంలో ఇంకో ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, భవిష్యత్తు గురించి నిరీక్షణతో ఉండడం. “భూమ్మీద ఉన్న కుటుంబాలన్నీ” అబ్రాహాము ద్వారా ఖచ్చితంగా దీవించబడతాయి అని యెహోవా అతనికి మాటిచ్చాడు. అబ్రాహాముకు ఎంత అద్భుతమైన భవిష్యత్తు వేచివుందో కదా! (ఆది. 12:3; 15:5; 17:4; రోమా. 4:17) కానీ అబ్రాహాముకు 100 ఏళ్లు, శారాకు 90 ఏళ్లు వచ్చినా వాళ్లకు కొడుకు పుట్టలేదు. మనుషుల వైపు నుండి ఆలోచిస్తే, వాళ్లకు కొడుకు పుట్టడం అసాధ్యం. అది అబ్రాహాముకు నిజంగా పెద్ద పరీక్షే. అయినాసరే, దేవుడిచ్చిన “మాటకు అనుగుణంగా తాను అనేక దేశాల ప్రజలకు తండ్రి అవుతానని అతను విశ్వసించాడు.” (రోమా. 4:18, 19) నిజానికి, అతని ఆశలు అడియాశలు కాలేదు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న తన కొడుకైన ఇస్సాకు పుట్టాడు.—రోమా. 4:20-22.

17. మనం నీతిమంతులుగా, దేవుని స్నేహితులుగా అవ్వగలమని ఎలా చెప్పవచ్చు?

17 మనం దేవుని ఆమోదాన్ని పొంది, నీతిమంతులుగా అవ్వగలం. అంతేకాదు, అబ్రాహాములాగే దేవునికి స్నేహితులుగా కూడా అవ్వొచ్చు. నిజానికి, పౌలు ఈ విషయం గురించే ఇలా రాశాడు: ‘“దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు” అనే మాట కేవలం [అబ్రాహాము] కోసం మాత్రమే రాయబడలేదు. కానీ, దేవుడు నీతిమంతులుగా ఎంచబోతున్న మన కోసం కూడా రాయబడింది. ఎందుకంటే మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి బ్రతికించిన దేవుని మీద మనం నమ్మకం ఉంచుతున్నాం.’ (రోమా. 4:23, 24) అబ్రాహాములాగే మనకు విశ్వాసం ఉండాలి, దానికి తగిన పనులు చేయాలి, వాటికి తోడు నిరీక్షణ ఉండాలి. ఈ నిరీక్షణ గురించే పౌలు రోమీయులు 5వ అధ్యాయంలో మాట్లాడాడు. దాన్ని మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

a మనందరం యెహోవాను సంతోషపెట్టాలని, ఆయన మనల్ని నీతిమంతులుగా చూడాలని కోరుకుంటాం. అయితే, అదెలా సాధ్యమో పౌలు, యాకోబు రాసిన మాటల్ని పరిశీలించి చూస్తాం. అంతేకాదు, యెహోవాను సంతోషపెట్టడానికి మన విశ్వాసం, మన పనులు ఎంత ప్రాముఖ్యమో కూడా ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

b చిత్రాల వివరణ: వస్త్రం అంచులకు నీలి రంగు దారాల్ని కుట్టుకోవడం, పస్కాను ఆచరించడం, చేతులు కడుక్కోవడం లాంటి ఆచారాల మీద కాకుండా విశ్వాసం మీద మనసు పెట్టమని పౌలు యూదా క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు.

c చిత్రం వివరణ: పేదవాళ్లకు సహాయం చేయడం లాంటి మంచి పనులు చేస్తూ విశ్వాసాన్ని చూపించమని యాకోబు ప్రోత్సహించాడు.