కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఇచ్చిన గ్రంథాన్ని మీరు గౌరవిస్తున్నారా?

యెహోవా ఇచ్చిన గ్రంథాన్ని మీరు గౌరవిస్తున్నారా?

“మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి.”1 థెస్స. 2:13.

పాటలు: 44, 40

1-3. యువొదియ, సుంటుకేల మధ్య ఏమి జరిగివుండవచ్చు? అలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలంటే ఏమి చేయాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

 బైబిలు దేవుడిచ్చిన గ్రంథమని మనకు తెలుసు కాబట్టి మనం దాన్నెంతో గౌరవిస్తాం. సమస్యల్ని అధిగమించేందుకు కావాల్సిన సలహాలు అందులో ఉన్నాయి. అంతేకాదు మనం ఏవైనా పొరపాట్లు చేసినప్పుడు మనల్ని సరిదిద్దుకునేందుకు సహాయం చేసే సలహాలు కూడా అందులో ఉన్నాయి. మరి వాటికి మనమెలా స్పందిస్తాం? మొదటి శతాబ్దంలోని యువొదియ, సుంటుకే అనే ఇద్దరు అభిషిక్త సహోదరీల గురించి ఓసారి ఆలోచించండి. వాళ్లిద్దరు ఓ విషయంలో వాదించుకున్నారని బైబిలు చెప్తోంది గానీ, దేనిగురించి వాదించుకున్నారో చెప్పట్లేదు. బహుశా ఏం జరిగి ఉండవచ్చో మనం కాసేపు ఊహించుకుందాం.

2 బహుశా యువొదియ కొంతమంది సహోదరసహోదరీల్ని తన ఇంటికి భోజనానికి పిలిచి ఉంటుంది. కానీ సుంటుకేని ఆమె పిలవలేదు. అయితే ఆరోజు వాళ్లంతా కలిసి భోజనం చేస్తూ ఎంతో ఆనందించారని విని సుంటుకే చాలా బాధపడింది. బహుశా సుంటుకే ఇలా అనుకుని ఉంటుంది: ‘యువొదియ నన్నెందుకు పిలవలేదో నాకు అస్సలు అర్థంకావట్లేదు. మేం చాలా మంచి స్నేహితులమని అనుకున్నాను.’ యువొదియకు తనంటే ఇష్టంలేదనీ, తనను దూరంపెడుతోందని సుంటుకే అనుకుంది. అందుకే ఈసారి సుంటుకే ఏం చేసిందంటే, యువొదియ పిలిచిన సహోదరసహోదరీల్నే భోజనానికి పిలిచిందిగానీ యువొదియను మాత్రం పిలవలేదు. జరిగినదానికి సంఘంలోని ఇతరులు కూడా బాధపడివుంటారు. అయితే పౌలు ఆ ఇద్దరు సహోదరీల్ని సరిదిద్ది, సమాధానపడమని ప్రోత్సహించాడని బైబిలు చెప్తోంది. బహుశా వాళ్లు అతనిచ్చిన సలహా విని, యెహోవా సేవలో సంతోషంగా కొనసాగివుంటారు.—ఫిలి. 4:2, 3.

3 నేడు మన సంఘాల్లో కూడా, ఓ సహోదరునితో లేదా సహోదరితో మనకు కొన్నిసార్లు సమస్య రావచ్చు. బైబిలు ఇచ్చిన సలహాను పాటిస్తే అలాంటి సమస్యల్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. నిజానికి, అవి రాకుండా కూడా చూసుకోగలుగుతాం. అంతేకాదు బైబిలు చెప్తున్నవాటిని పాటించినప్పుడు, యెహోవా ఇచ్చిన గ్రంథాన్ని నిజంగా గౌరవిస్తున్నామని చూపిస్తాం.—కీర్త. 27:11.

భావోద్వేగాల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో బైబిలు నేర్పిస్తుంది

4, 5. భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకునే విషయంలో బైబిలు ఏ సలహా ఇస్తోంది?

4 భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం ప్రతీసారి అంత సులువు కాదు. మన సంస్కృతి, రంగు, మనం కనిపించే తీరును బట్టి ఎవరైనా మనల్ని అవమానిస్తే, మనపట్ల పక్షపాతం చూపిస్తే మనకు చాలా బాధ కలగవచ్చు లేదా కోపం రావచ్చు. ఒకవేళ అలా చేసేది మన తోటి సహోదరుడు లేదా సహోదరి అయితే అది మనల్ని మరింత బాధిస్తుంది. ఈ విషయంలో దేవుని వాక్యం మనకు ఏ సలహా ఇస్తోంది?

5 మనుషులు తమ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోకపోతే ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు. మనం బాధలో లేదా కోపంలో ఉన్నప్పుడు ఏదోకటి అనేసి లేదా చేసేసి ఆ తర్వాత బాధపడతాం. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోమని సలహా ఇస్తూ యెహోవా ఇలా చెప్పాడు, “ఆత్రపడి కోపపడవద్దు.” ఈ సలహాను పాటిస్తూ త్వరగా కోపగించుకోవడం మానుకుంటే ఎన్ని సమస్యల్ని తప్పించుకోవచ్చో ఓసారి ఆలోచించండి. (ప్రసంగి 7:9; సామెతలు 16:32 చదవండి.) ఇతరుల్ని క్షమించమని కూడా బైబిలు చెప్తోంది. నిజానికి మనం ఇతరుల్ని క్షమించకపోతే యెహోవా మనల్ని క్షమించడని యేసు చెప్పాడు. (మత్త. 6:14, 15) మీ విషయమేమిటి? మీరు సహనాన్ని, క్షమించే గుణాన్ని మరింత వృద్ధిచేసుకోవాలా?

6. మన భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోకపోతే ఏమి జరగవచ్చు?

6 భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోకపోతే మన కోపం అలానే ఉంటుంది. చివరికి అది ద్వేషానికి దారితీస్తుంది. లేదా సంఘంలోని ఇతరులు కూడా మనలాంటి భావాల్నే కలిగివుండేలా చేస్తాం. ఒకవేళ మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని పైకి కనిపించకుండా ఉంచడానికి ప్రయత్నించినా కొంతకాలానికి అవి ఎలాగోలా ఇతరులకు తెలుస్తాయి. అప్పుడు మన తోటి సహోదరసహోదరీలు మనకు దూరమవ్వచ్చు. (సామె. 26:24-26) కాబట్టి ఇతరులమీద మనకున్న కోపాన్నీ, ద్వేషాన్నీ తీసివేసేందుకు, వాళ్లను క్షమించడానికి సహాయం చేసేందుకు సంఘపెద్దలు బైబిల్ని ఉపయోగిస్తారు. (లేవీ. 19:17, 18; రోమా. 3:11-18) అప్పుడు మనం యెహోవా ఇచ్చిన పుస్తకంలోని నిర్దేశాల్ని పాటిస్తామా?

యెహోవా మనల్ని నడిపిస్తున్నాడు

7, 8. (ఎ) యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాడు? (బి) బైబిల్లో ఉన్న నిర్దేశాల్లో కొన్ని ఏమిటి? వాటిని మనమెందుకు పాటించాలి?

7 నేడు తన సంస్థలోని భూభాగంలో ఉన్నవాళ్లను యెహోవా నడిపిస్తున్నాడు, వాళ్లకు బోధిస్తున్నాడు. ఎలా? ఆయన క్రీస్తును ‘సంఘానికి శిరస్సుగా’ నియమించాడు. క్రీస్తు ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుని’ ద్వారా దేవుని ప్రజలకు బోధించి వాళ్లను నడిపిస్తున్నాడు. (ఎఫె. 5:23; మత్త. 24:45-47) మొదటి శతాబ్దంలోని పరిపాలక సభలానే, ఈ దాసుడు కూడా బైబిల్ని దేవుని వాక్యమని నమ్ముతూ దాన్ని ఎంతో గౌరవిస్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 2:13 చదవండి.) బైబిల్లో ఉన్న నిర్దేశాల్లో కొన్ని ఏమిటి?

8 మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లాలనే నిర్దేశాన్ని బైబిలు మనకిస్తోంది. (హెబ్రీ. 10:24, 25) ఒకేలాంటి బైబిలు బోధల్ని నమ్మమని అది మనందర్నీ ప్రోత్సహిస్తోంది. (1 కొరిం. 1:10) అంతేకాదు ‘రాజ్యాన్ని మొదట వెదకమని’ అది చెప్తుంది. (మత్త. 6:33) ఇంటింటా, బహిరంగ ప్రదేశాల్లో, అలాగే ప్రజలు ఎక్కడుంటే అక్కడ సువార్త ప్రకటించమని బైబిలు మనకు నిర్దేశిస్తోంది. (మత్త. 28:19, 20; అపొ. 5:42; 17:17; 20:20, 21) సంఘాలను పవిత్రంగా ఉంచడానికి కావాల్సిన నిర్దేశాల్ని బైబిలు సంఘపెద్దలకు ఇస్తోంది. (1 కొరిం. 5:1-5, 13; 1 తిమో. 5:19-21) అంతేకాదు పరిశుభ్రంగా ఉండమని, యెహోవా అసహ్యించుకునే ఆలోచనలకు, అలవాట్లకు దూరంగా ఉండమని కూడా బైబిలు మనకు చెప్తోంది.—2 కొరిం. 7:1.

9. బైబిల్లోని విషయాల్ని అర్థంచేసుకునేలా ప్రజలకు సహాయం చేయడానికి యేసు ఎవర్ని నియమించాడు?

9 బైబిల్లోని విషయాల్ని అర్థంచేసుకోవడానికి తమకు ఎవరి సహాయం అవసరం లేదని కొంతమంది అనుకోవచ్చు. కానీ బైబిల్లోని నిర్దేశాల్ని అర్థంచేసుకొని, వాటిని పాటించేలా ప్రజలకు సహాయం చేయడానికి యేసు 1919 నుండి ‘నమ్మకమైన, బుద్ధిగల దాసున్ని’ ఉపయోగించుకుంటున్నాడు. బైబిలు చెప్తున్నవాటిని పాటిస్తే మనం సంఘాన్ని పవిత్రంగా, సమాధానంగా, ఐక్యంగా ఉంచుతాం. కాబట్టి మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను యేసుకు నమ్మకంగా ఉంటూ, నమ్మకమైన దాసుడిచ్చే నిర్దేశాన్ని పాటిస్తానా?’

యెహోవా రథం వేగంగా వెళ్తోంది

10. యెహెజ్కేలు పుస్తకం యెహోవా సంస్థలోని పరలోక భాగాన్ని ఎలా వర్ణిస్తోంది?

10 పరలోకంలోని తన సేవకుల్ని కూడా యెహోవా ఓ క్రమపద్ధతిలో నడిపిస్తున్నాడని బైబిలు నుండి తెలుసుకున్నాం. ఉదాహరణకు యెహెజ్కేలు ఓ దర్శనంలో యెహోవా ఒక రథాన్ని నడపడం చూశాడు. యెహోవా ఎటువైపు నడిపిస్తే అటువైపు ఆ రథం వేగంగా వెళ్లడాన్ని యెహెజ్కేలు చూశాడు. (యెహె. 1:4-28) ఆ రథం యెహోవా సంస్థలోని పరలోక భాగాన్ని సూచిస్తోంది, అది ఆయనిచ్చే నిర్దేశాన్ని వెంటనే పాటిస్తుంది. అంతేకాదు అది ఆయన సంస్థలోని భూభాగం పై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు గత పది సంవత్సరాల్లో దేవుని సంస్థలో వచ్చిన ఎన్నో మార్పుల గురించి ఆలోచించండి. ఆ మార్పులన్నిటినీ యెహోవాయే చేయిస్తున్నాడని గుర్తుంచుకోండి. క్రీస్తు అలాగే దూతలు ఈ దుష్టలోకాన్ని నాశనం చేసే రోజు దగ్గరపడుతుండగా, యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించేందుకు, ఆయన పేరును పరిశుద్ధపర్చేందుకు ఆయన రథం వేగంగా దూసుకెళ్తోంది.

ఎంతో కష్టపడి నిర్మాణపని చేస్తున్న స్వచ్ఛంద సేవకులకు మనం ఎంతో కృతజ్ఞత కలిగివున్నాం. (11వ పేరా చూడండి)

11, 12. యెహోవా సంస్థ ఈ చివరిరోజుల్లో ఏమేమి సాధించింది?

11 యెహోవా సంస్థ ఈ చివరిరోజుల్లో సాధిస్తున్న వాటిగురించి ఆలోచించండి. నిర్మాణపని. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న వార్విక్‌లో యెహోవాసాక్షుల కొత్త ప్రధాన కార్యాలయాన్ని నిర్మించడానికి వందలమంది సహోదరసహోదరీలు కష్టపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమంది స్వచ్ఛంద సేవకులు రాజ్యమందిరాల్ని, బ్రాంచి కార్యాలయాల్ని నిర్మిస్తున్నారు. వరల్డ్‌వైడ్‌ డిజైన్‌/కన్స్‌ట్రక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్దేశం కింద ఈ స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నారు. ఇలాంటి బిల్డింగుల్ని ఎంతో కష్టపడి నిర్మిస్తున్న వాళ్లకు మనమెంతో కృతజ్ఞత కలిగివున్నాం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా సేవకులు తాము ఇవ్వగలిగినంత డబ్బు ఇస్తూ వీటిని నిర్మించేందుకు సహాయం చేస్తున్నారు. వినయాన్ని, నమ్మకాన్ని చూపిస్తున్నందుకు యెహోవా తన ప్రజల్ని దీవిస్తాడు.—లూకా 21:1-4.

12 విద్య. తన ప్రజలకు బోధించడమంటే యెహోవాకు ఎంతో ఇష్టం. (యెష. 2:2, 3) అందుకోసం ఆయన ఏర్పాటు చేసిన వేర్వేరు పాఠశాలల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, పయినీరు సేవా పాఠశాల, రాజ్య సువార్తికుల కోసం పాఠశాల, గిలియడ్‌ పాఠశాల, బెతెల్‌ ప్రవేశ పాఠశాల, ప్రాంతీయ పర్యవేక్షకులకు వాళ్ల భార్యలకు పాఠశాల, సంఘ పెద్దల కోసం పాఠశాల, రాజ్య పరిచర్య పాఠశాల, బ్రాంచి కమిటీ సభ్యులకు వాళ్ల భార్యలకు పాఠశాల. అంతేకాదు మన jw.org వెబ్‌సైట్‌లో వందల భాషల్లో బైబిళ్లు, ఇతర ప్రచురణలు ఉన్నాయి. వాటితోపాటు పిల్లల కోసం, కుటుంబం కోసం అలాగే వార్తల కోసం ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయి (ఈ సెక్షన్‌ ఇంగ్లీషులో అందుబాటులో ఉంది). మీరు పరిచర్యలో, కుటుంబ ఆరాధనలో jw.org వెబ్‌సైట్‌ ఉపయోగిస్తున్నారా?

యెహోవాకు నమ్మకంగా ఉంటూ ఆయన సంస్థకు మద్దతివ్వండి

13. యెహోవా ప్రజలపై ఏ బాధ్యత ఉంది?

13 యెహోవా సంస్థలో భాగంగా ఉండడం, ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోవడం మనకు దొరికిన గొప్ప గౌరవం. ఆయనకు ఇష్టమైనవేమిటో తెలుసుకున్నాం కాబట్టి ఆయన మాట వింటూ, సరైనది చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. చాలామంది చెడు చేయడానికే ఇష్టపడినప్పటికీ మనం మాత్రం యెహోవాలా ‘చెడుతనాన్ని అసహ్యించుకోవాలి.’ (కీర్త. 97:10) ‘కీడు మేలని, మేలు కీడని’ అనుకునేవాళ్లలా మనం ఎన్నడూ ఉండకూడదు. (యెష. 5:20) మనం యెహోవాను సంతోషపెట్టాలని కోరుకుంటాం కాబట్టి అన్ని విషయాల్లో పవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. (1 కొరిం. 6:9-11) బైబిల్లో యెహోవా చెప్పేవన్నీ మన మంచికే. మనం యెహోవాను ప్రేమిస్తాం, ఆయనకు నమ్మకంగా ఉండాలనుకుంటాం. అందుకే ఆయన ఇచ్చే నిర్దేశాల్ని ఇంట్లో, సంఘంలో, ఉద్యోగ స్థలంలో, స్కూల్లో, ఎక్కడున్నా సరే పాటిస్తాం. (సామె. 15:3) మనం యెహోవాకు నమ్మకంగా ఉండాల్సిన కొన్ని విషయాల గురించి ఓసారి ఆలోచించండి.

14. తల్లిదండ్రులు యెహోవాకు ఏవిధంగా నమ్మకంగా ఉండవచ్చు?

14 పిల్లలకు శిక్షణ ఇవ్వడం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలో తెలిపే నిర్దేశాల్ని యెహోవా బైబిల్లో ఇచ్చాడు. లోకంలో సర్వసాధారణమైపోయిన ఆలోచనా విధానం తమపై ప్రభావం చూపించకుండా క్రైస్తవులు జాగ్రత్తపడాలి. (ఎఫె. 2:2) ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లోని తండ్రులు, ‘మా దేశంలో, పిల్లలకు బోధించాల్సిన బాధ్యత స్త్రీలదే’ అని అనుకోవచ్చు. కానీ యెహోవా గురించి తమ పిల్లలకు బోధించాల్సిన బాధ్యత తండ్రులకు ఉందని బైబిలు స్పష్టంగా చెప్తోంది. (ఎఫె. 6:4) సమూయేలులాగే తమ పిల్లలు కూడా చిన్నప్పటినుండి యెహోవాతో దగ్గరి సంబంధం కలిగివుండాలని యెహోవాను ప్రేమించే తల్లిదండ్రులు కోరుకుంటారు.—1 సమూ. 3:19.

15. పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఎలా యెహోవాకు నమ్మకంగా ఉండవచ్చు?

15 నిర్ణయాలు తీసుకోవడం. జీవితంలో పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెహోవాకు నమ్మకంగా ఉండాలంటే ఆయన ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలి. అందుకు బైబిలు, దేవుని సంస్థ మనకు సహాయం చేయగలవు. ఉదాహరణకు కొంతమంది తల్లిదండ్రులు తమ దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్తున్నారు. వాళ్లకు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల్ని తమ దేశంలోని బంధువుల దగ్గరకు పంపించాలని నిర్ణయించుకుంటున్నారు. అప్పుడు తాము పనిచేస్తూ డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. నిజమే, ఇది భార్యాభర్తలు తీసుకోవాల్సిన వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ వాళ్లిలా ప్రశ్నించుకోవాలి, ‘మేం తీసుకునే నిర్ణయం గురించి యెహోవా ఏమి అనుకుంటాడు?’ (రోమీయులు 14:11, 12 చదవండి.) అవును కుటుంబానికి, ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బైబిలు ఏమి చెప్తుందో తెలుసుకోవడం తెలివైన పని. మనంతట మనం సరైన దారిలో నడవలేం కాబట్టి మనకు మన తండ్రి సహాయం అవసరం.—యిర్మీ. 10:23.

16. తనకు కొడుకు పుట్టినప్పుడు ఓ తల్లి ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? సరైన నిర్ణయం తీసుకునేందుకు ఆమెకు ఏమి సహాయం చేసింది?

16 ఒక జంట వేరే దేశంలో ఉన్నప్పుడు వాళ్లకు ఓ కొడుకు పుట్టాడు. దాంతో వాళ్లు ఆ బాబును తమ సొంత దేశంలో ఉంటున్న తమ తల్లిదండ్రుల దగ్గరకు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే ఆ బాబు తల్లి యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది, తన కొడుకుకు యెహోవా గురించి బోధించే బాధ్యత తనకుందని ఆమె నేర్చుకుంది. (కీర్త. 127:3; సామె. 22:6) దాంతో ఆమె బైబిలు చెప్తున్నట్లుగా యెహోవాకు ప్రార్థించి, సరైనదాన్ని చేసేందుకు సహాయం చేయమని వేడుకుంది. (కీర్త. 62:7, 8) అంతేకాదు తనకు స్టడీ ఇస్తున్న సహోదరితో, సంఘంలోని ఇతరులతో ఆ సమస్య గురించి మాట్లాడింది. బాబును తమ తల్లిదండ్రుల దగ్గరకు పంపించాలని బంధువులు, స్నేహితులు పదేపదే చెప్తున్నప్పటికీ, అలా చేయడం సరైనది కాదని ఆమె నిర్ణయించుకుంది. ఆమె భర్త కూడా, సహోదరసహోదరీలు తన భార్యకు, కొడుకుకు ఎంత సహాయం చేశారో గమనించాడు. అది అతనికి చాలా నచ్చి అతను కూడా బైబిలు స్టడీ తీసుకుంటూ, కుటుంబంతోపాటు మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. యెహోవా తన ప్రార్థనకు జవాబివ్వడం చూసి ఆ బాబు తల్లి ఎంత సంతోషించి ఉంటుందో ఊహించండి.

17. ఎవరితోనైనా స్టడీ చేస్తున్నప్పుడు మనం ఏ నిర్దేశాన్ని పాటించాలి?

17 నిర్దేశాల్ని పాటించడం. మనం దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని పాటిస్తాం. ఉదాహరణకు ఎవరితోనైనా బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంతో స్టడీ చేయడం మొదలుపెట్టిన వెంటనే మనమేమి చేయాలో ఆలోచించండి. స్టడీ అయిపోయిన ప్రతీసారి కొన్ని నిమిషాలు యెహోవా సంస్థ గురించి మరింత తెలుసుకోవడానికి విద్యార్థికి సహాయం చేయమని సంస్థ చెప్పింది. అందుకోసం మనం, రాజ్యమందిరం అంటే ఏమిటి? అనే వీడియోను, నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? అనే బ్రోషురును ఉపయోగించవచ్చు. బైబిలు బోధిస్తోంది పుస్తకం పూర్తయ్యాక ‘విశ్వాసంలో స్థిరంగా’ ఉండేలా విద్యార్థికి సహాయం చేయడానికి దేవుని ప్రేమలో నిలిచి ఉండండి అనే పుస్తకంతో స్టడీ చేయవచ్చు. ఒకవేళ వాళ్లు బాప్తిస్మం తీసుకున్నాసరే దాన్ని కొనసాగించవచ్చు. (కొలొ. 2:6, 7) మరి యెహోవా సంస్థ ఇస్తున్న ఈ నిర్దేశాన్ని మీరు పాటిస్తున్నారా?

18, 19. మనం యెహోవా పట్ల కృతజ్ఞత కలిగివుండడానికి కొన్ని కారణాలు ఏమిటి?

18 మనం యెహోవాకు కృతజ్ఞత చూపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆయనవల్లే మనం ‘బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఉనికిలో ఉన్నాం.’ (అపొ. 17:26-28) మరొకటి ఏమిటంటే, ఆయన మనకోసం తన వాక్యమైన బైబిల్ని ఇచ్చాడు. థెస్సలోనికలోని క్రైస్తవుల్లానే మనం కూడా ఆ బహుమతిని గౌరవిస్తాం, ఎందుకంటే అది యెహోవా నుండి వచ్చిన సందేశం.—1 థెస్స. 2:13.

19 మనం యెహోవాకు దగ్గరవ్వడానికి బైబిలు సహాయం చేసింది, దానివల్ల యెహోవా కూడా మనకు దగ్గరయ్యాడు. (యాకో. 4:8) అంతేకాదు తన సంస్థలోకి రమ్మని మన తండ్రి మనల్ని ఆహ్వానించినందుకు ఆయనకు మనమెంతో రుణపడి ఉన్నాం. మనం కూడా కీర్తనకర్తలానే భావిస్తాం. అతనిలా రాశాడు, “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.” (కీర్త. 136:1) ఆ కీర్తనలోని ప్రతీ వచనంలో, “ఆయన కృప నిరంతరముండును” అని కీర్తనకర్త రాశాడు. నిజమే, మనం యెహోవాకు నమ్మకంగా ఉంటూ తన సంస్థ ద్వారా ఆయనిచ్చే నిర్దేశాల్ని పాటిస్తే, ఆయన మనకు నిత్యజీవం ఇస్తాడు, ఆయన కూడా మనకు నిరంతరం నమ్మకంగా ఉంటాడు.