కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 50

పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’

తల్లిదండ్రులారా—విశ్వాసం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి

తల్లిదండ్రులారా—విశ్వాసం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి

‘మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోండి.’రోమా. 12:2.

ముఖ్యాంశం

తల్లిదండ్రులు పిల్లలతో దేవుని గురించి, బైబిలు గురించి ఎలా మాట్లాడాలో అలాగే విశ్వాసం పెంచుకునేలా వాళ్లకు ఎలా సహాయం చేయాలో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.

1-2. దేవుని గురించి, బైబిలు గురించి పిల్లలు ప్రశ్నలు అడిగితే తల్లిదండ్రులు ఏం చేయాలి?

 పిల్లల్ని పెంచడం అంత తేలికేం కాదు. మీకు పిల్లలుంటే, వాళ్ల విశ్వాసాన్ని పెంచడానికి మీరు చేస్తున్న కృషిని నిజంగా మెచ్చుకోవాలి. యెహోవా కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడు. (ద్వితీ. 6:6, 7) అయితే పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవుతుండగా మన నమ్మకాల గురించి, బైబిల్లో ఉన్న నియమాల గురించి కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టవచ్చు.

2 అలాంటి ప్రశ్నలు వినగానే మొదట్లో మీకు కంగారుగా, పిల్లల విశ్వాసం తగ్గిపోయిందేమో అని భయంగా అనిపించవచ్చు. కానీ నిజానికి ఎదుగుతున్న పిల్లలు ప్రశ్నలు అడగడం మంచిది. అప్పుడే వాళ్లకంటూ సొంత అభిప్రాయాలు, నమ్మకాలు ఏర్పడతాయి. (1 కొరిం. 13:11) కాబట్టి భయపడాల్సిన పని లేదు. వాళ్లు అడిగే ప్రతీ ప్రశ్నను ఒక అవకాశంగా తీసుకుని, సొంతగా ఆలోచించడానికి వాళ్లకు సహాయం చేయండి. అప్పుడు దేవుని మీద, బైబిలు మీద వాళ్ల విశ్వాసం పెరుగుతుంది.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 తల్లిదండ్రులు పిల్లలకు ఈ మూడు విషయాల్లో ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. (1) పిల్లలు సొంతగా తమ నమ్మకాల్ని బలపర్చుకోవడానికి, (2) బైబిలు చెప్పే మంచి విలువలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవడానికి, (3) తమ నమ్మకాల్ని వేరేవాళ్లకు వివరించడానికి. అంతేకాదు పిల్లలు ప్రశ్నలు అడగడం ఎందుకు మంచిదో, మన నమ్మకాల గురించి పిల్లలతో మాట్లాడడానికి కుటుంబంగా కలిసి ఏమేం పనులు చేయవచ్చో చూస్తాం.

పిల్లలు సొంతగా తమ నమ్మకాల్ని బలపర్చుకునేలా సహాయం చేయండి

4. పిల్లలకు ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? ఎందుకు?

4 దేవుని మీద విశ్వాసం పిల్లలకు వారసత్వంగా వచ్చేది కాదని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. యెహోవా మీద విశ్వాసం మీకు పుట్టుకతో రాలేదు, మీ పిల్లల విషయంలో కూడా అంతే. వాళ్లు పెద్దవాళ్లు అవుతుండగా బహుశా ఈ ప్రశ్నలతో తర్జనభర్జన పడుతుండవచ్చు: ‘దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు ఏంటి? బైబిలు చెప్తున్నదాన్ని నిజంగా నమ్మవచ్చా?’ ‘ఆలోచన సామర్థ్యాన్ని’ ఉపయోగించి ‘అన్నిటినీ పరీక్షించడం’ మంచిదని బైబిలు కూడా చెప్తుంది. (రోమా. 12:1; 1 థెస్స. 5:21) మరి తమ విశ్వాసాన్ని పెంచుకునేలా మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

5. బైబిలు మీద విశ్వాసం పెంచుకునేలా తల్లిదండ్రులు పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? (రోమీయులు 12:2)

5 బైబిల్లో ఉన్నవి నిజం అనడానికిగల రుజువుల్ని వెదకమని మీ పిల్లల్ని ప్రోత్సహించండి. (రోమీయులు 12:2 చదవండి.) మీ పిల్లలు ప్రశ్నలు అడిగితే యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం, వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ లాంటి పరిశోధన పుస్తకాల్ని ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు ఎలా వెదకాలో చూపించండి. బైబిలు మనుషులు రాసిన మంచి పుస్తకం మాత్రమే కాదు, అది “దేవుని వాక్యం” అనడానికి రుజువుల కోసం పరిశోధనా పుస్తకంలో “బైబిలు” అనే ముఖ్యాంశం కింద “దైవ ప్రేరేపితం” అనే అంశంలో ఉన్న ఆర్టికల్స్‌ని పిల్లలు చదవచ్చు. (1 థెస్స. 2:13) ఉదాహరణకు, ప్రాచీన అష్షూరు పట్టణమైన నీనెవె గురించి మీ పిల్లలు పరిశోధన చేయవచ్చు. కొంతమంది బైబిలు పండితులు నీనెవె పట్టణం అనేదే లేదని అనేవాళ్లు. కానీ దాదాపు 1850 లో నీనెవె పట్టణ శిథిలాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. దాంతో బైబిలు చెప్తుంది నిజమని రుజువైంది. (జెఫ. 2:13-15) నీనెవె నాశనం బైబిలు ప్రవచనాన్ని ఎలా నెరవేర్చిందో తెలుసుకోవడానికి కావలికోట నవంబరు, 2021 పత్రికలో “మీకు తెలుసా?” అనే ఆర్టికల్‌ చూడొచ్చు. అలా మన ప్రచురణల్లో చదివినదాన్ని ఎన్‌సైక్లోపీడియాల్లో, పేరున్న ఇతర పుస్తకాల్లో, వెబ్‌సైట్‌లలో చూసినదాన్ని పోల్చినప్పుడు బైబిలు మీద మీ పిల్లల విశ్వాసం పెరుగుతుంది.

6. పిల్లలు సొంతగా ఆలోచించుకునేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు? ఉదాహరణతో చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)

6 సొంతగా ఆలోచించుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి. తల్లిదండ్రులారా బైబిలు గురించి, దేవుని గురించి మీ పిల్లలతో మాట్లాడడానికి అవకాశాల కోసం చూడండి. బహుశా మీరు మ్యూజియం, పార్కు, గార్డెన్‌ లేదా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలోని మ్యూజియంలకు వెళ్లినప్పుడు ఆ అవకాశాలు దొరకవచ్చు. మీరు మ్యూజియంకి నేరుగా వెళ్లినా లేదా ఆన్‌లైన్‌లో మ్యూజియం టూర్‌ చూసినా బైబిలుకు సంబంధించి ఏమైనా వస్తువులు ఉంటే వాటిని చూపించండి. అప్పుడు బైబిలు చెప్తుంది నిజమనే విశ్వాసాన్ని మీ పిల్లలు పెంచుకోగలుగుతారు. ఉదాహరణకు, యెహోవా పేరును 3,000 సంవత్సరాల క్రితం ఒక రాయి మీద చెక్కారని మీ పిల్లలకు తెలుసా? ఆ రాయిని “మోయబైట్‌ స్టోన్‌” అని పిలుస్తారు. అది ఫ్రాన్స్‌లోని ఒక మ్యూజియంలో ఉంది. ఈ రాయి కాపీ ఒకటి, వార్విక్‌లోని యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో “బైబిలు, అందులోని దేవుని పేరు” అనే మ్యూజియంలో ఉంది. ఆ రాయి మీద మోయాబు రాజైన మేషా ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేశాడని ఉంటుంది, బైబిలు కూడా అదే చెప్తుంది. (2 రాజు. 3:4, 5) బైబిలు చెప్తుంది నిజమనే రుజువుల్ని మీ పిల్లలు కళ్లారా చూసినప్పుడు వాళ్ల విశ్వాసం పెరుగుతుంది.—2 దినవృత్తాంతాలు 9:6 తో పోల్చండి.

మ్యూజియంలో ఉన్న వస్తువుల్ని చూపించి బైబిలు చెప్తుంది నిజమనే నమ్మకాన్ని మీ పిల్లల్లో పెంచడానికి ప్రయత్నించండి (6వ పేరా చూడండి)


7-8. (ఎ) ప్రకృతిలోని అందమైన ఆకారాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఉదాహరణతో చెప్పండి. (చిత్రం కూడా చూడండి.) (బి) సృష్టికర్త ఉన్నాడనే నమ్మకాన్ని పెంచుకోవడానికి మీ పిల్లలకు ఏ ప్రశ్నలు సహాయం చేస్తాయి?

7 ప్రకృతిలో కనిపించేవాటి గురించి ఆలోచించమని మీ పిల్లల్ని ప్రోత్సహించండి. మీరు పార్కులో లేదా ఇంట్లో ఉన్న మొక్కల్ని చూపిస్తూ సృష్టిలో ఉన్న వేర్వేరు ఆకారాల గురించి మీ పిల్లలకు చెప్పండి. అప్పుడు వాటిని ఎవరో తెలివిగా డిజైన్‌ చేశారు అనే రుజువులు మీ పిల్లలకే కనిపిస్తాయి. ఉదాహరణకు, సృష్టిలో చాలా వస్తువులు మెలికెలు తిరిగినట్టుగా (స్పైరల్‌) కనిపిస్తాయి. వీటి గురించి సైంటిస్ట్‌లు చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. ప్రకృతిలో ఏదైనా మెలికెలు తిరిగినట్టు ఉంటే అది ఎన్నిసార్లు మెలికెలు తిరిగిందో లెక్కపెడితే ఒక ప్రత్యేకమైన అంకెల వరుస వస్తుందని నికోలా ఫామలీ అనే సైంటిస్ట్‌ వివరించాడు. దాన్నే ఫిబోనాచి సిరీస్‌ అంటారు. ఈ మెలికెలు తిరిగిన ఆకారాలు ప్రకృతిలో చాలా వాటిలో కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని నక్షత్ర వీధుల్లో, నత్త గుల్లల్లో, ఆకుల్లో అలాగే సన్‌ఫ్లవర్‌ పువ్వు మధ్యభాగంలో చూస్తాం. a

8 ప్రకృతిలోని ఆకారాల వెనక కొన్ని నియమాలు ఉన్నాయని మీ పిల్లలు సైన్స్‌ క్లాస్‌లో నేర్చుకుంటారు. ఉదాహరణకు ప్రతీ మంచు స్ఫటికంలో (స్నోఫ్లేక్‌) ఒక ప్రత్యేకమైన ఆకారం కనిపిస్తుంది. దాన్నే ఫ్రాక్‌టల్‌ అంటారు. ఈ ఫ్రాక్‌టల్‌ డిజైన్‌లు ప్రకృతిలో ఉన్న చెట్లలో, ఇంకొన్ని వాటిల్లో కూడా కనిపిస్తాయి. ఇంత అందమైన ఆకారాల వెనకున్న నియమాల్ని ఎవరు పెట్టారు? ప్రకృతిలో వీటిని ఒక పద్ధతిగా, జాగ్రత్తగా ఎవరు డిజైన్‌ చేసుంటారు? ఇలాంటి ప్రశ్నల గురించి మీ పిల్లలు ఎంతెక్కువ ఆలోచిస్తే, అన్నిటినీ దేవుడే సృష్టించాడనే నమ్మకం వాళ్లలో అంతెక్కువ పెరుగుతుంది. (హెబ్రీ. 3:4) తర్వాత ఏదోక సమయంలో మీరు ఈ ప్రశ్న అడగొచ్చు: “దేవుడే మనల్ని సృష్టించాడంటే సంతోషంగా ఎలా జీవించాలో ఆయనకన్నా బాగా మనకు ఇంకా ఎవరు చెప్పగలరు?” అలా మెల్లమెల్లగా జీవితానికి సంబంధించిన మంచి సలహాలు బైబిల్లో ఉన్నాయని చూపించవచ్చు.

NASA, ESA, and the Hubble Heritage (STScl/​AURA)-ESA/​Hubble Collaboration

ప్రకృతిలో కనిపించే అందమైన డిజైన్‌లు ఎలా వచ్చాయి? (7-8 పేరాలు చూడండి)


బైబిల్లోని విలువలు ఎంత గొప్పవో అర్థంచేసుకునేలా సహాయం చేయండి

9. బైబిల్లో ఉన్న విలువలు సరైనవేనా అని మీ పిల్లలు ఎందుకు ప్రశ్నిస్తుండవచ్చు?

9 బైబిల్లో ఉన్న విలువలు సరైనవా కావా అని మీ పిల్లలు ప్రశ్నిస్తే, వాళ్లు ఎందుకు అలా అడుగుతున్నారో కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. బైబిల్లో ఉన్న విలువలు కరెక్ట్‌ కాదని అనుకుంటున్నారా లేక ఆ విలువల గురించి వేరేవాళ్లకు ఎలా వివరించాలో తెలీక ఇబ్బంది పడుతున్నారా? కారణం ఏదైనాసరే బైబిల్లోని విలువలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంతో మీ పిల్లలకు స్టడీ చేస్తే బాగుంటుంది. b

10. యెహోవాను బెస్ట్‌ ఫ్రెండ్‌గా చేసుకోవాలనే కోరికను మీ పిల్లల్లో ఎలా పెంచవచ్చు?

10 యెహోవాను బెస్ట్‌ ఫ్రెండ్‌గా చేసుకోవాలనే కోరికను మీ పిల్లల్లో పెంచండి. మీ పిల్లలతో స్టడీ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ఉన్న ప్రశ్నల్ని, బొమ్మల్ని ఉపయోగించి వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. (సామె. 20:5) ఉదాహరణకు మనకు మంచి సలహాలు ఇచ్చి, మనల్ని కాపాడే మంచి ఫ్రెండ్‌తో యెహోవాను 8వ పాఠం పోలుస్తుంది. 1 యోహాను 5:3 చర్చించిన తర్వాత మీరిలా అడగొచ్చు: “యెహోవా అంత మంచి ఫ్రెండ్‌ అని తెలుసుకున్నాక ఆయన చేయమని చెప్పిన పనుల్ని మనం ఎలా చూడాలి?” పైకి కనిపించడానికి అది చిన్న ప్రశ్నలాగే ఉండవచ్చు. కానీ యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే నియమాల్ని ఇచ్చాడని మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి అది సహాయం చేస్తుంది.—యెష. 48:17, 18.

11. బైబిలు చెప్పేది చేయడం ఎందుకు మంచిదో అర్థం చేసుకునేలా మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? (సామెతలు 2:10, 11)

11 బైబిలు చెప్పేవన్నీ చేస్తే వచ్చే ప్రయోజనాల గురించి మాట్లాడుకోండి. మీరు కలిసి బైబిలు చదువుతున్నప్పుడు లేదా దినవచనం చదువుతున్నప్పుడు బైబిలు సూత్రాలు మీ కుటుంబానికి ఎలా ఉపయోగపడ్డాయో మాట్లాడుకోండి. ఉదాహరణకు కష్టపడి పనిచేయడం వల్ల, ఎప్పుడూ నిజమే మాట్లాడడం వల్ల ఎన్ని ప్రయోజనాలు వస్తాయో మీరు చెప్పవచ్చు. (హెబ్రీ. 13:18) అంతేకాదు బైబిలు సూత్రాల్ని పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, మనసు ప్రశాంతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. (సామె. 14:29, 30) అలా బైబిలు చెప్పేవాటిని చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని మీ పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు వాటికి లోబడాలనే కోరిక వాళ్లలో పెరగవచ్చు.—సామెతలు 2:10, 11 చదవండి.

12. బైబిలు సూత్రాలు ఎలా ఉపయోగపడతాయో తమ కొడుకు అర్థం చేసుకునేలా, ఒక జంట ఏం చేసింది?

12 ఫ్రాన్స్‌లో ఉంటున్న స్టీవ్‌ అనే ఆయన వాళ్ల టీనేజ్‌ అబ్బాయికి ఎలా సహాయం చేశాడో చెప్తున్నాడు. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే నియమాల్ని పెట్టాడని వాళ్ల అబ్బాయి ఈతన్‌కి అర్థమయ్యేలా చెప్పడానికి స్టీవ్‌, ఆయన భార్య బాగా ప్రయత్నించారు. స్టీవ్‌ ఇలా చెప్తున్నాడు: “మేము ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్లం: ‘ఫలానా నియమాన్ని పాటించమని యెహోవా ఎందుకు అంటున్నాడు? దీని వెనక ఆయన ప్రేమ ఉందని ఎలా చెప్పవచ్చు? ఈ నియమాన్ని పాటించకపోతే ఏమౌతుంది?’” ఇలా మాట్లాడుకోవడం వల్ల యెహోవా పెట్టిన నియమాలు తన మంచికోసమే అని ఈతన్‌ గట్టిగా నమ్మగలిగాడు. స్టీవ్‌ ఇంకా ఇలా చెప్తున్నాడు: “మనుషుల తెలివి కన్నా బైబిల్లో ఉన్న తెలివి చాలాచాలా గొప్పదని ఈతన్‌ అర్థం చేసుకోవాలన్నదే మా కోరిక.”

13. బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో తల్లిదండ్రులు పిల్లలకు ఎలా నేర్పించవచ్చు? ఉదాహరణతో చెప్పండి.

13 బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో మీ పిల్లలకు నేర్పించండి. స్కూల్లో ఒక ప్రాజెక్టులో భాగంగా మీ పిల్లలు ఏదైనా కథ గానీ, పుస్తకం గానీ చదవాల్సి రావచ్చు. తప్పుడు పనులు చేయడం, కోపంగా ప్రవర్తించడం అంత పెద్ద తప్పేమీ కాదన్నట్టు ఆ కథ లేదా పుస్తకం చెప్తుండవచ్చు. ఒకవేళ అలాంటిది ఏదైనా పిల్లలు చదివేదానిలో వస్తే, దాన్ని అవకాశంగా తీసుకొని ఇలాంటి పనులు చేసేవాళ్లను యెహోవా ఎలా చూస్తాడని ఆలోచించేలా మీ పిల్లలకు సహాయం చేయండి. అప్పుడు యెహోవాకు లోబడడమే సరైనదని మీ పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. (సామె. 22:24, 25; 1 కొరిం. 15:33; ఫిలి. 4:8) ఒకవేళ ఆ పుస్తకం గురించి టీచర్‌ గానీ వేరే పిల్లలు గానీ ఏమైనా అడిగితే తమ నమ్మకాల్ని పిల్లలు ధైర్యంగా చెప్పగలుగుతారు.

తమ నమ్మకాల్ని వేరేవాళ్లకు వివరించడం పిల్లలకు నేర్పించండి

14. పిల్లలు ఏ విషయం గురించి వేరేవాళ్లతో మాట్లాడడానికి వెనుకాడుతుండవచ్చు? ఎందుకు?

14 తమ నమ్మకాల గురించి వేరేవాళ్లకు చెప్పడానికి పిల్లలు భయపడుతుండవచ్చు. ఉదాహరణకు, పరిణామం లేదా ఎవల్యూషన్‌ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పిల్లలకు ధైర్యం సరిపోకపోవచ్చు. ఎందుకంటే అది ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, అదే కరెక్ట్‌ అన్నట్టు టీచర్లు బల్లగుద్ది చెప్తుంటారు. తమ నమ్మకాల గురించి చెప్పడానికి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

15. తమ నమ్మకాల గురించి జంకకుండా ధైర్యంగా ఉండడానికి పిల్లలకు ఏం సహాయం చేస్తుంది?

15 తమ నమ్మకాల గురించి జంకకుండా ఉండేలా పిల్లలకు సహాయం చేయండి. సృష్టికర్త ఉన్నాడని మీ పిల్లలు నమ్ముతున్నందుకు సిగ్గుపడాల్సిన పనేమీ లేదు. (2 తిమో. 1:8) ఎందుకంటే చాలామంది సైంటిస్ట్‌లు మనచుట్టూ ఉన్నవి అవంతట అవే వచ్చేశాయని నమ్మరు. ఈ అద్భుతమైన సృష్టి వెనక తెలివైనవాళ్లు ఉన్నారని సైంటిస్ట్‌లు కూడా అనుకుంటారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లలో ఎవల్యూషన్‌ గురించి నేర్పిస్తున్నా, అదే కరెక్ట్‌ అని వాళ్లు అనుకోరు. అంతేకాదు వేరే బ్రదర్స్‌-సిస్టర్స్‌ సృష్టికర్తను ఎందుకు నమ్ముతున్నారో తెలుసుకోవడం వల్ల మీ పిల్లలు విశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుకోగలుగుతారు. c

16. సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నారో వేరేవాళ్లకు వివరించేలా, తల్లిదండ్రులు పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? (1 పేతురు 3:15) (చిత్రం కూడా చూడండి.)

16 సృష్టికర్త ఉన్నాడని మీ పిల్లలు ఎందుకు నమ్ముతున్నారో వేరేవాళ్లకు వివరించేలా సహాయం చేయండి. (1 పేతురు 3:15 చదవండి.) jw.orgలో ఉన్న “యువత అడిగే ప్రశ్నలు—జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేక దానంతటదే వచ్చిందా?” అనే ఆర్టికల్‌ సిరీస్‌ని మీ పిల్లలతో కలిసి చర్చించవచ్చు. తర్వాత సృష్టికర్త ఉన్నాడని వేరేవాళ్లకు ఎలా వివరిస్తే బాగుంటుందో మీ పిల్లల్నే అడగండి. దానికి తగ్గట్టు ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్‌ చేయండి. క్లాస్‌మేట్స్‌తో వాదించాల్సిన అవసరంలేదని మీ పిల్లలకు గుర్తు చేయండి. ఎవరైనా మాట్లాడడానికి ఇష్టపడితే, చిన్నచిన్న లాజిక్‌లతో ఈజీగా అర్థమయ్యేలా మాట్లాడడం నేర్పించండి. ఉదాహరణకు, స్కూల్‌లో ఎవరైనా ఇలా అనొచ్చు: “నేను కనిపించే వాటినే నమ్ముతాను. దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు కాబట్టి నమ్మను.” అప్పుడు మీ పిల్లలు ఇలా చెప్పవచ్చు: “ఊరు బయట అడవిలో నడుస్తున్నట్లు ఒకసారి ఊహించుకో. కాస్త దూరం నడిచాక, చక్కగా కట్టిన ఒక బావి కనిపించింది. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు? దాన్ని ఖచ్చితంగా ఎవరోఒకరు కట్టారనే అనుకుంటావు కదా? ఒక చిన్న బావిని చూస్తేనే అలా అనుకున్నప్పుడు ఈ విశ్వం, భూమి సంగతేంటి?”

క్లాస్‌మేట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు చిన్నచిన్న లాజిక్‌లతో, ఈజీగా అర్థమయ్యేలా మాట్లాడండి (16-17 పేరాలు చూడండి) d


17. వేరేవాళ్లతో బైబిలు గురించి మాట్లాడడానికి అవకాశాల కోసం చూడమని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా ప్రోత్సహించవచ్చు? మీ పిల్లలు తమ క్లాస్‌మేట్స్‌తో ఎలా మాట్లాడవచ్చో ఒక ఉదాహరణ చెప్పండి.

17 బైబిలు గురించి వేరేవాళ్లతో మాట్లాడడానికి అవకాశాల కోసం చూడమని పిల్లల్ని ప్రోత్సహించండి. (రోమా. 10:10) వేరేవాళ్లకు బైబిలు గురించి చెప్పడానికి చేసే ప్రయత్నాన్ని పియానో లేదా గిటార్‌ నేర్చుకోవడంతో పోల్చవచ్చు. మొదట్లో ఎవరైనా సింపుల్‌గా ఉండే పాటల్ని వాయించడం నేర్చుకుంటారు. కాలం గడిచేకొద్దీ బాగా వాయించగలుగుతారు. అదేవిధంగా ఎవరితోనైనా బైబిలు గురించి మాట్లాడేటప్పుడు మొదట్లో మీ పిల్లలు సింపుల్‌ పద్ధతుల్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వాళ్లు తమ క్లాస్‌మేట్‌ను ఇలా అడగొచ్చు: “చాలాసార్లు ఇంజనీర్లు ప్రకృతిలో ఉన్న డిజైన్‌లను కాపీ కొడతారని నీకు తెలుసా? ఒక మంచి వీడియో చూపించనా?” తర్వాత వాళ్లు సృష్టిలో అద్భుతాలు సిరీస్‌ నుండి ఒక వీడియో చూపించి ఇలా అడగొచ్చు: “ప్రకృతిలో ఉన్నవాటిని చూసి వస్తువులను తయారు చేసినందుకే ఇంజనీర్లను మెచ్చుకుంటే, మరి ప్రకృతిని చేసినందుకు ఎవర్ని మెచ్చుకోవాలి?” ఇలా సింపుల్‌గా మాట్లాడితే చాలు, బహుశా తన క్లాస్‌మేట్‌ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని అనుకోవచ్చు.

విశ్వాసం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేస్తూ ఉండండి

18. పిల్లలు విశ్వాసం పెంచుకునేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేస్తూ ఉండవచ్చు?

18 యెహోవా మీద విశ్వాసంలేని ప్రజలతో మన చుట్టూవున్న లోకం నిండిపోయింది. (2 పేతు. 3:3) కాబట్టి తల్లిదండ్రులారా, మీరు పిల్లలతో బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు దేవుని వాక్యమైన బైబిలు మీద, అందులోని విలువల మీద గౌరవం పెరిగేలా వేర్వేరు అంశాల గురించి పరిశోధన చేయమని పిల్లల్ని ప్రోత్సహించండి. యెహోవా సృష్టిలోని అద్భుతమైన విషయాల్ని చూపిస్తూ, వాళ్ల ఆలోచన సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నించండి. ఒక్క పొల్లు కూడా పోకుండా ఇప్పటివరకు నెరవేరిన బైబిలు ప్రవచనాల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ పిల్లలతో కలిసి ప్రార్థించండి, వాళ్లకోసం ప్రార్థించండి. అప్పుడు విశ్వాసం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయడానికి మీరు పడుతున్న కష్టాన్ని యెహోవా ఖచ్చితంగా దీవిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—2 దిన. 15:7.

పాట 133 యౌవనకాలంలో యెహోవాను ఆరాధించండి

a ఇంకా తెలుసుకోవడానికి, jw.org వెబ్‌సైట్‌లో ఉన్న సృష్టిలోని అద్భుతాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి—Patterns (ఇంగ్లీష్‌) అనే వీడియో చూడండి.

b మీ పిల్లలకు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం నుండి స్టడీ అయిపోయుంటే 3, 4 సెక్షన్‌లలో ఉన్న కొన్ని విషయాల్ని మళ్లీ చెప్పండి. అందులోని కొన్ని పాఠాలు బైబిలు చెప్పే విలువల గురించి వివరిస్తాయి.

c 2006, అక్టోబరు తేజరిల్లు! పత్రికలో వచ్చిన “సృష్టికర్త ఉన్నాడని మేము నమ్మడానికిగల కారణాలు” అనే ఆర్టికల్‌, జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఇంగ్లీష్‌) అనే బ్రోషురు చూడండి. ఇంకొన్ని ఉదాహరణలు తెలుసుకోవడానికి jw.org వెబ్‌సైట్‌లో జీవారంభం గురించిన అభిప్రాయాలు అనే వీడియో సిరీస్‌ చూడండి.

d చిత్రం వివరణ: డ్రోన్స్‌ అంటే ఇష్టమున్న తన క్లాస్‌మేట్‌కి ఒక అబ్బాయి “సృష్టిలో అద్భుతాలు” సిరీస్‌ నుండి ఒక వీడియో చూపిస్తున్నాడు.