కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 48

పాట 97 దేవుని మాట వల్లే జీవిస్తాం

యేసు చేసిన అద్భుతం నుండి నేర్చుకుందాం

యేసు చేసిన అద్భుతం నుండి నేర్చుకుందాం

“జీవాన్నిచ్చే ఆహారాన్ని [లేదా రొట్టెను] నేనే. నా దగ్గరికి వచ్చే వాళ్లెవ్వరికీ అస్సలు ఆకలి వేయదు.”యోహా. 6:35.

ముఖ్యాంశం

యోహాను 6వ అధ్యాయంలో యేసు ఎన్నో వేలమందికి అద్భుతంగా రొట్టెల్ని, చేపల్ని ఇచ్చిన సందర్భాన్ని పరిశీలిస్తాం. దాన్నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో కూడా చూస్తాం.

1. బైబిలు కాలాల్లో రొట్టె ఎంత ప్రాముఖ్యమైనది?

 బైబిలు కాలంలోని వాళ్లకు ముఖ్యమైన ఆహారం అంటే, రొట్టె. (ఆది. 14:18; లూకా 4:4) అది ఎంత ప్రాముఖ్యమైనది అంటే చాలాసార్లు బైబిల్లో ఆహారం లేదా భోజనం అని అనువదించిన పదం దగ్గర మూలభాషలో “రొట్టె” అని ఉంటుంది. (మత్త. 6:11; అపొ. 20:7, అధస్సూచి) యేసు చేసిన రెండు గొప్ప అద్భుతాల్లో కూడా రొట్టెను ఉపయోగించాడు. (మత్త. 16:9, 10) వాటిలో ఒక అద్భుతం యోహాను 6వ అధ్యాయంలో ఉంది. అందులో ఉన్న కొన్ని లేఖనాల్ని పరిశీలించి, పాఠాలు నేర్చుకుందాం.

2. కొన్ని వేలమందికి ఆహారం అవసరమైన సందర్భం ఏంటి?

2 యేసు, అపొస్తలులు పరిచర్య చేసి బాగా అలసిపోయారు. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి వాళ్లంతా పడవ ఎక్కి గలిలయ సముద్రాన్ని దాటారు. (మార్కు 6:7, 30-32; లూకా 9:10) వాళ్లు బేత్సయిదాలో ఎవరూలేని ఒక చోటుకు చేరుకున్నారు. కానీ అంతలోనే కొన్ని వేలమంది అక్కడికి వచ్చేసి వాళ్ల చుట్టూ గుమికూడారు. యేసు వాళ్లను పట్టించుకోకుండా వెళ్లిపోవచ్చు, కానీ అలా చేయలేదు. ఆయన సమయం తీసుకుని వాళ్లకు దేవుని రాజ్యం గురించి బోధించాడు, రోగుల్ని బాగుచేశాడు. సాయంత్రం కావొస్తుంది కాబట్టి అంతమందికి ఆహారం ఎలా పెట్టాలా అని శిష్యులు ఆలోచిస్తున్నారు. కొంతమంది దగ్గర బహుశా కొంచెం ఆహారం ఉండి ఉంటుంది, కానీ ఎక్కువశాతం మందేమో చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి ఆహారం కొనుక్కోవాలి. (మత్త. 14:15; యోహా. 6:4, 5) మరి యేసు ఏం చేశాడు?

యేసు అద్భుతంగా రొట్టెలు పెట్టాడు

3. అక్కడికి వచ్చినవాళ్లకు ఏం పెట్టమని యేసు అపొస్తలులకు చెప్పాడు? ( చిత్రం కూడా చూడండి.)

3 యేసు తన అపొస్తలులతో ఇలా అన్నాడు: “వాళ్లు వెళ్లాల్సిన అవసరం లేదు, మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి.” (మత్త. 14:16) కానీ చిక్కేంటంటే, అక్కడ దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు, పిల్లల్ని కలిపితే మొత్తం 15,000 మంది దాకా ఉండి ఉంటారు. (మత్త. 14:21) అంద్రెయ ఇలా అన్నాడు: “ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలు, రెండు చిన్నచేపలు ఉన్నాయి. అయితే ఇంతమందికి ఇవి ఎలా సరిపోతాయి?” (యోహా. 6:9) బార్లీ రొట్టెల్ని తినడం ఆ కాలంలో సర్వసాధారణం. అలాగే ఆ చిన్న చేపలనేమో ఉప్పు పట్టించి ఎండబెట్టి ఉంటారు. కానీ ఆ అబ్బాయి దగ్గరున్న ఈ కొంచెం ఆహారం అంతమందికి అస్సలు సరిపోదు.

యేసు ప్రజల ఆధ్యాత్మిక అవసరాల్ని, భౌతిక అవసరాల్ని తీర్చాడు (3వ పేరా చూడండి)


4. యోహాను 6:11-13 నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

4 యేసు ప్రజల మీద దయతో వాళ్లను గుంపులు-గుంపులుగా గడ్డి మీద కూర్చోమన్నాడు. (మార్కు 6:39, 40; యోహాను 6:11-13 చదవండి.) తర్వాత రొట్టెల్ని, చేపల్ని ఇచ్చినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆహారానికి నిజమైన మూలం దేవుడే కాబట్టి అలా కృతజ్ఞతలు చెప్పడం సరైనదే. యేసులా మనం కూడా ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా భోంచేసే ముందు ప్రార్థన చేయడం మంచిది. యేసు ఆ తర్వాత ఆహారాన్ని ప్రజలకు పంచిపెట్టాడు, వాళ్లు తృప్తిగా తిన్నారు. వాళ్లు తిన్నాక కూడా చాలా ఆహారం మిగిలింది. ఆయన వాటిని పడేయాలని అనుకోలేదు. బహుశా తర్వాత వాటిని ఉపయోగించడానికి ఆ రొట్టెల్ని పోగు చేయమన్నాడు. ఉన్నవాటిని తెలివిగా ఉపయోగించుకునే విషయంలో యేసు మనందరికీ ఒక చక్కని ఆదర్శం. మీకు పిల్లలు ఉంటే వాళ్లకు ఈ లేఖనాల్ని చూపిస్తూ తినే ముందు ప్రార్థన చేయడం, ఇతరుల మీద దయ చూపించడం, తమకు ఉన్నవాటిని ఇతరులతో పంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో నేర్పించండి.

‘యేసులా ఆహారం తినే ముందు నేను ప్రార్థిస్తున్నానా?’ అని ప్రశ్నించుకోండి (4వ పేరా చూడండి)


5. యేసు చేసిన అద్భుతాన్ని చూసి ప్రజలు ఏం చేయడానికి ప్రయత్నించారు? అప్పుడు యేసు ఏం చేశాడు?

5 యేసు చాలా చక్కగా బోధించాడు, అద్భుతాలు చేశాడు. ఇదంతా చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవుడు ఒక గొప్ప ప్రవక్తను పంపిస్తాడని మోషే మాటిచ్చిన విషయం వాళ్లకు తెలుసు కాబట్టి, ‘యేసే ఆ ప్రవక్తనా?’ అనే ప్రశ్న వాళ్లందరికీ వచ్చి ఉంటుంది. (ద్వితీ. 18:15-18) అదే నిజమైతే, యేసు ప్రతీఒక్కరికి ఆహారం పంచిపెట్టే ఒక గొప్ప రాజుగా వాళ్లకు కనిపించి ఉంటాడు. అందుకే ఆ ప్రజలందరూ “[యేసును] పట్టుకుని రాజుగా” చేయడానికి ప్రయత్నించారు. (యోహా. 6:14, 15) మరి యేసు దానికి ఒప్పుకున్నాడా? లేదు. ఎందుకంటే అలా చేస్తే రోమన్లు పరిపాలిస్తున్న యూదుల రాజకీయాల్లో తలదూర్చినట్టు అవుతుంది. ఆ తర్వాతి లేఖనాల్లో గమనిస్తే యేసు ఒక్కడే మళ్లీ ‘కొండకు వెళ్లిపోయాడు’ అని చదువుతాం. కాబట్టి ఎంత ఒత్తిడి వచ్చినా ఆయన రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఇది మనకు ఎంత చక్కని పాఠమో కదా!

6. మనం యేసులా ఎలా ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

6 ఇతరులు మనల్ని అద్భుతంగా ఆహారం పంచిపెట్టమని, రోగుల్ని బాగుచేయమని లేదా రాజుగా పరిపాలించమని అడగరు. కానీ ఓటు వేయమని లేదా ఎవరు పరిపాలిస్తే బాగుంటుందో చెప్పమని మనల్ని ఒత్తిడి చేయవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలో యేసు ఉదాహరణ స్పష్టంగా చూపిస్తుంది. రాజకీయాల్లో తలదూర్చనని చెప్తూ ఆయన స్పష్టంగా ఇలా అన్నాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహా. 17:14; 18:36) క్రైస్తవులుగా మనం కూడా యేసు ఆలోచనలకు, పనులకు అద్దంపట్టాలి. మనం ఎప్పుడూ దేవుని రాజ్యానికే మద్దతిస్తాం, దాని గురించే ప్రకటిస్తాం, ప్రార్థన చేస్తాం. (మత్త. 6:10) యేసు అద్భుతంగా ఆహారాన్ని పంచిపెట్టిన సందర్భాన్ని మళ్లీ పరిశీలించి ఇంకా ఏం నేర్చుకోవచ్చో చూద్దాం.

యేసు తన శిష్యులకు ఒక ఉదాహరణగా ఉంటూ యూదుల, రోమన్ల రాజకీయాల్లో తలదూర్చలేదు యేసు తన శిష్యులకు ఒక ఉదాహరణగా ఉంటూ యూదుల, రోమన్ల రాజకీయాల్లో తలదూర్చలేదు (6వ పేరా చూడండి)


‘రొట్టెలతో చేసిన అద్భుతానికి’ అర్థం

7. యేసు ఏం చేశాడు? దానికి అపొస్తలులు ఏం అన్నారు? (యోహాను 6:16-20)

7 యేసు ప్రజలకు ఆహారం పంచిపెట్టాక తన శిష్యుల్ని పడవలో కపెర్నహూముకు వెళ్లమన్నాడు, ఆయనేమో కొండమీదికి వెళ్లాడు. అలా తనను రాజుగా చేయాలనుకున్న ప్రజల దగ్గర నుండి తప్పించుకున్నాడు. (యోహాను 6:16-20 చదవండి.) అపొస్తలులు పడవలో వెళ్తున్నప్పుడు ఎగసిపడే అలలతో ఒక పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు యేసు వాళ్ల దగ్గరికి నీళ్లమీద నడుచుకుంటూ వెళ్లాడు. అపొస్తలుడైన పేతురును కూడా నీళ్లమీద నడుచుకుంటూ తన దగ్గరికి రమ్మన్నాడు. (మత్త. 14:22-31) యేసు పడవలో అడుగుపెట్టగానే తుఫాను ఆగిపోయింది. ఇదంతా చూసి శిష్యులందరూ ఆశ్చర్యంతో ఇలా అన్నారు: “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి.” a (మత్త. 14:33) కానీ యేసు చేసిన ఈ అద్భుతానికి, ఇంతకుముందు రొట్టెలతో చేసిన అద్భుతానికి ఉన్న సంబంధాన్ని వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. దీని గురించే మార్కు ఇలా రాశాడు: “అది చూసి [అపొస్తలులు] ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన రొట్టెలతో చేసిన అద్భుతం చూసి కూడా వాళ్లు ఏమీ గ్రహించలేదు, వాళ్ల హృదయాలు ఇంకా అర్థంచేసుకోలేని స్థితిలోనే ఉన్నాయి.” (మార్కు 6:50-52) అవును, అద్భుతాలు చేయడానికి యెహోవా యేసుకు ఎంత శక్తిని ఇచ్చాడో వాళ్లు పూర్తిగా అర్థంచేసుకోలేక పోయారు. ఆ తర్వాతి రోజే యేసు రొట్టెలతో చేసిన అద్భుతం గురించి మళ్లీ చెప్తూ ఒక పాఠాన్ని నేర్పించాడు.

8-9. యేసును వెదకడానికి ప్రజలు ఎందుకు ప్రయత్నించారు? (యోహాను 6:26, 27)

8 యేసు ఇచ్చిన ఆహారాన్ని తిన్న ప్రజలు, తమ రోజువారీ అవసరాలు-కోరికలు తీర్చుకోవడం మీదే మనసు పెట్టారు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఆ తర్వాతి రోజు యేసు, అపొస్తలులు అక్కడ లేకపోవడం వాళ్లు చూశారు. అప్పుడు వాళ్లందరూ తిబెరియ నుండి వచ్చిన పడవలు ఎక్కి యేసును వెదకడానికి కపెర్నహూముకు బయల్దేరారు. (యోహా. 6:22-24) వాళ్లు అలా వెళ్లింది దేవుని రాజ్యం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికా? కాదు. యేసు వాళ్లకు ఇంకా ఎక్కువ ఆహారం పెడతాడేమో అనే ఆశతో వెళ్లారు. అది మనకెలా తెలుసు?

9 ప్రజలు యేసును కపెర్నహూములో చూసినప్పుడు ఏం జరిగింది? వాళ్లు కొంతకాలమే ఉండే అవసరాల్ని, కోరికల్ని తీర్చుకోవడానికి అక్కడికి వచ్చారని యేసు సూటిగా చెప్పేశాడు. ఆ ప్రజలు ‘పాడైపోయే ఆహారంతో’ అంటే రొట్టెలతో ‘తృప్తి పడుతున్నారని’ అన్నాడు. అలా కాకుండా ‘శాశ్వత జీవితాన్ని ఇచ్చే పాడవ్వని ఆహారం కోసం కష్టపడమని’ వాళ్లకు చెప్పాడు. (యోహాను 6:26, 27 చదవండి.) తన తండ్రి ఆ ఆహారాన్ని ఇస్తాడని చెప్పాడు. ఆహారం తింటే శాశ్వత జీవితం దొరుకుతుందని విన్నప్పుడు ఆ ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపోయుంటారు. నిజంగా అలాంటి ఆహారం ఏదైనా ఉందా? దాన్ని పొందాలంటే ఆ ప్రజలు ఏం చేయాలి?

10. శాశ్వత జీవితం పొందాలంటే ప్రజలు ఏం చేయాలి?

10 ఆయన మాటలు వింటున్న యూదులు అలాంటి ఆహారం కోసం ఏమైనా పనులు చేయాలేమోనని అనుకుని ఉంటారు. బహుశా వాళ్లు ధర్మశాస్త్రం చెప్తున్న పనుల గురించి ఆలోచిస్తుండవచ్చు. కానీ యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు దేవుని ఆమోదం పొందాలంటే, ఆయన పంపించిన వ్యక్తి మీద విశ్వాసం చూపించాలి.” (యోహా. 6:28, 29) “శాశ్వత జీవితం” పొందాలంటే దేవుడు పంపించిన వ్యక్తి మీద విశ్వాసం చూపించాలని యేసు ఇంతకుముందు కూడా చెప్పాడు. (యోహా. 3:16-18, 36) ఈ విషయం గురించి తర్వాత కూడా యేసు ఇంకొన్ని వివరాలు చెప్పాడు.—యోహా. 17:3.

11. వాళ్ల మనసంతా తినే ఆహారం మీదే ఉందని యూదులు ఎలా చూపించారు? (కీర్తన 78:24, 25)

11 యేసు మీద విశ్వాసం చూపించాలనే విషయాన్ని ఆ యూదులు ఒప్పుకోలేకపోయారు. అందుకే వాళ్లు ఇలా అడిగారు: “మేము చూసి, నిన్ను నమ్మేలా నువ్వు ఏ అద్భుతం చేస్తావు?” (యోహా. 6:30) మోషే కాలంలో వాళ్ల పూర్వీకులు మన్నాని ఆహారంగా పొందిన సంగతి గురించి మాట్లాడారు. (నెహె. 9:15; కీర్తన 78:24, 25 చదవండి.) కాబట్టి వాళ్లు కేవలం తినే ఆహారం మీదే మనసు పెడుతున్నారని యేసుకు అర్థమైంది. మన్నాలా కాకుండా ‘పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారం’ శాశ్వత జీవితం ఇస్తుందని యేసు వాళ్లకు చెప్పాడు. (యోహా. 6:32) కానీ వాళ్లు కనీసం దాని అర్థం ఏంటో వివరించమని కూడా అడగలేదు. శాశ్వత జీవితం పొందడానికి ఏం చేయాలో యేసు పదేపదే చెప్పినా, అదేం పట్టించుకోకుండా వాళ్లు తినే ఆహారం గురించే ఆలోచిస్తున్నారు. దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

మనం ముఖ్యంగా దేనిమీద మనసుపెట్టాలి?

12. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటి? అది ప్రాముఖ్యమని యేసు ఎలా చూపించాడు?

12 యోహాను 6వ అధ్యాయంలో మనకొక ప్రాముఖ్యమైన పాఠం ఉంది. అదేంటంటే దేవునికి లోబడడం, ఆయనతో మంచి సంబంధం కలిగివుండడం అన్నిటికన్నా ప్రాముఖ్యం. సాతాను తనను శోధించినప్పుడు యేసు ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. (మత్త. 4:3, 4) కొండమీద ప్రసంగంలో కూడా దేవునితో మంచి సంబంధం కలిగివుండడం ఎంత ప్రాముఖ్యమో నేర్పించాడు. (మత్త. 5:3) కాబట్టి మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకోవడానికే మొదటిస్థానం ఇస్తున్నానా లేక సొంత కోరికల్ని తీర్చుకోవడానికే మొదటిస్థానం ఇస్తున్నానా?’

13. (ఎ) ఆహారాన్ని తింటూ ఎంజాయ్‌ చేయడం ఎందుకు తప్పుకాదు? (బి) పౌలు ఇచ్చిన ఏ హెచ్చరిక గురించి మనం ఆలోచించాలి? (1 కొరింథీయులు 10:6, 7, 11)

13 మన అవసరాల కోసం ప్రార్థించడం, అందులో సంతోషాన్ని పొందడం తప్పేమీ కాదు. (లూకా 11:3) “తింటూ తాగుతూ తన కష్టార్జితంతో సుఖపడడం” మంచిదేనని, అది “సత్యదేవుడు ఇచ్చేదేనని” బైబిలు చెప్తుంది. (ప్రసం. 2:24; 8:15; యాకో. 1:17) కానీ అవే మన ప్రపంచం కాకుండా చూసుకోవాలి. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు దీని గురించే రాశాడు. ఇశ్రాయేలీయుల చెడు ఉదాహరణ గురించి చెప్తూ ఎడారిలో, ముఖ్యంగా సీనాయి పర్వతం దగ్గర వాళ్లు ఏం చేశారో రాశాడు. ‘వాళ్లలా హానికరమైనవి కోరుకోకూడదని’ క్రైస్తవుల్ని హెచ్చరించాడు. (1 కొరింథీయులు 10:6, 7, 11 చదవండి.) యెహోవా వాళ్లకు అద్భుతరీతిలో ఆహారం పెట్టాడు. కానీ వాళ్ల అత్యాశ వల్ల అది ‘హానికరమైనదిగా’ మారిపోయింది. (సంఖ్యా. 11:4-6, 31-34) వాళ్లు బంగారు దూడను చేసి ఆరాధించినప్పుడు కూడా తినడం, తాగడం, ఎంజాయ్‌ చేయడానికే మొదటిస్థానం ఇచ్చారు. (నిర్గ. 32:4-6) పౌలు ఈ విషయాన్ని క్రైస్తవులకు రాస్తున్నప్పుడు, యెరూషలేము నాశనం చాలా దగ్గర్లో ఉంది. మనం కూడా ఈ సాతాను లోకం నాశనానికి చాలా దగ్గర్లో ఉన్నాం కాబట్టి, పౌలు ఇచ్చిన సలహాను జాగ్రత్తగా పాటించాలి.

14. కొత్తలోకంలో ఉండే ఆహారం గురించి బైబిలు ఏం చెప్తుంది?

14 యేసు, “ఈ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వు” అని ప్రార్థించమని చెప్పడంతో పాటు, దేవుని ఇష్టం “పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి” అని ప్రార్థించమన్నాడు. (మత్త. 6:9-11) అది నిజమైనప్పుడు లోకమంతా ఎలా ఉంటుంది? మంచి ఆహారమైతే ఖచ్చితంగా ఉంటుందని బైబిలు చెప్తుంది. అందుకే యెషయా 25:6-8 లో దేవుని రాజ్యంలో ప్రజలందరూ రకరకాల రుచికరమైన వంటకాల్ని ఆనందిస్తారని ఉంది. కీర్తన 72:16 కూడా ఇలా చెప్తుంది: “భూమ్మీద సస్యసమృద్ధి ఉంటుంది; పర్వత శిఖరాల మీద ధాన్యం పొంగిపొర్లుతుంది.” ఆ ధాన్యంతో మీకు నచ్చిన వంటకాన్ని లేదా కొత్తకొత్త వంటకాలు చేయాలని ఎదురుచూస్తున్నారా? అదొక్కటే కాదు మీరు నాటిన ద్రాక్షతోట పండ్లు కూడా మీకే సొంతం. (యెష. 65:21, 22) భూమ్మీదున్న ప్రతీఒక్కరు ఈ బహుమానాల్ని ఆనందిస్తారు.

15. పునరుత్థానమైన వాళ్లు ఏం నేర్చుకుంటారు? (యోహాను 6:35)

15 యోహాను 6:35 చదవండి. యేసు అద్భుతంగా తయారుచేసిన రొట్టెల్ని, చేపల్ని తిన్నవాళ్ల గురించి ఒకసారి మళ్లీ ఆలోచించండి. వాళ్లలో కొంతమందిని మనం కొత్తలోకంలో కలవవచ్చు. గతంలో విశ్వాసం చూపించకపోయినా వాళ్లు పునరుత్థానం అయ్యే అవకాశం ఉంది. (యోహా. 5:28, 29) అలాంటివాళ్లు యేసు అన్న ఈ మాటల అర్థాన్ని తెలుసుకుంటారు: “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాళ్లెవ్వరికీ అస్సలు ఆకలి వేయదు.” యేసు వాళ్ల కోసం తన ప్రాణాన్ని అర్పించాడని అర్థం చేసుకుని విమోచన క్రయధనం మీద విశ్వాసం పెంచుకోవాలి. పునరుత్థానమైన వాళ్లతోపాటు కొత్తలోకంలో పుట్టిన పిల్లలు కూడా యెహోవా గురించి, ఆయన ఉద్దేశం గురించి నేర్చుకుంటారు. వాళ్లకు మంచి-మంచి విషయాలు బోధించినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతాం. యెహోవాకు దగ్గరయ్యేలా ఇతరులకు సహాయం చేయడం కన్నా మించింది ఏదైనా ఉందా? ఆ ఆనందాన్ని ఆహారం తినడంలో ఉన్న ఆనందంతో అస్సలు పోల్చలేం.

16. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

16 యోహాను 6వ అధ్యాయంలోని కొన్ని విషయాల్ని ఇప్పటివరకు చూశాం. అయితే “శాశ్వత జీవితం” గురించి యేసు మనకు ఇంకొన్ని విషయాలు నేర్పించాడు. వాటిని అప్పట్లో యూదులు చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఇప్పుడున్న మనం కూడా జాగ్రత్తగా వినాలి. వాటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 20 ప్రశస్తమైన నీ కుమారుణ్ణి ఇచ్చావు

a ఈ ఆసక్తికరమైన సంఘటనల గురించి ఇంకొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి యేసే మార్గం, సత్యం, జీవం పుస్తకంలో 131వ పేజీ అలాగే వాళ్లలా విశ్వాసం చూపించండి పుస్తకంలో 213వ పేజీ చూడండి.