కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చీకటి నుండి విడుదల

చీకటి నుండి విడుదల

[యెహోవా, NW] చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు.’1 పేతు. 2:9.

పాటలు: 1, 14

1. యెరూషలేము నాశనమప్పుడు జరిగిన సంఘటనల్ని వివరించండి.

 సా.శ.పూ. 607⁠లో రాజైన నెబుకద్నెజరు II, తన గొప్ప బబులోను సైన్యంతో కలిసి యెరూషలేము పట్టణంపై దాడిచేశాడు. అక్కడ జరిగిన రక్తపాతం గురించి బైబిలు ఇలా చెప్తోంది, ‘అతను యౌవనులను ఖడ్గంతో సంహరించాడు. యౌవనులనుగానీ, యువతులనుగానీ, ముసలివాళ్లనుగానీ, నెరసిన వెంట్రుకలుగల వాళ్లనుగానీ కనికరించలేదు.’ అంతేకాదు చివరిలో ‘దేవుని మందిరాన్ని తగులబెట్టి, యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టి, దాని నగరులన్నిటినీ కాల్చేశాడు. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేశాడు.’—2 దిన. 36:17, 19.

2. యెహోవా ఏమని హెచ్చరించాడు? యూదులకు ఏమి జరుగుతుంది?

2 యెరూషలేము నాశనం యూదులకు ఆశ్చర్యం కలిగించి ఉండదు. ఎందుకంటే తనకు లోబడకపోతే బబులోనీయుల చేతికి అప్పగిస్తానని యెహోవా ఎన్నో సంవత్సరాలపాటు ప్రవక్తల ద్వారా వాళ్లను హెచ్చరించాడు. అలా జరిగితే చాలామంది యూదులు చంపబడతారు, తప్పించుకున్నవాళ్లు బహుశా బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడతారు. (యిర్మీ. 15:2) బబులోనులో బందీలుగా ఉన్నవాళ్ల జీవితం ఎలా ఉండేది? యూదులు బబులోనులో బందీలుగా ఉన్నట్లు క్రైస్తవులు కూడా ఎప్పుడైనా బందీలుగా ఉన్నారా? ఒకవేళ ఉంటే, ఎప్పుడు?

బందీలుగా జీవితం

3. బబులోనులో బందీలుగా ఉన్నవాళ్ల జీవితం, ఈజిప్టులో బానిసలుగా ఉన్నవాళ్ల జీవితం కన్నా ఎలా వేరుగా ఉండేది?

3 బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు అక్కడి కొత్త పరిస్థితులకు సర్దుకుపోయి, సాధ్యమైనంత బాగా జీవించాలని యెహోవా యూదులకు చెప్పాడు. యిర్మీయా ద్వారా ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు, “ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.” (యిర్మీ. 29:5, 7) యెహోవా చెప్పినట్లు చేసినవాళ్లు చాలావరకు సాధారణ జీవితం గడిపారు. బబులోనీయులు యూదులను తమ ఇష్టప్రకారం జీవించేందుకు, దేశమంతటా స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిచ్చారు. ఆ కాలంలో, బబులోను వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు, చాలామంది యూదులు క్రయవిక్రయాలు చేసే కళను, కొంతమందైతే హస్తకళా నైపుణ్యాన్ని నేర్చుకున్నారని ప్రాచీన పత్రాలు చూపిస్తున్నాయి. ఇంకొందరైతే ధనవంతులు కూడా అయ్యారు. ఇశ్రాయేలీయులు వందల సంవత్సరాల క్రితం ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ల జీవితం కష్టంగా ఉండేది. కానీ బబులోనులో అలా లేదు.—నిర్గమకాండము 2:23-25 చదవండి.

4. నమ్మకంగాలేని యూదులతోపాటు ఎవరు కూడా బాధలుపడాల్సి వచ్చింది? ధర్మశాస్త్రం చెప్పినవన్నీ చేయడం వాళ్లకు ఎందుకు సాధ్యంకాలేదు?

4 బబులోనులో బందీలుగా ఉన్నవాళ్లలో, దేవున్ని నమ్మకంగా సేవిస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఏ తప్పూ చేయకపోయినా మిగతా జనాంగంతోపాటు వాళ్లు కూడా బాధలుపడాల్సి వచ్చింది. అయితే అక్కడ వాళ్లకు అవసరమైన వస్తువులన్నీ ఉన్నాగానీ యెహోవాను ఆరాధించడం మాత్రం వీలయ్యేదికాదు. ఎందుకంటే యెహోవా ఆలయం, బలిపీఠం నాశనమవ్వడంతో యాజకులు ఓ క్రమపద్ధతిలో సేవ చేయలేకపోయారు. అయినప్పటికీ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి నమ్మకమైన యూదులు చేయగలిగినదంతా చేశారు. ఉదాహరణకు దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అపవిత్ర ఆహారాన్ని తినడానికి ఒప్పుకోలేదు. అంతేకాదు దానియేలు దేవునికి క్రమంగా ప్రార్థించేవాడని బైబిలు చెప్తోంది. (దాని. 1:8; 6:10) ఏదేమైనా వాళ్లు అన్యుల పరిపాలన కింద ఉన్నారు కాబట్టి దేవుని ధర్మశాస్త్రంలోని నియమాలన్నిటినీ పాటించడం నమ్మకమైన యూదులకు అసాధ్యం.

5. యెహోవా తన ప్రజలకు ఏమని మాటిచ్చాడు? అది ఎందుకు ప్రత్యేకమైనది?

5 ఎప్పటికైనా యూదులు యెహోవా అంగీకరించే విధంగా మళ్లీ ఆరాధించగలరా? అప్పటి పరిస్థితులుబట్టి అది అసాధ్యమనిపించి ఉండవచ్చు, ఎందుకంటే బబులోనీయులు సాధారణంగా బందీలను వదిలిపెట్టేవాళ్లు కాదు. కానీ తన ప్రజలు మాత్రం విడుదలవుతారని యెహోవా మాటిచ్చాడు, అది నెరవేరింది కూడా. అవును, యెహోవా ఏదైనా మాటిస్తే అది తప్పకుండా నిజమౌతుంది.—యెష. 55:11.

ఆధునిక కాలానికి ఉన్న పోలిక

6, 7. మన అవగాహనలో మార్పు ఎందుకు అవసరమైంది?

6 యూదులు బబులోనులో బందీలుగా ఉన్నట్లు క్రైస్తవులు కూడా ఎప్పుడైనా బందీలుగా ఉన్నారా? నమ్మకమైన క్రైస్తవులు 1918⁠లో మహాబబులోనుకు బందీలై 1919⁠లో విడుదలయ్యారని కావలికోట చాలా ఏళ్లపాటు చెప్తూ వచ్చింది. అయితే మన అవగాహనలో మార్పు ఎందుకు అవసరమైందో ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

7 దీన్ని పరిశీలించండి. మహాబబులోను అంటే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం. 1918⁠లో దేవుని ప్రజలు అబద్ధమతానికి బానిసలు కాలేదు. ఆ సమయంలో అభిషిక్తులకు హింసలు ఎదురైన మాట వాస్తవమే. కానీ అది ఎక్కువగా ప్రభుత్వాల నుండే వచ్చిందిగానీ అబద్ధమతం నుండి రాలేదు. నిజానికి, మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వడానికి ఎంతోకాలం ముందే దేవుని అభిషిక్త సేవకులు అబద్ధమతం నుండి వేరైపోవడం మొదలుపెట్టారు. కాబట్టి యెహోవా ప్రజలు 1918⁠లో మహాబబులోనుకు బందీలు కాలేదని చెప్పవచ్చు.

దేవుని ప్రజలు మహాబబులోనుకు ఎప్పుడు బందీలయ్యారు?

8. అపొస్తలులు చనిపోయిన తర్వాత ఏమి జరిగింది? (ప్రారంభ చిత్రం చూడండి.)

8 సా.శ. 33 పెంతెకొస్తు రోజున కొత్తగా క్రైస్తవులైన వేలమంది పవిత్రశక్తితో అభిషేకించబడ్డారు. వాళ్లు ‘ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజకసమూహంగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తయిన ప్రజలుగా’ అయ్యారు. (1 పేతురు 2:9, 10 చదవండి.) అపొస్తలులు బ్రతికున్నంతకాలం సంఘాల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే, ప్రాముఖ్యంగా అపొస్తలులు చనిపోయిన తర్వాత సంఘంలోని కొంతమంది అబద్ధ ఆలోచనల్ని బోధించడం మొదలుపెట్టారు. వాళ్లు శిష్యుల్ని సత్యం నుండి దూరం చేయాలనుకున్నారు. వాళ్లకు అరిస్టాటిల్‌, ప్లేటో చెప్పిన సిద్ధాంతాలు నచ్చి, దేవుని వాక్యంలోని సత్యానికి బదులు ఆ సిద్ధాంతాల్ని బోధించారు. (అపొ. 20:30; 2 థెస్స. 2:6-8) వాళ్లలో చాలామంది సంఘంలో ప్రముఖమైన వ్యక్తులుగా, పర్యవేక్షకులుగా ఉండేవాళ్లు. యేసు తన అనుచరులకు “మీరందరు సహోదరులు” అని చెప్పినప్పటికీ వాళ్లు తమను తాము మతగురువులుగా చెలామణి చేసుకోవడం ప్రారంభించారు.—మత్త. 23:8.

9. మతభ్రష్టమైన క్రైస్తవత్వం రోమా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎలా మొదలైందో వివరించండి. దాని ఫలితమేమిటి?

9 సా.శ. 313⁠లో అన్య దేశమైన రోమా సామ్రాజ్యాన్ని కాన్‌స్టెంటైన్‌ అనే చక్రవర్తి పరిపాలించాడు, అతను మతభ్రష్టత్వం ప్రారంభమైన క్రైస్తవత్వాన్ని అధికారిక మతంగా ప్రకటించాడు. ఆ తర్వాత నుండి చర్చికి సంబంధించిన వాళ్లు రోమా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, కాన్‌స్టెంటైన్‌ మతనాయకులతో ఓ మీటింగ్‌ జరిపాడు, అది కౌన్సిల్‌ ఆఫ్‌ నైసియాగా పేరు పొందింది. ఆ మీటింగ్‌ తర్వాత, అతను ఏరియస్‌ అనే మతగురువును దేశం నుండి వెళ్లగొట్టాడు. ఏరియస్‌, యేసే దేవుడని నమ్మడానికి ఒప్పుకోకపోవడమే దానికి కారణం. కొంతకాలానికి తియోడోసస్‌ రోమాకు చక్రవర్తి అయ్యాడు, అతను క్యాథలిక్‌ చర్చిని రోమా సామ్రాజ్యానికి అధికారిక మతంగా ప్రకటించాడు. అతని పరిపాలనలోనే అన్యదేశమైన రోమా ‘క్రైస్తవ’ దేశంగా మారిందని చరిత్రకారులు చెప్తారు. కానీ నిజమేంటంటే, అప్పటికే మతభ్రష్టులైన క్రైస్తవులు అన్యమత బోధల్ని అంగీకరించారు. కాబట్టి వాళ్లు అప్పటికే మహాబబులోనులో భాగమయ్యారు. కానీ నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు ఇంకా కొంతమంది మిగిలివున్నారు. వాళ్లు యేసు చెప్పిన గోధుమల్లా ఉన్నారు. ఈ నమ్మకమైనవాళ్లు, దేవున్ని ఆరాధించడానికి చేయగలిగినదంతా చేశారుగానీ వాళ్లు చెప్పేవాటిని ఎవ్వరూ వినేవాళ్లు కాదు. (మత్తయి 13:24, 25, 37-39 చదవండి.) వాళ్లు నిజంగానే మహాబబులోనుకు బందీలుగా ఉన్నారు.

10. ప్రజలు చర్చి బోధల్ని ప్రశ్నించడం ఎందుకు మొదలుపెట్టారు?

10 క్రీస్తు శకంలోని మొదటి కొన్ని వందల సంవత్సరాల వరకు చాలామంది గ్రీకులోగానీ, లాటిన్‌ భాషలోగానీ బైబిలు చదవగలిగేవాళ్లు. చర్చిలో చెప్పే బోధల్ని దేవుని వాక్యం చెప్తున్నవాటితో పోల్చి చూసుకునేవాళ్లు. చర్చి బోధిస్తున్న విషయాలు తప్పని తెలుసుకున్న కొంతమంది వాటిని తిరస్కరించారు. కానీ వాళ్లు తమ అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పడం ప్రమాదకరం, ఎందుకంటే అలా చెప్పేవాళ్లను చంపేసేవాళ్లు కూడా.

11. మతగురువులు బైబిల్ని ఏవిధంగా తమ ఆధీనంలో ఉంచుకున్నారు?

11 కాలం గడిచేకొద్దీ గ్రీకు, లాటిన్‌ భాషల్ని మాట్లాడే ప్రజలు తక్కువైపోయారు. ప్రజలు సాధారణంగా మాట్లాడే భాషల్లోకి బైబిల్ని అనువదించడానికి చర్చి నాయకులు ఒప్పుకోలేదు. దానివల్ల కేవలం మతనాయకులు, కొంతమంది చదువుకున్నవాళ్లు మాత్రమే బైబిల్ని చదవగలిగేవాళ్లు. పైగా మతనాయకులందరికి చదవడం, రాయడం సరిగ్గా వచ్చేదికాదు. చర్చి బోధల్ని వ్యతిరేకించేవాళ్లను తీవ్రంగా శిక్షించేవాళ్లు. అయితే నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు చిన్నచిన్న గుంపులుగా కలుసుకోవాల్సి వచ్చేది, కొంతమంది అస్సలు కలుసుకోలేక పోయేవాళ్లు. బబులోనులో బందీలుగా ఉన్నవాళ్లలాగే అభిషిక్త ‘రాజులైన యాజకసమూహం’ కూడా ఓ క్రమపద్ధతిలో ఆరాధించలేకపోయింది. మహాబబులోను ప్రజల్ని తన గుప్పిట్లో ఉంచుకుంది.

వెలుగు కనిపించడం మొదలైంది

12, 13. ఆధ్యాత్మిక చీకటిని చీల్చే వెలుగు కిరణాలు రావడానికి సహాయపడిన రెండు కారణాలు ఏమిటి? వివరించండి.

12 నిజ క్రైస్తవులు ఎప్పటికైనా యెహోవాను స్వేచ్ఛగా, ఆయన అంగీకరించే విధంగా ఆరాధించగలరా? ఆరాధించగలరు. ఎందుకంటే ఆధ్యాత్మిక చీకటిని చీల్చుకుంటూ వెలుగు కిరణాలు వచ్చాయి, అందుకు రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, కదిలించగలిగే ప్రింటింగ్‌ ప్రెస్‌ను 1450⁠లో కనుక్కోవడం. దాన్ని కనుక్కోకముందు బైబిల్ని చేతితో నకలు రాయాల్సివచ్చేది, అది చాలా కష్టం. నకలు రాయడంలో నైపుణ్యమున్న వ్యక్తి ఒక్క బైబిల్ని నకలు రాయడానికి పది నెలలు పట్టేది. పైగా వాటిని జంతు చర్మాలపై రాసేవాళ్లు కాబట్టి బైబిలు నకలు చాలా అరుదుగా దొరికేవి, ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. ఏదేమైనా ఓ నైపుణ్యంగల వ్యక్తి ప్రింటింగ్‌ ప్రెస్‌, పేపరు సహాయంతో రోజుకు 1,300 కన్నా ఎక్కువ పేజీలు ప్రింట్‌ చేయగలిగేవాడు.

ప్రింటింగ్‌ ప్రెస్‌ను కనుక్కోవడం, ధైర్యవంతులైన బైబిలు అనువాదకులు చూపించిన ఉత్సాహం మహాబబులోను నుండి విడుదలవ్వడానికి సహాయపడ్డాయి (12, 13 పేరాలు చూడండి)

13 రెండవ కారణం బైబిల్ని అనువదించడం. 16వ శతాబ్దం మొదట్లో ధైర్యవంతులైన కొంతమంది, దేవుని వాక్యాన్ని ప్రజలు మాట్లాడే సాధారణ భాషల్లోకి అనువదించారు. అలా అనువదిస్తున్నారని తెలిస్తే చంపేస్తారని తెలిసి కూడా వాళ్లు ఆ పనిని చేశారు. బైబిల్ని అనువదిస్తున్నారని తెలుసుకున్న మతనాయకులు భయపడిపోయారు. ఎందుకు? ఎందుకంటే నిజమైన ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా తమ భాషలో బైబిల్ని చదివితే, ‘నరకం గురించి బైబిల్లో ఎక్కడుంది? అంత్యక్రియలు చేసే మతగురువుకు డబ్బులివ్వాలని బైబిల్లో ఎక్కడ ఉంది? పోప్‌లు, బిషప్‌లు గురించి ఏ లేఖనాల్లో ఉంది?’ అని అడుగుతారని వాళ్లు ఆందోనళపడ్డారు. చర్చి బోధలు చాలావరకు, క్రీస్తు శకం కన్నా వందల సంవత్సరాల ముందు జీవించిన అరిస్టాటిల్‌, ప్లేటోల సిద్ధాంతాల మీదే ఆధారపడి ఉండేవి. ప్రజలు తమను ప్రశ్నించినప్పుడు మతనాయకులకు కోపమొచ్చింది, దాంతో తమ బోధల్ని వ్యతిరేకించిన స్త్రీపురుషుల్ని వాళ్లు చంపేశారు. ప్రజల్ని బైబిలు చదవనివ్వకుండా, తమను ప్రశ్నించకుండా చేయాలని అనుకున్నారు. చాలావరకు అదే జరిగింది కూడా. కానీ ధైర్యవంతులైన కొంతమంది మాత్రం మహాబబులోను గుప్పిట్లోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. వాళ్లు దేవుని వాక్యంలోని సత్యం తెలుసుకున్నారు, మరింత తెలుసుకోవాలని కోరుకున్నారు. అబద్ధమతం నుండి విడుదలయ్యే కాలానికి వాళ్లు దగ్గరౌతూ వచ్చారు.

14. (ఎ) బైబిల్ని అధ్యయనం చేయాలనుకున్న ప్రజలు ఏమి చేశారు? (బి) సత్యం తెలుసుకోవడానికి సహోదరుడు రస్సెల్‌ చేసిన కృషిని వివరించండి.

14 చాలామంది ప్రజలు బైబిల్ని చదవాలని, అధ్యయనం చేయాలని, నేర్చుకున్న వాటిని ఇతరులకు చెప్పాలని కోరుకున్నారు. తాము ఏమి నమ్మాలో చర్చి నాయకులు చెప్పడం వాళ్లకు నచ్చలేదు. కాబట్టి బైబిల్ని స్వేచ్ఛగా అధ్యయనం చేసేందుకు వీలుండే దేశాలకు వాళ్లు వెళ్లిపోయారు. అలాంటి దేశాల్లో అమెరికా ఒకటి. అక్కడ 1870 కల్లా, ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ అలాగే ఇంకొంతమంది బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. మొదట సహోదరుడు రస్సెల్‌, ఏ మతం సత్యాన్ని బోధిస్తోందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే అతను క్రైస్తవమతాలని చెప్పుకుంటున్న వాటి బోధల్ని, ఇతర మతాల బోధల్ని కూడా బైబిలు చెప్తున్నవాటితో జాగ్రత్తగా పోల్చి చూశాడు. వాటిలో ఒక్క మతం కూడా దేవుని వాక్యాన్ని పూర్తిగా పాటించట్లేదని అతను కొంతకాలానికే గ్రహించాడు. ఒకానొక సమయంలోనైతే, సహోదరుడు రస్సెల్‌ కొంతమంది స్థానిక చర్చి నాయకులతో మాట్లాడాడు. అతనూ, అతని గుంపులోని వాళ్లూ కలిసి బైబిలు నుండి తెలుసుకున్న సత్యాల్ని ఆ నాయకులు అంగీకరిస్తారనీ, వాటిని తమ సంఘాల్లో బోధిస్తారనీ రస్సెల్‌ అనుకున్నాడు. కానీ ఆ మతనాయకులు ఆసక్తి చూపించలేదు. అబద్ధమతంతో సంబంధమున్న వాళ్లతో కలిసి దేవున్ని ఆరాధించలేమని బైబిలు విద్యార్థులు కొంతకాలానికే తెలుసుకున్నారు.—2 కొరింథీయులు 6:14 చదవండి.

15. (ఎ) నిజ క్రైస్తవులు మహాబబులోనుకు ఎప్పుడు బందీలయ్యారు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

15 చివరి అపొస్తలుడు చనిపోయిన వెంటనే నిజక్రైస్తవులు మహాబబులోనుకు బందీలయ్యారని ఈ ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. ఇంకా మనం జవాబులు తెలుసుకోవాల్సిన ప్రశ్నలు ఏమిటింటే: 1914 కన్నా ముందు సంవత్సరాల నుండి అభిషిక్తులు మహాబబులోనును విడిచి రావడం మొదలుపెట్టారని మనమెలా చెప్పవచ్చు? తన సేవకులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో చురుగ్గా ప్రకటనా పని చేయనందుకు యెహోవా సంతోషించలేదన్నది నిజమా? ఆ యుద్ధ సమయంలో మన సహోదరుల్లో కొంతమంది తమ నమ్మకాల విషయంలో రాజీపడి యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయారా? చివరిగా, ఒకవేళ అపొస్తలులు చనిపోయిన తర్వాత నిజక్రైస్తవులు మహాబబులోనుకు బందీలైవుంటే, వాళ్లు ఎప్పుడు విడుదలయ్యారు? ఇవి ఎంతో అద్భుతమైన ప్రశ్నలు. వీటికి జవాబుల్ని తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుందాం.