కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ బహుమానం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి

మీ బహుమానం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి

“ఎవరి వల్లా మీ బహుమానం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి.”కొలొ. 2:18.

పాటలు: 122, 139

1, 2. (ఎ) దేవుని సేవకులు ఏ బహుమానం కోసం ఎదురుచూస్తున్నారు? (బి) బహుమానం పై మనసు పెట్టేందుకు ఏది మనకు సహాయం చేస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

 అభిషిక్త క్రైస్తవులకు పరలోకంలో జీవించే అద్భుతమైన నిరీక్షణ ఉంది. దాన్నే “దేవుని నుండి వచ్చే పరలోక పిలుపు అనే బహుమానం” అని అపొస్తలుడైన పౌలు వర్ణించాడు. (ఫిలి. 3:14) అభిషిక్త క్రైస్తవులు పరలోకంలో యేసుక్రీస్తుతోపాటు పరిపాలిస్తారు, మనుషులు పరిపూర్ణులుగా అయ్యేందుకు సహాయం చేస్తారు. (ప్రక. 20:6) అది ఎంతటి గొప్ప నిరీక్షణ! వేరేగొర్రెలు మరో రకమైన బహుమానం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లకు భూపరదైసులో శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉంది, దాన్నిబట్టి వాళ్లు ఎంతో సంతోషిస్తారు.—2 పేతు. 3:13.

2 తన తోటి అభిషిక్త క్రైస్తవులు చివరివరకు నమ్మకంగా ఉండి బహుమానం గెల్చుకునేలా సహాయం చేయాలని పౌలు కోరుకున్నాడు. ఆయనిలా అన్నాడు, “పైనున్నవాటి మీదే మనసు పెట్టండి.” (కొలొ. 3:2) అవును, వాళ్లు తమకున్న అద్భుతమైన పరలోక నిరీక్షణ మీద మనసుపెట్టాలి. (కొలొ. 1:4, 5) పరలోక నిరీక్షణగల వాళ్లయినా, భూనిరీక్షణగల వాళ్లయినా యెహోవా ఇచ్చే ఆశీర్వాదాల గురించి ఆలోచించడంవల్ల తమ బహుమానం మీద మనసు పెట్టగలుగుతారు.—1 కొరిం. 9:24.

3. పౌలు క్రైస్తవుల్ని దేనిగురించి హెచ్చరించాడు?

3 బహుమానాన్ని పోగొట్టుకునేలా చేయగల విషయాల గురించి కూడా పౌలు క్రైస్తవులను హెచ్చరించాడు. ఉదాహరణకు, క్రీస్తుపై విశ్వాసం ఉంచే బదులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవున్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్న అబద్ధ క్రైస్తవుల గురించి ఆయన కొలస్సయులకు రాశాడు. (కొలొ. 2:16-18) మనకాలంలో కూడా ఎలాంటి విషయాలు మన బహుమానాన్ని పోగొట్టుకునేలా చేయగలవో పౌలు చెప్పాడు. అంతేకాదు మనం తప్పుడు కోరికలతో ఎలా పోరాడాలో, తోటి సహోదరులతో లేదా కుటుంబసభ్యులతో సమస్యలు వచ్చినప్పుడు ఏమి చేయాలో వివరించాడు. పౌలు ఇచ్చిన విలువైన సలహా నేడు కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి కొలస్సయులకు ఆయన రాసిన ఉత్తరంలోని ప్రేమపూర్వక సలహాల్లో కొన్నిటిని పరిశీలిద్దాం.

తప్పుడు కోరికల్ని చంపేసుకోండి

4. తప్పుడు కోరికల వల్ల ఏమి జరిగే ప్రమాదం ఉంది?

4 తమకున్న అద్భుతమైన నిరీక్షణ గురించి తన సహోదరులకు గుర్తుచేసిన తర్వాత పౌలు ఇలా అన్నాడు, “కాబట్టి, భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి. లైంగిక పాపాలు, అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ, చెడు కోరిక . . . అత్యాశ వంటివి వాటిలో నుండే పుడతాయి.” (కొలొ. 3:5) తప్పుడు కోరికలు చాలా బలమైనవి. అవి యెహోవాతో మనకున్న సంబంధాన్ని, మన భవిష్యత్తు నిరీక్షణను కోల్పోయేలా చేయగలవు. తప్పుడు కోరికలకు లొంగిపోయిన ఒక సహోదరుడు, తిరిగి సంఘంలోకి చేర్చుకోబడిన తర్వాత ఇలా చెప్పాడు, “వాటినుండి బయటపడడానికి నాకు చాలా కాలం పట్టింది.”

5. నైతికంగా ప్రమాదంలో పడకుండా మనమెలా జాగ్రత్త పడవచ్చు?

5 యెహోవా ఏర్పాటు చేసిన నైతిక ప్రమాణాల విషయంలో రాజీపడే పరిస్థితి ఎదురైనప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, కోర్ట్‌షిప్‌లో ఉన్న జంట ముట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం, ఏకాంతంగా సమయం గడపడం వంటి విషయాల్లో ముందు నుండే హద్దులు పెట్టుకోవడం తెలివైన పని. (సామె. 22:3) అంతేకాదు, ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్లినప్పుడు లేదా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పనిచేస్తున్నప్పుడు నైతిక ప్రమాణాలు ఉల్లంఘించే పరిస్థితులు రావచ్చు. (సామె. 2:10-12, 16) అలాంటప్పుడు మీరు ప్రమాదంలో పడకూడదంటే ఏమి చేయవచ్చు? మీరొక యెహోవాసాక్షి అని వాళ్లకు చెప్పండి. మర్యాదపూర్వకంగా ప్రవర్తించండి, సరసాలాడడం ఘోరమైన పరిస్థితులకు దారితీయవచ్చని మర్చిపోకండి. అంతేకాదు బాధలో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకరు మనల్ని ఓదారిస్తే బాగుండని అనిపించవచ్చు. అలాంటి పరిస్థితిలో భావోద్వేగపరంగా చాలా బలహీనంగా ఉంటాం, కాబట్టి ఎవ్వరు శ్రద్ధ చూపించినా వాళ్లకు లొంగిపోతాం, కానీ అది ప్రమాదకరం. మీకెప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైతే, బహుమానాన్ని పోగొట్టుకోవడానికి దారితీసే ఏ పనీ చేయకండి. సహాయం కోసం యెహోవాను, తోటి సహోదర సహోదరీలను అడగండి.—కీర్తన 34:18; సామెతలు 13:20 చదవండి.

6. మనం ఎలాంటి వినోదానికి దూరంగా ఉండాలి?

6 తప్పుడు కోరికల్ని చంపేసుకోవాలంటే, అనైతిక వినోదానికి మనం దూరంగా ఉండాలి. నేడున్న వినోదం చాలావరకు ఒకప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న విషయాల్నే గుర్తుచేస్తుంది. (యూదా 7) వినోద కార్యక్రమాల్ని తయారు చేస్తున్నవాళ్లు లైంగిక అనైతికత మామూలు విషయమేనని, దానివల్ల ఏ హాని లేదని అనిపించేలా చేస్తున్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలోని అన్నిరకాల వినోదాన్ని ఆనందించాలని మనం అనుకోకూడదు. బదులుగా, జీవమనే బహుమానాన్ని గెల్చుకోవాలంటే వినోదాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.—సామె. 4:23.

ప్రేమను, దయను “అలవర్చుకోండి”

7. క్రైస్తవ సంఘంలో ఎలాంటి సమస్యలు రావచ్చు?

7 క్రైస్తవ సంఘంలో ఒకరిగా ఉన్నందుకు మనం సంతోషిస్తాం. మీటింగ్స్‌లో బైబిలు గురించి మనం లోతుగా తెలుసుకుంటాం, ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటూ మద్దతిచ్చుకుంటాం. ఇవన్నీ బహుమానం మీద మనసుపెట్టడానికి మనకు సహాయం చేస్తాయి. కానీ కొన్నిసార్లు మనస్పర్థలవల్ల సహోదరసహోదరీలతో సమస్యలు రావచ్చు. వాటిని పరిష్కరించుకోకపోతే, మనసులో వాళ్లపై కోపం పెరుగుతుంది.—1 పేతురు 3:8, 9 చదవండి.

8, 9. (ఎ) బహుమానాన్ని గెల్చుకోవడానికి మనకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి? (బి) సహోదరసహోదరీలు ఎవరైనా మనల్ని బాధపెడితే మనం ఏమి చేయాలి?

8 కోపం పెంచుకోవడంవల్ల బహుమానాన్ని పోగొట్టుకోకూడదంటే ఏమి చేయాలి? క్రైస్తవులు ఏమి చేయాలో పౌలు ఇలా వివరించాడు, “మీరు దేవుడు ఎంచుకున్న వ్యక్తులు, పవిత్రులు, ఆయన ప్రేమించేవాళ్లు కాబట్టి వాత్సల్యంతో కూడిన ప్రేమను, కనికరాన్ని, దయను, వినయాన్ని, సౌమ్యతను, ఓర్పును అలవర్చుకోండి. ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరులు మిమ్మల్ని నొప్పించినా సరే అలా చేయండి. యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి. అయితే, వీటన్నిటికన్నా ముఖ్యంగా, ప్రేమను అలవర్చుకోండి. ఎందుకంటే ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఒకటి చేస్తుంది.”—కొలొ. 3:12-14.

9 ఇతరుల్ని క్షమించడానికి మనకు ప్రేమ, దయ సహాయం చేస్తాయి. కొన్నిసార్లు ఇతరులు తమ మాటలవల్ల లేదా పనులవల్ల మనల్ని బాధపెట్టవచ్చు. అలాంటప్పుడు, గతంలో మనవల్ల బాధపడినవాళ్లు మనల్ని క్షమించిన సందర్భాల్ని గుర్తుచేసుకోవాలి. వాళ్లు చూపించిన ప్రేమకు, దయకు ఎంత కృతజ్ఞులమో కదా! (ప్రసంగి 7:21, 22 చదవండి.) సత్యారాధకులను దయతో ఐక్యం చేస్తున్నందుకు క్రీస్తుకు మనం కృతజ్ఞులం. (కొలొ. 3:15) మనందరం ఒకే దేవున్ని ప్రేమిస్తున్నాం, ఒకే సందేశాన్ని ప్రకటిస్తున్నాం, చాలావరకు ఒకేలాంటి సమస్యల్నే అనుభవిస్తున్నాం. మనం దయ, ప్రేమ, క్షమాగుణం చూపిస్తే సంఘం మరింత ఐక్యంగా ఉంటుంది. అంతేకాదు బహుమానం మీదే మనసు పెట్టగలుగుతాం.

10, 11. (ఎ) ఈర్ష్య ఎందుకు ప్రమాదకరమైన లక్షణం? (బి) ఈర్ష్య కారణంగా బహుమానాన్ని పోగొట్టుకోకూడదంటే ఏమి చేయాలి?

10 ఈర్ష్య కారణంగా కూడా బహుమానాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆ లక్షణం ఎంత ప్రమాదకరమైనదో బైబిలు ఉదాహరణలు చెప్తున్నాయి. ఉదాహరణకు, కయీను ఈర్ష్యతో హేబెలును చంపేశాడు. కోరహు, దాతాను, అబీరాములు ఈర్ష్యపడి మోషేకు ఎదురుతిరిగారు. అదేవిధంగా సౌలు ఈర్ష్య వల్ల దావీదును చంపడానికి ప్రయత్నించాడు. “అసూయ, గొడవలకు దిగే మనస్తత్వం ఉన్నచోట గందరగోళం, నీచమైన ప్రతీది ఉంటాయి” అని బైబిలు చెప్తున్న మాటలు అక్షరాల నిజం.—యాకో. 3:16.

11 నిజమైన ప్రేమ, దయను అలవర్చుకోవడానికి మనం కృషి చేసినప్పుడు ఇతరులపట్ల ఈర్ష్యపడం. బైబిలు ఇలా చెప్తుంది, “ప్రేమ ఓర్పు కనబరుస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ ఈర్ష్యపడదు.” (1 కొరిం. 13:4) మన వ్యక్తిత్వంలో ఈర్ష్య ఒక భాగం కాకూడదంటే, విషయాల్ని యెహోవా చూసినట్టు చూడాలి. తోటి సహోదరసహోదరీల్ని ఒకే శరీరంలోని అవయవాల్లా చూడాలి. ఆ శరీరమే సంఘం. బైబిలు ఇలా చెప్తుంది, “ఒక అవయవం ఘనత పొందితే, మిగతా అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.” (1 కొరిం. 12:16-18, 26) మన సహోదరుల్లో ఎవరికైనా మంచి జరిగితే వాళ్లతోపాటు మనమూ సంతోషిస్తాం గానీ ఈర్ష్యపడం. సౌలు కొడుకైన యోనాతాను ఉంచిన మంచి ఆదర్శం గురించి ఆలోచించండి. దేవుడు దావీదును రాజుగా ఎంపిక చేసుకున్నప్పుడు యోనాతాను ఈర్ష్యపడలేదు. పైగా ఆయన దావీదును ప్రోత్సహించి, మద్దతిచ్చాడు. (1 సమూ. 23:16-18) మనం కూడా యోనాతానులా దయను, ప్రేమను చూపించగలమా?

కుటుంబంగా బహుమానాన్ని గెల్చుకోండి

12. కుటుంబంగా బహుమానాన్ని గెల్చుకోవడానికి బైబిల్లో ఉన్న ఏ సలహా ఉపయోగపడుతుంది?

12 కుటుంబంలోని ప్రతీఒక్కరు బైబిలు సూత్రాలను పాటించినప్పుడు, కుటుంబం శాంతిసంతోషాలతో ఉంటుంది, బహుమానాన్ని గెల్చుకుంటుంది. కుటుంబాలకు పౌలు ఈ తెలివైన సలహా ఇచ్చాడు, “భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ప్రభువు శిష్యులు అలా చేయడం సరైనది. భర్తలారా, మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి, వాళ్ల మీద విపరీతమైన కోపం చూపించకండి. పిల్లలూ, మీరు ప్రతీ విషయంలో మీ అమ్మానాన్నల మాట వినండి. ఇది ప్రభువుకు ఇష్టం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి. అలా చేస్తే వాళ్లు కృంగిపోతారు.” (కొలొ. 3:18-21) ఈ సలహా మీ కుటుంబానికి ఎలా సహాయపడగలదో ఆలోచించగలరా?

13. యెహోవాసాక్షికాని తన భర్త యెహోవాను ఆరాధించేలా ఒక క్రైస్తవ భార్య ఎలా సహాయం చేయవచ్చు?

13 మీకు యెహోవాసాక్షికాని భర్త ఉండి, ఆయన మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదని మీకు అనిపిస్తే ఏమి చేస్తారు? బహుశా మీకు కోపం రావచ్చు, ఆయనతో గొడవపడాలని అనిపించవచ్చు. కానీ దానివల్ల ఆయన మారతాడా? ఒకవేళ ఆ గొడవలో మీరే నెగ్గినా, ఆయన యెహోవాను ఆరాధించేలా చేయగలరా? చేయలేకపోవచ్చు. ఒకవేళ కుటుంబ పెద్దగా ఆయనకున్న స్థానాన్ని మీరు గౌరవిస్తే, మీ కుటుంబం మరింత శాంతిగా ఉండడానికి సహాయం చేయగలుగుతారు. అలాగే యెహోవాకు ఘనత తీసుకొస్తారు. మీ మంచి ప్రవర్తన బట్టి మీ భర్తలో యెహోవాను ఆరాధించాలనే కోరిక కలగవచ్చు. అప్పుడు మీరిద్దరూ బహుమానాన్ని గెల్చుకోవచ్చు.—1 పేతురు 3:1, 2 చదవండి.

14. యెహోవాసాక్షికాని భార్య గౌరవాన్ని సంపాదించుకోవడానికి క్రైస్తవ భర్త ఏమి చేయవచ్చు?

14 మీకు యెహోవాసాక్షికాని భార్య ఉండి, ఆమె మిమ్మల్ని గౌరవించడం లేదని మీకు అనిపిస్తే ఏమి చేయవచ్చు? కుటుంబ పెద్దగా మీకున్న అధికారాన్ని చూపించడానికి ఆమె మీద అరిస్తే, ఆమె మిమ్మల్ని గౌరవిస్తుందా? ఖచ్చితంగా గౌరవించదు. మీరు యేసును అనుకరించే ప్రేమగల భర్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. (ఎఫె. 5:23) సంఘ శిరస్సైన యేసు ఎల్లప్పుడూ ఓపిగ్గా, ప్రేమగా ఉన్నాడు. (లూకా 9:46-48) మీరు యేసును అనుకరిస్తే, కొంతకాలానికి మీ భార్యలో కూడా యెహోవాను ఆరాధించాలనే కోరిక కలగవచ్చు.

15. భార్యను ప్రేమిస్తున్నాడని క్రైస్తవ భర్త ఎలా చూపించవచ్చు?

15 భర్తలకు యెహోవా ఇలా చెప్తున్నాడు, “మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి, వాళ్ల మీద విపరీతమైన కోపం చూపించకండి.” (కొలొ. 3:19) ప్రేమగల భర్త తన భార్యను ఘనపరుస్తాడు. ఎలా? ఆమె అభిప్రాయాలను వినడం ద్వారా, వాటికి విలువిస్తున్నాడని చూపించడం ద్వారా ఘనపరుస్తాడు. (1 పేతు. 3:7) ఒకవేళ అన్నిసార్లు భార్య చెప్పింది చేయలేకపోయినా, ఆమె చెప్పేది వినడం ద్వారా భర్త మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. (సామె. 15:22) భార్య తనను గౌరవించాలని ఒక ప్రేమగల భర్త పట్టుబట్టడు. బదులుగా, ఆమె గౌరవాన్ని సంపాదించుకునేలా ప్రవర్తిస్తాడు. ఒక భర్త తన భార్యాపిల్లల్ని ప్రేమించినప్పుడు, వాళ్లు యెహోవాను ఆరాధించడంలో మరింత సంతోషిస్తారు అలాగే జీవమనే బహుమానాన్ని గెల్చుకుంటారు.

కుటుంబ సమస్యల వల్ల బహుమానం పోగొట్టుకోకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు? (13-15 పేరాలు చూడండి)

యౌవనులారా—దేనివల్లా మీ బహుమానాన్ని చేజార్చుకోకండి

16, 17. యౌవనులారా మీ అమ్మానాన్నలను బట్టి మరీ బాధపడకుండా ఎలా ఉండవచ్చు?

16 మీ అమ్మానాన్నలు టీనేజీలో ఉన్న మిమ్మల్ని అర్థంచేసుకోవట్లేదని, స్వేచ్ఛను ఇవ్వట్లేదని మీకనిపించవచ్చు. ఆ చిరాకులో, యెహోవా సేవ చేయడం ఎంతవరకు సరైనదనే సందేహం కూడా రావచ్చు. కానీ ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెడితే, దైవభక్తిగల మీ అమ్మానాన్నల కన్నా, సంఘంలోని స్నేహితుల కన్నా ఎక్కువగా మిమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరని తెలుసుకుంటారు.

17 దీనిగురించి ఆలోచించండి: మీ అమ్మానాన్నలు మిమ్మల్ని ఎప్పుడూ సరిదిద్దకపోతే, మీపట్ల వాళ్లకు నిజంగా శ్రద్ధ ఉందని ఎలా తెలుస్తుంది? (హెబ్రీ. 12:8) నిజమే, వాళ్లు పరిపూర్ణులు కాదు కాబట్టి వాళ్ల క్రమశిక్షణా విధానం మీకు బాధకలిగించవచ్చు. కానీ వాళ్లు మీకు క్రమశిక్షణ ఇవ్వడానికి గల కారణాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండండి, అతిగా స్పందించకండి. బైబిలు ఇలా చెప్తుంది, “మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.” (సామె. 17:27) సలహా ఎలా ఇచ్చినా దాన్ని స్వీకరించి, దాన్నుండి నేర్చుకునేంత పరిణతి సాధించాలనే లక్ష్యం పెట్టుకోండి. (సామె. 1:8) యెహోవాను ప్రేమించే అమ్మానాన్నలు ఉండడం మీరు పొందిన అమూల్యమైన బహుమతని మర్చిపోకండి. మీరు శాశ్వతకాలం జీవించడానికి వాళ్లు సహాయం చేయాలనుకుంటున్నారు.

18. బహుమానంపై మనసుపెట్టాలని మీరెందుకు నిర్ణయించుకున్నారు?

18 మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా ప్రతీఒక్కరం అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చు. మన నిరీక్షణ వాస్తవమైనది. ఆ వాగ్దానాన్ని విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త చేశాడు. ఆయనిలా అంటున్నాడు, “లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెష. 11:9) త్వరలోనే భూమ్మీదున్న ప్రతీఒక్కరూ దేవుని చేత బోధించబడతారు. అలాంటి బహుమానాన్ని పొందడానికి మనం ఎంతైనా కష్టపడవచ్చు. కాబట్టి యెహోవా వాగ్దానం చేసినదాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీ బహుమానాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎన్నడూ తెచ్చుకోకండి.