కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 51

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

మీరు కార్చిన కన్నీళ్లన్నిటినీ యెహోవా గుర్తుంచుకుంటాడు

మీరు కార్చిన కన్నీళ్లన్నిటినీ యెహోవా గుర్తుంచుకుంటాడు

“దయచేసి నా కన్నీళ్లను నీ తోలుసంచిలో ఉంచు. అవి నీ పుస్తకంలో రాసివున్నాయి.”కీర్త. 56:8.

ముఖ్యాంశం

మనం పడుతున్న బాధ యెహోవాకు బాగా తెలుసని, మనకు అవసరమైన ఊరటను ఇస్తాడని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

1-2. మనకు ఎప్పుడెప్పుడు కన్నీళ్లు రావచ్చు?

 మనలో ప్రతీఒక్కరం ఏదోక సమయంలో కన్నీళ్లు పెట్టుకుని ఉంటాం. మన జీవితంలో ఏదైనా ముఖ్యమైనది లేదా ప్రత్యేకమైనది జరిగినప్పుడు ఆనందం పట్టలేక మన కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఉదాహరణకు పిల్లలు పుట్టినప్పుడు, తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు, చాలాకాలం తర్వాత స్నేహితుల్ని కలిసినప్పుడు కంటతడి పెట్టుకుంటాం.

2 కానీ ఎక్కువసార్లు మనసులో ఉన్న బాధవల్ల ఏడుస్తుంటాం. ఉదాహరణకు ఎవరైనా మన ఆశల్ని అడియాశలు చేసినప్పుడు మనకు ఏడుపు రావచ్చు. మానని అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు బాధ భరించలేక మనం ఏడ్పు ఆపుకోలేకపోతాం. అలాంటప్పుడు యిర్మీయా ప్రవక్తకు అనిపించినట్టే మనకు కూడా అనిపించవచ్చు. బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసినప్పుడు యిర్మీయా ఇలా అన్నాడు: “నా కళ్లలో నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి. నేను ఆగకుండా ఏడుస్తూ ఉన్నాను.”—విలా. 3:48, 49.

3. తన సేవకులు కష్టాలు పడుతున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది? (యెషయా 63:9)

3 కష్టాల వల్ల మనం కార్చే ప్రతీ కన్నీటి బొట్టు యెహోవాకు తెలుసు. తన సేవకులకు ఎలాంటి సమస్యలు వచ్చాయో ఆయనకు తెలుసని, సహాయం కోసం వేడుకున్నప్పుడు ఆయన వింటాడని బైబిలు మాటిస్తోంది. (కీర్త. 34:15) అయితే యెహోవా మన బాధను చూడడం, మనం చెప్పేది వినడం కన్నా ఎక్కువే చేస్తాడు. ఆయన మన తండ్రి కాబట్టి మనల్ని ప్రాణంగా ప్రేమిస్తాడు. మనం ఏడ్వడం చూసినప్పుడు ఆయనకు కూడా చాలా బాధేస్తుంది, మనకు సహాయం చేయడానికి పరుగెత్తుకుంటూ వస్తాడు.—యెషయా 63:9 చదవండి.

4. మనం ఏ బైబిలు ఉదాహరణల్ని పరిశీలిస్తాం? వాళ్లనుండి యెహోవా గురించి ఏం నేర్చుకుంటాం?

4 తన సేవకులు ఏడ్చినప్పుడు తనకు ఎలా అనిపించిందో, వాళ్లకు ఎలా సహాయం చేశాడో యెహోవా బైబిల్లో రాయించాడు. ముఖ్యంగా హన్నా, దావీదు, రాజైన హిజ్కియా గురించి ఇప్పుడు పరిశీలిస్తాం. ఈ ముగ్గురు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడు? చావు, వెన్నుపోటు, అనారోగ్యం వల్ల మనం కూడా కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ముగ్గురి ఉదాహరణల నుండి ఎలా ఊరటను పొందవచ్చు?

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు కార్చే కన్నీళ్లు

5. తనకున్న సమస్యల వల్ల హన్నాకు ఎలా అనిపించింది?

5 హన్నాకు వచ్చిన సమస్యలు అన్నీఇన్నీ కాదు. అవి ఆమెను బాధలో ముంచేశాయి. ఆమె భర్తకు పెనిన్నా అనే ఇంకో భార్య ఉంది. ఆమెకు హన్నా అంటే అస్సలు ఇష్టంలేదు, హన్నాకు చుక్కలు చూపించేది. పెనిన్నాకు చాలామంది పిల్లలున్నారు, హన్నాకేమో పిల్లలు లేరు. (1 సమూ. 1:1, 2) దాంతో పెనిన్నా ఆమెను బాగా దెప్పిపొడుస్తూ ఉండేది. అలాంటి పరిస్థితి మీకే వస్తే ఎలా అనిపిస్తుంది? పెనిన్నా పోరు భరించలేక హన్నా బాగా “ఏడ్చేది, భోజనం కూడా చేసేది కాదు.” ఆమె మనసంతా “దుఃఖంతో” నిండిపోయింది.—1 సమూ. 1:6, 7, 10.

6. ఊరట పొందడానికి హన్నా ఏం చేసింది?

6 హన్నాకు ఊరట ఎలా దొరికింది? ఆమె చేసిన ఒక పని ఏంటంటే, సత్యారాధనకు కేంద్రమైన గుడారానికి వెళ్లింది. అక్కడ బహుశా గుడారం ద్వారం దగ్గరికి వెళ్లి, ‘యెహోవాకు ప్రార్థించడం మొదలుపెట్టి విపరీతంగా ఏడ్చింది.’ ఆమె యెహోవాను ఇలా బ్రతిమాలింది: “నీ సేవకురాలినైన నా బాధను చూసి, నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకో.” (1 సమూ. 1:10బి, 11) హన్నా తన మనసులో ఉన్నదంతా యెహోవాకు ప్రార్థనలో చెప్పుకుంది. కంటికి రెప్పలా చూసుకుంటున్న తన కూతురు అలా వెక్కివెక్కి ఏడుస్తున్నప్పుడు యెహోవాకు ఎంత బాధేసి ఉంటుందో కదా!

7. తన బాధనంతా యెహోవాకు చెప్పుకున్న తర్వాత హన్నాకు ఎలా అనిపించింది?

7 హన్నా తన బాధనంతా యెహోవాకు చెప్పుకున్న తర్వాత, తన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు దొరుకుతుందని ప్రధానయాజకుడైన ఏలీ అన్నాడు. అప్పుడు హన్నాకు ఎలా అనిపించింది? బైబిలు ఇలా చెప్తుంది: “ఆమె తన దారిన వెళ్లిపోయింది, ఆమె భోజనం చేసింది, ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆమె ముఖం బాధగా కనిపించలేదు.” (1 సమూ. 1:17, 18) ఆమె సమస్యలన్నీ వెంటనే మాయం అవ్వకపోయినా హన్నాకు ఊరటగా అనిపించింది. తన మనసులో ఉన్న బరువంతా యెహోవాకు ఇచ్చేసింది. ఆయన ఆమె బాధను చూశాడు, ఆమె ప్రార్థన విన్నాడు, తర్వాత పిల్లల్ని కనేలా దీవించాడు.—1 సమూ. 1:19, 20; 2:21.

8-9. హెబ్రీయులు 10:24, 25 ప్రకారం, మీటింగ్స్‌కి వెళ్లడానికి మనందరం ఎందుకు చేయగలిగినదంతా చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

8 మనం ఏం నేర్చుకోవచ్చు? మీ కుటుంబ సభ్యుడో లేక స్నేహితుడో చనిపోవడం వల్ల మీ గుండె చెరువైందా? అలాంటప్పుడు అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలనిపించవచ్చు. కానీ హన్నా ఎలాగైతే గుడారానికి వెళ్లి ఊరటను, ప్రోత్సాహాన్ని పొందిందో మీరు కూడా, వెళ్లాలనిపించకపోయినా సరే, మీటింగ్స్‌కి వెళ్తే ఊరటను పొందవచ్చు. (హెబ్రీయులు 10:24, 25 చదవండి.) మన మనసు కుదుటపడడానికి సహాయం చేసే కొన్ని బైబిలు లేఖనాల్ని మీటింగ్స్‌లో వింటాం. అప్పుడు మన బాధను పక్కన పెట్టేసి మంచి విషయాలు ఆలోచించడానికి యెహోవా సహాయం చేస్తాడు. మన పరిస్థితిలో మార్పు రాకపోయినా మనసులో ఉన్న బరువు కాస్త దిగినట్టు అనిపిస్తుంది.

9 మీటింగ్స్‌లో మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ చూపించే ప్రేమ, శ్రద్ధ వల్ల మన ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. (1 థెస్స. 5:11, 14) భార్య చనిపోయిన ఒక ప్రత్యేక పయినీరు అనుభవాన్ని చూడండి. ఆయనిలా అంటున్నాడు: “నేను ఇప్పటికీ కన్నీళ్లు ఆపుకోలేకపోతాను. కొన్నిసార్లు ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటాను. కానీ మీటింగ్స్‌ వల్ల నేనెంతో ప్రోత్సాహాన్ని పొందాను. బ్రదర్స్‌-సిస్టర్స్‌ నా భుజం తట్టి నన్ను ఓదార్చినప్పుడు గాయానికి మందు పూసినట్టు చాలా హాయిగా అనిపిస్తుంది. మీటింగ్‌కి వెళ్లకముందు ఎంత కంగారుగా, టెన్షన్‌గా అనిపించినా అక్కడికి వెళ్లాక చాలా ధైర్యంగా ఉంటుంది.” అవును, మీటింగ్స్‌కి వెళ్లినప్పుడు యెహోవా బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ఉపయోగించి మనకు సహాయం చేయగలడు.

బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనకు ఊరటను ఇస్తారు (8-9 పేరాలు చూడండి)


10. గుండె బరువెక్కినప్పుడు మనం హన్నాలా ఏం చేయవచ్చు?

10 ప్రార్థనలో తన ఫీలింగ్స్‌ యెహోవాకు చెప్పుకున్నప్పుడు కూడా హన్నాకు ఊరటగా అనిపించింది. మీరు కూడా ఆయన వింటాడనే ధైర్యంతో “మీ ఆందోళనంతా [యెహోవా] మీద వేయండి.” (1 పేతు. 5:7) దొంగల చేతుల్లో తన భర్త చనిపోయినప్పుడు తనకు ఎలా అనిపించిందో ఒక సిస్టర్‌ ఇలా గుర్తు చేసుకుంటుంది: “నా గుండె ముక్కలు-ముక్కలు అయిపోయి, ఇక నా జీవితం అంతా చీకటి కమ్మేసినట్టు అనిపించింది. ప్రేమగల పరలోక తండ్రియైన యెహోవాకు ప్రార్థించడం వల్ల ఊరటను, ధైర్యాన్ని పొందాను. కొన్నిసార్లు నా ప్రార్థనలో మాటలే ఉండేవి కావు. అయినా నా మనసును యెహోవా అర్థం చేసుకునేవాడు. బాధవల్ల నా ప్రాణం విలవిలలాడినప్పుడు నేను ప్రశాంతత కోసం ప్రార్థించేదాన్ని. అప్పుడు మనసంతా శాంతితో నిండిపోయినట్టు అనిపించేది, ఒక్కొక్క రోజు గడవడానికి అదెంతో సహాయం చేసేది.” మీరు కూడా మీ గోడును యెహోవాకు చెప్పుకున్నప్పుడు, మీ తడి కన్నులను చూసి ఆయన తల్లడిల్లిపోతాడు. మీ ఫీలింగ్స్‌ని బాగా అర్థం చేసుకుంటాడు. మీ సమస్య తీరకపోయినా మీ మనసు కుదుటపడేలా, కాస్త ప్రశాంతంగా అనిపించేలా యెహోవా చేయగలడు. (కీర్త. 94:19; ఫిలి. 4:6, 7) మీరు నమ్మకంగా అన్నిటినీ భరించినందుకు ఆయన తప్పకుండా మీకు ప్రతిఫలం ఇస్తాడు.—హెబ్రీ. 11:6.

వెన్నుపోటు పొడిచినప్పుడు కార్చే కన్నీళ్లు

11. తనను వేధించేవాళ్ల వల్ల దావీదుకు ఎలా అనిపించింది?

11 కన్నీళ్లను మిగిల్చే ఎన్నో పెద్దపెద్ద కష్టాల్ని దావీదు చూశాడు. చాలామంది ఆయన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించారు, తన వెన్నంటే ఉండాల్సినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. (1 సమూ. 19:10, 11; 2 సమూ. 15:10-14, 30) ఒకసారి ఆయన ఇలా రాశాడు: “నా మూల్గులతో నేను నీరసించిపోయాను; రాత్రంతా నా పరుపు కన్నీళ్లతో తడిచిపోతోంది; నా మంచం కన్నీళ్లలో మునిగిపోతోంది.” తనను వేధించేవాళ్ల వల్ల ఇలా జరిగిందని ఆయన తర్వాత రాశాడు. (కీర్త. 6:6, 7) అవును, ఇతరుల పనులవల్ల దావీదు గుండెలోని బాధ కన్నీళ్లలా పారింది.

12. కీర్తన 56:8 ప్రకారం, దావీదుకు ఏ విషయంలో గట్టి నమ్మకం ఉంది?

12 ఎన్ని పెద్దపెద్ద కష్టాలు వచ్చినా యెహోవా తనను ప్రేమిస్తున్నాడనే విషయంలో దావీదుకు ఏ సందేహం లేదు. ఆయన ఇలా రాశాడు: “యెహోవా నా రోదనను వింటాడు.” (కీర్త. 6:8) దావీదు మరో సందర్భంలో, మనసుకు హత్తుకునే మాటల్ని కీర్తన 56:8లో రాశాడు. (చదవండి.) యెహోవా మనల్ని అపురూపంగా చూసుకుంటున్నాడని ఆ మాటలు స్పష్టం చేస్తున్నాయి. యెహోవా మన కన్నీళ్లను ఒక బాటిల్‌లో పెట్టుకుంటున్నాడని లేదా వాటిగురించి ఒక పుస్తకంలో రాసుకుంటున్నాడని దావీదుకు అనిపించింది. తను అనుభవిస్తున్న నొప్పిని యెహోవా గమనించి, గుర్తుపెట్టుకుంటాడని దావీదు పూర్తిగా నమ్మాడు. అయితే తనకు ఎలాంటి సమస్యలు వచ్చాయనే కాదు, వాటివల్ల తనకు ఎలా అనిపించిందో కూడా తన ప్రేమగల పరలోక తండ్రి గమనిస్తున్నాడని దావీదు గట్టిగా నమ్మాడు.

13. ఇతరులు నిరాశపర్చినా లేదా వెన్నుపోటు పొడిచినా మనం ఏం గుర్తుంచుకోవాలి? (చిత్రం కూడా చూడండి.)

13 మనం ఏం నేర్చుకోవచ్చు? మీరు బాగా నమ్మిన ఒకవ్యక్తి మిమ్మల్ని నిరాశపరిస్తే, వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ అంతాఇంత ఉండదు. బహుశా మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో బ్రేకప్‌ అయితే, లేదా పెళ్లయ్యాక మీరు విడాకులు తీసుకోవాల్సి వస్తే, లేదా మీకు బాగా ఇష్టమైనవాళ్లు యెహోవాను సేవించడం ఆపేస్తే మనసు విరిగిపోతుంది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను విడిచిపెట్టినప్పుడు ఒక బ్రదర్‌కి ఎలా అనిపించిందో ఇలా చెప్తున్నాడు: “నేను ముందు బాగా షాక్‌ అయ్యాను. అసలు అలా జరిగిందని కూడా నమ్మలేకపోయాను. నేను ఎందుకూ పనికిరానని అనిపించింది. అప్పుడు వచ్చిన బాధ, కోపం మాటల్లో చెప్పలేను.” మీ పరిస్థితి కూడా అదే అయితే యెహోవా మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు అనే విషయాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. ఆ బ్రదర్‌ ఇంకా ఇలా అన్నాడు: “మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తారు గానీ, యెహోవా మాత్రం మనకెప్పుడు అండగా ఉంటాడు. ఏం జరిగినా ఆయన మన పక్కనే ఉంటాడు. ఆయన తన విశ్వసనీయుల్ని విడిచిపెట్టడు.” (కీర్త. 37:28) ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి: యెహోవా చూపించే ప్రేమ మనుషులు చూపించే ప్రేమ కన్నా చాలాచాలా గొప్పది. నిజమే, ఎవరైనా మనకు నమ్మకద్రోహం చేస్తే ఆ బాధను భరించలేం. కానీ యెహోవాకు మన మీదున్న ప్రేమ, శ్రద్ధ మాత్రం అస్సలు తగ్గవు. (రోమా. 8:38, 39) ముఖ్యమైన విషయం ఏంటంటే ఎదుటివ్యక్తి మీతో ఎలా ఉన్నా, మీ పరలోక తండ్రి మాత్రం మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తాడు.

విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉన్నాడని కీర్తనల పుస్తకం మనకు భరోసానిస్తుంది (13వ పేరా చూడండి)


14. కీర్తన 34:18 లో ఎలాంటి ఊరట ఇచ్చే మాటలు ఉన్నాయి?

14 ఎవరైనా నమ్మకద్రోహం చేసినప్పుడు కీర్తన 34:18లో దావీదు అన్న మాటలు మనకు ఎంతో ఊరటను ఇస్తాయి. (చదవండి.) “నలిగిన మనస్సుగలవాళ్లు” అనే మాట, “జీవితంలో ఇక ఏ ఆశా లేదన్నట్టు” అనిపించే వాళ్లను సూచిస్తుందని ఒక రెఫరెన్స్‌ పుస్తకం చెప్తుంది. అలాంటి వాళ్లకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు? ప్రేమగల తల్లిదండ్రులు ఏడుస్తున్న తమ పిల్లల్ని ఎలా దగ్గరికి తీసుకుని ఓదారుస్తారో, యెహోవా కూడా మనం బాధలో ఉన్నప్పుడు మనకు “దగ్గరగా” ఉంటాడు. అంటే ఇంకా ఎక్కువ కనికరం, ప్రేమ చూపిస్తాడు. మనకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. నలిగిపోయిన, విరిగిపోయిన మన హృదయానికి కట్టుకట్టడానికి ఆయన అస్సలు వెనకాడడు. అంతేకాదు ముందుముందు మంచి రోజులు వస్తాయనే ఆశను నింపుతాడు. అది ఇప్పుడున్న మన కష్టాల్ని సహించడానికి సహాయం చేస్తుంది.—యెష. 65:17.

అనారోగ్య సమస్యల వల్ల కార్చే కన్నీళ్లు

15. హిజ్కియాకు ఏమైంది?

15 యూదా రాజైన హిజ్కియాకు 39 ఏళ్ల వయసులో ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చింది. దానివల్ల ఆయన చనిపోతాడని యెహోవా యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు. (2 రాజు. 20:1) అసలు హిజ్కియాకు ఇంక ఏ ఆశా లేదనే చెప్పాలి. అది విన్నప్పుడు బాధతో హిజ్కియా బోరున ఏడ్చాడు, యెహోవాకు తీవ్రంగా ప్రార్థించాడు.—2 రాజు. 20:2, 3.

16. యెహోవా హిజ్కియా కన్నీళ్లను ఎలా తుడిచాడు?

16 హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థనలు యెహోవా మనసును తాకాయి. ఆయన ఇలా అన్నాడు: “నేను నీ ప్రార్థన విన్నాను. నీ కన్నీళ్లు చూశాను. ఇదిగో నేను నిన్ను బాగుచేస్తున్నాను.” యెహోవా ఎంతో కరుణ చూపిస్తూ హిజ్కియా ఆయుష్షును పొడిగిస్తానని, అష్షూరీయుల చేతుల్లో నుండి యెరూషలేమును కాపాడతానని యెషయా ప్రవక్త ద్వారా మాటిచ్చాడు.—2 రాజు. 20:4-6.

17. పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు? (కీర్తన 41:3) (చిత్రం కూడా చూడండి.)

17 మనం ఏం నేర్చుకోవచ్చు? నయంకాని ఏదైనా పెద్ద అనారోగ్యం మీకు కూడా వచ్చిందా? అయితే యెహోవాకు ప్రార్థించండి. అలా ప్రార్థిస్తున్నప్పుడు మీకు ఏడ్పు వచ్చినా ఫర్వాలేదు, మీ మనసులోని మాటల్ని ఆయన ఖచ్చితంగా వింటాడు. “ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు . . . కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు” అని బైబిలు మనకు భరోసానిస్తుంది. (2 కొరిం. 1:3, 4) యెహోవా మన సమస్యలన్నిటినీ అద్భుతంగా తీసేస్తాడని మనం అనుకోకూడదు. కానీ మనకు అవసరమైన సహాయాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. (కీర్తన 41:3 చదవండి.) సమస్యను తట్టుకోవడానికి పవిత్రశక్తి ద్వారా మనకు అవసరమైన బలాన్ని, తెలివిని, మనశ్శాంతిని ఇస్తాడు. (సామె. 18:14; ఫిలి. 4:13) అంతేకాదు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలన్నీ పోతాయనే ఒక గొప్ప ఆశను ఇస్తూ ధైర్యాన్ని నింపుతాడు.—యెష. 33:24.

బలాన్ని, తెలివిని, మనశ్శాంతిని ఇచ్చి యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తాడు (17వ పేరా చూడండి)


18. పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఏ లేఖనం మీకు ఊరటను ఇచ్చింది? (“ మన కన్నీళ్లను తుడిచే కొన్ని లేఖనాలు”అనే బాక్సు చూడండి.)

18 యెహోవా మాటల్ని బట్టి కూడా హిజ్కియా ఎంతో ఊరట పొందాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి ఓదార్పును పొందవచ్చు. సమస్యల వేడి తగులుతున్నప్పుడు, యెహోవా రాయించిన చల్లని మాటలు చదివితే కాస్త హాయిగా అనిపిస్తుంది. (రోమా. 15:4) పశ్చిమ ఆఫ్రికాలో ఉంటున్న ఒక సిస్టర్‌కి క్యాన్సర్‌ వచ్చినప్పుడు ఆమె బాగా ఏడ్చేది. ఆమె ఇలా అంటుంది: “నాకు ముఖ్యంగా యెషయా 26:3 ఎంతో ఊరటను ఇచ్చింది. మనకు ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మన చేతుల్లో లేదు. కానీ ఎలాంటి సమస్య వచ్చినాసరే దాన్ని తట్టుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి యెహోవా సహాయం చేస్తాడనే భరోసాను ఆ లేఖనం నాకు ఇచ్చింది.” కొండల్లాంటి పెద్దపెద్ద సమస్యలు వచ్చినప్పుడు మీకు ఏ లేఖనం ధైర్యాన్ని ఇచ్చింది?

19. మనకు ఏ ప్రతిఫలం వేచివుంది?

19 మనం చివరి రోజుల అంచుల్లో ఉన్నాం. కాబట్టి కష్టాల వల్ల మన కన్నీళ్లు ఎక్కువే అవుతాయి. కానీ హన్నా, దావీదు, రాజైన హిజ్కియా ఉదాహరణల్లో చూసినట్టు యెహోవా మనం కార్చే కన్నీళ్లను మర్చిపోడని, మనం బాధపడుతున్నప్పుడు మనతో బాధపడతాడని తెలుసుకున్నాం. మనం పెట్టుకునే కన్నీళ్లన్నీ యెహోవాకు గుర్తుంటాయి. కాబట్టి కష్టాల కడలిలో ఉన్నప్పుడు యెహోవాకు మనసువిప్పి ప్రార్థిద్దాం. సంఘంలోని బ్రదర్స్‌-సిస్టర్స్‌ ప్రేమకు దూరం కాకుండా చూసుకుందాం. బైబిల్లో ఉన్న చల్లని మాటల్ని చదివి, ఊరటను పొందుదాం. ఇలా నమ్మకంగా సహిస్తే యెహోవా మనకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. అంటే చావు, వెన్నుపోటు, అనారోగ్యం వల్ల మనం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. (ప్రక. 21:4) ఆ తర్వాత నుండి మనం ఇక బాధతో ఏడ్వం గానీ, సంతోషంతోనే కన్నీళ్లు పెట్టుకుంటాం!

పాట 4 “యెహోవా నా కాపరి”