పాఠకుల ప్రశ్న
1 తిమోతి 5:21 లో చెప్పిన “దేవుడు ఎంపిక చేసుకున్న దేవదూతలు” ఎవరు?
అపొస్తలుడైన పౌలు తనలాగే సంఘ పెద్దగా సేవ చేస్తున్న తిమోతికి ఇలా రాశాడు: “ముందే ఒక నిర్ణయానికి రాకుండా, పక్షపాతం చూపించకుండా ఈ నిర్దేశాల్ని పాటించమని దేవుని ముందు, క్రీస్తుయేసు ముందు, దేవుడు ఎంపిక చేసుకున్న దేవదూతల ముందు నీకు ఆజ్ఞాపిస్తున్నాను.”—1 తిమో. 5:21.
ముందుగా, ఈ ఎంపిక చేసుకోబడిన దేవదూతలు ఎవరు కాదో చూద్దాం. 1,44,000 మందైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే పౌలు తిమోతికి రాస్తున్న సమయానికి అభిషిక్త క్రైస్తవులు పరలోకానికి పునరుత్థానం అవ్వడం ఇంకా మొదలవ్వలేదు. అపొస్తలులు, ఇతర అభిషిక్తులు, అప్పటికి ఇంకా పరలోక ప్రాణులు కాలేదు కాబట్టి వాళ్లు “దేవుడు ఎంపిక చేసుకున్న దేవదూతలు” కాదు.—1 కొరిం. 15:50-54; 1 థెస్స. 4:13-17; 1 యోహా. 3:2.
వీళ్లు జలప్రళయం సమయంలో దేవుని మాట వినని దేవదూతలు కూడా కాదు. ఆ దూతలు సాతానుతో చేతులు కలిపి చెడ్డదూతలుగా మారారు, యేసుకు శత్రువులు అయ్యారు. (ఆది. 6:2; లూకా 8:30, 31; 2 పేతు. 2:4) భవిష్యత్తులో యేసుక్రీస్తు వాళ్లను 1,000 ఏళ్లు అగాధంలో బంధిస్తాడు. ఆ తర్వాత సాతానుతోపాటు వాళ్లు నాశనం అవుతారు.—యూదా 6; ప్రక. 20:1-3, 10.
పౌలు రాసిన ఈ “ఎంపిక చేసుకున్న దేవదూతలు” దేవునికి, యేసుకు పరలోకంలో నమ్మకంగా సేవ చేస్తున్న దేవదూతలు అయ్యుంటారు.
నమ్మకమైన దూతలు ఎన్నో లక్షల్లో ఉన్నారు. (హెబ్రీ. 12:22, 23) వాళ్లందరూ ఒకే టైంలో, ఒకేలాంటి పనులు చేస్తుంటారని చెప్పలేం. (ప్రక. 14:17, 18) ఉదాహరణకు 1,85,000 మంది అష్షూరు సైనికుల్ని చంపే పని ఒక దేవదూతకు ఇవ్వబడింది. (2 రాజు. 19:35) బహుశా చాలామంది దేవదూతలకు “ఇతరులు పాపం చేయడానికి కారణమయ్యేవాళ్లను, చెడ్డపనులు చేసేవాళ్లను [యేసు] రాజ్యంలో నుండి” తొలగించే పని అప్పగించబడి ఉంటుంది. (మత్త. 13:39-41) ఇంకొంతమంది దేవదూతలకేమో అభిషిక్తుల్ని పరలోకానికి సమకూర్చే పని ఇవ్వబడవచ్చు. (మత్త. 24:31) మరికొంతమందికి ‘మన మార్గాలన్నిట్లో మనల్ని కాపాడే’ ఆజ్ఞ ఇవ్వబడింది.—కీర్త. 91:11; మత్త. 18:10; మత్తయి 4:11 తో పోల్చండి; లూకా 22:43.
అయితే 1 తిమోతి 5:21 లో చెప్పిన “ఎంపిక చేసుకున్న దేవదూతలు” బహుశా సంఘాన్ని చూసుకునే బాధ్యత ఉన్న దేవదూతలు అయ్యుంటారు. ఈ అధ్యాయంలో పౌలు పెద్దలకు మంచి సలహాలు ఇచ్చాడు. అంతేకాదు, సంఘంలో ఉన్న సహోదర సహోదరీలు వాళ్లను గౌరవించాలని చెప్పాడు. పెద్దలేమో వాళ్ల బాధ్యతల్ని వివక్ష, పక్షపాతం చూపించకుండా చేయాలి. తొందరపడకుండా, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దలు పౌలు ఇచ్చిన సలహాను ఎందుకు అంత ప్రాముఖ్యంగా తీసుకోవాలంటే దేవుడు, క్రీస్తు అలాగే వాళ్లు ఎంపిక చేసుకున్న దూతలు వాళ్లు చేస్తున్న పనిని గమనిస్తున్నారు. దీనంతటిని బట్టి కొంతమంది దేవదూతలకు సంఘాన్ని చూసుకునే పని అప్పగించబడిందని స్పష్టమౌతుంది. ఆ పనుల్లో కొన్ని ఏంటంటే: దేవుని సేవకుల్ని కాపాడడం, ప్రకటనా పనిలో సహాయం చేయడం, చూసినవాటి గురించి యెహోవాకు చెప్పడం.—మత్త. 18:10; ప్రక. 14:6.