కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 49

పాట 147 యెహోవా శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు

మీరు శాశ్వతకాలం జీవించవచ్చు—ఎలా?

మీరు శాశ్వతకాలం జీవించవచ్చు—ఎలా?

‘కుమారుణ్ణి అంగీకరించి, ఆయనమీద విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందుతారు.’యోహా. 6:40.

ముఖ్యాంశం

యేసుక్రీస్తు బలివల్ల అభిషిక్తులు, వేరే గొర్రెలు ఎలాంటి దీవెనలు పొందుతారో చూస్తాం.

1. ఎప్పటికీ జీవించడం గురించి చాలామందికి ఎలా అనిపిస్తుంది?

 ఆరోగ్యం కోసం చాలామంది మంచి ఆహారం తీసుకుంటారు, క్రమంగా ఎక్సర్‌సైజ్‌ చేస్తారు. కానీ ఎంత చేసినా ముసలితనాన్ని, చావును తప్పించుకోలేమని అనుకుంటారు. ఎప్పటికీ జీవించడం అనేది వాళ్లకు ఒక పగటి కలలా అనిపించవచ్చు. అయితే యేసు మాత్రం యోహాను 3:16; 5:24 లో “శాశ్వత జీవితం” సాధ్యమేనని చెప్పాడు.

2. శాశ్వత జీవితం గురించి యోహాను 6వ అధ్యాయం ఏం చెప్తుంది? (యోహాను 6:39, 40)

2 యేసు ఒక అద్భుతం చేసి ఎన్నో వేలమందికి రొట్టెల్ని, చేపల్ని పంచిపెట్టాడు. a అదే చాలా గొప్ప విషయమైతే, ఆయన తర్వాతి రోజు అన్న మాటలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఆ ఆహారం తిన్న ప్రజలు ఆయన వెంట వెళ్తూ గలిలయ సముద్ర తీరాన ఉన్న కపెర్నహూముకు చేరుకున్నారు. అక్కడ యేసు చనిపోయినవాళ్లు తిరిగి బ్రతికించబడతారని, వాళ్లు శాశ్వత జీవితాన్ని పొందుతారని చెప్పాడు. (యోహాను 6:39, 40 చదవండి.) చనిపోయిన మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. మీరు ఎవర్ని చూడాలనుకుంటున్నారు? చనిపోయిన చాలామంది తిరిగి బ్రతికించబడతారని, మీతోపాటు మీకు కావాల్సినవాళ్లు శాశ్వత జీవితాన్ని పొందగలరని యేసు మాటలు భరోసాను ఇస్తున్నాయి. అయితే యోహాను 6వ అధ్యాయంలో యేసు ఆ తర్వాత అన్న మాటల్ని అర్థం చేసుకోవడం చాలామందికి కష్టంగా అనిపించింది. ఇప్పుడు వాటిగురించి ఇంకాస్త వివరంగా చూద్దాం.

3. యోహాను 6:51 లో యేసు తన గురించి ఏం చెప్పాడు?

3 యేసు అద్భుతంగా తయారుచేసిన రొట్టెలకు, యెహోవా వాళ్ల పూర్వీకులకు ఇచ్చిన మన్నాకు మధ్య సంబంధాన్ని కపెర్నహూములో ఉన్న ప్రజలు అర్థం చేసుకోగలిగారు. నిజానికి బైబిలు మన్నాని, పరలోకం నుండి వచ్చిన ఆహారం అని పిలుస్తుంది. (కీర్త. 105:40; యోహా. 6:31) యేసు మన్నా గురించి చెప్పి, ఆ తర్వాత ముఖ్యమైన విషయాలు నేర్పించాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు మన్నాను అద్భుతరీతిలో ఇచ్చినా, దాన్ని తిన్నవాళ్లు చివరికి చనిపోయారు. (యోహా. 6:49) దానికి పూర్తి భిన్నంగా యేసు తాను ‘పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం’ అని, “దేవుడిచ్చే ఆహారం” అని, “జీవాన్నిచ్చే ఆహారం” అని అన్నాడు. (యోహా. 6:32, 33, 35) మన్నాకు, తనకు మధ్య ఒక ముఖ్యమైన తేడా గురించి యేసు చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “పరలోకం నుండి దిగివచ్చిన సజీవమైన ఆహారం నేనే. ఈ ఆహారాన్ని తినేవాళ్లు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు.” (యోహాను 6:51 చదవండి.) అది విన్న యూదులు అయోమయంలో పడిపోయారు. వాళ్లకు ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది: యేసు తాను పరలోకం నుండి వచ్చిన “ఆహారం” అని, తమ పూర్వీకులకు దేవుడు ఇచ్చిన మన్నా కంటే గొప్పవాడని ఎలా చెప్పుకుంటున్నాడు? యేసు ఇలా కూడా అన్నాడు: “నేనిచ్చే ఆహారం నా శరీరమే.” ఆ మాటకు అర్థమేంటి? అది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అది తెలుసుకుంటేనే మనకు, మనవాళ్లకు శాశ్వత జీవితం ఎలా దొరుకుతుందో అర్థం చేసుకుంటాం.

జీవాన్నిచ్చే ఆహారం, తన శరీరం—వీటి అర్థమేంటి?

4. యేసు చెప్పిన మాటలకు కొంతమంది ఎందుకు షాక్‌ అయ్యారు?

4 “లోకం జీవించేలా నేనిచ్చే ఆహారం నా శరీరమే” అని యేసు చెప్పినప్పుడు కొంతమంది అవాక్కయ్యారు. ఆయన నిజంగా తన మాంసం తినమని చెప్తున్నాడని వాళ్లు అనుకొనివుంటారు. (యోహా. 6:52) అయితే యేసు ఇంకో షాకింగ్‌ విషయం చెప్పాడు: “మీరు మానవ కుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని తాగితే తప్ప జీవం పొందరు.”—యోహా. 6:53.

5. నిజంగా తన రక్తం తాగమని యేసు ప్రజలకు చెప్పలేదని ఎందుకు అనవచ్చు?

5 రక్తాన్ని అస్సలు తినకూడదని దేవుడు నోవహు కాలంలో స్పష్టంగా చెప్పాడు. (ఆది. 9:3, 4) ఇశ్రాయేలీయులకు మళ్లీ అదే ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైనా రక్తం తింటే వాళ్లు “చంపబడాలి.” (లేవీ. 7:27, అధస్సూచి) యేసు కూడా మోషే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటించమనే యూదులకు చెప్పాడు. (మత్త. 5:17-19) కాబట్టి ఆ యూదులు నిజంగా తన శరీరాన్ని తినాలని, రక్తాన్ని తాగాలని యేసు ఉద్దేశం కానేకాదు. అయితే అవాక్కయ్యే ఆ మాటల్ని చెప్పి “శాశ్వత జీవితం” ఎలా పొందవచ్చో ప్రజలకు నేర్పించాడు.—యోహా. 6:54.

6. యోహాను 6:53 లో యేసు తన శరీరాన్ని, రక్తాన్ని ఒక ఉదాహరణలా చెప్పాడని ఎందుకు అనవచ్చు?

6 యేసు ఏం చెప్పాలనుకున్నాడు? దాన్ని తెలుసుకోవడానికి, సమరయ స్త్రీతో ఆయన ఎలా మాట్లాడాడో గమనిద్దాం. ఆయన ఒక ఉదాహరణను ఉపయోగించి ఆమెతో ఇలా అన్నాడు: “నేను ఇచ్చే నీళ్లు తాగే ఏ వ్యక్తికీ ఎప్పుడూ దాహం వేయదు. నేనిచ్చే నీళ్లు అతనిలో నీటి ఊటలా మారతాయి. ఆ ఊట అతనికి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి అతనిలో ఉబుకుతూ ఉంటుంది.” (యోహా. 4:7, 14) b ఈ సందర్భంలో యేసు, ఫలానా బావి దగ్గర నీళ్లు తాగితే శాశ్వత జీవితం దొరుకుతుందని చెప్పాలనుకోలేదు. అదేవిధంగా కపెర్నహూములో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్లు నిజంగా తన శరీరాన్ని తినాలని, రక్తాన్ని తాగాలని యేసు చెప్పాలనుకోలేదు. యేసు తన శరీరాన్ని, రక్తాన్ని కేవలం ఒక ఉదాహరణలా ఉపయోగించాడు.

యేసు అలాంటి మాటల్నే చెప్పిన మరో సందర్భం

7. యోహాను 6:53 లో యేసు అన్న మాటల గురించి కొంతమంది ఏం అనుకుంటారు?

7 ప్రభువు రాత్రి భోజనంలో చేయాల్సిన పనుల గురించి యేసు యోహాను 6:53 లో చెప్తున్నాడని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే కపెర్నహూములో, అలాగే ప్రభువు రాత్రి భోజనమప్పుడు యేసు ఒకేలాంటి పదాల్ని ఉపయోగించాడు. (మత్త. 26:26-28) ప్రభువు రాత్రి భోజనానికి హాజరయ్యే ప్రతీఒక్కరు రొట్టె, ద్రాక్షారసాన్ని తీసుకోవాలని వాళ్లు అంటారు. కానీ వాళ్లు చెప్పేది కరెక్టేనా? అది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ప్రతీ సంవత్సరం మనతోపాటు లక్షలమంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతారు. అయితే ఇప్పుడు యోహాను 6:53 లో ఉన్న మాటలకు, ప్రభువు రాత్రి భోజనంలో యేసు అన్న మాటలకు మధ్య కొన్ని తేడాల్ని చూద్దాం.

8. ఈ రెండు సందర్భాల్లో ఉన్న కొన్ని తేడాలు ఏంటి? (చిత్రాలు కూడా చూడండి.)

8 ఈ రెండు సందర్భాల్లో ఉన్న రెండు తేడాల్ని చూద్దాం. మొదటిగా, యోహాను 6:53-56 లో ఉన్న మాటల్ని యేసు ఎప్పుడు, ఎక్కడ చెప్పాడు? క్రీ.శ. 32 లో గలిలయలో ఉన్న కొంతమంది యూదులకు చెప్పాడు. అది యెరూషలేములో ప్రభువు రాత్రి భోజనాన్ని మొదలుపెట్టడానికి ఒక సంవత్సరం ముందు జరిగింది. రెండోది, ఆయన ఆ మాటల్ని ఎవరికి చెప్పాడు? గలిలయలో ఉన్న కొంతమందికి. వాళ్లేమో ఆధ్యాత్మిక అవసరాల కన్నా రోజువారీ అవసరాల్ని తీర్చుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. (యోహా. 6:26) ఎంతగా అంటే, యేసు చెప్పింది వాళ్లకు అర్థంకాకపోవడంతో ఆయన్ని నమ్మడమే ఆపేశారు. శిష్యుల్లో కూడా కొంతమంది ఆయన్ని విడిచిపెట్టేశారు. (యోహా. 6:14, 36, 42, 60, 64, 66) కానీ ఒక సంవత్సరం తర్వాత అంటే క్రీ.శ. 33 లో యేసు మొదలుపెట్టిన ప్రభువు రాత్రి భోజనంలో ఉన్న 11 మంది శిష్యులు వాళ్లలా కాదు. యేసు చెప్పేవన్నీ వాళ్లకు పూర్తిగా అర్థంకాకపోయినా, వాళ్లు ఆయన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. గలిలయలో ఉన్నవాళ్లలా కాకుండా ఈ నమ్మకమైన అపొస్తలులు యేసు పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడని గట్టిగా నమ్మారు. (మత్త. 16:16) అందుకే వాళ్లను మెచ్చుకుంటూ యేసు ఇలా అన్నాడు: “నా కష్టాల్లో నన్ను అంటిపెట్టుకొని ఉన్నవాళ్లు మీరే.” (లూకా 22:28) ఈ రెండు తేడాల్ని బట్టే యేసు యోహాను 6:53 లో, ప్రభువు రాత్రి భోజనమప్పుడు ఏం చేయాలో చెప్పడం లేదని అర్థమౌతుంది. ఇలా చెప్పడానికి వేరే రుజువులు కూడా ఉన్నాయి.

యేసు గలిలయలో ఎన్నో వేలమంది యూదులతో మాట్లాడిన విషయాలు యోహాను 6వ అధ్యాయంలో ఉన్నాయి (ఎడమవైపు). ఒక సంవత్సరం తర్వాత, యెరూషలేములో ఆయన తన నమ్మకమైన 11 మంది అపొస్తలులతో మాట్లాడాడు (కుడివైపు) (8వ పేరా చూడండి)


యేసు మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

9. ప్రభువు రాత్రి భోజనమప్పుడు యేసు ఎవర్ని ఉద్దేశించి మాట్లాడాడు?

9 ప్రభువు రాత్రి భోజనమప్పుడు యేసు తన అపొస్తలులకు పులవని రొట్టె ఇచ్చి, అది తన శరీరానికి గుర్తు అని చెప్పాడు. తర్వాత ద్రాక్షారసాన్ని ఇచ్చి అది ‘ఒప్పంద రక్తానికి’ గుర్తు అని చెప్పాడు. (మార్కు 14:22-25; లూకా 22:20; 1 కొరిం. 11:24) ఈ విషయాలు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కొత్త ఒప్పందం “దేవుని రాజ్యంలో” ఉండే “[ఆధ్యాత్మిక] ఇశ్రాయేలు ఇంటివాళ్లతో” మాత్రమే చేయబడుతుంది, మనుషులందరితో కాదు. (హెబ్రీ. 8:6, 10; 9:15) అపొస్తలులకు ఆ విషయం అప్పుడు అర్థంకాలేదు. కానీ కొంతకాలం తర్వాత వాళ్లు పవిత్రశక్తి చేత అభిషేకించబడి, పరలోకంలో యేసుతో పరిపాలించడానికి కొత్త ఒప్పందంలో అడుగుపెట్టారు.—యోహా. 14:2, 3.

10. యేసు ప్రభువు రాత్రి భోజనమప్పుడు చెప్పిన మాటలకు, గలిలయలో చెప్పిన మాటలకు ఉన్న ఇంకో తేడా ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

10 ప్రభువు రాత్రి భోజనమప్పుడు యేసు కేవలం “చిన్నమంద” గురించే చెప్పాడు. ఆ రోజు సాయంత్రం తనతోపాటు ఆ గదిలో ఉన్న నమ్మకమైన అపొస్తలులతో చిన్నమంద మొదలైంది. (లూకా 12:32) యేసు వాళ్లను రొట్టె తినమని, ద్రాక్షారసం తాగమని చెప్పాడు. అయితే తర్వాత ఆ మందలోకి వచ్చే ఇతరులు కూడా ప్రభువు రాత్రి భోజనం చేసుకునేటప్పుడు రొట్టెను తినాలి, ద్రాక్షారసాన్ని తాగాలి. వాళ్లు యేసుతో కలిసి పరలోకంలో పరిపాలిస్తారు. కాబట్టి ప్రభువు రాత్రి భోజనమప్పుడు యేసు చెప్పిన మాటలకు, గలిలయలో ఆయన చెప్పిన మాటలకు ఇంకో తేడా ఉందని అర్థమౌతుంది. అదేంటంటే, యెరూషలేములో యేసు చెప్పిన మాటలు కొంతమందికే వర్తిస్తాయి, గలిలయలో ఆయన చెప్పిన మాటలు ఎక్కువమందికి వర్తిస్తాయి.

రొట్టె, ద్రాక్షారసాన్ని తీసుకునేవాళ్లు చాలా తక్కువమందే అయినా, యేసు మీద విశ్వాసం చూపిస్తే ఎవరైనా శాశ్వత జీవితాన్ని పొందగలరు (10వ పేరా చూడండి)


11. యేసు కేవలం కొంతమంది గురించే మాట్లాడట్లేదని గలిలయలో అన్న మాటలు ఎలా చూపిస్తున్నాయి?

11 గలిలయలో ఉన్న ఎక్కువశాతం మంది ప్రజలకు, యేసు నుండి కేవలం ఆహారం మాత్రమే కావాలి. కానీ దానికన్నా ముఖ్యమైన విషయం ఒకటుందని యేసు చెప్పాలనుకున్నాడు. అది వాళ్లను శాశ్వత జీవితానికి నడిపిస్తుంది. చనిపోయినవాళ్లు చివరి రోజున తిరిగి బ్రతికించబడతారని, శాశ్వతకాలం జీవిస్తారని కూడా యేసు చెప్పాడు. అయితే యేసు ఇక్కడ కేవలం కొంతమంది గురించే చెప్పట్లేదు. బదులుగా అందరూ పొందగలిగే దీవెనల గురించి చెప్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “ఈ ఆహారాన్ని తినేవాళ్లు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు; నిజానికి లోకం జీవించేలా నేనిచ్చే ఆహారం నా శరీరమే.”—యోహా. 6:51. c

12. శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలి?

12 భూమ్మీద పుట్టిన ప్రతీఒక్కరికి శాశ్వత జీవితం దొరుకుతుందని యేసు గలిలయలో ఉన్న యూదులకు చెప్పలేదు. ఎవరైతే ‘ఆహారాన్ని తింటారో’ అంటే విశ్వాసం చూపిస్తారో, వాళ్లు మాత్రమే దీవెనలు పొందుతారు. కానీ నేడు చాలామంది క్రైస్తవులు యేసును నమ్మితే, ఆయన్ని రక్షకునిగా చూస్తే సరిపోతుందని అనుకుంటారు. (యోహా. 6:29) అయితే అదొక్కటే సరిపోదు. గలిలయలో ఉన్న కొంతమంది యేసును ముందు నమ్మారు, కానీ తర్వాత ఆయన్ని విడిచిపెట్టేశారు. ఎందుకు?

13. నిజంగా యేసు శిష్యులవ్వాలంటే ఏం చేయాలి?

13 ఆ ప్రజల్లో ఎక్కువశాతం మంది తమకు కావల్సింది దొరికినంతకాలం సంతోషంగా యేసు వెంట వెళ్లారు. వాళ్లకు కావాల్సిందల్లా అద్భుతంగా రోగాలు నయమవ్వడం, ఉచిత భోజనాలు, వాళ్లకు నచ్చిన బోధలు. కానీ ప్రజల కోరికల్ని తీర్చడానికే యేసు భూమ్మీదకు రాలేదు. నిజంగా తన శిష్యులవ్వాలంటే ఏం చేయాలో నేర్పించడానికి వచ్చాడు. తన దగ్గరికి రమ్మని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకుని, ఆయన చెప్పే వాటన్నిటికీ వాళ్లు లోబడాలి.—యోహా. 5:40; 6:44.

14. యేసు శరీరం నుండి, రక్తం నుండి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?

14 యేసు ఆ ప్రజలకు విశ్వాసం చూపించమని చెప్పాడు. దేనిమీద? ఆయన కొంతకాలం తర్వాత త్యాగం చేసే తన శరీరానికి, రక్తానికి ఉన్న శక్తిమీద. ఆ విశ్వాసాన్ని ఆ కాలం నాటి యూదులు చూపించాలి, నేడు మనం కూడా చూపించాలి. (యోహా. 6:40) కాబట్టి యోహాను 6:53 లో యేసు ఏం చెప్పాలి అనుకున్నాడంటే, మనం శాశ్వత జీవితాన్ని పొందాలంటే విమోచన క్రయధనం మీద విశ్వాసం చూపించాలి. అయితే ఈ దీవెనను కేవలం కొంతమందే కాదు, చాలామంది పొందవచ్చు.—ఎఫె. 1:7.

15-16. యోహాను 6వ అధ్యాయంలో మనం ఎలాంటి ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం?

15 యోహాను 6వ అధ్యాయంలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. యేసు ప్రజల్ని ఎంతబాగా చూసుకున్నాడో అక్కడ స్పష్టంగా ఉంది. ఆయన గలిలయలో ఉన్నప్పుడు రోగుల్ని బాగుచేశాడు, రాజ్యం గురించి బోధించాడు, అందరికీ అవసరమైన ఆహారాన్ని ఇచ్చాడు. (లూకా 9:11; యోహా. 6:2, 11, 12) అన్నిటికన్నా ముఖ్యంగా, “జీవాన్నిచ్చే ఆహారం” ఆయనే అని నేర్పించాడు.—యోహా. 6:35, 48.

16 ప్రభువు రాత్రి భోజనమప్పుడు “వేరే గొర్రెలు” రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకోరు, తీసుకోకూడదు కూడా. (యోహా. 10:16) అయితే వాళ్లు యేసు బలి మీద విశ్వాసం చూపిస్తే ఆయన రక్తం, శరీరం నుండి ప్రయోజనం పొందుతారు. (యోహా. 6:53) మరోవైపు ఎవరైతే రొట్టె, ద్రాక్షారసాన్ని తీసుకుంటారో, వాళ్లు కొత్త ఒప్పందంలోకి వచ్చారని, భవిష్యత్తులో పరలోకం నుండి పరిపాలిస్తారని చూపిస్తారు. కాబట్టి మనం అభిషిక్త క్రైస్తవులమైనా, వేరే గొర్రెలమైనా యోహాను 6వ అధ్యాయాన్ని బాగా పట్టించుకోవాలి. ఎందుకంటే శాశ్వత జీవితం పొందాలంటే విశ్వాసం చూపించాలనే వెలకట్టలేని పాఠాన్ని అది నేర్పిస్తుంది.

పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

a యోహాను 6:5-35 వచనాల్ని ముందు ఆర్టికల్‌లో చర్చించాం.

b యేసు చెప్పిన నీళ్లు మనం శాశ్వత జీవితం పొందడానికి యెహోవా చేసిన ఏర్పాట్లను సూచిస్తున్నాయి.

c శాశ్వత జీవితం పొందే అవకాశం ఉన్నవాళ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను 6వ అధ్యాయంలో ఉపయోగించిన పదాల్ని “ఎవరైనా,” “ప్రతీ ఒక్కరు” అని కూడా అనువదించవచ్చు.—యోహా. 6:35, 40, 54.