జీవిత కథ
నేర్చుకోవడమనే అంతులేని ప్రయాణాన్ని ఎన్నడూ ఆపలేదు
యెహోవా నా ‘మహాగొప్ప ఉపదేశకునిగా’ ఉన్నందుకు నేను ఆయనకు రుణపడి ఉన్నాను. (యెష. 30:20) ఆయన తన వాక్యమైన బైబిలు, అద్భుతమైన సృష్టి, సంస్థ ద్వారా తన ఆరాధకులకు నేర్పిస్తున్నాడు. అంతేకాదు సాటి మనుషుల ద్వారా అంటే మన బ్రదర్స్-సిస్టర్స్ ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. నాకు 97 ఏళ్లు వచ్చినా ఈ విధానాలన్నిట్లో యెహోవా ఇచ్చే ఉపదేశం నుండి ఇప్పటికీ ప్రయోజనం పొందుతున్నాను. ఎలాగో చెప్తా వినండి.
నేను 1927లో అమెరికాలోని చికాగోకు దగ్గర్లో, ఇల్లినాయిస్ అనే చిన్న పట్టణంలో పుట్టాను. మా అమ్మానాన్నలకు మేము మొత్తం ఐదుగురు పిల్లలం: జత, డాన్, నేను, కార్ల్, జాయ్. మేమంతా యెహోవాను నిండు ప్రాణంతో సేవించాలని నిర్ణయించుకున్నాం. జత 1943లో గిలియడ్ పాఠశాల రెండవ తరగతికి హాజరైంది. డాన్ 1944లో, కార్ల్ 1947లో, జాయ్ 1951లో న్యూయార్క్‌లో ఉన్న బ్రూక్లిన్ బెతెల్‌కి వెళ్లారు. నా తోబుట్టువులు, అమ్మానాన్నలు యెహోవా సేవ చేయమని నన్ను బాగా ప్రోత్సహించారు.
సత్యం మా తలుపు తట్టింది
మా అమ్మానాన్నలు బైబిలు బాగా చదివేవాళ్లు. వాళ్లకు దేవుడంటే చాలా ఇష్టం. మాకు కూడా అదే నేర్పించారు. కానీ యూరప్‌లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం మా నాన్నలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఆ సమయంలో ఆయన సైనికుడిగా పనిచేశాడు, ఆ తర్వాత నుండి ఆయనకు చర్చీలంటేనే చిరాకు వచ్చేది. కానీ అమ్మ ఏమో, నాన్న ఇంటికి ప్రాణాలతో వచ్చాడనే సంతోషంతో, “రండి ఎప్పటిలాగే చర్చీకి వెళ్దాం” అంది. దానికి నాన్న, “నీతో అక్కడ వరకు వస్తాగానీ లోపలికైతే రాను” అన్నాడు. అప్పుడు అమ్మ “ఎందుకు రారు?” అని అడిగింది. దానికి ఆయనిలా చెప్పాడు: “యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకే మతానికి చెందిన పాస్టర్లు రెండువైపుల ఉన్న సైనికుల్ని దీవిస్తూ ప్రార్థించారు. మరి దేవుడు ఎవరివైపు ఉన్నట్టు?”
ఆ తర్వాత ఒకరోజు, అమ్మ చర్చీకి వెళ్లినప్పుడు ఇద్దరు యెహోవాసాక్షులు మా తలుపు తట్టారు. వాళ్లు నాన్నకు లైట్ (వెలుగు) అనే రెండు ఇంగ్లీషు పుస్తకాల్ని ఇచ్చారు. వాటిలో ప్రకటన గ్రంథం గురించి ఉంది. నాన్నకు నచ్చి ఆ పుస్తకాల్ని తీసుకున్నాడు. ఆ పుస్తకాలు అమ్మ కంటపడగానే, ఆమె చదవడం మొదలుపెట్టింది. కొన్ని రోజులకు లైట్ అనే పుస్తకాల్ని ఉపయోగించి స్టడీ జరుగుతుందని, ఆసక్తి ఉన్నవాళ్లు రావచ్చని అమ్మ న్యూస్ పేపర్‌లో ఒక ప్రకటన చూసింది. తను అక్కడికి వెళ్లినప్పుడు ఒక పెద్దావిడ తలుపు తెరిచింది. అమ్మ పుస్తకాల్ని చూపిస్తూ “వీటిని ఇక్కడ స్టడీ చేస్తున్నారా?” అని అడిగింది. దానికి ఆవిడ “అవునమ్మా, లోపలికి రా” అంది. ఆ తర్వాతి వారం అమ్మ మమ్మల్ని కూడా తీసుకెళ్లింది, ఇక అప్పటి నుండి మేము ప్రతీవారం వెళ్లేవాళ్లం.
ఒకసారి మీటింగ్‌లో కీర్తన 144:15 చదవమని స్టేజ్ మీద నుండి బ్రదర్ నన్ను అడిగాడు. యెహోవాను ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారని ఆ లేఖనం చెప్తుంది. ఆ లేఖనమే కాదు నాకు ఇంకో రెండు లేఖనాలు కూడా నచ్చాయి: యెహోవా “సంతోషంగల దేవుడు” అని చెప్పే 1 తిమోతి 1:11 అలాగే ‘దేవున్ని అనుకరించండి’ అని చెప్పే ఎఫెసీయులు 5:1. నా సృష్టికర్తను సంతోషంగా ఆరాధించాలని, అలా ఆరాధించే అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకు రుణపడి ఉండాలని అర్థం చేసుకున్నాను. నా జీవితమంతా ఈ రెండు పనులు చేయడానికి బాగా ప్రయత్నించాను.
మాకు దగ్గర్లో ఉన్న సంఘం చికాగోలో ఉంది. అక్కడికి వెళ్లాలంటే మేము 32 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయినాసరే వెళ్లేవాళ్లం, దానివల్ల నేను బైబిలు గురించి బాగా నేర్చుకోగలిగాను. ఒకసారి ఏమైందంటే, మీటింగ్‌లో మా అక్క కామెంట్ చెప్పింది. అది విన్నప్పుడు ‘నాకు కూడా ఇది తెలుసు, నేను చెయ్యెత్తి ఉంటే బాగుండేదే’ అని అనుకున్నాను. ఆ తర్వాత నుండి నేను మీటింగ్స్‌కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టి సొంతగా కామెంట్స్ రాసుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా తోబుట్టువుల్లాగే నేను కూడా యెహోవాకు దగ్గరయ్యాను, 1941లో బాప్తిస్మం తీసుకున్నాను.
సమావేశాల్లో యెహోవా నుండి నేర్చుకోవడం
1942లో ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన సమావేశం నాకు బాగా గుర్తుండి పోయింది. సమావేశానికి వచ్చిన చాలామందితో పాటు మేము కూడా టెంట్లలో ఉన్నాం. అమెరికాలోని 50 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉన్న బ్రదర్స్-సిస్టర్స్ ఈ కార్యక్రమాన్ని టెలిఫోన్ ద్వారా విన్నారు. అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒకవైపు రెండవ ప్రపంచ యుద్ధం విజృంభిస్తుంది. ఇంకోవైపు యెహోవాసాక్షుల మీద వ్యతిరేకత పెరిగిపోతుంది. ఇలా ఉండగా సమావేశం అప్పుడు, ఒకరోజు సాయంత్రం చాలామంది బ్రదర్స్ వాళ్ల కార్లను హెడ్ లైట్లు ఒకే వైపు ఉండేలా పార్క్ చేయడం నేను చూశాను. ఒక్కొక్కరు ఒక్కో కార్లో కూర్చుని రాత్రంతా కాపలా కాయాలని అనుకున్నారు. ఒకవేళ ఎవరైనా మాపై దాడిచేస్తే, ఆ బ్రదర్స్ కార్ హెడ్ లైట్లను ఆన్ చేసి వాళ్ల కళ్లు మసకబారేలా చేయాలనుకున్నారు. అలాగే హారన్‌లను కొడుతూ ఉండాలనుకున్నారు. ఈలోగా వేరే బ్రదర్స్ పరుగులు తీసుకుంటూ సహాయం చేయడానికి వచ్చేస్తారు. ఈ ప్లాన్ అంతా చూశాక ‘యెహోవాసాక్షులు అన్నిటికీ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు’ అని అనుకున్నాను. ఇక ఆ నమ్మకంతో హాయిగా నిద్రపోయాను. అయితే ఏ ప్రమాదం జరగలేదు, సమావేశం ప్రశాంతంగా కొనసాగింది.
ఒకసారి వెనక్కివెళ్లి ఆ సమావేశాన్ని గుర్తుచేసుకుంటే, అప్పుడు మా అమ్మ రవ్వంత కూడా భయాన్ని గానీ, కంగారును గానీ చూపించలేదు. యెహోవాను, ఆయన సంస్థను అమ్మ పూర్తిగా నమ్మింది. ఆమె ఉంచిన ఆదర్శాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.
సమావేశానికి కాస్త ముందే మా అమ్మ క్రమ పయినీరు అయ్యింది. కాబట్టి పూర్తికాల సేవ గురించి చెప్పే ప్రసంగాల్ని తను మనసుపెట్టి వినింది. సమావేశం నుండి ఇంటికి వచ్చేసేటప్పుడు ఆమె ఇలా అంది: “నాకు పయినీరు సేవను కొనసాగించాలని ఉంది. కానీ అది చేస్తూ ఇంటిని కూడా చక్కగా చూసుకోవడం నావల్ల అవ్వదు.” ఇంటి పనుల్లో సహాయం చేస్తారా అని మమ్మల్ని అడిగింది. దానికి మేము చేస్తామని చెప్పాం. తను మా ఒక్కొక్కరికీ ఒకటి లేదా రెండు రూములు ఇచ్చి టిఫిన్ చేసే ముందే శుభ్రం చేయమని చెప్పింది. మేము స్కూల్‌కి వెళ్లాక ఇల్లంతా శుభ్రంగా ఉందా లేదా చూసుకుని, ఆ తర్వాత అమ్మ ప్రీచింగ్‌కి వెళ్లేది. చాలా బిజీగా ఉన్నాసరే అమ్మ మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోకుండా వదిలేయలేదు. మేము కొన్నిసార్లు మధ్యాహ్నం ఇంటికి వచ్చినా లేదా స్కూల్ తర్వాత వచ్చినా అమ్మ ఎప్పుడూ మాకోసం ఇంట్లో ఉండేది. కొన్నిసార్లయితే మేము స్కూల్ తర్వాత తనతోపాటు ప్రీచింగ్‌కి వెళ్లేవాళ్లం. దానివల్ల పయినీర్లు ఎంత కష్టపడతారో మాకు అర్థమైంది.
పూర్తికాల సేవలోకి అడుగుపెట్టడం
నేను 16 ఏళ్లకు పయినీరు సేవను మొదలుపెట్టాను. మా నాన్న ఇంకా యెహోవాసాక్షి కాకపోయినా, నా ప్రీచింగ్ ఎలా జరుగుతుందో కనుక్కుంటూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం, నేను ఎంత ప్రయత్నించినా ఒక్కరూ కూడా బైబిలు స్టడీకి ఒప్పుకోలేదని ఆయనతో అన్నాను. తర్వాత
ఒక క్షణం ఆగి “నేను మీకు బైబిలు స్టడీ ఇవ్వొచ్చా?” అని అడిగాను. ఆయన కాస్త ఆలోచించి చివరికి స్టడీ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి నా మొదటి బైబిలు విద్యార్థి మా నాన్నే. అది నాకు చాలా స్పెషల్!“సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది” (ఇంగ్లీష్) అనే పుస్తకం నుండి స్టడీ చేశాం. బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి, వేరేవాళ్లకు బాగా బోధించడానికి మా నాన్నే నాకు సహాయం చేస్తున్నాడని కొన్నిరోజులకు అర్థమైంది. ఒకసారి, ఒక పేరా చదివిన తర్వాత మా నాన్న ఇలా అడిగాడు: “పుస్తకంలో ఉన్నది బానే ఉంది, కానీ అది కరెక్టే అని నువ్వెలా చెప్తావు?” నా దగ్గర దానికి జవాబు లేదు. అందుకు “ఇప్పటికైతే నాకు తెలీదు. కానీ ఈసారి స్టడీ చేసే టైంకి నేను చెప్తాను” అని అన్నాను. నేను చెప్పినట్టే చేశాను. మేము మాట్లాడుకున్న ప్రశ్న గురించి లేఖనాల్ని వెదికి నాన్నకు చూపించాను. తర్వాత నుండి పరిశోధన చేయడం నేర్చుకుని, స్టడీ కోసం బాగా ప్రిపేర్ అయ్యాను. అలా చేయడం వల్ల బైబిలు గురించి నేను బాగా నేర్చుకోగలిగాను, మా నాన్నకు కూడా నేర్పించగలిగాను. నేర్చుకున్న వాటిని పాటించి, 1952లో నాన్న బాప్తిస్మం తీసుకున్నాడు.
నేర్చుకోవడం అనే అంతులేని ప్రయాణం బెతెల్‌లో కొనసాగింది
నాకు 17ఏళ్లు వచ్చినప్పుడు ఇంటికి దూరంగా వేరేచోట ఉండడం మొదలుపెట్టాను. జత a మిషనరీ అయ్యింది. డాన్ బెతెల్‌కి వెళ్లాడు. వాళ్లిద్దరికీ వాళ్ల నియామకాలంటే చాలా ఇష్టం. అది నన్ను కూడా చాలా ప్రోత్సహించింది. అందుకే నేను బెతెల్‌కి, అలాగే గిలియడ్ పాఠశాలకు అప్లయి చేశాను. ఇక అంతా యెహోవాకు వదిలేశాను. చివరికి 1946లో నాకు బెతెల్‌కి ఆహ్వానం వచ్చింది.
నేను బెతెల్‌కి వచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు అవుతున్నాయి. ఇక్కడ నేనెన్నో కొత్తకొత్త విషయాలు నేర్చుకున్నాను. పుస్తకాల్ని ఎలా తయారుచేయాలో, అకౌంట్స్ ఎలా చూసుకోవాలో తెలుసుకున్నాను. అలాగే బెతెల్‌కి అవసరమైన వస్తువుల్ని ఎలా కొనాలో, వస్తువుల్ని వేరే దేశాలకు ఎలా పంపించాలో నేర్చుకున్నాను. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా బైబిలు గురించి నేర్చుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే బెతెల్‌లో ఉదయకాల ఆరాధన ఉంటుంది, చాలా ప్రసంగాలు కూడా ఉంటాయి.
1947లో బెతెల్‌కి వచ్చిన నా తమ్ముడు కార్ల్ నుండి కూడా నేను చాలా నేర్చుకున్నాను. తను బైబిల్ని చాలా చక్కగా అధ్యయనం చేసేవాడు, బోధించేవాడు. ఒకసారి ఒక ప్రసంగంలో నాకు సహాయం చేయమని నేను తనని అడిగాను. చాలా సమాచారాన్ని సమకూర్చుకున్నాను గానీ దాన్నంతటినీ ఎలా ఉపయోగించాలో అర్థం కావట్లేదని కార్ల్‌కి చెప్పాను. అప్పుడు నా సమస్యకు ఒక ప్రశ్న వేసి పరిష్కారం చెప్పాడు. తను ఇలా అడిగాడు: “జోయెల్ నీ ప్రసంగం ముఖ్యాంశం ఏంటి?” నాకు వెంటనే తనేం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైంది. ముఖ్యాంశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఉపయోగించి మిగతాదంతా పక్కన పెట్టేయచ్చు. ఆ విషయాన్ని నేనెప్పుడు మర్చిపోలేదు.
బెతెల్‌లో హ్యాపీగా ఉండాలంటే ప్రీచింగ్ కూడా బాగా చేయాలి. దానివల్ల మర్చిపోలేని అనుభవాల్ని పొందుతాం. నాకు బాగా గుర్తుండిపోయిన ఒక అనుభవం, న్యూయార్క్ సిటీలోని బ్రాంక్స్ ప్రాంతంలో జరిగింది. అప్పటికే కావలికోట, తేజరిల్లు! పత్రికలు తీసుకున్న ఒకావిడ ఇంటికి ఒకరోజు సాయంత్రం నేను, ఒక బ్రదర్ వెళ్లాం. “బైబిలు గురించి కొన్ని మంచి విషయాలు అందరికీ చెప్తున్నాం” అని మొదలుపెట్టాం. అప్పుడామె “బైబిలు గురించైతే నేను తప్పకుండా వింటాను, లోపలికి రండి” అని చెప్పింది. దేవుని రాజ్యం గురించి, రాబోయే కొత్తలోకం గురించి మేము చాలా లేఖనాలు చదివి చర్చించుకున్నాం. అది ఆమెకు బాగా నచ్చింది. అందుకే తర్వాతి వారం తన స్నేహితుల్ని కూడా మాకు పరిచయం చేసింది. కొంతకాలానికి ఆమె, ఆమె భర్త యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టారు.
నా భార్య నుండి నేనెన్నో నేర్చుకున్నాను
నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న 10 సంవత్సరాల తర్వాత నాకు సరైన జోడీ దొరికింది. ఈ విషయంలో నాకు ఏది సహాయం చేసిందో చెప్తాను. నేను యెహోవాకు బాగా ప్రార్థించి, ఈ ప్రశ్న గురించి ఆలోచించాను: ‘పెళ్లయ్యాక నా భార్యతో కలిసి జీవితంలో ఏం చేయాలి అనుకుంటున్నాను?’
1953లో నేను మేరీ ఆనియోల్ అనే అమ్మాయిని యాంకీ స్టేడియంలో జరిగిన ఒక సమావేశంలో కలిశాను. ఆమె, మా అక్క గిలియడ్ పాఠశాల రెండవ తరగతికి హాజరయ్యారు. వాళ్లిద్దరు కలిసి మిషనరీ సేవ చేసేవాళ్లు. కరీబియన్ ప్రాంతంలో మేరీ మిషనరీగా చేసిన వాటి గురించి, బైబిలు స్టడీల గురించి నాకు ఉత్సాహంగా చెప్తూ ఉండేది. ఒకరినొకరు తెలుసుకుంటుండగా మా ఇద్దరికీ ఒకేలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయని మాకు అర్థమైంది. మా మధ్య ప్రేమ పెరిగి 1955, ఏప్రిల్‌లో మేము పెళ్లి చేసుకున్నాం. మేరీ నిజంగా యెహోవా ఇచ్చిన ఒక బహుమతే. ఆమెను చూసి చాలా నేర్చుకున్నాను. ఆమెకు ఏ పని ఇచ్చినా సంతోషంగా చేసేది, కష్టపడి పనిచేసేది, ఇతరుల్ని బాగా పట్టించుకునేది, దేవుని రాజ్యానికే మొదటిస్థానం ఇచ్చేది. (మత్త. 6:33) పెళ్లయ్యాక మూడు సంవత్సరాలు ప్రాంతీయ సేవ చేశాం. తర్వాత 1958లో మమ్మల్ని బెతెల్‌కి ఆహ్వానించారు.
మేరీ నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఉదాహరణకు పెళ్లయిన కొత్తలోనే, కలిసి బైబిలు చదవాలని నిర్ణయించుకున్నాం. మేము రోజుకు 15 వచనాలు చదవాలని అనుకున్నాం. కొన్ని వచనాలు చదువుతూ మధ్యలో ఆగి చదివిన వాటిగురించి మాట్లాడుకునేవాళ్లం. దాన్ని జీవితంలో ఎలా పాటించాలో చర్చించుకునేవాళ్లం. గిలియడ్‌లో నేర్చుకున్న వాటిగురించి, మిషనరీ సేవలో నేర్చుకున్న వాటిగురించి మేరీ నాకు చెప్తూ ఉండేది. తన నుండి నేర్చుకున్న వాటివల్ల నేను ప్రసంగాల్ని ఇంకా బాగా ఇవ్వగలిగాను, సిస్టర్స్‌ని ఇంకా బాగా ప్రోత్సహించగలిగాను.—సామె. 25:11.
2013లో నా ప్రియమైన మేరీ చనిపోయింది. కొత్తలోకంలో తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను. ఈలోగా నేను నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచాలని, ఆయన నుండి నేర్చుకుంటూ ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. (సామె. 3:5, 6) కొత్తలోకంలో యెహోవా ప్రజలు ఏమేం చేస్తారో ఆలోచించినప్పుడు నాకు చాలా సంతోషంగా, ఊరటగా అనిపిస్తుంది. అక్కడ మన మహాగొప్ప ఉపదేశకుని నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఆయన గురించి కూడా చాలా నేర్చుకోవచ్చు. యెహోవా నాకు ఇప్పటివరకు నేర్పించిన వాటన్నిటికీ, అపారదయ వల్ల ఆయన నాకోసం చేసిన వాటన్నిటికీ ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
a జత సునల్ జీవిత కథ కోసం కావలికోట 2003, మార్చి 1, 23-29 పేజీలు చూడండి.