మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఈ సంవత్సరం కావలికోట పత్రికల్ని జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరేమో చూడండి:
స్త్రీలను చూసే విధానం గురించి యెహోవా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
యెహోవా స్త్రీలతో నిష్పక్షపాతంగా ఉన్నాడు. ఆడవాళ్ల కన్నా మగవాళ్లకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడు. స్త్రీలు చెప్పేది వింటాడు, వాళ్ల ఫీలింగ్స్‌ని, సమస్యల్ని పట్టించుకుంటాడు. ఆయన వాళ్లను నమ్ముతూ, తన పనిని చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు.—w24.01, 15-16 పేజీలు.
“మీరు వాళ్లలా ఉండకండి” అని ఎఫెసీయులు 5:7 లో ఉన్న మాటల్ని మనం ఎలా పాటించవచ్చు?
యెహోవా ప్రమాణాల్ని అంటిపెట్టుకుని ఉండకుండా చేసే ప్రజలతో స్నేహం చేయడం ప్రమాదకరమని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ సలహాను పాటిస్తూ మనం నేరుగా కలిసేవాళ్లతోనే కాదు, సోషల్ మీడియాలో కలిసేవాళ్లతో కూడా జాగ్రత్తగా ఉండాలి.—w24.03, 22-23 పేజీలు.
మనం ఎలాంటి కట్టుకథలకు దూరంగా ఉండాలి?
మన బ్రదర్స్-సిస్టర్స్ మనల్ని ప్రోత్సహించడానికి, కొన్ని కథలు నిజమో కాదో తెలుసుకోకుండానే వాటిని మనకు చెప్పవచ్చు. ఇంకొన్నిసార్లు ఈ-మెయిల్స్ ద్వారా లేదా మనం ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఆసక్తి ఉన్నట్టు నటించే మతభ్రష్టుల ద్వారా ఆ కట్టుకథలు మన చెవిన పడవచ్చు. అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి.—w24.04, 12వ పేజీ.
సొదొమ గొమొర్రాలో, జలప్రళయంలో చనిపోయినవాళ్లను, సొలొమోను రాజును యెహోవా తీర్పు తీర్చే విధానం గురించి మనకు ఏం తెలీదు, ఏం తెలుసు?
వాళ్లందరూ పునరుత్థాన నిరీక్షణ లేకుండా శాశ్వతంగా నాశనం అవ్వాలని యెహోవా తీర్పుతీర్చాడో లేదో మనకు తెలీదు. కానీ ఆయనకు అన్ని వాస్తవాలు తెలుసని, గొప్ప కరుణగల దేవుడని మనకు తెలుసు.—w24.05, 3-4 పేజీలు.
దేవుడు ‘బండరాయిగా’ లేదా ‘ఆశ్రయదుర్గంగా’ ఉండడం మనకు ఎలాంటి భరోసానిస్తుంది? (ద్వితీ. 32:4)
యెహోవా మన ఆశ్రయంగా ఉంటాడు. ఆయన తన మాటను నిలబెట్టుకుంటూ నమ్మకస్థుడిగా ఉంటాడు. యెహోవా తన వ్యక్తిత్వాన్ని, తన సంకల్పాన్ని ఎప్పుడూ మార్చుకోకుండా స్థిరంగా ఉంటాడు.—w24.06, 26-28 పేజీలు.
కొత్త సంఘానికి ఎలా అలవాటుపడొచ్చు?
గతంలో తన సేవకులకు సహాయం చేసినట్టే, యెహోవా మీకు కూడా సహాయం చేస్తాడు కాబట్టి ఆయన మీద ఆధారపడండి. మీ కొత్త సంఘాన్ని పాత సంఘంతో పోల్చకండి. కొత్త సంఘంలో చురుగ్గా ఉండండి, కొత్త స్నేహితుల్ని చేసుకోవడానికి ప్రయత్నించండి.—w24.07, 26-28 పేజీలు.
మత్తయి 25వ అధ్యాయంలో ఉన్న మూడు ఉదాహరణల నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
గొర్రెల, మేకల ఉదాహరణ నుండి యెహోవాకు నమ్మకంగా, విశ్వసనీయంగా ఉండడం చాలా ప్రాముఖ్యమని తెలుసుకున్నాం. బుద్ధిగల కన్యలు, బుద్ధిలేని కన్యల ఉదాహరణలో సిద్ధంగా, అలర్ట్‌గా ఉండాలని నేర్చుకున్నాం. చివరిగా కష్టపడుతూ, నమ్మకంగా పని చేయడం ముఖ్యమని తలాంతుల ఉదాహరణ నొక్కిచెప్తుంది.—w24.09, 20-24 పేజీలు.
సొలొమోను కట్టించిన ఆలయంలోని వసారా ఎత్తు ఎంత?
కొన్ని పాత చేతిరాత ప్రతుల్లో 2 దినవృత్తాంతాలు 3:4 లేఖనంలో వసారా ఎత్తు “120 మూరలు” అని ఉంది. అంటే దానికి 53 మీటర్ల (175 అడుగుల) ఎత్తు ఉండాలి. కానీ ప్రసిద్ధి చెందిన కొన్ని వేరే ప్రతుల్లో అక్కడ “20 మూరలు” అని ఉంది, అంటే దాని ఎత్తు 9 మీటర్లు (30 అడుగులు). ఆలయ గోడల వెడల్పును బట్టి ఇదే సరైనదని చెప్పవచ్చు.—w24.10, 31వ పేజీ.
సంఘ పరిచారకులకు “ఒకే భార్య ఉండాలి” అంటే ఏంటి? (1 తిమో. 3:12)
అంటే అతను ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకోవాలి, లైంగిక పాపం చేయకూడదు. అంతేకాదు వేరే స్త్రీలతో సరసాలాడడం, మరీ చనువుగా ఉండడం లాంటివి చేయకూడదు.—w24.11, 19వ పేజీ.
యోహాను 6:53 ప్రభువు రాత్రి భోజనంలో చేసే విషయాల గురించి చెప్పట్లేదని ఎందుకు అనొచ్చు?
యోహాను 6:53 లో యేసు శరీరం తినడం, రక్తం తాగడం గురించి ఉంది. అయితే యేసు ఈ మాటల్ని క్రీ.శ. 32 లో గలిలయలో ఉన్నప్పుడు, తన మీద విశ్వాసం చూపించాల్సిన యూదులతో చెప్పాడు. కానీ ప్రభువు రాత్రి భోజనం ఒక సంవత్సరం తర్వాత యెరూషలేములో మొదలైంది. అప్పుడు యేసు తనతో కలిసి పరలోకంలో పరిపాలించే వాళ్లతో మాట్లాడాడు.—w24.12, 10-11 పేజీలు.